పూనె ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యార్థులు నటన, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వంటి శాఖలలో చదువుతారు. ఎడిటింగ్ కోర్సు చదివే విద్యార్థులు సినిమా ఎడిటర్ టేబుల్ మీదే తయారవుతుందని గర్వంగా అనేవారు. ఆ రోజుల్లో ఇన్‌స్టిట్యూట్ డైరక్టర్ మూర్తి కన్నా, ఎడిటింగ్ శాఖలో ప్రొఫెసర్ కొడవటిగంటి రామచంద్రరావు అంటే విద్యార్థులు చాలా గౌరవంగా చెప్పుకొనేవారు. నేను పూనె ఫిల్మ్ అప్రీసియేషన్ కోర్సు చేస్తున్నప్పుడు వారిని కలిశాను. సినిమా ‘కూర్పు’లో ఎన్నో ఆధునిక విధానాలు వచ్చాయని వారు అన్నారు.
కూర్పు అంటే రష్యన్ డైరక్టర్ ఐజెన్‌స్టెయిన్ (Sergei Eisenstein) – Battleship Potemkin – సినిమా ఎవరికైనా గుర్తు రాకమానదు. 1905లో కాబోలు పొటమ్‍కిన్ నౌక లోని నావికులు జార్‍కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు. ఐజెన్‌స్టెయిన్ ఈ విప్లవాన్ని సినిమాగా అద్భుతంగా తీశాడు. Odessa Steps దృశ్యం ఎడిటింగ్ శిల్పానికి పరాకాష్ట.
పొటమ్‍కిన్ యుద్ధనౌకలో నావికులకు చెడిపోయిన తిండి పెట్టి దారుణంగా చూస్తుంది ప్రభుత్వం. నావికులు తిరుగుబాటుకు దిగడంతో రష్యన్ పోలీసుల క్రౌర్యానికి గురౌతారు. ఒడెస్సా నగర పౌరులు గుంపులు గుంపులుగా సహానుభూతి తెలియజేస్తూ తిరుగుబాటు చేసిన నావికుల పక్షాన చేరుతారు. జార్ పోలీసులు ప్రజల మీద దాడి చేసి విచక్షణారహితంగా కొడ్తారు, కాల్పులు జరుపుతారు. ఒడెస్సా ఓడ రేవు మెట్ల మీద ప్రజలు ఆత్మరక్షణకు పరుగులు తీయడం, వెనక పోలీసులు – ఈ దృశ్యాన్ని ఐజెన్‌స్టెయిన్ ఎడిటింగ్ శిల్పం ద్వారా అద్భుతంగా చిత్రించాడు. ఇప్పటికీ, ఎప్పటికీ ఈ సినిమా ప్రపంచంలో అతి గొప్ప చలన చిత్రాలలో ఒకటిగా నిలుస్తుంది.
Odessa Steps in Battleship Potemkin
1974-84 మధ్య ఫిల్మ్ సొసైటీ కార్యకర్తగా ఈ సినిమా ఫిల్మ్ సొసైటీల ప్రదర్శనకు అర్హమైనదని సినిమా చూచి ‘యోగ్యతాపత్రం’ ఈయవలసి వచ్చింది. ఆ రోజుల్లో ఫిల్మ్ సొసైటీలు కొనసాగాయంటే కమ్యూనిస్ట్ దేశాల రాయబార కార్యాలయాలు సరఫరా చేసిన 16 mm సినిమాల వల్లనే. తూర్పు, పశ్చిమ జర్మనీలు, హాలెండ్ వంటి దేశాల కార్యాలయాలు కూడా మాకు సినిమాలు సప్లై చేసేవి.
ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీ కేంద్ర కార్యాలయం కలకత్తాలోనో లేకపోతే ప్రధాన నగరాల్లోనో ఫెడరేషన్ ఎంపిక చేసిన ప్రతినిధుల ముందు విదేశీ ఎంబసీలు, కాన్సులేట్‌లు ప్రదర్శన ఏర్పాటు చేసేవి. ఆ విధంగా మద్రాసులో తాజ్ హోటల్‍లో రష్యన్ కాన్సులేట్ ఫిల్మ్ సొసైటీ ప్రతినిధులకు Battleship Potemkin ప్రదర్శించింది. మేము ఆ సినిమాకు సర్టిఫికెట్ ఇచ్చేదేమిటి? అట్లా రూల్సు. మొత్తం మీద మొదటి పర్యాయం Battleship Potemkin చూసినప్పుడు అవ్యక్తమైన ఆనందం మమ్మల్నందరినీ లోగొన్నది. ఆ తర్వాత నెల్లూరులో ఇతర చోట్ల ఈ సినిమా ప్రదర్శన ఏర్పాటు చేయగలిగాము, ఇస్‌కస్ (ఇండో సోవియట్ ఫ్రెండ్‌షిప్ సొసైటీ) సహకారంతో. ఇస్‍కస్ వారి వద్ద చాలా మంచి రష్యన్ 16 mm ప్రొజెక్టర్ ఉండేది. దానికి అనువైన స్క్రీన్ అన్నీ వారే ఏర్పాటు చేసేవారు.
రష్యన్లే సినిమా ఎడిటింగ్ శిల్పాన్ని మొదట మొదట చక్కగా వాడుకున్నారు. రెండు చిత్రాలను పక్కపక్కన పెట్టినప్పుడు కొత్త భావం ప్రేక్షకులలో కలుగుతుందని వాళ్ళు కనుగొన్నారు. టేబుల్ మీద ఆహారాన్ని చూపించి, వెంటనే బక్కచిక్కిన బాలుణ్ణి చూపితే ఒక భావం; ఆహారం దృశ్యం, వెంటనే స్థూలకాయుణ్ణి చూపితే హాస్యం – నవ్వు ప్రేక్షకులలో. దీన్నే మాంతాజ్ శిల్పం అంటారు. భిన్న దృశ్యాలున్న ఫిల్మ్ ముక్కముక్కల్ని కలిపి ఒక దృశ్యంగా చెయ్యడం అన్న మాట. నిశ్శబ్ద చిత్రాల్లో మాంతాజ్ శిల్పం ధ్వని లేని లోటును కొంతవరకు తీర్చగలిగేది. సంగీతాన్ని కూడా ఇలాగే ఎడిట్ చేసి మాంతాజ్ ప్రభావం కలిగించేవారు. ‘మాంతాజ్’ ఫ్రెంచి భాషా పదమట.
సినిమా సొసైటీ ప్రారంభించిన తొలి రోజుల్లోనే సోవియట్ బ్లాక్ దేశాల అనేక సినిమాలు 16 mm, 35 mm రెండూ మా సొసైటీలకు, ఫెడరేషన్, నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్, పూనె వారి ద్వారా అందడంతో సినిమాల సరఫరాకు దిగుల్లేకుండా పోయింది. ప్రపంచ యుద్ధం, నాజీ దుర్మార్గాలు, ఇట్లా అనేక అంతర్జాతీయ సమస్యల మీద సినిమాలు ప్రదర్శించాము. నెల్లూరులో కెంచం పురుషోత్తమరావు అనే వామపక్ష భావాలున్న వ్యక్తి ఇండోజర్మన్ (సోవియట్ బ్లాక్) సొసైటీ నెలకొల్పడంతో తూర్పు జర్మనీ సినిమాలు కూడా మాకు అందేవి.
