పగటి కలలు నిజం కావు!
పగటి కలలు నిజం కావు. రాత్రి కలలూ నిజం కావు. కొందరు తమ స్వప్నాలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. కొందరు జీవితం పట్ల డిటాచ్డ్గా, దూరం నుంచి ఏదో ప్రదర్శనను చూస్తున్నట్లు, తాము నిమిత్తమాత్రులైనట్లు ఉంటారు. ఈరోజు వేకువన నేను మళ్ళీ యువజనం మధ్య కళాశాలలో ఉన్నట్లు ఒక స్వప్నం. సుప్త చైతన్యంలోని భావనలే స్వప్న రూపంలో వ్యక్తమవుతాయని శాస్త్రవేత్తలు అంటారు.
మొన్న మేడేతో పాటు నా 81 పుట్టిన రోజున ఫేస్బుక్ మిత్రులు ఊహించని రీతిలో అభినందించారు, కొందరు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. మా పెద్దబ్బాయి కుటుంబం ప్రత్యేకంగా హైదరాబాదు నుంచి వచ్చి ఆ రోజు మాతో గడపటం ప్రత్యేకంగా అనిపించింది.
నన్ను అభినందించిన మిత్రుల్లో ఒకరు “మనం ఎంత కాలం బ్రతుకుతాం? మన జీవితాలకు అర్థం ఉందా?” అంటూ నిరాశగా మాట్లాడాడు. “నేను ఆరోగ్యంగా జీవించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రకృతి ధర్మానికి అనుగుణంగా క్రమశిక్షణతో జీవిస్తాను” అని సమాధానం చెప్పవలసి వచ్చింది. వయసు తెచ్చే మార్పులను సహజమైనవని సంతోషంగా స్వీకరిస్తాను. 16 నెలలుగా రోజుకు ఒక లీటరు మంచినీళ్ళతో, ఉప్పు లేని భోజనాన్ని సంతోషంగా ఆనందించగలుగుతున్నాను. క్షణం పాటు కూడా వైద్యులు నిషేధించిన పదార్థాలను తినాలనే కోర్కె, చపలత్వం, ఆలోచన మనసులోకి రాలేదు. గొప్పలు చెప్పుకోవడానికో, సానుభూతి పొందడానికో కాదు. జీవితం పట్ల నా అవగాహనను తెలియజేయడానికే రాయవలసి వచ్చింది. పుష్కర కాలం క్రితం పళ్ళు, కొబ్బరినీళ్ళు పనికిరావని వైద్యులు చెప్పిన సలహాను తు.చ. తప్పకుండా పాటించాను. కాశిలో మిత్రులు ఇష్టమైన ఫలాలు, కూరలు విడిచిపెడుతుంటే, ఆ రోజు నాకేమీ వదలాలని అనిపించలేదు.
నా ఖాళీ సమయాన్ని పుస్తక పఠనంలో, మిత్రులతో ఫోన్లో సంభాషించడంతో, కొంత సమయం రచనకు కేటాయించుకున్నాను. డెస్క్‌టాప్ కంప్యూటర్ ముందు కూర్చుని రోజు రెండు గంటలకు తక్కువ కాకుండా హిందూ వగైరా పత్రికలన్నీ చదువుతాను; హిందూ చదివేవారు తగ్గిపోయారని అంటారు కానీ, రోజూ కాఫీ తాగడం మాదిరే హిందూ పఠనం కూడా ఒక వ్యసనం లాంటిదే.
పదవీ విరమణ తర్వాత, కొందరు బాల్యమిత్రులు స్నేహాన్ని పునరుద్ధరించుకొన్నారు. పదేళ్ళ క్రితం బాల్యమిత్రుడు మోహన్ రెడ్ది మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చి, తనెవరో చెప్పమంటే గుర్తు పట్టలేకపోయాను. నా జ్ఞాపకాల్లో అతడి కోమలమైన రూపం మాత్రమే నిక్షిప్తమై ఉంది మరి! మోహన్ విశాఖలో ఏదో పరిశ్రమకు న్యాయ సలహాదారుగా చేసి, నెల్లూరు మీది ప్రేమతో వచ్చి స్థిరపడ్డా; తరచూ అమెరికా, ఇంగ్లాండు, ఇండియాల మధ్య చక్కర్లు కొడుతూ ఉంటాడు. తనకి నెల్లూరంటే తగని ప్రేమ.
