[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘గిడుగు ఉద్యమం – ఈనాటి అవసరాలు’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]
తెలుగు సాహితీలోకం యావత్తూ గిడుగు రామమూర్తిని సమర్థించేవారు, వ్యతిరేకించేవారని రెండు శిబిరాలుగా విడిపోయిన కాలంలో పరిస్థితి నేటి పరిస్థితి లాగానే ఉన్న వాస్తవాన్ని గుర్తించ గలుగుతాం!
వందేళ్ల క్రితం నాటి వాడుక భాషోద్యమానికి కొనసాగింపుగానూ రెండవ భాషోద్యమంగానూ భావించే నేటి భాషోద్యమం 2003-04లో ఆరంభమైంది. అప్పటి నుండీ సన్నిహితంగా గమనిస్తే తెలుగు భాష అనగానే ఉలిక్కిపడే నాలుగు వర్గాలవారు ప్రధానంగా కనిపిస్తారు. గిడుకు వాడుక భాషోద్యమాన్ని వ్యతిరేకించింది ఈ నాలుగు వర్గాలావారే ఆనాడూ!
పాలకవర్గం: భాష కోసం గళమెత్తగానే ప్రభుత్వ అలారం గణగణా మోగుతుంది! బ్రిటిష్ కాలంలోనూ అంతే! తెలుగనగానే ఉలిక్కి పడేది ఆనాటి ప్రభుత్వం. మాతృభాషకు అనుకూలం కాదు కాబట్టి, ఆ అపరాథ భావనే తెలుగు భాషాభిమానులు ప్రభుత్వ వ్యతిరేకులని భావించేలా చేసింది. రాజకీయ నేతలు, అధికారులు, న్యాయస్థానాలు కూడా ఆనాడూ ఈనాడూ కూడా తెలుగు భాషకు స్నేహితులుగా లేరు. మన పాలనా వ్యవస్థలో భాషాపరిమళం అంటే ఇష్టపడే అరుదైన వ్యక్తుల్ని వేళ్లపైన లెక్కబెట్టవచ్చు.
సంస్కృత పండితులు: భాషకు కదలిక కలగగానే కలవరపాటు పొందిన మరో వర్గం సంస్కృత పండితులు. వారు తెలుగు భాషకు వ్యతిరేకులు కాకపోయినా, తెలుగు భాషాభిమానులంటే సంస్కృతానికి వ్యతిరేకులని, తద్వారా జాతి వ్యతిరేకులని, దేశభక్తి లేని వారనీ బహిరంగంగానే వ్యాఖ్యానించేవాళ్లు. ఈ వర్గాలవారే ఆనాడూ పామరుల భాషను తెచ్చి భాషను కలుషితం చేస్తున్నాడని గిడుగువారిని వ్యతిరేకించారు! వీరు అపారమైన సంస్కృత భాషాపాండిత్యం కలవారేగానీ తెలుగు ఫట్ల మమకారం లేని తెలుగువాళ్లు.
ఆంగ్ల పండితులు: వీళ్లు పక్కా భాషోద్యమ వ్యతిరేకులు. తెలుగు భాషాభిమానుల్ని భాషాపిచ్చోళ్లంటూ మదర్ టంగ్ మానియాక్స్ అని హేళనగా మాట్లాడేవాళ్లు. తమ మాతృభాషను కించపరచటమే మేధావితనమని భావించిన వాళ్లు.. వీరంతా ఇంగ్లీషు వచ్చిన వాళ్లే గానీ, ఆ భాషలో అద్భుత పాండిత్యం ఉన్నవారేమీ కాదు. నిజమైన ఆంగ్ల పండితుడు గానీ, సంస్కృత పండితుడు గానీ తమ మాతృభాషను కించపరచే నీచానికి పాల్పడరు. అలాంటి దౌర్భాగ్యం ఇంగ్లీషు లేదా సంస్కృతం వచ్చిన కొందరిలో ఉంది. “మీ ఇంట్లో తెలుగులో మాట్లాడితే మీ పిల్లలకు ఇంగ్లీషెలా వస్తుంది..?” అని తల్లిదండ్రుల్ని డబాయించిన కార్పొరేట్ విద్యా సంస్థల యజమానులూ, వాళ్ల భక్తులూ వీళ్లలో అధికులు.
తెలుగు పండితులు: భాషోద్యమానికి ప్రధానమైన హాని తెలుగు చదువుకుని తెలుగు మీదే బ్రతికే వారివలనే జరిగింది. కురుసభలో నోరు మెదపని మేథావుల్లాంటి వాళ్లు ఈ తెలుగు పండితులు. వీళ్లలో అత్యధికులు భాషోద్యమంలో పాల్గొనలేదు. తమ జీవికకు ఢోకా లేదుకదా.. అని మిన్నకుండిపోయారు. విశ్వవిద్యాలయ స్థాయి నుండి హైస్కూలు స్థాయి వరకూ ఏ కొద్దిమందినో మినహాయిస్తే, ముఖ్యంగా ఉపాధ్యాయ వర్గం భాషోద్యమంలో చురుకుగా పాల్గొనలేదు. తెలుగు భాషకు ప్రాచీనతా హోదా వచ్చి, 17 యేళ్లు గడిచి పోయినా భాష ప్రాచీనతకు సంబంధించిన పరిశోధన చేయించటానికి ఏ విశ్వవిద్యాలయమూ ముందుకు రాకపోవటమే ఇందుకు సాక్ష్యం! ఒక్కో విశ్వవిద్యాలయం క్రమేణా తెలుగు శాఖని మూసివేస్తుంటే ఎవరికీ పట్టటం లేదు!
గిడుగు కాలంలోనూ ఇదే పరిస్థితి
గిడుగు వెంకట రామమూర్తి పంతులుగారు వాడుక భాషోద్యమాన్ని నడుపుతున్న కాలంలో విద్యావేత్తలు అంతో ఇంతో గ్రాంథికవాదాన్నే బలపరిచారు. పాఠ్య గ్రంథాల్లో కొరుకుడు పడని భాషతో నింపేశారు. తాము మాట్లాడే భాషే అయినప్పటికీ, వారి దృష్టిలో వాడుక భాష అంటే నాణ్యమైన భాష కాదని! శాస్త్ర విజ్ఞానాన్ని కూడా శాస్త్ర కోణంలోంచి కాకుండా భాషాకోణంలోంచి చూడటం వలన వాళ్లలో ఇలాంటి భావన ఏర్పడింది. జటిలమైన శాస్త్ర విషయాల్ని నోరు తిరగని భాషలో కాకుండా నోటికి తెలిసిన భాషలో నేర్చుకుంటే విద్యార్థికి తేలికగా అర్థం అవుతుందనే చిన్న తర్కాన్ని వీళ్లు మరిచిపోయారు.
“నేను ఐదేళ్లపాటు ఆంగ్లంలో నేర్చుకున్న చదువుని నా మాతృభాషలో నేర్పినట్లయితే మూడేళ్లలోనే నేర్చుకుని ఉండేవాణ్ని. సైన్సుని అర్థం చేసుకోవటం కన్నా ఆంగ్లాన్ని అర్థం చేసుకోవటానికి ఎక్కువ సమయం పట్టింది” అన్నారు మహాత్మా గాంథీ! ఆయన ఈ మాటలన్నది తెలుగు నేలమీద వాడుక భాషోద్యమం నడుస్తున్న 1920ల్లోనే! గ్రాంథిక తెలుగులో నేర్చుకోవటం కన్నా ఆంగ్లంలో నేర్చుకోవటమే తేలికయ్యే పరిస్థితి ఉంటే మాతృభాషలో విద్యాబోధన వలన ఒనగూరే ప్రయోజనం ఏముంటుంది?
