మా పొగతోట అంటే ఎన్నో స్మృతులు. వేదం వెంకటరాయశాస్త్రి తమ్ముడు వేదం వెంకటాచలయ్యరు గుర్తొస్తారు. వారు మద్రాసులో బి. ఎ. బియల్ చదివారు. బహుముఖ ప్రజ్ఞావంతులు. నెల్లూరులో న్యాయవాదవృత్తి సాగించినా అన్యాయమైన కేసులు పట్టరని పేరు తెచ్చుకున్నారు. బి. ఏ.లో సంస్కృతం పేపర్లో విశ్వవిద్యాలయంలో ప్రథములుగా నిలిచినందుకు గోడె సంస్థానం వారు 400 రూపాయల పురస్కారం ఇచ్చారు. 19వ శతాబ్ది చివరి దశాబ్దంలో అది చాలా పెద్ద మొత్తమే.
వీరి అన్నగారు వెంకటరాయశాస్త్రి సంప్రదాయవాదయితే, వీరు ఆధునిక చారిత్రక దృక్పథాన్నవలంబించారు. హీబ్రూ, అరబ్బీ మొదలైన అనేక భాషలు నేర్చుకొని సంస్కృత భాషపై ఇతర భాషల ప్రభావాన్ని గూర్చి పరిశోధించారు. సమకాలీన ప్రఖ్యాత పండితులతో, విదేశీ విశ్వవిద్యాలయ ఆచార్యులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగించారు. భారతివంటి పత్రికలలోనే కాక, Modern Review తదితర పత్రికలకు రాశారు. Asiatic Society లో సభ్యులు. వారి వ్యక్తిగత గ్రంథాలయం చాలా పెద్దది. వారి మనుమలు, వి. ఆర్. కళాశాల విశ్రాంత ఆంగ్లోపాధ్యాయులు వేదం వెంకటరామన్ ఈ అపురూప గ్రంథాలయాన్ని పూనె భండార్కర్ సంస్థకు బహుకరించారు.
వేదం వెంకటాచలయ్యర్ మనుమలు, వేదం వెంకట్రామన్. వి ఆర్ కళాశాలలో ఆఃగ్లోపాధ్యాయులు. ప్రా కృతభాషాపండితులు. 90వ యేట గతసంవత్సరం కాలం చేశారు.
వెంకటాచలయ్యరు జీవితకాలంలోనే 1922లో ‘Notes of a study of the Mahabharatha being an attempt to separate from genuine to superious matter.’ అనే గ్రంథం అచ్చయింది. భండార్కర్ సంస్థ ఈ పరిశోధనను ప్రామాణికంగా అంగీకరించింది. వీరి భావాలను ఆమోదించలేని నెల్లూరు బ్రాహ్మణ్యం సాంఘిక బహిష్కారం చేసేంత వరకు వెళ్లింది కానీ, అది సాధ్యంకాలేదు. వీరు కొన్ని పదాల వ్యుత్పత్తి మీద పరిశోధించి భారతిలో రాసిన వ్యాసాలు ‘‘కతిపయ శబ్దార్థ శబ్దస్వరూప విచారము’’ గ్రంథంగా ముద్రించబడింది. వెంకటాచలయ్యర్ మనుమలు వేదం వెంకటరామన్ తాతగారి నోట్సులన్నీ జాగ్రత్త చేసి, పదేళ్లు శ్రమించి డిజిటీకరణ చేసి, ఆ పరిశోధన భవిష్యత్తరాలకు అందించారు. వెంకటరామన్ దాదాపు 90 ఏళ్లు జీవించి ఏడాది క్రితం స్వర్గస్థులయ్యారు.
పొగతోటలో ఆ పురాతనమైన మేడ ముందు నుంచి వెళుతున్న ప్రతిసారి ఇంటిలో అయ్యరుకాలం నాటి వృక్షాలు, ఎప్పుడూ పరిశోధనలో మునిగితేలే వెంకటరామన్ సారు, చిరునవ్వుతో లోపలికి ఆహ్వానించే వారి సతీమణి గుర్తొస్తారు!
వేదం వెంకటాచలయ్యర్ ఇల్లు. పొగతోట. 1920 ప్రాంతంలో కట్టినది.
