నీళ్ళో.. నీళ్లు..!!
నీళ్లు.. నీళ్లు..!
నీళ్లు లేనిదే జీవితం లేదు, నాగరికత లేదు, అభివృద్ధి అంతకంటే లేదు! ఒక ప్రదేశం లేదా ఒక ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే, లేదా పాడీపంట మెరుగుపడాలంటే, ఆ ప్రాంతంలో పుష్కలంగా నీటి సదుపాయం వున్నప్పుడే అది సాధ్యపడుతుంది. దేశ అభివృద్ధికి, లేదా ఒక ప్రాంత అభివృధ్ధి కోసం, రవాణా సౌకర్యం ఎంత అవసరమో, నీరు.. అంతకంటే ఎక్కువ అవసరం. అందుకే సముద్రాల్లో కలిసిపోయే నీటిని అదుపుచేసి కాల్వల ద్వారా నీరు పంటపొలాలకు అందించడం ద్వారా రైతు మంచి ఆదాయం పొందే అవకాశాలు ఉంటాయి. అలాంటి ఆలోచనతోనే నిర్మించబడింది, నాగార్జున సాగర్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు వల్ల అటు ఆంధ్రా ప్రాంతము, కుడికాల్వ ద్వారానూ, తెలంగాణా ప్రాంతము ఎడమకాల్వ ద్వారాను లబ్ధి పొందుతున్నాయి. పంటపొలాల సాగుకు ఉపయోగపడి, ఆయా ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తున్నాయి. అలాగే అవసరమైన ప్రాంత ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి. అలాగే నీటి ద్వారా జల విద్యుత్తును ఉత్పత్తి చేసే సామర్థ్యం కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఉంది. ఉభయ రాష్ట్రాలలోనూ అనేక ప్రాజెక్టులు ఉన్నప్పటికీ రెండు రాష్ట్రాలకు ఉపయోగపడుతున్న, నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఉదాహరణగా తీసుకోవడం జరిగింది. అంతమాత్రమే కాకుండా, ఈ వ్యాస రచయిత, 1972-74 ప్రాంతంలో, నాగార్జున సాగర్‌లో, ఇంటర్మీడియెట్ చదవడం కూడా ఒక కారణం. అప్పటికి ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రమే ఉంది, రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోలేదు.


రచయిత ఇంట్లో బోరు బావి
ఒక విషాదం ఏమిటంటే, మనం ఎంతో అభివృద్ధి చెందామని గొప్పలు చెప్పుకుంటున్న తరుణంలో, ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు తగినంత సాగునీరు త్రాగునీరు పొందలేక పోవడం బాధాకరం. కేవలం వర్షాధార ప్రాంతాలలో వర్షం నీటి మీద, త్రాగునీరు, సాగునీరు ఉపయోగించుకోవలసిన ప్రాంతాలలో, వర్షపు నీటిని నిల్వ చేసుకునే సదుపాయాలూ కూడా అంతంత మాత్రమే ఉండడం ఇంకా సమస్య గానే మిగిలి పోయింది. ఇప్పటికీ కొన్ని ప్రాంత ప్రజలు త్రాగునీటి కోసం కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లి రావడం మనం వింటూనే విన్నాం.
అయితే, భవిష్యత్తులో నీటి కొరత మరింత జనావళికి ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఊహించవచ్చు. కారణం దట్టమైన అడవులు అదృశ్యమైపోవడం, ఋతువుల్లో తేడాలు వచ్చి వర్షపాతంలో మార్పులు రావడం. భూగర్భ జలాలు అడుగంటిపోవడం, ఆకాశహర్మ్యాలు అని చెప్పదగ్గ భవన నిర్మాణాలు, వాటికోసం లోతైన బోరుబావుల త్రవ్వకం, వర్షపు నీటిని నిల్వ చేసుకోలేని పరిస్థితులూ, ఇవన్నీ నీటి ఎద్దడికి కారణాలే! నీటి కోసం, నీటి యుద్దాలను కూడా ఊహించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో, కొన్ని ప్రాజెక్టులు రాజకీయ రంగులు పులుముకుని, వారి వారి స్వార్థం కోసం రాజకీయ నాయకులు, రాబోయే తరాలకు అన్యాయం చేస్తున్నారేమో అనిపిస్తుంది. ప్రస్తుతం అధికారంలో వున్న రాజకీయ పార్టీలు, తమ పార్టీల/పదవుల మనుగడ కోసం, ఉచితాల పేరుతో సామాన్య ప్రజలను మభ్య పెట్టి, దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించే పథకాలకు గుండుసున్నా చుడుతున్నారు. భవిష్యత్తు గురించి ఆలోచించేవాళ్ళు మృగ్యం అవుతున్నారు. ఎన్నికల చుట్టూ కరెన్సీ నోట్లు ప్రదక్షిణం చేస్తున్నాయి. ఇలా ఎన్నికైన నాయకులు, తమ అభివృద్ధి వైపే దృష్టి సారిస్తున్నారు గానీ దేశ అభివృధ్ధి కోసం, దేశ భవిష్యత్తు కోసం ఎవరూ ఆలోచించకపోవడం దురదృష్టకరం.


