Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గంగా తీర విద్యా విహారం

[శ్రీ యన్. వి. శాంతి రెడ్డి గారు రచించిన ‘గంగా తీర విద్యా విహారం’ అనే వేదాంత కథ అందిస్తున్నాము.]

వేదాంతా లాంగ్ టైం కోర్స్ స్వామి తత్త్వవిదానంద సరస్వతి వారి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించబడింది. స్వామి బ్రహ్మ విద్యానంద సరస్వతి, స్వామి పరబ్రహ్మనంద సరస్వతి, స్వామి విధితాత్మానంద సరస్వతి, స్వామి పరమార్ధానంద సరస్వతి, స్వామిని సద్విద్యానంద సరస్వతి, స్వామి శాంతాత్మానంద సరస్వతి అనుగ్రహ భాషణం చేశారు. తర్వాతి రోజు నుండి రెగ్యులర్ క్లాసెస్ ప్రారంభమౌతాయని ప్రకటించారు.

తర్వాత రోజు ఉదయం 9 గంటలకు స్వామి తత్త్వ విదానంద క్లాస్ ప్రారంభమైంది. భక్తృహరి వైరాగ్య శతకం టేకప్ చేస్తున్నానని చెప్పి మా అందరికీ గీతా భవన్ వారి వైరాగ్య శతకం పుస్తకాలు పంచి పెట్టారు.

“ఈ రోజు సరదాగా కాలక్షేపం చేద్దాం! డూ యు నో నెగిటివ్ అండర్స్టాండింగ్ ఈస్ ది హైయెస్ట్ అండర్ స్టాండింగ్ ఇన్ వేదాంత స్టడీ!” అంటూ చర్చకు తెర తీసారు.

వెంటనే ఆస్ట్రేలియా వాసి మిస్టర్ డామియేన్ క్లర్క్ కోపంగా లేచాడు. “వాట్ డూ యూ మీన్ స్వామీ? యూ థింక్ ఉయ్ అర్ ఆల్ ఫూల్స్ ఆర్ (or) యూ ఆర్ ఎంకరేజంగ్ నెగటివిటీ?” అన్నాడు (సంభాషణ అంతా ఆంగ్లంలో).

“నేను నెగటివిటీ ఎంకరేజ్ చేయడం లేదు. ఆధ్యాత్మ శాస్త్రం నీ గురించి తెలుసుకొనే శాస్త్రం. నేను ఎవరు అన్న ప్రశ్నకు శాస్త్రం నీవు ఎవరు కాదో చెబుతుంది. ‘నేతి.. నేతి’ విచారణలో నీవు ఎవరెవరు కాదో విశదపరుస్తుంది. మిగిలిన నీవు ఎవరో నీకే తేటతెల్లమవుతుంది. లేబరేటరీలో నీ రక్తం పరీక్ష కోసం పాజిటివ్ ఫలితాన్ని ఆశించి ఇస్తావు. కానీ.. ఒక్క కరోనా పరీక్షకు మాత్రం నెగటివ్ రిజల్ట్స్ కోరుకుంటావు. మానవ జీవితం పట్టుకోవాల్సినవి, విడిచి పెట్టాల్సినవి అనే రెండు ప్రక్రియలతో నిండి వుంటుంది. ఈ సందర్భంలో అష్టావక్ర గీతలో జనక మహారాజు అష్టావక్ర మహర్షితో అన్న ఈ శ్లోకాన్ని మనం స్మరించాలి ‘హేయోపాదేయ విరహాద్/ఏవం హర్ష విషాదయో:!/అభావాద్-అధ్య హే బ్రహ్మన్ -/ఏవం ఇవ అహం ఆస్థితాః!!’

భావం: జీవితంలో పట్టుకోవాల్సినవి, విడిచి పెట్టాల్సినవి వున్నప్పుడు హర్షము- విషాదము కూడా ఉంటాయి. అదే సంసారం అనబడుతుంది. నా జీవితంలో ఆ రెండు లేనందువల్ల నాకు నేనుగా నాలో నేను స్థిరంగా వున్నాను.

ఇది జనకుని జీవితం మాత్రమే అనుకోకండి. మీకు ఆపాదించుకోండి. ఎవరి జీవితమైనా అందులో హర్షం, విషాదం రెండూ ఉంటాయి. అందులోని ఏ ఒక్క దానితో మమేకం అయినా అదే పెద్ద సంసారాన్ని నిర్మాణం చేస్తుంది. ఈ నా వివరణతో ఏకీభవించిన వారు చేతులు ఎత్తండి.” అన్నారు స్వామి తత్త్వవిధానంద.

