Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జ్ఞాపకాల పొదరిల్లు

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన యలమర్తి అనూరాధ గారి ‘జ్ఞాపకాల పొదరిల్లు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

దూరంగా అందమైన కొండల వరుస. ఆ వెనకల ఊదా రంగు, గులాబీ రంగు మిశ్రమంగా మెరిసిపోతున్న సంధ్యా సమయం. భార్యభర్తల (సమ్మేళన) దాంపత్యాన్ని తలపించింది జనార్ధన్ రావు, జగతిలకు. పెళ్ళై నలభై సంవత్సరాలు అయినా కొత్త దంపతుల్లా మెసిలే జంట. బంధానికి, అనుబంధానికి ప్రతీకల్లా కనిపిస్తారంటే ఆశ్చర్యం లేదు.

వాళ్ళ అనురాగానికి గుర్తుగా మొదటి సుపుత్రుడు ‘అనుదీప్,’ ఆ తర్వాత ‘వాత్సల్య’, ‘హన్షిత్’. ఇక చాలనుకున్నారు. వారిది ‘జమిందారీ’ కుటుంబం కాకపోయినా తాత, ముత్తాతల నుండి సిరి సంపదలతో తులతూగుతున్న కుటుంబం. రాజభవనాన్ని తలపించే వారి భవంతి చుట్టూ వంద ఎకరాలు వారివే. దాన ధర్మాలకు పెట్టింది పేరు వారి కుటుంబం. తోటివారిని తమ వారే అనుకునే మనస్తత్వం.

చీకటి పడుతుంటే ఒక్కసారి ఆ భవనంలో విద్యుద్దీపాలు వెలిగాయి. విస్తృతంగా వ్యాపించిన వారి వ్యాపార సామ్రాజ్యం వెలుగులను తలపిస్తున్నట్లు. ఇప్పుడు ‘అనుదీప్’ ఆ వ్యవహారాలన్నీ చూసుకుంటున్నాడు.

ఇక కూతురు ‘వాత్సల్య’ సామాజిక కార్యకర్త. ఆమె ఉదయం లేచిన దగ్గరనుంచీ ఎవరికి ఎలా సహాయపడాలా అన్న ఆలోచనతోనే ఉంటుంది. సహాయం చేయగల మనిషికి చేతి నిండా డబ్బు ఉంటే ఏమి చేయగలరో అవి అన్నీ ఆమె చేస్తుంటుంది.

చివరివాడు అవటం వలన ‘హాన్షిత్’కి ఆ ఇంట్లో గారాబం ఎక్కువ. అందరూ బాగా ముద్దు చేస్తారు. అతనికి సంగీతం అంటే మక్కువ. ప్రసిద్ధ గాయకుడిగా ఎదిగాడు.

అంతా దయగలవారే. జగతి జగతినంతా ప్రేమిస్తున్నట్లు అందరికీ అండగా నిలుస్తుంది. ఇక జనార్ధన్ రావు తమ క్రింద పని చేసే ఉద్యోగులకు సకల సౌకర్యాలు కల్పిస్తారు. వారి పిల్లలకు చదువులు, ఆరోగ్యం, పెళ్ళి విషయాలలో ప్రతి కుటుంబానికే వీరి చేయత తప్పనిసరిగా ఉండాల్సిందే. అలా సంతోష సాగరంలో సాగుతున్న వారి జీవిత నౌక ఒక్కసారి సముద్ర తుఫానుకి విలవిల లాడినట్లుగా వణికిపోయింది. అంత వారిని కలవరపెట్టిన విషయం. రహదారి నిర్మాణంలో వారి భవనాన్ని కూల్చేయ్యబోతున్నామని డార్జిలింగ్ ప్రభుత్వం సుస్పష్టం చేయటం.

దానితో ఆ కుటుంబానికి మనశ్శాంతి కరువైంది. తర తరాల తీపి గుర్తులకు నిలయమైన తమ ఇంటిని ఎలా కాపాడుకోవాలా అన్న సమస్య పెద్ద ప్రశ్నలా వారి ముందు తయారయ్యింది. ఎవరికి తోచినట్లు వాళ్ళు తమ స్నేహబృందంతో సంప్రదింపులు ప్రారంభించారు. కానీ ఫలితం కనిపించటం లేదు. అయినా ప్రయత్నాలను ఆపలేదు. చివరి క్షణం వరకూ పోరాటం చేసైనా ఇంటిని నిలబెట్టుకోవాలన్నదే ఇప్పుడు వారందరి ధ్యేయం.

ఇంత పెద్ద వ్యాపార స్రామాజ్యాన్నే దక్షతగా నిర్వహిస్తున్న తాను దీన్ని ఆపలేడా? ఉపాయం కోసం అతను సంప్రదించని వ్యక్తి లేడు. ఎలా? ఎలా? అని అనుదీప్ మనసు తెగ కలవరపడుతోంది. ఈ విషయంలో తమకే ఇలా ఉంటే ఇక తల్లి తండ్రుల పరిస్థితి ఏమిటో? అమ్మానాన్నల్లో క్రుంగుబాటు స్పష్టంగా కనిపిస్తోంది. వారు పైకి తమ బాధను ఎంత కనిపించకూడదని దాచిపెడుతున్నా లోలోపల లావాలా అగ్నిగోళాలు బ్రద్దలవుతున్నాయని తమకు అర్థమౌతూనే ఉంది.

