Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గెలవడమంటే

[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన నామని సుజనాదేవి గారి ‘గెలవడమంటే’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

“IT’S VERY EASY TO DEFEAT SOMEONE,

BUT IT’S VERY HARD TO WIN SOMEONE.

Difficulties in your life do not come to destroy you,

But to help you realize your hidden potential and power,

Let difficulties know that you too are difficult. Be active! Take on responsibility!

Work for the things. You believe in, if you do not, you are surrendering your fate to others”

-Abdul Kalam.

ప్రతీ రోజు తప్పనిసరిగా ఏ పుస్తకమైనా కొంతయినా చదివే అలవాటు ఉన్ననేను నా అభిమాన రచయిత, నాయకుడు అయిన అబ్దుల్ కలాం గారి కొటేషన్స్ చదివి ఆనందించాను. కాని అప్పుడు నాకు తెలీదు. అవి నా జీవితంలో నిజమవుతాయని, ఆ వాక్యాల స్ఫూర్తితో నేను మా కార్యాలయంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతానని.

నేను కొత్తగా బ్రాంచ్ మేనేజర్‌గా ఆ బ్రాంచ్‌కి ట్రాన్స్‌ఫర్ చేయబడ్డాను. నిజానికి పట్టణానికి కాస్త దూరంగా పల్లె, పట్నం కాని ఊర్లో ఉంది ఆ బ్రాంచ్. నేను పని చేసేది ఒక పబ్లిక్ ఓరియెంటెడ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ప్రతీ మూల మూలలా మా ఆఫీసులు ఉన్నాయి. నేను వేరే బ్రాంచ్ నుండి ఇక్కడికి రావడానికి ముందే ఈ బ్రాంచ్ లోని క్లాస్ త్రీ యూనియన్ లోని ప్రెసిడెంట్, సెక్రెటరీ, ఈసి మెంబర్స్ నన్ను పర్సనల్‌గా కలిసి ఒక రిక్వెస్ట్ చేసారు.

“మా బ్రాంచ్‌కి హార్డీక సుస్వాగతం సర్.. మీరు చాలా మంచి వాళ్ళని విన్నాం.. అలాంటి మంచి మనిషి మా బ్రాంచ్‌కి రావడం మాకు ఆనందం. చిన్న రిక్వెస్ట్ సర్ ఇప్పటి వరకు మాకు ఇస్తున్న రెండు ఎఫ్ ఎల్ (ఫ్రెంచ్ లీవ్)లు మీరు అలాగే కంటిన్యు చేయాలి. ఇప్పుడు ఉన్న బ్రాంచ్ మేనేజర్ కూడా అలాగే ఇస్తున్నారు.. మాకు తెల్సు సర్.. మీరు మా రిక్వెస్ట్ మన్నిస్తారని..” అన్నాడు ప్రెసిడెంట్ సురేష్.

“ఇంకా నేను రాలేదు కదా.. జాయిన్ అయ్యాక చూద్దాం..” అన్నాను నేను.

“భలే ఉన్నారు సర్.. ఇప్పుడు కాకపొతే రేపు జాయిన్ అవుతారు అంటే కదా.. అయినా ఇప్పుడు ఉన్న దాన్ని కంటిన్యూ చేస్తారు అంతే కదా.. అయినా సారు ఎంత మంచివారో తెల్సి కూడా మనం ఇలా అడగడం ఏంటి? సర్ ఒకసారి మాటిస్తే అంతే మరి.. థాంక్ యు సర్.. నమస్తే సర్..” అంటూ వెళ్ళిపోయారు.

నేను దానిని అంత సీరియస్గా తీసుకోలేదు. ఆ బ్రాంచ్‌లో జాయిన్ అవగానే క్లాస్ వన్, క్లాస్ టు, క్లాస్ త్రీ అలా అందరూ ఫ్లవర్ బొకేలతో స్వాగతం పలికారు. ఇల్లు మారడం, కొత్త వాతావరణానికి అలవాటు పడడం, ఎవరి మనస్తత్వాలు ఏమిటో బేరీజు వేయడం లాటి విషయాలతో పాటు, ఆఫీస్ మార్కెటింగ్, అడ్మినిస్ట్రేషన్ పనులన్నింటిలో నేను రెండు మూడు నెలలు బిజీ అయిపోయాను.

