ఆయనే.. ఈయన..!!
ప్రపంచంలో, మనదేశంలో, మనరాష్ట్రంలో, మన తాలూకా (మండలం)లో, మన వూళ్ళో ఎందరో మహానుభావులుంటారు. వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, పార్లమెంటు సభ్యులు కావచ్చు, శాసనసభ సభ్యులు కావచ్చు, ఐ.ఏ.ఎస్/ఐ.పీ.ఎస్ కావచ్చు, గొప్ప వైద్యులు కావచ్చు, విద్యారంగంలో ప్రముఖులు కావచ్చు, సాహిత్య రంగంలో ప్రముఖులు కావచ్చు, న్యాయమూర్తులు కావచ్చు, ఇలా సమాజంలో పేరుప్రఖ్యాతులు గల ఎందరో పెద్దల గురించి సామాజిక మాధ్యమాల ద్వారా వింటుంటాం. వారి గొప్పదనం గురించి ఏదో రూపంలో తెలుసుకుంటూనే ఉంటాం. కానీ అలాంటి పెద్దలను చూడగలవారు, వారితో పరిచయం చేసుకునే అవకాశాలు అందరికీ వుండవు. పేరుప్రతిష్ఠలు పెరిగే కొద్దీ,అలాంటి పెద్దలకు ప్రజలలో స్వేచ్ఛగా తిరిగే అవకాశాలు కూడా తగ్గిపోతాయి.
సెక్యూరిటీ అనే పదం ఇప్పుడు అందరి దృష్టిలోనూ పడింది. కొందరి జీవితాలు అమూల్యం కాబట్టి, ప్రభుత్వ పక్షాన వారికి రక్షక వలయం ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు చోటామోటా నాయకులు కూడా, సెక్యూరిటీ అంటే సమాజంలో అదొక గౌరవ గుర్తింపుగా భావించి, వారి వారి స్థాయిల్లో సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుని మురిసిపోతున్నారు. అసలు స్వేచ్ఛగా ప్రజలలో తిరగలేనివాడు నాయకుడు ఎలా అవుతాడు? ఈనాడు మన దేశంలో ఈ నాయకుల సెక్యూరిటీ కోసం ప్రజాధనం ఎంత వృథా అయిపోతుందో లెక్కలు కడితే ప్రాణం ఉసూరుమంటుంది. ఇది మన దేశంలోనే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, ప్రపంచమంతటా ఇదే జాడ్యం అమలులో వుంది. అలా అని కనీస రక్షణ లేకుండా ప్రజలలో స్వేచ్ఛగా తిరిగే ప్రపంచ నాయకులు అక్కడక్కడా లేకపోలేదు. కానీ ఇలాంటి వారి శాతం బహు తక్కువ. బహుశః ఈ సెక్యూరిటీ విధానాన్ని తొలగిస్తే, సమాజంలో అరాచకాలు సంఘ వ్యతిరేక కార్యక్రమాలు, లంచగొండితనం, వరకట్న జాడ్యం కొంతవరకైనా తగ్గుముఖం పడతాయేమో! అనేక క్రైమ్ కేసులతో సంబంధం వున్నవాళ్లు ఎన్నికల్లో నిలబడే అర్హతను కోల్పోతారేమో! ఇది కలలో కూడా సాధ్యం కాని పనే అని ప్రస్తుత పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. ఈ నాయకుల సందర్శన సెక్యూరిటీ సాకుతో పట్టణాలలో కొన్నిగంటలపాటు ప్రజా జీవనం అస్తవ్యస్తమైపోతున్నసన్నివేశాలు మనం చూస్తూనే వున్నాం. నాయకులకు ఇవేమీ అక్కరలేదు అది తమ గొప్పదనంగా తమ హోదాకు చిహ్నంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో ఒక మహానుభావుడు గురించి చెప్పక తప్పదు. ఆయన ఎంత సాధారణ జీవితాన్ని అనుభవించాడో తెలిస్తే ఇప్పటి జనానికి ఆశ్చర్యం కలిగిస్తుంది. అలాంటి నాయకులు ప్రజాశ్రేయస్సునే కోరుకున్నారు తప్ప ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎప్పుడూ తీసుకురాలేదు.
చాలాకాలం క్రితం నేను నాగార్జునసాగర్‌కు వెళ్లే ప్రయత్నంలో, గుంటూరు నుండి మాచర్లకు రైలు ప్రయాణం చేయవలసి వచ్చింది. పెద్దక్క మహానీయమ్మ అక్కడ ఉపాధ్యాయినిగా పనిచేసేది. అక్క దగ్గరకు వెళ్ళవలసిన ప్రయాణం అది. అప్పటికి అది ఇంకా బ్రాడ్ గేజ్ లైన్ కాలేదు. మీటర్ గేజ్ రైళ్లు ఉండేవి. నేను గుంటూరు నుండి రైల్లో మాచర్ల వరకూ వెళ్లి, అక్కడినుండి నాగార్జున సాగర్ (దక్షిణ విజయపురి)కు బస్సులో వెళ్ళాలి. గుంటూరులో రైలు ఎక్కాను. నా పక్కన ఇద్దరు నాలాంటి ప్రయాణికులు వున్నారు. నాకు ఎదురుగా ఇద్దరు ప్రయాణికులు వున్నారు. అందులో కాస్త వయస్సులో పెద్దాయన కిటికీ పక్కన కూర్చున్నారు. సన్నగా, పొట్టిగా ఖద్దరు పంచా, ఖద్దరు లాల్చీ ధరించి భుజం మీద కండువా వేసుకుని వున్నారు. ఎవరితోనూ మాట్లాడడం లేదాయన. రైలు పరిగెడుతున్నది. కానీ అది ముందుకు వెళుతుందో, వెనక్కు పరిగెడుతుందో అర్ధం కావడం లేదు, దూరం తరగడం లేదు.