రోజూ సాయంత్రమైతే చాలు, ఇవే చర్చలు. ఎవరి ద్వారా ఎంత వరకూ వచ్చిందని వాత్సల్య, హన్షిత్ లతో. రోజులు గడిచిపోతున్నాయి.

సామాజిక కార్యకర్తగా ఎప్పుడూ ఎవరికి ఏమి చేయాలని ఆలోచించే వాత్సల్య ఇప్పుడు తన ఇంటిని ఎలా కాపాడుకోవాలా అనే ఆలోచనే శ్వాసగా శ్వాసిస్తోంది. ప్రభుత్వం తమ భవనాన్ని కూలగొట్టటానికి తాము ఒప్పుకోమని ఓ ఉద్యమాన్నే నడిపిస్తోంది. అది ఎలెక్ట్రానిక్ మీడియాలో పెద్ద సంచలనాన్నే రేపుతోంది.

ఇక హన్షిత్ అయితే తమ ప్రేమనిలయం కుప్పకూలే విషాద సంఘటనను ఓ విరహగీతం కన్నా అద్భుతంగా ఆలపించి ఆ ఆడియోని యూట్యూబ్‌లో అప్‍లోడ్ చేసాడు. అది కోట్ల మందికి మందికి చేరి ఎందరి హృదయాలనో కదిలిస్తోంది.

జనార్థన్ రావు లాయర్లతో సంప్రదింపులు చేస్తూనే ఉన్నారు. ఎలాగైనా తమ భవనాన్ని నిలబెట్టుకోవాలన్న తపన ఆయన్నసలు నిద్రపోనివ్వటం లేదు. అలా భర్తను, పిల్లలనూ చూస్తున్న జగతికి ముందసలు ఏమి చెయ్యాలో పాలుపోలేదు. ఇప్పటికీ చక్కటి ఇల్లాలిగా, అతిథులకు అన్నపూర్ణగా, సంసారాన్ని సంపూర్ణంగా చక్కబెట్టే తల్లిగా, భార్యగా తన పాత్రను వంద శాతం పాటించింది. ఇప్పుడు వచ్చిన తమందరి సమస్యకు పరిష్కారం వెతుకులాటలో కూడా తన వంతు సాయం ఉండాల్సిందే అని ధృఢంగా నిశ్చయించుకొని ఇంట్లోంచే ఆ వేట ప్రారంభించింది. అలా తమ ఇంట్లో ఎప్పటి నుంచీ ఉన్న భోషాణాన్ని తెరిచింది. జనార్దన్ రావు గారి తాత ముత్తాతల నుంచీ చేసిన దాన ధర్మాలు, ఆస్తుల వివరాలు ఉన్న డాక్యుమెంట్స్ ఉన్న పెట్టె అది. ఓపిగ్గా వాటన్నిటినీ పరిశీలించటం ప్రారంభించింది. రోజులు, నెలలు గడిచిపోతున్నాయి. ఫలితం దక్కటం లేదు. భవనం కూల్చివేసే సమయం దగ్గర పడుతోంది.

తమ భవనాన్ని తాము కాపాడుకోలేమా అన్న ఉద్విగ్నత అందరిలో వరదలా ప్రవహిస్తోంది. అంతులేని ఆలోచనలతో వారంతా కొట్టుకుపోతున్నారు. ప్రవాహంలో కొట్టుకుపోతున్న వారికి ఓ దుంగ దొరికినట్లుగా జగతికి ఒక పెద్ద ఆధారం దొరికింది.

ప్రభుత్వం ఘోర విపత్తులో ఉన్నప్పుడు, భయంకర వ్యాధితో జనులంతా దిక్కుతోచని స్థితిలో ఉన్న సమయంలో జనార్దన రావు ముత్తాత ‘సర్వేశ్వర్రావు’ గారు వంద కోట్లు విరాళంగా ఇచ్చి ఆ సమస్య నుంచీ గట్టెక్కించిన సందర్భంలో భవిష్యత్తులో, తమ వ్యాపార, భవన విషయాల్లో ఎటువంటి నష్టం ప్రభుత్వం ద్వారా జరగబోదని హామీ ఇచ్చిన డాక్యుమెంట్ ఆమె కళ్ళబడింది. అప్పటి దాకా నిరాశ, నిస్పృహల్లో కొట్టుకుపోతున్న ఆ కుటుంబానికి ఓ ఆసరా, ఓ గొప్ప ఆధారం, ఓ చేయూత దొరికినట్లయింది.