‘దంపూరు నరసయ్య’ పరిశోధన గ్రంథంలో నా గురించి రెండు మాటలు రాసుకుంటూ ‘నెల్లూరు వాడిని’ అని చెప్పుకొంటే, మిత్రులొకరు ‘నెల్లూరైతే ఏం గొప్ప’ అన్నాడు హాస్యంగా. తనదీ నెల్లూరే. ఏమో, ఆనాటి నెల్లూరు ఇప్పటి నెల్లూరు కాదు. నగరం గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. నేను ప్రేమించేది ఈ నగరాన్నా? ఇక్కడి మనుషులనా? నా మటుకు నెల్లూరు వాళ్ళ మాటలు వినబడగానే ఏదో అభిమానం పుట్టుకొచ్చేస్తుంది.
వెనక్కి తిరిగి చూస్తే, బాల్యమిత్రులు, జీవితాంతం ఆత్మీయంగా మెలిగిన మిత్రులు కొందరు ముందుగానే వెళ్ళిపోయారు. కళాప్రపూర్ణ మరుపూరు కోదండరామరెడ్ది కుమారుడు తరుణేందు శేఖర్ రెడ్డి శైశవం నుండి మిత్రుడు. తను సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజరుగా చేస్తూ స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశాడు. వాడి జ్ఞాపకశక్తి అమోఘం. ఏకసంథాగ్రాహి. వాడి లెక్క ఎప్పుడూ తప్పదు. ‘నెల్లూరు క్లబ్’ కార్యదర్శి పదవి కోసం హత్యాకాండ వరకు ఘర్షణలు కొనసాగిన తర్వాత, మా మిత్రుడిని ఇరువర్గాలవారు కార్యదర్శిని చేశారు, రాజీగా. మావాడు అజాతశత్రువు. ఒకసారి కాదు, రెండు టర్మ్‌లు ఏకగ్రీవంగా ఎంపికై క్లబ్‌కు సారథ్యం వహించాడు. శేఖర్‌కు బాల్యం నుంచీ హాలీవుడ్ సినిమాల పిచ్చి. మద్రాసు, బాంబేకు గూడా సినిమాల కోసం వెళ్ళేవాడు. తను, నేను, మరొక మిత్రుడు సింగరాజు ప్రసాద్ కలిసి నెల్లూరులో ప్రోగ్రెస్సివ్ ఫిల్మ్ అసోసియేషన్ పేరుతో ఫిల్మ్ సొసైటీ పదేళ్ళకు పైగా నిర్వహించి, నెల్లూరీయుల కళాతృష్ణను కొంత తీర్చగలిగాము.
ఆంధ్రపదేశ్ ఉపాధ్యాయ సంఘం నిర్మాత సింగరాజు రామకృష్ణయ్య కుమారుడు రాజేంద్ర ప్రసాద్ హైస్కూలులో, కళాశాలలో నా సహాధ్యాయి. వాడిలో ఏదో తెలియని ఆకర్షణ. ఎప్పుడూ వాడి చుట్టూ స్నేహితులు. చివరి శ్వాస విడిచేవరకూ వాణ్ణి స్నేహితులు విడిచిపెట్టలేదు. అమెరికా నుంచి వెనక్కి వచ్చిన వారం లోపల కావచ్చు, ఒక రోజు ఎవరో ఫోన్ చేసి, “మీకు సింగరాజు ప్రసాద్ ఏమవుతారు?” అని అడిగారు. “మీరెవరు?” అని నేను అడిగాను. “నేను డాక్టర్‌ను. ప్రసాద్ గారు మా హాస్పిటల్లో చనిపోయారు. మీ ఫోన్ నెంబరు రాసిన చీటీ దిండు కింద పెట్టారు” అన్నారు అవతల్నించి డాక్టర్.
ఎం.ఎ.లో నా సహాధ్యాయులు ఎం.వి.ఎల్., డాక్టర్ టిప్పిరెడ్డి ప్రభాకరరెడ్డి చివరిదాకా స్నేహాన్ని కొనసాగించారు. ఎన్నో స్నేహాలు, పరిచయాలు. తలచుకొంటే ఉసుళ్లపుట్ట రేగినట్టు ఎన్నో ఆత్మీయమైన జ్ఞాపకాలు.