గిడుగువారు నడిపించిన వాడుక భాషా ఉద్యమానికి ప్రధాన వ్యతిరేకుల్లో జయంతి రామయ్య పంతులు, కొమర్రాజు లక్ష్మణరావు, వేదం వెంకటరాయ శాస్త్రి, శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి, వావిలికొలను సుబ్బారావు, కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి లాంటి హేమాహేమీలున్నారు. తక్కిన గ్రాంథిక తీవ్ర వాదులతో పోలిస్తే, వీళ్లలో జయంతివారు కొమర్రాజువారు కొంత మధ్యేవాదులు. వీరేశలింగారి ప్రేరణ ఇందుకు కొంత ఉపయోగపడింది.
వాడుక భాషా పరిరక్షణ నేటికీ అవసరమే!
కావ్య భాషకు వ్యాకరణ రక్షణ ఉంది. దానికొచ్చిన ప్రమాదం ఏమీ లేదు! వాడుక భాషాపరిరక్షణే ఈనాటి అవసరం! సాహిత్యాన్ని, పాఠ్యగ్రంథాల్ని, ప్రామాణిక గ్రంథాల్ని వాడుక భాషలోకి తేవటం ద్వారా మొత్తం తెలుగు భాషనే పరిరక్షించే ప్రయత్నానికి పిలుపు నిచ్చినవాడు గిడుగు రామమూర్తి కాగా, వాడుకభాషని గ్రామ్య భాషగా ఈసడించి, కావ్యాలలోనూ, పాఠ్య గ్రంథాలలోనూ, ఆఖరికి నిఘంటువుల్లో కూడా దానికి చోటు లేకుండా చేయాలని ప్రయత్నించింది వైరివర్గం. ఒక విధంగా పద్మవ్యూహంలో అభిమన్యుడిలా ఒంటరి పోరాటం చేశాడాయన. పండిత వర్గాలు ఆయన పట్ల కఠినంగా వ్యవహరించారు.
సాహిత్యాన్ని, పాఠ్య గ్రంథాలనూ, ప్రభుత్వ ఉత్తర్వులనూ వాడుక తెలుగులోకి తేవాలని పిలుపు నివ్వటం ద్వారా జటిలమైన శాస్త్ర విషయాలను సామాన్యుడి ముంగిట చేర్చాలన్నది గిడుగు ఆశ! ఈనాటికీ భాషోద్యమం కోరుతున్నది అదే! సాధ్యమైనంత వాడుక భాష జనం వాడకంలో ఉండాలని! కావ్యభాషని సరళీకరించటమో, దానికి ప్రాణ ప్రతిష్ఠ చేయటమో ఆయన కోరుకోలేదు, వాడుక భాషను ప్రామాణికరించాలని వాదించారు. ప్రపంచ స్థాయి సైన్సు విషయాలకు మన సామాన్యుడు మాట్లాడుకునే భాష సరిపడేలా అన్ని చర్యలూ తీసుకోవాలని ఆనాడే కోరారు.
చెప్పుకోదగిన విషయం ఏమంటే, ఏ ప్రజల భాష కోసం గిడుగు పోరాడాడో ఆ ప్రజలు ఆనాడే కాడు, ఈనాడు కూడా భాషోద్యమాన్ని పట్టించుకోలేదు! రిషి స్థానం, నవ్య సాహిత్య పరిషత్తు లాంటి సంస్థల్ని వ్యవస్థాపించా రాయన. కానీ, ఆ సంస్థలేవీ ఆయన నడిచిన భాషోద్యమం బాటలో కొనసాగలేదు!
సాంకేతిక ప్రగతికి వాడుకభాష
వందేళ్లనాడు గిడుగు రామమూర్తిగారు ఏ వాడుక భాష గురించి పోరాడారో ఈ నాటికీ ఆయన వారసులుగా మనం కూడా మాతృభాష పరిరక్షణ పేరుతో కోరుతున్నది వాడుకభాష పరిరక్షణనే!
రమారమి నాలుగు దశాబ్దాలపాటు తెలుగు తల్లి పాదాల చెంత గిడుగు జీవితం ఒక దీపంలా వెలిగింది. శాస్త్రీయ భాష చీకట్లో కొట్టుకుంటూ ఉంటే, దాన్ని ప్రజలభాషగా మార్చటమే సరైన దారిగా భావించాడాయన! ప్రజల ఊపిరితో వెలిగే వాడుక భాషోద్యమాన్ని ప్రారంభించాడాయన! అప్పటికీ ఇప్పటికీ ఉద్యమం కోరే అంశాలు ఒకేలా ఉన్నాయంటే, తెలుగు భాష పరిస్థితిలో ఈ వందేళ్ల కాలంలో పెద్ద మార్పేమీ రాలేదని అంగీకరించక తప్పదు!
కళింగాంధ్రలో స్కూళ్ల ఇనస్పెక్టర్ యేట్స్ దొరగారి ప్రేరణతో గురజాడ అప్పారావు, బుర్రా శేషగిరిరావు, పి. టి. శ్రీనివాస అయ్యంగార్ గిడుగు రామమూర్తి ప్రభృతులు వాడుకభాషకు పట్టం కట్టే ఉద్యమాన్ని లేవనెత్తారు.
గిడుగు, గురజాడ గ్రాంథిక భాషను ఖండించలేదు. వ్యతిరేకించలేదు. వాడుకభాషను సాహిత్య భాషగా తీసుకురావటానికి ఏం చేయాలనేదే వారి ముఖ్యమైన ఆలోచన! సాంకేతిక ప్రగతికి వాడుకభాషే తోడ్పడుతుందని వారు గట్టిగా నమ్మారు. చదువుసంధ్యలు, నిత్యవ్యవహారాల్లో వ్రాతపనులన్నీ వాడుకభాషలో ఉండాలన్నారు. గిడుగు వారైతే, గ్రాంథిక భాషలో వ్రాసిన కవిపండితుల రచనల్లో తప్పుల కుప్పల్ని ఎత్తి చూపించేవారు. కొమ్ములు తిరిగిన ఉద్దండ పండితులే ఇలా తప్పులు వ్రాస్తుంటే ఈ భాషని అభం శుభం తెలీని బడిపిల్లలు, సామాన్యుల నెత్తిన రుద్దటం అన్యాయం, అశాస్త్రీయం అన్నారు.
రాజుల కాలంలో కావ్యభాష గ్రాంథికమైనా పాలనా విషయాలు మాత్రం ప్రజల భాషలోనే సాగేవి. రాజులకు ప్రజలతో నేరుగా మాట్లాడే సందర్భాలు అరుదు. ప్రభుత్వ ఉత్తర్వులన్నీ చాటింపు ద్వారానో శాసనాల ద్వారానో ప్రజలకు తెలియచేసేవారు. అందుకని, ప్రభువుల దృష్టిలో సాహిత్య భాషంటే కావ్య భాషే!
కావ్య భాష అర్థం కావాలంటే, వ్యాకరణ నియమాలు తెలియాలి. దాన్ని వ్రాయటానికి ప్రత్యేక శిక్షణ అవసరం. సామాన్యుడి భాషకు వాటి అవసరం లేదు. అందువలన దానికి విలువ లేదు.
