మిత్రత్వం… ఇలా కూడా!!
వైద్య రంగం – ముఖ్యంగా ప్రభుత్వ వైద్య రంగం రకరకాల రంగులు మార్చుకుంటూ, మొత్తం మీద పేదవాడికి అందాల్సిన వైద్యం వక్రరూపాలు దాల్చి పట్టాలు తప్పుతుందని చెప్పక తప్పదు. అలా అనీ అందరినీ ఒకేలా లెక్క కట్టడం సముచితం కాకపోయినా, ఒకరు చేసే తప్పు యావత్ అదికారుల మీద, సిబ్బంది మీద ప్రభావం పడుతుంది. తద్వారా ప్రజల్లో – ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల, అందులో పనిచేసే సిబ్బంది పట్ల చులకన భావం ఏర్పడడమే కాదు, అర్థం పర్థం లేని అలజడులకు కారణం అవుతుంది. ముఖ్యంగా, పై కేడర్ నుండి క్రింది స్థాయి ఉద్యోగుల వరకూ అవినీతిని ఆశ్రయించడమే దీనికి ముఖ్య కారణం.
ఒకప్పుడు ప్రభుత్వ వైద్య రంగంలో వివిధ స్థాయిల్లో ఎప్పటికప్పుడు ఆయా స్థాయి అధికారుల పర్యవేక్షణ సజావుగా, పకడ్బందీగా, కఠినంగా క్రమశిక్షణతో ఉండేది. రాష్ట్ర స్థాయిలో ఇద్దరు డైరెక్టర్లు, వారి క్రింది స్థాయి అధికారులు, జిల్లా స్థాయిలో, జిల్లా వైద్య అధికారి (డి.ఎం.&హెచ్.ఓ), వారి క్రింది అధికారులు, రీజియన్‌కు సంబంధించి (మూడు జిల్లాలు) ఒక రీజినల్ డైరెక్టర్, వారి క్రింది స్థాయి అధికారులు వుండి, జిల్లా ఆసుపత్రులు తాలూకా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పర్యవేక్షణ ముమ్మరంగా జరిగేది. అందుచేత అటు వైద్యులు, ఇటు వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వుండి, పుష్టికరమైన వైద్య సేవలు అందించేవారు.
తర్వాత ఎన్నో మార్పులు వచ్చాయి. నాటి ఉమ్మడి రాష్ట్రంలో, ఎన్. టి. రామారావు గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి నిధులు రప్పించి, వైద్య రంగాన్ని మూడు విభాగాలుగా చీల్చినారు. జిల్లా, తాలూకా ఆసుపత్రులను ఒక ప్రత్యేక గొడుగు క్రిందికి తెచ్చినారు. అదే ‘వైద్య విధాన పరిషత్’. దీని రాష్ట్ర స్థాయి అధికారి కమీషనర్. అలాగే వైద్య విద్యను, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ క్రిందికి, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ క్రిందికి తెచ్చినారు. దీనివల్ల సేవా కార్యక్రమాలు మెరుగుపడినా, పాలనాధికారం కూడా ముఖ్యమైన మూడు ముక్కలుగా చేయడం వల్ల ఎవరికి వారే …! అన్న చందంగా తయారయి ఒకరికి మరొకరు జవాబుదారీ కాకుండా అయినందు వల్ల, ఆసుపత్రుల మధ్య సమన్వయం లోపించి కొన్ని సమస్యలు ఎదురయినాయి. దీని పర్యవసానమే, కొన్ని జాతీయ కార్యక్రమాలు దెబ్బతిన్నాయి. అధికారుల పర్యవేక్షణా లోపం ఏర్పడింది. వైద్యుల్లో, వైద్య సిబ్బందిలో క్రమశిక్షణ లోపించింది. దీనికి తోడు లంచగొండితనం ప్రబలి పోయిందని చెప్పక తప్పదు. జిల్లా ఆసుపత్రులపై, జిల్లా వైద్యాధికారి పట్టు సడలిపోవడం, వైద్య విధాన పరిషత్, జిల్లా కో-ఆర్డినేటర్లను ఏర్పాటు చేయడం, వారు వైద్యసేవలతో పాటు, పరిపాలనా విధులు నిర్వర్తించలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు ప్రభుత్వం ఆసుపత్రి అభివృద్ధి సలహా మండలిని ఏర్పాటు చేసి ఆ ప్రాంతపు శాసనసభ్యుడిని చైర్మన్ గాను, ఆసుపత్రి సూపరింటెండెంట్ సహాయకుడి గాను, వివిధ వర్గాలకు చెందిన నాయకులను సభ్యులుగానూ చేసింది. ఈ సలహామండలులు ఏ కొద్దీ ప్రాంతాల లోనో తమ విధులు సక్రమంగా చేసి ఆసుపత్రి అభివృద్ధిలోనూ, రోగులకు వైద్య సేవలు అందించడంలోనూ, తమ శక్తి సామర్ధ్యాలు చూపించారు. కానీ ఎక్కువ ప్రాంతాలలో ఈ సలహా మండలులు, ఆసుపత్రుల అభివృద్ధిని విస్మరించి, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను, సిబ్బందిని ఇబ్బందిపెట్టి వసూళ్లు చేయడం ప్రారంభించడంతో, విచ్చలవిడి లంచగొండితనానికి ఆసుపత్రులు శ్రీకారం చుట్టాయి. చోటా మోటా నాయకులను తట్టుకోవడానికి సిబ్బందికి ఇది తప్పనిసరి అయింది. నాల్గవతరగతి ఉద్యోగులు కొంతమంది ఇతర ముఖ్యమైన ఉద్యోగులూ సంవత్సరాల తరబడి ఒకేచోట పాతుకుపోవడం వల్ల వారు ఏమి చేస్తే అదే కరెక్టు అన్న పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితులకు కాస్త ముందు, నేను ఎదుర్కొన్న విషయం ఇక్కడ వివరించవలసిన అవసరం ఉంది.