ఆస్ట్రేలియా వాసి డామియన్ క్లర్క్‌తో సహా అందరూ చేతులెత్తారు.

“గుడ్! ఈ రోజు ఈ క్లాస్ సత్సంగంగా భావించండి. మీరు ఎవరైనా ఏ ప్రశ్న అయినా అడగండి. నేను జవాబు చెబుతాను. సందేహించ వద్దు. ప్రశ్నలు అడగటాన్ని నేను ప్రోత్సహిస్తాను.” అన్నారు స్వామి.

“హర్ష విషాదాలు ఒక సన్యాసి జీవితంలో ఉండవా? వుంటే.. అతన్ని సన్యాసిగా పరిగణించ వచ్చా?” అడిగాడు సచిత్ ఫ్రమ్ కేరళ.

“మీ పేరంటే నాకు ఇష్టం. దానికి కారణాలు రెండు. ఒకటి మీ పేరు. రెండు మీరు ప్రస్థానత్రయానికి భాష్యం రాసిన శ్రీ శంకర భగవత్పాదులు జన్మించిన కేరళకు చెందిన వారవడం. ఇది కూడా హర్షమేగా? కానీ ఇది మంచి హర్షము. ఇక మీ ప్రశ్నకు వస్తే.. హర్ష విషాదాలు సంసారికి సంబంధించినవి. సన్యాసి వీటికి సాక్షిగా ఉండాలే గానీ వాటితో మమేకం కారాదు. కానీ అలా జరగటం లేదు. సంసారి నా భార్య.. నా బిడ్డలు.. నా ఇల్లు.. నా బ్యాంకు బాలన్స్ అనుకొంటుంటే.. సన్యాసి నా ఆశ్రమం.. నా పీఠం.. నా శిష్యులు.. నా గో సంపద అనుకొంటున్నాడు. కాబట్టి సన్యాసి అతి పెద్ద సంసారి! మీరంతా ఇప్పుడే ఋషికేశ్ వచ్చారు కాబట్టి మీకు ముందు ముందు చాలా విషయాలు తెలుస్తాయి. గమనించండి ఇక్కడ కనిపించే వేలాది మంది సన్యాసుల్లో మహాత్ములు ఎవరో.. సన్యాసి వేషం వేసుకున్న ‘సన్నాసులు’ ఎవరో మీకే తెలుస్తుంది. ఒకప్పుడు అంటే శాంతి ఆశ్రమస్వామి ఓంకారులు ఇక్కడ స్వర్గ ఆశ్రమంలో తపస్సు చేసుకొనే కాలంలో అంటే ఒక వంద సంవత్సరాల క్రితం సన్యాసులు మూడు రకాలుగా ఉండేవారు. మహాత్ములు, సాధన సన్యాసులు, బండారా సన్యాసులు (వెరైటీ రుచులను ఆశ్వాదిస్తూ బాగా బ్రతకటానికి సన్యసించినవారు) అంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు అనేక రకాలు వున్నారు. వారిలో సరికొత్త రకం ‘హై టెక్’ సన్యాసులు. వీరు వేషదారణలో సన్యాసి లానే వున్నా అంతరంగమంతా కలుషితం. వీరు ఒక భయంకరమైన కాన్‌ఫ్లిక్ట్‌లో బ్రతుకుతుంటారు. అది ‘వాట్ ఐ యామ్ వర్సెస్ వాట్ ఐ షుడ్ బి’ అనేది. వారి దగ్గర ఆధునిక ఉపకరణాలన్ని ఉంటాయి. యాత్రల కోసమని వచ్చిన అందమైన, ధనవంతులైన అమ్మాయిల్ని, ఆకర్షించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంటారు, ధనవంతులైన యువతులు వీరి వలలో పడితే ఆఖరికి సన్యాసాన్ని కూడా సన్యసించి వివాహం చేసుకోడానికి సిద్ధంగా వుంటారు. ఇలాంటి మోసగాళ్లు మీకు చాలామంది తారసపడతారు. అప్రమత్తంగా ఉండమని మిమ్మల్ని ప్రేమతో హెచ్చరిస్తున్నాను. ఇక్కడ వుండే చాలామంది స్వాములు సన్యాసం తీసుకొనేటప్పుడు క్రింద గంగలో అన్నిటిని విడిచి పెట్టేస్తూ మంత్రాలు వల్లిస్తారు. గంగ లోంచి పైకి వచ్చిన వెంటనే గంగాధరేశ్వరుని గుడిలో పొర్లు దండాలు పెడతారు. మీకో విషయం ఆశ్చర్యం కలిగించవచ్చు అన్నీ విడిచి పెట్టేయడానికి సన్యసించిన స్వాములకు ఇక్కడ ఒక యూనియన్ వుంది. దానికి ప్రెసిడెంట్, సెక్రటరీ మొదలైన ఆఫీస్ బేరర్స్ కూడా వుంటారు. వారే ఇక్కడున్న వందలాది ఆశ్రమాల్లో జరిగే బండారాలకు సన్యాసులను, బ్రహ్మచారులను కేటాయిస్తూ నియంత్రిస్తారు. ఇక్కడ వేదాంతం చదువుకొన్న ఒక తమిళ బ్రహ్మచారిణి తర్వాత కాలంలో మూడు సార్లు చేసుకున్న వివాహాలు విఫలమై నాలుగోసారి సన్యాసం తీసుకొని ఇప్పుడు చెన్నైలో వేదాంత శాస్త్రం బోధిస్తుంది. చిత్రం కదూ? మీ అందరికీ నేనిచ్చే సందేశం ఏమిటంటే అందరినీ, అన్నిటిని గమనించండి.

