[సరస్వతి నది పుష్కరాల సందర్భంగా ‘జ్ఞానప్రదాత్రి సరస్వతీ పుష్కరశోభ’ అనే వ్యాసం అందిస్తున్నారు డా. మైలవరపు లలితకుమారి.]
‘పంచభూతాత్మకం ప్రకృతి సమస్తం’. పంచభూతాలతో నిండి ఉన్న ఈ ప్రకృతిలోని సమస్త ప్రాణికోటి జీవనమునకు నీరు అత్యంతావశ్యకం. ఋషులు ‘ఉదకం నారాయణ స్వరూపం’ గా భావించారు. నారములు అంటే నీరు. నీటిలో నివసించేవాడే నారాయణుడు.
“ఆకాశాద్వాయుః వాయోరగ్నిః
అగ్నేరాపః అద్భ్య పృథివీ
పృథివ్యా ఓషధయః ఓషధీభ్యః అన్నం
అన్నాద్రేతః రేతసః పురుషః”
ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి భూమి, భూమి నుండి ఓషధులు, ఓషధులనుండి అన్నము, అన్నం నుండి రేతస్సు అందుండి జీవుడు పుట్టాడని ఉపనిషత్ వాక్యము.
జీవునికి జీవనాధారమైన నీరు నదీ రూపాలను పొంది, భూమిపై ప్రవహిస్తూ మానవులకు జీవనాన్ని ఇవ్వటమే కాక వారి వారి పాపాలను కూడా ప్రక్షాళన చేస్తుంది. నదీ పరీవాహ ప్రాంతాలు మానవ ఆవాసాలై, నాగరికత పరిఢవిల్లింది. భారతదేశంలో వందల కొలది నదులు ప్రవహిస్తున్నాయి.
ఈ నదులలో 12 నదులను ప్రముఖమైనవిగా చెబుతారు. ఆ 12 నదుల వరుసలో గంగానది మొట్టమొదటిది. ఈ చెప్పిన 12 ప్రధాన నదులకు 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కరం వస్తుంది. ఈ పుష్కరాలను గురించి పురాణాలలో ఒక కథ ఉన్నది.
పూర్వం పుష్కరుడు అనే పుణ్యాత్ముడు బ్రహ్మను గూర్చి తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకొమ్మనగా అతడు “ఓ బ్రహ్మదేవా! నన్ను పరమ పావన తీర్థముగా మార్చి నాలో స్నానమాచరించిన వారి పాపాలు నశించే శక్తిని నాకు వరంగా ప్రసాదించము” అని కోరాడు. అలా బ్రహ్మ ఇచ్చిన వరప్రభావంతో నాటి నుంచి పుష్కరుడు దేవలోకమున గల ఆకాశ గంగలో కలిసి పవిత్రుడైనాడు. గౌతమ మహర్షి శాపానికి గురైన ఇంద్రుడు ఆ శాపాన్ని పోగొట్టుకోవటానికి మీరు తప్ప అన్యులు లేరనగా అప్పుడు బ్రహ్మదేవుడు “మహేంద్రా నీవు ఆకాశ గంగలో అంతర్భూతంగా ఉన్న పుష్కర తీర్థమున స్నానమాచరించిన శాప విముక్తుడవుతావు” అన్నాడు. అప్పుడు ఇంద్రుడు బ్రహ్మ ఆదేశమును శిరసా వహించి స్నానమాచరించి శాపవిముక్తుడవుతాడు. ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు, మహర్షులు అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు వారు భూలోకవాసులైన మానవులు ఏదో ఒక విధంగా పాపాలు చేస్తారు. వారు తమ తమ పాపాలను పోగొట్టుకోవటానికి పుష్కరుని భూలోకమునకు పంపవలసినదిగా బ్రహ్మను కోరుతారు. వారి ప్రార్థనను మన్నించిన బ్రహ్మ “ఈ పుష్కరుడు ఆర్షభూమియగు భారతదేశమున ప్రవహించు 12 పవిత్రమైన నదులలో సంవత్సరమునకు ఒకసారి నివసించును. పుష్కరుడు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నదికి ఆ సంవత్సరము పుష్కరము వస్తుంది” అని చెబుతాడు.
