Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నల్లజాతి స్త్రీల అస్తిత్వ పోరాటం ‘గర్ల్, వుమన్, అదర్’

[బుకర్ ప్రైజ్ గెల్చుకున్న, బర్నార్డిన్ ఎవరిస్తొ రచించిన ‘గర్ల్, వుమన్, అదర్’ అనే నవలని పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి.]

కొన్ని నవలలు చదువుతున్నప్పుడు రచయితలు ఆ కథను నిర్మించిన విధానానికి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎన్నో ఇతివృత్తాలు, మరెన్నో సమస్యలను కలగలిపి ఎన్నో పాత్రలను చిత్రీకరిస్తూ పూర్తి సమాజాన్ని మన ముందుకు ఓ పుస్తకంగా తీసుకురావడం ఆషామాషి వ్యవ్యహారం కాదు. ఎన్నో లింకులు ఏర్పరుస్తూ మళ్లీ అవి చిక్కు పడిపోకుండా, చర్చించే విషయాలలో ఎక్కడా స్పష్టత లోపించకుండా, కథను సృష్టించడం ఎంతో కష్టం. కాని బర్నార్డిన్, ఆన్నె మొబొలాజి ఎవారిస్తొ అనే ఓ ఇంగ్లీషు రచయిత్రి తన ‘గర్ల్, వుమన్, అదర్’ అనే నవలతో ఇది సాధించి చూపించారు. ఆంగ్ల సాహిత్యంలో విశిష్ట రచయిత్రిగా పేరు పొందిన ఈమె నైజీరియన్ తండ్రి, ఇంగ్లీషు తల్లికి జన్మించారు. మొదటి బ్రిటీష్ నల్లజాతి రచయిత్రిగా ఈమె ఈ పుస్తకానికి బుకర్ ప్రైజ్ అందుకుని చరిత్ర సృష్టించారు. అయితే ఈ బుకర్ ప్రైజ్‌ను ఆమె 2019లో మార్గరెట్ ఆర్ట్ వుడ్‌తో కలిసి పంచుకున్నారు. మార్గరెట్ రాసిన ‘ది టెస్టమెంట్స్’ పుస్తకానికి కూడా ఆ సంవత్సరం బుకర్ లభించింది.

‘గర్ల్, వుమన్, అదర్’ 30కి పైగా అవార్డులు అందుకున్న పుస్తకం వీటిలో బుక్ ఆఫ్ ది ఇయర్, ఇంకా డికేడ్ గౌరవాలు కూడా ఉనాయి. బరాక్ ఒబామా చెప్పిన 2019కి సంబంధించిన టాప్ 19 పుస్తకాలలో ఒకటిగానూ, 2019లో రోక్సేన్ గే కి ఇష్టమైన పుస్తకంగా కూడా ఇది గుర్తింపు పొందింది. 2020 బ్రిటిష్ బుక్ అవార్డ్స్‌లో ఫిక్షన్ బుక్ ఆఫ్ ది ఇయర్‌గా కూడా ఇది ఎన్నికయింది. రచయిత్రి ఎవరిస్టో ఆథర్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డును కూడా గెలుచుకున్నారు. అంతే కాక ఈ నవల ఫిక్షన్ విభాగంలో ఇండీ బుక్ అవార్డ్, గౌరవ ప్రోత్సాహక బంగారు పతకాన్ని కూడా గెలుచుకుంది. ఇది పొలిటికల్ ఫిక్షన్ విభాగంలో ఆర్వెల్ ప్రైజ్ కోసం, ఆస్ట్రేలియా బుక్ ఇండస్ట్రీ అవార్డ్స్ కోసం, ఫిక్షన్ ఫర్ ఉమెన్స్ ప్రైజ్ కోసం కూడా పోటీపడింది.

ఇన్ని అవార్డులు పొందిన ఈ పుస్తకంలో ముఖ్యాంశం ఏంటి అంటే ప్రపంచంలోని స్త్రీల జీవితం అని ఒక్క మాటగా చెప్పవచ్చు. ఇది చర్చించడానికి రచయిత్రి పన్నెండు స్త్రీ పాత్రలను సృష్టించారు. ఈ పన్నెండు పాత్రల ద్వారా జాత్యహంకారం, స్త్రీవాదం, రాజకీయాలు, పితృస్వామ్యం, వ్యక్తిగత విజయాలు, మానవ సంబంధాలు, లింగ భేధాలు, లైంగికత నడుమ గడిచే స్త్రీల జీవితాలు, వారి అంతర్ సంఘర్షణ, వీటన్నిటిని అధిగమిస్తూ వ్యక్తులుగా ఎదిగే స్త్రీల జీవన పోరాటాన్ని ఆమె చూపిస్తారు. అయితే ఈ పన్నెండు స్త్రీల జీవితాలూ వేటికవి వేరే. వీరందరిలోనూ ఉన్న సారూప్యత, వీళ్ళంతా నల్లజాతి స్త్రీలు అవడం ఒక్కటే. అంటే ఈ పుస్తకం ఇప్పుడు సమాజంలో ఉన్న విభిన్నమైన ప్రభావాల నడుమ నల్లజాతి స్త్రీల జీవిత సంఘర్షణలను చిత్రించింది.

కథను చెప్పడానికి రచయిత్రి ఎన్నుకున్న మార్గం కూడా వినూత్నంగా ఉంది. ఆమె ఈ పన్నెండు పాత్రలను నాలుగు భాగాలుగా విభజించారు. అంటే ఈ నవలలో నాలుగు అధ్యాయాలు ఉంటాయి. ప్రతి అధ్యాయానికి మూడు ఉప అధ్యాయాలు ఉంటాయి. ఒకో ఉప అధ్యాయం ఒకో స్త్రీ జీవిత కథ, ఆమె సంఘర్షణను వివరిస్తుంది. ఒకో అధ్యాయంలో వచ్చే ఈ మూడు పాత్రలే ఒకరికి ఒకరు సంబంధీకులు. ప్రతి పాత్ర జీవిత సంఘర్షణను కూడా దేనికది విలక్షణమైనదీ, ప్రత్యేకమైనదీ.