గంగా తీరంలో విస్తారంగా విహరించండి. గంగా ప్రవాహాన్ని గమనించండి. ఉదయిస్తున్నాడునుకొనే సూర్యుడిని, తూర్పు తెల్లారడాన్ని గమనించండి. ఇక్కడ విహరించే మహాత్ములను ఉదాహరణకు ఆర్ట్ అఫ్ లివింగ్ రవిశంకర్‌ను, పీఎంసీ పత్రీజీని, స్వర్గాశ్రమ ప్రాంతంలో స్వామీ మేధానంద పురిని, శివానంద ఆశ్రమ ప్రాంతంలో స్వామి హంసనంద ను ఇంకా అనేక మంది మహాత్ములను, భవిష్యత్తులో మహాత్ములుగా రూపొందే మహానుబావుల్ని గమనించండి. ఇంకా అనేక చెత్త విషయాలను, ఆకర్షణలను గమనించండి. అంతెందుకు గమనించడం మీ ధ్యాన పద్ధతిగా మార్చుకోండి. దీనితోనూ మమేకం కావద్దు. సాక్షి భావంతో ఉండటం అలవర్చుకోండి! ఒక చిన్న ప్రశ్నతో ఇంత పెద్ద వివరణ ఇచ్చేందుకు అవకాశం కల్పించిన సచిత్ కు ధన్యవాదములు!” వివరించారు.

“మూఢుల్లో శ్రేష్ఠుడు ఎవరు?” తపన్ రజూర్కర్ ప్రశ్న.

“తనలో వున్న లోపాల్ని ఇతరుల్లో చూసేవాడు.” స్వామి.

“సంవాదం అంటే వివాదమేగా?” కత్రిన్ కుబ్బే ప్రశ్న.

“కాదు. అహంకారం వుంటే వివాదం. అహంకారం నశిస్తే సంవాదం. జీవితంలో సంవాదం ఉండాలి కానీ వివాదం ఉండకూడదు.” స్వామిజీ జవాబు.

“ఒంటరి ప్రయాణము, ఒంటరి నిర్ణయము ప్రమాదమా?” అండ్రియా బర్రెరియో ప్రశ్న.

“తెలియని ప్రయాణం ఒంటరిగా చేస్తే దారి తప్పే అవకాశం, ఒంటరి నిర్ణయంలో భంగపడే అవకాశం ఎక్కువ. అలాగని అయోగ్యులతో సంఘము పెట్టుకోరాదు” చెప్పారు స్వామీజీ.

“తప్పు చేసిన వారిని క్షమించక తప్పదా?” యూలియా.

“తప్పు చేసినవారూ, క్షమించాల్సినవారూ ఒక్కరే! అంటే ఆ ఇద్దరూ కూడా మీరే! ఈ వేదాంత కోర్స్ పూర్తయ్యేనాటికి ఈ విషయం మీకు అర్ధమౌతుంది” స్వామి.

“పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఇన్ని ఆశ్రమాలకు, గుడులకు నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయి?” సువర్ణ ప్రశ్న.

“నో డౌట్ మనీ లాండిరింగ్ వల్లే! జనులకు దేవుణ్ణి పూజించాలని, ఆశ్రమాలను సేవించాలని ఉండదు. వారి కోరికలను పూజిస్తారు, వారి భయాల నుండి విముక్తి పొందాలని భావిస్తారు. వారి కోరికలూ భయాలే ఆశ్రమాలకూ, దేవాలయాలకు పెట్టుబడి” స్వామీజీ.

“మనీ లాండిరింగ్ అంటే ఏమిటి?” దిమిత్రి ప్రశ్న.

“నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడమే!” స్వామీజీ

“నల్లధనం, తెల్లధనం అని రెండు ఉంటాయా?” జున్ ఇషోబి ప్రశ్న.

“కష్టపడి సంపాదించింది తెల్లధనం. పన్నులు చెల్లించిన తర్వాత మిగిలింది శ్రేష్ఠం. లంచాల ద్వారా సంపాదించినా, ఇతరులది అపహరించినా అది అధమం. ఆ అధమం అయినదే నల్లధనం. నీవు ఈ కోర్స్ పూర్తి చేసి జపాన్ వెళ్లే నాటికి ఈ రెంటికీ వ్యత్యాసం బాగా తెలుస్తుంది” స్వామీజీ.

“స్వామీజీ! సన్యాసులైనంత మాత్రాన ప్రజల్లో ఉండకూడదా? ఒంటరిగా అడవుల్లో తపస్సు చేసుకోవాలా?” జ్ఞానానంద ప్రశ్న.

“అడవులా? ఎక్కడున్నాయి? గనుల పేరుతో, కలప కోసం నరికేసుకున్నాము కదా? స్వాములైనా ఎవరైనా ప్రపంచంలో ఉండవచ్చు. కానీ.. ప్రపంచం వారిలో ఉండరాదు. ఆంధ్రప్రదేశ్‍కు చెందిన స్వామీ ఓంకారులు తమ జీవిత కాలమంతా ఆ చుట్టు ప్రక్కల ట్రైబల్స్ సమస్యలు పరిష్కరిస్తూనే గడిపారు. శ్రీ రామకృష్ణులు చెప్పినట్టు పడవ ఎప్పుడూ నీటిలోనే ఉండాలి. నీరు మాత్రం పడవలో ఉండరాదు. సన్యాసులు ఎవరినీ నిందించరాదు. శరణు అన్న వారిని ఎప్పుడూ క్షమిస్తూ ఆత్మవిశ్వాసంతో ఉండాలి. తనను తాను నమ్ముకున్నవాడే దేవుణ్ణి నమ్మగలడు. ఆత్మవిశ్వాసం లేనివాడు దేవుణ్ణి నమ్మడు.” చెప్పారు స్వామి.

“ఈనాటి ఆశ్రమాల పై వ్యాఖ్యానించండి.” అడిగాను.

“ఈనాటి ఆశ్రమాలు నెపోటిజం‌కు ప్రతీకలు. పోటీ, పోలిక, అహంకారం ఈనాటి ఆశ్రమ యాజమాన్యాల లక్షణం. ఈనాటి ఆశ్రమాల్లో చేసే గోపూజను ‘అపూజ’ అనాలి. ఆశ్రమాల్లో రాయిలో కనిపించిన దేవుడు పేద ఆశ్రమవాసుల్లో కనిపించడు. ఆశ్రమాల్లో ఆశ్రమవాసులు బ్రహ్మ సూత్రాలు చదువుతుంటే, సన్యాసులు యజ్ఞాలు చేస్తుంటారు. ఇది కలియుగ లక్షణం!” చెప్పారు స్వామి.

“బాధ, భయం లను విమర్శ చెయ్యండి” రవీంద్ర కౌల్.

“గతాన్ని తల్చుకొని బాధ పడుతుంటారు. భవితను తల్చుకొని భయపడుతుంటారు. మా ఇండియాలో తండ్రి గతంలోకి, కొడుకు భవిష్యత్తు లోకి తొంగి చూస్తుంటారు. నిజానికి భూత, భవిష్యత్తులు రెండూ హుళక్కియే, అంటే మనోకల్పితలే!” చెప్పారు స్వామిజీ.