రెండో ప్రపంచ యుద్ధం నాటి జర్మన్ సినిమాలో జర్మన్ సైనికాధికారి బంగళాలో పెద్ద పార్టీ, సంగీత కచ్చేరి జరుగుతూ ఉంటుంది. మధ్యలో ఏదో వార్త వచ్చి సైనికాధికారి బంగళా వెనుక గదిలోకి వెళ్తాడు. అక్కడ, ఇద్దరు ముగ్గురు యువతులను దారుణంగా హింసిస్తూంటారు. జనరల్ ఇంకాస్త తీవ్రంగా హింసలు పెట్టి వాళ్ళ చేత విషయం కక్కించమని మళ్ళీ కచేరీలో కూర్చుని తన్మయత్వంగా వింటూంటాడు. ఆ సినిమా చూచినపుడు కె.వి.ఆర్. చెప్పిన సంఘటన గుర్తొచ్చింది. గుంటూరులో కాబోలు గొప్ప సంస్కారవంతుడని పేరు పడ్డ పొలీసు ఉన్నతాధికారి ఉస్మానియా పి.జి. విద్యార్థినులను నక్సలైట్లనే అనుమానంతో నిర్బంధంలో ఉంచి బాధలు పెట్టించారట! ఆ దృశ్యాన్ని చూచిన పోలీసు కానిస్టేబుల్ అమ్మాయిలు కళ్ళు తిరిగి పడిపోయారట! ‘ఇలా కాదు టార్చర్ పెట్టడంలో మీకు శిక్షణ ఇప్పించాలి’ అన్నారట ఆ పోలీసు అధికారి.
సోషలిస్టు దేశాలే కాదు, హాలీవుడ్ కూడా ప్రపంచ యుద్ధం నేపథ్యంగా అద్భుతమైన సినిమాలు తీసింది. జర్మనీ పేరిస్‌ను ఆక్రమించుకొన్న తర్వాత, పేరిస్ మ్యూజియంలో ఉన్న గొప్ప కళాఖండాలన్నింటిని జర్మనీకి తరలించాలని జర్మన్ సైనికాధికారి ఆజ్ఞలు జారీ చేశాడు. వెంటనే సైనికులు కళాఖండాలన్నింటిని ప్రదర్శనశాల నుంచి ప్రత్యేక రైలులో తీసుకువెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తుంటారు.
ఆ రోజు రాత్రి మ్యూజియం కీపర్ – ఒక మహిళ రహస్యంగా రైల్వే కార్మికుల సంఘ నాయకులను కలుసుకొని, ఎలాగైనా ఆ రైలు సరిహద్దు దాటకుండా నిలిపి వేయాలని కోరుతుది. ఆ కార్మికులకు కళలు, చిత్రలేఖనం గురించి ఏమీ తెలియక పోయినా అనేక త్యాగాలు చేసి, రైలును దారి తప్పించి జర్మనీకి వెళ్ళకుండా చేస్తారు. చాలా గొప్ప డ్రామా, దేశభక్తికి ఇంతకన్నా మరో సాక్ష్యం అక్కరలేదు.
మేము ప్రదర్శించిన చిత్రాలలో జెకోస్లోవేకియా చిత్రం ‘ద కీ’ కూడా చిరస్మరణీయమైనది. ఈ సినిమా ‘ఎమర్జెన్సీ’ లోనే మా సభ్యులకు ప్రదర్శించాము. జిల్లా కలెక్టర్ అర్జునరావు, ఎస్.పి. జస్పాల్ సింగ్, జిల్లా జడ్జి రంగారెడ్డి గార్లు ప్రత్యేకంగా సినిమా చూడటానికే వచ్చారు. ఇంటర్వెల్‍లో వారికి టీలు ఇస్తున్నప్పుడు వాళ్ళు ‘ఇక్కడ జరుగుతున్నదిదే’ అని వ్యాఖ్యానించారు.
