Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గిరిధర నామధేయస్య

[శ్రీమతి ఉప్పలూరి మధుపత్ర శైలజ గారు రచించిన ‘గిరిధర నామధేయస్య’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. ‘అభినందన’ సంస్థ (విజయనగరం) ఫిబ్రవరి-మార్చ్ 2025లో నిర్వహించిన హాస్య కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ.]

‘ఈ రోజు బుధవారమైనా ఎందుకో ఎక్కువ మంది భక్తులు స్వామివారి దర్శనానికి రాలేదు’ అనుకుంటూ పెద్దగా పనేమీ లేకపోవటంతో పూజారి మాధవాచార్యులుగారు గుడి మంటపంలోని రాతి స్తంభానికి అనుకొని భాగవతం చదువుకుంటున్నారు.

ఇంతలో “అయ్యోరు! అయ్యోరు!” అంటూ ఎవరో గట్టిగా పిలుస్తున్నారు.

ఆ గొంతు విన్న మాధవాచార్యులుగారు “ఎవరూ?” అంటూ ఆ శబ్దం వచ్చిన వైపు వచ్చారు.

“సామీ! నేనండి బిక్షపతిని” అంటూ నసుగుతూ సిగ్గుపడుతూ అన్నాడు.

“ఓరోరి! నీవట్రా! ఏమిటీ వేషం? ఇంత మంచి బట్టలు వేసుకుని చేతిలో పూజా సామాగ్రితో రాములవారి దర్శనానికి వచ్చావు. ఏదైనా విశేషమా! చేస్తున్న పని మానేసి కొత్త పనిలో చేరబోతున్నావా?” అంటూ అడిగారు భిక్షపతి వాలకం చూసిన మాధవాచార్యులు.

“చా చా! ఊరుకోండి బాబూ! బిచ్చగాడితో ఏమిటండి పరాచికాలు. ఈ అడుక్కునే కుంటోడికి వేరే పనేమి దొరుకుతుంది సెప్పండి. అసలు పనిచేసే సత్తువే ఉంటే ఇట్లా గుడి మెట్ల మీద కూర్చుని ఎందుకు అడుక్కుంటానయ్యా? నా ఒక్క పొట్టకు ఎంత కావాలి సామీ? మీరే సెప్పండి. రోజు వచ్చే నాలుగు రూకలు దాచుకుని ఇయ్యాల పూజ కోసం ఖర్చుపెట్టాలని ఇలా వచ్చాను. ఇవిగో ఈ అరటిపళ్ళు, కొబ్బరికాయ, పూలు తీసుకుని పూజ సేయండి సామీ” అన్నాడు భిక్షపతి.

“ఏరా! నీకెవరూ లేరు ఒంటరివాడినంటావు కదా! మరి ఎవరి పేరు మీద ఈ పూజ చేయమంటావు?” అని అడిగారు మాధవాచార్యులుగారు.

“సామీ! నేను మీకో సంగతి చెపుతానండి. తాము నవ్వకూడదు మరి” అంటూ భిక్షపతి, “బాబూ మన గాంధీనగర్ మొదటి వీధిలోని రెండో ఇంట్లో ఓ కుటుంబం ఉందండి. నేను గుడికి వచ్చే ముందుగా బువ్వ అడగటానికి ఆరింటికి వెడతాను. అక్కడి సారు తప్పకుండా నాకు రాత్రి మిగిలిన బువ్వ పెడతారు. చాలా రుచిగా వుంటుంది ఆ బువ్వ. పండుగలకు వారు పెట్టే పాయసం, పులిహోర అచ్చంగా మన ఆలయంలో మీరు పెట్టే ప్రసాదంలా అమృతంలా ఉంటాయి.

అయితే అసలు సంగతేమిటంటే ఆ అమ్మగారికి వంట రాదుట! సారే ఆ ఇంట్లో వంట చేస్తారట. ఆ సారు కొడుకే ఈ విషయం నాకు చెప్పారు. చాలా సంవత్సరాలుగా ఆ ఇంటి కూడు తింటున్నాను. అందుకే ఆ సారు, ఆ కుటుంబం చల్లగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను సామీ” అన్నాడు భిక్షపతి.

