Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జ్ఞాపకాల పందిరి-101

“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.

స్పందిస్తే.. సఫలమే!!

మానవుడు సంఘజీవి! మనుష్యులతో కూడుకున్నదే సమాజం. సమాజ శ్రేయస్సే అందరి శ్రేయస్సునూ. అందుకే మన కోసం మాత్రమే మనం కాకుండా అందరి కోసం ఉపయోగపడే పనుల్లో కూడా మనం పాలుపంచుకున్నప్పుడే అది సాధ్యం అవుతుంది. ప్రతిదీ ప్రభుత్వం మీద ఆధారపడడమే గాక, ఏదైనా ప్రజలందరికీ ఉపయోగపడే, లేదా నష్టం కలిగించే సమస్య ఎదురైనప్పుడు, దాని పరిష్కారం మన చేతిలో లేనప్పుడు, కనీసం ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం కూడా సహాయం చేసినట్టే, పైగా సమాజంలోని ప్రతి పౌరుడి బాధ్యత కూడాను. చాలామంది ‘అది మనకెందుకులే’ అన్న భావనే మనసులో ఉంటుంది. అదేదో మనకు ఉపయోగపడేదైతేనే దానిని పట్టించుకుంటారు చాలామంది. ఇలాంటి ఆలోచన బాధ్యతా రహితమైనది. ఇవి మన ఇంటి ముందు జరగవచ్చు, మన ఇంటి వెనుక జరగవచ్చు. దగ్గరలోనున్న రోడ్డుమీద జరగవచ్చు. మార్కెట్లో జరగవచ్చు, ఆసుపత్రిలో జరగవచ్చు, విద్యాలయంలో జరగవచ్చు. నలుగురూ మసిలే ఎక్కడైనా ఏ ప్రదేశంలోనైనా జరగవచ్చు. త్వరలో స్పందించకపోతే ప్రమాదాలు జరగవచ్చు, ప్రాణాలే పోవచ్చు. ఎవఱో వస్తారని, ఏదో చేస్తారని ఆలోచించే సమయం ఉండదు. అందుకే మన శక్తి మేరకు మనం స్పందిస్తే కొంత మేరకు మనం యావత్ సమాజానికీ మేలు చేసినవాళ్ళం అవుతాం.

ఉదాహరణకు కొన్ని కాలనీల్లో మురికి కాలవలు ఉంటాయి. కొందరు గృహిణులు లేదా పని మనుష్యులు ఇంట్లో పోగయ్యే తడి చెత్త, పొడి చెత్త అన్న భేదం లేకుండా ఆ కాలువలో పారబోస్తుంటారు. మురుగు నీరు ముందుకు ప్రవహించకుండా అవి అడ్డు పడుతుంటాయి. దానివల్ల దుర్గంధంతో పాటు, దోమలకు నెలవై మలేరియా వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇది మనకెందుకులే.. అని చూసినవారు స్పందించకపోతే ఒకరిని చూసి మరొకరు దీనికి అలవాటు అయిపోతారు. తత్ ఫలితంగా అపరిశుభ్రత చోటు చేసుకుని, వ్యాధులు ప్రబలే ప్రమాదం ఏర్పడుతుంది. అదే విధంగా, రోడ్డుమీద తిన్న అరటిపళ్ళ తొక్కలు అది తమ హక్కు అన్నట్టుగా పారేస్తారు. కాలినడకన పోయేవారు ఆ తొక్కలమీద కాలు వేయడం వల్ల కాలు జారి దెబ్బలు తగిలించుకున్న సంఘటనలు ఎన్నో. అలాగే వేగంగా పోతున్న స్కూటర్లు కూడా వీటివల్ల స్కిడ్ అయ్యి పడిపోయే ప్రమాదం వుంది. ఇక్కడ, రోడ్డు మీద అరటి తొక్కలు పారవేయడం ఎంత తప్పో, అలాంటి వారిని చూసి ఊరుకోవడం కూడా తప్పే! ఎవరో ఒకరు హెచ్చరిస్తే తప్ప అలాంటి అలవాట్లకు పర్మినెంట్‌గా తెరపడదు. ఇంతకు మించిన సంఘటనలు కూడా జరుగుతుంటాయి. కొన్ని చోట్ల వాళ్ళ ఇళ్ళ దగ్గర, పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లు జరిగినప్పుడు విద్యుత్ చౌర్యం చేసే విధానం చాలామంది గమనించి వుంటారు. ఇలాంటి వాటిని కూడా చూస్తూ ఊరుకోకూడదు, అది మన పని అనుకోకూడదు, ఎందుకంటే అది అందరిమీద పడే అనవసర వ్యయం కదా!

