[శరీరావయవాలకు మాటలు వస్తే, అవి ఒకదానితో ఒకటి తమ బాధలు చెప్పుకుంటూ, మనుషులు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదని హెచ్చరిస్తున్నట్లు ఈ రచనలో వివరిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]
“బిడ్డల్ని మోసేటి తల్లీ గర్భాశయమా! ఎందుకు తల్లీ ఇంతగా ఏడుస్తున్నావు? నీ కళ్ళ వెంట రక్త ధారలు కాఋతున్నాయి” లాలనగా గర్భాశయాన్ని గుండె అడిగింది.
“క్షమ, శాంతం కలిగిన దానివి, నువ్వే ఇలా బాధ పడుతుంటే మేం చూడలేకున్నాము. ఏమయిందో చెప్పు” అని మూత్రపిండం, కాలేయం, జీర్ణాశయం వచ్చి ప్రేమగా అడిగాయి.
అవి పలకరించిన తీరు చూసి గర్భాశయం మరింత కళ్ళనీళ్ళ పర్యాయమైంది. “నేనిన్నాళ్ళూ మీ అందరి మధ్యా బతుకుతున్నాను కదా! ఇప్పుడు నన్ను ముక్కలు ముక్కలుగా కత్తిరించి బయట పారేస్తారట అంటూ చేతుల్లో మొహం దాచుకుని ఏడ్చింది.
“అలా అని ఎవరు చెప్పారు? మేమందరం నీకు తోడుగా ఉండగా నిన్నెలా చంపేస్తారు. మేమందరం లేమా? నువ్వేం భయపడకు అట్లా ఎందుకు అనుకుంటున్నావు?” శరీర అవయవాలన్నీ ఒక్కసారిగా అన్నాయి.
“నేను విన్నాను మిత్రులారా? నేను మీలాగా అందరి మనుషుల్లో ఉండను కదా! కేవలం మహిళల శరీరాల్లోనే ఉంటాను కదా! మనం కాపురముంటున్న ఈ మహిళ నిన్న వేరే వాళ్ళతో చెబుతుంటే విన్నాను. ఏమన్నదంటే ‘వదినా నేను కూడా హిస్టిరెక్టమీ చేయించుకుందాం అని అనుకుంటున్నాను. ప్రతినెలా ఈ బాధలు పడలేకపోతున్నాను. విసుగ్గా ఉంది’ అని గర్భాశయం బాధగా మిత్రులతో చెప్పింది.
“అవునా! అట్లా ఆన్నదా! ఏం పోయేకాలం వచ్చింది ఆమెకు. నువ్వు లేకపోతే పిల్లలనెలా కనేది? నువ్వు లేకపోతే ‘ఆడది’ అని గుర్తింపెలా వచ్చేది? అమ్మెలా అయ్యేది ? ఏమి గుర్తుకు రాలేదా!” మూత్రపిండం ముక్కు పుటాలు అదురుతూ ఉండగా గబగబా మాట్లాడింది.
“నువ్వు లేకపోతే మాతృత్వం గొప్పదనం ఎలా తెలిసేది? తన ఒడిలోకి బిడ్డలెలా వచ్చేవారు? పిల్లల్నాడిస్తూ పొందే మధురాను భూతిని ఎలా తెలుసుకునేది? ఆ ఆనందాన్ని ఎలా అనుభవించేది?” గుండె సాలోచనగా తలూపుతూ గర్భాశయంతో అన్నది.
ఉపిరితిత్తులు కూడా గర్భాశయం వంక చూస్తూ ఆవేశంగా ఇలా అన్నాయి – “పిల్లలే లేకపోతే వృద్ధాప్యంలోని వారిని ఎవరు చూసుకుంటారు? చివరి రోజులలో ఎవరు కాపాడతారు? ఆ మాత్రం జ్ఞానం ఉండక్కర లేదా?”
వీరి మాటలన్నీ గర్భాశయం మౌనంగా వింటూ ఉన్నది “ఇప్పుడు పిల్లలు పుట్టేశారు. పిల్లలు పెద్ద వాళ్ళయిపోయారు. ఇంక నాతో ఏం అవసరం లేదు కదా! అందుకే నన్ను తొలగించి చంపేయాలనుకుంటున్నారు. అయినా రేపు డాక్టర్ దగ్గరకు వెళ్తారట! చూద్దాం! ఏం జరుగుతుందో?” కొంచెం బాధగా ఉన్నా కొంచెం తెప్పరిల్లుకుని గర్భాశయం మాట్లాడింది.
