కాశ్మీరు లోయలో సలామాబాదు కుగ్రామంలో ఒక రోజు
మనం ఎవరినీ మన దృష్టి నుంచి పరిశీలించి తీర్పులివ్వకూడదేమో! మనకు queer గా, వింతగా అనిపించే మనుషుల్ని దగ్గరగా చూసి మాట్లాడినప్పుడు వారు మరో రకంగా అనిపిస్తారు.
శ్రీ మల్పూరు విజయభాస్కరరెడ్డి నాకు నలభై ఏళ్ళ పైబడి తెలుసు. ఇంజనీరింగ్ పూర్తి చేసి నెల్లూరు లోనే మిత్రులతో కలిసి పరిశ్రమ నెలకొల్పి 30 సంవత్సరాలు విజయవంతంగా నిర్వహించి, ఇక చాలనుకొని మరో జీవితం మొదలుపెట్టాడు. పదేళ్ళ క్రితం బైపాస్ సర్జరీ విజయవంతంగా జరిగాక, శరీర దారుఢ్యం మీద దృష్టి పెట్టాడు. ఇతరులైతే భయం భయంగా, తాము ఒక గాజుబొమ్మ అనుకొని జీవితం సాగిస్తారు. మా మిత్రుడు జిమ్‌లో చేరి నిత్యం వ్యాయామం చేసి సంపూర్ణ ఆరోగ్యవంతుడై పర్వతారోహణకు పూనుకొని ఎవరెస్ట్ బేస్ క్యాంపు దాకా రెండు మూడు పర్యాయాలు ట్రెక్కింగ్ చేశాడు. కిలిమాంజో వంటి పర్వత శిఖరాలు – రష్యా వంటి దేశాల్లో పర్వతారోహకులతో కలిసి అధిరోహించాడు.
శీతాకాలం లదాక్‍లో ఘనీభవించిన జన్‍స్కర్ నది మీద ఐదారు రోజులు నడవటం – సాహసకార్యంలో యువజనులతో కలిసి పాల్గొన్నాడు. తను నిరంతరం దేశాటన, ట్రెక్కింగ్ కార్యక్రమాలలో పాల్గొంటునే ఉంటాడు. ఇప్పుడు తన వయసు 72 సంవత్సరాలు, కానీ శైశవం నాటి ఉత్సాహం మాత్రం తగ్గలేదు.
ఈ ఏడు యూత్ హాస్టల్స్ – అంతర్జాతీయ సంస్థ ఏర్పాటు చేసిన కాశ్మీరులోని గొప్ప సరస్సులన్నీ కాలి నడకను చుట్టి వచ్చే ‘కాశ్మీర్ గ్రేట్ ట్రెక్స్’ కార్యక్రమంలో పాల్గొనడానికి పేరిచ్చాడు. ఈ కార్యక్రమంలో రోజూ ఒక సరస్సును దర్శించి, అక్కడ ఓ కేంపు వేసుకొంటారు. ఈ సాహస యాత్రికులందరూ 2022 జూలై 26న శ్రీనగర్ నుంచి నాలుగు గంటల ప్రయాణంలో జోజీలా కనుమ మార్గానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోనామార్గ్ చేరుకోవాలి.
విజయభాస్కరరెడ్డి ఢిల్లీ నుంచి విమానంలో శ్రీనగర్ వెళ్ళి, అక్కడ నుంచి సోనామార్గ్ చేరాడు. అక్కడ ఆరు రోజుల ట్రెక్కింగ్ కార్యక్రమంలో పాల్గొంటున్న సభ్యులందరికీ Hotel Sonamarg Palace హోటల్‍లో విడిది ఏర్పాటయింది. మరుసటి రోజు ఏర్పాటు చేసిన అక్లమటైజెషన్ ట్రెక్కింగ్ కూడా సునాయాసంగా పూర్తి చేశాడు. తెల్లవారి అసలు ట్రెక్కింగ్ ఆరంభమవుతుంది. “మీకు బైపాస్ ఆపరేషన్ జరిగింది కాబట్టి మీరు ట్రెకింగ్‍లో పాల్గొనడానికి అర్హులు కారు” అని చివరి నిమిషంలో యూత్ హాస్టల్ నిర్వాహకులు విజయభాస్కరరెడ్డికి తెలియజేశారు. తను అప్లికేషన్, ఫీజు పంపినప్పుడే ఈ విషయం తెలియజేసి ఉన్నారు.