చెప్పదలచుకుంటే ఇలాంటివి చాలా ఉంటాయి. వాటికి మనం స్పందించవలసిందే,అది మన స్థాయిలో లేనప్పుడు అధికారుల దృష్టికి తీసుకు రావడం మన కనీస బాధ్యత. ఇటువంటివే నేను ఎదుర్కొన్న కొన్ని విషయాలను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను.

నాకు రోజూ మా ఇంటి మిద్దె మీద రెండు పూటలా నడిచే అలవాటయింది. ముఖ్యంగా ‘కరోనా’ వల్ల గత మూడు సంవత్సరాలుగా ఇదే పద్దతి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఒకరోజు మా ఇంటి పక్క రోడ్డుమీద స్ట్రీట్ లైట్ నా కాళ్ళ పడింది. అది ఎంతో శక్తివంతమైన కాంతిని వెదజల్లుతోంది. అయితే విషయం ఏమిటంటే, తెల్లవారగానే అన్ని వీధి దీపాలు అదిరిపోతున్నాయి, నేను చెప్పిన లైట్ తప్ప. ఒకరోజు పొరపాటున అలా జరిగిందేమో అనుకున్నా. కానీ ఆశ్చర్యంగా మరునాడు కూడా ఇరవై నాలుగు గంటలూ దేదీప్యమానంగా వెలుగుతూ కనపడింది. విద్యుత్ అధికారులే కాదు, ఆ లైట్ దగ్గర వున్న ఇంటివాళ్ళు కూడా పట్టించుకున్నట్టు లేదు. నా అశ్రద్ధ వల్ల కూడా పదిరోజులు గడిచిపోయాయి. నిరంతరం ఆ దీపం వెలుగుతూనే వుంది. నాకు మొబైల్‌లో సిటిజన్ ఫోరమ్ (GWMC CITIZEN FORUM) గుర్తుకు వచ్చింది. అందులో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ప్రజా ప్రతినిధులు కూడా వుంటారు. అందుచేత అందులో ఈ స్ట్రీట్ లైట్ విషయం పిర్యాదు రూపంలో టెక్స్ట్ మెసేజ్ పంపించాను. ఆశ్చర్యంగా కొద్దిగంటల్లోనే సంబంధిత ఉద్యోగి వచ్చి సరిజేశాడు మధ్యాహ్నం పూట. నా ఫిర్యాదుకు ఫలితం లభించింది. ఈ మధ్య కాలంలో మళ్ళీ ఎప్పుడూ అలాంటి పరిస్థితి ఏర్పడలేదు. స్పందిస్తే కొన్ని పనులు జరుగుతాయనే నమ్మకం ఏర్పడింది.

