Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గిరిజన జీవన సంస్కృతి, సంప్రదాయాలు – ఒక పరిశీలన

[బానోత్ అనిల్ కుమార్ గారు రచించిన ‘గిరిజన జీవన సంస్కృతి, సంప్రదాయాలు – ఒక పరిశీలన’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

‘గిరి’ అంటే కొండ, ‘జనులు’ అంటే ఆ ప్రాంతంలో నివసించేవారు. అనగా కొండలు, అడవులలో నివసించేవారు గిరిజనులు. మనదేశంలో ప్రధానమైన జాతులలో గిరిజన జాతి ప్రజలు పట్టణ ప్రాంతానికి దూరంగా, జన జీవనానికి భిన్నంగా జీవిస్తుంటారు. వీరి వీరి సంస్కృతి, ఆచార సంప్రదాయాలు ప్రత్యేకంగా, విశిష్టంగా ఉంటాయి.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో శ్రీకాకుళం నుండి పడమటి నిజామాబాద్, ఆదిలాబాద్ దాకా దట్టమైన అడవులు కన్పిస్తాయి. ఈ అడవులలో సవర, జాతాపు, కోయ, కొండరెడ్డి, నాయక్, గోండు, కోలామ్ మొదలైన గిరిజనులు నివసిస్తుంటారు. అట్లాగే, దక్షిణాదిన చెంచు, యానాది, ఎరుకల గిరిజనులు, నివసిస్తుంటారు. ఏ రాష్ట్ర సరిహద్దుల్లో చూసినా గిరిజనుల ఆవాసాలు కనిపిస్తాయి. వీరందరూ ఇప్పటివరకూ ఆయా ప్రాంతాల వర్గ విస్తరణకు లొంగనివారు. నాలుగువేల సంవత్సరాల నుండి మైదానాలు అడవుల్ని ఆక్రమించుకొంటూనే ఉన్నాయి. కాంట్రాక్టర్ల ద్వారా, ప్లాంటేషన్ ద్వారా, వడ్డీ వ్యాపారస్థుల ద్వారా భూస్వాములు ఈ రోజుల్లో భూమిని ఎలా అక్రమించుకొంటున్నారో అలాగే గతంలో కూడా భూమి దోపిడీ విషయంలో అంతే దౌర్జన్యం జరిగింది.

అశోక చక్రవర్తి అడవులను నరికి వ్యవసాయం కిందికి తీసుకురావడానికి చేసిన ప్రయత్నం మనకు చరిత్రలో కనిపిస్తుంది. అప్పటి అటవీకులు ఈ క్రమానికి లొంగిపోయి తమ స్వతంత్ర జీవనాన్ని వదిలిపెట్టి, కూలీలుగా మారిపోక తప్పలేదు. చాలామంది మాల, మాదిగ కులాలలో కలిసిపోయారు. ఇటువంటి చరిత్రకు మనకు ప్రత్యక్ష సాక్ష్యాలు, ఆధారాలు దొరకవు కానీ గిరిజనుల క్రమం యొక్క ప్రతిబింబం పౌరాణిక సాహిత్యంలోనూ, గిరిజనుల పురాణ గాథలలోనూ కనిపిస్తుంటాయి ఈ గిరిజనులు హిందూ దేవతల సేవకులుగా, భక్తులుగా, రెండవ భార్యలుగా మనకు దర్శనమిస్తారు. వర్గ సమాజంలో అల్ప స్థాయిగా పరిగణించబడిన గిరిజనులు సాహిత్యంలో కూడ చివరి స్థాయిలోనే ఉన్నారు. అయితే గిరిజనుల సంస్కృతి, సాహిత్యాలు ఉన్నత స్థాయికి చెందినవి.