ఒకసారి పెట్టిన ఆఫీసర్స్ మీటింగ్‌లో ఇక్కడ ఇంతకు ముందు ఇచ్చినట్లే క్లాస్ త్రీ వారికి ఎఫ్ ఎల్ (అంటే ఆ రోజు రాక పోయినా వారు వచ్చినట్లు సంతకం పెట్టుకోవడమో, లేదా వచ్చి సంతకం చేసి వెళ్లడమో) ఇస్తున్నారని తెలిసింది. నిజానికి నేను అంతకు ముందు ఆఫీసులో అలా ఎవరికీ ఇవ్వలేదు. ఆఫీసర్స్ అందరూ, “ఇప్పటి వరకు ఉన్నదాన్ని ఎందుకు తీసేయడం, వాళ్ళు మనకు ఎప్పుడైనా లేట్ అవర్స్ ఉండమన్నా ఉంటారు కదా, వార్షిక ముగింపు లెక్కలలో కూడా సహాయం చేస్తారు కదా” అని అనడంతో నేను మిన్నకుండి పోయాను.

నిజానికి బిజినెస్ వస్తుంది అంటే, కాష్ కౌంటర్ టైమింగ్స్ కన్నా ఎక్కువ సమయమైనా క్లోజ్ చేయకుండా ఉంటారు కదాని ఊర్కున్నాను. ఆఫీస్ అవర్స్ కన్నా ఎక్కువ సమయం అయితే సాధారణంగా ఏవైనా తినడానికి స్నాక్స్ తెప్పిస్తారు. ఒక వేళ ఎప్పుడైనా హాలిడేస్‌లో కూడా పని ఉండి ఆఫీస్ తెరిస్తే కూడా ఇలాగే కేవలం భోజనం వగైరా ప్రొవైడు చేస్తారు ఆఫీస్ తరఫున. అయితే వీళ్ళు దానితో పాటు ఎఫ్ ఎల్ కూడా అడుగుతున్నారు. ఇదంతా అఫీషియల్‌గా కాకుండా ఆఫ్ ద రికార్డ్ అన్నమాట.

మరో నాలుగు నెలల్లో ఆఫీసులో మార్చి క్లోజింగ్ జరిగింది. కాని దానికి కూడా క్లాస్ త్రీ అంతగా సహాయం ఏమీ చేయలేదు. ఎక్కువగా, తప్పదు కాబట్టి ఆఫీసర్లే షెడ్యుల్స్ వగైరా లన్నీ చూసుకున్నారు. ఈలోగా మా కంపనీ అన్ని యూనియన్ల డిమాండ్‌లను దృష్టిలో పెట్టుకుని ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే ఇప్పటివరకు మా కంపనీలో ప్రతీ శనివారం సగం పూట (హాఫ్ డే) ఉండేది. అది కాస్తా ఇప్పుడు ప్రతీ రెండవ శనివారం, నాలుగవ శనివారం పూర్తి సెలవుగా, మిగతా శనివారాలు పూర్తి రోజు పనిదినంగా ఆదేశాలు జారీ అయ్యాయి. దానితో నెలలో అప్పుడో ఇప్పుడో వచ్చే ఇతర సెలవుదినాలు, ఈ రెండు శనివారాలు పూర్తి సెలవు అయ్యేసరికి పని దినాలు బాగా తగ్గిపోయాయి.

ఆ తగ్గిపోయిన దినాలలో ఒక్కొక్కరు రెండు ఎఫ్ ఎల్‌లు, అప్పుడో ఇప్పుడో వారికున్న సెలవులను ఉపయోగించుకునేసరికి, ఏ పని కావాలన్నా చాలా ఆలస్యం కావడం, అసలు కాకపోవడంతో కస్టమర్ల నుండి ఇతర స్టాఫ్ నుండి చాలా కంప్లయింట్స్ రావడం మొదలయ్యింది. ఎప్పుడో, అది న్యాయబద్ధమైనది కాదు తీసేయాలి అనుకున్న నేను ఒకరోజు యూనియన్ వారిని పిల్చాను.

