1990 దశాబ్దంలో లదాక్‌లో పెద్ద ఎత్తున జరిగిన విద్యార్థుల ఉద్యమం విద్యావిధానాన్ని కుదిపివేసింది. ఈ ఉద్యమం తలఎత్తడానికి చారిత్రక కారణాలు బలంగా ఉన్నాయి.
జమ్ము కాశ్మీర్ రాష్ట్రం మూడు భాగాలుగా ఉండేది. జమ్మూలో హిందువులు, శ్రీనగర్ లోయలో ముస్లింలు అధిక సంఖ్యాకులు, కొద్ది మంది మాత్రమే హిందువులు, బౌద్ధులు. మిగిలిన లదాక్ లోని లే జిల్లాలో దాదాపుగా అందరూ మహాయాన బౌద్ధులు. అతి కొద్దిమంది క్రైస్తవులు, ముస్లింలు. కార్గిల్ జిల్లా అంతా షియా ముస్లింలే.
1991 వరకు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం స్కూళ్లలో ఉర్దూ మీడియంలో బోధించేవారు. పరిపాలనాభాష కూడా ఉర్దూనే. కాశ్మీరీల మాతృభాష కాశ్మీరీ. లదాకీల భాష లదాకీ, టిబెటియన్ మాండలికం. లదాకీ విద్యార్థులు మాతృభాష కాని ఉర్దూలో ప్రాథమిక విద్య నుండి 9వ తరగతి వరకూ చదువుతారు, 10వ తరగతి నుంచి ఇంగ్లీషు మీడియం. అందువల్ల లదాకీ విద్యార్థులు పదవ తరగతిలో విపరీతంగా తప్పేవారు. పాసయిన కొద్దిమందయినా శ్రీనగర్‌కో, జమ్మూకో వెళ్లి కాలేజీ చదువులు చదవాలి. Ethnic గా లదాకీలు వేరుగా కనిపిస్తారు కాబట్టి వారిపట్ల శ్రీనగర్‌లో కొంత వివక్ష కూడా ఉండేది.
సోనమ్ వాంగ్ ఛుక్ అర్ధ సంచార జాతులకు చెందిన గిరిజనుడు. కాశ్మీరు వేలీలో ఇంజనీరింగ్ చదివిన తర్వాత లదాకీల సమస్యల మీద, ప్రత్యేకంగా ఉర్దూ మాధ్యమానికి వ్యతిరేకంగా ఉద్యమించాడు. లదాక్‌లో ప్రజలంతా ఏదో ఒక బౌద్ధశాఖకు సంబంధించిన మఠానికి అనుబంధంగా ఉంటారు. ఈ మఠాలను గుంఫాలంటారు. గుంఫాల అధిపతులు ఉర్దూ మీడియంకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాన్ని సమర్థించడంతో ప్రభుత్వం దిగివచ్చింది. అందరికీ ఆమోదయోగ్యమైన ఇంగ్లీషు మాధ్యమం బళ్ళలో ప్రవేశపెట్టబడింది. ఈ సందర్భంలోనే లదాకీల జీవితాలకు, అనుభవాలకు సంబంధించని పాఠ్యాంశాలను తీసివేసి కొత్త పుస్తకాలు ప్రవేశపెట్టాలని కూడా ఉద్యమకారులు డిమాండ్ చేశారు.