శ్రీరాముడి దర్శనం కోసం పడిగాపులు కాచి తాను ఎంగిలి చేసిన ఫలాలను తిన్నందుకు తన జన్మ సాఫల్యం అయిందని భావించిన శబరి సవరజాతికి చెందిన స్త్రీ. గురువుకు గురుదక్షిణగా తన బొటనవేలునిచ్చిన ఏకలవ్యుడు బిల్లుతెగకు చెందినవాడు. పాండవులు అడవిలో తలదాచుకున్నప్పుడు భీముడు, ‘హిడింబి’ అనే ఆటవిక స్త్రీని పెళ్లాడతాడు. ఆమెకు పుట్టిన కొడుకు ద్వారానే తమ జాతి ఆవిర్భవించిందని అటవీకులలో ఒక తెగైన గోండుల నమ్మకం. మన దేశంలోని చాలామంది గిరిజనులు తమని తాము ఆ హిడింబి సంతానంగా ప్రతి సంవత్సరం భీమ, హిడింబిల వివాహ ఘట్టాన్ని ఇప్పసారాతో వేడుకగా జరుపుకుంటారు.

మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో మొత్తం 35 గిరిజన తెగలు ఉన్నాయి. అవి సాధు, అంద్, భగత్, చీల్, చెంచు, గదబ, గోండు, కొండరెడ్లు, జాలు పుత్రులు, కమర, కోలం, కొండదొర, కొండ కాపు, డొంగ్రీమా, కోటిమా, కోమ, కులిమా, మారస్, మన్నదొర, నాయక్, ముక్కదొర, పరదన్, పోర్జా, రెడ్డి, దొర, రోన, సవర, లంబాడీ, తోటి, వాల్మీకి, యానాది, ఎరుకల, నక్కల, కురివకరన్, దులిమా.

గిరిజన జీవన సంసృతి

గిరిజనులలో సాధారణంగా మూడు రకాల తెగలు కన్పిస్తాయి. 1) వేట మీద జీవించేవారు, 2) ఆహార సేకరణ మీద ఆధారపడి జీవించేవారు, 3) పశుపోషకులుగా జీవించేవారు. మొదటి రెండు తెగలలో గిరిజనుల సంఖ్య చాలా తక్కువ. ఉన్న అతికొద్ది మంది, బ్రిటిష్ వారి తాకిడికి తట్టుకోలేక వృత్తిదొంగలు గాను, లేక అతి చౌకగా పనిచేసే కూలీలుగాను మారిపోయారు. ప్రస్తుతం ఆహారాన్ని ఉత్పత్తి చేసే తెగలు మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. ఈ గిరిజనులు పెదరికంలో కొట్టుమిట్టాడుతూ జీవిస్తుంటారు.

వీరిది పోడు వ్యవసాయం కావటం వల్ల దీని నుంచి వచ్చే ఫలసాయం చాలక అడవిలో దొరికే అనేక రకాలైన పండ్లు, కాయలు, ఆకులు పోగుచేసుకుని వాటిని తిని జీవిస్తూ ఉంటారు. స్త్రీలు, పురుషులు కూడా నామమాత్రంగానే బట్టలు దరించగల్గేవారు. గిరిజన ప్రాంతంలో ఆహార ధాన్యాలు అతి స్వల్పంగా మాత్రమే పండుతాయి. దానికి కారణం అడవి ప్రాంతాల్లో జీవిస్తున్న పశుపక్ష్యాదులు ఎప్పుడో వచ్చి చేనులో పడటం, చేనంతా పాడైపోవటం వల్ల వాళ్లకు లభించేది చాలా తక్కువ. దీన్లో షావుకార్ల మామూళ్లతో మొత్తం దోచుకోబడతారు. తిరిగి అదే పరిస్థితి నెలకొంటుంది. గిరిజనులు ఏడాదిలో అత్యధిక భాగం గడ్డి గింజలు, అడవుల్లో దొరికే కాయలు, పండ్లు, అడవి దుంపలు, ఇప్పపువ్వు తింటూ కాలం గడుపుతారు.