19వ శతాబ్ది నుండి 20 వ శతాబ్దిలోకి కాలం మారుతున్న పరిస్థితుల్లో ముద్రణ సౌకర్యాలు, వాటి అవసరాలు ముమ్మరం కానున్నాయని ముందుగా పసిగట్టిన వ్యక్తి గిడుగు! వందేళ్ల క్రితం గద్య రచన అన్ని రంగాల్లోకీ విస్తరించాల్సిన అవసరం ఏర్పడనుందని కూడా ఆయన గమనించారు. ఆ అవసరాలకు కావ్యభాషకన్నా వాడుక భాషే ఎక్కువ ఉపయోగపడ్తుందని దాన్ని ప్రామాణికరించవలసిన పరిస్థితులు వస్తాయని ఆయన అందరికన్నా ముందుగా గుర్తించారు. అందుకు తగిన సన్నద్ధతను భాషకు కల్పించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. కృత్రిమ గ్రాంథిక భాషావాదుల్లో ఈ ముందు చూపు కొరవడటం వలన ఈనాటికీ వాడుక భాషకు స్థిరీకరణ జరగలేదు.
ఆలస్యంగానైనా నిజాన్ని గుర్తించిన వారిలో కందుకూరి వీరేశలింగం, తిరుపటి వేంకట కవులూ ముఖ్యులు. వారి వారి జీవిత చరమాంకాలలో గిడుగు చెప్పిందాంతో వీరేశలింగంగారు ప్రత్యక్షంగానూ, తిరుపతి కవులు పరోక్షంగానూ అంగీకారాలు తెలిపారు.
వీరేశలింగం గారి సరళీకరణ
స్కూళ్లలో వాచకాలు తయారు చేయాల్సిన ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని, వీరేశలింగం గారు భాషను కొంత సరళీకరించి, అటు వ్యావహారికమూ, ఇటు గ్రాంథికమూ కాని రీతిలో కొన్ని నియమాలను సడలించి, సులభమైన గ్రాంథిక శైలిని వాడకంలోకి తెచ్చారు. దానికి అనుగుణంగా ఒక వ్యాకరణం కూడా వ్రాశారు. వేదం వేంకటరాయశాస్త్రి గారు ‘విసంధి వివేకం’ అనే చిన్న వ్యాకరణ గ్రంథాన్ని వ్రాశారు. తెలుగులో సంధులు పాటించనక్కరలేదన్నారు. అందుకు సంస్కృత వ్యాకరణాల ప్రమాణాలు చూపించారు.. ఇది వాడుకభాషను కాపాడేందుకు జరిగిన ఒక చిరు ప్రయత్నమే గానీ, సరళ గ్రాంథికం అనడం ద్వారా గ్రాంథికానిదే పైచెయ్యి అయ్యింది.
వడ్డాది సుబ్బరాయకవి “గిడుగురామమూర్తి నుడుగు నిల్వకపోయె, ఒగి జయంతి రామ్మయోక్తి గెలిచె” అని హేళన చేశాడు. నిజానికి వడ్డాది కవి ఈ వ్యాఖ్యని అచ్చతెలుగులో వాడుక భాషలో వ్రాశాడు. ఆ విధంగా గిడుగే గెలిచాడు!
ప్రాచీన కావ్య భాషా సూత్రాలేవీ వాడుక భాషకు వర్తించకపోవటం, అవి అధికంగా సంస్కృత వ్యాకరణ సూత్రాలకు అనుగుణంగా సాగటం వలన తెలుగు భాషాభిమానులైనా వాడుక భాషకు న్యాయం చేయగలిగే పరిస్థితి ఈనాటికీ లేకుండా పోయింది.
మాతృభాషా పరిరక్షణ అనే మాటని తొలిసారిగా వాడింది వీరేశలింగంగారే! భాషా పరిరక్షణోద్యమానికి యుగకర్త ఆయనే! పరిరక్షించ వలసిన తెలుగు భాష విషయంలో వీరేశలింగం గారి అభిప్రాయాల్లో నేటికీ పాటించవలసిన అంశాలు ఉన్నాయి. 1911లో పిఠాపురం మహారాజు, జయంతి రామయ్య పంతులు, వేదం వేంకట రాయశాస్త్రి ప్రభృతులు ఆంధ్ర సాహిత్య పరిషత్తు ప్రారంభించారు. ప్రామాణిక భాష అవసరం గురించి ఈ సంస్థ ప్రముఖంగా ప్రచారం చేసింది. అయితే, ఏది ప్రామాణికం అనే విషయంలో పండితుల మధ్య ఏకాభిప్రాయం లేదు. జయంతిరామయ్య, కొక్కోండ వెంకటరత్నం ప్రభృతులు కోరిన ప్రామాణిక భాష కేవలం కావ్యభాష. గిడుగు, గురజాడ ప్రభృతులు కోరిన ప్రామాణిక భాష జనసామాన్యం వాడే మాటల పొందికతో కూడిన ప్రజల భాష. వీరేశలింగం ఈ రెంటికీ మధ్యేమార్గం అవలంభించాడు. ఆయనది సరళ గ్రాంథిక భాష.
కాకినాడ ఆంధ్ర సాహిత్య పరిషత్ పక్షపత్రిక ప్రారంభంలో తెలుగు గ్రామ్య వ్యవహారిక భాష గురించి పంతులుగారి ప్రసంగ వ్యాసం ఒకటి ప్రచురితమైంది. అందులో తన మధ్యేమార్గానికి ఆయన అనేక కారణాలను చూపించారు. ఆయన తెలుగు భాషని నాగరికభాష, గ్రామ్యభాష అని రెండుగా వర్గీకరించారు. పట్టణ వాసులు మాట్లాడే భాష నాగరికభాష. జానపదులు మాట్లాడే భాష గ్రామ్య భాష.. అని వివరిస్తూ నాగరిక భాషయే గ్రాంథిక భాషగా మారిందనీ అది ప్రామాణిక భాష కావటం వలన భాషకు ఉపయోగ పడదనీ అన్నారు.
పూర్వపు రోజుల్లో తెలుగు పండితుల్లో సంస్కృతభాషా వ్యామోహం మితిమీరి ఉండేది కాబట్టి సంస్కృత పదాలతో నిండిన గ్రాంథికం పట్టణ లేదా నాగరిక భాషగా చెలామణి అయ్యింది. కావ్య రచనలన్నింటా మూడొంతులుగా సంస్కృతం తప్పనిసరిగా ఉండేది. అయితే వీరేశలింగం, జయంతి రామయ్య ప్రభృతుల కాలానికే ఇంగ్లీషు పట్టణభాషగా చేరిపోవటంతో మనం మాట్లాడే భాషలో కూడా ఆనాటికే తెలుగు మాటల వాడకం తగ్గిపోయే పరిస్థితి దాపురించింది.
ఇది ఆందోళనకరమైనదంటూ హూణ (ఆంగ్లం) భాషాధిక్యతకు వ్యతిరేకంగా వీరేశలింగం గారు, జయంతిరామయ్య పంతులుగారు కూడా ఆవేదన వెలిబుచ్చారు. దీన్ని బట్టి ఇంగ్లీషు విషయంలో జయంతి రామయ్య లాంటి గ్రాంథిక వాదులు కూడా తెలుగుకు పట్టం కట్టాలనే వాదాన్ని అంగీకరించారు. వారికి తెలుగంటే గ్రాంథిక తెలుగే! అది సామాన్యుడికి అర్థం కాదు. సామాన్యుడికి అర్థమయ్యే భాషంటే ఈ పండితులకు గౌరవం లేదు. ఇదీ ఆనాటి పరిస్థితి!