మొదటి అధ్యాయంలో ముగ్గురి జీవిత కథలుంటాయ్. అమ్మా, యాజ్, డామ్నిక్. అమ్మా ముగ్గురు మగ పిల్లల తరువాత నల్లజాతి తల్లితండ్రులకు పుట్టిన అమ్మాయి. ఆమె వివాహం చేసుకుని కుటుంబాన్ని చూసుకోవాలని, స్థిరపడాలని తండ్రి కోరిక. అతను పిల్లలకు స్వేచ్ఛ ఇచ్చి పెంచిన తండ్రే. కాని సమాజ నియమాల మధ్య కూతురు జీవించాలని కూడా కోరుకుంటాడు. అతనిలోని ఆ అధికార తత్వాన్ని అమ్మా తరుచుగా విమర్శిస్తూ ఉంటుంది. దానికి ఆమె తల్లి అతను ఘనాలో 1920లలో పుట్టిన వాడని, అమ్మ లండన్‌లో 1960లలో పుట్టిన స్త్రీ అని గుర్తు చేస్తుంది. ఇతర పురుషులతో పోలిస్తే అతనెంతో స్వతంత్ర భావాలున్న వ్యక్తి అని అమ్మా తల్లి వివరిస్తుంది. అయినా అమ్మాకు తండ్రిలోని అధికారి, పితృస్వామ్య ప్రతినిధి నచ్చడు. అతనికి అనుకూలమైన భార్యగా జీవించి కొన్నాళ్ళకు అమ్మా తల్లి చనిపోయినప్పుడు, అమ్మా తండ్రిని ద్వేషిస్తుంది. కాని వయసుతో వచ్చిన పరిపక్వతతో తండ్రి చనిపోయిన తరువాత అతని జీవితాన్ని పునఃపరిశీలిస్తుంది. తన మాతృ దేశాన్ని వీడి మరో దేశానికి దొంగగా వచ్చి బ్రతకవలసిన అతని పరిస్థితులు, అందులోనుండి వ్యక్తిగా ఎదిగిన అతని పోరాట తత్వం ఇవన్నీ ఆమెకు అప్పుడు అర్థం అవుతాయి. తన స్త్రీవాది కళ్లద్దాల నుండి తండ్రిని చూస్తూ తాను ఉండిపోయానని, ఆయన పడ్డ సంఘర్షణ నుండి రాటుదేలి వ్యక్తిగా ఆయన ఎదిగిన విధానంలో ఓ గొప్పతనం ఉంది అని అమ్మా చివర్లో అంగీకరిస్తుంది. మగవాడు సంపూర్ణంగా స్త్రీవాదిగా మారాలంటే దానికి సహకరించే పరిస్థితుల అవసరం కూడా అతని జీవితంలో ఉంటుందని అని ఆమెకు అర్థం అవుతుంది. మనుషులను చూసే తీరులో, అభిప్రాయాలను ఏర్పరుచుకునే విధానంలో అమ్మాలో ఎంతో మార్పు వస్తుంది.

అమ్మాకు నాటకరంగంలో పెద్ద దర్శకురాలిగా పేరు తెచ్చుకోవాలని కోరిక. కాని నల్లజాతి స్త్రీలెవరూ ఆ రంగంలో ఇంతకు ముందు అడుగు పెట్టలేదు. పైగా అమ్మ లెస్బియన్. కొన్ని చేదు మిగిల్చిన సంబంధాలు, అనుభవాల తరువాత అమ్మా – డామ్నిక్ అనే స్త్రీ తో కలిసి ఉంటుంది. సమాజంలో ఇన్ని వైరుధ్యాల మధ్య వ్యక్తిగా ఎదగడానికి ఆమె ఎంతో కష్టపడుతుంది. ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కుంటుంది. అయినా పట్టుదలతో నాటక రచయితగా ఎదుగుతుంది. నాటకాలను రాసి దర్శకత్వం వహించే స్థితికి చేరుకుంటంది.

అమ్మా స్నేహితుడు ఒకతను గే అయితే అతన్ని వివాహం చేసుకుని ఓ బిడ్డకు తల్లి అవుతుంది అమ్మా. బిడ్డ కోసం ఆమె ఈ మార్గాన్ని ఎన్నుకుంతుంది. యాజ్‌ని ఆమె ఒంటరిగా ధైర్యంగా పెంచుకుంటుంది. యాజ్ తండ్రి దగ్గరా అంతే ప్రేమను స్నేహాన్ని పొందుతుంది. ఓ బిడ్డకు తండ్రి అవ్వాలనే అతనూ ఈ బంధానికి ఒప్పుకుంటాడు.

తన ఇంటి వాతావరణం, తల్లి లెస్బియనిజం ఇవన్నీ అర్థం చేసుకుంటూనే స్వతంత్ర భావాలున్న స్త్రీగా ఎదుగుతుంది యాజ్. యూనివర్సిటీలో ఆమె స్నేహితులు వివిధ మతస్థులు, వివిధ దేశాలకు చెందిన వాళ్ళు. కాని దోపిడీ సమాజంలో సంఘర్షణను అనుభవిస్తూ ఎదిగిన వారితోనే యాజ్ స్నేహ బంధాన్ని ఆస్వాదిస్తుంది. ఈమె బృందంలో ఈజిప్ట్‌కు చెందిన ఓ ధనికుని కూతురు కూడా ఉంటుంది. ముందుగా నల్లజాతి స్త్రీ అని ఆమెతో స్నేహం చేసినా యాజ్‌కు ఆమె అహం, డబ్బు మదం అన్నీ క్రమంగా తెలిసి వస్తాయి. ఆమె డబ్బు ఇచ్చి తన రీసెర్చ్ పేపర్లను పేద స్టూడెంట్లతో రాయించుకుని డిగ్రీ సంపాదించే ప్రయత్నంలో ఉందని యాజ్‌కు తెలుస్తుంది. నల్లజాతికి చెందినంత మాత్రాన ఆ జాతి కడగండ్లు వారికి అర్థం కావని, ఒబామా కన్నా తెల్లజాతి తల్లి తండ్రులకు పుట్టి ఎంతో పేదరికంతో దోపిడిని అనుభవించి జీవిస్తున్న వాళ్లకు దోపిడి అర్థం తెలుస్తుందని, దోపిడిని అర్థం చేసుకోవడానికి జాతి కన్నా ఆ వ్యక్తుల జీవన స్థితిగతులు అధారం అవ్వాలని, పందొమ్మిదేళ్ళ యాజ్ అనుభవపూర్వకంగా తెలుసుకుంటుంది. ఓ జాతి పేరుతో మాత్రమే మనుషులను ఓ గాటికి కట్టేయకూడదనే ప్రాథమిక సూత్రం ఆమెకు అవగతం అవుతుంది. అందుకే స్త్రీవాదిగా ఉంటూనే హిజాబ్‌ను ధరించే ముస్లిం స్త్రీని కూడా ఆమె అర్థం చేసుకోగలుగుతుంది.