జర్మన్ అనుకూల ప్రభుత్వం జెక్‍లో అధికారం చేపట్టగానే ‘ప్రాహా’ లోని కమ్యూనిస్టు పార్టీ ఆఫీసు పైన దాడి తప్పదని, అక్కడ రికార్డంతా రహస్యంగా తరలిస్తారు. పార్టీ కార్యదర్శి గత్యంతరం లేక రెండంతస్తుల పై నుంచి దూకి తప్పించుకొనే ప్రయత్నంలో గాయపడి, స్పృహ కోల్పోతారు. అతనెవరో గుర్తు పట్టమని, గుర్తు పట్టినవారికి బహుమానం ఇస్తామని నాజీలు ‘ప్రాహా’ పట్టణంలో పౌరులందరిని దైవదర్శనానికి క్యూలో నిలబెట్టినట్లు నిలబెట్టి చూపిస్తారు. ఒకరు కూడా అతను మాకు తెలుసని చెప్పరు. అతని జోబిలో దొరికిన తాళం చెవి వంటి తాళం చెవులు వేలకు వేలు చేయించి ప్రాహాలో ఏ ఇంటి తాళమో గుర్తు పట్టడానికి నాజీలు చేసిన ప్రయత్నం ఫలించదు. ప్రజల సహాయంతో పార్టీ ఆఫీసు రహస్యంగా ఖాళీ చేస్తారు పార్టీ బాధ్యులు. దాదాపు డిటెక్టివ్ సినిమా పంథాలో నడిచినా దేశభక్తి, నాజీ వ్యతిరేకత పౌరుల్లో అశేష త్యాగాలకు స్ఫూర్తినిస్తుంది.
కోస్టా గావరా (Costa-Gavras) గ్రీకు సినిమా దర్శకుడు. రెండో ప్రపంచం యుద్ధం తర్వాత గ్రీకు దేశంలో 1967లో అధికారంలోకి వచ్చిన సైనిక నియంతృత్వం నాటి పరిస్థితులను ‘Z’ (జి – ఉచ్చారణ) కళ్ళకు కట్టినట్టు ప్రదర్శిస్తుంది. కేవలం గూఢచారి సినిమాల శిల్పాన్ని వాడుకుని ప్రభుత్వ నియంతృత్వంతో మనుషులు మాయం కావడం వంటి అంశం మీద రాజకీయ చైతన్యం కలిగిస్తాడు. సత్యాన్ని కనుగొనాలని ప్రయత్నం చేసిన న్యాయాధికారి ఒక రాజకీయ పార్టీ నాయకుడి హత్య, దాని వెనుక కుట్రను నిజాలను వెలికి తీస్తాడు. చూడడానికి ట్రాఫిక్ ప్రమాదంలో చనిపోయినట్లు ఆధారాలున్నా, జడ్జి గారికి అది ప్రమాదం చావు కాదనిపించి లోతుగా విచారణ జరుపుతాడు. సత్యాన్ని చెప్పిన వాళ్లు చివరకు వారి నిజాయితీకి బహుమతిగా ప్రాణాలర్పించవలసి వస్తుంది. సినిమా అనేక అంతర్జాతీయ పురస్కారాలను పొందింది. కానీ దర్శకుడు, నటించిన నటులు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని విదేశాలకు పారిపోవాల్సి వస్తుంది.
Z సినిమాలోని ఓ దృశ్యం
గ్రీకు భాషలో ‘Z’ అంటే He lives, చిరంజీవి అని అర్థమట! మా మనసు ఫౌండేషన్ మన్నం రాయుడు గారు వారి పెద్దబ్బాయికి Z అనే పేరు పెట్టారు!
(మళ్ళీ కలుద్దాం)
డా. కాళిదాసు పురుషోత్తం గారిది ప్రకాశం జిల్లా తూమాడు అగ్రహారం. వీరి తండ్రిగారు గొప్ప సంస్కృత పండితులు. నెల్లూరులో స్థిరపడ్డారు. జననం 1942 మే. ముగ్గురు అక్కలు, ఒక అన్నయ్య. పెద్దక్క, రచయిత మిగిలారు. పెద్దక్క 97వ ఏట ఏడాది క్రితం స్వర్గస్తులయ్యారు.