సమయం తెలియలేదు 10-30 AM బెల్ కొట్టారు క్రింద భోజనశాలలో.

“వెల్! మీరంతా క్రిందికెళ్లి టీ గానీ కాఫీ గానీ తీసుకోండి. అరగంటలో మళ్ళీ పైకి రండి తర్వాతి క్లాస్‌కు.” అంటూ మంగళ శ్లోకాలు చెప్పి క్లాస్ ముగించారు స్వామీజీ.

***

అందరం కాఫీ, టీ లు సేవించి కొంతసేపు గంగ వడ్డున రిలాక్స్ అయ్యి పది నిముషాలు ముందుగానే క్లాస్ రూమ్ దగ్గరకు వచ్చాము. బోర్డులో నోటీసు అంటించి వుంది.

‘స్వామి బ్రహ్మ విద్యానంద స్పెషల్ లెక్చర్ నిమిత్తం యోగ వేదాంతా ఫారెస్ట్ అకాడమీ శివానంద ఆశ్రమం వెళ్లిన కారణంగా ఈ క్లాస్ రద్దు చేయబడింది. తదుపరి క్లాస్ 2 గంటల ముప్పై నిముషాలకు అందరూ హాజరు కావలెను. ఇట్లు స్వామిని అనుపమానంద, కో ఆర్డినేటర్.’

అందరూ చాలా నిరుత్సాహంగా ముని వాటిక కుటీరాలకు వెళ్ళాము.

సరిగ్గా 12.30 గంటలకు లంచ్ బెల్ కొట్టారు. అందరం భోజనశాలకు వెళ్ళాము. అక్కడ భోజనం చేయడం ఒక అందమైన అనుభవం. జీవించి ఉండగానే స్వర్గ ఫలం అంటే ఇదే అనిపించింది.

2.30 గంటలకు క్లాసుకు వెళ్ళాము. స్వామి శాంతాత్మానంద తత్త్వ బోధ క్లాసు. ఈ స్వామి హై టెక్ స్వామి. అందరూ చాక్‌లెట్ స్వామి అని పిలుస్తారు. ఎందుకంటే పాఠం బాగా చెప్పారని పొగిడితే అమెరికన్ చాక్లెట్ ఇస్తారని చెప్పుకుంటారు. అతనికి తోక లాంటి అసిస్టెంట్ కోయంబత్తోర్ చంద్రు సూన్నారాయణ. ఇతని పని క్లాస్ రూమ్ వరకూ స్వామి లాప్టాప్, మొబైల్ ఫోను, కొన్ని పుస్తకాలు పట్టుకొచ్చి క్లాసు రూమ్‌లో డయాస్‌పై ఉంచి మొబైల్ ఫోన్ పట్టుకొని క్లాసు బయట కూర్చుని కాల్స్ వస్తే తెచ్చి స్వామికి ఇవ్వడం, స్వామికి భోజనం, టిఫిన్స్ కుటీరానికి తీసుకెళ్లి ఇవ్వడం. అందమైన యాత్రలకొచ్చిన స్త్రీలను తియ్యటి మాటలతో ఆకర్షించి స్వామితో లింక్ ఏర్పాటు చెయ్యడం, అంతెందుకు స్వామికి అతనే బాడీగార్డ్, అతనే బ్రోకర్! స్వామి పది నిముషాలు లేట్ గా వస్తున్న సూచనగా లాప్టాప్, కొన్ని పుస్తకాలు, స్మార్ట్ ఫోను, చాకోలెట్స్, తత్త్వబోధ టెక్స్ట్ బుక్స్ తెచ్చి డయాస్ మీద ఉంచి ఫోన్ తీసుకొని డోర్ బయట తన ఆసనంలో ఆశీనుడయ్యాడు చంద్రు. స్వామి వచ్చి మమ్మల్ని ఒక్కొక్కరిని రమ్మని చెప్పారు. మా పేరు అడిగి పాదాభివందనం చేయించుకొని ఒక్కొక్క చాక్‌లెట్టు, తత్త్వబోధ టెక్స్ట్ బుక్ ఇచ్చి ఆశీర్వదించారు.