అప్పటికి ఇంకా వైద్య విధాన పరిషత్ ఏర్పడలేదు. నేను మహబూబాబాద్ ఆసుపత్రిలో పనిచేస్తున్న రోజులు. కరీంనగర్ జిల్లాలోని ఒక ప్రాంతం నుండి డిప్యూటీ సివిల్ సర్జన్ హోదాలో ప్రమోషన్‌తో ఒక పెద్దాయన బదిలీ పై మహబూబాబాద్‌కు వచ్చారు. ఎంతో అనుభవాన్ని మూటగట్టుకుని వచ్చిన వ్యక్తి. అతి సౌమ్యుడు,మృదు స్వభావి. నెమ్మదస్తుడు, కించిత్ భయస్తుడు కూడా. నాకు వేసెక్టమీ శస్త్ర చికిత్స (ఆయన, కుసుమ అనే స్టాఫ్ నర్స్) చేసింది కూడా ఆయనే! ఆసుపత్రి ఆవరణ లోని డాక్టర్ క్వార్టర్లో కుటుంబ సమేతంగా ఉండేవారు. కుటుంబ సంక్షేమం శస్త్ర చికిత్సలతో పాటు చిన్న చిన్న సర్జరీలు (డబ్బులు తీసుకుని) చేసేవారు. ఆ స్థానంలో ఎవరు వున్నా కొంచెం అటు ఇటూగా ఇదే పద్ధతి. రెండు గంటలనుండి, సాయంత్రం నాలుగు గంటలవరకూ బయట ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకునేవారు. నేను ఆసుపత్రి పని గంటల తర్వాత, అంటే సాయంత్రం ఆరు గంటల తర్వాత చిన్న క్లినిక్‌లో ప్రాక్టీస్ చేసేవాడిని. పనివేళల్లో నా సీటుకు అంటిపెట్టుకుని ఉండేవాడిని. మొదట్లో నాకు పెద్దగా పని ఉండేది కాదు. ఖాళీ సమయంలో చదూకోవడమో, కథలు – వ్యాసాలూ రాసుకోవడమో (నిజానికి పనివేళల్లో ఈ పని కూడా చేయకూడదు!) చేసేవాడిని. పేషేంట్స్ వస్తే చూసేవాడిని.
సాధారణంగా, పనివేళల్లో ప్రైవేట్ సర్జరీలు వస్తే, ఓ.పి, ఆపేసి ఇతర డాక్టర్లు సర్జరీలు చేసుకుని డబ్బు సంపాదించుకునేవారు. కొందరు నన్ను రిక్వెస్ట్ చేసి కాసేపు ఓ.పి.లో కూర్చోమనేవారు. వారి అభ్యర్ధన మేరకు నేను వెళ్లి అక్కడ చిన్న చిన్న సమస్యలకు మందులు రాసేవాడిని. ఇలా.. నడుస్తున్న వ్యవహారం పరస్పర అవగాహనతో, ఆనందం గానే గడిచిపోతోంది. కాస్త అతి తెలివైన వాళ్ళు ఓ.పి.ని, ఫార్మాసిస్టుకి అప్పజెప్పి, తమ స్వంత పనులు చేసుకునేవాళ్ళు. డాక్టర్లు ఉండగా ఫార్మాసిస్టు రోగులను చూడడం, వంట మనిషి (రాములు) ఇంజెక్షన్లు ఇవ్వడం నేను జీర్ణించుకోలేక పోయేవాడిని. వాళ్ళ.. వాళ్ళ స్వంత ప్రయోజనాల కోసం ఇలాంటి పనులు జరిగేవి. గ్రామ పెద్దలు, వివిధ రకాల నాయకులు వారికి అవసరం వచ్చినప్పుడు మాత్రమే, ఆసుపత్రి వంక తొంగి చూసేవారు (ముఖ్యంగా వారికి సంబందించిన, పోస్టుమార్టంలు, మెడికొ లీగల్ కేసులు వచ్చినప్పుడు). అసలు అక్కడ ఏమి జరుగుతుందో ఎవరూ పట్టించుకునే వారు కాదు. ఈ నేపథ్యంలో ఒక సంఘటన జరిగింది. అది నాకూ డిప్యూటీ సివిల్ సర్జన్‌కు (నాకు బాస్ అన్న మాట!) సంబందించిన విషయం.
