నేను ఎంఏ రెండో సంవత్సరం చదువుతున్న రోజుల్లోనే సుప్రసిద్ధ చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్త, సుప్రసిద్ధ ఆర్కియాలజిస్టు మార్టిన్ వీలర్‌కు సహయకులుగా హరప్పా త్రవ్వకాల్లో పాల్గొన్న వ్యక్తి, ప్రొఫెసర్ రావిప్రోలు సుబ్రహ్మణ్యం ఏఎస్ఐ నుంచి డెప్యుటేషన్ మీద ఉస్మానియా విశ్వవిద్యాలయం చరిత్ర శాఖాధిపతిగా చేరారు.
ప్రొఫెసర్ రావిప్రోలు సుబ్రహ్మణ్యం గారు
రావిప్రోలు వారు నెల్లూరు వారు కావడం వల్లనేమో వారి పరిచయం, చనువుగా మారి వారి ఇంటికి తరచుగా వెళ్లేవాణ్ణి. ఆ రోజుల్లో ఆర్.ఎస్. గారు తార్నాకాలో యూనివర్సిటి అధ్యాపకుల క్వార్టర్సులో ఉండేవారు. గంపెడు పిల్లలను తల్లీ తండ్రి అంతా ఆయనే అయి సాకేరు. వారి పిల్లలతో పాటు బంధువుల పిల్లలు కొందరుండేవారు. ఇల్లంతా ఎప్పుడూ సందడిగా ఉండేది. భోజనం వేళకు వారింటికి వేళ్తే భోజనం చేసి రావాల్సిందే. లేకపోతే వారు ఉరుకోరు.
నేను ఎం.ఏ. పాసవగానే పి.హెచ్.డి కొనసాగించడం వల్ల ఆర్.ఎస్. గారితో పరిచయం కొనసాగింది. ఆర్.ఎస్. గారి అన్నయ్య రామ్మూర్తి గారి తోడల్లుడు నేలనూతల శ్రీ కృష్ణమూర్తి నెల్లూరులో న్యాయవాద వృత్తిలో ఉన్నా, వారి ప్రవృత్తి, వ్యాసంగం అంతా పరిశోధన, గ్రంథరచనలో సాగింది. శ్రీ కృష్ణమూర్తిగారు నెల్లూరు వర్థమాన సమాజ గ్రంథాలయ గౌరవ లైబ్రెరియన్‌గా దాదాపు పాతిక సంవత్సరాల పైనే వ్యవహరించడం చేత ఆంధ్రేశంలో పండిత పరిశోధకులందరూ వీరి మిత్ర వర్గంలో చేరిపోయారు. నా పరిశోధన – పర్యవేక్షకులు ప్రొఫెసర్ బిరుదురాజు రామరాజు గారు, ఆర్.ఎస్.గారు, నేలనూతల శ్రీకృష్ణమూర్తిగారి మధ్య ఒక అవిభాజ్యమైన స్నేహబంధం పెనవేసుకొని పోయింది. సుప్రసిద్ధ శాసన పరిశోధకులు, చరిత్రకారులు నేలటూరు వెంకటరమణయ్యగారు కూడా ఆ రోజుల్లో విద్యానగర్‌లో ఉండేవారు. తరచూ ఆర్.ఎస్., రామరాజు నేలటూరి వారి ఇంటికి వెళ్లి కలిసేవారు. రామరాజుగారి వెంటో, ఆర్.ఎస్. గారి వెంటో వెంకటరమణయ్య గారింటికి కూడా తరచూ వెళ్లి వచ్చేవాణ్ణి. ఆ రోజుల్లో ఆర్.ఎస్. గారు విశ్వవిద్యాలయం ఆచార్యులలో నక్షత్రం లాగా వెలిగిపోయారు. ఎప్పుడూ పి.జి. విద్యార్థులో, పరిశోధన చేస్తున్న విద్యార్థులో వారి వెంట అంటిపెట్టుకొని ఉండేవాళ్లు.