“ఏమిటి? నీకు ప్రతిరోజు మిగిలిన బువ్వ పెట్టే కుటుంబం చల్లగా ఉండాలని కోరుకుంటూ నీ డబ్బు ఖర్చుపెట్టి పూజ చేయిస్తున్నావా? మరి ఆ సారు పేరు చెప్పగలవా?” అని మాధవాచార్యులుగారు అడుగుతూండగానే,

భిక్షపతి “అదికాదండీ మీకు ఇంకో విషయం చెప్పాలండి. ఓసారి ఆ సారు అత్తమామలు కూతురి సంసారం చూద్దామని వచ్చి అల్లుడి వంటల రుచికి మైమరచి నెల్లాళ్ళుండిపోయారట. పైగా ఆ నెల్లాళ్ళు అల్లుడికి సెలవు వచ్చినప్పుడల్లా రకరకాల పిండివంటలు కూడా చేయించుకుని తిన్నారట. చివరికి ఆ సారుకి విసుగొచ్చి తన అమ్మానాన్నలకు వీళ్ళ విషయం చెప్పి ఏదో అర్జంట్ పనిమీద వాళ్ళు వస్తున్నట్లుగా ఫోను చేయించి తన అత్తమామలను సాగనంపాల్సి వచ్చిందట. ఆ సారు వంటల గురించి ఎక్కువగా మన గుడి మెట్లమీద కూర్చునే వారు కథలు కథలుగా చెప్పుకుంటూంటే నా చెవిన పడ్డాయి సామి.

ఇప్పుడో కష్టం వచ్చి పడిందండి. ఆ సారుకి విదేశంలో పనిపడి అమెరికాకు వెడుతున్నారుట. ఇక ఆ అమ్మకేమో వంట రాదాయే. అందుకే ఆమె ఏ స్విగ్గీ పైనో, బొగ్గీ పైనో, జొమాటోపైనో, టొమాటో పైనో ఆధారపడితే నేనేం తినాలి. అందుకే ఆ సారు ప్రయాణం ఆగిపోవాలని తమరు పూజ చేయాలని ఈ పూజా సామాన్లు తెచ్చానండి” అంటూ చెప్పాడు బిక్షపతి.

ఇంతలో “ఏమండీ పూజారిగారూ! నేను తెచ్చిన ఈ పూజా సామాన్లతో పూజ చేయండి” అంటూ హడావిడిగా వచ్చింది మంగ.

“ఏమిటే మంగా ఈ హడావిడి! ఈ రోజు మీ పెళ్ళిరోజా? పూజ చేయమని అడుగుతున్నావు” అంటూ మంగ తెచ్చిన పూజా సామాన్లను అందుకున్నారు మాధవాచార్యులుగారు.

“నా జన్మకి అలాంటి అదృష్టం కూడా వుంటుందా అయ్యగారూ? ఆ తాగుబోతు మొగుడితో తన్నులు తింటూ, ఏదో నాలుగిళ్ళలో పాచి పనులు చేసుకుంటూ బతికే నా మొఖానికి పూజలొక్కటే తక్కువయ్యాయి. మనింట్లో గిన్నెలు తోమాక, గాంధీనగర్ మొదటివీధిలోని ఓ ఇంట్లో పనులు చేస్తూంటానయ్యా. ఇప్పటిదాకా ఆరింట్లో మంచిమంచి వంటలతో భోజనం పెట్టేవారు. నాకిప్పుడిక కారం మెతుకులే గతి” అంది మంగ కన్నులు వత్తుకుంటూ. “ఏమైయ్యిందే మంగా? ఆ ఇంటివారు పనిలోనుండి నిన్ను తీసేసారా ఏమిటి?” అని అడిగారు మాధవాచార్యులుగారు.