వీరు అడవి కోళ్లను, యెనుము అనే అడవి దున్నలను వేటాడతారు. సామలు, అరికెలు, జొన్నలు దొరికినప్పుడు వాటితో రొట్టెలు చేసుకొని తిని కాలం వెళ్ళబుచ్చుతారు. ఇప్పపువ్వును కాచి కల్లు చేసుకొని తాగుతారు. ఈ ఆదివాసి గిరిజనుల ఆహార సేకరణ విలక్షణమైంది. కన్పించిన ఆహారాన్ని సేకరించడం, జంతువుల్ని వేటాడి పట్టుకోవడం ద్వారా పొట్ట నింపుకొంటారు. పురుషులు చేపల వేటకు బయలుదేరితే స్త్రీలు రోజు గడవటానికి కావలసిన దుంపలు, ఆకుకూరల కోసం అడవిలోకి వెళ్తారు. అయితే ఇటువంటి ఆహార సేకరణను స్వంత ఆస్తి మీద ఆధారపడే వర్గ సమాజం దొంగతనంగా భావిస్తుంది. ఈ సమాజం ప్రతి వస్తువును ఎవరో ఒకరి ఆస్తిగా ప్రకటించి వారిని బలవంతంగా దొంగలుగా మారుస్తుంది.

ఇది ఇలా ఉంచితే ఇరవయ్యవ శతాబ్దం నుండి గిరిజనులు వ్యవసాయాన్ని 1. పోడు, 2. కుకి అని రెండు విధాలుగా చేస్తున్నారు.

పోడు వ్యవసాయంలో అడవులను నరికి దున్ని వ్యవసాయం చేసేవారు. ఆ విధంగా పంటలు పండించాక ఆ ప్రదేశాన్ని వదిలి గిరిజనులు వేరే చోటికి వలస వెళ్లి తిరిగి మళ్ళీ అదే విధంగా భూమిని సాగులోకి తెచ్చేవారు. వీరు స్థలాన్ని మారుస్తూ రెండు మూడేళ్లకు ఒకసారి సాగుచేసి నేల మారుస్తుంటారు. పంట మార్పిడి లేదు. ఈ వ్యవసాయం వల్ల అడవి కోత ఉండదు. స్తలాన్ని మార్చడం వల్ల ప్రభుత్వానికి నష్టం జరగదు. అడవి సహజంగానే అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఎరువు లేకుండా ప్రాచీన సంప్రదాయాన్ని అనుసరిస్తారు కాబట్టి నేల మారుస్తారు. ఒకే చోట వ్యవసాయం చేస్తే భూమి సారం తగ్గిపోయి పంటలు పండవని వీరి నమ్మకం. వీరు అడవంతా తిరుగుతూ గుట్టలపై వ్యవసాయం చేస్తారు.

కుకి వ్యవసాయంలో గిరిజనులు ఏటవాలు భూములలో లోతట్టు ప్రాంతాల్లో నేలను తవ్వి, భూమిలో కన్నాలు పెట్టి వాటిలో విత్తనాలు నాటి వ్యవసాయం చేస్తారు. ఈ రకం వ్యవసాయం వల్ల రైతులకు చాలీచాలని ఆదాయం లభించేది. అందువల్ల గిరిజనులు అడవిలో దొరికే ఇతర ఉత్పత్తులైన కుంకుమ పువ్వు, పండ్లు మొదలైన వాటిపైన ఆధారపడేవారు. కొన్ని సందర్భాలలో కరువు కాటకాలు సంభవించి ఎంతో నష్టం జరిగేది. ఒక్కొక్కప్పుడు ప్రకృతి బీభత్సాలతో వాళ్ళ పునాదులు లేని పూరిళ్ళకు నష్టం జరిగేది. అయినప్పటికీ ఈ గిరిజనులు కష్టనష్టాలను సహిస్తూ అడవుల్లో నివసిస్తుంటారు. భూమి గిరిజనుని ప్రాణం. వ్యవసాయం అతని వృత్తి. అడవి తల్లి తనకూ తల్లి. ప్రతిరోజూ వీళ్ళ పని భూమి, పొలం చుట్టూతే ఉంటుంది. చుట్టూ అడవి, నీటి వసతి, స్వచ్ఛమైన గాలీ, వెలుతురూ, పశుసంపద ఇన్ని ఉన్నా సరిపోయే తిండి మాత్రం ఉండదు. జావ తాగి కడుపు నింపుకునే కుటుంబాలే ఎక్కువ.