“ఇప్పుడు ప్రతీ నెలలో రెండు శనివారాలు సెలవు దినాలు రావడం వల్ల పని దినాలు పూర్తిగా తగ్గిపోయాయి. కాబట్టి ఎఫ్ ఎల్ తీసేయాలనుకుంటున్నాను.. మీ యూనియన్ కూడా నాతో ఏకీభవించి సహకరిస్తారని ఆశిస్తాను. మీ గ్రీవాన్సెస్ ఏవైనా ఉంటే ఈ రెండు రోజుల్లో విషయం చెప్పండి” అంటూ క్లుప్తంగా ముగించాను. ఇంతలో నా చాంబర్ కోసం బయట వేరే క్లయింట్స్ ఎదురుచూస్తూండటంతో వారు లోపలికి రావడంతో వీరు ఏమీ మాట్లాడకుండా వెళ్లి పోయారు. అసలు నేను ఆ విషయం మాట్లాడతానని వారు ఊహించలేదు.

నిజానికి ఎప్పుడయినా యూనియన్‌తో మాట్లాడేప్పుడు బ్రాంచ్ మేనేజర్‌తో పాటు కనీసం మరో ఆఫీసర్ ఉంటారు తోడుగా. ఎందుకంటే అంతా మంచిగా ఉంటే ఏమీ కాదు కాని ఒకవేళ ఏమైనా తేడా వస్తే, మాటలు జారినా.. ఇంకా ఆవేశంలో ఒక అడుగు ముందుకేసినా కనీసం సాక్ష్యంగా అయినా ఉండడం కోసం అనుకుంటా. ఎందుకంటే వారంతా ఒకే యూనియన్, ఒకే క్లాస్, సెక్రెటరీ, ఇద్దరు జాయింట్ సెక్రెటరీలు, ప్రెసిడెంట్, ఆడిటర్, ఈసి మెంబర్స్ అందరూ కల్సి దాదాపు ఆరు, ఏడూ మంది ఉద్యోగులు అవుతారు. అయితే ఇప్పటివరకు ఎప్పుడైనా యూనియన్‌తో సత్సంబంధాలు ఉండడంతో ఎప్పుడైనా వారు వచ్చినప్పుడు బ్రాంచ్ మేనేజర్ చాంబర్‌లో నేను ఒక్కడినే ఉండేవాడిని.

ఆ తర్వాత రెండు రోజుల తర్వాత వచ్చిన మొదటి తేదీ నుండి అటెండెన్స్ మార్క్ చేసే ఆఫీసర్ ఉమకి ‘నో ఎఫ్ ఎల్స్’ అంటూ సూచనలు ఇచ్చేశాను. మొదటి రోజు అలా ‘ఎఫ్ ఎల్’ అడిగిన వారికి ఆఫీసర్, లేదని చెప్పి ఆ రోజు లీవ్ మార్క్ చేసేసింది. ఇది చాలా పెద్ద గొడవకు దారి తీసింది.

నేనేమో వారు నేనిచ్చిన రెండు రోజులు ఏ రకమైన ఫిర్యాదులు తీసుకురాలేదు కాబట్టి, నేను అనుకున్నట్టుగా అమలు చేసేయాలని అనుకున్నాను. వారేమో, మాట్లాడడానికి వెళ్ళడానికి ప్రెసిడెంటో ఎవరో లీవ్‌లో ఉన్నారు కాబట్టి మరో రోజు వెళదాం అనుకున్నారట, ‘ఈ లోగా ‘లేదు’ అని యూనియన్‌కి అగైనెస్ట్‌గా పోవడం కొరివితో తల గోక్కున్నట్లే కదా.. అంత ధైర్యం ఎవరూ చేయరు’ అనుకున్నారట. ఈ విషయం తర్వాత క్లాస్ త్రీ ఉద్యోగులు అనుకునేది విన్న ఆఫీసర్ చెప్పగా తెల్సింది.