వాడుక భాష స్థిరీకరణ
ఎంతో మంది వ్యాకరణవేత్తలను వాడుకభాష విషయంలో నియమాల స్థిరీకరణకు ప్రయత్నించమని కోరినా ప్రయోజనం లేకపోవటానికి కారణం, మన వ్యాకరణ సూత్రాలన్నీ కావ్యాల ఉదాహరణలతో, కావ్య భాషను ఉద్ధేశించి రూపొందినవి కావటమే!
మరుగునపడి, కాలగమనంలో కనుమరుగైన తెలుగు పదాలు చిన్నయ సూరి వచనంలో ఎక్కువగా కనిపిస్తాయి. వాటిలో కొన్నింటికి నిఘంటువులు కూడా అర్థాలు వ్రాయని పరిస్థితి.
పండితభాషలోనే గద్య పద్య రచనలు రెండూ సాగాలని కోరిన జయంతి రామయ్య పంతులు గారు గిడుగువారి వాడుకభాషా వాదాన్ని ఖండిస్తూ, “గ్రామ్యభాషనే గ్రాంథిక భాషగా మార్చవలెనని మన ప్రతిపక్షుల వాదము దుర్బలముగను, దోషభూయిష్ఠముగను, గాన్పించు చున్నది” అన్నారు. ఇక్కడ జయంతి వారి దృష్టిలో గ్రాంథిక భాష అంటే పుస్తకాల్లో వ్రాసే భాష అనే! జయంతి రామయ్య గారి భావాలతో ఇప్పటి మనం కూడా ఏకీభవించక పోవచ్చు. కానీ, ఆయన వ్యాఖ్యలో అంతర్లీనంగా పుస్తకాల భాష మరీ కఠినతరంగా ఉండకూదదనే కోరిక స్పష్టమౌతోంది. సంస్కృత పండితుల దాష్టీకం ఎక్కువగా ఉండటం వలన చాలామంది బైటపడలేకపోయారు!
వ్యవహారంలో వున్న భాష ఒక ప్రాంతంవారిది ఇంకో ప్రాంతం వారికి అర్థం కాదని, ఒక కాలంలో రాసిన భాష ఇంకొక కాలంవారికి అర్థం కాదని, విద్యావంతులైన బ్రాహ్మణులు మాట్లాడే భాష కూడా ప్రాంతం నుంచి ప్రాంతానికి మారుతుందని, ఇలాంటి భాషలో రచనలు చెయ్యకూడదని జయంతివారి గట్టి నమ్మకం. అందుచేత లాక్షణికమైన భాషే రచనల్లో వాడాలని ఆయన అభిప్రాయపడ్డారు. అది క్రమేణా, ‘వాడుక భాషకు భిన్నంగా గ్రంథాల్లో వ్రాసే భాష ఉండాల’నేది జయంతివారి వాదన.
“చాలవఱకు నాంగ్ల భాష కొఱకై మాతృభాష నుపేక్ష చేయుట వలన దుర్గ్రాహ్యత్వము వాటిల్లుచున్నది. సామాన్యముగ మాతృభాష నుపేక్ష చేయు పాఠశాలలో సయితము ప్రతి తరగతి నుండియు నేవురార్వురు కవులు బయలు వెడలుచున్నారు కాఁబట్టి, యాంధ్రవాఙ్మయము నిజముగా కఠినమయినది కాదని స్పష్టము కాఁగలదు” అంటారు జయంతి రామయ్య పంతులు.
కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ఈ వాదాన్ని పుణికి పుచ్చుకున్న రచయిత. విశ్వనాథ వారి గ్రాంథిక నవలలు హాహాహూహూ, నందిగ్రామరాజ్యం, బాణామతి లాంటివి అద్భుతంగా పాఠకుల్ని పరుగు లెత్తించేంత వేగంగా సాగాయి. అది విశ్వనాథ వారి శైలి. అంతే! అయితే, అలాంటి గ్రాంథికం ప్రామాణిక భాష అంటే మనం అంగీకరించలేము.
గిడుగు వారి ఆలోచనల్ని ఇప్పటి మన భాష తీరుతో పోల్చుకుని ఆలోచిస్తే మనం చేయవలసిన మార్పులు స్పష్టం అవుతాయి.
ఎలా మాట్లాడుతున్నామో అలానే వ్రాయాలి!
శతాబ్దాలుగా స్థిరీకృతమై కేవలం సాహిత్య రచనకే పరిమితమైన భాష నేటికాలపు ఆధునిక రచనా వ్యాసాంగానికి పనికిరాదని గుర్తించిన వారిలో ప్రముఖులు గిడుగు వారు! ఈనాటికీ వాడుకభాష పట్ల ఎంత మక్కువ ఉన్నా ఎలా మాట్లాడుతున్నామో అలా వ్రాయటం ఇంకా మనకు పూర్తిగా చేతకాలేదనే చెప్పాలి. ఎలా వ్రాస్తున్నామో అలా మాట్లాడటమూ చేతకావటం లేదు. మొత్తం మీద మాటకు, వ్రాతకూ ఎడం ఇంకా ఎక్కువగానే ఉంది!
గిడుగువారి దృష్టి ప్రధానంగా వచన రచనపైన కేంద్రీకృతమయ్యింది. ఈయన తన కాలంలో ప్రవర్థమానమౌతోన్న కొత్త శాస్త్రాల్ని తెలుగులోకి తేవాలంటే వాడుక భాషే శరణ్యం అని ఎంతో ముందు చూపుతో వాదించారు. శాస్త్రాలను కావ్య భాషలో వ్రాస్తే, విద్యార్థి శాస్త్రాన్ని అర్థం చేసుకోవటానికన్నా ఎక్కువ సమయాన్ని ఈ కావ్యభాషాపదాలను అర్థం చేసుకోవటానికి కేటాయించాల్సి వస్తుంది.
నాకు ఐదేళ్లపాటు ఆంగ్లంలో నేర్పిన విద్యని నా మాతృభాషలో నేర్పినట్లయితే మూడేళ్లలోనే నేర్చుకుని ఉండే వాణ్ణని గాంధీగారు వ్రాసిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి! ఆయన 1920లలో ఈ వ్యాఖ్యలు చేసే నాటికి గిడుగు వారి వాడుకభాషోద్యమం ఉఢృతంగానే సాగుతోంది. ఇది ఆనాటి సంగతి మాత్రమే కాదు, ఈ నాటి సమస్య కూడా!
1970లలో ఆనాటి తెలుగు అకాడెమీ ప్రచురించిన సైన్సు పాఠ్య గ్రంథాల్లో సాంకేతిక పదాలన్నింటినీ సంస్కృతంలోకి అనువదించి సైన్సు బోధించే ఉపాధ్యాయులక్కూడా అర్థం కానిదిగా మార్చేశారు. తెలుగు మీడియంలో పాఠ్య గ్రంథాలు ఓ విఫల యత్నం కావటానికి కావ్యభాషను, కావ్య భాష విధానాన్నీ పాఠ్యగ్రంథ రచయితలు వదులుకోలేకపోవటమే కారణం.