డామ్నిక్ అమ్మాతో బంధంలో ఉంటుంది. ఇద్దరూ తమ సొంత నాటక సమాజంలో పనులు చూసుకుంటూ ఉంటారు. డామ్నిక్ యాజ్‌కు గార్డియన్ గానూ వ్యవహరిస్తుంది. కాని ఈమె జింగా అనే మరో స్త్రీ ప్రేమలో పడుతుంది. జింగా తెల్లజాతీయుల పట్ల అమితమైన ద్వేషంతో వ్యవహరిస్తూ ఉంటుంది. నల్లవాళ్లని బానిసలుగా ఉపయోగించుకున్న తెల్లవాళ్లపై ఆమె కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అమ్మా స్నేహంలో డామ్నిక్ తన సొంత ఆలోచనలను పెంపొందించుకుంటుంది. నల్లవాళ్ళను తెల్లవారికి బానిసలుగా అమ్మింది నల్లజాతీయులే కదా అన్న మాటను ఆమె జింగా దగ్గర అనలేకపోతుంది. జింగా ఆమెను ఎంతగా ప్రభావితం చేస్తుందంటే డామ్నిక్ ఆమె మత్తులో పూర్తిగా పడిపోతుంది. జింగా తల్లి తండ్రులిద్దరూ మత్తుకు బానిసలు. ఆ ఇంట్లోనే ఆమెపై ఎన్నోసార్లు లైంగిక దాడి జరగడంతో స్కూల్లో టీచర్‌కు తన పరిస్థితితి చెప్పి తమ్ముడితో పాటు సోషల్ వెల్ఫేర్ లోకి వెళ్తుంది జింగా. వాళ్లని ప్రేమించలేని వారి మధ్యే ఆమె ఎదుగుతుంది. తమ్ముడు, జింగా లెస్బియన్ అని తెలిసి ఆమెను వదిలేస్తాడు. అయినా ఒంటరిగా ఎదిగి అమెరికాలో భవంతులు నిర్మించే రంగంలో స్థిరపడుతుంది జింగా. జింగా వ్యక్తిత్వం డామ్నిక్‌ను ఆకర్షిస్తుంది. అమ్మాతో బంధానికి స్వస్తి చెప్పి ఆమెతో కలిసి అమెరికా వెళ్లిపోతుంది డామ్నిక్.

అమ్మా జింగాలోని అభద్రతాభావం, ఆధిపత్య స్వభావాన్ని గమనిస్తుంది. ఆమెతో జీవితం బావుండదని డామ్నిక్‌కు ఆమె నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుంది. కాని ప్రేమలో మునిగి ఉన్న డామ్నిక్ అమ్మా మాటలు వినదు. జింగాతో ఆమె ఒంటరిగా అమెరికా వెళ్లిపోతుంది. అయితే అక్కడ ఆమె జీవితం జింగాతో నరకప్రాయం అవుతుంది. ఒక రకమైన జైలు జీవితం గడుపుతుంది. డామ్నిక్‌కి అమ్మ రాసే ఉత్తరాలేవీ ఆమెకు చేరకుండా జాగ్రత్తపడుతుంది జింగా. డామ్నిక్‌ని చూడాలని అమ్మా అమెరికా వెళ్లినా డామ్నిక్‌తో ఆమె మనసుతీరా మాట్లాడలేక పోతుంది. కొన్నాళ్లకు మరో స్నేహితురాలి సహాయంతో జింగాను వదిలించుకుని పారిపోతుంది డామ్నిక్. కాని ఆమెకు ఓడిపోయి ఇంగ్లండ్ వెళ్లాలనిపించదు. అదే దేశంలో ఉంటూ ఒంటరిగా ఆమె మళ్లీ జీవితాన్ని మొదలెడుతుంది. క్రమంగా పోగొట్టుకున్న ఆత్మవిశ్వాసాన్ని తిరిగి సంపాదించుకుని అక్కడే స్త్రీల ఆర్ట్ ఫెస్టివల్ మొదలెట్టి తనకు ఇష్టమైన రంగంలో పేరు సంపాదించుకుంటుంది.

ఈ అధ్యయంలో లెస్బియన్ల మధ్య జీవితం గురించి, వారి సంబంధాలలో వాళ్లు ఎదుర్కునే సమస్యలను చర్చిస్తూనే వారి సంఘర్షణను చూపిస్తుంది రచయిత్రి. అమ్మా స్త్రీవాదాన్ని అకళింపు చేసుకుంటూనే తన తండ్రిని అర్థం చేసుకున్న విధానం, తన జీవితాన్ని, తన లైంగికతను ప్రకటిస్తూ జీవితంలోని సంఘర్షణలను ఎదుర్కున్న విధానం, నల్లజాతి స్త్రీలెవరూ ప్రవేశించని నాటక రచనారంగంలో తనదైన ముద్ర వేసుకోగలిగిన ఆమె ప్రతిభను రచయిత్రి ప్రస్తావిస్తూనే మరో పక్క ఆమె కూతురు యాజ్ జీవితాన్ని కూడా చూపిస్తుంది. తన తల్లి జీవన సరళిని తాను అనుకరించనని ప్రకటిస్తూ పరుషుల పట్ల తన ఆకర్షణను స్పష్టంగా తెలియజేస్తుంది యాజ్. అలాగే నల్లజాతీయులందరూ దోపిడిని ఎదుర్కుంటున్నారనే దృష్టితో వారిని హృదయాలకు హత్తుకోవడం తప్పని, తెల్లవారందరూ దోచుకునేవాళ్ళే అనుకుని వారిని ద్వేషించడం ఇంకా తప్పని అర్థం చేసుకుంటుంది యాజ్.

