Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గంగాజలం జీవామృతం

[శ్రీ కర్లపాలెం హనుమంతరావు గారి ‘గంగాజలం జీవామృతం’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

యుగయుగాల నుంచీ హిందువులు గంగానదిని పూజిస్తున్నారు. గంగనీరు కంటే పవిత్రమైనది దేశంలోనే కాదు. ప్రపంచంలోనే లేదని వారి నమ్మకం. గాయకులు, గంగను వేయి విధాల స్తుతించారు. ఋషులు గంగను నెత్తిమీద పెట్టుకున్నారు.

క్రతువులకు, యజ్ఞాలకు, సర్వకర్మలకూ గంగనీరు ఆవశ్యకం. నేటికీ గంగా స్నానానికి ఎంతో ఫలితం వుందనే భావన ఉంది. గంగామాత సందర్శన నిమిత్తం ఆసేతు హిమాచలంనుంచీ ప్రజలు యాత్ర చేస్తారు. గంగను దర్శిస్తే చేస్తే చాలు ముక్తి కలుగుతుందని వారి నమ్మకం.

మహమ్మదీయ చరిత్రకారులు, పాశ్చాత్య శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేసి వారి వారి అనుభవాలు పొందుపరచి ఉన్నారు.

‘అయిన్-ఇ-అక్బరీ’ అనే మహమ్మదీయ గ్రంథంలో గంగను గురించి మూడు విషయాలు చెప్పబడ్డాయి.

  1. గంగలో స్నానంచేసినా, గంగనీరు త్రాగినా సంపూర్ణారోగ్యం కలుగుతుంది.
  2. చెంబులో పోసి ఎంత కాలం వుంచినా, గంగనీరు చెడిపోదు.
  3. ఇట్టి ప్రాశస్త్యం ఉండడం చేతనే, ఎక్కడెక్కడివారూ గంగను ఇళ్లకు తీసు సపోయి, భద్రంగా ఉంచుకొని, వాడుకొంటున్నారు.

ఔరంగజేబు చక్రవర్తికి అనేకమంది వైద్యులుండేవారు. అందులో ముఖ్యుడు ‘మనాషీ’. ఇతడు యూరపు వెనిస్ నగరవాసి.

మొగలాయీ సామ్రాజ్యపు విశేషాలను గురించి వ్రాస్తూ ఈ విధంగా చెప్పాడు:

“హిందువులు గంగను పూజిస్తారు. గంగా జలములు సర్వ పాపములూ నశింపజేస్తాయి, తన సామ్రాజ్యంలో సాటిలేని మణి వంటిది గంగానదియని అక్బరు చక్రవర్తి అనేవాడు. అట్టి విశిష్టమైన నది యొక్క వ్యుత్పత్తి కనుక్కోవలసిందని ఆరితేరిన ఇంజనీర్లను నియమించాడు.”

మహమ్మదీయ చక్రవర్తులు గంగనీరు తప్ప ఇంకో నీరు త్రాగేవారు కాదని ‘టెర్నియర్’ అనే మరో పాశ్చాత్య పరిశోధకుని వ్రాతలవల్ల తెలుస్తుంది. ప్రతి దినం కొన్ని ఒంటెలు రాజమందిరానికి గంగనీరు తీసుకొని వెళ్ళేవి. వీటి పని రోజూ గంగనీరు మోయడమే. .

గంగానదిలో శవాలు రోజూ కొట్టుకు పోతూవున్నా, నీరు, క్రిములు లేకుండా, పరిశుభ్రంగా ఉండడంవల్లనే, గంగను అన్ని కులాలవారూ, మతములవారూ పూజిస్తున్నారని అతడు వ్రాసియున్నాడు.

పదకొండవ శతాబ్దంలో సోమనాథ దేవాలయం సుల్తాన్ మహమ్మద్ గజినీ ధ్వంసం చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఆ పురాతన దేవాలయాన్ని ‘అల్-బెరునీ’ వర్ణిస్తూ, అక్కడ జరిగే పూజా పునస్కారాల విశిష్టతను కొనియాడి, అట్టి దేవస్థానానికి కలిగిన విపత్తుకు వాపోయాడు.

వెయ్యిమంది బ్రాహ్మణులు ప్రతినిత్యమూ పూజ చేసేవారు, ప్రతి రాత్రి గుడిలో దేవుని అప్పటికప్పుడు తెచ్చిన గంగనీరుతో స్నానం చేయించేవారు. గంగానది సోమనాధుని దేవాలయానికి అలం మైళ్లకు పైగా ఉన్నా, దేవ స్నానానికి ఆ నది నీరు వాడడం చేత, గంగలో ఎంత మహత్తు వున్నదీ ప్రచురింపబడింది. గ్రంథకర్త గంగను గురించి పూసగ్రుచ్చినట్లు ఈ క్రింది విధంగా వ్రాశాడు.

బ్రిటిష్ రాయల్ సొసైటీ సభ్యుడు డాక్టరు నెల్సన్ గంగను గురించి స్వానుభవం ప్రపంచానికి వెల్లడి చేశాడు.

కలకత్తా నుంచి ఇంగ్లాండుకు ఓడలు గంగ నీరు తీసుకుపోతాయి. గమ్యస్థానం చేరేవరకూ ఓడలోని వారికి త్రాగడానికి ఈ నీరే. గంగా జలం చెడిపోదు.