1966 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కైవ్సు శాఖ అఖిల భారత స్థాయిలో ఎనిమిది ఉపకార వేతనాలకు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేసుకొన్నారు. ఆ రోజు ఇంటర్వ్యూలో ఆర్కైవ్సు డైరెక్టర్ వి.కె.బావా ఐ.ఏ.ఎస్, ఆంధ్రప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీ డాక్టర్, ఆర్, రమేశన్ మరి కొందరు పెద్దలు అభ్యర్థులను ఇంటర్య్యూ చేశారు. నా. పి.హెచ్.డి పరిశోధనాంశం వెంకటగిరి సంస్థాన చరిత్ర సాహిత్యం కనుక, వి.కె.బావాగారు అప్పుడున్న వెంకటగిరి మాజీ జమిందారు పేరు చెప్పమని అడిగారు. వారి పేరు నాకు తెలియదని, వెంకటగిరిలో వారిని రాజాగారని వ్వవహరిస్తారని సమాధానం చెప్పాను. బావాగారడిగిన మరొక ప్రశ్న Government Oriental Manuscript Library ఎక్కడ వుందని. మద్రాసు విశ్వవిద్యాలయ గ్రంథాలయ భవనంలో ఉందని జవాబు చెప్తే, ఆ లైబ్రరీ మద్రాసులో ఏ ప్రాంతంలో ఉందో చెప్పమని అడిగారు సమాధానం నాకు తెలియదనన్నాను. ఇంత చిన్న విషయాలు తెలుసుకోక పోతే పరిశోధన ఏం చేస్తావని బావాగారు వ్యాఖ్యానించారు. ఇంటర్వ్యూ జరుగుతున్న హాల్లోకి ప్రవేశిస్తూ ఆర్.ఎస్. మా సంభాషణ విన్నట్లున్నారు, వారు ఛైర్లో కూర్చొంటూ “స్కాలర్షిప్ మంజూరైతేనే గదా అతను పరిశోదన కోసం మద్రాసు వెళ్లేది? మద్రాసు చూడని మనిషి గ్రంథాలయం ఎక్కడ ఉందో చెప్పమంటే ఏం చెప్తాడు?” అని వ్యాఖ్యానించారు. అంతే కాదు, ఆయనే కల్పించుకొని “నేను నెల్లూరు జిల్లా వాణ్ణి. జమిందార్లను కుమారరాజాగారు, పెదరాజుగారు వంటి పేర్లతో వ్యవహరిస్తారే తప్ప, సాధారణ ప్రజలు పేర్లతో వ్యవహరించరు” అని కూడా వారు వ్యాఖ్యానించారు.
ఆ ఇంటర్వ్యూ తర్వాత రెండురోజులు హైదరాబాదులో ఉండి, మూడో రోజు నెల్లూరి కెళ్తూ నిశి రాత్రివేళ బెజవాడ ప్లాట్‌ఫాంలో దిగి కాఫీ తాగుతున్నాను. “మీ ప్రొఫెసరు ఫస్టు క్లాసులో ఉన్నారు, రమ్మంటున్నారు” అని టి.సి. చెప్పి వెళ్లాడు. ఫస్టు క్లాసులో ఆర్.ఎస్. గారున్నారు. నన్ను చూడగానే “ఇంటర్వ్యూకి హజరవుతన్నట్లు నాతో ఎందుకు చెప్పలేదు?” కొంచెం మందలించినట్లుగా అన్నారు. వారికి చెప్పాలని నాకు తోచలేదు, నా పొరపాటు గ్రహించాను. బహుశా వారు ఆ రోజు ఇంటర్వ్యూ బోర్డులో ఉండి సహాయం చేయకపోతే నాకా ఉపకార వేతనం లభించేది కాదేమో! వారు నా పైన ఉంచిన నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నాననే భావిస్తాను. ఆ రోజు ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్ధి అందరిలో అందరికంటే ముందు పి.హెచ్.డి పట్టా అందుకోగలగడం నా భాగ్యంగా భావిస్తాను.
