ఏవమ్మా..! బొట్టు పెట్టుకో..!!
చీర.. పురాతన కాలంనుండి మన స్త్రీమూర్తుల వెంట నడిచి వస్తున్న కట్టుబడి ఆచారం. అది మన సంస్కృతితో, సంప్రదాయంతో, ముడిపడి వున్న అంశం. నిజానికి చీర అందంగా కట్టుకోవడం ఒక కళ. అది ఇతర మహిళామణులకు అబ్బని విద్య. మనదేశ స్త్రీలు అమెరికా వంటి పాశాత్య దేశాల్లో చీర కట్టుకుని తిరుగుతుంటే, అక్కడి వనితలు వింతగా చూడడం నేను గమనించాను. అంత మాత్రమేకాదు, చిన్నగా పరిచయం చేసుకుని, చీరకట్టే విధానాన్ని అక్కడి మహిళలు ఆసక్తిగా అడిగి తెలుసుకున్న సందర్భాలూ నేను గమనించక పోలేదు. దేవతా స్త్రీ మూర్తులకు కూడా చీరకట్టి సింగారించడం మన సాంప్రదాయాల్లో ముఖ్యమైనది. సరే.. దేవతలు కాబట్టి ఆ సంప్రదాయమేదో గుడ్డిలో మెల్లలా ఇప్పటికీ కొనసాగుతూ వున్నది. మరి చీరలు కట్టేవారి సంఖ్య తగ్గిపోవడం లేదా? మహా అయితే పెళ్లిళ్లకు, పండగలకూ, అతి బలవంతం మీద ఇప్పటి ఆధునిక ఆడపిల్లలు చీరలు కడుతున్నారు తప్ప మిగతా రోజుల్లో అంతా డ్రెస్సులే! చీరలు కట్టే సంప్రదాయం క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. దీనికి భిన్నంగా విదేశీ స్త్రీలు మన ఆచారాలను దిగుమతి చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మనం మాత్రం జీన్ పేంట్లు, మిడ్డీలు, చుడీలు, ఇతర ఫ్యాషన్లు ఆహ్వానిస్తున్నాం. మగాళ్లు పంచ కట్టడం ఎప్పుడో మరచిపోయారు, లుంగీలు మాయమైపోతున్నాయి. పల్లెల్లో సైతం షార్టులు వివిధ రూపాల్లో వెలుస్తున్నాయి. సరే, అలంకారం – ఆహార్యం గురించి మాట్లాడవలసిన సమయం కాదేమో.. అతి సున్నితమైన అంశం అయిపొయింది. ఎవరి ఇష్టం వారిది. కాలంతో పాటు కదలి పోవలసిందేనేమో!
దీనికి భిన్నంగా కొన్ని మతాలలో, వర్గాలలో బొట్టు పెట్టుకోవడం నిషేధం! అది వారి సంస్కృతి. అంతే!! ఈ కోవకు చెందినవారిలో, నాకు తెలిసినంత వరకూ మూడు వర్గాలున్నాయి. వారిలో క్రైస్తవులు వున్నారు (ఇందులో మళ్ళీ ఒక ఉప వర్గం వారు బొట్టు పెట్టుకుంటారు, విగ్రహ పూజలు కూడా చేస్తారు). అలాగే, ముస్లింలు కూడా బొట్టు పెట్టుకోరు! తరువాత నాస్తికులు సైతం బొట్టు పెట్టుకోరు. అయితే ఆధునిక నాస్తికులు కొందరు ఇప్పుడిప్పుడే ఆ సంప్రదాయానికి గుడ్ బై చెప్పేసి, చక్కగా బొట్టుపెట్టుకుని ‘జస్ట్ ఫర్ చేంజ్..!!’ అంటున్నారు. సరే ఇలాంటి అతి సున్నితమైన విషయాలు ఇంతకు మించి చర్చించడం కూడా సబబు కాదు. ఈ వ్యాస రచయితకు మాత్రం బొట్టు పెట్టుకున్న ఆడపిల్లలు, మహిళామణులు అంటే ఇష్టం. అది వేరే విషయం.
ఇక సంస్కృతి – బొట్టు అనే అంశాలు ఇంతగా చర్చించడానికి గల ముఖ్య కారణం, బొట్టుతో నాకున్న గత అనుభవం గురించే!నా జీవన మూలాలు పూర్తిగా నాస్తిక జీవన విధానంతో సహవాసం చేసినవి. మా నాయన కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను (అప్పటివి) నూటికి నూరు శతం నమ్మి ఆకళింపు చేసుకుని ఆచరించిన వ్యక్తి. అందుకే ఇంట్లో పొరపాటున కూడా ‘దేవుడు’ అనే పదం వినపడేది కాదు. మా అమ్మమూలాలు పూర్తిగా క్రైస్తవత్వానికి చెందినవే! అయినప్పటికీ, మా కుటుంబం వల్ల ఆవిడ కూడా నాస్తికత్వానికి తలవొగ్గక తప్పలేదు.
మహబూబాబాద్‌లో కాపురం పెట్టాక మాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు, ఒక్క బొట్టు విషయం తప్ప. బయటికి వెళితే తప్పక బొట్టు పెట్టుకోమని హింసించేవాడిని. ఆమెకు సుతారమూ బొట్టు పెట్టుకోవడం ఇష్టం లేకపోయినా, నా భయానికో భక్తికో, తప్పక పెట్టుకునేది. తర్వాత వాళ్లకు ప్రతి ఆదివారం చర్చికి వెళ్లడం తప్పనిసరి అలవాటు. నేను వెళ్లనిచ్చేవాడిని కాదు. అయినా ఆమె ఎప్పుడూ దాని గురించి ఎదురు తిరిగిన సందర్భాలు లేవు. అయితే, కొన్ని నెలల తర్వాత నేనే ఆలోచనలో పడ్డాను. మానసికంగా ఆమె ఎంత బాధ పడుతున్నదో కదా! ఆమె కనీస స్వేచ్ఛను నేను ఎందుకు అడ్డుకోవాలి? అన్న ఆలోచనలతో చాలా రోజులు బాగా అలోచించి సకాలంలోనే ఒక నిర్ణయానికి వచ్చేసాను. చర్చి విషయంలో గానీ, ఆమె బొట్టు విషయంలో గానీ నేను ఎలాంటి ఆంక్షలూ విధించ కూడదని అనుకున్నాను. ఒక శుభోదయాన ఇదే విషయం ఆమె చెవిన వేసాను. అది విన్న ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది. పంతాలకూ పట్టింపులు జోలికి పోకుండా నిశ్శబ్ద యుద్ధం చేసి ఆమెనే గెలిచింది. గెలిచామన్న అహంభావం కూడా ఆమె ఎప్పుడూ చూపించలేదు. అంతేకాదు నన్నుకూడా చర్చి వైపు మళ్లించింది.
పెళ్ళైన కొత్తలో నా శ్రీమతి ఫోటోలు చాలా మట్టుకు బొట్టుతోనే ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి విషయాలు ప్రస్తావనకు వచ్చే అవకాశంలేదు – పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా!
(మళ్ళీ కలుద్దాం)
వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.