ఎప్పుడైనా ఏదైనా స్టేషన్లో బండి ఆగితే కాస్త ఉపశమనం దొరికేది. కొంత దూరం ప్రయాణించామన్న ఉపశమనం లభించేది. మళ్ళీ రైలు మెల్లగా స్పీడు అందుకునేది. ఎంత స్పీడ్‌గా బండి పోతున్నా దూరం తిరుగుతున్నట్టు అసలు అనిపించేది కాదు. అలా ఒక్కొక్క స్టేషను వెనక్కి వెళ్ళిపోతున్నది. అయితే బండి ఏ స్టేషన్లో ఆగినా ఎవరో ఒకరు ఆ కిటికీ పక్కన కూర్చున్న పెద్దాయనతో ఏదో మాట్లాడి వెళ్లిపోతున్నారు. వాళ్లందరికీ ఆయన ఎంతో సౌమ్యంగా సమాధానాలు ఇచ్చి పంపిస్తున్నారు ఆ పెద్దాయన. ఆయన ఎవరో తెలియక పోయినా పక్కా గాంధేయవాది అని మాత్రం మనసులో అనుకున్నాను. ప్రయాణం చాలా విసుగు అనిపిస్తున్నది, మాచర్ల ఎప్పుడు చేరతామా? అన్న ఆదుర్దా తప్ప మరో ఆలోచనపై మనసు లగ్నం కావడం లేదు. రైలు వేగం బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ, గమ్య స్థానం ఎప్పటికి చేరుకుంటామన్నది తెలియదు. అప్పటికి రైల్వే టైం టేబుల్ చూసే అలవాటులేదు, మొబైల్స్ ఉనికి అప్పటికి లేనే లేదు. ఇలావుండగా ఒకచోట రైలు ఆగింది, స్టేషన్ పెద్దదనుకుంటా, జనసందోహం బాగానే వుంది. బండి దిగేవాళ్ళతో ఎక్కేవాళ్ళతో అక్కడ కోలాహలంగా వుంది. మా ఎదురుగా కూర్చున్న పెద్దాయన సంచీతీసుకుని మెల్లగా బండి దిగి వెళ్లిపోయారు. మళ్ళీ కొత్త ప్రయాణికులతో మా కంపార్ట్మెంట్ నిండిపోయింది. బండి కదిలింది. ఫ్లాట్‌ఫామ్ దాటిపోతుండగా స్టేషన్ బోర్డు చోశాను. ‘సత్తెనపల్లి’ అని కనిపించింది. నాకు వెంటనే ఒక మహానుభావుడు గుర్తుకు వచ్చారు. అదే స్టేషన్లో బండి ఎక్కిన ఒక ప్రయాణికుడిని అడిగాను,
“బాబూ వావిలాల గోపాల కృష్ణయ్య అనే శాసన సభ్యులు వుండే వూరు ఇదేనా?”
“అవును, ఎందుకు సార్?” అన్నాడు.
“ఆయన గురించి బాగా విన్నాను బాబు. ఈ వూరు పేరు చూడగానే ఆయన గుర్తుకు వచ్చారు,ఆ మహాపురుషుడిని చూడాలనిపిస్తుంది” అన్నాను.
“అయ్యో.. వారు ఇదే కంపార్ట్మెంట్ నుండి,ఈ స్టేషన్ లోనే దిగిపోయారు కదా! మా ఏం.ఎల్. ఏ గారు ఆయనే” అన్నాడు.
“అవును సర్, మనకు ఎదురుగా కూర్చుని ఖద్దరు దుస్తుల్లో వున్నది ఆయనే” అన్నాడు, నా పక్కన కూర్చున్న ప్రయాణికుడు. ఒక్కసారి ప్రాణం చివుక్కుమంది. ఆయనను మనసారా చూడలేకపోయానే అన్న బాధ.


శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారు
“మరి ఆయన కూడా మంది – మార్బలం, సెక్యూరిటీ వంటివి లేవు కదా!” అన్నాను.
“ఆయన అలాంటి ఆర్భాటాలకు ఒప్పుకోరండీ, అవసరం అనుకుంటే తప్ప ఆయన కూడా ఎవరూ వుండరు” అన్నాడు.