మున్సిపాలిటీ మంచి నీరు సంపు
ఈ నేపథ్యంలో జల సమస్యకు పరిష్కారం ఎప్పుడు, ఎక్కడ దొరుకుతుంది? ఆలోచించేవాడికి గుండె ఝల్లుమంటుంది. అందుచేత నీటిని దుర్వినియోగం చేయకుండా, పొదుపుగా వాడడం వంటి విషయాలు ప్రజలలో అవగాహన రావాలి. వర్షపు నీరు వృథా కాకుండా, చెరువులలో నిల్వచేసుకునే పరిస్థితులు సమకూర్చుకోవాలి. బోరు బావులున్నట్లైతే, వాటికి సమీపంలో, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి. గృహ నిర్మాణంలో ‘ఇంకుడు గుంత’ ఒక ప్రధాన అంశంగా గుర్తించి, మునిసిపాలిటీలు, అలా ప్లాను వున్నవాటికే అనుమతులు ఇవ్వాలి. బహుళ అంతస్తులకు అనుమతి ఇచ్చేటప్పుడు, నీటి విషయం కూడా పరిగణనలోనికి తీసుకోవాలి.
చాలా మందికి మున్సిపాలిటీ నీటి సదుపాయంతో పాటు, బోరుబావులు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలాంటి వారు, మొక్కల కోసం ఇతర ప్రాధాన్యతలు లేని పనుల కోసం, మంచినీటినే వినియోగిస్తారు. ఇలాంటి వారు కనీసం తాగడానికి నీళ్లు లేనివారి గురించి ఆలోచించాలి. అవసరానికి మించి మంచినీరు సరఫరా అయినప్పుడు, ఆ నీటిని భద్రపరచుకోకుండా, వృథాగా రోడ్లమీదికో, ఖాళీ ప్రదేశాలలోకో వదలకూడదు. నీటి యొక్క విలువను గుర్తించాలి. స్నానాలకు గాని ఇతరపనులకు గాని నీటిని పొదుపుగా వాడాలి.