ఒక రోజు, ఎప్పటిమాదిరిగానే తొమ్మిది గంటలకు ఆసుపత్రికి వెళ్లి అటెండన్స్ రిజిస్టర్లో సంతకం చేసి వచ్చి నా సీట్లో కూర్చున్నాను. జనరల్ ఓ.పి.ని ఆనుకుని వున్నచిన్న గది నాకు కేటాయించారు. నేను వచ్చిన పేషెంట్లను ఒక్కొక్కరిని చూసి పంపిస్తున్నాను. సుమారు మధ్యాహ్నం పదకొండు గంటలకు, మా డిప్యూటీ సివిల్ సర్జన్ గారు వచ్చి, ఒక ఆర్దరు వేసినట్టుగా – “వెళ్లి జనరల్ ఓ.పి. చూడండి” అన్నాడు. నేను కాసేపు ఆలోచించి “నేను చూడను” అనేశాను.
“అదేంటి.. నేను చెబుతుంటే ఎందుకు చూడరు?” అన్నాడు కాస్త సీరియస్‌గా.
“మీరందరూ ఉండగా.. నేనెందుకు చూడాలి?” అని ఎదురు ప్రశ్న వేసాను. “మాకు వేరే పనులున్నాయి” అన్నాడు.
“అయితే.. ఓ. పి. మూసుకుని వెళ్ళండి” అని ఒక ఉచిత సలహా ఇచ్చాను.
“మీకు అసలు పేషెంట్స్ ఉండడం లేదు, ఖాళీగా వుంటున్నారు” అన్నాడు, ముఖం అదోలా పెట్టి.
“వచ్చిన వాళ్ళని చూడడం నా బాధ్యత! నేను పనిచేయకుంటే నా పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవలసిన బాధ్యత మీది! నేనైతే ఊరిమీద పడి డెంటల్ పేషెంట్స్‌ను తీసుకు రాలేను కదా!” అన్నాను.
“మీరు ఇప్పుడు జనరల్ ఓ.పి.లో కూర్చోవలసిందే! నేను ఆఫీస్ ఆర్డర్ ఇస్తాను” అన్నాడు. “అది నేను పట్టించుకోను” అన్నాను
“ఏమి ఎందుకు?” అని ఎదురు ప్రశ్న వేసాడు.
“ప్రతి ఉద్యోగికి ప్రభుత్వ పరంగా ఒక జాబ్ చార్ట్ ఉంటుందని మీకు నేను వేరే చెప్పనక్కరలేదు. అందులో మీరు చెప్పే డ్యూటీ నాకు లేదు. మీరు ఇప్పుడు చెబుతున్న పని నేను చెయ్యాలంటే, నాకు ‘డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్’ నుండి ప్రత్యేకమైన అధికారిక ఉత్తర్వులు అవసరం” అన్నాను
ఇక నాతో టైం వెస్ట్ అనుకుని, జనరల్ ఓ.పి. ఫార్మాసిస్టుకు అప్పజెప్పి ఆయన ఆపరేషన్ థియేటర్‌కు వెళ్ళిపోయాడు. మరునాడు నాకు తప్పక మెమో వస్తుందని, దానికి సరైన సమాధానం ఎలా ఇవ్వాలో కూడా ఒక ఐడియా మైండ్‌లో పెట్టుకున్నాను.
కానీ.. నా ఆలోచనలకు పూర్తిగా భిన్నంగా మరునాడు ఆయన నా సీట్ దగ్గరికి వచ్చి నవ్వుతూ – “ప్రసాద్,బాగున్నారా?” అని పలకరించాడు. నేను కూడా ఏమీ జరగనట్టుగానే ఆయనను నవ్వుతూ పలకరించాను.
ఏమి జరిగిందన్నది నాకు తెలీదు కానీ, అప్పటినుండీ మేము మంచి మిత్రులం అయిపోయినం. కుటుంబంతో మంచి స్నేహ సంబంధాలు ఏర్పడినాయి. వాళ్ళ చిన్నబాయిని (రాజు.. అని పిలిచేవారు) ఇద్దరం విజయవాడ శివార్లలో వున్నఒక ఇంజనీరింగ్ కాలేజీలో చేర్చి వచ్చాము.
వాళ్ళ పెద్దమ్మాయిని బెజవాడలోని కోటేశ్వరమ్మ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న బి.ఎడ్. కాలేజీలో చేర్చి వచ్చాము. ప్రతి ఆదివారము మా అత్త గారు వెళ్లి ఆ అమ్మాయిని చూసి వచ్చేది. అలా మా మధ్య మంచి స్నేహం ఏర్పడింది. తర్వాత ఆయన వరంగల్ ఎం.జి.ఎం. ఆసుపత్రిలో ఆర్.ఎం.ఓ.గా నియమింప బడినందువల్ల వరంగల్ వచ్చేసారు. నాకు జనగాం బదిలీ అయినందువల్ల నేను హన్మకొండలో స్థిరపడ్డాను. అలా.. అప్పుడప్పుడూ వారి ఇంట్లో కలుస్తుండేవాళ్ళం.