మనకు మేషాది 12 రాశులు ఉన్నవి. సంవత్సరమునకు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నదిలో పుష్కరుడు ప్రవేశిస్తాడు. బ్రహ్మ ఆదేశమున అనుసరించి పుష్కరుడు భూలోకంలోని నదులలో ప్రవేశించటం ఆరంభిస్తాడు. మొదటగా పుష్కరుడు మేషరాశిలో గంగా నదిలో ప్రవేశిస్తాడు. ఆ తర్వాత వృషభరాశిలో నర్మదా నది పుష్కరాలు వస్తాయి. ఇప్పుడు సరస్వతి నదిలో మిధున రాశిలో పుష్కరుడు ప్రవేశిస్తున్నాడు. విశ్వావసునామ సంవత్సరం వైశాఖ బహుళ తదియ అంటే మే 15 నుండి బహుళ చతుర్దశి మేనెల 26 వరకు సరస్వతీ నదిలో పుష్కరుడు సంవత్సర కాలము కొలువై ఉంటాడు. ఈ సంవత్సర కాలంలో సరస్వతీ నదిలో పుష్కరుడు నివసించిన మొదటి 12 రోజులు ఆది పుష్కరాలని, చివరి 12 రోజులు అంత్య పుష్కరాలని అంటారు. మధ్య మిగిలిన కాలములో అపరాహ్ణ సమయంలో 2 1/2 గడియల కాలం సరస్వతీ నదిలో నివసిస్తాడు. ఆది, అంత్య పుష్కరకాలాలలో నదీస్నానం చేయలేని వారు మిగిలినసంవత్సర కాలంలో ఏ రోజులలోనైనా అపరాహ్ణ సమయంలో స్నానం చేసి పునీతులు కావచ్చును.
కానీ ఈ సరస్వతి నది ఎక్కడ ఉన్నది అన్నది ప్రశ్నార్ధకము. సరస్వతీ నదిని హిందూ పురాణాలలో ప్రముఖంగా పేర్కొన్నారు. కానీ ఇది అంతర్వాహినిగా చెప్పబడింది. ప్రయాగరాజ్‌లో గంగా యమునా నదుల సంగమంలో కూడా సరస్వతీనది అంతర్వాహినిగానే ఉండి త్రివేణి సంగమంగా ప్రసిద్ధి పొందింది.
అసలు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లాలోగల మానా గ్రామం వద్ద హిమాలయాలలో సరస్వతీ నది జన్మస్థలమని నమ్మకం. ఒకప్పుడు దీనిని భారతదేశంలో చివరి గ్రామముగా చెప్పేవారు. తరువాత సరిహద్దు రోడ్ల సంస్థ వారు దీనిని మొదటి భారతీయ గ్రామంగా తెలియచెప్పే ఫలకం పెట్టడం జరిగింది. ఈ గ్రామం సముద్రమట్టానికి దాదాపు 10,000 అడుగుల ఎత్తున ఉన్నది. హిందువుల పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్‌కి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది. బద్రీనాథ్ వెళ్ళిన ప్రతివారు మానా గ్రామం దగ్గర గల సరస్వతి నదిని దర్శనం చేసుకుని పునీతులవుతారు. కొండలపై నుండి అమితో వేగంగా కిందికి ప్రవహించే ఆ సరస్వతీనదీ ప్రవాహంలో స్నానమాచరించటం కొంచెం కష్టసాధ్యమే.
కేవల దర్శన మాత్రం చేతనే పుణ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ ఒక్కచోటే సరస్వతీ నదిని ప్రత్యక్షంగా చూడగలుగుతాము. ఆ తరువాత రుద్ర ప్రయాగ వద్ద అలకనందతో కలిసి అంతర్వాహినిగా మారి ప్రవహిస్తుంది. ఇంక ఎక్కడా కూడా మనకు ప్రత్యక్షంగా కనిపించదు. వినాయకుడు ఈ నది ఒడ్డునే కూర్చొని వ్యాసమహర్షి చెబుతుంటే మహాభారతరచన చేశాడని స్థల పురాణము ఉన్నది. ఇక్కడ వ్యాసగుహ, గణేష్ గుహ కూడా ఉన్నాయి. ఈ నదీతీరాల్లో మహర్షులు యజ్ఞ యాగాదులు చేసినట్లుగా పురాణ ప్రసిద్ధి. మహాభారతంలో స్వర్గారోహణ పర్వంలో పాండవులు అందరూ పడిపోగా, ధర్మరాజు మాత్రమే ఈ నదిని దాటి స్వర్గానికి చేరినట్లుగా చెప్పబడింది. ఇదేకాక మరికొన్ని కథనాలు కూడా ఈ విధంగా ఉన్నాయి. విశ్వామిత్రుడు వశిష్ఠుని వంచించడం కోసం వశిష్ఠుని తీసుకురమ్మని సరస్వతి నదికి చెప్పగా ఆ తల్లి తీసుకొస్తుంది. కాని విశ్వామిత్రుని ఆలోచనను తెలుసుకుని ఒక్కసారిగా ఉప్పొంగుతుంది. ఆ వేగానికి వశిష్ఠుడు ఎక్కడో దూరంగా విసిరివేయపడతాడు. అది తెలుసుకున్న విశ్వామిత్రుడు సరస్వతీ నదిని ఎండిపొమ్మని శపిస్తాడు. అందువలన నది మాయమైందని అంటారు. ఇంద్రుడు తన బ్రహ్మహత్యాపాతకాన్ని, చంద్రుడు క్షయరోగాన్ని సరస్వతి నదిలో స్నానం చేసి పోగొట్టుకున్నారని ఒక కథనం. వరుణుడు జలాధిపతి కావడానికి, కుబేరుడు ధనాధిపతి కావటానికి కారణం సరస్వతీ నదిని అర్చించడమేనని పురాణ కథనం.