‘కోలాములు’ నాయకపోళ్ళ కంటే ఇంకా వెనుకబడిన వారు. వీళ్లు వ్యవసాయం కూడా చేయరు. అడవిలోంచి వెదురుకొట్టి తీసుకొచ్చి బద్దలుగా చీల్చి తొడికలు, బుట్టలు, గుల్లలు, గంపలు, గుమ్ములు, గాదెలు, జల్లెళ్ళు, చేటలు అల్లుతారు. ఈత చెట్లు ఉన్నచోట ఈత కమ్మలతో చాపలు, చీపురులు కట్టి అమ్ముకుంటారు. అదే వాళ్ళ బతుకుతెరువు. చేసిన వస్తువులతో ఊరూరా తిరిగి అంగళ్లు చేసి అమ్ముకుంటారు.

గిరిజనుల మొత్తం జీవితం వ్యవసాయంతో ముడిపడి ఉంటుంది. అన్ని పనులు వ్యవసాయపు అవసరాల చుట్టూరానే రూపొందిస్తారు. వీరికి వరి, జొన్న, మొక్కజొన్న, రాగులు ముఖ్య పంట కాగా, వ్యాపార పంటలైన ప్రత్తి, పొగాకు, మిరప అతి తక్కువ ప్రాంతంలో పండిస్తారు. నువ్వులు కూడా పండిస్తారు. వరిసాగు ప్రధానం అయినచోట జులై మాసం నుండి దున్నడం, విత్తడం, నారు పోయడం ప్రారంభిస్తారు. నీటి సౌకర్యం తక్కువ ఉన్న భూములు కనుక ఎంత ముసురు ఉంటే వాళ్లకి అంత లాభం. వీళ్ళు పెద్ద వర్షాలు కోరుకోరు. ఆ వర్షాల వల్ల ఉపయోగం కూడా తక్కువే. కొందరు గిరిజనులు నాట్లు వేసే పద్ధతికంటే అలకడానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. వీరిలో కొందరికి పశువులు వుంటాయి. అవీ వీరిలాగే బక్క చిక్కి ఉంటాయి.

ఆవులకు, మేకలకు పాలు పితకడం చేయరు. అది వీరి సాంప్రదాయం. తమలాగే ఆ పశువులు కూడా అడవిలో తినడం, ఊర్లో ఉండటం అనే పద్ధతిగా వాటిని పెంచుతారు తప్ప ప్రత్యేకంగా వాటిపై ధ్యాస నిల్వరు. తమ అజ్ఞానం, దారిద్ర్యం వల్ల వ్యవసాయంలో మెలకువలు తెలియక తగిన ఫలితాన్ని ఎలా పొందలేరో, అలాగే పశువుల పెంపకంలో కూడా వాటి ఆలనా పాలనా చూడక, వాటి విలువలు తెలియక సరియైన పద్ధతులు అర్థం కాక పురాతన పద్ధతుల్ని, అశాస్త్రీయ పద్ధతులనే అవలంబిస్తున్నారు.

గిరిజనుల కళా జీవితంలో ముగ్గులు పెట్టడానికి ఎంతో ప్రాధాన్యముంది. సౌందర్య దృష్టి కన్నా దుష్టశక్తులను రాకుండా చేయడానికి ముగ్గులు ఉపకరిస్తాయని వారి నమ్మకం. అట్లాగే శరీరానికి పచ్చ పొడుచుకుంటే చనిపోయిన తర్వాత తమ శరీరాన్ని దయ్యాలు తినవన్న మూడవిశ్వాసం ఉంది. అయితే ఈ పచ్చబొట్లలో కళ, సృజనాత్మకమైన ఆనందం వున్నా విన్యాసం పాలే ఎక్కువ. వారి శ్రమ నుండి కళాకాంక్షను, సృజనాత్మకతను, విశ్వాసాలను వేరు చేయడం అసాధ్యం.