చాలా కాలం కుటుంబ సమేతంగా ఆయన ఎక్సయిజ్ కాలనీలో వారి సొంత ఇంట్లో వున్నారు. ఇద్దరు కొడుకులూ, ఇద్దరు కూతుళ్లు చక్కగా ప్రయోజకులైనారు. తర్వాత వారంతా హైదరాబాద్‌కు వెళ్లిపోవడం ఆయన చనిపోవడం కూడా జరిగింది. చివరికి ఆయన నాకు మంచి స్నేహితుడిగా, శ్రేయోభిలాషిగా మిగిలారు. ఇవాళ ఆయన లేకపోయినా, మా ఇద్దరి మధ్య చిన్న ఘర్షణ జరిగినా తర్వాత ఒకరికొకరం తెలుసుకుని దగ్గరయ్యాము. అందుచేత ఇక్కడ ఆయన పేరు చెప్పకుండా ఉండడం సమంజసం కాదని నాకు అనిపిస్తున్నది.
ఆయన డా. ఎస్. వెంకటేశం గారు. ఏదో రూపంలో, ఏదో సందర్భంలో డా. వెంకటేశం గారు నాకు ఎప్పుడూ గుర్తుకు వస్తూనే వుంటారు. ఆయన చివరి క్షణాలు చూడలేకపోవడం బాధాకరమే!
(మళ్ళీ కలుద్దాం)

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
34 Comments
డా కె.ఎల్.వి.ప్రసాద్
సంచిక సంపాదకవర్గానికి
ఇతర సాంకేతిక నిపుణుల కు
హృదయపూర్వక ధన్యవాదాలు.
sagar
వెంకటేశం గారు ఆరోజు ఆదేశించకుండా అభ్యర్ధించి ఉంటే మీరు ఓపి చూసేందుకు ఒప్పుకునేవారు అని నా అభిప్రాయం. నిదానంగా అయినా వారు జరిగిన పొరపాటును సరిదిద్దుకుని మీతో స్నేహానికి పూనుకోవడం అనేది మానవ సంబంధాలలో అన్నీ పట్టింపులు పనికిరావు అనే చిన్న సూక్తిని తెలియచేస్తుంది సర్ . అటుపై సుధీర్ఝకాలం వారు మీతో స్నేహబాంధవ్యాలు నడపడం ఎంతో సంతోషించవలసిన విషయం. మనసుకు ఆకట్టుకునే మంచి విషయాలు తెలుపుతున్న మీకు అభినందనలు మరియు ధన్యవాదములు.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
సాగర్
నీ స్పందన కు ధన్యవాదాలు.
మొహమ్మద్. అఫ్సర వలీషా
నమస్తే సార్
మీరు ముక్కు సూటి మనిషి నిజాయితీ కి పెట్టింది పేరు అని తెలుసు. మీ పై అధికారి మీపై ఆజమాయిషీ చేసినా మీరు ధైర్యంగా నిజాయితీకే ఓటేసి మీ నిర్ణయాన్ని మార్చుకోకుండా ఊహించని రీతిగా ఆయనే మీ స్నేహితునిగా మార్చడం చాలా సంతోషం సార్ మీ గొప్ప మనసు కు జోహార్లు 



మీ వ్యాసాలు ఎప్పుడూ మాకు స్ఫూర్తి దాయక మే ఆదర్శ పూరితమే








అదీ కాక హాస్పిటల్స్ లో జరిగే విషయాలు డాక్టర్లు వాళ్ళ స్వలాభాపేక్ష కు వాళ్ళ క్రింది ఉద్యోగుల మీద బాధ్యతలు వదివేయడం నిజం గా బాధాకరమే మీ ఙ్ఞాపకాల పందిరిలో పోగు చేసిన ప్రతి జ్ఞాపకం మాకు ఒక అనుభవాల సారమే సార్ మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు
డా కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా
మీ స్పందన కు ధన్యవాదాలు.
Dr.Harika
Good morning sir,
We can have that confidence to raise our voice when we are doing our duties perfectly(as you had done) where no one can through their disrespectful manners.
This is a major problem in many fields.
Whatever may be the problem, that can’t affect us if we are genuine enough which we need to learn from you sir.
Thank you for sharing sir.
డా కె.ఎల్.వి.ప్రసాద్
You are right
Doctor.
Thank you.
డా.కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా
నీ స్పందన కు ధన్యవాదాలు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
మీ తో జరిగిన సంభాషణలో , మీరు ప్రస్తావించిన ఘటం మీరు నాకు ఒక సారి చెప్పారు. ఎక్కడ , ఎవరితో అని మటుకు మాట రాలేదు.
మీ తరం వాళ్ళు గట్టిగా నిలబడి ఉన్నారు గనుక, మాకు ఇప్పుడు ఉనికి, సమాజ గుర్తింపు వచ్చాయీ.
మీతోను డా. జి. యన్. రావు గారి తో మాట్లాడినప్పుడు, మీ కు విద్యార్థి దశలో మీకు జరిగిన పరభవల ప్రస్తావన చాలాసార్లు వచ్చింది. అవి నేను నా తోటి వాళ్లు చవిచూడం జరగలేదు. సభ్య సమాజం లో కొంత గుర్తింపు ( దంత వైద్యుడు కి) చూసాను , కానీ అది తక్కువే. ఇప్పుడు ప్రస్తుతం ఆ భాధ్యత నా లాంటి మధ్య వయస్కులైన భుజస్కందాలపై ఉంది .
మీ కథ నా భాద్యతలు కి అద్దం లాగా రాశారు మీరు
——డా. డి.సత్యనారాయణ
హైదరాబాద్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు
డాక్టర్ గారూ.