డామ్నిక్ జింగాల మధ్య అనుబంధంలో జింగా ఒక పురుషునిలాగే డామ్నిక్ జీవితాన్ని డామినేట్ చేస్తుంది. అంటే ఆధిపత్య భావం కేవలం పురుషులు మాత్రమే ప్రదర్శించరని, మానసికంగా ఇతరులను తమ అధీనంలో ఉంచుకుని అధికారాన్ని ప్రకటించే గుణం పురుష స్వభావానికే పరిమితం కాదని, అది లింగపరమైన సమస్య కాదని, వ్యక్తుల మానసిక అపరిపక్వతకు, అభద్రతాభావానికి నిదర్శనం అని స్పష్టపరుస్తుంది రచయిత్రి. అలాగే లెస్బియనిజం అధికారపూరిత సంబంధాలకు అతీతం కాదన్న విషయాన్ని కూడా స్పష్టంగా వివరిస్తారు రచయిత్రి.

ఇక రెండవ అధ్యాయంలో కారోల్, బుమ్మి, లతీషాల జీవితాలుంటాయి. కారోల్ స్కూలులో ఉండగా లైంగిక దాడికి గురవుతుంది. ఇది ఆమెలో ఎంతో అభద్రతాభావాన్ని పుట్టిస్తుంది. కాని తన టీచర్ షిర్లే సహాయంతో ఆమె ఆ క్లిష్ట పరిస్థితుల నుండి బైట పడుతుంది. తనకేం జరిగిందో ఆమె ఎవరికీ చెప్పదు. జీవితంలో ఎదగాలని పట్టుదలగా చదివి బాంకింగ్ రంగంలో ఓ కంపెనీకి హెడ్డుగా ఉన్నతి సాధిస్తుంది.

బుమ్మి కరోల్ తల్లి. ఆమె తండ్రి చనిపోతే బంధువులు ఆమెను తమ ఇంటి పిల్లగా అంగీకరించపోతే ఒంటరిగా తల్లి కూలి పని చేసి బుమ్మిని పెంచుతుంది. ఆమె చనిపోయాక బంధువుల ఇంట్లో ఎన్నో కష్టాల మధ్య బాల్యం వెల్లదీస్తుంది బుమ్మి. లెక్కల్లో ఆమె ఎంతో ప్రతిభ కనపరిచేది. కాలేజీలో ఆమెకు అగస్టిన్ పరిచయమవుతాడు. ఎకనమిక్స్‌లో పీ.హెచ్.డి చేసిన అగస్టీన్‌ని ఆమె ప్రేమించి వివాహం చేసుకుంటుంది. కాని తమ దేశంలో మనుగడ లేదని బ్రిటన్ చెరుతుంది ఈ జంట. వారి చదువుకు ఇక్కడా సరైన ఉద్యోగం రాదు. చిన్న చిన్న పనులు చేస్తూ జీవితం మొదలెడతారు ఇద్దరూ. కారొల్ పుట్టాక ఆమె చదువు గురించి ఎన్నో కలలు కంటారు. పని భారంతో అగస్టీన్ హార్ట్ అటాక్‌తో చనిపోతే ఒంటరిగా ఇళ్లల్లో పని చేస్తూ కూతురిని పెంచుతుంది బుమ్మి. ఇంటి పని చేస్తూనే బిడ్డకు స్వయంగా చదువు చెప్తుంది. తల్లి సహాయంతోనే కారోల్ మంచి స్టూడెంట్‌గా ఎదుగుతుంది. ఆ శక్తే ఆమె తరువాత తన పై జరిగిన లైంగిక దాడి అనుభవాన్ని ఎదుర్కునే వనరుగా మారుతుంది. బుమ్మి కారొల్ స్కూల్లో టీచర్ పెనిలేప్ ఇంట్లోనూ పని చేస్తుంది. అయితే ఆమె తమను పోలిన శరీర రంగుతోనే ఉన్నా తల్లి తండ్రులు తెల్లవారని అహాన్ని ప్రదర్శించడం బుమ్మికి నచ్చదు. కూతురు పెద్దదయిన తరువాత ఇంగ్లండ్ టీనేజర్‌గా నచ్చిన వారితో డేటింగ్ చేయడం, తన మూలాలను మర్చిపోవడం, తనకు అండగా నిల్చిన టీచర్ షిర్లేని కూడా ఎప్పుడు తలుచుకోకుండా ఉండడం, ప్రేమించిన వ్యక్తితో తల్లి అనుమతి అడగకుండానే కలిసి జీవించడం, అతన్నే వివాహం చేసుకోవడం బుమ్మి భరించలేకపోతుంది. కాని బిడ్డ మీద ప్రేమతో అన్నిటిని సహిస్తూ కరోల్‌తో సత్సంబంధాలను కొనసాగిస్తుంది.

లాతీషా కరోల్ స్నేహితురాలు. ఆమెతో పాటే స్కూలులో చదువుతుంది. కాని ఆమెకు చదువు పట్ల ఎప్పుడు శ్రద్ధ ఉండదు. అలాంటి వాతావరణం ఆమె ఇంట్లో ఉండదు. తన తండ్రి అంటే లాతీషాకి ఎంతో ప్రేమ, కాని మరో స్త్రీ కోసం అతను భార్యను ఇద్దరు పిల్లలను వదిలి వెళ్లిపోతాడు. ఇది ఆమె పై ఎంతో ప్రభావం చూపుతుంది. జీవితం అంతా తండ్రిలాంటి ఓ వ్యక్తి ప్రేమను పొందాలని కోరుకుంటూ ఆమె మగస్నేహితులకు దగ్గరవుతూ ఉంటుంది. ఆమెలోని ఈ అభద్రతను మగవారు ఉపయోగించుకుంటూ ఉంటారు. లాతీషా తల్లి డిప్రెషన్ లోకి వెళ్లిపోతుంది. అప్పుడే తన అక్కకు తనకు ఒకరే తండ్రి కాదన్న నిజం కూడా తెలుస్తుంది. లాతాషా తల్లికి తాను ప్రేమీంచిన వ్యక్తి ఓ సాడిస్ట్ అని గర్భవతి అయిన తరువాత తెలుస్తుంది. దానితో ఆమె అతన్ని వదిలి పారిపోతుంది. కూతురు గర్భంలో ఉండగానే ఆమెకు మరొకతను పరిచయం అవుతాడు. ఆమెను కోరి పెళ్లి చేసుకుంటాడు. తరువాత అతనితో ఆమెకు లాతీషా పుడుతుంది. అలా ఆమె బిడ్డలకు తండ్రులు వేరు. అయితే ఈ సంగతి తెలిసిన తరువాత లాతీషా అక్క మానసికంగా ఒంటరిదవుతుంది. దీనితో లాతీషా ఇంటి వాతావరణమే మారిపోతుంది. ప్రేమ కోసం ఆమె మగపిల్లలతో చనువుగా ఉండడం మొదలెడుతుంది. ముగ్గురు మగవారితో ముగ్గురు పిల్లలని కంటుంది. ఒకరి తరువాత ఒకరు ఆమెను ఉపయోగించుకుని వదిలేసి వెళ్లిపోతారు. కాని పిల్లల పట్ల ప్రేమతో ఆమె వాళ్ల కోసం కష్టపడడం మొదలెడుతుంది. ఆమె తండ్రి తప్పు తెలుసుకుని తిరిగి వచ్చాక లాతీషా తన ముగ్గురు పిల్లలకు ఓ మగ అండ దొరుకుతుందని భావిస్తుంది. ప్రేమ గురించి వెతుకులాట మానేసి తన పిల్లలను బాధ్యతగా పెంచుకోవడానికి కష్టపడి పని చేయడాన్ని తన జీవితంలో మొదటి ప్రాధాన్యతగా స్వీకరిస్తుంది.