నేను ఆశ్చర్యపోయాను, ఇవన్నీ గతంలో నేను వున్నా.. ఈ సందర్భంలో ప్రత్యక్షంగా చూసాను. ఆయన సాధారణ జీవన శైలి బాగా అర్థమైంది. ఇలాంటి ప్రజానాయకులు ఇంకొంతమంది ఉంటే బావుణ్ణు అనిపించింది. ఆయన జ్ఞాపకాల్లో నా విసుగు ఎటో పారిపోయింది. క్షేమంగా సాయంత్రానికల్లా అక్క దగ్గరకి వెళ్ళిపోయాను, ఈ తరం యువతీ -యువకులకు ఆయన అంతగా తెలియక పోవచ్చును. అనేకసార్లు సత్తెనపల్లి నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఆయనకే సాధ్యం అయింది. బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రికి,సంబంధిత మంత్రులకి దడ పుట్టించడం ఆయనకే చెల్లింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారభాషా సంఘం అధ్యక్షుడిగా గొప్పసేవలు అందించడం ఒక ఎత్తైతే, ప్రభుత్వ పరంగా అందే అదనపు సౌకర్యాలు త్యజించిన ఏకైక వ్యక్తి ఆయనే కావచ్చు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ విషయంలోనూ, దాని శంకుస్థాపనకు నాటి ప్రధానమంత్రి నెహ్రు గారిని ఒప్పించడంలోనూ ఆయన ప్రముఖ పాత్ర చాలామందికి తెలియకపోవచ్చును.
తర్వాతి కాలంలో నేను మహబూబాబాద్‌లో పనిచేస్తున్నప్పుడు, అక్కడి స్థానిక స్వాతంత్ర్య సమరయోధులు, శ్రీ బి. ఎన్, గుప్తా గారి పిలుపు మేరకు, మానుకోటకు వచ్చినప్పుడు,ఆయనను దగ్గరగా చూసి ఆయన ఉపన్యాసం వినే నా కోరిక తీరింది. వారిద్దరూ మంచి మిత్రులని అప్పుడే తెలిసింది అప్పటికి గోపాల కృష్ణయ్య గారి ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది, బాగా వంగిపోయారు. అసెంబ్లీ పులిగా పేరు తెచ్చు కున్న వావిలాల గారిని అలా చూడడం కొంచెం బాధ అనిపించింది.


శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారు
పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయినశ్రీ వావిలాల సత్తెనపల్లిలో 1906,సెప్టెంబరు 17న జన్మించి తన 97 వ ఏట హైదరాబాద్‌లో 29, ఏప్రిల్ 2003 నాడు స్వర్గస్తులైనారు. తెలుగు ప్రజలు ఒక స్వచ్ఛమైన, నిజాయితీపరుడైన, గొప్ప నాయకుడిని కోల్పోయారు. నాటి ప్రజానాయకులైన, శ్రీ వావిలాల, శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య గారు, గౌతు లచ్చన్నగారు, ఎం. ఓంకార్ గార్లను మరచిపోవడం కష్టం. వారి సేవలు అలాంటివి. అందరిలోనూ వావిలాల గోపాలకృష్ణయ్య గారు ప్రత్యేకం. ఆయనతో ప్రయాణం గుర్తుంచుకోదగ్గది.
(మళ్ళీ కలుద్దాం)

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
55 Comments
డా.కె.ఎల్.వి.ప్రసాద్
సంచిక సంపాదక వర్గానికి
ఇతర సాంకేతిక నిపుణుల కు
హృదయ పూర్వక కృతజ్ఞతలు.
Sagar
పక్కా గాందేయవాది అయిన వావిలాల గురించి మీరు ప్రస్తావించడం చాలా ఆనందంగా ఉంది సర్ . అవును సర్ ఆయనకు హంగూ ఆర్భాటాలు నచ్చవు. ఒకసారి అక్కడి తెలుగు సంఘూల ఆహ్వానం మేరకు అమెరికా వెళ్ళిన వావిలాలగారు వారిచేతి సంచితోనే అక్కడ దర్శన మిచ్చి అందరినీ ఆప్యాయంగ పలకరిస్తుంటే ఒక వ్యక్తి వారి దగ్గరకు వచ్చి మీరు ఇండియాకు కొని తీసుకుని వెళ్ళాల్సిన వస్తువులు ఏమన్నా ఉంటే మొహమాటం లేకుండా చెప్పండి మీరు తిరిగి వెళ్ళేలోపల మీకు చేరుస్తాను. నేను మీకు అభిమానిని కాబట్టి సంకోచం వద్దు అడగండి అని బలవంతం చేస్తె ఆయన ఒకటే మాట అన్నారట. ఆదివారం నాకు వంకాయకూరతో బోజనం ఇష్టం. ఈరోజు ఆదివారం కాబట్టి నాకు ఇక్కడ తెలుగు హోటల్స్ లో గుత్తివంకాయ ఏర్పాటుచేస్తే నేను ధన్యుణ్ణి అని. అంతటి నిరాడంబర జీవి ఆ మహానుభావుడు. అలాంటి వాళ్ళను ఇలాంటి ఙ్ఞాపకాల ద్వార తలచుకోవలసిందే తప్ప మనం చూడడం అనేది ఇక జరగని పని సర్ . సుందరయ్య లాంటివాళ్ళ త్యాగనిరతికి ఎన్ని అక్షరాలు అలంకరించినా తక్కువే. మీ రచన ద్వారా అలాంటి మహాను భావులను గుర్తుచేసినందుకు మీకు ధన్రవాదములు సర్ .