దానితో ఆఫీసర్ లీవ్ మార్క్ చేసినది ఆ మర్నాడు చూసిన సదరు ఉద్యోగి యూనియన్ ప్రెసిడెంట్‌కి చెప్పాడు. అతను, మిగతా అందరూ కల్సి అటెండెన్స్ రిజిస్టర్ చూసి విషయం నిర్ధారణ చేసుకుని,

“బ్రాంచ్ మేనేజర్ డౌన్ డౌన్..”, “అసలేం అనుకుంటున్నాడు వాడు..” అంటూ అందులో కొందరు భయోత్పాతం సృష్టిస్తూ అరుస్తూ పై ఫ్లోర్‌లో నేను ఉన్న చాంబర్ లోకి దూసుకొచ్చారు.

అందులో ప్రెసిడెంట్ ఆవేశం పట్టలేక కొట్టడానికి నా పైకి దూసుకొచ్చాడు. బిజినెస్ ఫిగర్స్ అనాలిసిస్ చేస్తున్న నాకు, అసలు వాళ్ళు ఎందుకు అంత కోపంగా దూసుకోస్తున్నారో అర్థం కాలేదు. ఒక్క నిమిషం షాక్‌కి లోనయ్యాను. ఇంతలో అందులోనే ఉన్న మరి కొందరు అతన్ని ఆపారు.

“అసలు ఎం జరిగింది..” అంటూ అడగబోతున్న నన్ను, “ఇది నీ అయ్య జాగీరనుకున్నావా.. అందరి కన్నా నువ్వు గోప్పోడివి అనుకుంటున్నావా.. ఎలా ఇవ్వరో మేమూ చూస్తాం” అంటూ చాలా దురుసుగా, హీనమైన భాషతో దుర్భాషలాడుతూ అందరినీ భయకంపితులను చేసారు. నేను నిశ్చేష్టుడిని అయ్యాను. అయితే ఈ గందరగోళం విన్న మిగతా ఆఫీసర్లు పైకి పరుగెత్తుకుని వచ్చారు.

మిగతా వాళ్ళంతా అతన్ని ఆపి అందరూ అరుచుకుంటూ కుర్చీలు ఎత్తేస్తూ, కాష్‌లో కూర్చున్న ఉద్యోగులను కూడా ఎవ్వరూ వర్క్ చేయొద్దు అని చెబుతూ క్లబ్ రూమ్ లోకి వెళ్ళిపోయి మీటింగ్ పెట్టుకున్నారు.

జరిగిన దాన్ని మౌనంగా గమనిస్తున్న నా దగ్గరకు మిగతా అందరు ఆఫీసర్లు వచ్చారు.

“అసలు ఇది ఆఫీస్ అనుకున్నారా? బజారు అనుకున్నారా..”

“ఇక్కడ రౌడీయిజం ఏంటి సర్”

“మీరు చాలా మంచివారు కాబట్టే వారి ఆటలు సాగుతున్నాయి.. వారు మన కోసం వర్క్ చేస్తున్నారా.. జీతం తీసుకుంటున్నారు పని చేస్తున్నారు.. కంప్లైంట్ ఇద్దాం సర్”

“అసలు అలా అనడానికి ఎన్ని గుండెలు సర్.. నేను అందుకే సెల్‌లో వీడియో ఆన్ చేసి చేతిలో పట్టుకున్నాను.. వీడియో రాకపోయినా అందరి అరుపులు అవీ రికార్డ్ అయ్యాయి..” ఇలా రకరకాల వాఖ్యానాలు చేసారు అందరూ.

అక్కడ నేను చేయని తప్పుకి ఇలాంటి వ్యతిరేకత నేను ఊహించనిది..

మంచితనాన్ని చేతకానితనం కింద జమ కడితే అది చూస్తూ నేను ఊరుకుంటే, నేను అసమర్థుడిని అవుతాను. అప్పుడు నిజంగానే రూల్స్ ప్రకారం పోతే ఒక్క రోజు కూడా వాళ్ళు పని చేయలేరు. ఎందుకంటే పది గంటలకు ఆఫీస్ అయినా బయోమెట్రిక్ లేదు కనుక అరగంట అలా లేట్ వచ్చినా చూసీ చూడనట్లు వదిలేస్తున్నాం.

ఇంకా మధ్య మధ్యలో పర్మిషన్లు.. దగ్గరలోని టౌన్ నుండి, అప్ అండ్ డౌన్ రోజూ చేసేవాళ్ళే చాలా మంది ఉన్నారు కాబట్టి రోజూ సాయంత్రం అరగంట అలా ముందు వెళుతుంటారు. కారణం అప్పుడు బస్ పోతే మళ్ళీ గంటకు గానీ లేదు. కాబట్టి పోనీలే అనుకుంటారు అందరూ.