ఈ రెండో అధ్యాయంలో లైంగిక దాడితో మనసికంగా కృంగిపోయిన కారోల్ చదువు అనే ఆయుధంతో ఎదగడం చూస్తాం. చదువును నిర్లక్ష్యం చేసిన లాతీషా కష్టపడడం కూడా చూస్తాం. చివరకు కొన్ని చెడు అనుభవాల తరువాత ఓ గాటికి జీవితాన్ని తెచ్చుకుని తల్లిగా కొత్త జీవితాన్ని మొదలుపెట్టడానికి ధైర్యాన్ని కూడగట్టుకోవడం కూడా చూస్తాం.

ఉన్నతమైన స్థితికి చేరిన కారొల్ తన తల్లిని, చదువు చెప్పిన గురువును వారిద్దరి శ్రమను లెక్కచేయని స్థితికి చేరుకోవడం గమనించవచ్చు. ఆర్థికమైన ఉన్నతి మనిషి కళ్లను ఎలా కప్పేస్తుందో, దోపిడికి గురయిన జాతులలోనూ ఈ స్వార్థం సాధారణంగా ఎలా వారిని తమవారి నుండి దూరం చేస్తుంది అన్నది కారోల్ జీవితంలో గమనించవచ్చు. జీవితాన్ని అర్థం చేసుకుని తన ప్రాధాన్యతనలను సరి చూసుని లాతీషా తిరిగి పోరాడే తత్వాన్ని అలవర్చుకోవడం కూడా గమనిస్తాం.

మూడవ అధ్యాయం షిర్లే, విన్సోమ్, పెనిలోప్‌ల కథ. షిర్లే ఎన్నో ఆదర్శభావాలతో నల్ల జాతీయుల స్కూలులో టీచరుగా పని చేస్తూ ఉంటుంది. దారి తప్పిన పిల్లలకు, నల్లజాతీయులకు ఏదో చేయాలనే తపన ఆమెది. అది ఇతరులకు అర్థం కాదు. పిల్లల కోసం ఆమె పడే తాపత్రయం చూసి మిగతా వాళ్లు నవ్వుకుంటారు. ఆమె తన పనిలో ఒంటరిదవుతుంది.

షిర్లే చిన్నప్పటి నుండి ఆదర్శభావాలతో పెరుగుతుంది. ఇంట్లో ఆమె అన్నదమ్ములకు చదువు అబ్బదు. ఆడపిల్లగా వివక్షతో పెరిగిన ఆమె జీవితంలో యూనివర్సిటీ వరకు ఎదగడం ఓ రకంగా జీవితంతో చేసిన యుద్దమే. స్కూలులో టీచర్‌గా చేరాక తోటి తెల్లజాతి టీచర్లు ఆమెను పట్టించుకోరు, ఒంటరిని చేస్తారు. ఆమె ఈ అవమానాలనూ సహిస్తుంది. కాస్త తన రంగుకు దగ్గరగా ఉన్న పెనిలీప్ అనే సీనియర్ టీచర్‌ను ఆమె పలకరించబోతే ఆమె చూడనట్లు వెళ్లిపోతుంది. తెల్లవారి ఇంట దత్తపుత్రికగా పెరిగిన పెనిలోప్ తెల్లవారి అహాన్నే ప్రదర్శిస్తుంది. నల్లజాతి పిల్లలను విమర్శిస్తుంది. ఆమెతో షిర్లే ఓ సందర్భంలో విభేదిస్తుంది. మనం తప్ప వారిని ఎవరు సరి చేయగలరు అని టీచర్లకు ఎదురు తిరుగుతుంది. తనను అర్థం చేసుకున్న లిన్నోక్స్ అనే లాయర్ ను షిర్లే వివాహం చేసుకుంటుంది. అందరిలా భార్య తన చెప్పు చేతలలో ఉండాలని అతను అనుకోడు. ఇంటి పనులలోనూ ఆమెకు సాయం చేయడానికి అతనికి అహం అడ్డు రాదు. లిన్నోక్స్‌తో ఆమె కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతూ ఉంటుంది. తన మొత్తం శక్తిని ఆమె స్కూల్లో పిల్లలపై కేంద్రీకరిస్తూ పిల్లలకు ఎంతో దగ్గర అవుతుంది.