అందరూ ట్రెక్కింగ్‍కు వెళ్ళిపోతే తనొక్కడే సోనామార్గ్‌లో ఏం చేస్తాడు? అప్పటికే అనేక పర్యాయాలు సోనామార్గ్‌లో ఉండి పరిసరాల్లో ట్రెక్కింగ్‍లలో పాల్గొని ఉన్నాడు. మూడు రోజులు ఒక్కడే సోనామార్గ్‌లో గడిపి, విసుగు పుట్టి, శ్రీనగర్ వెళ్ళి Adventure Tourists, Trekkers దిగే ‘Hostel Zostel’ లో చేరాడు. అక్కడ కేంపు అకామొడేషన్‍కు రోజు వెయ్యి రూపాయలు. ఈ హాస్టల్ మొగల్ గార్డెన్స్‌కు చాలా దగ్గరలో ఉంటుంది. నడిచివెళ్ళి హాయిగా తిరిగి రావచ్చు.
విజయభాస్కరరెడ్డి కావలి బంధువొక కంట్రాక్టర్ శ్రీనగర్ విమానాశ్రాయానికి సమీపంలో కాపురం ఉంటూ కాంట్రాక్టు పనులు సాగిస్తున్నారు. విజయభాస్కరరెడ్డి హాస్టల్‍లో ఉన్న విషయం విని ఆయన కారు పంపి విజయభాస్కరరెడ్డిని తన ఇంటికి తీసుకొని వెళ్ళారు. శ్రీనగర్ నుంచి తన విమానం ముందే బుక్ అయి ఉంది. అందువల్ల మరుసటి రోజు కారులో దూధ్ పత్రి వెళ్ళి రమ్మన్నారు బంధువులు.
దూధ్ పత్రి
గుల్‌మార్గ్ వెళ్ళే మార్గంలోనే దూధ్ పత్రి వెళ్ళాలి. కారులో గంట ప్రయాణం. బస్‍లో అయితే రెండు గంటల ప్రయాణం అట! దూధ్ పత్రి అంటే Valley of Milk. తెలుగులో క్షీరరతికుహరం అంటే ఎబ్బెట్టుగా ఉంటుంది. పాలలోయ అంటే తేలిపోయినట్లుంటుంది. సరే, ఒక బాబా మహిమలకు జ్ఞాపకంగా ఈ ప్రదేశానికి Valley of Milk అని పేరు వచ్చిందని స్థానిక ఐతిహ్యం. ఈ లోయ అంతా అసమతలంగా, వాలుగా వున్న పచ్చటి పచ్చికబయళ్ళు, అడవి పువ్వుల సువాసనలతో గాలి పరిమళిస్తుంది, గొర్రెల కాపరుల మందలతో. “పత్రి వ్యాలీ పర్యాటకుల దృష్టిలో పడినట్లు లేదు గాని తప్పకుండా చూడాల్సినదే” అంటారు విజయభాస్కరరెడ్ది గారు.
మరుసటి రోజు శంకరాచార్య పర్వతం చూచి వచ్చారు. శ్రీనగర్ నగరంలో ఎక్కడినుంచి చూచినా శంకరాచార్య పర్వతం కనిపిస్తూనే ఉంటుంది. క్రీస్తు పూర్వం 371లో గోపాదిత్య రాజు శంకరాచార్య పర్వతం పైన గుడిని కట్టినట్లు ఐతిహ్యం.
ఈ పర్వతానికి గోపాద్రి అని, సంధిమాన్ పర్వతం అని, సులేమాన్ పర్వతమని – అన్ని మతాలకు సంబంధించిన పేర్లున్నాయి. నగరానికి 5 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 11,000 అడుగుల ఎత్తులో పర్వత శిఖరం ఉంది. శిఖరం పై నుంచి చూస్తే, దాల్ సరస్సు దృశ్యం అద్భుతంగా దృశ్యమానమవుతుంది.
శంకరాచార్య ఆలయం – ఫోటో సౌజన్యం ఇంటర్‌నెట్
శంకరాచార్య పర్వత శిఖరం మీద పెనుశిలపైన రాళ్ళతో శివాలయం నిర్మించబడింది. కల్హణుడి రాజతరంగిణిలో ఈ గుడి ప్రస్తావన ఉన్నదంటారు. యాత్రికులు ఆలయ ద్వారం ముందున్న మెట్లెక్కి లోపలి లింగాన్ని దర్శిస్తారు. ఇప్పుడు కూడా నిత్యపూజ లందుకొంటున్న ఆలయం ఇది.
మరురోజు శ్రీనగర్ నుంచి బారాముల్లా వరకు ఉన్న రైలు మార్గంలో ప్రయాణించాలనుకొన్నాడు. బారాముల్లా చివరి స్టేషను. 60 కిలోమీటర్ల దూరం, రెండు గంటల ప్రయాణం. తమ బంధువు కారు డ్రైవర్ మగ్బూల్ ఊరు సలామాబాద్‍కు అక్కడ్నించి వెళ్ళాలి. గ్రామీణ జీవితం చూడాలని భావించినపుడు మగ్బూల్ తన ఊరికి తీసుకువెళ్తానన్నాడు.