“సాధించావు అమ్మా” అంటూ ముగ్గురు పిల్లలు ఆమెను పల్లకిలో ఎత్తి పట్టుకున్నాట్లు పట్టుకొని ఇల్లంతా ఊరేగించారు. భార్య కనిపెట్టిన ఆ సంగతి విన్న జనార్దన్ రావు ఆనంద బాష్పాలను చవిచూసాడు. ఇన్నాళ్ళూ తన భార్య ప్రేమనే పంచింది అనుకున్నాడు. ఇప్పుడు తన వంశ ప్రతిష్ఠను నిలబెట్టే అమృతాన్ని అందించి తామందరికీ పునర్జన్మ ప్రసాదించినంత గొప్పగా అనిపించి ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకొని తనివి తీరా హత్తుకున్నాడు. తమ జ్ఞాపకాల పొదరిల్లును ఇక నిలబెట్టుకోగలమనే ధైర్యం అందరి లోనూ పొంగి పొర్లింది.

లాయర్ విజయ్ కాంత్ అయితే ఆ డాక్యుమెంటును చూసి కోహినూర్ వజ్రం దొరికినంత ఆనందపడ్డాడు. “ఇక మనం భయపడాల్సింది ఏమీ లేదు. కానీ ఈ డాక్యుమెంట్ ప్రాచీన భాండాగారంలో ఎక్కడ ఉందో కనిపెట్టాలి. ఇవి చాలా ప్రదేశాలలో ఉంటాయి. అది పట్టుకోగలిగితే చాలు” అనటంతో ఇక రంగంలోకి దిగారు అందరూ. యుద్ధ సైనికుల్లా!

అనుదీప్ మెయిల్ ద్వారా తన స్నేహితులందరితో ఈ విషయం పంచుకున్నాడు. వ్యాపారరీత్యా, స్నేహం ద్వారా పరిచయస్థులు అందరికీ తమ ఊర్లలో ఉన్న భాండాగారాలకి వెళ్ళి తమ డాక్యుమెంట్ ఉందేమో చూడమన్నాడు.

వాత్సల్య వాట్సాప్ ద్వారా అదే పనిలో పడింది. ఇక హన్షిత్ ఆ వైపుగా దూసుకుపోతున్నాడు. అందరూ తమదే ఆ పని అన్నట్లు సహాయపడటం ప్రారంభించారు.

ఎందుకంటే దేశంలో ఆ కుటుంబం ద్వారా సహాయం అందుకోని వారు చాలా తక్కువ. అందరూ తమ తమ విశ్వాసాన్ని చూపించుకొనే అవకాశం దొరికిందని విజృంభించారు. అందరి కృషి ఫలించింది, చివరకు ఆ డాక్యుమెంటును పట్టుకోగలిగారు పట్టిసీమలో.

ఇక రెండు రోజుల్లో కూల్చివేత ఉన్న సమయంలో కోర్టులో ఆ డాక్యుమెంట్ కాపీలను సమర్పించి భవనాన్ని కూల్చి వేసే కార్యాక్రమాన్ని నిలిపివేయనున్నట్లుగా పత్రాన్ని విడుదల చేయించుకోగలిగారు. అప్పటి దాకా బిగపెట్టిన ఊపిరిని వదిలినట్లుగా అనిపించింది ఆ కుటుంబానికి, వారికి తోడుగా నీడగా పని చేసిన అందరికీ కూడా.

ప్రయత్నిస్తే అసాధ్యం సుసాధ్యమే అనే విషయాన్ని మరోసారి నిరూపించి వార్తలకు ఎక్కారు. ఈ విషయం బీబీసి వారు కూడా తమ వార్తలలో చెప్పటంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సంతోషం వెల్లి విరిసింది.

ఆ ఇంటిలో పండుగ వాతావరణం నెల్కొంది. వారి అనురాగ వృక్షం కీర్తి దిశ దిశలా వ్యాప్తి చెందింది.

తమ ఆనందాన్ని నలుగురితో పంచుకునే అలవాటును ఆచారంగా చేసుకున్న జనార్థన్ రావు, జగతిలు తమ ఈ విజయాన్ని వేడుకగా చేయాలనుకున్నారు. అంతే. ఊళ్ళో ఉన్న అందరికీ విందు భోజనం ఏర్పాటు చేశారు. దేశ విదేశాలలో ఉన్న తన స్నేహితులను, బంధువులను ఈ వేడుకకు ఆహ్వానించారు. వచ్చిన ప్రతి ఒక్కరికి తమ భవనం ప్రతిరూపాన్ని అందమైన కానుకగా తయారు చేయించి ఇవ్వటమే ఆ ఫంక్షన్‌కి మకుటంలా నిలిచింది.

అనురాగం, ఆప్యాయతలకు ఆదర్శంగా ఇప్పటివరకు నిలిచిన ఆ కుటుంబం ఇప్పుడు సమిష్టి కృషితో సాధించలేనిది ఏమీ లేదని అన్న నాందికి నూతన ఒరవడిని సృష్టించి చరిత్రకెక్కింది.

శతమానం భవతి ఆశీస్సుల వెల్లువలో ఆ కుటుంబంలో అందరూ పులకితులయ్యారు.

‘సర్వేజనా సుఖనో భవంతు’ నేపథ్యంగా పల్లవిగా వెల్లివిరిసింది.

సమాప్తం

Exit mobile version