కోయల జీవిత వర్ణన దాశరధి రంగాచార్య గారి నవల ‘మోదుగుపూలు’లో కనిపిస్తుంది. రచయిత కోయగూడెంలో వున్న పాతిక గుడిసెల్లో నివసిస్తున్న కోయల జీవితాన్ని కళ్ళకు కట్టినట్టు చిత్రించారు. అడవిలో ఉన్నదంతా కోయవారిదే. కోయ ఉక్కు లాంటి తన శరీరంతో అడవిని కొడుతూ భూమిని సాగు చేస్తూ తన చెమటోడ్చి పంటలు పండిస్తాడు. ఆ పంట రాశులు చూసుకొని మురిసిపోతాడు. అతని ఆనందం చూసి మురిసినంతవరకే పరిమితం. షావుకారు వచ్చి పంటలన్నీ తుడుచుకుపోతాడు. చివరకు తన రెక్కలు మాత్రమే మిగులుతాయి. ఎప్పటిలాగే ఆడ మగ అడవి మీద పడ్తారు. కాయ గసరులతో, దుంపలతో తమ జీవనం గడుపుతారు. అలా కాలచక్రం తిరుగుతూ ఉంటుంది. ఇప్పసారా తాగుతూ ఉంటారు. వీరెప్పుడూ వర్షం కోసం ఎదురు చూస్తుంటారు. వర్షం వారికి ప్రాణం. నెమళ్ళు అడవంతా కూస్తూన్నప్పుడు వర్షం రాబోతుందన్న సంగతి కోయదొరలకు తెలుస్తుంది. బుట్టలో నవధాన్యాలు తెచ్చి విత్తనాల పండుగ జరుపుకుంటారు. వీరికిది ముఖ్యమైన పండగ.

‘మోదుగు పూలు’ నవలలో ఇటువంటి పండగను ఆడ మగ అందరూ జట్లు, జట్లుగా కలిసి చెట్టా పట్టా లేసుకొని పాటలు పాడుకుంటూ తమ పూర్వికులు ఎట్లా వచ్చారో పురాణ కథల ద్వారా నెమరు వేసుకుంటున్న సమయంలో గూడెంలో తలారి శివుడు గజ్జే ఘల్లు ఘల్లు మంటుంది. వాడి గజ్జే ఘల్లుమనగానే గూడెంలో ప్రతి ఒక్కరి గుండె జల్లుమంటుంది. ప్రతి గిరిజనుడు కొండలను తొలిచే, మసి చేసే శక్తి, పులితో పోరాడే శౌర్యం ఉన్నా అధికారులను చూస్తే హడలిపోతారు. అది కోయల బలహీనత అని తెలుసుకుంది దొరల బలం.

తలారి శివుడు గూడెంలో పెద్దగా పిలువబడుతున్న సమ్మయ్య దగ్గరికి వచ్చి గూడానికి గిర్దావర్, అమీన్ వస్తున్నారని చెప్తాడు. తాసిల్ దార్ బంగ్లా కట్టడానికి కోయలంతా కట్టె కొట్టి పెట్టాలని చెప్పి అందర్నీ తరలించుకుపోయేందుకు సన్నాహాలు చేస్తుంటారు. ఈ కోయలంతా ఒక గూడెం ప్రజలు ఇంకొక గూడానికి తరలిస్తుంటే ఒకరినొకరు సాదరంగా ఆహ్వానించుకొని అందరూ కలిసి సంబరంగా పండగ లాగా ఆ రోజును జరుపుకుంటారు. కోయదొరల జీవితంతో పాటు వారి ప్రణయం, ఆచార వ్యవహారాలు, వారు ఓషదులుగా వాడుకుంటున్న సంజీవిని చెట్లు, తమ ప్రాణాలు పులి వాత పడకుండా దాన్ని దెబ్బతీయటంలో చూపిన చాకచక్యం మొదలైన వాటిని ఈ నవలలో చాలా వివరంగా చూడవచ్చు.

