[డా. ఎస్. వి. కామేశ్వరి గారు రచించిన ‘గర్భసంచిని కాపాడుకుందాం సమాజాన్ని బలపరుద్దాం’ అనే పుస్తకాన్ని పరిచయం చేస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
కొన్ని పుస్తకాలకు ప్రత్యేక ప్రచారం అవసరం. సాహిత్యేతర పుస్తకాలకి మరీ అవసరం. ముఖ్యంగా సమాజంలో చలామణీలో ఉన్న అపోహలని తొలగించే ప్రయత్నం చేసే పుస్తకాలు, తప్పుడు సమాచారం వల్లో, అవగాహనా లేమి వల్లో, లేదా తాము ఎదుర్కుంటున్న ఆరోగ్య సమస్యలకు పరిష్కారంగా నమ్మించబడి – గర్భసంచి తొలగించుకుంటున్న మహిళలను హెచ్చరించే పుస్తకాలు ప్రచురితమైనప్పుడు – వాటిని వీలైనంత వరకూ జనబాహుళ్యంలోకి చేర్చాల్సిన బాధ్యత అందరిదీ.
తెలుగు రాష్ట్రాలలో అడ్డూ అదుపు లేకుండా జరుగుతున్న హిస్టరెక్టమీ ఆపరేషన్‍లకు వ్యతిరేకంగా, మహిళలకు, ఆరోగ్య కార్తకర్తలకు, మహిళల భర్తలకు, ఇతర కుటుంబ సభ్యులకు లోతైన అవగాహన కల్పించడం, అదీ అందరికీ అర్థమయ్యేలా సరళమైన భాషలో వివరించడం అనే కార్యాచరణని గత కొన్నేళ్ళుగా చేపట్టిన డా. ఎస్. వి. కామేశ్వరి, డా. వింజమూరి ప్రకాశ్ గార్ల కృషిలో ఒక భాగం ‘గర్భసంచిని కాపాడుకుందాం సమాజాన్ని బలపరుద్దాం’ అనే ఈ పుస్తకం.
ఈ పుస్తకం తొలి ముద్రణ 2017లో జరిగింది. ఆ తరువాతి ఏడేళ్ళలో సంభవించిన సామాజిక మార్పులు, అంతర్జాతీయ పరిశోధనలు, కోర్టు తీర్పుల కారణంగా – ఈ పుస్తకానికి రెండవ ముద్రణ తీసుకురావల్సిన అవసరం ఉందని భావించిన రచయిత్రి/ప్రచురణకర్తలు ఆగస్టు 2024లో సెకండ్ ఎడిషన్ వెలువరించారు.
***
మొదటి అధ్యాయం ‘ఆధారాలు లేకుండా గర్భసంచి తొలగింపు – మన స్త్రీల ప్రస్తుత పరిస్థితి’లో గర్భసంచి ప్రాధాన్యతని తెలిపారు రచయిత్రి. పెద్దాపరేషన్ పేరుతో గర్భసంచిని తొలగించే హిస్టరెక్టమీ గురించి ప్రస్తావిస్తారు. హిస్టరెక్టమీ ఆపరేషన్ – నిరుపేద నిరక్షరాస్య స్త్రీలలోనూ, ప్రభుత్వ ఆరోగ్య బీమా ఉన్నవారిలోనూ ఎక్కువగా జరుగుతున్నట్లు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, బీహార్ రాష్ట్రాలలో అత్యధికంగా జరుగుతున్నట్లు వివరించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలలో అత్యధికంగా 15 శాతానికి మించి జరిగాయని తెలిపారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వారి మొదటి సర్వే నుంచి రెండవ సర్వే జరిగిన 2021 వరకు – ఈ ఆపరేషన్ చేయించుకున్న స్త్రీల సంఖ్య గణనీయంగా పెరిగిందని వివరించారు.