కొద్ది స్థలంలోనే పచ్చదనం
ముఖ్యంగా వేసవి కాలంలో నీటి విలువ బాగా తెలుస్తుంది. మంచి నీటి వాడకం కూడా ఎక్కువగా ఉంటుంది. గ్రామాలలోని, సహజ బావులు ఎండిపోతాయి. చెరువులు అడుగంటిపోతాయి. భూగర్భ జలాలు కనీస స్థాయి దిగజారిపోతాయి. ఇలాంటప్పుడు నీరు ఎంత విలువైనదో తెలుస్తుంది. ప్రభుత్వాలు సమకూర్చే రక్షిత మంచినీటి పథకాలు సైతం వేసవికాలంలో ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుచేత నీటిని చాలా జాగ్రత్తగా, పొదుపుగా వాడుకోవాలి.
నీటికి సంభందించి నా అనుభవాలు కొన్ని చెబుతాను. ఉదయం నేను ‘నడక’ కోసం బయటకు వెళ్లే అలవాటు వుంది. ఒక్కోసారి మా కాలనీకి ఉదయమే మంచినీటి సరఫరా చేస్తుంటారు. ఈ నేపథ్యంలో, మా కాలనీలో, అనేక లీకేజీల వల్ల నీరు వృథాగా రోడ్డుమీద వరదలా ప్రవహిస్తుండేది. ఈ పరిస్థితిని అనేక మార్లు గమనించిన నేను ఒకసారి నీటి సరఫరా లైన్మాన్కు ఫోన్ చేసి విషయం అతని దృష్టికి తెస్తే, అతని సమాధానం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అది వింటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. అతను ఏమన్నాడంటే
“సార్.. ఇది నా పై అధికారులకు చెబితే నన్ను బాగు చేయించమంటారు, నా జేబులోంచి అంత సొమ్ము పెట్టే స్తొమత నాకు లేదు” అని. అలా మా కాలనీలోనే నాలుగైదు చోట్ల మంచి నీళ్లు నెలల కొద్దీ వృథా అయిపోవడం నేను ప్రత్యక్షంగా చూసాను.


నిమ్మ,అరటి చెట్లు
అలాగే, కొత్తగా ఎన్నికైన మేయర్లు తమ హయాంలో రెండుపూటలా మంచినీళ్లు ఇప్పించాం అని చెప్పుకోవడానికి, లేదా ప్రజావసరాలు తీర్చడానికి ,రెండు పూటలా మంచి నీరు సరఫరా చేస్తే, అవి నిల్వ వుంచుకోవడానికి వీలు కానివాళ్ళు, పైపు ఆపకుండా, నీటి ప్రవాహాన్ని రోడ్డుమీదికి వదిలేస్తుంటారు. ఇలా ఎన్నో చోట్ల, ఎన్నో కాలనీల్లో, విలువైన మంచినీరు వృథా చేయడం జరుగుతుంది. త్రాగవలసిన నీరు ఇంటి అవసరాలకు మాత్రమే ఉపయోగించవలసిన మంచి నీరు, మొక్కలకు, జంతువులను, ఇళ్లను, వాహనాలను కడగడానికి ఉపయోగించేవాళ్ళు చాలా మంది వున్నారు. ఇది ఒకరు చెబితే వచ్చేది కాదు, సమాజ అవసరాలను అవగాహన చేసుకుని ప్రతివారు సహకరించవలసిన అంశం.
ఉండేకొద్దీ నీటి కొరత మరింత పెరిగే అవకాశం వుంది. ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకోవడం, వరదనీటిని, వర్షపు నీటిని తయూరీతిలో భద్రపరుచుకోవడం వంటి విషయాలు, ప్రజలలో అవగాహన తీసుకురావాలి. దీనికి ప్రజల సహకారంతో పాటు ప్రభుత్వ సంస్థలు,స్వచ్ఛంద సంస్థలు,కలిసి పనిచేస్తేనే ఇది కొంతలో కొంత ఫలితాలవైపు దారితీసే అవకాశం వుంది.


మామిడి చెట్లు


ఇంటి బయట పచ్చదనం
నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం. ఇంచుమించు ఇంట్లో అందరికీ ఇష్టమే. ఇంటి చుట్టూరా వున్న అతి కొద్దీ ప్రదేశంలో, జామ, మామిడి, నిమ్మ, కరివేపాకు, అరటి చెట్లు కొన్ని పూలమొక్కలు పెంచుతున్నాను. వీటికి నీళ్ళ సరఫరా, బోర్ నుండి వచ్చే నీరు మాత్రమే. పరిసరాలు కడగడానికి, వాహనాలు కడగడానికి మంచినీరు ఎప్పుడూ ఉపయోగించను. బోర్ నీళ్లు అయినా, మున్సిపాలిటీ నీళ్లు అయినా, ఒక్క చుక్కకూడా వృథా కాకుండా జాగ్రత్త పడుతుంటాను. నేనే కాదు, మా కుటుంబ సభ్యులను కూడా వృథా చేయనివ్వను.