వెన్నెముక గల ప్రాణులు, వెన్నెముక లేని ప్రాణులు అంటే సరిపోయే చోట సకశేరుకములు, అకశేరకములు అనవలసిన అవసరం ఉన్నదా? తెలుగు మాధ్యమంలో సైన్సు పాఠ్యపుస్తక రచయితలుగా సంస్కృత పండితుల్ని నియమించటం వలన వాళ్లు తమ భాషాభిమానాన్ని సైన్సు చదివే పిల్లల మీద రుద్దారు. ఏ ప్రయత్నాలను గిడుగు వ్యతిరేకించారో అదే తెలుగు మాథ్యమ పాఠ్య గ్రంథాల విషయంలో జరిగింది. ఇలాంటి ప్రయోగాలు కావ్యాలకు చెల్లుతాయి. శాస్త్ర గ్రంథాలకు అవి వేడి అన్నంలో పలుగురాళ్లలా తగులుతాయి. వచన రచన పైన పండితులకు ఈనాటికీ సరైన అవగాహన లేదనే చెప్పాలి! కావ్యరచనకు ఎంత శిక్షణ అవసరమో, వ్యాస రచనకూ అంత నైపుణ్యంతో కూడిన శిక్షణా అవసరమే! కావ్యాలు పండిత పాఠకుల కోసం కాగా వచన రచనలు పామర పాఠక జనం కోసం! వాటిలో సైన్సు రచనల పరమ ప్రయోజనం అతి సామాన్యుడికి చేరువ కావటమే! గిడుగు వారి ఉద్యమం ఆనాడు ఆశించింది ఇదే!
వాడుక భాషలో వ్రాయటం తేలికేమీ కాదు!
వందేళ్ల క్రితం రచయిత అంటే కావ్యాలు వ్రాసేవాడే అనే గుర్తింపు ఉండేది. కావ్యేతర ప్రక్రియలకు పెద్ద విలువ ఉండేది కాదు. వచన రచనలో కావ్యానికి మించిన దూకుడు ప్రదర్శిస్తే తప్ప గుర్తింపు ఉండదనే గ్రహింపు వలన చిన్నయ సూరి మిత్రలాభం, మిత్రభేదం పండితుల్ని సైతం బెదరకొట్టగలిగింది. ఏమీ చెయ్యలేక ఆయన కులాన్ని పట్టుకుని పండిత వర్గాలు దాడులకు పూనుకున్నాయి.
ఈ పరిస్థితుల్లో వీరేశలింగంగారి సరళ గ్రాంథికం రాజ్యం ఏలుతుండగా వాడుకభాషే ప్రధానం కావాలని ఉద్యమించినవాడు గిడుగు. భాషోద్యమం, వాడుక భాషోద్యమం రెండూ పోటాపోటిగా నడిచాయానాడు.
వీరేశలింగం పంతులుగారికి గట్టి వ్యతిరేకిగా ముద్రపడిన కొక్కొండ వెంకట రత్నం పంతులు గారు అత్యంత ఆధునికుడైన గ్రాంథికవాది. ఆయన బ్రిటిష్ యువరాజు భారత పర్యటన మీద వాడుక భాషలో “యువరాజు పర్యటన” అనే నవల వ్రాసి బహుమతి పొందినవాడు. కాదంబరిని సంస్కృతంలోకి తెలుగులో నవలా పద్ధతిలో అనువదించినవాడు. ఇప్పుడు మనం వ్రాస్తున్నంత స్వేచ్ఛగా వాక్యప్రయోగాలు చెయ్యకపోయినప్పటికీ కొంత సరళ గ్రాంథికానికే మొగ్గు చూపాడాయన! కానీ, “ఓయి భిక్షుకా! నేడు మా ఇంట తండులములు నిండుకున్నవి, రేపు రమ్ము” లాంటి భాష ఇంట్లోకూడా మాట్లాడేవారని చెప్తారు. ఇది అటు గ్రామ్యం లేదా జనసామాన్య భాష కాదు. ఇటు నాగరిక భాష కూడ కాదు. ఎలా మాట్లాడుతున్నామో అట్లానే వ్రాయాలనే ఆలోచన వీరేశలింగంగారి నాటికే మొదలయ్యింది. ఎలా మాట్లాడాలో, ఎలా వ్రాయాలో కూడా స్థిరీకరణ జరగాలని భావించిన వాడు గిడుగు! ఇందుకు ఈ నాటికీ సన్నద్ధత కనిపించటం లేదు, వ్యాకరణవేత్తలలో.
వాడుక భాష విషయంలో ఇంత యుద్ధానికి కారకుడైన గిడుగు రామమూర్తిగారు స్వీయ రచనల్లో తాను వాదించిన వ్యవహార భాష వాడలేకపోయారు. ఆయన విమర్శించిన గ్రాంథికానికి దగ్గరగానే గిడుగువారి వచనం ఉండేది. వెల్చేరు వారు ఓ చమత్కారం వ్రాశారు: “ఈ వ్యావహారిక భాషావాది తన సొంత విషయాలు తన భార్యకు రాసిన ఉత్తరాలలో చక్కని పద్యాల్లో రాశారు. ఆయన భార్య కూడా అంత చక్కని పద్యాల్లోనే సమాధానం రాశారు. పద్యాల్లో సొంత ఇంటి సంగతులు భార్యాభర్తలు మాట్లాడుకోడానికి గ్రాంథికభాష పనికి వచ్చినప్పుడు, ఇతర లౌకిక వ్యవహారాలకి ఎందుకు పనికిరాదని ఆయన ఎలా అనుకున్నారో చెప్పడం కష్టం.” అని!
పూర్తి వాడుక
హిందూ ధర్మ శాస్త్ర సంగ్రహం అనే గ్రంథాన్ని చిన్నయ సూరి పూర్తి వ్యావహారిక భాషలో వ్రాయగా, అత్యంత ఆధునికుడైన కట్టమంచి రామలింగారెడ్డి తన కవిత్వతత్త్వ విచారము గ్రంథాన్ని పూర్తి గ్రాంథికంలో వ్రాశారని, విమర్శిస్తూనే వెల్చేరు నారాయణరావుగారు పరుచూరి శ్రీనివాసరావుతో కలిసి వ్రాసిన తెలుగు భాష కథ పుస్తకంలో గ్రాంధిక వ్యావహారిక భాషలు ఎప్పుడు ఏవి ఎలా అవసరం పడతాయో ఇలా వివరించారు:
“భాషలో రకరకాల శైలులు వున్నాయి. సాహిత్యంలో వాడే భాష ఒక రకం, శాస్త్ర విషయాలు, ఆలోచనలు చెప్పటానికి వాడే భాష ఇంకొక రకం, ఈ రెండురకాల భాషలకి మధ్య తేడా ఉంది. మొదటి దాంట్లో ఏం చెప్పాలి అనే అనే విషయం మీద కాకుండా ఎలా చెప్పాలి అన్న విషయం మీద దృష్టి ఎక్కువగా ఉంటుంది, రెండవ దాంట్లో స్పష్టతకి, తార్మికతకి, సమాచారానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. కాని చెప్పే విషయం అందంగా ఉందా లేదా అన్న విషయం మీద దృష్టి ఉండదు. ఇలా విడదీసి చూస్తే చిన్నయ సూరి రెండు రకాల శైలుల్లోనూ పుస్తకాలు రాశాడని, వ్యావహారికవాదులు ఆ పని చేయ్యలేదని చెప్పాలి!”