అమెరికాలో ప్రతీ పదివేల మందిలో 55 మంది స్త్రీలకీ, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలలో ప్రతి పదివేల మందిలో కేవలం 20 మంది స్త్రీలకు మాత్రమే అనారోగ్య కారణాల వల్ల గర్భసంచి తొలగిస్తున్నారని తెలిపారు. ఈ దేశాల్లో ఈ ఆపరేషన్ చేయించుకున్న స్త్రీ సగటు వయసు సుమారుగా 44 ఏళ్ళు కాగా మన దేశంలో 29 సంవత్సరాలని చెప్పారు.
అసలు మన దగ్గర హిస్టరెక్టమీ ఆపరేషన్‌కి ఏ కారణాలతో సిఫార్సు చేస్తున్నారో చదివినప్పుడు విస్తుపోతాం. ఈ అధ్యాయం ద్వారా పరిస్థితి తీవ్రత అర్థమై, ఈ ఆపరేషన్లు జరిగే ధోరణి అవగతమవుతుంది.
‘గర్భసంచి – ఆరోగ్యానికి సూచిక’ అనే రెండో అధ్యాయంలో గర్భసంచిని తొలగించే ముందు పాటించాల్సిన విధి విధానాలు ఏమిటి? ఎలాంటి నియమావళిని అనుసరించాలి? అల్లోపతి వైద్యశాస్త్రం దీని గురించి ఏం చెబుతోంది? విధి విధానాలను, నియమావళిని అనుసరించిన తరువాత నిజంగా ఎంతమందికి గర్భసంచి తొలగించాల్సిన అవసరం ఉంటుంది? తప్పనిసరిగా, అవసరార్థం చేయాల్సిన ఆపరేషన్లు ఎన్ని, వాటికి ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి వంటి ప్రశ్నలకు జవాబులిచ్చారు డా. కామేశ్వరి. గర్భసంచి ప్రాముఖ్యతని వివరిస్తూ, గర్భసంచిలా అనువుగా సాగే అవయవం మరొకటి మన శరీరంలో లేదని అంటారు. పునరుత్పత్తి వయసులో గర్భసంచి పరిమాణం 8 నుంచి 10 సెంటీమీటర్ల పొడవు, 6 సెంటీమీటర్ల వెడల్పు, 3 సెంటీమీటర్ల మందంతో, 60 గ్రాముల బరువుతో ఉంటుందని చెప్తారు రచయిత్రి. మహిళ గర్భం దాల్చినప్పుడు గర్భసంచి 15 రెట్లు పొడవు, సుమారుగా ఒక కిలో వరకూ బరువు పెరగవచ్చని అంటారు. రక్త సరఫరాను 50 మిల్లీ లీటర్ల నుంచి 500 మిల్లీ లీటర్ల వరకూ పెంచుకోగలదని చెప్తారు. కుహర పరిమాణాన్ని 500-1000 రెట్లు పెంచుకునేలా కండరాల సంఖ్యను, సైజును, వాటి శక్తిని పెంచుకుని వ్యాకోచిస్తుందని తెలిపారు. ఒకసారి తొలగించడమంటూ జరిగితే, ఇక మరల ఏ రకంగానూ గర్భసంచిని తిరిగిపొందలేమని హెచ్చరిస్తారు. ఈ ఆపరేషన్ చేసిన తరువాత ఆసుపత్రి వారిచ్చే డిశ్చార్జ్ సమ్మరీలో ఏయే వివరాలు ఉండాలో చెప్పి, ఆ డిశ్చార్జ్ సమ్మరీని భద్రపరుచుకోవడం చాలా ముఖ్యమని వివరిస్తారు.
మూడవ అధ్యాయం ‘పునరుత్పత్తి అవయవాల మధ్య సమన్వయం – తెలిసిన, తెలుసుకోవాల్సిన, తెలియని విషయాలు’ లో శరీరమంతటిని ఒక్కటిగా చూడాలి తప్ప, ముక్కలు ముక్కలు చేసినట్టు ఏ విభాగానికదే స్వతంత్రమైనదనుకుంటూ, ఒకదానితో మరొకదానికి ఉన్న అనుబంధాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, ఆ భాగాలను తొలగించకూడదంటారు డా. కామేశ్వరి. స్త్రీ పునరుత్పత్తి అవయవాల పని ఎందుకు, ఎంత సంక్లిష్టమైనదో ఈ అధ్యాయంలో వివరించారు. అండాశయ ధమని, గర్భాశయ దమని కలిసి రక్తనాళాల వలయం ఏర్పాటు చేసుకుంటాయనీ, గర్భసంచీని తొలగిస్తున్నప్పుడు గర్భాశయ దమనిని కూడా తొలగించడం వల్ల ఈ వలయం విచ్ఛిన్నమవుతుందనీ, ఫలితంగా అండాశయ పనితీరులో దీర్ఘకాలిక మార్పులు చోటు చేసుకుంటాయనీ, వాటి ప్రభావం స్త్రీల శరీరంపై ఎలా ఉంటుందనేదానిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు.