లదాక్ శీతల ఎడారి. పదివేల అడుగులు ఎత్తనుంచి పదిహేడు వేల అడుగుల ఎత్తు వరకు ఉన్న ప్రదేశాల్లో ప్రజలు జీవిస్తారు. పగలు ఎండ, చలి, రాత్రి భయంకరమైన చలి. షయోక్ లోయలో కొద్దిగా కూరలు, పండ్ల చెట్లు వేస్తారు. లదాకీలకు యాక్ ఎద్దు మాంసం ప్రధాన ఆహారం. చేపలు తినరు. అనేక చిన్న చిన్న ప్రాణులను చంపి కడుపు నింపుకోడం కన్నా ఒక పెద్ద జంతువును చంపి తక్కువ హింసతో కడుపు నింపుకోడం మేలని వారి భావన. కొండల్లోంచి జాలువారే జలధారలు వాడుకొంటారు. మే నుంచి సెప్టెంబరు చివరి దాకా బార్లీ వంటి పంటలు కొద్దిగా పండిస్తారు. ఆ తర్వాత సుదీర్ఘ శీతాకాలం. ఉష్ణోగ్రత కొన్ని చోట్ల మైనస్ 40 డిగ్రీల వరకు పడిపోతుంది ఇటువంటి వారికి రైళ్లు, సినిమా హాళ్ళు, వరిపంటలు, ఫ్యాక్టరీల గురించి పాఠ్యాంశాలుగా పెట్టి ఏం ప్రయోజనం? ఏనుగు, కప్ప వంటి ప్రాణులను లదాకీలు ఎరగరు. లదాకీ శిశువులకు వీటిమీద పాఠాలు ఎందుకు? ఆ ఉద్యమంలో పాఠ్యాంశాల ఎంపిక కూడా ఒక సమస్యగా ముందుకు వచ్చింది. సెక్‌మోల్ సంస్థ లదాకీల సాంస్కృతిక పునరుజ్జీవనానికి ప్రతీకగా నిలిచింది.
ఉద్యమం ముగిసిన తర్వాత సోనమ్ వాంగ్ ఛుక్ లే టౌన్‌కు 18 కి.మీ దూరంలో సింధూతీరంలో ఫే అనే పల్లెలో SECMOL సంస్థను నెలకొల్పారు. 1994 నుంచి 98 వరకు భవనాల నిర్మాణం సాగింది. సంప్రదాయ నిర్మాణ పద్ధతులను ఉపయోగించి, విశేషంగా పొదుపు చేసి, మూడు రెసిడెన్షియల్ భవనాలు, 20 చిన్న చిన్న గదులు, విశాలమైన పాఠశాల భవనం పూర్తి చేశారు. పాఠశాల గదులన్నిటిని సౌరశక్తితో వేడిగా ఉంచే విధానం ప్రవేశపెట్టారు. మొత్తం విద్యార్థులు, టీచర్లకు సౌరశక్తితో పనిచేసే పాకశాల ఏర్పాటయింది. సంప్రదాయ ఇంధనాలకు బదులుగా ప్రత్యామ్నాయ ఇంధనాలు అభివృద్ధి చేయడం కూడా ఈ సంస్థ ఆశయాలలో ఒకటి.
సెక్‌మోల్ ప్రధాన భవంతి
40 మంది విద్యార్థులు, కొద్ది మంది టీచర్లు, కొందరు విదేశాలనుంచి వచ్చి కొద్ది కాలం పాఠాలు చెప్పి వెళ్ళే వలంటీర్లు.
ఈ సంస్థలో పదవ తరగతి తప్పిన విద్యార్థులకు కరెంటు పనులు, ప్లంబరింగ్, కొయ్యపని వంటి వృత్తివిద్యల్లో శిక్షణ, మేథ్స్, సైన్సు, ఇంగ్లీషు పాఠాలు చెప్పి పదవ తరగతి పరీక్షలు రాయించేవారు. స్పోకెన్ ఇంగ్లీషులో శిక్షణ ఇచ్చేవారు.
సెక్‌మోల్ స్కూలు హాస్టల్ గది
బెకి అనే అమెరికా దేశపు యువతి స్వచ్ఛందంగా వాంగ్ ఛుక్ బృందంలో చేరి, లదాకీ అధ్యాపకుణ్ణి పెళ్ళాడి సెక్మోల్ లోనే స్థిరపడ్డారు. ఇంకా అనేక దేశాల నుంచి ఆ స్కూల్లో కొంతకాలం పనిచేసి తిరిగి తమ దేశాలకు వెళ్లిపోయే స్వచ్ఛంద కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. మా పెద్దబ్బాయి ఒక శీతాకాలం ఛాంగ్‌తాంగ్ సరస్సు ప్రాంతంలో, షచుకుల్ పల్లెలో ఏర్పాటు చేసిన శీతాకాల శిబిరంలో గణితం బోధించాడు.