డా.కె.ఎల్.వి.ప్రసాద్
సాగర్
నీ స్పందన చాల బాగుంది.
బాగా విశ్లేషించావు.
ధన్యవాదాలు.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Gd Mng Doctor garu,
Indeed, we do not have such leaders now. They are icons for Shrudness. & simplicity. A big salute to such leaders
——–Surya narayana rao
DGM(Rtd)SBI
Hyderabad.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Thank you
So much sir.
Shyam
శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారి లాగా సాధారణ జనజీవితం గడిపే గొప్ప వారు, ఈ రోజుల్లో మచ్చుకైనా కానరారు. 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎక్కడా కనిపించట్లేదు అనుకుంటాను . ఒకవేళ ఎవరైనా ఆ విధంగా ఉండడానికి ప్రయత్నిస్తే ప్రజల దృష్టిలో గొప్పవారిగా మిగిలిపోతారెమో కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం గెలవరు. అలాంటి గొప్పవారిని కలవడం, చూడడం అన్నది రచయిత చేసుకున్న అదృష్టం. ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తే మళ్లీ అలాంటి గొప్ప వారు జన్మిస్తారని నాకైతే నమ్మకం లేదు. మంచి రాజకీయ వేత్తలు నిస్వార్ధపరులు దేశభక్తులు జన్మిస్తున్నారు కానీ వారి జీవన విధానం మాత్రం చాలా ఖరీదైనది.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
మీత్రమా
నీ స్పందన బాగుంది
నీచు హృదయపూర్వక ధన్యవాదాలు.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Good ‘memory ‘
—–Ravulapati Sitaramarao.IPS
Ex. IGP
Hyderabad
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Thank you
Somuch sir.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
అవునండీ. నాకు shoulder injury avuthe. Birmingham lo Oka hospital కూర్చున్న. నా ముందు చైర్ లో ఒకాయన కూర్చొని పేపర్ చదువూ తూ కూర్చున్నాడు అర గంట తరువాత. ఆయన్ను పిలిచారు ( ఆతరువాత నా నొంబర్). మా సన్ – ఇన్ లా drkrishna చెప్పారు. ఆకూర్చున్న ఆయన Mp అని.
Maa allude kooda tanudoctor ani naakosamrecommend cheyale ( telugu Enduko egiripoyindi) vaavilaagari relative oka dr ‘Fernandez hyd lo job chestunnarani vinna
——డా. అంజనీ దేవి
కల్యాణి నర్సింగ్ హోం
హనంకొండ.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
మీ స్పందన కు
ధన్యవాదాలండీ
డా.కె.ఎల్.వి.ప్రసాద్
చాల…. చాలా మందే బ్రతికినా
స్వతంత్రులమైన తరువాత కూడా ఆదే నిస్వార్ధ దేశ భక్తి తో
బ్రతికినవారు అతికొద్దిమంది మాత్రమే…. !గుర్తింపుకోసం ప్రాకులాడే నాయకులు కొందరైతే…. అధికారం, డబ్బు
సుఖ భోగాలకోసం ప్రాకులాడేవారే అందరూ… !మీరు ప్రస్తావించిన ఆ మహానుభావులు గుర్తింపు కోసం బ్రతకలేదు !మనసా వాచా కర్మణా దేశాన్ని ప్రేమించారు, దేశ క్షేమంకోసమే తపించారు !మనమీనాడు ఇలా చెప్పుకోవాలని కాదు…
అలా బ్రతకటంలోనే అటువంటివారు ఆత్మానందాన్ని పొందగలరు !
శ్రీయుత వావిలాలగారిని నేను పార్వతీపురంలో ఉండగా చూసాను, వారు అప్పుడు వారి శిష్యులుశ్రీ డొల్లు పారినాయుడు గారు ప్రారంభించిన సంస్కరణ… సాహితీ సేవా సంస్థను సందర్శించే సందర్భంలో…
మొహమ్మద్+అఫ్సర+వలీషా
గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తులు ఈ వ్యాసంలో చర్చకు రావడం అభినందనీయం సార్. వారి మంచితనాన్ని కళ్ళకు కట్టి నట్టు వ్రాశారు. అలాంటి వ్యక్తిని అతి దగ్గరగా ఉండి కూడా మీరు కలవ లేక పోయారనే బాధ మీకే కాదు చదివిన మాకూ కలిగింది సార్. అప్పటికీ ఇప్పటికీ అంచనాలు వేసుకుంటే అంతా వ్యతిరేకమే సార్. ఇప్పుడంతా ఏ చిన్న కార్యక్రమం జరిగినా రాజకీయ నాయకులు ఎక్కడికి వెళ్ళినా అంతా హంగులు ఆర్భాటమే . చాలా చాలా మంచి విషయాలు మీ జ్ఞాపకాల పందిరిలో దాచారు సార్. అన్నీ పరిమళాలు వెదజల్లేవే.హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్ మీకు
















డా.కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా
నీ స్పందన కు ధన్యవాదాలు.