ఇంకుడు గుంత


ఇంటిలోపలి పచ్చదనం
భవిష్యత్ నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని, నేటి ప్రకృతి పరమైన మార్పులను దృష్టిలో ఉంచుకుని, నీటిని జాగ్రత్తగా, పొదుపుగా వాడవలసిన అవసరం వుంది. భవిష్యత్తులో జలసమస్యలు/సంఘర్షణలు రాకుండా చూసుకోవలసిన గురుతర బాధ్యత మన మీదే ఉంది. కాదంటారా?
(మళ్ళీ కలుద్దాం)

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.
21 Comments
డా కె.ఎల్.వి.ప్రసాద్
సంచిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక ధన్యవాదాలు
–డా కె.ఎల్.వి.ప్రసాద్
హన్మకొండ/సఫిల్ గూడ
Sagar
మంచి ఉపదేశంతో కూడిన వ్యాసం సర్. నిజమే లేనప్పుడు వాటి కొరకు వేంపర్లాడటం మాని, మన జాగ్రత్తలో మనం ఉండటమే అసలైన బాధ్యత అని మీ రచన తెలియచేస్తుంది. చెప్పడమే కాక చేసి చూపించే మీ నిర్వహణ ముదావహం.ధన్యవాదములు సర్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
కృతజ్ఞకలు
సాగర్.
డా కె.ఎల్.వి.ప్రసాద్
వస్తువు లేనప్పుడే,విలువతెలు స్తుంది !… ముందు చూపులేని మనిషి పాస్చాత్తాప పడక తప్పదు… !







—కోరాడ నరసింహారావు
విశాఖపట్నం
డా కె.ఎల్.వి.ప్రసాద్
ధన్య వాదాలాండీ
Bhujanga rao
జ్ఞాపకాల పందిరి 134 లో నీళ్లు..నీళ్లు..!సంచికలో నీటిని జాగ్రత్తగా పొదుపుగా ఎలా వాడుకోవాలో మీరు ఆచరించి చూపించిన విధానం బాగుంది.మానవుని నిత్య జీవితంలో నీరు ఎంతో ముఖ్యమైనది, అయినప్పటికీ నీటికి ఇవ్వవలసిన ప్రాధాన్యతను ఇవ్వడంలేదు. రాజకీయ నాయకులు వారి స్వార్ధం కోసం, వారి మనుగడ కోసం,ఉచితాల కోసం ప్రజలను మభ్యపెట్టి, ప్రజల అవసరాలను మరియు రాష్ట్ర అభివృద్ధిని మర్చిపోయి,ధీర్గకాలిక ప్రయోజనం కలిగే పథకాలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు ఇది అక్షరాలా నిజం సర్.ఇది ఏమైనా ప్రజలలో మార్పు రావాలి సర్.మంచి విషయాలు అందిస్తున్న మీకు ధన్యవాదములు డాక్టర్ గారు
డా కె.ఎల్.వి.ప్రసాద్
కృత జ్ఞత లు
భుజంగరావు గారూ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
నీటి సత్ వినియోగము , వ్యర్థంచేయకుండా వుండటం.నీటి పొదుపు గురించి ఆచరణీయమైన విషయాలు చాలాబాగా చెప్పినారు ధన్యవాదాలు. సర్
నీరు ,గాలి మనిషిమనుగడకు అతి ముఖ్యమైన వి .వాటిని ధుర్వినియోగంచేస్తే తరువాత పశ్చాత్తాపపడటం మనవంతే
-నాగిళ్ళ రామ.శాస్త్రి
హన్మకొండ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
శాస్త్రి గారు
హృడయ పూర్వక
ధన్యవాదాలు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
నీటి పొదుపు గురించి స్వంత ఉదాహరణ తో చక్కగా వివరించారు అన్నయ్య గారు
—జయ.అలెగ్జెండెర్
సఫిల్ గూడ
డా కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా
ధన్య వాదాలూ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
మూడోవ ప్రపంచ యుద్ధం అంటూ వస్తే అది నీటి గూర్చే అని ఎందరో విశ్లేషకులు చెబుతున్న మాట దీన్ని బట్టి ఇది ఎంత తీవ్రమైన సమస్యో మనం ఊహించవచ్చు.మీరు ఈ రోజు ప్రస్తావించిన అంశము నిజంగా చాలా చాలా ఆవశ్యకమైనది సర్.నీటి వృధా…నీటి లేమి ఈ రోజు మనం ఎదుర్కొంటున్న సమస్య మీరు చెప్పినట్టు ఇది సామాజిక బాధ్యతగా తీసుకోవాలి ప్రతి ఒక్కరూ.ఇప్పటికే నీటిని కొనుక్కుంటున్నాం.నీటి వనరులు వృధాతో పాటు వాటిని పూడ్చేసి నిర్మాణాలు చేపట్టడం కూడా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి.నీరు పోయే దారి లేనప్పుడు అది మనల్నే ముంచేస్తుంది.నీరు ఊరే అవకాశం లేనప్పుడు అది మన భవితనే మింగేస్తుంది.నీటిని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.గుక్కెడు నీళ్లకోసం ఎంతో దూరాలకు పోయే వారి స్థితిని అర్ధం చేసుకుని అట్టి స్థితి మనకు,మన ముందు తరాల వారికి రాకుండా ఉండాలంటే నీటి పొదుపు…పచ్చదనం పెంపుదల ఒక్కటే మార్గం.మీ వ్యక్తిగత బాధ్యత గూర్చి తెలుసుకొని ఎంతో నేర్చుకున్నాం సర్.మీ నీటి పొదుపు పద్ధతులకు నమస్సులు.మీ ఇంటి పచ్చదనానికి అభినందనలు సర్