నేను ముందు ఆ ఆఫీసర్లందరి ముందే పై ఆఫీసుకి ఫోన్ చేసి విషయం చెప్పాను. వారు, “వెంటనే కస్టమర్‌లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలి కాబట్టి, వారితో ఎవరైనా కాష్ కౌంటర్‌లో కూర్చుంటారో లేదో అడగండి. ఒకవేళ కూర్చోనంటే మాత్రం వెంటనే ఒక ఆఫీసర్‌కి పాస్ వర్డ్ కాషియర్‌ది ఇచ్చి కూర్చోబెట్టండి. తర్వాత వారి డిమాండ్ లను ఏమిటో చర్చలకు రమ్మని పిలవండి. వచ్చినప్పుడు మాత్రం ఎప్పటిలా ఒక్కరే చాంబర్‌లో ఉండకండి. ఒక లేడీ ఆఫీసర్‌ను, ఒక రిజర్వేషన్ ఆఫీసర్‌ను మీతో పాటు తప్పక ఉంచుకోండి. మళ్ళీ ఏ విషయం చెప్పండి” అంటూ సూచనలు ఇచ్చారు.

దానితో ఆఫీసర్లందరినీ ఎవరి పని వారు చేసుకోమని చెబుతూ ఒక ఆఫీసర్‌ని మాత్రం ఉండమన్నాను. ఈ లోగా ఆఫీస్ పని వేళలు కాబట్టి క్లబ్ రూమ్‌లో ఉన్న వారంతా ఎవరి సీట్లో వారు వచ్చి కూర్చున్నారు. తర్వాత ప్రెసిడెంట్‌కి ఫోన్ చేసి, చాంబర్ లోకి రమ్మన్నాను.

ఇద్దరు గుర్రుగా చూస్తూ వచ్చారు. “కాష్ లో ఎవరూ లేరు.. ఎవరైనా కూర్చుంటారా..” అంటూ అడిగాను.

“ఎవ్వరం కూర్చోం.. ఏ పనీ చేయం..” అంటూ పొగరుగా వెళ్ళిపోతున్నారు. వారు చాంబర్ లోని నా సీట్ నుండి ఆ గది దాటడానికి తలుపు వరకు ఇంకా వెళ్ళనే లేదు, నేను, “మధూ.. నీకు కాషియర్ పాస్ వర్డ్ ఇస్తున్నాను.. కూర్చో..” అన్నాను పదునుగా, ఎదురుగా ఉన్న ఆఫీసర్ మధుతో.

వాళ్ళు విస్తుపోయినట్లున్నారు. అలా గది బయటకు వెళ్ళారో లేదో.. మరుక్షణంలో మళ్ళీ లోపలకు వచ్చి, “మా వాళ్ళు కూర్చుంటారు..” అని చెప్పి వెళ్లి, అందరూ ఎవరి సీట్లలో వాళ్ళు మౌనంగా ఎవరి పని వారు చేస్తూ కూర్చున్నారు. ఇంత త్వరగా మారిన వారి ప్రవర్తనకు కారణం ఏమిటో నాకు అర్థం కాలేదు. అలాంటి పిచ్చి విషయానికి నా టైం కూడా వెచ్చించదలచుకోలేదు. కాని అసలు విషయం మరో గంటలో నా దగ్గరకు వచ్చి చెప్పిన మధు ద్వారా తెల్సింది.

“సర్.. వీళ్ళు చేసిన పని పై ఆఫీసు లోని యూనియన్ లీడర్లకు తెలిసి వీళ్ళని పిచ్చి తిట్లు తిట్టారట. ‘అసలు అలా ఎఫ్ ఎల్స్ తీసుకోవద్దని మేము ఎప్పుడో చెప్పాం.. మేం మిమ్మల్ని సపోర్ట్ చేయం. ఆ మేనేజర్ మంచి వారు కాబట్టి ఇప్పటి వరకు ఊరుకున్నాడు. అసలు కాష్‌లో కూర్చునే వాళ్ళని మీరు అడ్డుకుంటే, పని చేయడాన్ని అడ్డుకుంటున్నారని మీపై కేస్ ఫైల్ చేయవచ్చు. పొరపాటున ఈ విషయం ఎవరైనా వీడియో తీస్తే ఉద్యోగాలు పోతాయి.. మీ కసలు బుద్ధుందా..’ అంటూ డివిజనల్ యూనియన్ సెక్రెటరీ బాగా తిట్టారట సర్..” సంతోషంగా చెప్పాడు మధు.

