[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]


అనుకున్నదొక్కటీ..!!
జీవితంలో అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరగవు. కొన్ని ఊహించని మంచి పనులు మన ప్రమేయం లేకుండానే మంచిగా జరిగిపోతుంటాయి. కొన్నింటిని ఆశాజనకంగా మంచి జరుగుతుందని ఊహిస్తాం. కానీ మన ఊహలను తలక్రిందులు చేస్తూ మనకు నిరాశను కల్పిస్తాయి. ఇటువంటివి జీవితంలో మనకు అనేకరూపాల్లో ఎదురవుతుంటాయి. పరిస్థితిని బట్టి ఉత్సాహ, నిరుత్సాహాలు బయట పడుతుంటాయి.
కొందరి మనుష్యులను, వారి జీవనశైలిని విపరీతంగా ఇష్టపడతాం. మన మనస్సులోని మంచితనం గుర్తింపు వచ్చేవరకూ ఎదుటివాళ్ళు వారి నిజస్వరూపాన్ని బయటపడనివ్వరు. ఒకసారి మనకు వారి మీద పూర్తి నమ్మకం ఏర్పడిన తర్వాత, ఎలాంటి అనుమానాలకు తావీయకుండా వారికి ప్రతి విషయంలోనూ పూర్తి స్వేచ్ఛ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అల్లాంటి నమ్మకాన్ని ఒక్కోసారి ఎదుటివారు దుర్వినియోగం చేసుకుని, ఆనక సర్వం కోల్పోతారు. ఇది లోక నైజం. ఇలాంటివి ప్రతి ఒక్కరూ, ఏదో సమయంలో, ఏదో రూపంలో, ఇటువంటి సమస్యలను ఎదుర్కుంటారు. ఈ సమస్య బయటివారితోనే కాదు, బంధువులలోనూ, రక్తసంబంధీకులలోను, శ్రేయోభిలాషుల్లో కూడా ఉండవచ్చు. నమ్మకం కేంద్రంగా వ్యాపారాలలో భాగస్వాముల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్కాచెల్లెళ్ల మధ్య, స్నేహితుల మధ్య ఎక్కడైనా రావచ్చును. సహా ఉద్యోగుల మధ్య, పని కార్మికుల మధ్య, ఇంట్లో పనిచేసే పనిమనుష్యుల వల్ల, ఇలా ఎవరి వల్లనైన సమస్యలు ఎదురుకావచ్చు.
ఇంట్లో భార్యాభర్తలు ఉద్యోగస్థులైనప్పుడు, వారికి వారి కుటుంబ పెద్దల నుండి ఎలాంటి సహకారమూ అందే పరిస్థితులు లేనప్పుడు, వారు పూర్తిగా అన్నివిషయాలలోను పనిమనుష్యుల మీద ఆధార పడక తప్పదు. పిల్లల పెంపకానికి కూడా, పనిమనుష్యుల మీద ఆధారపడక తప్పదు. పనిమనుష్యులను నమ్మక తప్పదు. ఇలాంటి సందర్భాలలో చాలామంది పనిమనుష్యులు నమ్మకంగా పనిచేసి, వారి వారి యజమానుల ప్రశంసలు పొందుతుంటారు. ఎక్కడో ఒకచోట, పంటి క్రింది రాయిలా పనిమనుష్యులు తమపై ఉంచిన నమ్మకాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. తాత్కాలిక ప్రలోభాలకు లొంగిపోయి భవిష్యత్తును సర్వనాశనం చేసుకుంటారు.
నా ఉద్యోగ పర్వంలో మేము పనిమనుష్యులమీద ఆధారపడక తప్పలేదు. మొదటి కారణం ఇద్దరం ఉద్యోగులం, రెండో కారణం, మా ఇద్దరి పిల్లల ఆలనాపాలనా చూసే పెద్దలు ఎవరూ మాకు అందుబాటులో లేకపోవడం. మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేవరకూ ఎందరో పనిమనుష్యులు మా దగ్గర పనిచేసారు, మేము ఊహించిన/ఆశించిన దానికి మించి వారు మాకు పనిచేసిపెట్టారు. దానికి కారణం మేము వాళ్ళని ప్రత్యేకంగా పనిమనుష్యులుగా కాకుండా, ఇంటి మనుష్యులుగా చూడడమే! మేము ఏమి తినేవారమో వారికి అదే పెట్టేవారము. అలా పనిమనుష్యుల నుండి మంచి సహకారం అందుకోవడం మూలాన, మేము ఎప్పుడూ ఒంటరితనం ఫీల్ కాలేదు. మా పిల్లలకు ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. ఆ విధంగా మేము, మా పిల్లలు చాలా అదృష్టవంతులం అని చెప్పాలి.