—నాగ జ్యొతి శేఖర్
కాకినాడ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా
మీ విశ్లేషణ బావుంది.
ధన్యవాదాలు.
శ్యామ్ కుమార్ చాగల్
మా ఇంట్లో పెద్ద వాళ్ళు అనే వారు ‘ నీళ్లు వృధా చేస్తే డబ్బులు అదే విధంగా పోతాయి , కాబట్టి నీటిని జాగ్రత్తగా వాడుకోవాలి అని. చాలా కరవు దేశాల్లో పడే అతి తక్కువ వర్షపు నీటిని అవి దాచుకుంటూ అతి జాగ్రత్తగా వాడుకుంటారు.
మన దేశం లో మాత్రం నీటి దుర్వినియోగం అత్యధికమే. అంతేకాదు వర్షపు నీటి విలువ కూడా సాధారణ జనాలకు ఇసుమంత కూడా తెలీదనటం లో అతిశయోక్తి లేదు. మనం చూస్తూనే వున్నాం గోదావరి నది నీళ్లు ప్రతీ సంవత్సరం సముద్రం లో ఎన్నో లక్షల క్యూసెక్కులు ,ఎలా కలుస్తున్నాయి. ఇప్పుడిప్పుడు కొంత వరకూ అలా వృధాగా పోయే నీరు ను ఒడిసి పెట్టె ప్రయత్నం కొద్దీ మాత్రంగా జరుగుతోంది.
మరి కొన్ని దేశాలలో అయితే సముద్రపు నీటిలోనుండీ ఉప్పు ను వేరు చేసి మంచి నీటిని ప్రజల అవసరాలకు వాడుతున్నారు. ఆ ప్రక్రియ చాలా డబ్బుతో కూడినదని వేరేగా చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పుడిప్పుడే నదీ జలాల సమస్య తో మన దేశం లో రాష్ట్రాల మధ్య జరిగే రాజకీయ యద్దాలు చూస్తూనే వున్నాం. భగవంతుడి దయ వల్లవర్షాలు విస్తారంగా కురవబట్టి గానీ ,లేని పక్షం లో జరిగే దుష్పరిణామాలు మన ఊహ కందనివి.
మన రాష్టాన్ని తీసుకుంటే, గోదావరి పైన, కృష్ణ నది పైన వేరే రాష్ట్రాలు కట్టిన నీటి ప్రాజెక్టుల తో మనకు నీరు రాకుండా ,బాగా వర్షాలు పడి అవి నిండి పోనీ పొరలే వరకూ వరకు మన జలాశయాలు ఎండి పోయి మనం నిశ్శయంగా చూస్తుండిపోయిన రోజులున్నాయి.. ఈ విషయం యొక్క ప్రాధాన్యతను తన అనుభవాన్నీ జోడించి జ్ఞాపకాల పందిరి రూపం లో మనకు అందించిన డాక్టర్ కె ఎల్వి ప్రసాద్ గారికి, సంచిక కు నా అభినందనలు