అయ్యరు ఇంటినుంచి ఇంకొంచెం ముందుకు సాగి కుడివైపు తిరిగితే, ఆ మూల పెద్దమిద్దెను “టోపీదాసుగారి యిల్లు” అనేవారు. నాకు ఊహ తెలిసేప్పటికి దాసు, వారి శ్రీమతి వృద్ధులు. సంతానం లేక, దాసుగారి బావమరది బిడ్డలను తోడుగా వుంచుకున్నారు. రెండో ప్రపంచయుద్ధం ముందు దాసుగారూ, ఆయన తమ్ముడు కలిసి పెద్ద ఎత్తున నేతి వ్యాపారం చేశారు. దాసుగారు నేయి సేకరించి బర్మాకు ఎగుమతి చేసేవారు. తమ్ముడు రంగూన్ లో వుండి విక్రయం వగైరా పనులు చూసేవాడు. కొన్నేళ్ల తర్వాత తమ్ముడు తిరిగి నెల్లూరు వచ్చినపుడు దాసుగారు వ్యాపారంలో నష్టాలు చూపి తమ్ముడికి టోపీ పెట్టారు. ఆ తమ్ముడి కుటుంబం వెంకటాచలంలో నిరుపేదలుగా కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ పిల్లలను చదివించుకోవడం అందరికీ తెలిసిందే! ఆ కుటుంబం నాకు బాగా పరిచయం. మొత్తం మీద ‘టోపీదాసు ఇల్లు’గా ఆ ఇల్లు అపఖ్యాతి పాలైంది. మనుషులు పోతారు, మంచి చెడ్డలు నిలిచిపోతాయి.
వేదం వెంకటరాయశాస్త్రి గారు కాలం చేశాక కూడా వారి శిష్యులు ప్రశిష్యులు ఒక వర్గంగా, ప్రత్యర్థులు ఒక వర్గంగా సభల్లో సమావేశాల్లో పత్రికాముఖంగా కొట్టుకు చచ్చేవారు. మా నాయన ఆనాడు సుప్రసిద్ధ విద్వాంసులు, ఇరువర్గాల వారు మా ఇంటికి వచ్చి విషయాలన్నీ చెప్పేవారని, కానీ మా నాయన ఎవరినీ సమర్థించకుండా వాదవివాదాలు వినేవారని మా అమ్మగారు చెప్పేవారు. ఆ వివాద సాహిత్యం నాయన గ్రంథాలలో లభించింది.
వేదం వెంటరాయశాస్త్రి ప్రత్యక్ష శిష్యులు గునపాటి యానాది రెడ్డిగారు మా నాయనకు బహూకరించిన ఆముక్తమాల్యద సంజీవని వ్యాఖ్య, శృంగారనైషధ సర్వంకష ప్రతులు మా ఇంట్లో వుండేవి. ఎం. ఏ లో ఆ పుస్తకాలే చదివాను. ఇటీవల నా అపూర్వ గ్రంథాలను తిరుపతి శ్రీ వెంకటేశ్వర పరిశోధన సంస్థకు బహూకరించాను.
దుర్భా సుబ్రహ్మణ్యశాస్త్రి మొదట ప్రభుత్వోద్యోగి. పదవీ విరమణ చేసిన తర్వాత వీరు నెల్లూరు వి. ఆర్. హైస్కూల్లో తెలుగు పండితులుగా చేరారు. వీరు వెంకటరాయశాస్త్రి వ్యతిరేక వర్గానికి ‘కప్తాను’ వంటివారు. దీపాల పిచ్చయ్యశాస్త్రి, మోచెర్ల రామకృష్ణయ్య, కొలకుల నారాయణరావు తదితరులు సుబ్రహ్మణ్యశాస్త్రి వర్గం. వి. ఆర్. కళాశాల ఆంధ్రోపన్యాసకులు ధరణికోట వెంకటసుబ్బయ్య, గుర్రం సుబ్బరామయ్య, వీరి సోదరులు న్యాయవాది సుబ్రహ్మణ్యం మరొక వర్గం.
దీపాలవారి దీమసము, ధరణికోట సుబ్బయ్యగారి దబ్బరలు, ప్రభాపరిష్కార పరిశీలనము, కుమతి శతకము (కొలకుల నారాయణరావు), కల (మోచర్ల రామకృష్ణయ్య) ధరణి కోటవారి ధార్ష్ట్యము (దీపాల), ఓదార్పు (దీపాల), కాలగతి తలపోతలగతి (ములుమూడి నారాయణరెడ్డి) వంటి వివాద, దూషణ సాహిత్యం వెలువడుతూన్న కాలంలో నెల్లూరులో పండితులు ఎక్కడ చేరినా ఈ చర్చలే చేసేవారట!