రచయిత మనవరాలి కోసం 5 సం.లు పని చేసిన పనమ్మయి కుమారి స్వప్న
ఇప్పుడు మేము ఇద్దరం పదవీ విరమణ చేసిన తర్వాత, మనుమల పెంపకంపై దృష్టిపెట్టక తప్పలేదు. నా కూతురు – అల్లుడు ఉద్యోగస్థులు కనుక మళ్ళీ పనిమనుష్యుల విషయం తెరమీదికి వచ్చింది. మేము ఇద్దరమూ పదవీ విరమణ చేసివుండడం వల్ల అమ్మాయికి మొదటి సంతానం కూతురు (ఆన్షి) కావడం, అలా మనుమరాలు పెంపకం మా మీద పడడం, అదృష్టవశాత్తు మా అమ్మాయికి ఆ సమయంలో నిజామాబాద్ నుండి,నేను ఉంటున్న వరంగల్ (హన్మకొండ)కు బదిలీ కావడం మాకు కొంత కలిసొచ్చినట్టు అయింది.


రచయిత మనవరాలు ఆన్షిని ఆడిస్తున్న స్వప్న
అదృష్టం కొద్దీ, మంచి పనిమనిషి దొరకడం పాపకు ఐదు సంవత్సరాలు వచ్చేవరకూ ఆ అమ్మాయి మనవరాలిని చాలా బాగా చూసింది (పెంచింది). అలా ఒకగండం సాఫీగా గడిచిపోయినట్లు అయింది.


రచయిత కుటుంబంతో కలిసిపొయిన స్వప్న
ఈ లోగా మా అమ్మాయికి, హైదరాబాద్ బదిలీ కావడం, ఇక్కడ వంశోద్ధారకుడు జన్మించడం జరిగిపోయాయి. మళ్లీ సమస్య పునరావృతం అయింది. మేము హైదరాబాద్‌కు తరలివచ్చినా, సమస్యకు పరిష్కారం దొరకలేదు.


స్వప్న పుట్టిన రోజు జరుపుతున్న రచయిత కుటుంబం
మళ్ళీ పని అమ్మాయి, పైగా మా జీవనశైలికి అనుకూలంగా వుండే అమ్మాయి కోసం వెతుకులాట. మొత్తం మీద మా అమ్మాయి ప్రయత్నం ఫలించి, పాత వరంగల్ జిల్లాలో ఒక కుగ్రామం నుండి, తెలిసిన మిత్రుడొకాయన, ఒక పేదింటి అమ్మాయిని చూసి పెట్టారు. ఆమెకు ఇలా చిన్న పిల్లల్ని చూడడం మాతోటే ప్రారంభం. మాకు కావలసిన విధంగా ఆ అమ్మాయిని మలుచుకోవడంతో, కొద్దీ కాలంలోనే పనులన్నీ నేర్చుకుని శభాష్! అనిపించుకుంది. ఆమె వయసు 19 సంవత్సరాలు ఉండొచ్చు, కానీ చూడడానికి 15 ఏళ్ళ పిల్లలా కనిపించేది. మా ఇంటి పనిలో చేరిన తర్వాత అమ్మాయి పుష్టిగా బాగా తయారయ్యింది. అసలు వాళ్ళ పుట్టింటికి వెళ్ళడానికి ఇష్టపడేది కాదు. తృప్తికరంగా రోజులు గడిచి పోతున్నాయి. ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా వున్నారు. మంచి అమ్మాయి (కేర్ టేకర్) దొరికిందని మేము బంధువులతో, స్నేహితులతో చెప్పుకునేవాళ్ళం. అలాంటి ఆ అమ్మాయి మీది నమ్మకం గత నెల గాలిలో కలిసిపోయింది.