డా కె.ఎల్.వి.ప్రసాద్
చాలా బాగా రాసావు మిత్రమా
నీ విశ్లేషణ బాగుంది.వ్యాసానికి సరియైన స్పందన.
కృత జ్ఞత లు.
డా కె.ఎల్.వి.ప్రసాద్
జ్ఞాపకాల పందిరి 134 లో నీటి అంశంపై మీ అభిప్రాయాలను చక్కగా తెలిపారు. మనిషి బతకడానికి నీరు ఎంతో అవసరం. మీరు చెప్పనట్టుగా, నాగార్జునసాగర్ లాంటి భారీ ప్రాజెక్టులు మన తెలుగు రాష్ట్రాలకు ఎంతో ఉపయోగకరం. ఆ ప్రాజెక్టును అందించే నీటి వలన ఇరు రాష్ట్రాల్లో పంటలు బాగా పండుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వేసవిలో నీటి ఎద్దడి సమస్య ఎదుర్కుంటున్నాయి. చెరువులు ఎండిపోతున్నాయి. కొన్ని గ్రామాల్లో కలిసికట్టుగా గ్రామప్రజలు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నీటిని ఒడిసి పట్టి ఆ గ్రామాన్ని సస్యశ్యామలంగా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. ప్రభుత్వాలు ఈ విషయంపై దృష్టి సారించాలి. మహారాష్ట్రలో పానీ పథకం ఇటువంటిదే. ప్రభుత్వ సహకారంతో ఎన్నో గ్రామాల్లో నీటి ఎద్దడిని పరిష్కారించారు. మీరు చక్కటి సూచనలు ఇచ్చారు. అభినందనలు.
–జి.శ్రీనివాసా చారి
కాజీపేట.
డా కె.ఎల్.వి.ప్రసాద్
మీ చక్కని
స్పందనకు
ధన్యవాదాలండీ
చారి గారూ…
డా కె.ఎల్.వి.ప్రసాద్
మంచి సందేశం సార్. నిజంగా భవిష్యత్తులో మండే సమస్య
—-డా.డి.సుజాత
విజయవాడ.
డా కె.ఎల్.వి.ప్రసాద్
అమ్మా…
ధన్యవాదాలు.
Sunianu6688@gmail.com
మంచి నీరు వృధా కాకుండా ఎలా సద్వినియోగం చేసుకోవాలో రచయిత గారు స్వయంగా పొదుపు గా వాడుతూ పాఠకులకు చెప్పడం అభినందనీయం.నేను నా వృత్తిరీత్యా కొన్ని సంవత్సరాలు రాయలసీమ లో వుండడం వలన నీటిని ఎలా పొదుపుగా వాడాలో నాకు బాగా అలవాటు అయింది. రచయిత గారికి అభినందనలు







డా కె.ఎల్.వి.ప్రసాద్
మీ స్పందనకు
కృత జ్ఞత లు మేడం