Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వసివాడని స్మృతుల పుష్పగుచ్ఛం – ‘జ్ఞాపక కుసుమాలు’ కవితాసంపుటి

[లింగుట్ల వెంకటేశ్వర్లు గారి ‘జ్ఞాపక కుసుమాలు’ అనే కవితాసంపుటిని పరిచయం చేస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

శ్రీ లింగుట్ల వెంకటేశ్వర్లు గారి తొలి కవితాసంపుటి ‘జ్ఞాపక కుసుమాలు’. వీరు అనంతపురం జిల్లాలో జన్మించి, తిరుపతిలో విద్యాభ్యాసం పూర్తి చేసి, రాష్ట్ర ప్రభుత్వం వారి నీటిపారుదల అభివృద్ధి సంస్థలో జియాలజిస్టుగా సేవలందించి, హైడ్రోజియాలజిస్టుగా పదవీవిరమణ చేశారు. ప్రస్తుతం తిరుపతిలో విశ్రాంత జీవనం గడుపుతున్నారు. ఈయన బహుముఖ ప్రజ్ఞాశాలి. కవి మాత్రమే కాదు, చిత్రకారుడు, గాయకుడు, గేయ రచయిత కూడా. విశిష్టమైన అభిరుచులు గల వెంకటేశ్వర్లు గారు పలు సంస్థల పురస్కారాలను అందుకున్నారు.

ఈ పుస్తకం శీర్షిక చూడగానే, ‘రాజా’ అనే తెలుగు సినిమాకి సిరివెన్నెల గారు రాసిన ‘ఏదో ఒక రాగం పిలిచిందీ వేళ’ అనే పాట అప్రయత్నంగా గుర్తొచ్చింది. అందులో ఆయన “జ్ఞాపకాలే మైమరుపు, జ్ఞాపకాలే మేల్కొలుపు, జ్ఞాపకాలే నిట్టూర్పు, జ్ఞాపకాలే ఓదార్పు” అని అంటారు.

మనిషి జీవితంలో జ్ఞాపకాలకి అంత విలువ!

నిజానికి సృజనాత్మక కళ దేనికైనా ప్రేరణ జ్ఞాపకమే! తను చూసిన ఓ దృశ్యమో, విన్న ఓ గానమో, అనుభూతి చెందిన ఉద్వేగమో, కలతపెట్టిన సంఘటనో – జ్ఞాపకంలా మదిలో నిక్షిప్తమైతేనే కళాకారుడు వాటిని తన సృజనలో ప్రతిబింబించగలుగుతాడు. ఆ కోణంలో చూస్తే, కవిత్వం స్మృతుల ఉద్యానం అవుతుంది, ప్రతి కవిత ఒక జ్ఞాపక కుసుమం అవుతుంది.

ఈ ‘జ్ఞాపక కుసుమాలు’ కవితా సంపుటిలో 78 కవితలున్నాయి. ఈ కవితలని పరిశీలిస్తే, కవిలో ఒక భావుకుడు, ఒక ప్రకృతి ఆరాధకుడు, ఒక సంవేదనాశీలి, సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరుడు, ఓ చక్కని జీవిత భాగస్వామి గోచరిస్తారు. కొన్ని కవితలకి శీర్షికలు విభిన్నంగా ఉండి వెంటనే చదవాలన్న ఆసక్తిని కలిగించాయి. ఉదా: నడిచే గాయాలు, తడి నిధులై, మౌన చిత్రికలై, మనసు ఖాళీగా లేదు, నువ్వో నిశ్శబ్దానివైతే వంటివి.

పుస్తక పరిచయం కోసం ఈ కవితలని అనుభూతి, ప్రేరణ, ప్రకృతి/భావుకత, సామాజికం, స్వభాషాభిమానం, జీవితం అనే విభాగాలలోకి వర్గీకరించి వాటి గురించి క్లుప్తంగా వివరిస్తాను.

అనుభూతి:

అనుభవాలు అనుభూతులైతేనే, ‘జ్ఞాపక కుసుమాలు’ లాంటి కవితని వ్రాయగలగరు. కొన్ని అనుభూతుల్ని పదే పదే గుర్తు చేసుకోడం వల్ల అవి మనో ఫలకంపై తాజాగా ఉండిపోతాయి. కొన్ని ఆనందాన్నిస్తే, కొన్ని అలజడిని రేపుతాయి.