డి.వి.శేషాచార్య
ఒక అద్భుతమైన అనుభూతిని చాలా అందంగా చెప్పారు. వావిలాల గోపాలకృష్ణయ్య గారి వంటి నాయకులు మళ్ళీ కనిపించరు.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
కోరాడ నరసింహారావు గారు
మీస్పందనకు ధన్యవాదాలండీ.
ఎన్.వి.ఎన్.చారి
నిష్కలంక దేశభక్తుడు త్యాగమూర్తి వావిలాల వారు
పులిలా గాండ్రించినా గోవులో సౌమ్యంగా ఉన్నా
మచ్చలేని వ్యక్తిత్వం వారిది చాలా మంది గొప్పవారు
మనకు ఎక్కడో తారసపడుతూనే ఉంటారు వారు ఎవరి గుర్తింపు ప్రశంస కోరుకోరు
విద్యాదదాతివినయం,వినయద్వాతిపాత్రతాం
చక్కని అనుభవం
డా.కె.ఎల్.వి.ప్రసాద్
చారి గారూ
మీస్పందనకు ధన్యవాదాలండీ
Bhujanga rao
శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారు చాలా సాధారణ జీవితం గడిపిన మహానుభావుడు.ఈ రోజుల్లో అలాంటి వారు మచ్చుకైనా కనపడరు. సర్వ ప్రాణి సేవగా మాధవసేవ, మరియు ఖరీదైన జీవితం కన్నా విలువైన జీవితం కొరకు పాటుపడి,బాధ్యతా యుతమైన క్రమశిక్షణతో నిజాయితీగా పని చేసినటువంటి గొప్ప వ్యక్తిని,వారి ఫోటోలు మరియు జ్ఞాపకాలు సేకరించి మాకు పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదములు సర్.అటువంటి గొప్పవారిని కలవడం మీ అదృష్టం.జ్ఞాపకాల పందిరిలో ఇన్నేసి ఫొటోలతో,ఎందరో మహానుభావులను పరిచయం,మీ జ్ఞాపక శక్తికి హ్యాట్సాఫ్. హృదయపూర్వక నమస్కారములు డాక్టర్ గారు.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
భుజం గ రావు గారూ
మీ స్పందనకు ధన్యవాదాలు.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
మీరూ చాలా అదృష్టవంతులు, ఒక మహానుభావుడు తో కలిసి ప్రయాణం చేసారు.
మీరు మీ వ్యాసం చివరిలో రాసిన పేర్లు గలవారు కూడా మహానుభావులే.
—-డా. డి.సత్యనారాయణ.
హైదరాబాద్.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
మీ స్పందన కు ధన్యవాదాలండీ
Sarasi
నేను సచివాలయంలో అధికారభాషా సంఘ అధ్యక్షులు డా. నండూరి రామకృష్ణమాచార్య గారికి సహాయకుడిగా పనిచేశా. పూర్వ అధ్యక్షులైన వావిలాల గారు అక్కడికి వస్తూ వుండేవారు. సిబ్బంది అందరూ నాన్న గారూ అని పిలిచేవాళ్లం. వారితో చాలా అనుభవాలున్నాయి. ఆయన పదవిలో వున్నరోజుల్లో కారు లేకుండా ఒకసారి ఖద్దరు బట్టలూ, సంచీతో వస్తూ వుంటే సచివాలయ గేటు వద్ద సెక్యూరిటీవాళ్లు ఆపేశారు. నేను ఫలానా అని చెప్పినా వారు వినలేదు. ఆయనది అప్పుడు క్యాబినెట్ మినిస్టర్ ర్యాంకు. పక్కన నిలబడమని తోసేస్తే ఆయన అక్కడ ధర్నాకి కూర్చున్నారు. తరవాత ఎవరో చూసి చెబితే సెక్యూరిటీ వాళ్లు నాలికలు కరుచుకుని సారీలు చెప్పారు. అయినా ఆయన దీక్ష విరమించలేదు. లోపల నించి చీఫ్ సెక్రటరీ గారు పరుగు పరుగున వచ్చి బ్రతిమలాడి లోపలికి తీసుకెళ్లారు. ఇలాంటి అనుభవాలు విన్నవి, కన్నవీ చాలా వున్నాయి వారితో. అపర గాంధేయ వాది. నిజాయితీకి, నిస్వార్థానికి, సిసలైన నీతి గల రాజకీయాలకు ఆయన నిలువెత్తు ఆదర్శం. అటువంటి విలువైన వ్యక్తి మళ్లీ పుట్టడు. వారిని గుర్తుకు తెచ్చిన ప్రసాద్ గారికి ధన్యవాదాలు.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
సరసి గారూ
మంచి అనుభవం చెప్పారు.