నాగార్జున సాగర్ నిర్మాణ సమయంలో అక్కడ ఏ.ఎస్.ఐ చేసిన త్రవ్వకాల్లో ఆర్.ఎస్ నిర్వహించిన పాత్ర గురించి అందరికీ తెలిసిందే. త్రవ్వకాలలో లభించిన చారిత్రిక అవశేషాలను కృష్ణానది కుడిగట్టు మీద జాగ్రత్తగా భద్రపరచడం, ఐల్యాండ్ మ్యూజియం ఏర్పాటు అన్నీ ఆర్.ఎస్ పర్యవేక్షణలోనే జరిగాయి. ఆ త్రవ్వకాలలో రంగనాథస్వామి విగ్రహం కూడా లభించింది. నెల్లూరు పాలకుడు మనుమసిద్ధి రాజ్యాన్ని కోల్పోయి, పల్నాడులో తలదాచుకొన్న సమయంలో నిర్మించిన గుడిలో విగ్రహామట అది! ఏ.ఎస్.ఐ శాఖ, స్థానికులు సహాయంతో ఆర్.ఎస్. కృష్ణ గుడి గట్టు మీద గుడికట్టించి ఆ రంగనాథస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి, ఏటా బుద్ధ పౌర్ణమి రోజు ఆ స్వామి కల్యాణం జరిపించేవారు. ఆయన తదనంతరం వారి సంతానం ఇప్పటికీ ఆ స్వామి కల్యాణం జరిపిస్తూనే ఉన్నారు. తుంగభద్ర ఆనకట్ట నిర్మాణం మొదలు పెట్టినపుడు కంచి పరమాచార్యులు ఆలంపూర్లో కొన్ని గుళ్ళను మాత్రం తాకవద్దనీ అవి డ్యాం నీటిలో మునిగిపోయినా సరే విడిచిపెట్టమని ఆర్.ఎస్ ద్వారా తెలియజేశారట. వారి మాట ప్రకారమే ఆ గుళ్ళను తవ్వి పునర్నిర్మాణం చేయలేదట.
నాగార్జున సాగర్ త్రవ్వకాలు జరుగుతున్న సందర్భంగా మన ప్రధాని నెహ్రూగారితో ఆర్.ఎస్. (కుడివైపు చివర తెల్లబట్టల్లో)
నెహ్రూ జీ పక్కనే
బహుశా 1968 వేసవిలో మే మాసంలో నాగార్జున సాగరం కుడి గట్టు మీద రంగనాథస్వామికి జరిగిన కల్యాణానికి ఆర్.ఎస్. వెంట నేను కూడా హాజరయ్యాను. ఆ ఏడు ఆర్.ఎస్ తన వెంట ప్రొఫెసర్ భద్రిరాజు కృష్ణమూర్తి, డాక్టర్ నేలటూరి వెంకటరమణయ్య, ప్రొఫెసర్ బిరుదురాజు రామరాజుగార్లను కూడా జీపులో తీసుకొని వెళ్లారు. జీపు స్వయంగా వారే నడిపారు. నేను మరొక విద్యార్థి ఆర్.ఎస్. వెంట సాగర్ వెళ్లాము. దారి పొడువుతా సాహిత్యం, చరిత్ర గురించి, పురావస్తు త్రవ్వకాలను గురించి వాళ్ల మధ్య జరిగిన సంభాషణ మౌనంగా వింటూ కూర్చొన్నాను. దారిలో ఒక చోట జీపు నిలిపి నన్ను వెంట పెట్టుకొని ఆ బీడు భూమిలో కొంత దూరం తీసుకొని వెళ్లి, అక్కడ గుట్టలాగా నిలబెట్టి ఉన్న రాళ్ళను చూపించి, అవి రాక్షసగుళ్లని, వాటి గురించి వివరించారు. ఎప్పుడో రాక్షసగుళ్లంటే ఏమిటని వారిని అడిగాను. దాన్ని మనసులో ఉంచుకొని ఆ రోజు రాక్షసగుళ్లను చూపించారు. వారి శిష్య వాత్సల్యాన్ని గురించి చెప్పడానికే ఇదంతా రాయావలసి వచ్చింది. ఆ రోజు రాత్రి భోజనాలు చేసి ఆచార్యులందరూ వెన్నెల్లో కూర్చొని సింధు నాగరకత లిపి అధ్యయనంలో ఎదురయ్యే సమస్యలను గురించి, ఇతర విద్యావిషయాలు చర్చిస్తూంటే వినడం నా అదృష్టంగా భావించుకొన్నాను.