శ్రీనగర్ రైల్వే స్టేషన్
రైలులో
బారాముల్లా స్టేషన్‍లో దిగి షేర్ టాక్సీ సుమోలో ఇద్దరూ ప్రయాణమయ్యారు. కాశ్మీరులో స్త్రీలు పురుషుల పక్కనే కూర్చుంటారనీ, ఎలాంటి ఇబ్బందిగా అనుకోరని అంటాడు. తను కాశ్మీరంతా తిరిగినా, యువతులెవరూ అరుదుగా తప్ప బురఖా ధరించడం కనిపించలేదని, వృద్ధ స్త్రీలు కొందరు తప్ప – అని ప్రత్యేకంగా అంటాడు.
ఆ రోజే దాల్ సరస్సుకు సమీపంలో ఉన్న పరీ మహల్‍ను కూడా దర్శించాడు. ఇది జబర్వాన్ పర్వత శ్రేణి ఎగువ భాగంలో ఏడు మేడలతో ఉన్న ఒక సుందర ఉద్యానవనం. దీన్ని ప్యాలస్ ఆఫ్ ఫెయిరీస్ అని కూడా అంటారు. చాలా సుందర ప్రదేశం.
చష్మషాహి ఉద్యానవనం – వికీపీడియాలో నుంచి ఫొటో
తరువాత గవర్నరు భవన్ సమీపంలోనే ఉన్న ఛష్మ షాహి ఉద్యానవనాని దర్శించాడు.
చష్మషాహి ఉద్యానవనం, సమీపంలో భవనం
జీలమ్ నది ఒడ్దు మీదే సలామాబాద్ ప్రయాణం, మధ్యాహ్నం 3 గంటలకు ఊరు చేరారు.
మగ్బూల్‍కు 30 సంవత్సరాలుంటాయి. అతని భార్య, ఇద్దరు చిన్న పిల్లలు, తండ్రి రజాక్, తమ్ముడి వరసయ్యే నాసర్ – ఇదీ అతని కుటుంబం.
మగ్బూల్ తండ్రితో పైపంచతో విజయభాస్కరరెడ్డి
మక్బూల్ ఇద్దరు పిల్లతో విజయభాస్కరరెడ్డి
సలామాబాద్ గ్రామంలో మగ్బూల్ కుటుంబంతో విజయభాస్కరరెడ్డి
మగ్బూల్ ఇల్లు
మగ్బూల్ ఇల్లు ఇలా వెలుపలినుంచి
విజయభాస్కరరెడ్ది మగ్బూల్‌ని వెంట తీసుకుని చుట్టుపట్ల కొండల వరకూ నడిచి చీకటి పడుతున్న వేళకు వెనక్కు వచ్చారు. ఎటు చూసినా నేత్రపర్వంగా అంతటా పచ్చగా ఉంది. ఇంటికి రాగానే తినడానికి స్నాక్సు ఇచ్చారు. విజయభాస్కరరెడ్ది తన కోసం ప్రత్యేకంగా ఏమీ వండవద్దని, వాళ్లు తినే భోజనమే తానూ తింటానని ముందుగానే చెప్పినా రాత్రి 9 గంటలకు ప్రత్యేకంగా మాంసంతో వంటకాలు చేసి వడ్డించారు. విజయభాస్కరరెడ్ది ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రజల ఆహారం తినటం అలవాటు చేసుకున్న వ్యక్తి. అందరం ఆయనలాగా ఉండడం అసాధ్యం.
ఆ రాత్రి మగ్బూల్ ఇంట్లో విందు
భోజనం తర్వాత గదిలో నేల మీద పరచిన తివాచీ పై పరుపు పరచి పడక సిద్ధం చేశారు. వారికి మంచాలు అలవాటున్నట్లు లేదు. ఉదయం కుటుంబ సభ్యులందరూ, పిల్లలూ పెద్దలూ ఏ మాత్రం సంకోచం లేకుండా తనతో కలసి ఫోటోలు దిగారు. తిరుగు ప్రయాణానికి బయలుదేరితే, తనకు ఆతిథ్యం ఇచ్చినందుకు డబ్బులు ఇవ్వబోతే, వారు వద్దంటే వద్దని అడ్దు పడ్డారట! చివరకు ఎంతో నచ్చజెప్పి పిల్లలకు ఏదైనా కొని ఇమ్మని చెప్పి వచ్చాడట! తిరుగు ప్రయాణం షేర్ టాక్సీలో, దారి పొడవునా యాపిల్ వనాలు..
