[ఇటీవల మృతి చెందిన డా. గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారికి ఈ వ్యాసం ద్వారా నివాళి అర్పిస్తున్నారు దీర్ఘాసి విజయభాస్కర్.]
నేను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం తులనాత్మక అధ్యయన శాఖలో పీహెచ్డీ విద్యార్థిని. అతను నాకు గైడ్. కానీ మా ఇద్దరి అనుబంధం గురుశిష్యుల పరిశోధన పరిధి దాటి ఒక ఆత్మీయతా లోకాలకు తీసుకువెళ్ళింది. గంగిశెట్టి గారి దగ్గర చాలా కష్టం, ఆయన చెప్పినది ఒకంతట అర్థం కాదు, అనే మాట ఎవరికి నిజమో నాకు తెలీదు కానీ నా విషయంలో అది అబద్ధంగా తేలిపోయింది. మాస్టారు మాటలు అనేక క్రొత్త ఆలోచనలకు బాటలు వేసాయి. ఆయన ఉపదేశించే విధానం ఉపనిషత్తుల ప్రమాణంలో ఉంటుంది. వివరించే విధానం మనలో మనలో క్రొత్త విద్వత్తుకి దారులు చూపుతుంది. నా సాహిత్య వ్యాసంగంలో నా చేయి పట్టుకొని మరీ నన్ను నడిపించారు. వారి సమక్షంలో, వారితో చేసిన సంభాషణలో నేను పొందిన స్ఫూర్తి, ప్రేరణ అమూల్యమైనది.
ఆచార్య గంగిశెట్టి అనంతపురం జిల్లాలో తనకల్లు గ్రామంలో జన్మించారు. సంవత్సరం కూడా నిండని వయసులో తండ్రిని కోల్పోయారు. తల్లి సంరక్షణ లోనే పెరిగి పెద్దవారయ్యారు. చిన్నతనం నుండి చదువులో చాలా చురుకుగా ఉండేవారు. జైజ్ఞాశ, నిరంతర పఠనం, గొప్ప ధారణ శక్తి ఆయనకు స్వంతం. ఈ లక్షణాలే అతనని బహుభాషా కోవిదుడిని చేసాయి. తెలుగు తమిళం, కన్నడ భాషల్లో చాలా పట్టు సాధించారు. మూడు భాషల్లోను అనర్గళంగా ప్రసంగించే ప్రతిభా పాటవాలు తన స్వంతం చేసుకున్నారు. ఏ విషయంపై మాట్లాడినా సాధికారికంగా మాట్లాడేవారు. ముక్కు సూటిగా మాట్లాడేవారు. ఆ ముక్కుసూటి దనం కొన్నిసార్లు అతన్ని ఇబ్బందుల పాలుచేసింది కూడా.
అతని పీహెచ్డీ పరిశోధన గ్రంథం ఒక అమూల్య ఆభరణం. తెలుగు సంస్కృతి: శాసనాలు, చారిత్రక పరిణామాలు శీర్షికతో ప్రచురితమైంది. నిర్వచనం దగ్గర నుండి సంస్కృతి యొక్క విక్రమ రూపాన్ని ఆ గ్రంథంలో ఆవిష్కరించారు. కవితాత్మక సంక్షిప్తత, విస్తృతమైన అర్థ వ్యాప్తితో మనల్ని అలరిస్తుంది. రాజ వంశాల ప్రతేకత, కులవ్యవస్థ మూలాలు, ఆనాటి కట్టుబాట్లు, వివిధ వృత్తుల మధ్య నుండే సమన్వయ సహకారం, శాసనాల ద్వారా ప్రకటితమైన పౌర జీవన వ్యవస్థ, – ఇలా ప్రాచీన తెలుగు, కన్నడ, తమిళ నేల లను తడిమి తడిమి రచించిన ఇతిహాస వ్యాఖ్యానమని చెప్పవచ్చు. ఆ గ్రంథం లోనే సంస్కృతి గురించి చెప్పిన విలువైన మాటలు చూడండి “సంస్కృతి అంటేనే అనేక సృజనాత్మక, ఆధ్యాత్మిక సాధనాల సంపుటి. ప్రకృతిలో భాగమైన మానవుడు, ఆ ప్రకృతిని తనకు అనుకూలంగా, సుఖప్రదంగా మార్చుకోవడంలో చేసిన మార్పులు, ఏర్పాటులు, కట్టుబాటులు, కనిపెట్టడాలు అన్నీ సంస్కృతిలో భాగమౌతాయి. సంస్కృతి మానవ మనుగడకు అర్థం చెప్పి రక్షిస్తుంటుంది. ఆ సంస్కృతీ సంపన్నతే ఒక జాతికి మూల సంపద.”
ఆలయంకి ఆచార్యులు ఇచ్చిన నిర్వచనం చూడండి: “ఆనాటి ఆలయం రాతిలో వెలసిన మహా కావ్యం. విగ్రహం కావ్యం లోని రసం వంటిది. కావ్యానికి ఆత్మ రసం. ఆలయానికి ఆత్మ విగ్రహం.”