మీస్పందనకు హృదయ పూర్వక కృతజ్ఞతలు.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
మహనీయుల వృత్తి ఏదైనా ప్రవృత్తి మాత్రం ఆదర్శనీయంగా ఉంటుంది .. వారి ఋజు ప్రవర్తనే వారిని శిఖరాన్ని అధిరోహింపజేస్తుంది … వారి వ్యక్తిత్వం అన్ని తరాలుకూ అనుసరరణీయమే … అటువంటి మహామహుల్లో మాన్యులు వావిలాల వారొకరు … పరమ కష్మల ప్రవృత్తి తో తామొక ప్రజానాయకుల మనుకొని విచ్చలవిడిగా తిరిగే రాజకీయనాయకగణాల మధ్య వారు బురదలో విరిసిన పద్మం వంటివారు … మొదటి సారి ప్రత్యక్షంగా చూసి కూడా కలవలేకపోవడం నిజంగానే బాధాకరం …
మీరు మొదట్లో చెప్పినట్టు సెక్యూరిటీ పటాటోపాలు ఇవ్వాళ ఒక స్టేటస్ గా మారడం ప్రజల దౌర్భాగ్యం …
కొడవటిగంటి వారు ఒకానొక సందర్భంలో “ జైళ్ళ లో ఉండాల్సిన వాళ్ళు మనల్ని పాలిస్తున్నారు “ అనడం ఇప్పటి రోజులకు సరిగ్గా సరిపోయే నిజం … నేరస్తుడు ముదిరితే నాయకుడౌతున్నాడు … ఇదెంత ప్రమాదకరమో మనం అనుభవిస్తూనే ఉన్నాం
ఒక ఆదర్శపురుషుని పరిచయం మనకు శాశ్వతంగా మిగిలిపోయే గొప్ప జ్ఞాపకం …
నేను ఎం.ఏ విద్యార్థిగా ఉన్నప్పుడు జరిగిన ఒక సభలో విద్యార్థి వక్తగా మాట్లాడటం , ఆ సభకు వారు అధ్యక్షులుగా ఉండటం నన్ను పులకింపజేసే మధురస్మృతి … చాలాకాలం తరువాత “ సత్తెనపల్లి కల్చరల్ క్లబ్ “ వారు సత్తెనపల్లి లో నిర్వహించిన ఒక సభలో జాషువాగారిని గురించి మాట్లాడటానికి నేను వెళ్ళినప్పుడు కూడా వారి యింటికి వెళ్ళి కలిసి వచ్చాను , అప్పటికే వారు పెద్దవారై ఉండిన కారణంగా సభలకు రావటం తగ్గించారు … ఆ అనుభూతి పచ్చదనం ఎప్పటికీ వాడిపోదు
ఒక ఉత్తమ వ్యక్తిని పరిచయంచేసి మీ జ్ఞాపకాలు పంచినందుకు హార్దికాభినందనలు సర్
—-‘జి.గిరిజా మనోహర్ బాబు
హనంకొండ.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
సర్
మీఈ స్పందన కు ధన్యవాదాలండీ.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ఆ య న పేరు విన్నానుయిప్పుడుతెలిసింది ఆయనాగురించి ధ న్య వాద ములు
—-విజయ లక్ష్మి
హైదరాబాద్.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ
Rajendra+Prasad
సర్!
మంచి వ్యక్తిని జ్ఞాపకం చేశారు. ఈ కాలం లో వ్యక్తుల పెట్టుకుంటున్న సెక్యూరిటీ పై బాగా చెప్పారు. నిజాయితీ లేని చోట, వ్యక్తులకు భయం ఉండటం సహజమే కదా.
రైలు పరిగెడుతున్నా, దూరం తరగటం లేదు, ముందుకెళ్తుందో వెనక్కి పరిగెడుతోందో అని హాస్యంగా చెప్పారు. మరి దాన్నే మాచెర్ల రైలు అంటారు! మేము కూడా ఇవే ఫీలింగ్స్ తో 7 సంవత్సరాలు ప్రయాణించాము
ధన్యవాదాలు
రాజేంద్ర ప్రసాద్ శ్రేయోభలాషి
డా.కె.ఎల్.వి.ప్రసాద్
మీ స్పందన కు ధన్యవాదాలండీ
డా.కె.ఎల్.వి.ప్రసాద్
అవును సార్ వావిలాల లాంటి వారే కాక వారే చాల మంది MLA లు సాధారణ జీవితం గడిపే వారు బస్సులో ప్రయాణం చేసేవారు ఇప్పుడు బస్సు సీట్లపై మాత్రమేMLA/MLC/MP లాంటివి రాసి ఉంటుంది
——నిధి(బ్రహ్మ చారి)
హనంకొండ
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలండీ.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
వావిలాల గోపాలకృష్ణయ్యగారిగూర్చి
చక్కని పరిచయం చేసారు. నీతి
నిజాయితీలే ఆయనకు రక్షణలు.
మంచితనంతో కూడిన ప్రజాసహకార
మే ఆయనజీవన కార్యక్రమం. అందు
కే ప్రజలే కార్యకర్తలు ,స్నేహితులు.