Bhujanga rao
ఈవారం ఎపిసోడ్ ఆసక్తిగా సాగింది. మీరు విలువలతో కూడిన స్నేహాభావంతో ఉంటారు.మీ మాట నిక్కచ్చిగా ,నిర్మొహమాటంగా ఉంటుంది. సూటిగా చక్కని సలహాలు ఉంటాయి కాబట్టి మీరంటే మా అందరికి ఇష్టం సర్.ఇప్పుడున్న వ్యవస్థలు ఎంతగా భ్రష్ఠు పట్టాయో చిన్న example చక్కగా ఇచ్చారు.అందుకే మీ జ్ఞాపకాల పందిరిలో వ్రాసిన జ్ఞాపకాలు మాకు స్పూర్తిదాయకం.కాబట్టి మీ ఎపిసోడ్ మాకు తప్పక పంపించగలరు.చాలా ఎపిసోడ్స్ మిస్ అయినాయి సర్
డా కె.ఎల్.వి.ప్రసాద్
అలాగే నండీ.
మీ స్పందనకు ధన్యవాదాలు.
Sambasivarao Thota
Prasad Garu!
Appatlo prabhuthva aasupathrulalo vunna panitheerunu nijaayitheegaa vivarinchaaru..
Avasaramanukunte gattigaa nilabade manasthathvam meedi…
ani cheppakane cheppaaru..
Tharuvaatha emaindo,meeriddaroo manchi snehithulugaa maaraaru ..
Santhoshinchadagga Vishayam mari…
Chaalaa Baagundandi ee episode..
Dhanyavaadaalandi
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు
రావుగారు.
డి.వి.శేషాచార్య
ఒక వ్యవస్థ ఎలా నిర్వీర్యం అవుతుందో చాలా చక్కగా వివరించారు.
ఘర్షణ తో ప్రారంభమైన స్నేహం ఎక్కువ బలంగా ఉంటుందనేది నిజం.
డా కె.ఎల్.వి.ప్రసాద్
అవునా..అలాగే జరిగింది.
మీ స్పందన కు ధన్యవాదాలండీ.
Jhansi koppisetty
మీ అన్యాయాన్ని ఎదిరించే తత్వం, ముక్కు సూటితనమే మీపై వారికి గౌరవాన్ని పెంచి మంచి స్నేహితునిగా దరి చేర్చింది…
మీ మంచి నడవడిక అమూల్యమైన వ్యక్తిత్వమే ఈ నాటికీ చాలామందిని ఆకట్టుకుని స్నేహితులను చేస్తోంది….
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు
ఝాన్సీ గారు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
మీ కంటే పై స్ధాయి లో ఉండి తనకు లేని అధికారంతో మీకు కేటాయించిన జాబ్ చార్ట్ లో లేని పనిని చేయమని చెప్పినప్పుడు అనవసరంగా సమస్యలు ఎందుకు అని అనుకోకుండా నిర్భయంగా సమాధానం చెప్పినా మీ తెగువ ప్రశంసనీయం సర్.
ఇప్పటికీ చాలా మంది పై అధికారులతో అనవసరంగా సమస్యలు ఎందుకు అని సర్దుకుపోయి పనిచేసే వారు చాలా మంది ఉన్నారు సర్.
సంఘటన జరిగిన మరుసటి రోజే వెంకటేశం గారిలో మార్పు రావడం, మీ మధ్య మంచి అనుబంధం ఏర్పడడం చాలా సంతోషకరమైన అంశం సర్.
———–జానీబాషా
నరసరావుపేట.
డా కె.ఎల్.వి.ప్రసాద్
జానీబాషా
మీ స్పందన కు ధన్యవాదాలండీ
Shyam
Standing upright against the corrupt and authoritarian bosses is appreciated. The plight of government hospitals never change. The job security and employees rights are the causes for such attitude in the system. We observed that government doctors and nurses behave rash and insensitive towards patients. Earning was part of the doctors profession but now it has transformed in to amassing wealth. Now patients became customers. We can find umpteen number of nefarious activities in the government hospitals. All are innovative. Some have good reputation due to its special entity and some are still clean because of the systems incorporated from the inception by the founders. Inhuman attitude and lust for money, lack of service attitude, exorbitant cost of medical education are the root cause of this malaise in govt hospitals. We feel happy whenever we see a perfect person in such areas. He is to be respected and recognized.
Thats what happened to you dr klv. Though you hurt your boss, he recognized your sincerity and you are honored by him. An old saying ” sincerity pays in the long run”. It proved.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Thank you shyam
For your.wonderful
Analysis
Naccaw Sudhacaraw Rau
Dr ji good morning, the hopelessness of our administration and political system from the day one is INCORRIGIBLY corruptive, corruptible and corrupting…. this is institutional and from Top to the Bottom or bottom to the top is the salf same….
This is also the History of our India…one king during Tughlaq rule, paid sweeteners to his own subordinates to get the things done at the earliest!!!
Even the clergy defied and rejected the the king Chatrapati Shivaji Maharaj to perform his Coronation as per the Vedic tradition!!!
So, I don’t find anything strange in your assessment of our administration and system. What is unbelievably surprising is your statement that Administration is going down day by day….