రచయిత బృందం బస చేసిన లాడ్జ్ యజమానులు
Secmol సంస్థ లదాకీల ప్రత్యేక సమస్యలను పరిష్కరించడానికి పూనుకొన్నది. లదాక్‌లో శీతాకాలం విపరీతంగా మంచు పడుతుంది. వేసవిలో దూరంగా కొండలమీదినుంచి మంచు కరిగి ప్రవహించే నీటిధారల వద్దకు వెళ్ళి నీరు తెచ్చుకోవాలి. ఐస్ పిరమిడ్ లను ఏర్పాటుచేసి త్రాగునీరు సమస్యకు పరిష్కారం కనుగొన్నది Secmol. శీతాకాలంలో కురిసిన మంచును పెద్ద పిరమిడ్ లాగా తయారు చేస్తారు. కొంత కరిగినా వేసవిలో ఆ మంచు కరిగిన నీటిని వాడుకోవచ్చు.
సెక్‌మోల్‌లో రచయిత బృందం
లదాక్‌లో విద్యుత్ కూడా సమస్యే. రోజులో సప్లై కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. శీతాకాలమైనా, వేసవి అయినా గదులు వేడిచేసుకోడానికి ఇంధనం సమస్యే. లదాక్‌లో ఏడాది పొడవునా ఆకాశం మబ్బులు లేకుండా స్వచ్ఛంగా ఉంటుంది. కనీసం 300 రోజులు ఆకాశం నిర్మలంగా ఉంటుంది. రాత్రివేళ ఎంత చలో పగలు అంత ఎండ కాస్తుంది. ఈ సంస్థలో సౌరశక్తితో పనిచేసే హీటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. గృహనిర్మాణంలో మెలకువలు వగైరా అనేక నూతన ఆవిష్కరణలను, విధానాలను సెక్మోల్ సంస్థ ప్రవేశపెట్టింది.
రచయిత బృందాన్ని తమ పాటలతో ఆనందింపజేసిన సెక్‌మోల్ పిల్లలు
ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా పద్ధతులు అభివృద్ధి చెయ్యడం, లదాకీ యువతకు పర్యావణం గురించి తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియజెయ్యడం, లదాకీ చరిత్ర, సంస్కృతి, వ్యవసాయం, పంటలు, ఆరోగ్యం వంటి విషయాలలో చైతన్యం కలిగించడం మొదలైన కార్యక్రమాలు ఈ సంస్థ విజయవంతంగా పూర్తిచేసింది. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణలో ఇదొక పెనుమార్పును తెచ్చిందని అంటారు. గ్రామీణ పాఠశాలల నిర్వహణలో పల్లీయులు స్వచ్ఛందంగా పాల్గొనేందుకు ప్రోత్సహించడంతో లదాకీ విద్యావిధానంలో గణనీయంగా మార్పు వచ్చింది. మధ్యలో చదువు మానుకొన్న బాలలకు Secmol వృత్తివిద్యల్లో శిక్షణ ఇచ్చింది.
2010లో లే నగరంలో అనూహ్యంగా Cloudburst వల్ల ప్రళయకాలంలో కురిసినట్లు రెండు రోజులు ఏకధాటిగా వర్షం కురిసి ఇళ్ళకు ఇళ్ళే కొట్టుకొని పోయాయి. 400 మందికి పైగా అదృశ్యమయ్యారు. ఎందరో నిరాశ్రయులయ్యారు. కొండల వాలుల్లో నిర్మించిన వందల ఇళ్ళు ఆనవాళ్లు లేకుండా పోయాయి. లే చరిత్రలో కనివిని ఎరుగని ఉపద్రవం. మనిషి ప్రకృతి నియమాలను పాటించకపోవడంవల్లే ఈ ప్రళయం సంభవించిందని శాస్త్రవేత్తలు ఘోషించారు.
లదాక్ గ్రామీణ ప్రాంతాలనుంచి లే నగరానికి వలసలు వచ్చి ఎక్కడ పడితే అక్కడ ఇళ్ళు కట్టుకొని స్థిరపడ్డారు. యిప్పుడు కేవలం లదాక్ జనాభాలో కేవలం అయిదు శాతంకంటే తక్కువమందే గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మిగతా ప్రజలు లే కు వచ్చేశారు. జలప్రళయంలో ఇళ్ళు కోల్పోయిన వారికి సిమెంటు, మట్టి కలిపి తక్కువ ఖర్చుతో చేసిన ఇటుకలతో పర్యావరణ అనుకూలమైన ఇళ్ళ నమూనాలు సెక్మోల్ సంస్థ తయారు చేసి ఇచ్చింది.