అలాంటి దేశసేవకులు నూటికో
కోటికో ఉంటారు
——–వజ్జల రంగా చార్య
అమెరికా.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
మీ స్పందన కు ధన్యవాదాలండీ
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Excellent Sir .We may not find such great leaders in our life time
.
—- prof.Erragattu swami
KUC-WARANGAL.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Thank you sir.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
It’s a very good experience with Vavilala Gopala krishnaiahgaru. You are so lucky sir.
You can not see that type of real leaders now a days sir.
Regards
—-KJ Srinivas
Hyderabad.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Thank you Srinivas.
Sambasiva+Rao+Thota
Prasad Garu!
Maa ooru “Sattenapalli” ni,aanaati maa MLA,Sri Vaavilaala Gopaalakrishnaiah gaarini,,gurthu thechukuntoo vraasina ee episode naaku chaalaa baagaa nachindi..
Dhanyavaadaalandi
డా.కె.ఎల్.వి.ప్రసాద్
మీ స్పందన కు ధన్యవాదాలండీ
సాంబశివరావు గారు.
Varigonda Kantha Rao
VAVILALA vaari parichayam goppaga vunnadi
Abhinandanalu.
Dr.Harika
Good morning sir,
The story reminded me that – A great leader’s courage to fulfill his vision comes from passion, not position.
Feeling great that you had an opportunity to meet such people sir.
Thank you sir for sharing and letting us know about the great personalities of our state.
Great man with great gesture.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Thank you Dr.Harika.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
డాక్టర్ గారు నమస్కారం.
వివిద రంగాలలో నిష్ణాతులైన మహానుభావులు
ఎందరో ఉన్నప్పటికినీ, బహు కొద్దిమంది మాత్రమే వారివారి మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్చించడం ద్వారా చిరస్మరణీయులుగా మిగిలిపోతారు అనటంలో ఎటువంటి సందేహము లేదు. మీరు ఉదాహరించినటువంటి కొద్ది మంది మాత్రమే ఈ కోవలోకి వస్తారు.
మీ అనుభవాన్ని చదివిన తర్వాత నాకు ఒక పాత జ్ఞాపకం గుర్తుకొస్తుంది. అది 1989వ సంవత్సరం .అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్టీ రామారావు గారు ముఖ్య మంత్రిగా ఉండేవారు. అప్పటి పి సి సి( ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్) గా క్యాబినెట్ హోదాలో కొణిజేటి రోశయ్య గారు ఉండేవారు .ఒక రోజు నేను గుంటూరు నుండి హైదరాబాద్ కి నర్సాపూర్ ఎక్స్ప్రెస్ లో ఏసీ టు టైర్ లో రిజర్వేషన్ చేసుకున్నాను .ముందుగా రిజర్వేషన్ చేసుకోవటం వల్ల నాకు ,నా శ్రీమతికి Lower berths అలాట్ అయ్యాయి. ట్రైన్ బయలుదేరటానికి ఐదు నిమిషాల ముందు టిటిఇ నా దగ్గరకు వచ్చి, పిసిసి అధ్యక్షులు రోశయ్య గారు ఈ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. ఆఖరి నిమిషంలో ప్రోగ్రాం ఫిక్స్ అవ్వటం వల్ల వారికి 2 upper berths వచ్చాయి, మీరు ఏమీ అనుకోకుండా అక్కడికి మారిపోండి, వారిని ఇక్కడ అడ్జస్ట్ చేస్తాను ,అని చెప్పడం జరిగింది. ఆయన హాదా ఏమిటో నాకు తెలుసు కాబట్టి వెంటనే ఒప్పుకొని అక్కడికెళ్లి సర్దుబాటు చేసుకున్నాము. ఆ విషయం తెలుసుకున్న తర్వాత రోశయ్య గారు, వారి శ్రీమతి ఇద్దరూ సర్దుబాటు అయిన సీట్లలో కూర్చున్నారు. బండి బయలుదేరిన పదినిమిషాల తర్వాత వారు నా దగ్గరికి వచ్చి” క్షమించండి మీకు శ్రమ కలిగించాను. నాకు మోకాళ్ళ నొప్పులు, పైకి ఎక్కలేను ,అందుచేతనే సర్దుబాటు చేయవలసి వచ్చింది.” అని పదే పదే నాకూ ,మాఆవిడకి, చెప్పి తిరిగి ఆయన సీట్లోకి వెళ్లారు.
నిజం చెప్పాల్సి వస్తే అటువంటి క్యాబినెట్ మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ముందుగా రిజర్వేషన్ చేసుకోకపోయినా ,నాలుగు బెర్తల క్యాబిన్ రైల్వే వారు అలాట్ చేయవలసి ఉంటుంది. ఆ విషయం ఆయనకు తెలిసినా కూడా, మానవతా విలువలు, మరియు తోటి వారిని గౌరవించాలి…అనే సంస్కృతి గల వ్యక్తి కావునే మాకు థాంక్స్ చెప్పారు. రాజకీయ బ్యాక్ గ్రౌండు ఎక్కువగా లేకపోయినప్పటికీ ఆయన వ్యక్తిత్వాన్ని గుర్తించే తర్వాత ఆయనకి ముఖ్యమంత్రి గానూ, తర్వాత గవర్నర్ హోదాలు వాటంతట అవే వచ్చాయి అనుకుంటాను. మీతో ఈ జ్ఞాపకాన్ని పంచుకోవడానికి అవకాశం కల్పించినందులకు ధన్యవాదాలు.