ఇంకా సాహూ, అల్లం రాజయ్య గార్లు రాసిన ‘కొమరం భీం’, వసంతరావు దేశ్‌పాండే గారు రాసిన ‘అడవి’, సాధన గారి ‘అడవిలో అన్నలు’, ఆనంద్ మోహన్ గారి ‘వసంతగీతం’ అనే నవలలు ఈ కోవలోకే చెందుతాయి.

గిరిజనుల ఆర్థిక జీవనం ఏ రకంగా ఉన్నా సామాజిక సంబంధాలను పరిశీలిస్తే మాత్రం గిరిజనులలో సమైక్యత కనిపిస్తుంది. దీనికి కారణం, గిరిజనులలో భూమి, తదితర ఉత్పత్తి సాధనాలు, స్వంత ఆస్తి అనేది లేకపోవడం. గిరిజనులు ఇప్పటికీ సమిష్టి ఆస్తి సంబంధాల ఛాయాలను వదులుకోలేదు. ఎవరి వ్యవసాయం వాళ్ళు చేసుకుంటున్నా ఒక సమిష్టి పద్ధతిలో చేస్తారు. అందరూ ఒకేసారి మొదలుపెట్టడం, సమిష్టిగా పూజ తదితర కార్యక్రమాలను నిర్వహించడం, పంట ఒకేసారి కోయడం, గ్రామం అంతా ఒకేసారి అంగడికి వెళ్ళడం ఇలా ప్రతి పనీ పెండ్లి అయినా, చావు అయినా సమిష్టిగా జరుపుకుంటారు. గ్రామమంతా కలిసి పండుగలు, వేడుకలూ ప్రముఖ సందర్భాలలో ఉమ్మడిగా తమ ఆనందాన్ని పంచుకుంటారు. పంట వేసేటప్పుడు, కోతలు కోసేటప్పుడు, విప్ప చెట్టు పూత పూసినప్పుడు, మొట్టమొదటి వర్షం కురిసినప్పుడు పండుగలు జరుపుకోవడమే కాక కొన్ని సమయాలలో భీమదేవర పెళ్లి, పురాణ పురుషుని పుట్టుకను ఆధారంగా చేసుకుని పండుగలు జరుపుకుంటారు.

సవరలది బహు పురాతన జాతి. ఐతరేయ బ్రాహ్మణం, రామాయణం, మహాభారతాల్లోనూ, ఇతర సంస్కృత పురాణాల్లోనూ వీరి ప్రస్తావన ఉంది. సంస్కృత పురాణాల్లో వీరిని ‘శబరి’ అన్న నామంతో పిలిచారు. తెలుగువారు వీరిపై దాడి చేసి వారిని కొండలకు తరిమేశారన్న వాదన వ్యవహారంలో ఉంది. క్రీ.శ. 8వ శతాబ్ది ప్రారంభంలో కళింగ గంగ మూలపురుషుడైన ‘కామర్నవ’ అనే రాజు ‘శబరాదిత్య’ ను ఓడించినట్లు చరిత్రలో ఉంది. ఈ శబరాదిత్యుడు సవర జాతికి చెందిన వాడే కావచ్చునని చరిత్రకారులు భావిస్తున్నారు. వీరి భాష ముండారి భాషా కుటుంబానికి చెందింది. మొదట వీరి భాషకు లిపి లేదు. సుప్రసిద్ధ భాషా శాస్త్రవేత్త ‘గిడుగు రామ్మూర్తి పంతులు’ వీరి భాషకు లిపిని రూపొందించి వారి భాషలో నిఘంటువును కూడా రచించి ప్రచురించారు. సవర భాషను నేర్చుకోవడం చాలా కష్టం అంటారు భాషా తత్వవేత్తలు.