షిర్లే అమ్మా కలిసి ఒకే స్కూల్లో చదువుకున్నారు. అమ్మా లెస్బియన్ అని తెలిసిన తరువాత కూడా ఆ స్నేహాన్ని అలాగే కొనసాగిస్తుంది షిర్లే. ఆమెకు స్నేహితురాలిలోని ఈ కోణం నచ్చకపోయినా తమ బాల్య స్నేహానికి విలువ ఇస్తుంది. అందుకే తనకు అర్థం కాని ఈ కోణాన్నివదిలి అమ్మాతో చివరిదాకా స్నేహాన్ని కొనసాగిస్తుంది. తన పట్ల కూడా అందరూ అదే నమ్మకాన్ని విధేయతను చూపాలని కోరుతుంది. ఆమెకున్న టాలెంట్‌కు పెద్ద స్కూలులో అవకాశాలు రావచ్చు. కాని ఆమె జాతి, రంగు దీనికి అడ్డుపడతాయి. దానితో జీవితంతో సర్ధుకుపోతుంది తప్ప తన వృత్తిపై ఆమెకు నిర్లక్ష్యం ఉండదు. అందుకే మంచి స్టూడెంట్ అయిన కారోల్ చదువులో వెనక పడిపోతూ ఉంటే బాధపడుతుంది. చివరకు కారోల్ ఆమె సహాయం అర్ధిస్తే నిస్వార్థంగా ఆమెకు ఎంతో సహాయం చేస్తుంది. స్కూలు తరువాత కూడా ఎంతో సమయం ఆమె కోసం వెచ్చిస్తుంది. కారోల్ చివరకు కేంబ్రిడ్జ్‌లో స్కాలర్‌షిప్ సంపాదించి వెళ్లిపోతుంది. కారోల్ అక్కడి దాకా వెళ్ళడానికి షిర్లే చాలా కష్టపడుతుంది. కారోల్ పెద్ద బాంకింగ్ కంపెనీకి డైరెక్టర్ అయి తనను మర్చిపోవడం, కనీసం తనను కలవడానికి ఒక్కసారి కూడా రాకపోవడం ఆమెకు ఎప్పుడూ మనసులో ముల్లులా గుచ్చుకుంటూనే ఉంటుంది. తన జీవితంలోనే తాను సాధించిన విజయం కారోల్ ఎదుగుదల కాని కారోల్ తనను మర్చిపోవడం ఆమెను ఎంతగానో కృంగదీస్తుంది.

విన్సోమ్ షిర్లే తల్లి. విన్సోమ్ ఓ బస్ కండక్టర్‌గా ఉద్యోగం చేస్తుంది. ఎన్నో కష్టాలను ఎదుర్కుని కుటుంబాన్ని పోషిస్తుంది. ఆమె భర్త కూడా కాయకష్టం చేసుకుని బతికే శ్రమజీవి. జాలర్ల కుటుంబాలకు చెందిన వారిద్దరూ తమ గత జీవితాన్ని వదిలి కొత్త ప్రపంచంలో జీవించాలనుకుని ఇంగ్లండ్ చేరతారు. కాని అక్కడా వివక్షనే ఎదుర్కుంటారు. చివరకు లండన్‌లో సంసారాన్ని ఏర్పాటు చేసుకున్నారు. షిర్లే లిన్నోక్స్ తో డేట్ చేస్తూ తల్లి తండ్రులకు అతన్ని పరిచయం చేసిన రోజు నుండి విన్సోమ్ లిన్నోక్స్ ఆకర్షణలో పడిపోతుంది. షిర్లేకి పిల్లలు పుట్టాక ఈ అత్తా అల్లుళ్ళ మధ్య శారీరిక సంబంధం ఏర్పడుతుంది. ఒక సంవత్సరం దాకా ఈ కథ నడిచిన తరువాత లిన్నోక్స్ విన్సోమ్‌తో బంధాన్ని తెంచుకుంటాడు. అల్లుడిగా ఆ ఇంటికి మామూలుగా వస్తూనే ఉంటాడు. వారి మధ్య నడిచిన కథ వారిద్దరికే తెలుసు. భర్త తనను ఎప్పుడూ మోసం చేయడని షిర్లే గర్వంగా తల్లితో చెప్తూనే ఉంటుంది దానికి విన్సోమ్ అది షిర్లే అదృష్టం అని బదులిస్తూనే ఉంటుంది.

పెనిలోపే షిర్లే స్నేహితురాలు. తెల్ల జాతీయులు ఆమెను దత్తత తీసుకుని పెంచుతారు. ఆమె పదహారో పుట్టిన రోజున ఆమెకీ విషయం తండ్రి చెబుతాడు. తన ఆహార్యం, శరీరం, రంగు తన తల్లి తండ్రుల కన్నా వేరేగా ఉండడం ఆమె గమనిస్తుంది. తాను వారికి సొంత కూతురిని కానన్న నిజం ఆమెను లోలోన తినేసూ ఉంటుంది. తనకో భధ్రతనిచ్చే స్వంత కుటుంబం కావాలని ఆమె కోరుకుంటుంది. రెండు సార్లు వివాహం చేసుకుంటుండి. ఆ జీవితం ఆ భర్తలు అమెలోని వెలితిని నింపలేకపోతారు. ఆమె పిల్లలు తమ తండ్రిని ప్రేమించినంతగా పెనిలోప్‌ను ప్రేమించరు. తాను ఎంత కష్టపడి వారితో మానసికంగా కలవాలనుకున్నా ఏదో దూరం ఆమెను బాధిస్తూనే ఉంటుంది. చివరకు మనవళ్ళతోనూ, తనకే అర్థం కాని జీవితంతోనూ నిస్సారగా ఆమె బ్రతుకీడుస్తూ ఉంటుంది.

ఈ అధ్యాయంలో విలువలతో జీవిస్తూ చుట్టూ ఉన్నవారిని ఎంతో ప్రేమించి నమ్మిన షిర్లేని ఆమె భర్త ఆమె తల్లీ మోసం చేయడం చూస్తాం. షిర్లే ప్రపంచం నుండి తనను తాను కాపాడుకోవాలనుకుంటుంది. బాధ్యతను, నీతిని అంటి పెట్టుకుని జీవిస్తుంది. కాని ఆమె నమ్మిన కుటుంబీకులే ఆమెకు ద్రోహం చేస్తారు. ఇది ఆమెకు తెలియదు, తెలిస్తే తట్టుకోలేదు. ఆ మోసపూరిత జీవితమే తనదనే మాయలో ఆమె జీవిస్తూ ఉంటుంది.

పెనీలోప్ కూడా తనది కాని జీవితాన్నే జీవిస్తుంది. తెల్లవారి ఇంట పెరుగుతుంది. నల్లవారిని ద్వేషిస్తుంది. వారికి దూరంగా ఉండాలని షిర్లేని కూడా దూరం పెడుతుంది. కాని ఆమె దగ్గరే నిజమైన స్నేహాన్ని పొందుతుంది. ఏదో ఆశించి చేసుకున్న ఆ రెండు వివాహాలు ఆమెకు తనది కాని ప్రపంచాన్ని అందిస్తాయి. అందులో ఇమడలేక, తానెవరో తెలియక ఆమె ఎవరికీ చెప్పలేని ఒంటరితనాన్ని అనుభవిస్తుంది. కుటుంబం కొన్ని సార్లు మనుషులను ఎంతగా మోసం చేసుందో, అశాంతి పాలు చేస్తుందో చెప్పడానికి షిర్లే, పెనిలోప్‌ల జీవితాలే ఉదాహరణలు. మానవ సంబంధాలలోని నిజాలను వెలికి తీస్తె ఈ ప్రపంచంలో కోట్లాది మనుషులు కలిసి జీవించలేరు. మనవ సంబంధాలలోని డొల్లతనాన్ని ఈ అధ్యాయంలో రచయిత్రి చర్చిస్తారు.