పై ఆఫీసు వాళ్ళు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం, వారి డిమాండ్స్ చర్చించడానికి రమ్మంటూ ఒక ఆఫీసర్ ద్వారా పిల్చాను. వారు వస్తున్నామని అన్నారు. దానితో నేను లేడీ ఆఫీసర్ ఉమా మేడంను, మధును చాంబర్‌లో కూర్చోబెట్టుకున్నాను. వారు నా చాంబర్ బయట కుర్చీల్లో కూర్చుని లోనికి చూస్తూ ఉండడం, అద్దాల లోపల నుండి నాకు కనబడుతుంది. ఇంతలో ఇంటర్ కం మోగింది.

“సర్.. మేము మాట్లాడడానికి వస్తున్నాం..” ప్రెసిడెంట్ అన్నాడు.

“రండి”

“మీ ఎదురుగా ఉన్న ఆఫీసర్ల పనయిపోయి వాళ్ళు వెళ్ళగానే వస్తాం సర్..” అన్నాడు అవతలి నుండి.

“లేదు.. వాళ్ళు ఎక్కడికీ వెళ్ళరు.. ఇక్కడే ఉంటారు. వారు కూడా చర్చల్లో పాల్గొంటారు..” నేను అనగానే షాక్ తిన్నారు. “ఓకె” అంటూ పెట్టేసారు కాని, చూసి చూసి లోనికి రాకుండానే వెళ్ళిపోయారు. పై ఆఫీసు వాళ్లకి అదే విషయం చెప్పాను. “వెరీ గుడ్” అన్నారు.

తెల్లవారి పై ఆఫీసు నుండి ఫోన్. “మీ దగ్గరకు చర్చలకు వస్తారట గానీ ఎవరూ ఉండొద్దు అన్నారు, ఇక్కడున్న వారి యూనియన్ లీడర్లు. అయితే, ‘అది కుదరదు’ అనడంతో, మధు ఆఫీసర్‌కి బదులుగా మరో ఆఫీసర్ పేరు చెప్పారు, అతన్ని ఉంచమన్నారు.. సరే అన్నాము కాబట్టి ఇవాళ అలాగే పిలవండి..” అన్నారు.

అలాగే ఎప్పటిలాగే అందరూ వచ్చారు. కాని అంతకు ముందులా ఎవరూ వారి హద్దు మీరలేదు.

బతిమిలాడినట్లే మాట్లాడారు.. నేనూ మృదువుగానే, గంభీరంగా, “ఆ ఒక్కటీ దక్క” అన్నాను. దానితో, “మేం నాన్ కోఆపరేషన్ చేస్తాం ఇవ్వాల్టి నుండి” అంటూ వెళ్ళిపోయారు.

ఆ సాయంత్రం ఆఫీసర్స్ మీటింగ్ పెట్టాను. విషయం చెబుతూ, “ఇక మీరంతా జాగ్రత్తగా ఉండండి.. వాళ్ళిలా చెప్పారు.. వాళ్ళు ఏ విషయం లోనైనా కావాలని గొడవ చేయడానికి ప్రయత్నించినా ఎవరూ ఓపిక, సంయమనం కోల్పోవద్దు. బహుశా సహాయ నిరాకరణ కాకుండా ఏ పనీ చేయక పోవచ్చు.. అయినా నెమ్మదిగా మీరే చేసుకుంటూ వెళ్ళండి. వారు వచ్చే వేళలు, వెళ్ళే వేళల పై ఒక కన్నేయండి. మనల్ని ఎప్పుడైనా టార్గెట్ చేస్తే ఒక అంశం ఉంటుంది.. రోజూ మనం ఉండే సమయం కన్నా వారు పని చేయకపోతే మరో గంట ఎక్కువ చేస్తామేమో.. అన్ని డిపార్ట్‌మెంట్‌లు ఒకరి కొకరు సహాయం చేసుకోండి.. ఇది కూడా ఎక్కువ కాలం ఉండక పోవచ్చు.. వారు కూడా మన కుటుంబ సభ్యులే.” అన్నాను.