గిరిజన నృత్యాలు

తెలుగు రాష్ట్రాల్లోని గిరిజన నృత్యాల్లో గోండుల గుస్సాడి నృత్యం, బగతలు, కోటియా ఖొండుల దింసా నృత్యం, లంబాడీల నృత్యం, కొండరెడ్ల మామిడి కొత్తనృత్యం, ఖొండుల నెమలి నృత్యాలు ముఖ్యమైనవి. వ్యాస విస్తరణను దృష్టిలో పెట్టుకుని నేను ‘సుగాలీ నృత్యం’, మామిడి కొత్త నృత్యం, గుస్సాడి నృత్యాలను గూర్చి వివరణ చేస్తున్నాను.

సుగాలీ నృత్యం:

‘సుగాలీ నృత్యాన్ని’ లంబాడీ, బంజారా, తండా నృత్యమని పిలుస్తారు. ఇందులో స్త్రీలు అద్దాలతో కుట్టిన రంగురంగుల రవికెలు, చీర ముక్కలు, చేతుల నిండా గాజులు, కాళ్లకు గజ్జలు, జుట్టుకు వివిధ రంగుల పూసలు ధరిస్తారు. మగవారు పొడవైన తలపాగాలు ధరించి, కాళ్లకు గజ్జలు కట్టుకుని చిన్నపెద్ద అంతా చేతులు ఊపుతూ మగవారు లయ తప్పకుండా తప్పెటలు కొడుతుంటే దానికనుగుణంగా స్త్రీలు గుండ్రంగా తిరుగుతూ పాటలు పాడుకుంటూ నృత్యాలు చేస్తారు.

మామిడి కొత్త నృత్యం:

ఖమ్మం, తూర్పు, పశ్చిమ గోదావరీ అటవీ ప్రాంతాలలో నివసించే కొండరెడ్లు మామిడి పంట చేతికొచ్చే సమయంలో ముత్యాలమ్మ, కొండదేవతలను కొలుస్తూ చేసే నృత్యమే ‘మామిడి కొత్త నృత్యం’.

ఈ నృత్యంలో డప్పువాద్యగాళ్ళు, ఇతర వాద్యగాలను మధ్యలో ఉంచి నలుగురైదుగురు స్త్రీలు, పురుషులు ఆడ, మగ భేదం లేకుండా వలయం కట్టి లయబద్ధంగా ముందుకు, వెనుకకు అడుగులు కదుపుతూ ముత్యాలమ్మ, కొండ దేవతలను స్తుతిస్తూ శరీరం అలిసిపోయేంతవరకు, తెల్లవారే వరకు ఈ నృత్యం చేస్తారు.

గుస్సాడి నృత్యం:

ఆదిలాబాద్ జిల్లాలోని రాజ్ గోండులు పౌర్ణమినాడు మొదలుకొని బహుళ చతుర్దశి వరకు అంటే దీపావళి పండుగ సమయంలో పంట ఇంటికి వచ్చి వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా ఉండే సమయంలో ఈ నృత్యం చేస్తారు. ఈ నృత్యంలో గోండులు రంగురంగుల వస్త్రాలు ఆభరణాలుగా ధరించి ప్రతీవారు నెమలి ఈకలు పొదిగిన పెద్దతలపాగా ధరించి, ఇంకా జింక కొమ్ములను, కృత్తిమమైన మీసాలను, గడ్డాలను తగిలించుకొని ఒంటికి మేక చర్మం చుట్టుకుని గుంపులు గుంపులుగా చుట్టుపక్క పల్లెలకు పోయి ఆటపాటలు ప్రదర్శిస్తారు. ఈ గుంపులను దండారి గుంపులంటారు. వీళ్ళకు సహాయంగా డప్పు, తుడుము, పిప్రి, కలికొమ్ము లాంటి వాయిద్యాలు మోగిస్తూ గమేలా ధ్వనిస్తుండగా దండారి గుంపు క్రమ విన్యాసంతో లయబద్ధంగా నృత్యం చేస్తూ మెల్లగా ఎడమ వైపుకు అడుగులు కదపడంతో ఆరంభమై కుడిపాదం కదుపుతూ ముందుకు వెనుకకు ఉయ్యాలలాగా శరీరం కదుపుతూ ప్రతివాడి చేతుల్లో ఉన్న రెండు చిన్న కర్రలతో ఇష్ట దేవతలను ప్రార్థిస్తూ, కోలాటం వేస్తూ మొత్తం గుంపంతా లయబద్ధంగా తిరుగుతూ నృత్యం చేస్తారు.