థిక్సే మఠం
2000 నుంచి సెక్మోల్ సంస్థ, సోనమ్ వాంగ్ ఛుక్ పేరు ప్రసిద్ధిలోకి రావడం మొదలై ఆయన కృషికి గుర్తింపు లభించింది. ఎన్నో బహుమతులు, పురస్కారాలు, జాతీయ అంతర్జాతీయ గౌరవాలు ఆయనకు లభించాయి. రామన్ మెగాసెసే పురస్కారం అందుకున్నారు. పత్రికలు కవర్ పేజీలలో ఆయన చిత్రాన్ని ముద్రించి గౌరవించాయి. ఇప్పుడు సెక్మోల్‌ను విశ్వవిద్యాలయంగా మార్చే ప్రయత్నాలు సాగుతున్నవి. విశ్వవిద్యాలయం వస్తే భూమార్గంలో ప్రయాణం చేసి శ్రీనగర్‌కో, జమ్మూకో వెళ్ళే ప్రయాస లదాకీలకు తప్పుతుంది. లదాకీలకు భూమార్గం ఆరునెలలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మిగతా ఆరునెలల్లో ఖరీదయిన విమాన ప్రయాణమే అందుబాటులో ఉంటుంది. లదాక్‌కు కులు, మనాలి మీదుగా ఒక రోడ్ మార్గం ఉన్నా, అదీ శ్రీనగర్, కార్గిల్ మార్గంలాగే ఆరునెలలే తెరచి ఉంటుంది.
థిక్సే మఠం
మా చాంగ్‌తాంగ్ యాత్రలో గైడ్‌గా వ్యవహరించిన యువతి సోనమ్ Secmol సంస్థ shachukul పల్లెలో ఏర్పాటు చేసిన ఐస్ హాకీలో శిక్షణ తీసుకొని, తర్వాత డార్జిలింగ్‌లో శిక్షణ పొంది బీజింగ్‌లో జరిగిన ఆసియా ఐస్ హాకీ క్రీడల పోటీల్లో పాల్గొన్నది. మరొక గైడ్ డోల్మా ఇక్కడే చదువుకొని ఇప్పడు టూరిస్ట్ ఆపరేటర్‌గా సుఖజీవనం గడుపుతోంది. లడాకీలకు సైన్యంలో ఉద్యోగాలు, లేదా సైన్యానికి చాలా ఎత్తయిన ప్రదేశాల్లో బరువులు మోయడం వంటి పనులలో ఉపాధి దొరుకుతుంది. మిగతా వాళ్ళు టూరిజంలో ఉపాధి పొందుతారు.
థిక్సే మఠం
2016 మార్చి నెలలో ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయి పాండిచ్చేరిలో ఫ్రెంచ్, ఇంగ్లీష్ భాషల్లో శిక్షణ తీసుకొని లదాక్ తిరిగి వెళ్తూ నెల్లూరులో మా అతిథులుగా రెండుమూడు రోజులున్నారు. మరొక పర్యాయం ఇద్దరమ్మాయిలు మా అతిధులుగా రెండు వారాలు ఉన్నారు. వీలయినంతలో వారికీ చూపించదగిన విశేషాలన్నీ చూపించి పంపాము. వీళ్ళు లే లో పర్యాటకుల కోసం మంచి లదాకీ రుచులను పరిచయం చేసే భోజనశాలను నిర్వహిస్తున్నారు. Mainland కు దూరంగా ఉండడం, ఉపాధి సౌకర్యాలు, విద్యావకాశాలు తక్కువగా ఉండడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించి అక్కడి యువజనులు సాహసంతో కొత్త అవకాశాలను అందిపుచ్చుకొంటున్నారు. Secmol సంస్థ ఈ మార్పులకు గొప్ప దోహదం చేసింది.