వేద కాలంలో, ఇతిహాస, పురాణ కాలం నుండి కూడా సరస్వతీ నది ప్రస్తావన గ్రంథాలలో కనపడుతూనే ఉన్నది. కానీ తరువాత ఎక్కడ పైకి కనపడకుండా అంతర్వాహినిగా మిగిలిపోయింది. “సరస్వతి అంటే జ్ఞానానికి ప్రతీక”. జ్ఞానం ఎప్పుడూ అంతర్గతంగా ఉండి మనిషి యొక్క బుద్ధికి సంబంధించినదే కానీ అది పైకి ప్రకటితమయ్యేది కాదుకదా! అదే విధంగా సరస్వతీ నది కూడా అంతర్వాహినిగా మిగిలిపోయింది.
“ప్రసరణం సర్వత్ర అస్తీతి సరస్వతి”
సర్వత్రా ప్రసరిస్తూ ఉంటుంది. సర్వత్రా, సర్వకాలాల్లో ప్రవహిస్తూనే ఉంటుంది. కానీ ఎక్కడా కూడా మనకు కనపడదు. పుష్కర్, సిధ్ధాపూర్, ప్రయాగరాజ్ లలో అంతర్వాహినిగా ప్రవహిస్తున్నదని పండితవాక్కు.
తెలంగాణా రాష్ట్రంలోని జయశంకర్ భూపాల్ జిల్లాలోని కాళేశ్వరంలో గల శైవక్షేత్రంలో ప్రాణహిత, గోదావరి నదులతో సంగమించి సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తున్నది. అందుకని ఇప్పుడు ఈ సంవత్సరము అక్కడ సరస్వతీ నది పుష్కరాలు ప్రశస్తముగా నిర్వహించడానికి ప్రభుత్వము అనేక చర్యలను తీసుకుంటున్నది.
ఈ కాళేశ్వర క్షేత్రం ముక్తి క్షేత్రంమని ప్రసిధ్ధి.
ఆలయంలో గల స్వామి ముక్తేశ్వరునికి, యమధర్మరాజుకి భక్తులు పూజలు చేస్తారు. ఈ త్రివేణి సంగమం వద్ద స్నానం చేసి శివుని పూజిస్తే ముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ కాళేశ్వరం క్షేత్ర వర్ణన కూడా పురాణాలలో ఉన్నదని డాక్టర్ మాడుగుల భాస్కర్ శర్మ గారు పేర్కొన్నారు. పూర్వం నుండి ఇక్కడ సరస్వతీనదికి పుష్కరాలు జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. ప్రయాగరాజ్ లోని సరస్వతి నదిని, కాలేశ్వరం క్షేత్రంలోని సరస్వతీ నదిని ఒకటిగానే భావిస్తారంటారు. కాళేశ్వరం క్షేత్రంలో సరస్వతి ఆలయం కూడా ఉండటం వలన ఇక్కడ సరస్వతీనది ఉన్నదని పండితులు భావిస్తారు. ఇక్కడగల సరస్వతీనదిలో స్నానమాచరించి ధ్యానజపదానహోమాదులను, పితృకార్యాలను చేసుకుని, ఆ తల్లిని మనసారా అర్చించి పునీతులమవుదాం!
“సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా!
పద్మపత్ర విశాలాక్షీ పద్మకేసరవర్ణినీ
నిత్యం పద్మాలయా దేవి సామాం పాతు సరస్వతీ!”
అని ఆ తల్లిని ప్రార్థించి ఆ దేవి కృపకు పాత్రులమవుదాం.