శ్రీ గంగిశెట్టి కేవలం పరిశోధకుడే కాదు. సామాజిక వ్యాఖ్యాత, సాహిత్య గుణ నిర్ణేత. విమర్శనా రంగానికి క్రొత్త దారులు చూపిన వారు. అన్వయపరమైన విమర్శ కన్నా సిద్ధాంత పరమైన విమర్శ కు ప్రాధాన్యతను ఇచ్చినవారు. సమీక్ష విమర్శ కాదని కాదని ఖండించిన తెగువరి. విమర్శ ఎలా ఉండాలో చేసి చూపించిన తీర్పరి. అంతే కాదు కవి, కథకుడు కూడా.
అనువాదకునిగా పర్వ, విషాద కామరూప తెలుగువారికి అతనిచ్చిన అపురూప కాన్కలు. పర్వ కు అనువాదకుని నివేదన అని వ్రాస్తూ ఏమంటున్నారో చూడండి. “భారతీయ సంస్కృతిని అధ్యయనం చేసే వారందరికీ మహా భారతం అనేకమైన సవాళ్ళను విసురుతుంది. ఎన్నో యుగాల సంస్కృతి పరిణామాల్ని అది తనలో ఇముడ్చుకొని, ప్రతీ వర్తమాన తరానికి అన్వయించేలా, ఇలియట్ చెప్పిన ‘present ness of the past and pastness of the present’ అనే భావనలకు భాష్యం చెప్పేలాగా, భారత జాతి మహోత్తమ వారసత్వంలో భాగంగా నిలిచి ఉంది.” – అని చెబుతూ ఒక గొప్ప మాటంటారు “మహా భారతంలో పరిశ్రమించే పరిశోదకుడికి సమగ్ర సృజనాత్మక వ్యాఖ్య. నాటి భారతానికి నేటి పర్వ ఒక సమగ్ర పూరణ.” ఈ వ్యాఖ్య వలన తాను అనువదించిన నవల ఆత్మను పట్టుకున్న తీరును మనం గ్రహించగలం.
పర్వ నవలకు గంగిశెట్టి గారికి కేంద్ర సాహిత్య ఆకాడేమి అనువాద పురస్కారం లభించింది.
జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఇందిరా గోస్వామీ రచించిన ‘ఊనే ఖోవా హోదా’ అనే నవలను శ్రీ గంగిశెట్టి గారు ‘విషాద కామరూప’గా అనువదించారు. ఇది ఆధునిక చారిత్రక నవల. ఒకప్పుడు సర్వ కళా తంత్రం శాస్త్రాల అధ్యయనానికి పెట్టింది పేరు ఐన అస్సామ్ రాష్ట్రం లోని కామరూప జిల్లాలోని వైష్ణవ మఠాల్లో ఒకానొక మఠం (సత్త్రం) చుట్టూ ఉన్న గ్రామాల్లోని దయనీయ పరిస్థితిని చిత్రించే నవల విషాద కామరూప. ఒకానొక వ్యాసంలో ఆమె గురించి గంగిశెట్టిగారు “సాహిత్య భావ సంవేదన అక్షరాల్లోనూ, అవి పొదువుకొనే కల్పనలలోనూ కాదు. మనిషి గుండెలో, మానవత్వపు చూపులో, చేతలో ఉంటుందని చాటి చెప్పిన ఏకైక భారతీయ రచయిత్రి ఇందిరా గోస్వామి. ఆమె ముందు అఖిల భారత పురస్కారాలు, జ్ఞాన పీఠాలు, అస్సామి ప్రజ, ప్రభుత్వం అందుకే మోకారిల్లాయి.” అంటారు. చూడండి, ఒక సృజనాత్మక వ్యక్తిని తులాబారం వేస్తున్నప్పుడు వాడాల్సిన తూనిక రాళ్లు ఏ ప్రమాణం లో ఉండాలో ఎంత చక్కగా చెప్పారో!.
ఇలా చెప్పుకుంటూ పొతే శ్రీ గంగిశెట్టి గారు చేసిన సామాజిక విశ్లేషణ, ధార్మిక మార్మిక వ్యవస్థల వివేచన, ఉపనిషత్తు, పురాణాది సంప్రదాయ సాహిత్య అవలోకన చాలా ప్రత్యేకంగా ఉంటాయి.
శ్రీ గంగిశెట్టి గారు నాటకం అంటే ప్రాణప్రదంగా భావించేవారు. ‘శ్రీ వేమన’ నాటకాన్ని కూడా రచించారు. ఆధునిక నాటక రచయితల్లో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ చంద్రశేఖర్ కంబార్ గారంటే ఎనలేని గౌరవం, ప్రేమ. శ్రీ కంబార్ గారికి జ్ఞానపీఠ అవార్డు వచ్చినప్పుడు హైదరాబాద్ పిలిపించి ఘన సన్మానం చేసి పులకించిపోయారు. నాటకం పట్ల ఉన్న ప్రేమ నా పట్ల వాత్సల్యంగా మారిందేమో! ఆ వాత్సల్యమే నా ఆలోచనా పరిధిని విస్తృత పరిచింది.