కోలాటం ముగిసిన తర్వాత కర్రలను విడిచిపెట్టి అడుగుల కదలికతో లయ విన్యాసంతో గుంపులోని నాయకుడు మొదట గొంతెత్తి పాడితే మొత్తం గుంపు దాన్ని అందుకుంటూ నృత్యం చేస్తూ నృత్యం పరాకాష్టకు చేరుకున్న సమయంలో పెద్ద గుంపు నుంచి విడివడిన ఇద్దరు లేదా అయిదుగురి గుసాడీ గుంపు నెమలి ఈకలతో తలపాగా, మెడలో గవ్వలు, పూసల దండలు వేసుకొని, కృత్తిమమైన మీసాలు, గడ్డాలు తగిలించుకొని, మణికట్టుకు గజ్జలో చిరుగంటలు కట్టుకొని శరీరమంతా నామాలతో తెల్లగా గీతలూ, చుక్కలూ చిత్రించుకొంటూ నడుముకు శరీరమంతా గోచీ, చేతుల్లో పొడవైన కర్రలతో ఆహార్యాన్ని సిద్ధం చేసుకుని దండారి గుంపులోకి చొరబాడతారు. అప్పుడు దండారి వలయం చెదిరిపోగా చూసేవాళ్లకు బెదురు కలిగేటంత భీకరంగా పెద్ద, పెద్ద అంగలు వేస్తూ గంతులతో పొలికేకలు పెడుతూ నృత్యాన్ని నిర్వహిస్తూ తమ చేతుల్లో ఉన్న కర్రలతో పక్కలకు ఉన్న ప్రేక్షకులను తాకి వాళ్లకు గిలిగింతలు పెడుతూ, కలిగిస్తూ చిన్న పిల్లలను భయభ్రాంతులను చేస్తూ పెద్దవాళ్ళను తమ కొంటె చేష్టలతో నవ్విస్తారు. నృత్యం అయిన తర్వాత గ్రామస్థులు వారిని పిలిచి వాళ్ళ కాళ్లు కడిగి గౌరవిస్తారు.

ప్రభుత్వాలు గిరిజన నృత్యాలను సంప్రదాయ నగర నృత్యాలలో చేర్చి వారి నృత్యాలకు తగిన ప్రాముఖ్యత కల్పించడం ద్వారా వారి కళలను కాపాడాలి. చరిత్రకు సాహిత్యంతో అవినాభావ సంబంధం ఉంటుంది. గిరిజన జీవన సంస్కృతి, సంప్రదాయ, సాహిత్యాల గురించి చాలా పరిశోధనలు జరగాలి. తద్వారా మన సమాజ లౌకిక సంస్కృతి మరింత సంపద్వంతమవుతుంది.

ఉపయుక్త గ్రంధాలు

  1. భారతీయ గిరిజనులు – నదీం హస్ నైన్, ఓరియంట్ లాజన్ లిమిటెడ్ – ఐశ్వర్య గ్రాఫిక్స్, హైదరాబాదు – 1995
  2. ఆంధ్రప్రదేశ్ జానపద సాహిత్యము – సంస్కృతి – బి. రామరాజు, నేషనల్ బుక్ ట్రస్ట్, న్యూఢిల్లీ – 2001
  3. ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రాంతాలు – గిరిజనుల సాంస్కృతిక పరిశోధన శిక్షణా సంస్థ, హైదరాబాద్ – 2004
  4. అడవి తల్లి – పి. సత్యవతి – హైదరాబాద్ బుక్ ట్రస్ట్ – 2004
  5. 5.Tribal dances of India – Robin, D.Tribhuwan, Preeti, R.Tribhuwan Discovery Publishing House, New Delhi – 1999.
Exit mobile version