[డా. లక్ష్మీ రాఘవ రచించిన ‘జ్ఞానమ్మ’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
జ్ఞానమ్మ మొదటి సారి సిటీకి వచ్చింది మేనకోడలు శాంతి దగ్గరికి. ఆమెకు స్వయాన పిల్లలు లేకపోవడం వలన అన్నయ్య పిల్లలంటే ఇష్టం చిన్నప్పటి నుండీ. భర్త ఉన్నంత వరకూ పల్లె వదలి ఎక్కడకూ వెళ్ళేవారు కాదు. “మనల్ని చూడాలనుకుంటే ఇక్కడికే వస్తారులే” అనేవాడు ఆయన.
ఆయన పోయి రెండేళ్లవుతూ ఉంటే మొదటిసారిగా శాంతి దగ్గరకు వచ్చింది.
శాంతి వేసవి సెలవులకు వచ్చినప్పుడు కలిసి “ఎప్పుడూ ఊరు వదలి రానే లేదు అత్తా. ఇప్పుడు ఒక్కదానివే కదా నాదగ్గరికి వచ్చి ఉండు.. మా ఆయన మూర్తి కూడా కొన్ని రోజుల కోసం అమెరికా వెళ్ళాలి” అని మరీ బలవంతం చేస్తే వచ్చింది.
శాంతి వాళ్ళ పెద్ద ఇల్లూ, ఇంట్లో ఉన్న సౌకర్యాలు చూసి ఆశ్చర్యపోయింది. టైమ్ ప్రకారం వంటకు వచ్చే వంటావిడ, బట్టలు వేయడానికి మిషను, ఒక్క పూట మాత్రమే వచ్చే పనిమనిషి అన్నీ వింతగానే ఉన్నాయి ఆమెకు. వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంటినుండే పనిచేస్తుంది శాంతి. ఒక గంటసేపు వంటింట్లో పనికి వంటావిడ ఎందుకో అర్థం కాలేదు జ్ఞానమ్మకు. అదే మాట అంటే వంట స్వయంగా చేయడం కంటే ‘ఇది చేయాలి’ అని చెప్పగానే అన్నీ గంటలో చేసి టేబుల్ మీద ఉంచేస్తే ఎంత సుఖంగా అనిపిస్తుందో చెప్పింది శాంతి. అలాగే పనిమనిషి ఒక అరగంటలో చక చకా పని చేయడం లాటివి ముక్కున వేలేసుకుని చూసింది.
అందరి పనులూ టైము ప్రకారమే!
“ఇక్కడ ఉన్నన్నాళ్ళూ హాయిగా టి.వి. చూసుకుంటూ, పొద్దునా, సాయంకాలం ఎదురుగా ఉన్న పార్క్‌లో తిరుగుతూ ఆరోగ్యం చూసుకో అత్తా..” అన్న శాంతి మాటలు నచ్చాయి. ఇన్ని రోజులకు తన గురించి పట్టించుకునే వాళ్ళు ఉన్నారు కదా అని.
శాంతి కూతురు ప్రియ వరంగల్ ఇంజనీరింగ్ కాలేజీలో హాస్టల్లో ఉండి చదువుతూంది. పదిహేను రోజులు సెలవులని ఇంటికి వచ్చింది. మనమరాలితో కూడా హాయిగా గడపవచ్చు అనుకుంది జ్ఞానమ్మ. కానీ ప్రియ ఎప్పుడూ పది గంటలకు కానీ లేవదు. లేచినా ఎక్కువసేపు అందరితో కూర్చోదు. ఎప్పుడూ తన లాప్టాప్ తోనే లోకం. అదే అసంతృప్తి వెల్లడిస్తే
“దానికి కూర్చుని మాట్లాడేంత తీరిక ఉండదు. ఇంటికి వచ్చినా హోంవర్క్ చాలా ఉంటుంది అత్తా.. ఎప్పుడూ హాస్టల్ జీవితం కదా.. ఇక్కడికి వచ్చినప్పుడు దాని ఇష్టం వచ్చినట్టు ఉండనీ అని నేను పట్టించుకోను..” అంది శాంతి నవ్వుతూ. అంటే ఇంట్లో వాళ్ళతోనే మాట్లాడే తీరిక ఉండదా?.. ఆసక్తి లేదా.. అర్థం కాలేదు.
కానీ చూద్దాం అని ఒకటి రెండుసార్లు ప్రియతో కబుర్లు చెప్పాలని చూసినా కుదరలేదు.