ఆర్.ఎస్. ఒకసారి పల్లిపాడు వెళ్తూ నన్ను వెంట పెట్టుకొని పోయి పినాకిని సత్యాగ్రహశ్రమం అంతా తిప్పి చూపించి… ఆశ్రమవాసి మరుపురు రుక్మిణమ్మను పరిచయం చేశారు.
ఒకరోజు ఉదయం మా ఇంటి ముందు రెండు రిక్షాలు ఆగాయి. ఒక దాన్లో ఆర్.ఎస్. గారు మరొక రిక్షాలో ఆయన వద్ద పరిశోధన చేస్తున్న బొందు నరసింహం ఉన్నారు. ఉన్న పళంగా నన్ను బయల్దేరమన్నారు. నెల్లూరు మూలపేట వేణుగోపాలస్వామి గుడి వద్ద రిక్షాలు దిగి, ఆలయం కల్యాణ మండపంలో విడిది చేసి ఉన్న కంచి కామకోటి పీఠాధిపతి పరమాచార్యులు చంద్రశేఖర సరస్వతి స్వామి దర్శనానికి వెళ్లాము. పరిచారకులు ఆర్.ఎస్. పేరు చెప్పగానే లోపలికి వెళ్లమన్నారు. ముగ్గురం చొక్కాలు విప్పాము. నరసింహం, నా మెడలో యజ్ఞోపవీతాలు లేకపోతే ఆర్.ఎస్ తన మెడలో నుంచి రెండు జంద్యాలు తీసి మమ్మల్నిద్దరినీ వేసుకోమన్నారు. ఆ రోజు పరమాచార్యులు వారు దాదాపు రెండు గంటలసేపు ఆర్.ఎస్.తో సంభాషించారు. సంభాషణంతా ఇంగ్లీషులోనే. అప్పుడు తెలంగాణాలలో కనుగొనబడిన గుహచిత్రాలు (cave paintings), ఎక్కడెక్కడో ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జరుపుతున్న త్రవ్వకాలు, ఆలయాల జీర్ణోద్ధరణ వంటి అనేక విషయాలు వారు చర్చిస్తుంటే నేను, మిత్రులు నరసింహం మౌనంగా వింటూ కూర్చొన్నాము. మధ్యమధ్యలో స్వామి నిత్యకృత్యాల వేళ మించిపోతుందన్నందుకు సూచనగా స్వామి పరిచారకులు రెండు సార్లు గదిలోకి వచ్చి వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆ సమావేశం ముగిసింది. ఆ రోజు ఆర్.ఎస్ స్వామి వారి వద్దకు నన్నెందుకు వెంటపెట్టుకొని వెళ్లారో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. ఆర్.ఎస్. గారికి నా పట్ల గల అవ్యాజప్రేమకు ఇదొక నిదర్శనం అనుకొంటాను. ఆర్.ఎస్ తదనంతరం వారి పిల్లలు కూడా నా పట్ల అభిమానం ప్రదర్శించారు. కృతజ్ఞతా భావంతో ఈ నాలుగు మాటలు ముగిస్తున్నాను.