నాల్గవ అధ్యాయం ‘పునరుత్పత్తి అవయవాలు – ఎముకల గట్టితనానికి వాటిలో ఉండే ఖనిజాలకు ఉన్న సంబంధం’ లో అస్థిపంజరం, ఎముకల గురించిన ఉపయుక్తమైన వివరాలు అందించారు. ఎముకలు సజీవమైన కణాల సముదాయమని చెప్తూ, గట్టిగా కనబడే ఎముకల్లో కొత్త కణాలు పుట్టడం, పాత కణాలు నశించడమనే ప్రక్రియ నిరంతరం కొనసాగుతూ, అస్థిపంజరం శరీరంలోని సున్నితమైన అవయవాలకు ఎలా ఊతంగా నిలుస్తుందో తెలిపారు. అయితే గర్భసంచీని తొలగించటం వల్ల మహిళలలో ఎముకల బలం తగ్గి, అనేక ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని వివరించారు.
ఐదవ అధ్యాయం ‘గర్భసంచి, అండాశయాల మధ్య సంబంధం’ లో తమ పరిశోధనలో తేలిన కొన్ని నిజాలని వెల్లడిస్తూ, గర్భసంచితో పాటు అండాశయాలను, ఎపెండిక్స్‌ని కూడా తొలగిస్తున్నారని చెబుతూ, స్త్రీ జీవితంలో అండాశయాలు ఎంత ముఖ్యమో వివరించారు. అండాశయాలు స్రవించే ఈస్ట్రోజెన్ స్త్రీలకు ఎంత అవసరమో వెల్లడించారు. ఈస్ట్రోజెన్ ఏయే అవయవాల మీద పనిచేస్తుందో తెలిపారు. అవసరం లేకున్నా అండాశయాలను తొలగించడం ద్వారా మోనోపాజ్ కలిగినప్పుడు సహజమైన మార్పులు కాకుండా, ఆకస్మిక మార్పులు జరిగి వాటి తీవ్రత అధికమై, ఆ ప్రభావం శరీరమంతా పడుతుందని హెచ్చరిస్తారు.
ఆరవ అధ్యాయం ‘వైద్య శాస్త్రంలో పరిణామ క్రమం’ లో ఒకప్పుడు వైద్యులు సత్యాన్ని నిరూపించడానికి, వైద్యపరిజ్ఞానాన్ని సంపాదించడానికి తన ప్రాణాలు పణంగా పెట్టేవారనీ, కానీ నేడు కొందరు వైద్యులు – తమకు లభించిన వైద్య విజ్ఞానాన్ని రోగ నిర్ధారణకు సరిగా వాడకుండా, రోగానికి మించిన బాధను వైద్యం ద్వారా కలిగిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పటి గర్భసంచి ఆపరేషన్లు శాస్త్రాన్ని అపహాస్యం చేస్తున్నాయని అన్నారు.
ఏడవ అధ్యాయం ‘భావజాలాలు, భయాలు, హెచ్‍పివి, పాప్ స్మియర్ పరీక్షల ప్రాధాన్యత’ లో ఒక అంగన్‍వాడీ కార్యకర్త తనకి కేన్సర్ వస్తుందేమోనని భయపడుతూ తన వద్దకు సందేహాలు తీర్చుకున్న వైనాన్ని వివరించారు డా. కామేశ్వరి. పల్లెప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని అవసరం లేని హిస్టరెక్టమీ ఆపరేషన్లు ఎలా చేస్తున్నారో ఆ అంగన్‍వాడీ కార్యకర్త ద్వారా తెలియజెప్తారు. హెచ్‍పివి, పాప్ స్మియర్ పరీక్షల ప్రాముఖ్యతని వెల్లడిస్తారు.