మధ్యాహ్నానికి శ్రీనగర్ చేరి ఫ్లయిట్‍లో ఢిల్లీకి, అక్కడ్నించి నెల్లూరు వచ్చారు విజయభాస్కరరెడ్ది గారు. ఫోటోలు వారి తీసినవే. వైకేరియస్ ఫ్లషర్ అంటారు. నేను యాత్ర చేయకపోయినా, ఇతరుల అనుభవాలు గ్రంథస్థం చెయ్యడం నాకు ఇష్టమైన హాబీ.
(మళ్ళీ కలుద్దాం)
డా. కాళిదాసు పురుషోత్తం గారిది ప్రకాశం జిల్లా తూమాడు అగ్రహారం. వీరి తండ్రిగారు గొప్ప సంస్కృత పండితులు. నెల్లూరులో స్థిరపడ్డారు. జననం 1942 మే. ముగ్గురు అక్కలు, ఒక అన్నయ్య. పెద్దక్క, రచయిత మిగిలారు. పెద్దక్క 97వ ఏట ఏడాది క్రితం స్వర్గస్తులయ్యారు.
రచయిత బాల్యంలో నాయనగారి వద్ద సంస్కృతం కొద్దిగా చదువుకున్నారు. నెల్లూరు వి.ఆర్.హైస్కూలు, కాలజీలో విద్యాభ్యాసం, యం.ఏ. తెలుగు ఉస్మానియాలో ఫస్ట్ క్లాసులో, యూనివర్సిటీ ఫస్ట్ గానిలిచి, గురజాడ అప్పారావు స్వర్ణ పురస్కారం ఆందుకున్నారు. హైదరాబాద్, స్టేట్ ఆర్కైవ్సు వారి జాతీస్థాయి స్కాలర్షిప్ అందుకొని వెంకటగిరి సంస్థాన సాహిత్యం మీద పరిశోధించి 1971 సెప్టెంబర్‌లో డాక్టరేట్ అందుకున్నారు. 1972లో నెల్లూరులో శ్రీ సర్వోదయ డిగ్రీ కళాశాలలో చేరి, ఆ కళాశాల ప్రిన్సిపల్‌గా రిటైరై నెల్లూరులో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఫొటోగ్రఫీ, సినిమాలు, పర్యటనలు ఇష్టం. 15 సంవత్సరాలు మిత్రులతో కలిసి కెమెరా క్లబ్, ఫిల్మ్ సొసైటీ ఉద్యమం, దాదాపు పుష్కరకాలం నడిపారు. సాహిత్యం, సినిమా, యాత్రానుభవాలు వ్యాసాలు భారతినుంచి అన్ని పత్రికలలో అచ్చయ్యాయి.
2007లో దంపూరు నరసయ్య – ఇంగ్లీషు లో తొలి తెలుగు వాడిమీద పరిశోధించి పుస్తకం. 1988లో గోపినాథుని వెంకయ్య శాస్త్రి జీవితం, సాహిత్యం టిటిడి వారి సహకారంతో. డాక్టర్ మాచవోలు శివరామప్రసాద్ గారితో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాచ్య పరిశోధన శాఖ వారికోసం పూండ్ల రమకృష్ణయ్య అముద్రిత గ్రంథచింతామణి సంపుటాలనుంచి మూడువందల పుటల “అలనాటి సాహిత్యం” గ్రంథానికి సంపాదకత్వం, 2011లో కనకపుష్యరాగం పొణకా కనకమ్మ స్వీయచరిత్ర ప్రచురణ. మనసు ఫౌండేషన్ సహకారంతో AP Sate Archives లో భద్రపరచిన గురజాడ వారి రికార్డు పరిశీలించి స్వర్గీయ పెన్నేపల్లి గోపాలకృష్ణ, మనసు రాయుడు గారితో కలిసి “గురజాడ లభ్య సమగ్ర రచనలసంకలనం” వెలువరించారు. మనసు ఫౌండేషన్ వారి జాషువ సమగ్ర రచనల సంకలనంకోసం పనిచేశారు. 2014లో “వెంటగిరి సంస్థాన చరిత్ర సాహిత్యం” గ్రంథ ప్రచురణ.
2021లో పెన్నేపల్లి గోపాలకృష్ణతో కలిసి అనువదించిన”letters from Madras During the years 1836-39″ గ్రంథం ‘ఆమె లేఖలు’ పేరుతో అనువాదం. (ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్-ఎమెస్కో సంయుక్త ప్రచురణ).
పూండ్ల రామకృష్ణయ్య అముద్రిత గ్రంథచింతామణి ఆనాటి సాహిత్య దృక్పథాలు మీద మాచవోలు శివరామప్రసాద్, అల్లం రాజయ్య నవలలు, కథలు మీద కుమారి ఉభయ భారతి పిహెచ్.డి పరిశోధనలకు పర్యవేక్షణ. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ సంస్థాపక సభ్యులు, ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సభ్యత్వం.