(మళ్ళీ కలుద్దాం)
డా. కాళిదాసు పురుషోత్తం గారిది ప్రకాశం జిల్లా తూమాడు అగ్రహారం. వీరి తండ్రిగారు గొప్ప సంస్కృత పండితులు. నెల్లూరులో స్థిరపడ్డారు. జననం 1942 మే. ముగ్గురు అక్కలు, ఒక అన్నయ్య. పెద్దక్క, రచయిత మిగిలారు. పెద్దక్క 97వ ఏట ఏడాది క్రితం స్వర్గస్తులయ్యారు. రచయిత బాల్యంలో నాయనగారి వద్ద సంస్కృతం కొద్దిగా చదువుకున్నారు. నెల్లూరు వి.ఆర్.హైస్కూలు, కాలజీలో విద్యాభ్యాసం, యం.ఏ. తెలుగు ఉస్మానియాలో ఫస్ట్ క్లాసులో, యూనివర్సిటీ ఫస్ట్ గానిలిచి, గురజాడ అప్పారావు స్వర్ణ పురస్కారం ఆందుకున్నారు. హైదరాబాద్, స్టేట్ ఆర్కైవ్సు వారి జాతీస్థాయి స్కాలర్షిప్ అందుకొని వెంకటగిరి సంస్థాన సాహిత్యం మీద పరిశోధించి 1971 సెప్టెంబర్‌లో డాక్టరేట్ అందుకున్నారు. 1972లో నెల్లూరులో శ్రీ సర్వోదయ డిగ్రీ కళాశాలలో చేరి, ఆ కళాశాల ప్రిన్సిపల్‌గా రిటైరై నెల్లూరులో విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఫొటోగ్రఫీ, సినిమాలు, పర్యటనలు ఇష్టం. 15 సంవత్సరాలు మిత్రులతో కలిసి కెమెరా క్లబ్, ఫిల్మ్ సొసైటీ ఉద్యమం, దాదాపు పుష్కరకాలం నడిపారు. సాహిత్యం, సినిమా, యాత్రానుభవాలు వ్యాసాలు భారతినుంచి అన్ని పత్రికలలో అచ్చయ్యాయి. 2007లో దంపూరు నరసయ్య – ఇంగ్లీషు లో తొలి తెలుగు వాడిమీద పరిశోధించి పుస్తకం. 1988లో గోపినాథుని వెంకయ్య శాస్త్రి జీవితం, సాహిత్యం టిటిడి వారి సహకారంతో. డాక్టర్ మాచవోలు శివరామప్రసాద్ గారితో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాచ్య పరిశోధన శాఖ వారికోసం పూండ్ల రమకృష్ణయ్య అముద్రిత గ్రంథచింతామణి సంపుటాలనుంచి మూడువందల పుటల “అలనాటి సాహిత్యం” గ్రంథానికి సంపాదకత్వం, 2011లో కనకపుష్యరాగం పొణకా కనకమ్మ స్వీయచరిత్ర ప్రచురణ. మనసు ఫౌండేషన్ సహకారంతో AP Sate Archives లో భద్రపరచిన గురజాడ వారి రికార్డు పరిశీలించి స్వర్గీయ పెన్నేపల్లి గోపాలకృష్ణ, మనసు రాయుడు గారితో కలిసి “గురజాడ లభ్య సమగ్ర రచనలసంకలనం” వెలువరించారు. మనసు ఫౌండేషన్ వారి జాషువ సమగ్ర రచనల సంకలనంకోసం పనిచేశారు. 2014లో “వెంటగిరి సంస్థాన చరిత్ర సాహిత్యం” గ్రంథ ప్రచురణ. 2021లో పెన్నేపల్లి గోపాలకృష్ణతో కలిసి అనువదించిన”letters from Madras During the years 1836-39″ గ్రంథం ‘ఆమె లేఖలు’ పేరుతో అనువాదం. (ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్-ఎమెస్కో సంయుక్త ప్రచురణ). పూండ్ల రామకృష్ణయ్య అముద్రిత గ్రంథచింతామణి ఆనాటి సాహిత్య దృక్పథాలు మీద మాచవోలు శివరామప్రసాద్, అల్లం రాజయ్య నవలలు, కథలు మీద కుమారి ఉభయ భారతి పిహెచ్.డి పరిశోధనలకు పర్యవేక్షణ. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ సంస్థాపక సభ్యులు, ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సభ్యత్వం.
ఢన్యవాదాలు సర్. ఫ్రొఫెసర్ ఆర్.ఎస్ గారి గురించి వినటమిదే. కంచి పరమాచర్యులను కలిసే మహద్భాగ్యం మీకు కలిగినందుకు చాలా సంతోషం. కుదిరితే వారి మాటలు వివరంగా వ్రాయగలరు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
బివిడి ప్రసాదరావు హైకూలు 15
జీవన రమణీయం-138
రైతన్న
ఆద్యంతమూ ఆసక్తికరంగా సాగే “గూఢచారి”
దక్షిణాఫ్రికాలో వికసించిన నానీలు
ఆదికావ్యంలోని ఆణిముత్యాలు-21
పాటల తిలకం
ఆధ్యాత్మిక తృప్తిని కలిగించే ‘కుంభకోణం యాత్ర’
మేనల్లుడు-16
అంతరం-2
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®