ఈ సాహిత్య జన్యాలకు (యుద్ధాలకు) వేదంవారి శిష్యులే ప్రధాన కారణమని మరుపూరు కోదండరామరెడ్డిగారనేవారు. మా గురువుగారిని మించిన పండితులుండరు అనడమే తగాదాకు మూలకారణమట! కోదండరామరెడ్డిగారి గ్రంథం కంబరామాయణం మీద దీపాలపిచ్చయ్యశాస్త్రిగారు ఇటువంటి వివాదాస్పద పుస్తకమే అచ్చువేశారు. కోదండరామరెడ్డి గారి చిన్ననాటి సహాధ్యాయి, రక్తబంధువే పిచ్చయ్యశాస్త్రిని రెచ్చగొట్టి, ప్రోత్సహించి, పుస్తకం ముద్రణకు డబ్బిచ్చి ఈ గ్రంథం రాయించారని నెల్లూరులో అభిజ్ఞవర్గాలు అనుకునేది.
1981లో కాబోలు ఆంధ్ర విశ్వవిద్యాలయం మరుపూరు కోదండరామరెడ్డి గారికి ‘కళాప్రపూర్ణ’తో గౌరవించిన సందర్భాన్ని పురస్కరించుకొని నెల్లూరు టౌన్ హాల్ లో గొప్ప అభినందన సభ ఏర్పాటయింది. ఉపన్యాసాలు, సన్మానం, అభినందనలు- కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. ఆ సభకు అధ్యక్షత వహించిన బెజవాడ గోపాలరెడ్డిగారు సభాసదుల్లో ముందు వరసలో కూర్చొని వున్న దీపాల పిచ్చయ్యశాస్త్రిని వేదిక మీదికి వచ్చి రెండు మాటలు చెప్పి అభినందించ వలసినదిగా అభ్యర్థించారు. దీపాలవారు వేదిక మీదికి వచ్చి క్లుప్తంగా రెండు మంచి మాటలు చెప్పి భాషణం ముగిస్తూ, ‘‘కళాప్రపూర్ణ బిరుదమునకు అర్హులయిన పండితులు పలువురీనగరములో ఉన్నను, ఆ బిరుదు రెడ్డిగారికి వచ్చినది. అది అదృష్ట’’మన్నారు. ఆ మాటల్లో రెడ్డిగారికి సూక్ష్మం తగిలింది. ఈ విషయాలన్నీ వివరంగా దీపాలవారే కోదండరామరెడ్డి ‘‘వచన కంబరామాయణ పరామర్శ’’ అనే విమర్శ గ్రంథంలో సవివరంగా రాశారు.
నెల్లూరులో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రెడ్డిగారు నిర్వహించిన ‘తిక్కన తిరునాళ్ల’ సభలకు పిచ్చయ్యశాస్త్రికి ఆహ్వానం లేదు. సభలో తిక్కన మీద విశేష సంచిక విడుదల చేశారు. అందులో రాయమని కూడా శాస్త్రిగారిని కోరలేదు. ఈ విధంగా తనను ఉపేక్షించడం సహించలేక పోయామని శాస్త్రిగారు చెప్పుకున్నారు. దీపాలవారు అనారోగ్యంతో ఆ ‘జాతర’లో పాల్గొనలేదా అని కొందరు అభిమానులు దీపాలను కూడా రెచ్చగొడుతూ ఉత్తరాలు రాశారు. ఏమైతేనేం? కోదండరామరెడ్డి గారు తమిళ కంబరామాయణానికి చేసిన తెలుగు అనువాదంలో దీపాలవారు నూట చిల్లర తప్పులెన్నారు (వచన కంబరామాయణ పరామర్శ 1981 ప్రతి) కొందరు పండితులు దీపాలవారికి అనుకూలంగా ఇచ్చిన అభిప్రాయాలను కూడా పుస్తకంలో చేర్చారు. తర్వాత జరిగింది అందరికీ తెలిసిందే, కోదండరామరెడ్డిగారికి కోపం వస్తే ఏంజరుగుతుందో! “మత్ఛ్యాలు దినేనోటికి స్వచ్ఛాలు రావ”ని ఆయనే అంటారు. వారిలో ఒక సుగుణం, దీర్ఘకోపం మనసులో ఉంచుకోరు! ఎదుటి పక్షంవాళ్లు ఏదో పొరపాటైందని మొక్కితే కరిగి మెత్తబడతారు. ‘‘ఆయనకు కుడుమిస్తే చాలు పండగ’’ అని ఎరిగినవారు అనేవారు.