చిన్నయసూరి పదాలపై విశ్లేషణ
1920లో మెట్రిక్యులేషన్ యస్.యస్.యల్.సి విద్యార్థుల తెలుగు పాఠ్యగ్రంథాల్లో చిన్నయసూరిగారి మిత్రభేదంలో ఒక భాగాన్ని పాఠ్యాంశంగా విశ్వవిద్యాలయం నిర్ణయించింది. గిడుగు రామమూర్తిగారు ఓ పాఠ్యగ్రంథంలో మిత్రభేదం పాఠాన్ని పైపైన తిరగేస్తుండగా, “ఆ కానన మందుఁ బింగళకమను సింహము గలదు. అది పుండరీకముల ఖండించుచు సలుగుల నలుగులం పడఁజేయుచుఁ గాసరముల మీసరముగాఁ జించుచు” అనే వాక్యం ఆయన కళ్లలో పడింది. ఈ వాక్యంలో మిగతా పదాలకు నిఘంటువుల్లో అర్థాలు దొరికాయి. కాని “కాసరముల మీసరముగా జించుట” అంటే ఏమిటో ఆయనకు అన్వయం దొరకలేదు. కిళాంబి రామానుజాచార్యులవారు, కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రులుగారి వంటి పెద్దల్ని చాలా మందిని కలిసి అడిగారు ఎవరికి తోచింది వారు చెప్పారేగాని “మీసరముగాఁ జించుచు” అని చిన్నయగారు ఎందుకు వాడాడో సంతృప్తికరంగా సమాధానం రాలేదు.
ఆంధ్రభాషాలక్షణము లెస్సగా తెలిసిన శ్రీ వజ్ఝల చిన సీతారామస్వామి శాస్త్రులుగారిని కలిసి అడిగారు. ఆయన లోపలికి వెళ్లి 1909వ సంవత్సరంలో అచ్చయిన (18వ ముద్రణ) నీతిచంద్రికని తెచ్చి పరిశీలించి చూశారు. అందులో “కాసరముల మీసరము గాసించుచు” అని ఉంది. ‘గాసించుచు’ అనే క్రియా పదం ఉందన్న సంగతి మరిచిపోయి సూరిగారి భాషా సేవని అర్థం చేసుకోలేని పండిత పరిష్కర్తలు మధ్యలో అరసున్నా చేర్చి ‘గాఁ జించుచు’ అని అచ్చువేయించారని ఆయన తేల్చారు. ఈ ఉదంతాన్నంతా గిడుగువారు 1924లో చిన్నయసూరి నీతిచంద్రిక అనే వ్యాసంలో ఉదహరించారు.
1856లో చిన్నయసూరిగారు నీతిచంద్రికని స్వయంగా పరిష్కరించి రెండవ ముద్రణ అచ్చువేయించారు. మొదటి ప్రతిలోని దోషాలను ఆయనే సరిచేశారు కాబట్టి ఈ ముద్రణే నిర్దుష్టమైంది. అది దొరికితే, దాంతో సరిచూసుకుంటే గానీ, ఇప్పుడు మనం చదువుతున్న నీతిచంద్రికలో తప్పులు తేలవు. ఇప్పుడు మనం చదువుతున్న చిన్నయసూరి మిత్ర లాభం, మిత్రభేదం ప్రూఫులు దిద్దేవాళ్లు తమకు తోచినట్టు దిద్దిన పుస్తకాలు. వాటివలన అసలు తెలుగు అంటే ఏమిటో తెలీకుండా పోయింది.
“ఆ అడవిలో పింగళకం అనే సింహం ఉంది. అది పుండరీకాలను అంటే పెద్దపులుల్ని ఖండించిందట. సలుగులు అంటే అడవిపందులు. పందులు పొలాల్లో పడి ముట్టితో మొక్కల్ని కుళ్లగించి దుంపల్ని తింటాయి. పొలాల్లో అధికంగా ఉండే నీళ్ళు బైటకు పోవటానికి తవ్వే పిల్లకాలువల్ని అలుగులు అంటారు. సలుగుల్ని ఈ అలుగుల్లోకి పడదోసేసిందిట పింగళకం. కాసరములు అంటే ఎనుబోతులు. వాటిని “మీసరము గాసించిందని చిన్నయసూరి వ్రాశారు. అక్షర దోషానైతే పట్తుకో గలిగారు కానీ దాని భావాన్ని మాత్రం తేల్చలేకపోయారు పండితులెవరూ!
‘నీతిచంద్రిక’ కృతి ప్రశంస చేస్తూ, చిన్నయసూరిగారు “తుదముట్టఁగ నీ కబ్బము/పదిలంబుగాఁ జదివినట్టి బాలుర కోలిం/బొదలును భాషాజ్ఞానము/కుదురుం గొదలేక నీతి కుశలత్వంబున్” అనే పద్యం రాశారు. చివరి పుటదాకా శ్రద్ధగా, ఏకబిగువున చదివితే మానసిక వికాసం, నైతికవర్తనతో పాటు భాషాజ్ఞానం కుదుర్తుందని, కుశలత్వం అంటే నిశితంగా పరిశీలించే నేర్పు పెరుగుతుందని ఆశించి తానీ రచనకు పూనుకొన్నట్టు చెప్పుకున్నారు. ఇది నీతిచంద్రికకు లక్ష్యప్రస్తావన చేసిన పద్యం. కావ్యాల్లో పెద్దగా స్థానం పొందకుండా
మరుగున పడిపోయిన తెలుగు పదాలను తెలుసుకోవటమే కదా.. భాషాఙ్ఞానం అంటే!
మూలపుటమ్మభాష (Proto Telugu) లోని పదాలు జనం వాడుక మరిచినవి కొల్లలుగా ఇందులో ఉన్నాయి.
1967లో వెలువడిన శ్రీ కన్యకా పరమేశ్వరీ చరిత్ర కావ్యంలో బండ్ల సుబ్రహ్మణ్యకవి చిన్నయసూరి మార్గాన్నే అనుసరిస్తూ ఈ క్రింది పద్యం వ్రాశారు:
“ఆ నురవృత్తము ల్దెలియ కా సురవృత్తి వహించి మించి పె
న్గాసర మట్ల మీసరము గాసిలఁ జేయుచు లోక జాలమున్
మీసముఁ ద్రిప్పు భూపతుల మెప్పున కిచ్చకమాడి వారికై
దోసములాచరించు కడు దుర్మతి దుర్గతి వొంద కుండునే” అని!
ఆసురవృత్తితో అంటే పరమ రాక్షసంగా కాసరాలను (అడవి దున్నల్ని) మీసరం గాసిలచేసినట్లు (హింసించి బాధించినట్లు) ఈ వర్ణన కనిపిస్తుంది.
వెదికినంత మేర చిన్నయసూరి ప్రయోగించిన అర్థంలో మీసరం గాసిలచేయు అనే పదాన్ని ప్రయోగించినవారు ఒక్క ఈ బండ్ల సుబ్రహ్య్మణ్య కవిగారే కనిపిస్తున్నారు. ఇంకెవరైనా ఇదే అర్థంలో ప్రయోగించి ఉంటే వారికీ నమస్కారం.
మీసరం అంటే సమూలంగా నిర్మూలించటం అన్నంత తీక్షణమైన పదం. కానీ, మన నిఘంటువులన్నీఈ ముక్తకంఠంతో ‘శ్రేష్ఠమైనదిగా చేయు’ అనే అర్థాన్నే ఇచ్చాయి. “మీసరము (Excellent, fine, grand) శ్రేష్ఠమైన. “మీసరములౌ నీలంపు సరు లమర.” అని బ్రౌణ్య నిఘంటువు చెప్తోంది.
మీసరము గాసిలచేయు అన్నప్పుడు ‘గాసిలచేయు’ అంటే బాధించటం అని! శ్రేష్ఠమైనదిగా చేయటానికి బాధించటానికి పొంతన ఎలా కుదుర్తుంది? ఈ రెండు పదాలను మన నిఘంటువులు ఎలా సమన్వయం చేస్తాయి?