ఇక నాలుగవ అధ్యాయం మేగన్, హాటి, గ్రేస్‌ల కథ. మేగన్ అమ్మాయిగా పుట్టి అబ్బాయిలా ఉండాలని కోరుకునే టీనేజర్. కాని ఆమె తల్లి ఆమెను పూర్తిగా అమ్మాయిలా పెంచాలని కోరుకుంటుంది. వీరి ముత్తల్లి హాటీ తరం నుండి తెల్లవారిని వివాహం చేసుకోవడంతో ఆ కుటుంబంలో అందరూ తమ నల్లరంగుని వదిలించుకున్నారు. మెగన్ తల్లి తండ్రులు ఇద్దరి శరీర వర్ణాలు కూడా ఒకటి కాదు. అలా మేగన్ నాలుగు జాతులు కలిసిన నవతరానికి ప్రతినిధి. యుక్త వయసులోకి వచ్చేసరికి ఆమె శరీరంలో మార్పులు ఆమెకు అసహ్యంగా అనిపించడం మొదలవుతుంది. దానితో స్కూలు మానేస్తుంది మేగన్. తనకు స్త్రీల సాంగత్యం ఇష్టం అని ఆ శరీరం తనది కాదని ఆమెకు అనిపిస్తుంది. తాను స్త్రీ శరీరంలో ఉన్న మగవాడినని ఆమెకు అర్థం అవుతుంది. ఇల్లు వదిలేసి తనలాంటి వారితో కలిసి ఉండడం మొదలెడుతుంది. అలా మగవాడిగా పుట్టి స్త్రీగా మారిన బీబి ఆమెకు పరిచయం అవుతుంది. బీబీ స్నేహంతో లింగభేధమే లేని కొత్త జాతి తనకు కావాలనే కోరిక మేగన్ లో మొదలవుతుంది. తన పేరు మార్గన్ గా మార్చుకుంటుంది మేగన్. పురుషునిగానే తనను గుర్తించి బీబీతో కలిసి ఉండడం మొదలేడతాడు మార్గన్.

మార్గన్‌ను తన కుటుంబంగా స్వీకరించేది అతని ముత్తమ్మ గిగి మాత్రమే. అందుకే వీరి మధ్య మంచి స్నేహం ఉంటుంది. యూనివర్సిటీలో తనలాంటి వారి సమస్యలపై ఓ టాక్ ఇస్తాడు మార్గన్. అక్కడ యాజ్‌తో ఏర్పడిన పరిచయం మంచి స్నేహంగా మారుతుంది. మార్గన్ మాటలతో స్వేచ్ఛకు కొత్త అర్థాలను కనుగొంటుంది యాజ్. లెస్బియన్ తల్లి, గే తండ్రి నడుమ పెరుగుతూ, వివక్షను అనుభవించి పెరిగిన తన స్నేహితుల జీవితాలను అర్థం చేసుకుంటూ మార్గన్ పరిచయంతో లీంగ వివక్షకు సంబంధించి కొత్త దృక్కోణాన్ని యాజ్ అర్థం చేసుకుంటుంది.

హాటి జీజి అసలు పేరు. ఆమె తల్లి తండ్రులు ఎంతో ఆ ప్రాంతంలో వ్యవసాయం చేసేవాళ్ళూ. ఓ పెద్ద ఎస్టేట్‌ను వాళ్ళు కొనుగోలు చేసి అక్కడ వ్యవసాయం చేసేవాళ్లు. వారి వారసత్వాన్ని జిజి కొనసాగిస్తుంది. కాని ఆ భూమిపై ఆమెకు పుట్టిన పిల్లలెవరికీ ప్రేమ ఉండదు. వారి దృష్టిలో అది కేవలం ఆస్తి మాత్రమే. అందుకే చివరి దాకా అక్కడే ఒంటరిగా జీవించాలని మొండి పట్టుదల ప్రదర్శిస్తుంది తొంభై మూడేళ్ళ జీజి. ఆమె పట్టుదల మార్గన్‌కి తప్ప ఎవరికీ అర్థం కాదు. అయితే ఆమె జీవితంలో ఓ రహస్యం ఉంది. పద్నాలుగేళ్ళ వయసులో ఆమె ఓ బిడ్డకు తల్లి అవుతుంది. ఆ బిడ్డను ఆమె తల్లి గ్రేస్ ఎవరికో ఇచ్చేస్తుంది. ఈ సంగతి హాటి ఎవరితోనూ చెప్పదు.

హాటీ తల్లి గ్రేస్ ఆమె తల్లికి వివాహం కాకుండా పుట్టింది. గ్రేస్ తల్లి ఒంటరిగా బిడ్డను పెంచుతుంది. కాని టీబీ రావడంతో ఆమెను బలవంతంగా హాస్పిటల్‌కు పంపించేస్తారు. దీనితో ఆమె శాశ్వతంగా గ్రేస్‌కు దూరం అవుతుండి. గ్రేస్ అనాథ ఆశ్రమంలో పెరుగుతుంది. జోసెఫ్‌ను వివాహం చేసుకుని ఆ ఫార్మ్‌కి యజమానురాలి హోదాతో వస్తుంది. కాని గ్రేస్‌కు పుట్టిన పిల్లలు వరుసగా చనిపోతూ ఉంటారు. ఎంతో ప్రేమగా కొన్నాళ్లు పెంచుకున్న అమ్మాయి కూడా కొన్నాళకు చనిపోయాక గ్రేస్ డిప్రషన్ లోకి వెళ్లిపోతుంది. జోసెఫ్‌కు తనకో వారసుడు కావాలని కోరిక. దానితో గ్రేస్ కు స్ట్రెస్ పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య దూరం కూడా పెరుగుతుంది. అలాంటి సమయంలో తరువాత పుట్టిన హాటీకి పాలు తాపడానికి బిడ్డను తాకడానికి కూడా గ్రేస్ ఒప్పుకోదు. జోసెప్ బిడ్డను పెంచడానికి ఆయాని పెట్టుకుంటాడు. కాని ఓ మూడు సంవత్సరాలు ఆయా చేతులో హాటీ పెరిగాక గ్రేస్ బిడ్డకు మళ్ళీ దగ్గరవుతుంది. హాటీ తరువాత ఓ అమెరికన్‌ను పెళ్లి చేసుకోవడంతో ఆ ఇంట్లో వారసులందరీ రంగు పలచబడిపోయి వాళ్లు తెళ్లవారిలో కలిసిపోతారు.