వేదంవారి కాలంలో మొదలైన ఈ వివాదాలు, బురదజల్లుకోడం దాదాపు 20 వ శతాబ్ది చివరి వరకూ కొనసాగాయి.
మరుపూరు కోదండరామరెడ్డిగారి జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు. ఆయన గొప్ప గుండె నిబ్బరం కలవారు. వారి స్వగ్రామం మడమనూరు. పెద్ద వ్యవసాయ కుటుంబం, తండ్రి కొండారెడ్డి, తల్లి కామమ్మకు ప్రథమ సంతానం పొణకా కనకమ్మగారు, ఆ తర్వాత, పిచ్చిరెడ్డిగారు, కడగొట్టు సంతానం కోదండరామరెడ్డిగారు. కనకమ్మను మేనమామ సుబ్బరామిరెడ్డికిచ్చారు. ఆమె మాటకు ఎదురు చెప్పని భర్త. అత్తవారిల్లు పొట్లపూడి జిల్లాలో జాతీయోద్యమానికి కేంద్రమయింది. కనకమ్మ16 సంవత్సరాల వయసులో నెల్లూరు బహిరంగ సభలో ఉపన్యసించిన బిపిన్ చంద్రపాల్, వారి సతీమణికి అతిథ్యమిచ్చారు. 1907 ఏప్రిల్‌లో పాల్ నెల్లూరు బహిరంగ సభకు అధ్యక్షత వహించడానికి ఎవరికీ ధైర్యం చాలకపోతే, అప్పుడే న్యాయ వాదవృత్తిలో ప్రవేశించిన ఒక అనామక వకీలు సభకు అధ్యక్షత వహించవలసి వచ్చింది. ఆ వాతావరణంలో కనకమ్మ పాల్ దంపతులకు ఆతిథ్య మిచ్చారు. జాతీయోద్యమంలో అన్ని ఘట్టాల్లో కనకమ్మ ఉన్నారు. ఆస్తి అప్పులవారిపాలై, వెంకటగిరి జమీందారు వద్ద భూమికొని వ్యవసాయం చేశారు. అన్యాయమైన శిస్తులు కట్టలేక పొలాలు జమీందారు వశమయ్యాయి. ఆ పరిస్థితుల్లో కనకమ్మగారు జమీందారి వ్యతిరేక పోరాటాన్ని ప్రారంభించి జమీందారీ రైతు పత్రికను ప్రారంభించారు.
మూడేళ్ల తర్వాత ఆమె పత్రికను తమ సహాయకులైన నెల్లూరు వెంకట్రామానాయుడుగారికి అప్పగించారు. అప్పణ్ణించి జమిందారి రైతు పత్రిక జమీన్ రైతుగా మారినా, వెంకటగిరి జమీందారి వ్యతిరేక ఉద్యమాన్ని తలకెత్తుకుని చివరంటా కొనసాగించింది.
“మా నాయనకు పదిహేనేళ్లు వచ్చేసరికి ఆస్తంతా అప్పులవారి పాలైంది. కనకమ్మగారే పుట్టింటి వారి ఆస్తిని, మెట్టినింటి వారి ఆస్తిని జాతీయోద్యమంలో త్యాగం చేశారు.’’ అని కోదండరామరెడ్డి కుమారుడు, నా ఆప్త మిత్రుడు తరుణేందు శేఖర్ రెడ్డి స్వయంగా చెప్పాడు. అక్క ఆస్తి పోగొట్టినా కొదండరామరెడ్డిగాని, వారి అన్నగారు పిచ్చిరెడ్డిగాని ఆమెను పల్లెత్తు మాట కూడా అనలేదు. ‘‘కనకప్ప, కనకప్ప’’ అని కోదండరామరెడ్డిగారు అక్కను తలచుకున్నప్పుడల్లా ప్రశంసించారే గాని నొచ్చుకోలేదు.