శ్రేష్ఠమైన (మీసరం), బాధ (గాసిల్లచేయు) రెండు పదాలను కలిపితే శ్రేష్ఠమైన బాధ అనే కొత్తపదం పుడ్తుంది. శ్రేష్ఠమైన బాధ అంటే మరణమే! “మీసరం గాసించుచు” అంటే, కాసరాలు “ఈ హింస భరించలేము, మమ్మల్ని చంపెయ్యి.. అదే మాకు సుఖం” అన్నట్టు – శ్రేష్ఠమైన బాధని తమకు ప్రసాదించమని వేడుకున్నాయన్నమాట! ‘గాసిల్లు’కి Sweet agony (తియ్యని బాధ) అనేది దీని సమానార్థకం. తీపు అని వాడుకలో ఉన్న తెలుగు పదానికి కూడా ఇలాంటి అర్థమే ఉంది.
శ్రేష్ఠం పదానికి పర్యాయపదాల్లో ‘పరమము’ కూడా ఒకటి. ఉత్కృష్టమైనది పరమం. పరమపదము అంటే మోక్షం. మీసరం ఈ పరమపదమే ననుకుంటే సూరిగారు కాసరముల మీసరము గాసించుచు అనటంలోని ఆంతర్యం తెలుస్తుంది. ఇలా గాసించాడనే మాటకు మోక్షం లేదా బలవన్మరణం పొండాడని ఒక కొత్త అర్థం వస్తోంది. తరచూ వాడ్తుంటే ఇవే వాడకంలో కొస్తాయి. మీసరం అంటే సమూలంగా తుడిచిపెట్టటం అనే అర్థంలో వాడుకోదగిన పదం!
“ఇప్పుడిలాంటి మారుమూల పదాల్ని వెలికి తెచ్చినందువలన ఏం ప్రయోజనం? ఎవరికి అర్థం అవుతాయి?” అనడిగేవాళ్లూ ఉన్నారు. పోయిందనుకున్న మన ఆస్తి మళ్ళీ మనకు దొరకటం లాంటిది. దాన్ని రేపటి తరం కోసం అయినా భద్రపరచటం మన విధి.
చిన్నయ సూరి-గిడుగు
చిన్నయసూరి పరమ గ్రాంథికవాదనీ, గిడుగు పరమ వ్యావహారికవాదనీ మనం అనుకుంటూ ఉంటాం. కొన్ని పడిగట్టు పదాలకు మనం అలవాటుపడిపోయి అనాలోచితంగా కొన్ని మాటలు వాడేస్తుంటాం. గ్రాంథికవాదం అనేది వాటిలో ఒకటి. వ్యాకరణ యుక్తమైన భాష లాక్షణిక భాష! లక్షణ విరుద్ధమైనది గ్రామ్య భాష!
లక్షణాలు వివరించేప్పుడు ఇచ్చే ఉదాహరణలన్నీ కావ్యాల్లో కవులు ప్రయోగించినవే! ఆ పదాలలో 99% ప్రజల వాడకంలో లేని పదాలే ఉంటాయి. ఒక పరాయి భాషీయుడు తెలుగు నేర్చుకోవాలంటే తెలుగు వారి సంభాషణల్లో లేని పదాల్ని నేర్చుకోవటం వలన ఆతనికి తెలుగు వచ్చినా తెలుగు ప్రజలతో మాట్లాడే అవకాశం ఉండదు. బ్రౌన్ లాంటి ఆంగ్లేయ తెలుగు పండితులు అప్పటి కచేరీల్లో, న్యాయస్థానాల్లో, ప్రజలు ఇచ్చుకునే అర్జీల్లో పదాలను ఉదహరిస్తూ వ్యాకరణ గ్రంథాన్ని, తెలుగు నిఘంటువుల్నీ రూపొందించాడు. ఇప్పటి వ్యాకరణ వేత్తలు ఆధునిక కావ్యాల్లోంచి గానీ, జనబాహిళ్యం లోకి వెళ్ళిన రచనల్లోంచిగానీ ఉదాహరణలిస్తే వ్యాకరణ సూత్రాలకు సమకాలీనత వస్తుంది. కనీసం అలాంటి ప్రయత్నం కూడా చేయటం లేదు. ప్రజలు మాట్లాడే తెలుగు పట్ల చిన్నచూపు ఈ నాటికి ఇంకా పోలేదనేది నిజమే!
దీని వలన జరిగిన అపకారం ఏమంటే ఇంగ్లీషువాడు తెలుగు నేర్చుకోవటం కన్నా తెలుగువాడు ఇంగ్లీషు నేర్చుకుంటే పరిపాలన సుఖంగా సాగుతుందని మెకాలే శాసించే పరిస్థితి వచ్చింది. ఇదంతా కుంఫిణీ ప్రభుత్వ కాలంలోనే జరిగిపోయింది.
వ్యాకరణ నియమాలతో సాధించలేని పదాల్ని, శబ్ద రత్నాకరంలో లేని పదాల్ని పండితులు పట్టించుకోకుండా వదిలేశారు. 1858లో బాలవ్యాకరణం వ్రాసిన చిన్నయ సూరి కాలానికి, 1925లనాటి గిడుగు వారి కాలానికి సమాజపోకడలో చాలా మార్పు ఉంది. పారిశ్రామిక విప్లవానంతర యుగానికి చెందిన గిడుగువారి ఆలోచనలు చిన్నయ కాలానికి ఉండే అవకాశం లేదు. కాబట్టి గిడుగులాగా సూరి ఆలోచించలేదనటం కూడా అన్యాయమే!
చిన్నయ సూరి కాలానికే అచ్చు యంత్రాలు వాడకంలోకి రావటం మొదలయ్యాయి. అర్బత్ నాట్ సహకారమే కావచ్చు, స్వంతంగా ఒక ప్రెస్సుకూడా సూరి గారి కుండేది. రాజకీయ, లౌకిక వ్యవహారాలకు వచనం అవసరాన్ని చిన్నయ సూరే మొదట గుర్తించాడు. అందుకు వాడుక భాషని ఒక నియమిత పద్ధతిలో వాడకంలోకి తేవాలని భావించాడు. ఆధునిక అవసరాలుకు ఉపయోగపడే పదాలు మరుగున పడిపోయిన వాటిలో అనేకం ఉన్నాయని వాటిని వెదికి వెలుగులోకి తేవాలని గుర్తించాడు. వ్యవహార అవసరాలకు అందంగా భాషను ఉపయోగించాలనే ఆలోచన చిన్నయసూరిదేనని వెల్చేరు వారు వ్రాసిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి.
“1862లో చిన్నయసూరి మరణం తరువాత ఆయన దృక్పథానికి కొనసాగింపు లేకుండా పోయింది” అంటారు వేల్చేరు నారాయణరావుగారు. నీతిచంద్రికలో చిన్నయసూరి రాసిన మిత్రలాభము, మిత్రభేదము నిజానికి అందమైన వచనం! వీరేశలింగం వ్రాసిన తక్కిన భాగాలే గడ్డు పదాలతో నిండిన శుష్క వచనం అని గురజాడ, గిడుగూ ఇద్దరూ అభిప్రాయపడ్డారు.