(మళ్ళీ కలుద్దాం)
డా. కాళిదాసు పురుషోత్తం గారిది ప్రకాశం జిల్లా తూమాడు అగ్రహారం. వీరి తండ్రిగారు గొప్ప సంస్కృత పండితులు. నెల్లూరులో స్థిరపడ్డారు. జననం 1942 మే. ముగ్గురు అక్కలు, ఒక అన్నయ్య. పెద్దక్క, రచయిత మిగిలారు. పెద్దక్క 97వ ఏట ఏడాది క్రితం స్వర్గస్తులయ్యారు.
రచయిత బాల్యంలో నాయనగారి వద్ద సంస్కృతం కొద్దిగా చదువుకున్నారు. నెల్లూరు వి.ఆర్.హైస్కూలు, కాలజీలో విద్యాభ్యాసం, యం.ఏ. తెలుగు ఉస్మానియాలో ఫస్ట్ క్లాసులో, యూనివర్సిటీ ఫస్ట్ గానిలిచి, గురజాడ అప్పారావు స్వర్ణ పురస్కారం ఆందుకున్నారు. హైదరాబాద్, స్టేట్ ఆర్కైవ్సు వారి జాతీస్థాయి స్కాలర్షిప్ అందుకొని వెంకటగిరి సంస్థాన సాహిత్యం మీద పరిశోధించి 1971 సెప్టెంబర్‌లో డాక్టరేట్ అందుకున్నారు. 1972లో నెల్లూరులో శ్రీ సర్వోదయ డిగ్రీ కళాశాలలో చేరి, ఆ కళాశాల ప్రిన్సిపల్‌గా రిటైరై నెల్లూరులో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఫొటోగ్రఫీ, సినిమాలు, పర్యటనలు ఇష్టం. 15 సంవత్సరాలు మిత్రులతో కలిసి కెమెరా క్లబ్, ఫిల్మ్ సొసైటీ ఉద్యమం, దాదాపు పుష్కరకాలం నడిపారు. సాహిత్యం, సినిమా, యాత్రానుభవాలు వ్యాసాలు భారతినుంచి అన్ని పత్రికలలో అచ్చయ్యాయి.
2007లో దంపూరు నరసయ్య – ఇంగ్లీషు లో తొలి తెలుగు వాడిమీద పరిశోధించి పుస్తకం. 1988లో గోపినాథుని వెంకయ్య శాస్త్రి జీవితం, సాహిత్యం టిటిడి వారి సహకారంతో. డాక్టర్ మాచవోలు శివరామప్రసాద్ గారితో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాచ్య పరిశోధన శాఖ వారికోసం పూండ్ల రమకృష్ణయ్య అముద్రిత గ్రంథచింతామణి సంపుటాలనుంచి మూడువందల పుటల “అలనాటి సాహిత్యం” గ్రంథానికి సంపాదకత్వం, 2011లో కనకపుష్యరాగం పొణకా కనకమ్మ స్వీయచరిత్ర ప్రచురణ. మనసు ఫౌండేషన్ సహకారంతో AP Sate Archives లో భద్రపరచిన గురజాడ వారి రికార్డు పరిశీలించి స్వర్గీయ పెన్నేపల్లి గోపాలకృష్ణ, మనసు రాయుడు గారితో కలిసి “గురజాడ లభ్య సమగ్ర రచనలసంకలనం” వెలువరించారు. మనసు ఫౌండేషన్ వారి జాషువ సమగ్ర రచనల సంకలనంకోసం పనిచేశారు. 2014లో “వెంటగిరి సంస్థాన చరిత్ర సాహిత్యం” గ్రంథ ప్రచురణ.
2021లో పెన్నేపల్లి గోపాలకృష్ణతో కలిసి అనువదించిన”letters from Madras During the years 1836-39″ గ్రంథం ‘ఆమె లేఖలు’ పేరుతో అనువాదం. (ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్-ఎమెస్కో సంయుక్త ప్రచురణ).
పూండ్ల రామకృష్ణయ్య అముద్రిత గ్రంథచింతామణి ఆనాటి సాహిత్య దృక్పథాలు మీద మాచవోలు శివరామప్రసాద్, అల్లం రాజయ్య నవలలు, కథలు మీద కుమారి ఉభయ భారతి పిహెచ్.డి పరిశోధనలకు పర్యవేక్షణ. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ సంస్థాపక సభ్యులు, ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సభ్యత్వం.