హృదయం లోని అనుభూతులు సృజనాత్మకతకి ఎంతలా దోహదం చేస్తాయో ‘మనసు గీసిన చిత్రం!’ కవిత సరళంగా వివరిస్తుంది.

ఆహా.. ఏమి అనుభూతి!’ అనే కవిత – తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నాకా కలిగే భక్త్యానుభూతిని, దివ్యానుభూతిని వర్ణిస్తుంది.

అనుభూతి మిగిల్చే..’ అన్న కవితా శీర్షికే.. ఆ కవితలో ఏముందో చెప్పేస్తుంది.  కొన్ని అనుభూతులు మరో లోకానికెలా తీసుకెళ్తాయో చెబుతుంది.

మరులు గొలిపే భావనలో..’ అనే కవిత అనుభూతి విభాగంలో చక్కగా ఒదిగిపోతుంది.

మట్టిని ముద్దాడిన చినుకు’ కవిత అనుభూతిమయం! చినుకు నేలని తాకితే, అది కంటికి కాటుక పెట్టినట్టే అని అనడంలో కవిలోని ఆర్తీ, ఆర్ద్రతా వ్యక్తమవుతాయి.

ప్రేరణ:

జత కలిపి చూడు’ అనేది గొప్ప కవిత. సరళమైన పదాలలో శ్రమైక జీవనంలోని సౌందర్యాన్ని తెలిపారు. బద్ధకాన్ని వదిలించుకుని చురుకుగా ఉండడం ఎంత ముఖ్యమో ఈ కవిత చెబుతుంది.

కల.. వరమై..’ అనే కవితలో బతుకుపోరాటంలో గెలిచేందుకు కావాల్సిన గుండె నిబ్బరాన్ని పొందాలంటే పట్టుదల, శ్రమించే తత్వం అత్యవసరమని గుర్తు చేస్తారు కవి.

నడక నేర్పిన దారి’ కవిత జీవన పథంలో ఎటువైపు నడవాలో గొప్పగా సూచిస్తుంది.

ఆత్మనిబ్బరంతో, అసాధ్యాన్ని కూల్చేలా, బంగారు భవిష్యత్తు చేకూర్చేలా ముందుకు సాగితే, ‘సాధ్యం కానిది ఏది’ అని ప్రశ్నిస్తారు కవి.

ప్రకృతి/భావుకత:

పచ్చని తోరణాలు కడదాం’ ప్రకృతిని, పచ్చదనాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని హృద్యంగా చెబుతుంది.

కనుల కొలనులో తారాడే కలువలు, చలవరేడుకై కాచిన వలపు తలపులు, గుండెల్లో ఊరే చెలిమి, వీణియ నాదాలై ప్రేమ గమకాలతో, మల్లె పరిమళపు గాలిగంధం – ఇలాంటి సొగసైన పదబంధాలతో అల్లిన ‘భావ వీచికలు’ గొప్ప భావుకత నిండిన కవిత!

మౌన చిత్రికలై..’ కవిత నిండా ప్రకృతిని పరిచారు కవి. ప్రకృతి దృశ్యాలు వింతగొలిపే చిత్రరాజములని వ్యాఖ్యానిస్తారు.

కాంతిబింబమై’ అనే కవితలో అరుణోదయపు ఆకాశంలోని వర్ణాలను వర్ణిస్తూ – భానుడు చేతనత్వ స్ఫూర్తిని కలిగిస్తాడని అంటారు కవి.

మొక్కలు పెంచి, పచ్చదనాన్ని పెంపొందించి పర్యావరణాన్ని కాపాడాలని ‘అమృత సంజీవని’ కవిత బోధిస్తుంది.

కవి ఎంత భావుకుడో ‘మనసు ఖాళీగా లేదు’ అనే కవిత చదివితే అర్థమవుతుంది.

సామాజికం:

ఎదగూడు’ అనే కవితలో సొంతిల్లు ఉంటే అది మనిషికి ఎంత భరోసా ఇస్తుందే చెప్తూనే, ఉచిత గృహాల పేరిట బీదలకు నాసిరకం ఇళ్లు నిర్మించి ఇవ్వడం పట్ల బాధను వ్యక్తం చేశారు కవి.