What is Cancer to individual .. Corruption is to society…..the former is medical and the latter is immedicable…
.
Sudhacaraw Rau Naccaw.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Dear sudhakar ji
Thank you so much
For your wonderful
Analysis.
డా కె.ఎల్.వి.ప్రసాద్
నిజంగా మన పని మనం చేసుకు పోతున్నా కొన్నిసార్లు ఇతరుల వల్ల మన ఆత్మ సాక్షికి వ్యతిరేకంగా చేయవలసి వస్తుంది.అటువంటప్పుడు వేదన పడడం కన్నా మీలా నిజాయితీగా, ముక్కుసూటిగా సమాధానం ఇవ్వగలిగితే మన విలువ,వ్యక్తిత్వం నిలబడడం ఏ కాకుండా…మనల్ని సదరు వ్యక్తులు అర్ధం చేసుకుని స్నేహంగా మారే సందర్భాలు ఉంటాయని మీ అనుభవం ద్వారా చాలా చక్కగా వివరించారు సర్. నిజాయితీగా వ్యవహరించడానికి కావాల్సిన మనోనిబ్బరం కలిగి ఉండడం మీ అనుభవం లో అత్యంత ప్రత్యేకంగా,స్ఫూర్తివంతంగా అనిపించింది సర్.మంచి జ్ఞాపకాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు సర్


—-నాగజ్యోతి శేఖర్
కాకినాడ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా
మీ స్పందన కు ధన్యవాదాలు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
డాక్టర్ గారు నమస్కారం

మీ జ్ఞాపకాల శీర్షిక నుండి మీ మీ సర్వీస్ లో మీకు ఎదురైన సంఘటన ను వివరిస్తూ ఉంటే నాకు నా నిజజీవితంలో అంటే ఉద్యోగరీత్యా ఎదురైన ఒక సన్నివేశాన్ని మీతో పంచుకోవాలని పిస్తుంది.
అది 1992 వ సంవత్సరము. నేను అప్పుడు అమీర్పేట రైల్వే రిజర్వేషన్ కౌంటర్ లో కౌంటర్ క్లర్క్ గా పని చేస్తున్న రోజులు. అప్పుడప్పుడే రైల్వే రిజర్వేషన్ సిస్టము కంప్యూటరైజ్డ్ అవుతుంది. అప్పటికి ఇంకా ఇంటర్నెట్ లో టికెట్లు పొందే సదుపాయం లేదు. అమీర్పేట్ లో నాలుగు కౌంటర్లలో కూడా ఎప్పుడు కనీసం పది పన్నెండు మంది లైన్ లో ఉండే వారు. సిటీలో అక్కడక్కడా రిజర్వేషన్ సెంటర్స్ ఓపెన్ చేయడం వల్ల స్టాప్ సర్దుబాటు వీలు కాక చాలామంది డబల్ డ్యూటీ అంటే ఓవర్ టైం చేయవలసిన అవసరం ఉండేది. నేను ఒక రోజు డబల్ డ్యూటీ చేస్తున్న టైంలో అంటే ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల 15 నిమిషాల నుండి సాయంత్రం 8 గంటల వరకు. 2 నుండి 2:15 వరకు ఉదయము క్యాష్ క్లోజ్ చేసి క్యాషియర్ కి అప్పచెప్పి మధ్యాహ్నం భోజనం చేసి తిరిగి రెండు గంటల 15 నిమిషాలకు కౌంటర్ ఓపెన్ చేయాలి. కరెక్ట్ గా రెండు గంటలకు ఒక నిమిషం ముందుగా ఒక పాసింజరు నాకు 2 forms ఇచ్చి ఒకటి క్యాన్సిలేషన్ కి రెండవది బుకింగ్ కి అని చెప్పడంతో వాటిని కంప్లీట్ చేసి నేను క్లోజ్ బోర్డు పెట్టడానికి సమాయత్తమవుతుంటే అతను తిరిగి మరి 2 forms ఇచ్చి వీటిని కూడా డీల్ చేయమన్నాడు. నేను అతనితో రెండు మాత్రమే తీసుకుంటాను ఒక 15 నిమిషాలు వెయిట్ చేయండి తిరిగి కౌంటర్ ఓపెన్ చేసిన తర్వాత మీ పని కంప్లీట్ చేస్తాను అని చెప్పి నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నాను. కానీ వెంటనే ఆ పాసింజరు లోపలికి షిఫ్ట్ సూపర్ సూపర్వైజర్ దగ్గరికి వచ్చి తను ఒక ట్రైనీ IRTS ఆఫీసర్ అని ,నేను అతన్ని తిరస్కరించిన విషయం చెప్పి తన పని చేయమని చెప్పడం జరిగింది. అప్పుడు ఆ సూపర్వైజర్ నా దగ్గరికి వచ్చి ఆయన irts ఆఫీసరు. మీరు ఎందుకు కాదన్నారు అని అడిగారు .దానికి నేను వెంటనే అయితే కానివ్వండి( so what )ఆయనకు రెండు ఫాన్స్ ఇచ్చాను నాలుగు ఇవ్వను కదా అన్నాను .తిరిగి ఆ సూపర్వైజర్ అప్పుడే ఓపెన్ చేసిన కౌంటర్ దగ్గరికి వెళ్లి ఆఫీసర్ యొక్క టికెట్లు ఇప్పించి పంపించడం జరిగింది(.As per railway rules only one or two forms per head at once).