రచయిత బాల్యంలో నాయనగారి వద్ద సంస్కృతం కొద్దిగా చదువుకున్నారు. నెల్లూరు వి.ఆర్.హైస్కూలు, కాలజీలో విద్యాభ్యాసం, యం.ఏ. తెలుగు ఉస్మానియాలో ఫస్ట్ క్లాసులో, యూనివర్సిటీ ఫస్ట్ గానిలిచి, గురజాడ అప్పారావు స్వర్ణ పురస్కారం ఆందుకున్నారు. హైదరాబాద్, స్టేట్ ఆర్కైవ్సు వారి జాతీస్థాయి స్కాలర్షిప్ అందుకొని వెంకటగిరి సంస్థాన సాహిత్యం మీద పరిశోధించి 1971 సెప్టెంబర్‌లో డాక్టరేట్ అందుకున్నారు. 1972లో నెల్లూరులో శ్రీ సర్వోదయ డిగ్రీ కళాశాలలో చేరి, ఆ కళాశాల ప్రిన్సిపల్‌గా రిటైరై నెల్లూరులో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఫొటోగ్రఫీ, సినిమాలు, పర్యటనలు ఇష్టం. 15 సంవత్సరాలు మిత్రులతో కలిసి కెమెరా క్లబ్, ఫిల్మ్ సొసైటీ ఉద్యమం, దాదాపు పుష్కరకాలం నడిపారు. సాహిత్యం, సినిమా, యాత్రానుభవాలు వ్యాసాలు భారతినుంచి అన్ని పత్రికలలో అచ్చయ్యాయి.
2007లో దంపూరు నరసయ్య – ఇంగ్లీషు లో తొలి తెలుగు వాడిమీద పరిశోధించి పుస్తకం. 1988లో గోపినాథుని వెంకయ్య శాస్త్రి జీవితం, సాహిత్యం టిటిడి వారి సహకారంతో. డాక్టర్ మాచవోలు శివరామప్రసాద్ గారితో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాచ్య పరిశోధన శాఖ వారికోసం పూండ్ల రమకృష్ణయ్య అముద్రిత గ్రంథచింతామణి సంపుటాలనుంచి మూడువందల పుటల “అలనాటి సాహిత్యం” గ్రంథానికి సంపాదకత్వం, 2011లో కనకపుష్యరాగం పొణకా కనకమ్మ స్వీయచరిత్ర ప్రచురణ. మనసు ఫౌండేషన్ సహకారంతో AP Sate Archives లో భద్రపరచిన గురజాడ వారి రికార్డు పరిశీలించి స్వర్గీయ పెన్నేపల్లి గోపాలకృష్ణ, మనసు రాయుడు గారితో కలిసి “గురజాడ లభ్య సమగ్ర రచనలసంకలనం” వెలువరించారు. మనసు ఫౌండేషన్ వారి జాషువ సమగ్ర రచనల సంకలనంకోసం పనిచేశారు. 2014లో “వెంటగిరి సంస్థాన చరిత్ర సాహిత్యం” గ్రంథ ప్రచురణ.
2021లో పెన్నేపల్లి గోపాలకృష్ణతో కలిసి అనువదించిన”letters from Madras During the years 1836-39″ గ్రంథం ‘ఆమె లేఖలు’ పేరుతో అనువాదం. (ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్-ఎమెస్కో సంయుక్త ప్రచురణ).
పూండ్ల రామకృష్ణయ్య అముద్రిత గ్రంథచింతామణి ఆనాటి సాహిత్య దృక్పథాలు మీద మాచవోలు శివరామప్రసాద్, అల్లం రాజయ్య నవలలు, కథలు మీద కుమారి ఉభయ భారతి పిహెచ్.డి పరిశోధనలకు పర్యవేక్షణ. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ సంస్థాపక సభ్యులు, ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సభ్యత్వం.