“ఏరు దాటాక తెప్ప తగలేసే రకం ఈ మనుషులు. పూర్తిగా నష్టపోయేదాకా వాళ్ళకి నచ్చినట్లు చేస్తూనే ఉంటారు! ప్రకృతికి వ్యతిరేకంగా చెయ్యటమే మానవుల పని. అడవులను కొట్టేసి వరదలు, తుఫాన్లు తెచ్చుకుంటున్నారు. అలాగే పనయిపోయిందని గర్భాశయాల్ని తొలగించుకుంటున్నారు. నిన్ను తొలగిస్తే వాళ్ళకే నష్టమని తెలుసుకోలెక పోతున్నారు” గుండె మిగతా అవయవాల్ని ఉద్దేశింది అన్నది.
“మానవుల్లో ఏటికి ఎదురీదాలనే మనస్తత్వం ఉంటుంది. అదీగాక ఈ మహిళల్లో అన్నిటికీ పురుషులతో సమానం అనిపించుకోవాలనే ఆశ మొదలైంది. ఈ మధ్య బ్రెస్ట్ క్యాన్సర్లు వచ్చి రొమ్ములు తీసేస్తున్నారు. ఏదా ఆరోగ్యవంకలు చెప్పి నన్నూ తొలగిస్తున్నారు. గర్భాశయం, రొమ్ములు లేకుండా పురుషులతో ఈ విధంగా సమానత్వం సాధించామని అనుకుంటున్నారు. పిల్లలు పెద్ద వాళ్ళయ్యాక ఈ రెండు అవయవాలూ అవసరం లేదనుకుంటున్నారు” గర్భాశయం బాదాతప్త హృదయంతో అన్నది.
“వీళ్ళ పిల్లలకు పాలివ్వక పోవడం వల్లే బ్రెస్ట్ క్యాన్సర్లు వస్తున్నాయి. చాలా వరకు కోరి తెచ్చుకునే జబ్బులే. ఋతుస్రావం చివరి దశలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి. దానిని ఓపికతో సరిదిద్దుకోవాలి అంతే గానీ మొత్తం గర్భాశయాన్ని తొలగిస్తారా? గుండెలో సమస్య వచ్చిందని గుండెను తీసి బయట వేసేవారా? ఇది ఉపయోగం లేదని క్రూరమైన ఆలోచనలు చేస్తున్నారు. ఇలాంటి వారికి తగిన శాస్తే జరుగుతుంది” కాలేయం వచ్చి వీళ్ళ మాటలు విన్నాక అన్నది.
“రేపు డాక్టర్ దగ్గరకు వెళుతున్నారు కదా! అక్కడ ఏమి చెబుతారో చూద్దాం” అని గర్భాశయం నిర్వేదంగా లోపలికి వెళ్ళిపోయింది. మరుసటి రోజు డాక్టరు వద్దకు వెళ్ళారు. ఆ మహిళ తన సమస్యలు చెప్పింది.
“డాక్టరు గారూ! నేనీ ఋతుస్రావ సమస్యలతో పడలేక పోతున్నాను. నాకు గర్భసంచిని తొలగించేయండి. పీడా వదిలి పోతుంది” అని అసహ్యంగా మొహం పెట్టి అన్నది.
దానికి డాక్టరు గారు చిరునవ్వుతో చూస్తూ “చూడమ్మా ఇప్పటి దాకా నీకెంతో సేవలు చేసిన గర్భాశయాన్ని ఇలా తూలనాడకూడదు. నీ సమస్యలకు గర్భ సంచిని తీసేయడం ఒకటే మార్గం కాదు. దీనికి కొన్ని మందులు వాడుకోవచ్చు. మందులు వాడినా తగ్గని పరిస్థితుల్లోనో, ఏదైనా క్యాన్సర్ వంటి ప్రమాదభరిత రోగాలు వస్తేనో గర్భసంచిని తొలగిస్తాం. అంతే కానీ మీరు అడిగారని మేము ఆపరేషన్ చేసి తొలగించము. హార్మోన్స్ అసమతుల్యత ఏర్పడి అనేక జబ్బులకు కారణమవుతుంది. డిప్రెషన్ వంటి మానసిక సమస్యలతో కూడా అవస్థ పడవచ్చు. కొన్ని సార్లు గుండె పని తీరుపై కూడా ప్రభావం పడవచ్చు. గోటితో పోయే దానికి గొడ్డలి ఎందుకు! నీకు వచ్చిన సమస్యను మందులతో తగ్గించవచ్చమ్మ! దానికి ఆపరేషన్ అవసరం ఎంత మాత్రం లేదు. అందరూ చేయించుకుంటున్నారని అపోహా పడకు. గర్భసంచి తొలగించాల్సిన అవసరం ఏర్పడితే నేనే చెబుతాను. అప్పటి దాకా ఆ విషయం ఎత్తకండి” అని అర్థమయ్యేలా చెప్పాడు.
