[శ్రీ ఎరుకలపూడి గోపీనాథరావు రచించిన ‘జ్ఞాపకాలు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
మాపుకోవాలనుకున్నా కుదరని
గాఢమైన గాథా చిత్రాలై
గత జీవన గమనాల పరిణామాల
శాశ్వత చిహ్నాలై
మదిలో గూడు కట్టుకునే
చిరంతన ఆనుభూతులు
మనిషిని కడ దాకా వీడని జతలు!
ఆహ్లాదకరమైన ఆమనులై
ఆత్మను స్పృశించే సత్కృతుల
జ్ఞాపకాలూ
పదునైన శూలాలై ఎదను బాధించే
దుష్కృతుల జ్ఞాపకాలూ
మనిషితో సహజీవనం చేసే
అనుభవాల శ్రుతులు!
బలీయ పరిస్థితుల ప్రభావాలను
చెరగని అనుభవాలుగా భద్ర పరచి
ఏ నాటి గతాన్నైనా
తృటిలో కనులకు కట్టే జ్ఞాపకాలు
ఋజు కథనాల రూపకాలు!
నిన్నటి నడవడికలలో దొరలిన
దోషాల పట్టికలై
వర్తమాన వర్తనను సరిదిద్దే పాఠాలై
ప్రగతి పథాలను పరచేందుకు
ప్రణాళికలుగా ఉపకరించే
జ్ఞాపకాల ఆవృత్తులు
మన మంచిని కోరే స్నేహితులు!
నేటి మన సత్కృతులు
రేపు మనను సన్మానించే
సత్కీర్తి ద్యుతులు!
మనం పరమపదించినా
పరుల మదిలో మెదలే మన జ్ఞాపకాలు
మన మంచితనాల రూపకాలు!
మన మానవ గుణాల దీపకాలు!