ఆ అమ్మాయి మా ఇంటి హాలులో పడుకునేది. ఉదయం 5.30కు లేచి తయారై ఉండేది. రాత్రి పని వున్నా 9.30 కి ఆమెను పడుకోమనేవాళ్ళం. ఒకరోజు ఏమైందంటే – ఆ రోజు మా అల్లుడు 12 గంటల, వరకూ హాలులోనే టివి చూసి తన బెడ్ రూంలో పడుకున్నాడు. అర్ధరాత్రి ఒంటిగంటకు, మా మనవడు మంచం దిగి బుడి బుడి నడకలతో హాల్ లోకి వెళ్ళాడు. మా అమ్మాయి అల్లుడూ లేచి గబగబా హాల్లో లైట్ వేసారు బాబు కోసం. హాల్లో పక్కమీద పని అమ్మాయి లేదు. లోపల వాష్‌రూమ్, బయట వెతికారు ఎక్కడా కనిపించలేదు. ఇంట్లో హడావిడి మొదలైంది. లైట్లు అన్నీ వెలిగాయి. నాకు మెలుకువ వచ్చింది. విషయం విని విస్తుపోయాను. ఆ అర్ధరాత్రి మా వాళ్లంతా ఏమి చేయాలో తెలియక పెద్ద టెన్షన్‌తో, ఆందోళనగా వున్నారు. మనసు పరి పరివిధాల ఆలోచనలతో మెదడును పూర్తిగా మొద్దుగా చేసేసింది.
ఈ లోగా నా శ్రీమతి నా దగ్గరకంటే వచ్చి, చెవిలో చెప్పినట్టుగా చెప్పింది. అదే, ఆ పని అమ్మాయిని పట్టుకోవడానికి దారి చూపించడానికి క్లూ.. అయింది.
ముందురోజు, ఆ అమ్మాయి నా శ్రీమతితో ఇలా అన్నదట! “అమ్మా నాకు ఎవరూ లేరు (పేద తల్లిదండ్రులు వున్నారు). మీరే నాకు పెళ్లి చేయాలి. నేను ఫేస్బుక్ ద్వారా ఒక అబ్బాయిని ప్రేమించాను, అతనిది ఫలానా వూరు, పెయింటింగ్ పని చేస్తాడు” అని చెప్పిందట! నా శ్రీమతి నవ్వి వూరుకుందిట. నాకు ఈ విషయం చెప్పగానే, ఈ సమాచారం బయట వున్న మా అల్లుడికి అందించాను. అది వినగానే అతని బుర్రలో బల్బు వెలిగింది. ఎందుకంటే, మా పక్కింటిలో వారం రోజులుగా పెయింటింగ్ పని జరుగుతున్నది. పగలు ఇద్దరు ముగ్గురు పని చేస్తే రాత్రి ఒకబ్బాయి పని చేస్తున్నాడు. ఈ అమ్మాయి అతనితో ఆ ఇంట్లో దొరికింది. ఎవ్వరం నమ్మలేని నిజం ఇది. ఎలా వాళ్ళిద్దరికీ ఎప్పుడు పరిచయం అయిందో, ఆ సాహసి మేము అందరం నిద్రలోకి జారుకోగానే పక్కింటికి జారిపోవడం మొదలు పెట్టింది. ఇలా ఈ అమ్మాయి అప్పటికే నాలుగుసార్లు అతని దర్శనం చేసుకున్నట్లు, ఆ ఇంట్లోని సి.సి. కెమెరాలు నిరూపించడం, ఈ హడావిడికి ఆ అబ్బాయి అక్కడినుండి పారిపోవడము, మరునాడు ఆ అమ్మాయిని మేము ఆమె ఇంటికి పంపించి వేయడం జరిగింది. ఆదిలోనే విషయం మా దృష్టికి వచ్చింది కాబట్టి సరిపోయింది కానీ, లేకుంటే ఎన్ని మలుపులు తిరిగి సమస్య పీక మీదికి వచ్చేదో!
ఇదంతా మీ ముందు ఉంచడం లోని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, ఎంతటి నమ్మకం గలవారైనా, వారిపై ఒక కన్నేసి ఉంచడం అవసరమనీ, నమ్మకంగా వున్నారుకదా అనీ అన్ని పనులు వాళ్లకి అప్పగించడం సరైనది కాదని నా అనుభవం ద్వారా చెప్పే ప్రయత్నమే ఇది. చేతులు కాలాక, ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదు కదా! ఇది పనిమనుష్యులను కించపరచడానికి రాసింది కాదు, యజమానులకు అవగాహన కల్పించడానికి.