“సరే డాక్టరు గారూ! నాకివన్నీ తెలియదు ఇంటి చుట్టు పక్కల వాళ్ళు ఆపరేషన్ చేయించుకో. ప్రతినెలా వచ్చే ఋతుస్రావ సమస్యలు ఉండవు. హాయిగా ఉండవచ్చు. ఎక్కడికైనా తిరిగి రావచ్చు అని చెబితే నిజమనుకున్నాను. మీరు చెప్పిన దానికి నాకు కళ్ళు తెరుచుకున్నాయి. మీరు మందులు ఇవ్వండి. క్రమం తప్పక వాడుకుంటాను. తప్పక తగ్గిపోతుందనే అనుకుంటున్నాను” అని ఆ మహిళ స్థిర నిశ్చయంతో అన్నది.
“సరేనమ్మా చాలా మంచిది. మందులు రాసిస్తాను మళ్ళీ నెలకు నా వద్దకు రావాలి. అప్పుడు ఎలా ఉందో చెప్పు. మీ ఇంటి చుట్టు పక్కల వాళ్ళకి కూడా ఈ విషయాలు చెప్పు” అని డాక్టరు గారు మందుల చీటీ అందించారు.
ఇవన్నీ వింటున్న అవయవాలు సంతోషంతో ఎగిరి గంతేశాయి. “ఆమె మనసు మార్చుకుంది గాబట్టి సరిపోయింది. లేకుంటే నేను కాసేపు గుండె నొప్పి తెప్పించి కనువిప్పు కలిగేలా చేద్దామనుకున్నాను. నాకా అవసరం రాకుండా సరి పోయింది” అని గుండె ఊపిరి పీల్చుకుంటూ సంతోషంగా అన్నది.
గర్భాశయం కూడా సంతోషపడింది. “మనందరం కలిసే పుట్టాం. కలిసే చనిపోదాం. మధ్యలో నన్నొక్కదాన్నీ చంపేస్తారని భయపడ్డాను. ఇప్పుడా భయం పోయింది మీరంతా కూడా నాకు అండగా ఉన్నారు. నాకు ఎంతో ఆనందంగా ఉన్నది” అంటూ గర్భాశయం మిగతా అవయవాల్ని దగ్గరకు తీసుకుంది.
డా. కందేపి రాణీప్రసాద్ MA, MSc, PHD, బాల సాహితీ వేత్త, కవయిత్రి, అనువాదకులు, చిత్ర కళాకారిణి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. రాణీ ప్రసాద్ ఆర్ట్ పేరుతో హాస్పిటల్ వేస్ట్‌తో 4000 బొమ్మలను సృష్టించారు. బాల సాహిత్యంలో 48 పుస్తకాలు రచించారు. ‘తెలుగు బాల సాహిత్యంలో సైన్స్ రచనలు’ అనే అంశంపై నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. తెలుగు విశ్వ విద్యాలయంలో బాల సాహిత్య కీర్తి పురస్కారాన్ని నెలకొల్పారు. మిల్కీ మ్యూజియం, స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీ లను తమ ఆసుపత్రిలో పిల్లల కోసం నిర్వహిస్తున్నారు. తమ సొంత ఆసుపత్రిలో ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద పిల్లల కోసం తెలుగు పాట, బొమ్మ పెట్టి ప్రింట్ చేస్తున్నారు. సైన్సు, యాత్రా సాహిత్యం విరివిగా రాస్తున్నారు. కళాభారతి, కవిత వాణి, చిత్ర కళారాణి అనే ఎన్నో బిరుదులను, 6 వరల్డ్ రికార్డ్స్నూ సొంతం చేసుకున్నారు.