అమ్మా తన నాటక ప్రదర్శనకు తెలిసిన వారందరినీ పిలుస్తుంది. ఆమె స్నేహితురాలు డామ్నిక్ అమెరికా నుండి వస్తుంది. యాజ్ స్నేహితులందరితో పాటు మార్గన్ కూడా ఆ ప్రదర్శనకు వస్తాడు. అమ్మా స్నేహితురాలు షిర్లే, అలాగే కారెల్ కూడా నాటకం చూడాలల్ని వస్తారు. కారెల్ షిర్లేను అక్కడ చూసిన తరువాత తాను మరచిపోయిన గతం మరోసారి ఆమె కళ్ళముందు కదులుతుంది. అమ్మ నల్లజాతి అస్తిత్వ పోరాటాన్ని నాటకంలో ప్రదర్శించే అది ఎందరి మనసుల్లోనో పాత గాయాలను రేపుతుంది. ఆ ప్రభావంలో పడి కారోల్ అన్నేళ్ల తన ప్రవర్తనకు సిగ్గుపడుతుంది. నాటక ప్రదర్శన విజయవంతంగా ముగుస్తుంది. నల్లజాతి స్త్రీల అస్తిత్వ పోరాటం ఓ రూపానికి చేరిందని అందరూ తృప్తి చెందుతారు.

పెనిలోప్ తన ఎనభయవ పుట్టినరోజుకు దగ్గరపడుతూ ఉంటుంది. అయినా తనను వదిలేసిన తల్లితండ్రులు ఎవరన్న బాధ ఆమెను వదలదు. ఆస్ట్రేలియాలో ఉంటున్న కూతురు సారాకి తన కథ చెపుతుంది పెనిలోప్. సారా డీ.ఎన్.ఏ. టెస్ట్ ద్వారా తమ జాతి మూలాలను కనుక్కోవచ్చని పెనిలోప్‌కి చెబుతుంది. ఆ టెస్ట్ చేయిస్తుంది కూడా. తన డీ. ఎన్ ఏ. ఆఫ్రికా ఖండానికి దగ్గరగా ఉందనే రిజల్ట్ తెలుసుకుని పెనిలోప్ షాక్‌కు గురవుతుంది. తన రక్తంలో నల్లజాతి మూలాలుంటాయని ఆమె కలలో కూడా అనుకోలేదు. అయితే సారా ఇదే టెస్ట్ చేయించుకున్న వారి రిపోర్టుతో దీన్ని కలిపి చూస్తుంది. పెనిలోప్ డీ.ఎన్.ఏతో మాచ్ అయే వ్యక్తి పేరు ఆమెకు నెట్‌లో కనిపిస్తుంది. దానికి సంబంధించి మార్గన్ అనే వక్తికి ఫోన్ చేసి ఆ డీ.ఎన్.ఏ హాటి అని వాళ్ల ముత్తాతమ్మదని ఆమె కనుక్కుంటుంది. చివరకు తొంభై ఐదేళ్ళ హాటి తన కూతురు పెనిలోప్‌ను కలుస్తుకోవడం నవల ముగింపు.

ఈ అధ్యాయంలో హాటి పాత్రతో కొన్ని నల్లజాతీయ కుటుంబాలు తెల్లవిగా మారిన కొన్ని తరాల చరిత్ర వినిపిస్తుంది రచయిత్రి. అలాగే గోధుమరంగు శరీరం కల పెనిలోప్ తనలో నల్లజాతి మూలాలున్నాయని తెలుసుకోవడం మరో మలుపు. యూరోప్ చరిత్రలో ఇలాంటి ఎన్నో కథలు కలిసిపోయి ఉన్నాయి. నల్లజాతీయులు తెల్లరక్తంలో కలిసిపోయిన సోదర జాతి. దీన్ని గుర్తించక ఇంకా నల్ల విద్వేషాలతో రగిలిపోతున్న ప్రజలు తమ మూలాలలోకి తొంగి చూసుకోవాలని, అలా చూస్తే వారికే నమ్మలేని నిజాలు బయటపడతాయని చెప్పడం రచయిత్రి ఉద్దేశం. అలాగే ట్రాన్స్‌పర్సన్ల హక్కుల దిశగా కూడా మార్గన్ పాత్రతో చర్చ నడిపిస్తారు రచయిత్రి.

ఈ పన్నెండు నల్లజాతి స్త్రీల జీవితాలతో సమగ్రంగా నల్లజాతి అస్తిత్వాన్ని అక్షరబద్దం చేసారు రచయిత్రి. వారు ఎదుర్కున్న పరిస్థితులు, సామాజిక, రాజకీయ, లైంగిక వివక్ష, వీటన్నిటి నుండి పోరాడి పొందిన అస్తిత్వాన్ని దానికి సంబంధించిన నల్లజాతి సంఘర్షణను ఈ నవల ప్రస్తావిస్తుంది. అలాగే ఎల్.జీ.బీ.టీ హక్కులు, స్త్రీవాదం, కూడా ఈ నవలలో చర్చకు వచ్చిన అంశాలు. ఇన్ని అంశాలను అస్తిత్వ పోరాటాలను ఒక పుస్తకంలో కలిపి చర్చకు తేవడం నిజంగానే పెద్ద సాహసం. దాన్ని సమగ్రంగా నిర్వర్తించారు రచయిత్రి. అందుకే ఇది ఎందరో చర్చించే గొప్ప పుస్తకం అయింది. దీన్ని బుకర్ వరించింది.

***

Girl, Woman, Other (Novel)
Author: Bernardine Evaristo
Publisher: ‎ Penguin
Language: ‎ English
Paperback: ‎ 464 pages
Price: ₹ 336
For copies:
https://www.amazon.in/Girl-Woman-Other-WINNER-BOOKER/dp/0241984998

Exit mobile version