(మళ్ళీ కలుద్దాం)

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
27 Comments
sagar
మంచి జాగ్రత్తతో కూడిన సందేశం సర్ . నిజమే. నమ్మకం అనేది మనిషిని సంతోషపెట్టడమే కాదు. ఎక్కడలేని సమస్యలు తెచ్చిపెడుతుంది. మీరన్నట్లు ఎంత నమ్మకం ఉన్నా, వారిపై ఒక కన్నువేయడం అందరికీ మొదటి కర్తవ్యం.అలాగని ప్రతి విషయానికీ అనుమానించేరీతిలో ఉండరాదని నా అభిప్రాయం సర్. మంచి వ్యాసం అందించినందుకు మీకు ధన్యవాదములు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
స్పందించడంలొ
సాగర్ ఎప్పుడూ ముందే.
ధన్యవాదాలు సాగర్.
Sudha Samudrala
ఒకప్పటి రోజులు కావండి. చాలా జాగ్రత్తగా ఉండాలి.
డా కె.ఎల్.వి.ప్రసాద్
అవునండీ
మీ స్పందనకు ధన్యవాదాలు.
Rajendra Prasad
సొంత పిల్లలు మాయలో పడి లేచి పోతున్న సందర్భాలు ఉన్నాయి. దిక్కులేని బీద, యౌవనంలో ఉన్న ఒంటరి ఆడపిల్ల చేయటం నాకుమాత్రం ఆశ్చర్యం అనిపించలేదు. మీరు మాత్రం పెద్ద ప్రమాదం నుండి దేవుని దయ వల్ల తప్పించుకున్నారు
డా కె.ఎల్.వి.ప్రసాద్
నిజమే ప్రసాద్ గారు
కృత జ్ఞత లు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
నిజమే ప్రసాద్ గారు
కృత జ్ఞత లు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
Hello Klv garu.
Manchi suspence thriller cinima laga undi.
Namma buddi kavatamu ledu.
—-డా.అన్నే అరుణ
హైదరాబాద్.
Mohammad. Afasara Valisha
మీ వ్యాసం అందరికీ ఒక మంచి సందేశం సార్. చదవగానే చాలా భయమేసింది. ఒక్కొక సారి మన మంచితనం కూడా మనకు శాప మవుతుందనడానికి మీ అనుభవమే ఒక ఉదాహరణ. చాలా త్వరగా మేలుకొలుపు జరిగింది. మంచి వ్యాసం అందజేశారు సార్ హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు









డా కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా
మీ స్పందనకు ధన్యవాదాలు .
డా కె.ఎల్.వి.ప్రసాద్
జ్ఞాపకాల పందిరి 178 లో
జీవితంలో మనం అనుకున్నవి అనుకున్నట్టుగా జరగవని, ఊహించనివి జరుగుతాయని చెప్పారు. ఈ రోజుల్లో, నమ్మకమైన పనిమనుషులు దొరకడం కష్టమే.
చక్కటి కథనం. అభినందనలు.
—-జి.శ్రీనివాసా చారి
కాజీపేట.
sunianu6688@gmail.com
రచయత Dr KLV prasad గారు అందరిలో అవగాహన పెంచడానికి వ్రాసిన ఇతివృత్తం బాగుంది. కానీ ఎవరూ లేని బీద అమ్మాయ్. ఏదో గమ్యం చేరుతుంది జీవితం అని ఆశించి భంగపడినది. మీలాంటి పెద్దవారికి ముందే చెప్పి వుంటే బాగుండేది. ప్రస్తుత రోజుల్లో సొంత ఇంటిలోనే బంగారం, నగదు తీసుకునీ తల్లిదండ్రులకు తెలియకుండా మాయం అవుతున్నారు. రెండు రోజుల క్రితమే సొంత అక్కనే చంపి నగదు, బంగారం తీసుకుని వెళ్ళిన సంఘటన మనం ఎరుగుదుము. ఏది ఏమైనా ప్రస్తుత రోజుల్లో ఒకరిమీద ఆధారపడి ఉండేవారికి ఇలాంటి అనుభవాలు పరిచితమే. మంచి విషయం మీద వ్రాసిన Dr KLV prasad గారికి ధన్యవాదాలు

డా కె.ఎల్.వి.ప్రసాద్
Gd Evng Doctor garu,
We have to create an impression that we are watching the movements of the maids (full time or part time). If any abnormalcy in their behavior/movements are observed, we should bring to their notice.