లండనుంచి బయల్దేరే ఓడలు అక్కడ థేమ్స్ నరి నీరు తీసుకువస్తాయి, కాని ఆ నీరు మధ్య దోవ లోనే కంపు కొడుతుంది. కనుక మార్గంలో ‘సయ్యద్’ రేవులోనైనా, ‘ఏడెన్’ రేవులో నైనా ఆ నీళ్లు పారబోసి కొత్త మంచినీళ్లు తీసుకుంటారు.

ఈ సంగతి డాక్టరు నెల్ఫ్ చూశాడు.

అతడూ మరికొందరు శాస్త్రజ్ఞులూ, వివిధ ఖండాల నదుల నీళ్ళను గంగతో పోల్చి చూశారు. అన్ని నదుల నీళ్లూ కొన్ని రోజులకు చెడిపోయాయి. గంగా జలం మాత్రం ఎంత కాలమయినా చెడిపోకుండా పరిశుభ్రంగా ఉంది.

చరిత్రకారులు, విదేశీయులు చెప్పిన విషయాలు శాస్త్రజ్ఞులు ప్రత్యక్షంగా పరిశోధనల మూలంగా తెలుసుకున్నారు. హిందువులు గంగను పూజించడం మూఢవిశ్వాసం కాదని ధృవపరిచారు.

50 సంవత్సరాల క్రితం కాశీలో కలరా వ్యాధి విపరీతంగావచ్చి యాత్రాసమయంలో ఉధృతమయింది. ఈ వ్యాధికి కారణం కాశీ ప్రజలు త్రాగే గంగ నీళ్ళు అని అప్పటి ఇండియా గవర్నమెంటు అనుకున్నారు.

ఇలాంటి వ్యాధుల విషయం పూర్తిగా తెలిసిన మేధావి ఆ రోజుల్లో ఫ్రాన్స్ దేశంలో ‘పాశ్చర్ ఇన్స్టిట్యూట్’ లో ఉన్నాడు.. ఆయన్ను ఇండియా గవర్నమెంటు పిలిపించారు.

అతడువచ్చి గంగనీటిని పరీక్షించాడు. సోలెడు నీటిలో ఐదారు కేజీల టెఫాయిడ్, కలరా మొదలయిన క్రిములు వేశాడు. మూడు గంటల కాలంలో ఆ క్రిములు నశించిపోయాయి.

యూరపు ఖండం నుంచి ఆసియాఖండం వచ్చినందుకు గంగ మహత్తు తెలుసుకున్నా నని చెప్పి, తన జన్మ తరించడానికి గంగానదిలో స్నానం చేసి, కడుపు నిండా గంగ నీరు త్రాగి, ఇంటికి కూడా గంగనీరు తీసుకు పోయాడు ఆ ఫ్రెంచి శాస్త్రజ్ఞుడు.

‘డీ హెరెల్లి’ అనే మరొక ఫ్రెంచి శాస్త్రజ్ఞుడు గంగను గురించి విచిత్ర విషయం కనుక్కొన్నాడు.

కలరా, రక్తగ్రహణి మూలంగా చని పోయినవారి శవాలు గంగలో కొట్టుకొని పోతూవుండగా ఆయన కళ్లారా చూశాడు. ఆ శవాలు తేలే చోట కోటానుకోట్లు వ్యాధిక్రిములు ఉండక తప్పదని అనుకొన్నాడు. తేలుతున్న ఆ శవాల క్రింద ఒకటి రెండడుగుల మేర గంగనీటిని తీశాడు. ఆ నీటిని శాస్త్రోకంగా పరీక్ష చేస్తే, అందులో మచ్చుకైనా ఒక్క పురుగూ కనిపించలేదు. ఆయన విస్మయపడ్డాడు.

కలరా వ్యాధిగ్రస్తులవద్ద నుండి క్రములను కొన్ని సేకరించి, వాటిని పెంచి పిమ్మట గంగనీటిలో చేశాడు. కొంత సేపటికి అవి మాయమయిపోయాయి. గంగనీరు యథావిధిగా, నిర్మలంగా వుంది.

గంగలో క్రిములు నశించడానికి కారణం యేమిటి, అనే ప్రశ్నకు సరియైన సమాధానం ఏ శాస్త్రజ్ఞుడూ చెప్పలేదని కెనడా దేశపు ‘మాక్ డొనాల్డ్ కాలేజీ’ ప్రిన్సిపాల్ డాక్టరు హారిసన్ అన్నాడు. ఆయన పరిశోధనలు చేసి క్రిములు చనిపోవడం చూశాడు కూడా. ఈ పరిశోధనలవల్ల గంగనీరు ఔషధగుణం తేటతెల్లమయింది.

గంగకు అంటుదోషం లేదు. అందుచేతనే ఛాందసులు కూడా గంగనీరు యెవరు ఇచ్చినా అభ్యంతరం లేకుండా స్వీకరిస్తారు. దూరదేశ యాత్రీకులు గంగను చెంబులలోనూ, బిందెలలోనూ నింపి వాటికి గట్టి మూతలు వేసి, భద్రంగా యిళ్ళకు తీసుకొని పోయే ఆచారం నేటికీ వుంది.

అన్ని దోషాలనూ గంగామాత హరిస్తుంది.

Exit mobile version