కళాప్రపూర్ణ మరుపూరు కోదండరామరెడ్డిగారికి కుమారుడు, నా బాల్య మిత్రులు తరుణేందు శేఖర్ రెడ్డి
ఆనాటి కుటుంబ ఆర్థిక కారణాలవల్లే కోదండరామరెడ్డి గారు బందరు జాతీయ కళాశాలలో చదివి, జస్టిస్ పార్టి పత్రిక సమదర్శినిలో పత్రికా రచయితగా జీవితం ఆరంభించారు. కోదండరామరెడ్డిగారి కుమారుడు తరుణేందు శేఖర్ ప్రమేమం లేకపోతే పొణకా కనకమ్మ స్వీయ చరిత్ర ‘కనకపుష్యరాగం’ వెలగుచూసేది కాదు. 1963లో కనకమ్మగారు పోయారు. ఆమె సంరక్షణ బాధ్యత చూసిన ఆమె చెల్లెలి కుటుంబం వద్దే ఆ రాతప్రతి ఉండి పోయింది. జిల్లాలో హేమాహేమీలపైన, భూస్వాములు, మోతుబరుల మీద ఆమె వ్యాఖ్యానాలు, కనకమ్మను మోసంచేసినవారి వ్యవహారాలు బహిరంగమై రచ్చకావడం ఇష్టం లేక, కనకమ్మ చెల్లెలి సంతానం ఆరాత ప్రతిని బయటపెట్టలేదు. 2008లో ఒకరోజు నా మిత్రుడు తరుణేందుశేఖర్.తో యథాలాపంగా మాట్లాడుతూ ఆ రాతప్రతి విషయం ప్రస్తావించాను. వెంటనే బయల్దేరమన్నాడు. నెల్లూరు దర్గామిట్టలోని మేనత్తవారి ఇంటికి తీసుకొని వెళ్లి నన్ను పరిచయం చేసి, “కనకమ్మ స్వీయచరిత్ర రాతప్రతి ఇస్తే, నా మిత్రుడు అచ్చువేస్తాడు” అని చెప్పాడు. మారు మాట్లాడకుండా వారు వ్రాత ప్రతిని తెచ్చి నామిత్రునికిచ్చారు.
పొణకా కనకమ్మగారి సహకారంతో కస్తూరిదేవి విద్యాలయంలో చదివి, గ్రాడ్యుయేషన్ ఆతర్వాత విద్యాలయంలో అధ్యాపికగా పనిచేసిన నలుబోలు సరస్వతి అనే యువతి కనకమ్మతో వుంటూ ఆమె చెబుతూవుంటే, ముందు విడికాగితాల మీద రాసి, తర్వాత బౌండ్ బుక్కులోకి ఎక్కించింది. కనకమ్మగారి జ్ఞాపకాలు కొనా, మొదలు లేకుండా చిన్నచిన్న తుంటలుగా వున్న వాటిని ఒక క్రమంలో కూర్చడానికి చాలాకాలం పట్టింది. ఆ తర్వాత కనకమ్మగారి అభివ్యక్తిని గుర్తించి, ఆ అభివ్యక్తి చెడకుండా రాత దోషాలను సవరిస్తూ శైలిలో ఏకరూపత పోకుండా చూశాను. ఈ పుస్తకంలో చాలాభాగం టైపు నేర్చుకుని నేనే టైపు చేశాను. పుస్తకం ప్రచురిస్తానని ఒక మిత్రుడు ఏడాది పాటు జాప్యం చేశాడు. చివరకు నా ఆత్మీయ మిత్రులు పెన్నేపల్లి గోపాలకృష్ణ సహాయం అర్థించాను. మనసు ఫౌండేషన్ మన్నెం రాయుడు, వారి సొదరులు డాక్టర్ గోపిచంద్ కనకమ్మ స్వీయచరిత్రను 2011 ఏప్రిల్‌లో ప్రచురించారు.
ఈ స్వీయచరిత్రకు కనకపుష్యరాగం అనిపేరు పెట్టి, మిత్రులు ‘గోపి’ (పెన్నేపల్లి గోపాలకృష్ణ) ‘విముక్త మహిళ’ పేరుతో పరిచయ వాక్యాలు రాశారు. తర్వాత నాలుగు నెలల లోపలే వారు వెళ్ళిపోయారు. 1959లో పూర్తిచేసిన స్వీయచరిత్ర 2011లో వెలుగు చూసింది. ఇంతకథ నడిచింది పుస్తక ప్రచురణ.