“సర్.. వారికి అంత సీన్ లేదు సర్.. అసలు వారి ‘నాన్ కోఆపరేషన్’ మనకు ‘కోఆపరేషన్’ అవుతుంది సర్.. ఎందుకంటే పొద్దున్న ఎప్పుడైనా సరిగ్గా సమయానికి అందరూ ఎప్పుడైనా వచ్చారా సర్.. ఎప్పుడూ అరగంట, ముప్పావు గంట, గంట లేటే.. రెండు సార్లు లేటయితే బావుండదు అనుకుంటారేమో సాయంత్రం ఎప్పుడైనా ముందే వెళ్ళిపోతారు. పైగా బస్ కూడా అలాగే ఉంటుంది.. కాబట్టి తిక్క తిరుగుతుంది..” అన్నాడు మధు నవ్వుతూ.

“నిజమే సర్.. మేం అందరం ఒకరి కొకరం సహాయం చేసుకుంటాం.. అసలు ఇది మన మంచికే జరిగింది. ఇప్పటి వరకు ఆఫీసర్లు అంటే వారికి ఏ మాత్రం కేర్ లేదు ఇప్పుడు ‘ఆఫీసర్’ అంటే ఏంటో చూపిస్తాము. అదేంటో గాని వారి గొడవ ఏమిటో గాని దాని వల్ల మాలో మాకు మంచి యూనిటీ వచ్చింది సర్.. మంచి బలం వచ్చింది..” నవ్వుతూ అంది ఉమ.

నిజమేనంటూ అందరూ బలపరిచారు. ఇక అప్పటి నుండి ప్రతీ రోజు కనీసం పది నిమిషాలయినా ఆఫీసర్లందరం నా చాంబర్‌లో మీటింగ్ పెట్టుకునేవాళ్ళం. వాళ్ళు మా యూనిటీ చూసి కుళ్ళుకునేవాళ్ళు.

‘అనవసర రాద్ధాంతం చేసి మన పరువు పోగొట్టుకుని, అటు కస్టమర్‌లలో, ఇటు పై యూనియన్ లీడర్లలో, ఆఫీసులో మిగతా వారి దగ్గర పరువు పోగొట్టుకున్నాం.. పైగా ఇలా సమయానికి రావడం, కూర్చోవడం, వెళ్ళడం ఘోరంగా ఉంది. అంతే కాదు అలా పని చేయకుండా మనం కూర్చుని ఆఫీసర్ తీరిక లేకుండా పని చేసేసరికి అందరి సానుభూతి వారు పొందడమే కాదు, కొంత మంది కస్టమర్లు, అది మీ సీట్ వర్కే కదా మీరెందుకు చేయరు అంటూ నిలదీస్తున్నారు కూడా. అలాంటప్పుడు కూడా వారి పని గొడవ కాకుండా ఆఫీసర్లే చేస్తున్నారు.. చ.. చా.. అంటూ అనుకుంటున్నార’ని మధు వార్త కూడా తీసుకొచ్చాడు.

పైగా ఒక్కరోజు కూడా అందరూ అలా సమయానికి రాలేదు కాని రెండో రోజు నుండి ఎప్పటి లాగానే పొద్దున్న లేట్‌గా రావడం, ముందుగా వెళ్ళడం, పర్మిషన్లు తీసుకోవడం కంటిన్యూ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఒకరోజు టూర్లో, “పెద్ద పార్టీ దగ్గర నుండి యాభై లక్షల చెక్ తీసుకోస్తున్నాను, నెలాఖరు కాబట్టి కౌంటర్ ఆపండి, వాళ్ళు వెళ్ళినా ఫర్వాలేదు క్లోజ్ జేయకుండా చూడండి.. ఆఫీసర్ ఎవరమైనా కూర్చుని పూర్తీ చేద్దాం” అని అకౌంట్స్ ఆఫీసర్ కి ఫోన్ చేసి చెప్పాను. అయితే వాళ్ళు కావాలని ఆఫీసర్‌కి చెప్పకుండానే క్లోజ్ చేసారట. జస్ట్ అప్పుడే నేను చెక్ తీసుకుని వచ్చాను. విషయం అకౌంట్స్ ఆఫీసర్ చెప్పగానే, కోపంగా గట్టిగట్టిగా అరిచాను.