ఐదు రోజులు గడిచాయి. ఒకరోజు మధ్యాహ్నం వేళకి ఒక కారులో ప్రియ ఫ్రెండ్ భావని వచ్చింది. రాగానే జ్ఞానమ్మను చూసి పలకరింపుగా నవ్వింది. భలే సంతోషం వేసింది జ్ఞానమ్మకు. ఆ తర్వాత ప్రియ రూము లోకి వెళ్ళింది.. ఆ అమ్మాయి వచ్చిందని శాంతి భోజనంలో వడియాలు లాటివి పెడుతుందేమో ఏదైనా సాయం చెయ్యచ్చు అనుకుని అడిగిoది.
శాంతి వెంటనే “వాళ్ళిద్దరూ బయట వెళ్ళి తింటారు. మనలాగా అందరూ అన్నం, పప్పు, కూర అన్నది ఇప్పుడు లేదు అత్తా అంతా బర్గర్లు, పాస్తాలు తింటారు. లేదా ఇంట్లో శాండ్విచ్ లేదా మ్యాగీ లాటివి చేసుకుంటారు. నీవు వర్రీ కావద్దు. ఆ పిల్ల కారు డ్రైవ్ చేసుకుని వస్తుంది. తినడానికి కారులో కావాల్సిన చోటికి వెడతారు. ఒక్కోసారి క్లాసు పనుల కోసం కూడా తిరుగుతారు..” అంది తేలిగ్గా.
చదువుకునే పిల్లలు ఆరోగ్యకరంగా తినాలి. ఏదో ఒకటి తిని కడుపు నింపుకుంటారా?? బయటకి ఆడపిల్లలు ఒంటరిగా అలా ఎలా వెళతారు? పెద్ద ప్రశ్న జ్ఞానమ్మకు. ఆరోజు సాయంకాలం వెళ్ళిన వాళ్ళు రాత్రి పది గంటల పైన వస్తే.. పడుకున్నా నిద్రపట్టని జ్ఞానమ్మ గమనిస్తూనే ఉంది.
పొద్దున లేవగానే శాంతితో “రాత్రి ఎప్పుడు వచ్చారు పిల్లలు?” అని శాంతిని అడిగితే “సినిమాకు పోతామన్నారు. ఎలాగూ ప్రియ దగ్గర ఇంటి కీస్ ఉంటాయి అందుకని ఎప్పుడు వచ్చారో గమనించలేదు” అన్న మాటలు గుండెను తాకాయి జ్ఞానమ్మకు.
ఇదేమి చోద్యం.. పిల్ల రాత్రి పూట ఎప్పుడు వస్తుందని బెంగపడని తల్లి నిద్రపోయిoదా?
మరురోజు మళ్ళీ వాళ్ళిద్దరూ బయటకు వెళ్ళటం, రావడం జరిగాయి.
ఇంట్లో ఉన్నంతలో హాలులోకి వస్తే తను మాట్లాడవచ్చని ఎదురుచూసింది. కానీ కూర్చుని మాట్లాడే అవకాశమే రాలేదు జ్ఞానమ్మకు. ఇక వదిలేసింది.
ఆ రోజు ఇంకొక అమ్మాయి కూడా వచ్చింది.. ముగ్గురూ రూంలో కూర్చుని ఒక్కటే పకపకలూ, గొల్లున మాట్లాడుకోవడాలు గమనిస్తూనే ఉంది జ్ఞానమ్మ. కొత్తపిల్ల రెండు గంటలు ఉండి వెళ్ళిపోయింది. బహుశా ఈ ఊరి పిల్లేమో..
రాత్రికి డిన్నర్ వెళతాం అని చెప్పి ప్రియ, భావనీ ఇద్దరూ వెళ్లారు. గంట తరువాత ప్రియ మాత్రమే ఇంట్లోకి రావటం చూసిన జ్ఞానమ్మకు ‘భావని రాలేదేం? ఇంత రాత్రి వేళ ఈ పిల్ల ఎక్కడ పోయింది?’ అన్న ప్రశ్నలు మనసు తొలిచేస్తున్నాయి. రూములో ఉన్న ప్రియను అడిగితే.. వాళ్ళ అమ్మకు చెబుతుందేమో అన్న అనుమానం వచ్చింది. కానీ మనసు వూరుకోక ప్రియ రూము లోకి తలుపు తోసుకుని వెళ్ళి
“నీ ఫ్రెండ్ ఊరికి వెళ్ళిపోయిందా?” అని అడిగింది.
“లేదు. తను ఇంకో ఫ్రెండ్ వాళ్ళింటికి వెళ్ళింది..”