—-suryanarayana rao
Hyderabad
డా కె.ఎల్.వి.ప్రసాద్
Thank you sir
డా కె.ఎల్.వి.ప్రసాద్
మీ జ్ఞాపకాలు ఓ విధంగా చదువరులను గతుక్కుమనేలా చేశాయి. పని సహాయకుల విషయంలో ఇంతవరకూ నేను దాదాపుగా ఇక్కడ ఉత్తర భారతం లో గత 23 ఏళ్లుగా చాలా అదృష్ట వంతుడ్ని ఒక రకంగా. ఇప్పటికి కేవలం ఇద్దరే పని చేశారు. (రెండో ఆమె ఇంకా చేస్తోంది, ఇంటి తాళం చెవులతో సహా తన వద్ద ఉంటాయి)
—-ప్రొ.రావు. ఉమ్మె తల
డా కె.ఎల్.వి.ప్రసాద్
సర్
కృత జ్ఞత లు.
Shyamkumarchagal. హైదరాబాద్
నమ్మని వాళ్ళని ఎవరూ మోసం చేయలేరు.
నమ్మి మోసపోవడం అన్నది సహజం. అయితే నమ్మకం లేనిదే ప్రపంచంలో ఏ పని జరగదు.
నమ్మిన వెంటనే మోసపోవడం ఏదైనా నమ్మిన తర్వాత ఎన్నో ఏళ్ల తర్వాత మోసపోవడం అన్నది కాదు అసలు సమస్య. మోసం అన్నది జరగాల్సిన సమయానికి జరుగుతుంది.
ముఖ్యంగా పని వాళ్ళ మీద అతిగా నమ్మకం పెట్టుకోవడం అన్నది అందరూ చేసే తప్పే. అందులో వాళ్ల మీద అభిమానం ప్రేమ అనురాగాలు పెట్టుకోవడం ఇంకా చాలా పెద్ద తప్పు. ఎందుకంటే అంతిమంగా నష్టపోయేది మనమే కాబట్టి.
బ్రతుకు తెరువు గురించి లేదా తప్పనిసరి మన దగ్గర కష్టపడుతూ పనిచేసే వాళ్లకు, వాళ్ల కారణాలు వాళ్ళకుంటాయి.
నేను గమనించి నంతవరకూ పనిమనిషి ప్రవర్తన వల్ల దెబ్బతినేది మధ్యతరగతి లేదా ఎగువ మధ్యతరగతి మనుషులు మాత్రమే. అత్యంత ధనవంతులు మాత్రం పని వాళ్ళతో నిర్ధాక్షిణ్యంగా పనిచేయించుకుని ఎటువంటి మానసిక అనుబంధాలు పెట్టుకోకుండా హాయిగా ఉంటారు.
రచయిత డాక్టర్ కే ఎల్ వి ప్రసాద్ గారు వారి ఇంట్లో పని చేసిన అమ్మాయి గురించి చదివి నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే వారి ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఆ అమ్మాయిని చూశాను. ఆ సమయంలో ఆ అమ్మాయి గురించి రచయిత గారు సంతోషంగా చాలా బాగా చెప్పి పరిచయం చేశారు కూడా.
యుక్త వయసులో ఉన్న ఆ అమ్మాయి ఒంటరి కావడం మూలాన ప్రేమలో పడడం లేదా ఆకర్షింపబడడం లోక సహజమే. ఈ రోజుల్లో ఎన్నో కట్టుబాట్లు ఉండి చదువు సంస్కారం, ఆర్థిక బలం అంగ బలం, మంచి కుటుంబం నుండి వచ్చిన ఎంతోమంది అమ్మాయిలు కన్న తల్లిదండ్రుల కళ్ళుగప్పి ప్రేమలో నిండా మునిగిపోయి చెప్పా పెట్టకుండా పారిపోయి పెళ్లి చేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
రచయిత లాంటి కుటుంబం అండదండలున్నప్పుడు ఆ అమ్మాయి వారి సహాయం తీసుకొని నచ్చిన అబ్బాయి తో వివాహము జరిగేట్లు చూసుకొని జీవితాన్ని ఒక ఒడ్డుకి చేర్చుకుంటే బాగుండేది.