ఫిర్యాదులకు సకాలంలో స్పందించే అధికారులు కూడా ఉంటారన్న నా అభిప్రాయానికి బలం చేకూరింది. అంతే కాకుండా ప్రతి పౌరుడి బాధ్యతను ఈ సంఘటన నాకు గుర్తు చేసినట్లయింది. ఇంకొక మరో మంచి విషయం ఇక్కడ ప్రస్తావించవసిన అవసరం వుంది. కొద్దీ కాలం, నేను కొత్తగూడెం రేడియో కేంద్రం ద్వారా దంత సమస్యలు – పరిష్కార మార్గాలకు సంబందించిన విషయాలు మాట్లాడుతుండేవాడిని. ఒకసారి వారి పిలుపు ఆధారంగా, ఆకాశవాణి – కొత్తగూడెం కేంద్రంకు వెళ్లాను. మంచి వేసవి సమయం, మండుటెండలు భగ.. భగమంటున్నాయి. నన్ను ఒక గదిలో వేచివుండమన్నారు (waiting hall). ఆ గదిలో ఖమ్మం జిల్లా వివిధ ప్రాంతాలనుండి వచ్చినవారు మరో నలుగురు వున్నారు, చమటలు కారి బట్టలు తడిచిపోతున్నాయి. ఆ గదిలో ఫేన్ లేదు. సిబ్బందికి ప్రతి గదిలోనూ ఫాన్‍తో పాటు ఎయిర్-కూలర్ వుంది. ఆ గదిలో మేము నరకం అనుభవించాము. వెళ్లిన పని ముగించుకుని బ్రతుకు జీవుడా.. అనుకుంటూ ఇంటికి చేరి మరునాడు కొత్తగూడెం ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ గారికి ఒక ఉత్తరం రాసాను. రికార్డింగు రోజున మేము పడ్డ వెతలను ఆయనకు వివరించాను. వాళ్లకి తెలియాలని రాసానే గానీ ఏదో జరుగుతుందని నేను ఆ ఉత్తరం రాయలేదు.

కానీ.. నన్ను ఆశ్చర్యపరుస్తూ నేను ఉత్తరం రాసిన నెల రోజులకు, కొత్తగూడెం ఆకాశవాణి కేంద్రం సంచాలకుల నుండి ఒకలేఖ వచ్చింది, దాని సారాంశం ఏమిటంటే, నా సూచనను మన్నిస్తూ వెయిటింగ్ హాల్‌లో రెండు సీలింగ్ ఫాన్‍లు బిగించినట్టు, నన్ను అభినందిస్తూ రాసారు. ఆ లేఖ నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఇలా కూడా పనులు అవుతాయా? అనిపించింది.

మరో సంఘటనలో కూడా ఇలాంటి మేలు జరిగింది. వరంగల్‌కు ఆకాశవాణి కేంద్రం రానప్పుడు, హైదరాబాద్ కేంద్రంలో నేను వ్యాసాలు చదువుతుండేవాడిని (1975 నుండి నాకు ఆకాశవాణితో అనుబంధం). అప్పుడు పారితోషికం ఎంతో నాకు గుర్తు వుంది. వరంగల్‌లో ఆకాశవాణి కేంద్రం ఏర్పడిన తర్వాత నేను వరంగల్ కేంద్రం కార్యక్రమాల్లో పాల్గొనేవాడిని. అక్కడ పారితోషికం తక్కువగా ఉండేది. ఈ వ్యత్యాసాన్ని సవాలు చేస్తూ,ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ (ఢిల్లీ) కు ఉత్తరం రాసాను. ఆ కాలంలో వరంగల్ ఆకాశవాణి కేంద్రం సంచాలకులుగా శ్రీ ఆర్ వెంకటేశ్వర్లు గారు పని చేస్తున్నారు. నేను ఉత్తరం రాసిన కొద్దినెలలలోనే, ఢిల్లీ నుండి ఉత్తరం వచ్చింది. ఏ-గ్రేడు స్టేషన్‌తో సమానంగా ఎఫ్.ఎమ్ కేంద్రంలో కూడా పారితోషికం ఇవ్వాలన్నది దాని సారాంశం. ఇవి చెప్పడంలో నేను ఏదో సాధించేశానని గొప్పలు చెప్పుకోవడం కాదు. సమయం వచ్చినపుడు సమస్యలకు సరైన రీతిలో స్పందిస్తే ఫలితాలు తప్పక వుంటాయని చెప్పడమే నా ఉద్దేశం. ‘నా కెందుకులే’ అన్న భావనను ప్రతి ఒక్కరూ మనసు నుండి తొలగించాలని చెప్పడమే నా ప్రధాన ఉద్దేశం. సమయం వస్తే ప్రజల మేలు కొరకు ప్రతి పౌరుడూ స్పందించాలిసిందే! మన బాధ్యతను నిరూపించుకోవలసిందే మరి!!

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version