వాట్సప్ ద్వారా బాల్యమిత్రులు ఇప్పుడు మళ్ళీ దగ్గరయ్యారు. అల్లాడి కృష్ణ రాజేంద్ర నాకన్నా రెండేళ్ళు చిన్నవాడు. నెల్లూరు ప్రసిద్ధ వైద్యులు అల్లాడి మహాదేవయ్య 9వ సంతానం. రాజేంద్ర తల్లి అన్నపూర్ణమ్మ మామిడిపూడి వెంకటరంగయ్య గారి కుమార్తె. గొప్ప సంఘసేవిక. రాజేంద్ర పి.యు.సి.లో కలిశాడు. ఆ తరువాత ఆరు దశాబ్దాలు తర్వాత మళ్ళీ స్నేహాన్ని పునరుద్ధరించుకొన్నాము. తను అఖిల భారత స్థాయి ఇంజనీరింగ్ సర్వీసెస్‌కు ఎంపికై, ఇప్పుడు మద్రాసులో స్థిరపడ్డాడు. కరోనా భయంతో నెల్లూరు వీధులు నిర్మానుష్యంగా మారిన సమయంలో నా చిరునామా తెలుసుకొని, ఎట్లాగో, నా హైస్కూలు సహాధ్యాయి డాక్టర్ బందుగుల సుబ్రహ్మణ్యం చూడడానికి వచ్చాడు. నేను ఉస్మానియాకు, తను ఎస్.వి.కి వెళ్ళిన తరువాత ఒకరిని గురించి ఒకరికి తెలీదు. తను బాబా అటామిక్ ఎనర్జీలో సీనియర్ సైంటిస్ట్‌గా చేసి బెంగుళూరులో స్థిరపడ్డాడట! ముదిమికి వెనుక చూపుకి సంబంధమేమిటా?
ఆచార్య శలాక రఘునాథశర్మగారు నాకన్నా ఏడాది పెద్ద. ఎం.ఎ.లో నాకు జూనియర్. తరచుగా కలుసుకోలేకపోయినా మా మధ్య విద్యార్థి దశ నాటి ఆత్మీయత అట్లాగే ఉండిపోయింది. 1999లో చిన్న పని మీద అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి వెళ్తే, యాదృచ్ఛికంగా శలాక వారు కలిశారు. నా సమస్య చెప్పగానే వారు నన్ను రిజిస్ట్రార్ గారికి పరిచయం చేసి నా పని చేసి పెట్టమని కోరడమేమిటి, మధ్యాహ్నానికల్లా నేను వెళ్ళిన పని పూర్తయింది. నిన్న వారితో ఆత్మీయంగా మా విశ్వవిద్యాలయ జీవితం గురించి, దివాకర్ల వారి గురించి ఆనందంగా, ఆత్మీయంగా మాట్లాడుకున్నాం.
ఇప్పుడు ముదిమిలో కొత్త పరిచయాలు, మిత్రులు… నాకంటే పదేళ్ళు చిన్నవాడైన పారిశ్రామికవేత్త మల్పూరు విజయభాస్కర రెడ్డి నిరంతర పర్యాటకులు. కరోనా ఒక్కటే ఆయన్ని కట్టిపడేసింది ఇంటి వద్ద. తను ఏ ప్రదేశానికి వెళ్ళినా, యాత్రా విశేషాలు వివరించి చెప్తారు, ఫోటోలు, వీడియోలు చూపించి సంతోషపెడతారు. అన్నీ నేను స్వయంగా వెళ్ళి చూసినంత ఇదిగా మురిసిపోతాను. మా తోడల్లుడి కుమారుడు రాం చెరువు లాసా మీదుగా మానస సరోవర యాత్ర చేసి, వివరాలు వాయిస్ మెసేజ్‌ల ద్వారా పంపిస్తే, ఆ సందేశాలన్నీ శ్రద్ధగా విని, అతని మానస సరోవర యాత్రను వ్యాస రూపంలో పెట్టాను. మే మిసిమిలో ఆ వ్యాసం చదవండి.
అమావాస్యకు, పున్నమికి ఏదో వ్యాసం రాసి పత్రికలకు పంపుతాను. అమ్మనుడి పత్రికకు రాసినా, రాయకపోయినా, తరచూ సామల రమేష్ గారితో భాషా విషయాలు చర్చిస్తూ ఆనందిస్తాను. నాకన్నా చిన్నవారు ఆచార్య నిత్యానంద రావు ఏ భోగట్టా అవసరమైనా క్షణాల్లో స్పందిస్తారు. మనసు ఫౌండేషన్ డాక్టర్ ఎం.వి. రాయుడు గారితో పరిచయం, స్నేహం పుష్కరకాలంగా సాగుతోంది. పుస్తకాలు, పత్రికలు, సాహిత్యం మమ్మల్ని కలిపిన వారధిలో భాగాలు.
జీవితంలో ఎంతో కొంత చేశానన్న సంతృప్తి కంటే ఎన్నో చేయవలసిన పనులు చేయలేకపోయానన్న కొరత. ఏమైనా జీవితం నా పట్ల ఎంతో దయ చూపిందనే నా భావన. దాదాపుగా ఏడాదిగా తెలుగు సాహిత్య వేదిక ‘సంచిక’లో నా అభిప్రాయాలు పంచుకోను వీలు కల్పించిన కస్తూరి మురళీకృష్ణ గారికి వారి సహ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుకొంటూ ఈ వారానికి సెలవు తీసుకుంటున్నాను.