ఇదంతా అమ్మాయి వ్యక్తిగతం అనుకోండి, అయినప్పటికీ అమ్మాయి ఆచరించిన విధానం అమ్మాయి జీవితానికి హానికరం అన్నది పాపం అమ్మాయికి తెలిసి ఉండదు. పైగా ఫొటో తో సహా ఇప్పుడు మనకు తెలిసి పోయింది.
ఎంతోమంది పనివాళ్ళు నమ్మించి ఇంట్లో ఉన్న డబ్బు బంగారం తీసుకొని పారి పోయారు.
రచయిత గారికి చెందిన అమ్మాయి ఇలాంటి పనిచేయలేదు కాబట్టి పెద్ద నష్టం జరిగిందని, నమ్మకద్రోహం జరిగిందని అనుకోవడానికి వీలు లేదు. కాకపోతే ఆ అమ్మాయి ప్రేమ విహారం ముదిరి రచయిత గారికి తలనొప్పులు తెచ్చి పెట్టలేదు. ప్రేమ వ్యవహారాలు
ముదిరిన తర్వాత అమ్మాయి అబ్బాయిలు దొంగతనంగా చీకట్లో లేదా పగలు కలుసుకోవడం పెద్ద విచిత్రమైన విషయంకాదు.
చాలామంది ఇంట్లో పని మనుషులుగా వయసులో ఉన్న అమ్మాయిలను ఈ కారణంగానే పెట్టుకోరు అనుకుంటాను.
మంచి విషయాన్ని మన ముందుకు తెచ్చి పనిమనుషుల విషయంలో మనలో జాగరూకతను మేలుకొల్పిన డాక్టర్ కె.వి ప్రసాద్ గారికి నా యొక్క కృతజ్ఞతలు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
శ్యాం
నీ సుడీర్ఘ స్పంద న
విశ్లేషణ బాగుంది
హృడయ పూర్వక కృతజ్ఞతలు.
సుగుణ అల్లాణి
చక్కని హెచ్చరిక లాంటి జ్ఞాపకం ఇది…. ఒక్కోసారి
అన్నీ తెలుసు అనుకుంటూనే మోసపోతూ ఉంటాము… బాగుంది సర్!!
డా కె.ఎల్.వి.ప్రసాద్
సుగుణ గారూ
కృత జ్ఞత లు మీకు
పుట్టి నాగలక్ష్మి
నిజమే! ఎవరినీ నమ్మలేని పరిస్థితులు.. మొన్ననే అక్కని చంపిన అమ్మాయిని చూసాము.. నమ్మకం ఉండాలి కాని మన జాగ్రత్తలు మనం ఉండాలి. మంచి విషయాన్ని తెలియజేశారు డాక్టర్ కె. యల్వీ. ప్రసాద్ గారూ! అభినందనలు మీకు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
మేడం
మీ స్పందనకు ధన్యవాదాలు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
మీ జ్ఞాపకాల పందిరి నిత్య జీవితంలో ఎన్నో అనుభవాలను చక్కగా ఆవిష్కరిస్తుంది సర్.జీవితం పట్ల అప్రమత్తతను పెంచుతుంది.ఈ నాటి జ్ఞాపకము నమ్మకానికి సంబంధించి ఒక విలువైన పాఠం.ధన్యవాదాలు సర్.


—-నాగజ్యోతి శేఖర్
కాకినాడ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా
ధన్యవాదాలు.
భుజంగ రావు
అనుకున్న వన్ని జరుగవు అనుకొలేనివి కొన్ని ఆగవు.నమ్మని వారిని మోసం చేయలేరు కానీ నమ్మిన వారు మోసపోతారు.ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి. అప్పుడున్న పరిస్తితులకనుగుణంగా ఏ ప్రమాదం జరుగక ముందే వాళ్ళ ఇంటికి పంపినారు.పని మనుషుల ప్రవర్తన కూడా గమనించి జాగ్రత్తగా ఉండాలని మంచి విషయాలు అందించిన మీకు నమస్కారములు సిర్,
Jogeswararao Pallempaati
కొందరికైనా ఉపయోగపడుతుంది, డాక్టర్ గారూ, ఇలాంటి అనుభవాలను పoచుకుంటే!
మైనర్ అయ్యి ఉంటే ఇబ్బంది గానీ మేజర్ కాబట్టి మీకు సమస్య వచ్చేది కాదు!
డా.కె.ఎల్.వి.ప్రసాద్
ధన్యవాదాలు మీకు