70 దశకం నుండి వివిధ సందర్భా అతను వ్రాసిన వ్యాసాలు, చేసిన ప్రసంగ పాఠాలు ఒక సంపుటిగా వేసి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి అంకితం చేశారు. ఆ గ్రంథంలో చాఫ్టర్స్‌ని ‘తరంగాలు’గా నామకరణం చేశారు. ఆ తరంగాల్లో ‘నాటక తరంగం’ ఒకటి. నాటకాన్ని ఆయన చూసిన దృష్టి కోణం ఇతరులకు భిన్నమైనది. అందులో ఏమంటున్నారో చూద్దాం. “నాటకం బయటిది కాదు. మనలో జరిగేదే. మనలో ఉత్పన్నమయ్యే అనేకానేక భావ తరంగాల మధ్య, ఆ వలయాల అడుగున అజ్ఞాతంగా ఉండే సుప్త కాంక్షకు సంబంధించింది. ఆ సుప్త కాంక్ష తరంగాలే ఈ జీవ నాటకం.”
కంబార్ నాటకతత్వం అనే వ్యాసంలో శ్రీ కంబార్ రంగస్థల శైలి గురించి “ఇక్కడ జీవితం, కళ, కథ, నాటకం, మతం వేరు వేరు కాదు. అన్నీ కలిసిందే జీవితం. జీవనోత్సవం. దాన్ని సెలబ్రేట్ చేసేదే జాన పద రంగస్థలం.” అని కంబార్ గారు అన్న మాట పై వ్యాఖ్యానిస్తూ “అదొక అద్భుత ప్రయోగం. భారతీయత జవసత్వాలు ఎక్కడున్నాయో తెలిసి దాన్ని వస్తుతా, రూపతా ఆధునికం చేసిన ప్రయోగం. భారతీయ నాటక రంగానికి గౌరవం అందించిన ప్రయోగం” అని కొనియాడారు. వారు అమెరికా వెళ్లిన తర్వాత సిరికొన సాహిత్య అకాడెమి ఆన్లైన్‌లో నిర్వహించి భారత, అమెరికా దేశాల్లోని అనేక మంది కవులకు, రచయితలకు మార్గదర్శిగా నిలిచారు. చివరి క్షణం వరకు సిరికొన ద్వారా సాహిత్య సేవలోనే గడిపారు.
కీ.శే. గంగిశెట్టి గారు గొప్ప ఆచార్యులే కాదు గొప్ప పరిపాలనాదక్షులు కూడా. కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యునిగా, నేషనల్ బుక్ ట్రస్ట్ సభ్యునిగా, భారతీయ తులనాత్మక సాహిత్య సంఘం, న్యూ ఢిల్లీ, అంతర్జాతీయ తులనాత్మక సంఘం ఎక్స్ ఆఫీసియో సభ్యునిగా సేవలందించారు. కుప్పం ద్రావిడ విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సెలర్‌గా శ్రీ గంగిశెట్టి గారు అందించిన సేవల్ని పలువురి ప్రశంసలు అందుకున్నాయి. యూనివర్సిటీ చట్టం సెక్షన్ 12 (బి) క్రింద కుప్పం యూనివర్సిటీకి గుర్తింపు సాధించారు. దాని వలన ఆ యూనివర్సిటీ యూజీసీ నిధులు పొందడానికి అర్హత పొందింది. 2006 – 2007 సం లో కర్ణాటక ప్రభుత్వం నుండి సాధించిన 50 లక్షల నిధులతో అక్క మహాదేవీ బాలికల హాస్టల్ బిల్డింగ్ నిర్మించారు. ఆ తర్వాత కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన 10 లక్షలతో ‘తుళు’ అధ్యయన పీఠం స్థాపించారు. యూనివర్సిటీలో ప్రచురణ విభాగం ఏర్పాటు చేయడంతో పాటు దాదాపు పదిహేను ఎకరాలలో పదివేల మూలికా వృక్ష జాతులను సేకరించి మూలికా వనం అభివృద్ధి చేశారు. 2008 సంవత్సరంలో తమిళనాడు ప్రభుత్వం నుండి టీచింగ్ పోస్టులకు అనుమతి సంపాదించడం గంగిశెట్టి గారు సాధించిన ఘన విజయం. రాష్టంలో ఇంటిగ్రాటెడ్ కోర్సెస్ ప్రవేశ పెట్టిన మొదటి విశ్వవిద్యాలయంగా కీర్తి గడించారు. తెలుగు, తమిళ, కన్నడ కోర్సెస్‌తో పాటు కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, కామర్స్, మాథ్స్, మొదలైన ఆధునిక సబ్జక్ట్స్ ప్రవేశ పెట్టారు.
ఇలా తాను చేపట్టిన ఏ రంగంలోనైనా ఉన్నత ప్రమాణాలతో, సుదీర్ఘ లక్ష్యాలతో, పనిచేసిన విజనరీ శ్రీ గంగిశెట్టి. జ్ఞాన కర్మ మార్గాలలో పరుగెట్టి పరుగెట్టి.. దివి కేగిపోయారు ఆచార్య గంగిశెట్టి.