“అబ్బే అదికాదండి. ఆ ఇంటి సార్‌కి పనిపడి అమెరికాకు పోతున్నారు. ఆ అమ్మగారికేమో వంటిల్లు దిక్కే తెలియదు. అందుకే నన్ను రోజూ చేసే పనులేకాక వంట పని కూడా చేయమని చెప్పింది ఆ తల్లి. ఒకవైపు పనిభారం పెరిగిపోతోంది. మరో వైపు చక్కగా ఆ సారు వండిపెడితే తినే నేను, రేపటి నుండి నా చేతివంటనే తినాల్సివస్తుంది.

నా వంట నాకే నచ్చదు, ఇక ఆ అమ్మకెలా నచ్చుతుందో? ఏమో? అయినా నా వంట ఎలా ఉన్నా ఆ అమ్మ కంటే తినక తప్పదు, మరి నేనెలా తినాలో దేవుడా అన్న బాధ కలుగుతోంది. అందుకే ఆ సారు అమెరికా ప్రయాణం ఆగిపోవాలని ఆరి పేరు మీద పూజ చేయండి సారు” అంది మంగ.

ఇదంతా పూజారిగారితోపాటు వింటున్న భిక్షపతి ఆశ్చర్యపోతూ “నీవు చెపుతున్నది గాంధీనగర్ మొదటి వీధిలోని రెండో ఇంటి సారు గురించేనా?” అని అడిగాడు.

“ఔను ఆ సారు గురించే, ఆ సారు నీకూ తెలుసునా?” అంది మంగ.

“అరే! మేమిద్దరం ఆ సారు అమెరికా ప్రయాణం ఆగిపోవాలనే కోరుకుంటున్నాం. మరి ఇకనేం. ఆ సారు పేరుతో పూజ పూర్తిచేయండి సామి” అన్నాడు భిక్షపతి.

“ఇంతకీ మీ ఇద్దరిలో ఎవరూ ఆ సారు పేరు చెప్పనే లేదు. మరి పూజ ఎలా మొదలుపెట్టాలి?” అన్నారు. మాధవాచార్యులుగారు.

“గిరిధర్” అంటూ వచ్చింది ఒకామె చేతిలో పూజాసామాగ్రి నిండిన బుట్టను మాధవాచార్యులగారికి ఇస్తూ.

“స్వామీ! వీళ్ళిద్దరూ చెప్పింది మా వారి గురించే. విదేశాలకు వెడితే చాలా డబ్బు సంపాదించుకోవచ్చు కదా. ఆ డబ్బులో కొంత ఖర్చు చేసి ఓ వంటమనిషిని పెట్టుకుంటే నా బాధలు, వీళ్ళ బాధలు కూడా తీరతాయి కదా. అందుకే మా వారి ప్రయాణం దిగ్విజయంగా నిరాటంకంగా సాగాలని నాకూ వుంది. కానీ మా వారి చేతి వంట రుచిమరిగిన నాకు ఇతరులు చేసే వంటలేవీ నచ్చటం లేదు. అందుకే డబ్బుపై వ్యామోహాన్ని పక్కనపెట్టి ‘చిన్ని నా బొజ్జకు శ్రీరామ రక్ష’ అనుకుంటూ నేను కూడా మావారి అమెరికా ప్రయాణం ఆగిపోవాలనే కోరుకుంటున్నాను. అందుకే మా వారి పేరున అర్చన చేయిద్దామని వచ్చాను” అంది.

ఈ ముగ్గురి మాటలకు నవ్వు వచ్చిన మాధవాచార్యులుగారు ‘మీ ఇల్లు చల్లగుండా! మీ జిహ్వచాపల్యానికి ఆ పెద్దాయన అమెరికా ప్రయాణమే అడొచ్చిందా?’ అనుకుంటూ “సరే మీ కోరిక నెరవేరాలని పూజ చేస్తాను” అంటూ గర్భగుడిలోకి వెళ్ళారు.

ఆ ముగ్గురికీ “గిరిధర నామధేయస్య” అంటూ మొదలైన అర్చన మంత్రాలు మృదుమధురంగా వినిపిస్తున్నాయి.

Exit mobile version