“ఇలా తిరుగుతున్నట్టు వాళ్ళ ఇంట్లో తెలుసా?” జ్ఞానమ్మ ప్రశ్న ప్రియకు కొత్తగా అనిపించింది.
ఇంతలో శాంతి వచ్చి “ఇక్కడేమి చేస్తున్నావు అత్తా?” అని అడిగింది.
“ఆహా ఏమీ లేదు భావని రాలేదా? అని అడుగుతున్నా” అంటున్న అత్తను చేయి పట్టుకుని బయటకు తీసుకు వచ్చింది.
డైనింగ్ రూము దగ్గర కుర్చీలో కూర్చుంటూ జ్ఞానమ్మ “ఎదిగిన పిల్లలు కదా. మన పిల్ల కాక పోయినా మన ఇంటికి వచ్చినప్పుడు ఎక్కడ పోయిందని వాళ్ళ వాళ్ళు మనల్ని ప్రశ్నిస్తారు కదా అనిపించి అడుగుతున్న” అని చెప్పింది సంజాయిషీగా..
“అత్తా.. నీవు వీరిని ఇంకా మన నీడలో బడికెళ్ళే పిల్లలని అనుకుంటున్నావు. కాలం మారింది. కాలానికి తగ్గట్టుగా ఎలా నడుచుకోవాలో వారికి తెలుసు. అడుగడుగునా మనం హెచ్చరించక్కర లేదు. ఇప్పుడు పిల్లలు హాస్టల్లో ఉండి చదువుకుంటారు.. అనుక్షణం వారు ఏమి చేస్తావున్నారు అని ఆలోచిస్తూ ఉండి పోతామా? చిన్నప్పటి నుండీ మంచి చెడులు చెప్పించాము. ఇప్పుడు వాళ్ళు చూసుకోగలరు అన్నది ధీమా..”
“అంటే భావని..” జ్ఞానమ్మని పూర్తి చెప్పనివ్వలేదు శాంతి
“భావని ఇక్కడకు వస్తుందని వాళ్ళ ఇంటివాళ్ళకు తెలుసు. వాళ్ళ అమ్మ నాకు ఫోను చేసి తను ఈ రోజు ఎక్కడకు వెడుతుందో కూడా చెప్పింది.. అందుకే అత్తా నీవు అనవసరంగా ఆలోచించకు.” అంది.
శాంతి మాటలతో జ్ఞానమ్మ ‘పిల్లలు పెరిగిపోయారు కానీ, మనుషుల మధ్య మాటలు, చూపులు తగ్గిపోతే బంధం ఎలా నిలుస్తుంది?’ అనుకుంది మనసులో.
ఏమైనా చివరికి ఉన్న ఆ కొద్ది రోజుల్లోనే ఇలా కొన్ని సంఘటనలతో కాలం మార్పు అర్థమై ఎక్కువగా టి.వి.లో భక్తి, సీరియల్ ప్రోగ్రామ్‌లకు అంకితమైంది జ్ఞానమ్మ.
సెలవులు పూర్తి అయ్యి ప్రియ వరంగల్‌కు వెళ్ళిపోయినా మనమరాలి దగ్గర జ్ఞానమ్మకు చనువు పెరగనే లేదు. ఇంతలో మూర్తి వచ్చే సమయం అవగానే పల్లెకు బయలుదేరింది జ్ఞానమ్మ.
***
ఊరు చేరిన అరగంటలో పక్కన ఇంటి లోకి గోడ మీద తొంగి చూస్తూ “కమలా, నేను వచ్చేశా.. వంట అయితే చెప్పు, మీ ఇంటికి కాస్సేపు వస్తా.. బోలెడు కబుర్లు చెప్పుకోవాలి” అంది.
కమల వెంటనే “అక్కా మీరు లేనిది నాకేమీ తోచనే లేదు. ఎన్ని విషయాలు ఉన్నాయో..” అంది.
“ఇదో పది నిముషాల్లో వచ్చేస్తా.. అన్నట్టు రామయ్య కూతురు కాపరానికి వెళ్ళిందా? వెంకమ్మ కోడలు కు ఏమి బిడ్డ? వేంకటేశు ట్రాక్టర్ కొన్నాడా?..” సాగదీసింది జ్ఞానమ్మ.
“అన్నీ చెబుతా వచ్చేసేయ్ అక్కా..”
“సిటీలో మాటా మంతీ ఉండనే ఉండదు. ఇంట్లో నైనా, వూరి విషయాలైనా హాయిగా చెప్పుకుంటే కదా తెలిసేది.. ఇప్పుడే వచ్చేస్తా..” అని లోపలకు వెళ్ళింది జ్ఞానమ్మ తృప్తిగా.