ఎనిమిదవ అధ్యాయం ‘ఈ ప్రవాహాన్ని ఆపవద్దు – Let it Flow’ లో గర్భసంచిని కాపాడుకోవాల్సిన అవసరాన్ని నొక్కి వక్కాణించారు. స్త్రీలలో ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా – ఈ అధ్యాయంలోని ప్రశ్నలు, వాటి జవాబులను చదవమని సూచిస్తారు.
తొమ్మిదవ అధ్యాయం ‘ఆరోగ్య విషయాల్లో స్త్రీలకు నిర్ణయాధికారం’ లో తాము జరిపిన అధ్యయనాలలో తెలిసిందేంటంటే, కొన్ని పదాలను తప్పుగా వాడి, కొన్ని సాధారణ శారీరిక ఇబ్బందులను భయపెట్టి, కాన్సర్ గురించి బెదరగొట్టి, గర్భసంచి తొలగింపులు జరుగుతున్నాయని తెలిపి, ఆ పదాలను ప్రస్తావించారు. మన శరీరానికి సంబంధించిన నిర్ణయాలను, నమ్మకాన్ని మనం మనపైన కాకుండా ఎవరిపైనా ఉంచినా అది దుర్వినియోగమయ్యే అవకాశాలు చాలా ఎక్కువని చెప్పారు.
పదవ అధ్యాయం ‘కౌమార దశ’ లో కౌమార దశలో ఆడపిల్లల ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలో తల్లులకు తెలియజేస్తారు. ఋతుచక్రం క్రమబద్ధమవడానికి సూచనలు చేస్తారు. పిల్లలలో పెరుగుతున్న ఊబకాయం గురించి హెచ్చరిస్తారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తారు.
పదకొండో అధ్యాయంలో క్షేత్రస్థాయి పరిశోధనల ఫలితాలను వెల్లడించారు. పన్నెండో అధ్యాయంలో గర్భసంచి తొలగించిన స్త్రీల ఆరోగ్య భద్రతకు తీసుకోవాల్సిన తక్షణ చర్యలను వెల్లడించారు.
అనుబంధం-1 ‘గర్భసంచి కబుర్లు’ లో – గర్భసంచి గురించిన సమాచారాన్ని పొందుపరిచారు.
~
అన్ని అధ్యాయాలలో చెబుతున్న అంశాలకు చాలా చోట్ల గ్రాఫ్స్, బొమ్మలు, బుల్లెట్ టెక్స్ట్ వంటి వాటితో చూపడం ఈ పుస్తకంలోని విషయాలను సులువుగా అర్థం చేసుకునేందుకు దోహదం చేసింది.
వైద్యులు, వైద్య ఆరోగ్య రంగంలో పని చేసే సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, తల్లిదండ్రులు, మహిళలు, యువతులు, తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం ఇది.
వైద్య రంగంలోని అంశాలపై అతి తక్కువ పరిచయం ఉన్నవారూ, అసలు పరిచయం లేనివారు కూడా చదివి మౌలిక అవగాహన కలిగించుకోవచ్చు.
ఈ పుస్తకంలోని అంశాల గురించి, ఏవైనా సలహాల గురించి డా. కామేశ్వరి గారిని సంప్రదించవచ్చు.
***
రచన: డా. సామవేదం వేంకట కామేశ్వరి
ప్రచురణ: లైఫ్ హెచ్.ఆర్.జి. ప్రచురణలు
పేజీలు: 194
వెల: అమూల్యం
ప్రతులకు:
అమర్ ప్రేమాలయం,
ఇంటి నెం. 10-16, ఎస్.బి.ఐ కాలనీ, రోడ్ నెం. 2,
కొత్తపేట, హైదరాబాద్.
తెలంగాణ – 500 035
ఫోన్: 040-24056984, 9848669840
ఈమెయిల్:
lifehrg@gmail.com
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.