మరుసటి రోజు మాకు మా రైల్వే అకౌంట్స ఆఫీస్ నుండి ఒక తెలిసిన ఆడిట్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి ఆ ఆఫీసర్ అకౌంట్స్ ఆఫీస్ లో ఒక మూడు నెలల ట్రైనింగ్ గురించి వచ్చారని, నిన్నటి రోజు జరిగిన సంఘటన గురించి నన్ను ఆఫీసుకు వచ్చి కలవమని చెప్పారని . కానీ నేను ఆ ఇన్స్పెక్టర్తో నేనేమీ తప్పు చేయలేదు అయినా వీలైతే తరువాత కలుస్తాను అని చెప్పాను. లెమ్మని ఊరుకున్నా.నేను రెండు మూడు రోజుల వరకు ఆఫీస్ కి వెళ్ళలేదు ఆయను కలవలేదు. ఇక నాలుగవ రోజు నుండి ఈ ఆడిట్ ఇన్స్పెక్టర్లు మరియు విజిలెన్స్ ఇన్స్పెక్టర్ మా అమీర్పేట చెకింగ్ చేయడానికి వచ్చారు. ఇలా రెండు మూడు రోజులకు ఒకసారి ఆ మూడు నెలల్లోనే ఆరు సార్లు ముఖ్యంగా నా కౌంటర్ చెక్ చేయడం జరిగింది. వాళ్లకు ఎటువంటి అవకతవకలు కనిపించలేదు. తిరిగి నాకు పరిచయమున్న ఆడిట్ ఇన్స్పెక్టరు వెళుతూ వెళుతూ ఆ ఆఫీసర్ నన్ను టార్గెట్ చేశాడు అని చెప్పాడు. ఈ కథని ఇక్కడ కట్ చేస్తే……
దాని తర్వాత 2015 సంవత్సరంలో నేను సూపర్వైజర్ ప్రమోషన్ మీద నాంపల్లి కి బదిలీ అవ్వడం జరిగింది. ఆ స్టేషన్ లో ఉన్నటువంటి నియమాల ప్రకారం సూపర్వైజర్ కూడా అప్పుడప్పుడు కౌంటర్లో పని చేయవలసి వచ్చేది. ఒక రోజు నేను ఇలాగే కౌంటర్ లో పనిచేసే టైంలో విజిలెన్స్ చెక్లో నా కౌంటర్ చెక్ చేయడం జరిగింది. నా క్యాస్ కరెక్టుగా టాలీ అయినది. కానీ ఒక స్పెషల్ క్యాన్సిలేషన్ టికెట్ పైన సూపర్వైజర్ ఎండార్స్మెంట్ లేదు. నేను కూడా సూపర్వైజర్ గ్రేడ్ లో ఉన్నాను కాబట్టి తిరిగి మరొక సూపర్వైజర్ తో సంతకం చేయ వలసిన అవసరం లేదు అనే ఆలోచనతో సంతకం చేయించుకోలేదు. ఆ విషయము వారితో చెప్పినప్పటికీ వారు తిరస్కరించి నాతో స్టేట్మెంట్ తీసుకుని ఆఫీస్ లో సబ్మిట్ చేయడం జరిగింది .మూడురోజుల తరువాత నాకు విజిలెన్స్ ఆఫీస్ నుంచి ఒక మెసేజ్ రావడం అందులో నేను చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ని చూడవలెనని. నేను మరుసటి రోజు లెటర్ తీసుకొని ఆయనను చూడడానికి వెళ్లాను. నన్ను ఏ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ అయితే చెక్ చేశాడో ఆయనను కలిశాను .అతను నన్ను ఆ ఆఫీసర్ ఛాంబర్ దగ్గర బయట నిలబెట్టి తను లోపలికి వెళ్ళాడు. ఒక 30 నిమిషాల వరకు లోపలికి పిలువలేదు. తరవాత లోపలికి పిలిస్తే ఆఫీసర్ దగ్గరకు వెళ్లి నిల్చున్నాను. ఆయన నన్ను గమనించకుండా తను ఫోన్లో మాట్లాడుకుంటూ ఇంకొక పది నిమిషాలు అలాగే నిలబెట్టారు. తిరిగి నన్ను పైకి కిందకు చూసి నీ పేరు రామకృష్ణ రెడ్డి కదా. నీకు చాలా పొగరు అంటూ 1992లో జరిగిన సంఘటన గుర్తు చేశాడు. ఆయనే నాకు ఆ రోజు తటస్థించిన ట్రైనీ irts ఆఫీసర్ .ఇన్ని సంవత్సరాలు ఆయన ఆల్ ఇండియా లెవెల్ లో ఎన్నో విభాగాల్లో అధిపతిగా పనిచేసి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నన్ను గుర్తుంచుకొని ఆఫీసుకు పిలిపించడం జరిగింది. ఈ టికెట్ పైన సూపర్వైజర్ సంతకం లేనందుకు నన్ను Parli లేదా బెల్లంపల్లి కి ట్రాన్స్ఫర్ చేయమని ఇన్స్పెక్టర్ లో చెప్పడం నేను దానికి సారీ సార్ అని మాత్రమే సమాధానం చెప్పడం తిరిగి ఆయనే రూల్స్ అంత కరెక్ట్ గా పాటిస్తున్నావా? ఓకే కీప్ ఇట్ అప్ అంటూ నన్ను పంపించేశారు. తర్వాత నాకు ఎటువంటి పనిష్మెంటు రాలేదు. తర్వాత అదే సంవత్సరంలో రైల్వే వీక్ అవార్డ్స్ లో ఆ ఆఫీసర్ చేతులమీదుగానే బెస్ట్ వర్కర్ గా నేను అవార్డు తీసుకోవడం ఎంతో గౌరవంగా భావించాను.