(మళ్ళీ కలుద్దాం)
డా. కాళిదాసు పురుషోత్తం గారిది ప్రకాశం జిల్లా తూమాడు అగ్రహారం. వీరి తండ్రిగారు గొప్ప సంస్కృత పండితులు. నెల్లూరులో స్థిరపడ్డారు. జననం 1942 మే. ముగ్గురు అక్కలు, ఒక అన్నయ్య. పెద్దక్క, రచయిత మిగిలారు. పెద్దక్క 97వ ఏట ఏడాది క్రితం స్వర్గస్తులయ్యారు.
రచయిత బాల్యంలో నాయనగారి వద్ద సంస్కృతం కొద్దిగా చదువుకున్నారు. నెల్లూరు వి.ఆర్.హైస్కూలు, కాలజీలో విద్యాభ్యాసం, యం.ఏ. తెలుగు ఉస్మానియాలో ఫస్ట్ క్లాసులో, యూనివర్సిటీ ఫస్ట్ గానిలిచి, గురజాడ అప్పారావు స్వర్ణ పురస్కారం ఆందుకున్నారు. హైదరాబాద్, స్టేట్ ఆర్కైవ్సు వారి జాతీస్థాయి స్కాలర్షిప్ అందుకొని వెంకటగిరి సంస్థాన సాహిత్యం మీద పరిశోధించి 1971 సెప్టెంబర్‌లో డాక్టరేట్ అందుకున్నారు. 1972లో నెల్లూరులో శ్రీ సర్వోదయ డిగ్రీ కళాశాలలో చేరి, ఆ కళాశాల ప్రిన్సిపల్‌గా రిటైరై నెల్లూరులో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఫొటోగ్రఫీ, సినిమాలు, పర్యటనలు ఇష్టం. 15 సంవత్సరాలు మిత్రులతో కలిసి కెమెరా క్లబ్, ఫిల్మ్ సొసైటీ ఉద్యమం, దాదాపు పుష్కరకాలం నడిపారు. సాహిత్యం, సినిమా, యాత్రానుభవాలు వ్యాసాలు భారతినుంచి అన్ని పత్రికలలో అచ్చయ్యాయి.
2007లో దంపూరు నరసయ్య – ఇంగ్లీషు లో తొలి తెలుగు వాడిమీద పరిశోధించి పుస్తకం. 1988లో గోపినాథుని వెంకయ్య శాస్త్రి జీవితం, సాహిత్యం టిటిడి వారి సహకారంతో. డాక్టర్ మాచవోలు శివరామప్రసాద్ గారితో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాచ్య పరిశోధన శాఖ వారికోసం పూండ్ల రమకృష్ణయ్య అముద్రిత గ్రంథచింతామణి సంపుటాలనుంచి మూడువందల పుటల “అలనాటి సాహిత్యం” గ్రంథానికి సంపాదకత్వం, 2011లో కనకపుష్యరాగం పొణకా కనకమ్మ స్వీయచరిత్ర ప్రచురణ. మనసు ఫౌండేషన్ సహకారంతో AP Sate Archives లో భద్రపరచిన గురజాడ వారి రికార్డు పరిశీలించి స్వర్గీయ పెన్నేపల్లి గోపాలకృష్ణ, మనసు రాయుడు గారితో కలిసి “గురజాడ లభ్య సమగ్ర రచనలసంకలనం” వెలువరించారు. మనసు ఫౌండేషన్ వారి జాషువ సమగ్ర రచనల సంకలనంకోసం పనిచేశారు. 2014లో “వెంటగిరి సంస్థాన చరిత్ర సాహిత్యం” గ్రంథ ప్రచురణ.
2021లో పెన్నేపల్లి గోపాలకృష్ణతో కలిసి అనువదించిన”letters from Madras During the years 1836-39″ గ్రంథం ‘ఆమె లేఖలు’ పేరుతో అనువాదం. (ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్-ఎమెస్కో సంయుక్త ప్రచురణ).
పూండ్ల రామకృష్ణయ్య అముద్రిత గ్రంథచింతామణి ఆనాటి సాహిత్య దృక్పథాలు మీద మాచవోలు శివరామప్రసాద్, అల్లం రాజయ్య నవలలు, కథలు మీద కుమారి ఉభయ భారతి పిహెచ్.డి పరిశోధనలకు పర్యవేక్షణ. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ సంస్థాపక సభ్యులు, ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సభ్యత్వం.