—–బి.రామకృష్ణా రెడ్డి
సఫిల్ గూడ
సికింద్రాబాద్.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
అద్భుతమైన
మీస్పందనకు ధన్యవాదాలండీ.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Sir Gopala krishnaiah garu mahonathamaina vyakthithvam kaligina varu atuvanti vari gurinchi rayadam nijanga adbutham nenu vari gurinchi inthaka mundu chadivanu inspirtional vyakthi gurinchi rayadam chala adbutham

ప్రమోద్. కుసుమ
హైదరాబాద్.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
బాబూ
మీ స్పందన కు ధన్యవాదాలండీ.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Chala manchi jnapakam sir.
Aa timelo mee feel Okka second nakkuda badha kaliginchindi.
Jeevitha prayanallo mee jnapakalu chadivimpa chesthunnayi
—–mrs.sujana panth
Bheemaaram
HANAMKONDA.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Thank you madam
డా.కె.ఎల్.వి.ప్రసాద్
65 వ సంచిక చదివినాను. కాళోజీ చెప్పిన ఒక సంగతి .కశ్మీర్ మహారాణి తిరుమల స్వామి వారి దర్శనానికి వచ్చినారట ప్రోటోకాల్ ప్రకారం అధికారులు ఆమె వచ్చి వెళ్ళేవరకు మిగతా వారి దర్శనాలను ఆపి వేసారట.ఆమె కారూలో వస్తూ దర్శనం కోసం నిలబడ్డ జనాల వరుసను చూసి వీరంతా ఎందుకు నిలబడ్డారని అడిగితే దైవ దర్శనానికని చెప్పానారట.ఆమె కారు ఆపించి దిగి క్యూ చివర,లైన్లో నిలబడినారట.అధికారులు చూసిచూసీ వెదుకులాడి ఆమెదగ్గరికివచ్చీ మీకోసమే వీరందరినీ ఆపినం మీరు వచ్చి దర్శనం చేసుకోవచ్చుననివచప్పినారట.ఆమె భగవంతుని ముఅందర అందరూ సమానమే ముఅందర వచ్చిన వారు ముఅందర దర్శనం చేసుకోవటం న్యాయం అని లైన్ లోనే వెళ్ళి దర్శనం చేసుకున్నారట. కాళోజీకివపద్మ విభూషణ్ ఇచ్చినప్పుడే వావిలాలకు పద్మ భూషణ్వఇచ్చిన్రు.కాళోజీశఏమన్నాడంటే వావిలాల నాకంటే సీనియర్ ప్రజా క్షేత్రంలో నాకన్నా ముందు నించే ఉన్నడు అతనికివకూడా పద్మవిభూషణ్ ఇవ్వనుఅండె అన్నడు.వారిద్దరు మంచి మిత్రూలుకూడా.కాళోజీ నాగొడవ పరాభవ గ్రీష్మం ను వావిలాల ,తెన్నేటి ఇద్దరూ,వచ్చి ఆవిష్కరించారు.గల్లీ లీడరుకూడా తనకు,ప్రోటోకాల్ మర్యాదలివ్వటం లేదని గోల చేస్తున్న ఈ రోజుల్లో అటువంటి నేతలను ఊహించటం కష్టమే.మనం వారున్న కాలంలో జీవించినమని చెప్పుకోగలగటం మన అదృష్టం. కాళోజీ షష్టి పూర్తికి పి వి వచ్చి అందరితోపాటు కృష్ణదేవరాయ భాషానిలయంలో కిందనే కూర్చున్నడు. మరల ఒకశసారి గొప్ప అంటే నైతికత కలిగిన వారినివతలచుకోగలిగినందుకు – మీకారణంగా- సంతోషం సర్
—-రామశాస్త్రి
డా.కె.ఎల్.వి.ప్రసాద్
శాస్త్రి గారు
మీ స్పందన కు ధన్యవాదాలండీ.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Great people will be always sincere, simple and helpful. There is no comparison with so called show off politicians who are not at all helping the common man.
——-Dr.M.Manjula.MDS
Hyderabad.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
Thank you
Doctor garu.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
దేశం కోసం.. సమాజ శ్రేయస్సు కోసం తమ జీవితాలను త్యాగం చేసిన ఎందరో మహానుభావులు నేటి తరానికి స్ఫూర్తి ప్రదాతలు …….
వావిలాల గోపాలకృష్ణయ్య లాంటి నాయకులు ప్రజాస్వామ్య నాయకులు ……
నేటి నాయకులు నిరంకుశ నాయకులు ….
——శ్రీ ధర్ రెడ్డి
రామకృష్ణా కాలనీ
హన్మకొండ.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
బాబూ
ధన్యవాదాలండీ.