చిన్నయ్య గ్రాంథికాన్ని తెచ్చి జనం మీద రుద్దాడన్న అభిప్రాయాన్ని ఆ ఇద్దరూ ఒప్పుకోలేదు. సూరిగారి వచన శైలికి ఆ ఇద్దరూ ముచ్చటపడ్డారు కూడా! 1924లో ‘చిన్నయసూరి నీతి చంద్రిక’ అనే వ్యాసంలో “వ్యావహారికభాష తల్లివలె నాకు ప్రేమపాత్రము; ప్రాచీనాంధ్ర భాష మూలపుటమ్మవలె నాకు పూజ్యురాలు” అని గిడుగువారు రాశారు. ప్రాచీనాంధ్ర భాషకు జీవంపోసిన వాడిగా చిన్నయ సూరిని ఆయన గౌరవించాడు కూడా!
1925-2025 ఈ వందేళ్ల కాలంలో ఏర్పడిన సాంకేతిక ప్రగతి అనేక రెట్లు ఎక్కువ, కానీ, దాన్ని అందుకోవటానికి భాషాపరంగా మనం చేసిన కృషి అతి స్వల్పం. ఇంక ముందు మరింత వేగంగా రానున్న అత్యంత సాంకేతికతకు అనుగుణమైన రీతిలో ఇప్పటికైనా తెలుగును సన్నద్ధం చేసుకోవటం ఒక అవసరం. ప్రపంచ దేశాలన్నీ మాతృభాషల్లో సాంకేతికను అభివృద్ధి చేసుకుంటుంటే ఇంకా మనం పాతకాలపు ఆలోచనల్లో కూరుకు పోతున్నాం!
గిడుగువారి కాలానికి స్వల్పమైన సాంకేతికత మాత్రమే ఉంది. ఆ రోజుల్లో ప్రజల భాష పట్ల చిన్నచూపు ఉండటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ, ఈ యుగానికి అది నప్పదు. ప్రభుత్వాలు, పాలకులు, కార్పోరేట్ శక్తులు సహకరించకపోయినా ప్రజల్ని తెలుగు వాడకుండా ఏ శక్తీ నిరోధించలేదు. ప్రజల్లోనే ఆ ఉత్సాహం పెరగాలి. అందుకు ముందుగ అతెలుగంటే చిన్నచూపు పోవాలి!
వాడుక భాషలో జపనీయుల సాంకేతిక విద్య
శాస్త్ర సాంకేతిక అంశాలను జపాన్ తన భాషలోకి అనువడించేందుకు అది అనుసరిస్తున్న విధానం మీద కొంత అధ్యయనం చేస్తే మనం గిడుగుమార్గాన వాడుక భాషను ఎలా అభివృద్ధి చేసుకోవాలో అర్థం అవుతుంది.
జపాన్లో మూడు రకాల లిపులున్నాయి. కంజి లిపి చైనా అక్షరాలను స్వీకరించిన లిపి. హిరగానా అనేది పూర్తిగా జపనీయుల దేశీయ లిపి. కటకానా అనేది విదేశీ పదాలను వ్రాయటానికి ఉపయోగించేది.
ప్రాథమిక స్థాయి పాఠ్యపుస్తకాల్లో సంభాషణలు, కీలక పదజాలం, వ్యాకరణ అంశాలూ ఉంటాయి. పై తరగతులకు వచ్చే కొద్దీ శాస్త్ర సాంకేతిక విషయాలన్నీ సరళమైన జపాన్ భాషలో నిర్దిష్ట అంశాలపై దృష్టి పెట్టి రూపొందుతాయి.
ప్రామాణిక పదాలను తరచుగా ప్రసిద్ధ జపానీ నాటకాలు, కావ్యాలు, ఇతర సాహిత్యాధారాల నుండి తీసుకున్న పదాలతో రూపొందిస్తారు. ఒక్కో పదాన్ని వివరిస్తూ కొన్ని ఎక్సర్‌సైజులు చేయించటం ద్వారా ఆ జపానీ పదం విద్యార్థికి బాగా బుర్రలోకి వెళ్లేలా చేస్తారు, క్రింది తరగతుల్లో సాంకేతిక పదాలమీద పట్టు పెరగటం వలన ఉన్నత విద్యలో పాఠ్యపుస్తకాలు ఒకరు బోధించాల్సిన అవసరం లేకుండా స్వయంగా చదువుకోగలిగేలా ఉంటాయి
పాఠ్యపుస్తకం ప్రధానంగా అధికారిక మరియు ప్రామాణిక భాషను బోధించడం లక్ష్యంగా పెట్టుకుంది.
శాస్త్ర సాంకేతిక గ్రంథాలు శాస్త్రాన్ని నేర్పటం మీద దృష్టి పెట్టాలే గానీ భాషాభిమానాన్ని చాటేవిగా ఉండకూడదని జపనీయులు గుర్తించారు. వ్రాయటం చేతనైన ఉత్తమ ఉపాధ్యాయులు శాస్త్ర గ్రంథాలు వ్రాస్తారు.
ఎంత జపనీ వస్తే అంత సైన్సు వస్తుందని వాళ్ల నమ్మకం. జపాన్ భాషా సంస్కృతులు తెలీకుండానే సైంటిస్టుల్ని చేసేయాలనే యావ అక్కడి తల్లిదంద్రులకు లేదు. జపాను వాళ్లు జపానీయులుగా ఎదగాలని చూస్తారు. తెలుగు వాళ్లు ఎంత త్వరగా ఇంగ్లీషువారిగా మారిపోదామా అని చూస్తారు.
ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ గారు అమెరికాలో అణుశాస్త్రాన్ని విశ్వవిద్యాలయ విద్యార్థులకు భోధించేప్పుడు తను చెప్తున్న పాఠాన్ని వినకుండా ఒక జపానీ విద్యార్థి తలవంచుకుని ఏదో పుస్తకం చదువుతున్నాడట! ఆచార్యులవారు ఆరా తీస్తే ఆ విద్యార్థి అదే సబ్జెక్టుని జపాన్ భాషలో ప్రచురించిన పుస్తకంలో చూస్తూ వింటున్నానని చెప్పాడట. 4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో ఆయన ఈ విషయాన్ని ఉదహరించారు.
అమెరికాలో ఒక శాస్త్ర విషయం వెలుగులోకి వచ్చే సమయానికి చైనా జపాన్ జెర్మనీ రష్యాల్లో అదే విషయం ఆయా భాషల్లో పాఠ్య పుస్తకాల్లోకి చేరిపోతుంది. మన వెనుకబాటుకు, కునుకుబాటుకు కారణాలు మన దగ్గరే ఉన్నాయి!
(సమాప్తం)
డా. జి. వి. పూర్ణచందు విజయవాడ వాస్తవ్యులు, ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు, వివిధ సాహిత్య ప్రక్రియలలో సృజనాత్మక, సామాజిక, వైఙ్ఞానిక రచనలు చేసిన సాహితీవేత్త. 130 పుస్తకాలు వివిధ ప్రచురణ సంస్థల ద్వారా ప్రచురితం అయ్యాయి. 50 అంతర్జాతీయ, జాతీయ సదస్సులలో కీలక ప్రసంగం, సభాధ్యక్షత లేదా, పత్రసమర్పణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న ‘హంస’ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, సద్గురు శివానంద మూర్తి వికారి నామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం, మద్రాస్ విశ్వవిద్యాలయం ఆర్కాటు ప్రసాదరావు ధర్మనిథి పురస్కారం ఇంకా 50కి పైగా సంస్థల పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు 4 పర్యాయాలు ప్రధానకార్యదర్శిగా వ్యవహరించారు.