(ఇంకా ఉంది)
డా. కాళిదాసు పురుషోత్తం గారిది ప్రకాశం జిల్లా తూమాడు అగ్రహారం. వీరి తండ్రిగారు గొప్ప సంస్కృత పండితులు. నెల్లూరులో స్థిరపడ్డారు. జననం 1942 మే. ముగ్గురు అక్కలు, ఒక అన్నయ్య. పెద్దక్క, రచయిత మిగిలారు. పెద్దక్క 97వ ఏట ఏడాది క్రితం స్వర్గస్తులయ్యారు. రచయిత బాల్యంలో నాయనగారి వద్ద సంస్కృతం కొద్దిగా చదువుకున్నారు. నెల్లూరు వి.ఆర్.హైస్కూలు, కాలజీలో విద్యాభ్యాసం, యం.ఏ. తెలుగు ఉస్మానియాలో ఫస్ట్ క్లాసులో, యూనివర్సిటీ ఫస్ట్ గానిలిచి, గురజాడ అప్పారావు స్వర్ణ పురస్కారం ఆందుకున్నారు. హైదరాబాద్, స్టేట్ ఆర్కైవ్సు వారి జాతీస్థాయి స్కాలర్షిప్ అందుకొని వెంకటగిరి సంస్థాన సాహిత్యం మీద పరిశోధించి 1971 సెప్టెంబర్‌లో డాక్టరేట్ అందుకున్నారు. 1972లో నెల్లూరులో శ్రీ సర్వోదయ డిగ్రీ కళాశాలలో చేరి, ఆ కళాశాల ప్రిన్సిపల్‌గా రిటైరై నెల్లూరులో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఫొటోగ్రఫీ, సినిమాలు, పర్యటనలు ఇష్టం. 15 సంవత్సరాలు మిత్రులతో కలిసి కెమెరా క్లబ్, ఫిల్మ్ సొసైటీ ఉద్యమం, దాదాపు పుష్కరకాలం నడిపారు. సాహిత్యం, సినిమా, యాత్రానుభవాలు వ్యాసాలు భారతినుంచి అన్ని పత్రికలలో అచ్చయ్యాయి. 2007లో దంపూరు నరసయ్య – ఇంగ్లీషు లో తొలి తెలుగు వాడిమీద పరిశోధించి పుస్తకం. 1988లో గోపినాథుని వెంకయ్య శాస్త్రి జీవితం, సాహిత్యం టిటిడి వారి సహకారంతో. డాక్టర్ మాచవోలు శివరామప్రసాద్ గారితో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాచ్య పరిశోధన శాఖ వారికోసం పూండ్ల రమకృష్ణయ్య అముద్రిత గ్రంథచింతామణి సంపుటాలనుంచి మూడువందల పుటల “అలనాటి సాహిత్యం” గ్రంథానికి సంపాదకత్వం, 2011లో కనకపుష్యరాగం పొణకా కనకమ్మ స్వీయచరిత్ర ప్రచురణ. మనసు ఫౌండేషన్ సహకారంతో AP Sate Archives లో భద్రపరచిన గురజాడ వారి రికార్డు పరిశీలించి స్వర్గీయ పెన్నేపల్లి గోపాలకృష్ణ, మనసు రాయుడు గారితో కలిసి “గురజాడ లభ్య సమగ్ర రచనలసంకలనం” వెలువరించారు. మనసు ఫౌండేషన్ వారి జాషువ సమగ్ర రచనల సంకలనంకోసం పనిచేశారు. 2014లో “వెంటగిరి సంస్థాన చరిత్ర సాహిత్యం” గ్రంథ ప్రచురణ. 2021లో పెన్నేపల్లి గోపాలకృష్ణతో కలిసి అనువదించిన”letters from Madras During the years 1836-39″ గ్రంథం ‘ఆమె లేఖలు’ పేరుతో అనువాదం. (ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్-ఎమెస్కో సంయుక్త ప్రచురణ). పూండ్ల రామకృష్ణయ్య అముద్రిత గ్రంథచింతామణి ఆనాటి సాహిత్య దృక్పథాలు మీద మాచవోలు శివరామప్రసాద్, అల్లం రాజయ్య నవలలు, కథలు మీద కుమారి ఉభయ భారతి పిహెచ్.డి పరిశోధనలకు పర్యవేక్షణ. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ సంస్థాపక సభ్యులు, ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సభ్యత్వం.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
ఇక యుద్ధం జరగదు…
పదసంచిక-51
అవధానం ఆంధ్రుల సొత్తు-3
సీతాకోకచిలుక
షేక్స్పియర్ గారి పరిపూర్ణ పరిచయం
నీలమత పురాణం-65
పూచే పూల లోన-33
విజయ విశ్వనాథమ్: విశ్వ విజయీభవ!-5
శ్రీ భరాగో గారి 90వ జయంతి సభ ప్రెస్ నోట్
జ్ఞాపకాల తరంగిణి-8
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®