కనుక ఎవరైనా నియమావళికి లోబడి పనిచేస్తున్నప్పుడు ఎదుటివారికి మొదట్లో కొంచెం అహం తిన్నా ,వారు కొంచెం ఆలోచిస్తే మన దోషము ఎక్కడా లేనప్పుడు తిరిగి మనలను గౌరవిస్తారు అనే విషయము మీ సందర్భంలోనూ, అలాగే నా సందర్భంలో నిరూపితమైనది. కానీ కాలానుగుణంగా పరిస్థితుల ప్రభావము లేదా మనుషుల యొక్క కల్మషం వలన ఇప్పుడు ఇటువంటి వారు ఎదురు పడటం చాలా అరుదు.
ధన్యవాదాలు
—–బి.ఎన్. కె.రెడ్డి
సికింద్రాబాద్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
సర్
మీ స్పందన కు ధన్యవాదాలండీ
మంచి అనుభవాలు మీవి.
డా కె.ఎల్.వి.ప్రసాద్
ఈ సంచికలో ఆసుపత్రులలో జరిగే సంఘటనలను, వాటిలో మీ పాత్ర మరియు మీ ముక్కుసూటితనం చాలా చక్కగా వివరించారు. మాకు తెలియని కొన్ని విషయాలు ఎన్నో తెలిపారు. అభినందనలు.
జి.శ్రీ నివాసాచారి
కాజీపేట.
డా కె.ఎల్.వి.ప్రసాద్
చారి గారూ
ధన్యవాదాలు
డా కె.ఎల్.వి.ప్రసాద్
49వ సంచిక చదివాను సర్.బాగుంది .వైద్యరంగం దిగజారి పో తున్న లేక పో యిన విషయం పట్ల మీ ఆందోళన అర్థ రహితం కాదు.ఒకరకంగా NTR పరిపాలన కారణం కావచ్చ్చు.ఎప్పుడైతే రాజకీయ నాయకుల ప్రమేయం మొదలైందొ అప్పుడే భ్రష్టు పట్టి పొయింది .ఒక వైద్యరంగం మాత్రమేకాదు. విద్యారంగము కూడా.ఎక్కడ రాజకీయం ప్రవేశిస్తుందొ అక్కడంతా నాశనమే.ముతకసామెత ఒకటున్నది .” నీ కాపురం చెడగొట్టక పో తే నేను రంకుమొగుడినే కాదు ” అని రంకు మగడైనప్పుడే చెడి పో యింది ఇంకాచెడగొట్టజమేంటి.రాజకీయ నాయకులు అన్ని చొట్లా ఇట్లాగే వస్తున్నారు..exceptions చాలా అరుదు కొందున్నరు వారు లెక్కలో కి రారు. మీరు మీ బాస్కు కచ్చితమైన సమాధానం చెప్పేవరకు ఆయన మిమ్మల్ని ఏమీ అన లేని స్థితికి జారి పొయారు .కచ్చితంగా ఉండే వాడు ఎవరికీ భయపడడు.
బాగున్నది సర్.
——రామశాస్త్రి
డా కె.ఎల్.వి.ప్రసాద్
శాస్త్రి గారు
మీ స్పందన కు ధన్యవాదాలండీ
డా కె.ఎల్.వి.ప్రసాద్
పర్యవేక్షణ నిజాయితీగా ఉంటే
పాలనావ్యవస్థ పటిష్టమౌతుంది.
గేదె చేలోమేస్తే దూడ గట్టున మేస్తుం
దా అన్నట్టు అధికారి లంచగొండి
లేదా విధ్యుక్తధర్మాతీతంగా ప్రవర్తించి
నపుడు ,సహాయ ఉద్యోగసిబ్బంది
కూడా తమ ఇష్టానుసారంగానే
ప్రవర్తిస్తారు. ఉద్యోగ నిబద్ధత కల్గిన
వారు మీవలె ఇబ్బందిపడవచ్చు
ఒక్కోసారి తలవంచుకొని సర్దుకొన
వచ్చు. అనుచితమైన ఆర్డరు చేయ
బోయిన వేంకటేశంగారికి జ్ఞానోదయం
కల్గింది. మీరు వారు చాచిన స్నేహ
హస్తాన్ని అందుకున్నారు. మబ్బు
తొలగిపోయి ,వెలుగు ప్రసరించడం
మంచిదేకదా ,అదే అదృష్టం
—–వజ్జల రంగాచార్య
హన్మకొండ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
రంగాచార్య గారూ
మీ స్పందన కు ధన్యవాదాలండీ.