“ఆఫీస్ అంటే ఏమనుకుంటున్నారు.. ఎవరు క్లోజ్ చేసింది.. వద్దన్నా క్లోజ్ చేసినందుకు రేపు లెటర్ ఇష్యూ చేస్తాను.. యు నో ద పవర్స్ ఆఫ్ బ్రాంచ్ మేనేజర్.. ముందు సేఫ్ కీ లు రెండు తీసుకుని తెరవండి. క్లోజ్ చేసినా ఫర్వాలేదు. మళ్ళీ ఓపెన్ చేయండి.. పై ఆఫీసు ద్వారా నేను ఏర్పాటు చేస్తాను.. ఇప్పటి వరకు వారు నాన్-కోఆపరేషన్ అని సమయానికి ఆఫీస్‌కి వచ్చినా, రాకపోయినా ఏమీ అనలేదు.. ఇక నుండి ప్రతీ ఒక్కటి కౌంట్ అవుతుంది.. ఒక్కొక్కరు ఏ ఏ సీట్లో ఏం పని చేస్తున్నారో లాగ్ ఫైల్ తీయిస్తాను.. టేక్ ద పాస్ వర్డ్ ఫర్ కాష్ అండ్ ఓపెన్ ద కౌంటర్ నౌ..” అంటూ కోపంగా పెద్దగా అనేసరికి ఎక్కడి వాళ్ళక్కడ కిక్కురుమనకుండా, భయం భయంగా జారుకున్నారు.

మా బ్రాంచ్‌లో జరిగిన విషయం అలా అలా పాకి డివిజన్ లోనే కాక ఇతర బ్రాంచ్ లలో కూడా పాకడంతో అక్కడ కూడా యూనియన్ వారి పరువు పడిపోయి ఇక్కడి లాంటి పరిస్థితి వస్తోందని అందరూ ఇక్కడి యూనియన్ లీడర్లను కోప్పడ్డారట. పైగా నేను ఆ తెల్లవారి జరిగిన డివిజన్ మీటింగ్‌కి అటెండ్ అయినప్పుడు వేరే విషయం ఏదో నెపం చెప్పి అందరి ముందు, ‘పవర్‌ఫుల్ బ్రాంచ్ మేనేజర్’ అంటూ సన్మానించారు.

మిగతా పూర్తిగా తెలియని వాళ్ళు జరిగిన విషయాలను ఆరా తీసారు. వారంతా కూడా ఇక ముందు ఎవరి బ్రాంచ్‌లో కూడా ఎఫ్ ఎల్‌లు ఇవ్వకుండా స్ట్రిక్ట్‌గా చెప్పాలని నిర్ణయించుకున్నట్లు ఆఫ్ ద రికార్డ్ చెప్పారు ఒకరితో ఒకరు. ఆ రోజు డివిజన్ మీటింగ్ వల్ల ఆఫీస్‌కి రాలేదు.

తెల్లవారి నా కోసమే చూస్తున్న యూనియన్ వాళ్ళు వచ్చి, “సర్.. జరిగిందేదో జరిగిపోయింది. దయచేసి అది మనసులో ఉంచుకోకుండా క్షమించండి. ఏదో కుటుంబ సభ్యులు అన్నప్పుడు ఏవో మాటలు వస్తాయి. అలాగే మీ బిడ్డలుగా భావించి ఆ తప్పులు మనసులో పెట్టుకోకండి. ఇక ముందు ఇదివరకు లాగానే ఉందాం సర్..” అన్నారు.

గాలి కూడా నా నిర్ణయం కోసం చెవులు రిక్కించింది.

బయట గుడిలోని జే గంటలు మంగళకరంగా ‘శుభం’ అంటూ మోగాయి.

Exit mobile version