కంటకప్రాయమే!’ అనే కవితలో ఆకాశాన్నంటే ధరలు సామాన్యులకెలా భారమవుతున్నాయో, సమాజానికెలా కంటకప్రాయమవుతున్నాయో వెల్లడించారు.

నిలకడ లేనిదై’ అనే కవితలో ప్రపంచమంతటా ఆడంబరం, యాంత్రీకరణ, స్వార్థం పెరిగిపోయి మానవత లోపిస్తోందని వాపోతారు. సాంత్వన లేని జీవితాలలో మనిషి రోజు రోజుకీ దిగజారిపోతున్నాడని బాధపడతారు.

తడి నిధులై..’ కవితలో జలసంరక్షణ సమాజానికి ఎంత కీలకమో తెలియజేశారు. మానవాళికి నీటిబొట్టే శ్వాసా, ధ్యాసా అని అంటారీ కవితలో.

బతికేదెందుకో’ కవిత నేటి సమాజంలోని మనుషుల మధ్య పెరుగుతున్న దూరాన్ని, మమత పంచని మాయాజాలంలో చిక్కుకుపోతున్న వైనాన్ని ప్రకటిస్తుంది.

అంధకారమవుతున్న సమాజ స్థితిపట్ల నిస్సహాయతను వ్యక్తం చేస్తుంది ‘అశక్తత’ అనే కవిత.

సమాజంలోని పెడ ధోరణుల పట్ల కవి ఆవేదనని ‘మారని ఇజం’ అనే కవిత ఆర్ద్రంగా చాటుతుంది.

స్వభాషాభిమానం:

తెలుగు అక్షర సాక్ష్యమై’ అనే కవితలో అక్షరం అమ్మ లాలిపాట లాంటిదని అంటూ, అది లాలిత్యాన్ని, ఔన్నత్యాన్ని మమతని, సాన్నిహిత్యాన్ని ప్రదర్శిస్తుందని అంటారు కవి.

జీవితం:

చూసే చూపులో’ అనే కవితలో జీవితంలో సర్దుబాటు ఎంత అవసరమో చెప్పారు. మనసు విరిగినా, చూసే చూపులో చిరు ఆనందాలు వెతుక్కోమంటారు.

నవ్వగలగాలి!’ కవితలో ఆరాటపోరాటాలలో మనిషి మనసారా నవ్వడం మర్చిపోతున్నాడని చెబుతూ, మందహాసాన్ని వలసపోనీక ఒడిసిపట్టాలి అని జీవన సూత్రాన్ని అందించారు.

జీవితం సాఫీగా సాగిపోవాలంటే సంయమనం ఎంత అవసరమో ‘సర్దుబాటు గుణం’ అనే కవితలో చెప్తారు కవి. త్రోసిపుచ్చలేని సూచనలవి!

ప్రస్తుత సమాజంలో ఎలా జీవించాలో ‘బతుకు బాట’ అనే కవిత నేర్పిస్తుంది. మంచితనాన్ని కూసింత దరిచేర్చి కలుపుగోలుగా ఉంటూ చెలిమి కలుపుకోమని సూచిస్తుంది.

~

ఇంకా – కాలం, కవిత్వం, దాంపత్యం, అమ్మ, తల్లిదండ్రులు, కుటుంబం వంటి అంశాలపై చక్కని కవితలున్నాయి ఈ పుస్తకంలో. కవి మదిలో మెదిలిన సున్నితమైన భావాలకు అక్షర రూపం ఈ కవితలు. ఈ కవితల ద్వారా కవి తన హృదయాన్ని పాఠకుల ముందు పరిచారు. ఇక ఆస్వాదించడం, స్పందించడం పాఠకుల వంతు!

***

జ్ఞాపక కుసుమాలు (కవిత్వం)
రచన: లింగుట్ల వెంకటేశ్వర్లు
ప్రచురణ: శామ్ పబ్లికేషన్స్.
పేజీలు: 100
వెల:₹ 120/-
ప్రతులకు:
లింగుట్ల వెంకటేశ్వర్లు
101, సంజనా టవర్స్,
విద్యానగర్
తిరుపతి 517502
ఫోన్: 9440472254
ఈమెయిల్: venkatidc@gmail.com

Exit mobile version