లాప్టాప్ ఆన్ చేసుకున్నారు. అందులోని పిడిఎఫ్ చూస్తూ చాలా గంభీరంగా పాఠ్య ప్రసంగం మొదలు పెట్టారు.

“వాసుదేవేంద్ర యోగీంద్రమ్ నత్వా జ్ఞానప్రదమ్ గురుమ్!
ముముకునాం హితార్థాయ తత్త్వ బోధో స్బి దీయితే!!”

అంటూ ప్రార్థనా శ్లోకం చాలా గట్టిగా చదివారు.

టెక్స్ట్ బుక్ తీసుకొని తాను చదివినట్టుగా మమ్మల్ని రిపీట్ చెయ్యమని చెప్పారు.

“సాధన చతుష్టయమ్ కిమ్?”
“నిత్యా నిత్య వస్తువివేకః ఇహా ముత్రార్ధ ఫలభోగ విరాగః
శమాది షట్క సంపత్తి: ముముక్షత్వం చేతి.”

“నిత్యా నిత్య వస్తు వివేకః కః?”
“నిత్య వస్తువేకం బ్రహ్మ తద్ వ్యతిరిక్తంసర్వమనిత్యమ్.
అయమేవ నిత్యా నిత్య వస్తు వివేకః!”

ఇలా టెక్స్ట్ బుక్ అంతా అరగంట సేపు పారాయణ చేయించారు. మిగిలిన అరగంటా చతురోక్తులతో, ప్రశ్నలు-జవాబులతో సరదాగా గడిచింది. స్వామి దగ్గర ఏమీ సరుకు లేదని ఏదో ఆసక్తితో సన్యాసం తీసుకున్నాడే గానీ జిజ్ఞాసతో కాదని కూడా అందరికీ విశదమైంది.

“స్వామీజీ! బుద్ధుడు సర్వం దుఃఖం అని ఎందుకన్నాడు?” మొదటి ప్రశ్న నేనే అడిగాను

“ఆ కాలంలో సౌకర్యాలు ఏమీ లేవు అంటే.. రేడియో, టీవీ, మొబైల్, మూవీ, కంప్యూటర్, సోషల్ మీడియా, బార్లు, పబ్బులు ఏమీ లేవు. అందుకే అలా అని వుండవచ్చు” అన్నారు స్వామి చాలా అమాయకంగా.

అర్ధమైపోయింది అందరికీ. చాలామంది మొహమాటంగా లోపలే నవ్వుకున్నారు. ఆపుకోలేక కొంతమంది పైకే నవ్వేశారు.

“భగవంతుడు ఏకమా? అనేకమా స్వామీజీ!” సువర్ణ ప్రశ్న.

“ఏకమని ఈ శాస్త్రాలు ఘోషిస్తాయి. కానీ.. మన గుడిలో గంగాధరేశ్వరుడు, బయట రామాలయంలో రాముడు ఓక్కటెలా అవుతారు. అందుకని క్లాసు రూమ్‌లో వేదాంతం వేరు బయట వాస్తవం వేరు” స్వామి.

ఈ జవాబుతో మా అందరి మతి పోయింది. ఈ స్వామికి ఏమీ తెలియదని కర్మ కొద్దీ మనకు ఆచార్యుడు అయ్యాడని అనుకున్నారు అందరూ.

“సూర్యుడికి ఉదయాస్తమయాలు ఉండవట సత్యమేనా?” యూలియా సెంక్విచ్ ప్రశ్న.

“సూర్యుడికి ఉదయించడం, అస్తమించడం అనే క్రియలు లేకపోతే మనం మేల్కొనేదెపుడు? నిద్రించేదెపుడు? పుస్తకాల్లో మాటలు పట్టుకొని ఊరేగకండి! వాస్తవంగా జీవించండి.” చెప్పారు స్వామి.

“జనన మరణాలు మిథ్య, ఈ సృష్టి క్రమంలో ఏది వచ్చిందో అదే పోతుంది. నిజానికి నీవు జన్మించలేదు. మరణించబోవు, అని ఒకస్వామి ప్రవచనంలో విన్నాము. అది వాస్తవం కాదా?” అడిగింది కత్రిన్ కుబ్బే.

“ఆ స్వామి ఆంధ్రా స్వామి అయ్యుంటాడు. పూర్వాశ్రమంలో సైంటిస్ట్ అట. అతన్ని నమ్మకండి! జనన మరణాలు సత్యం. మనం జన్మించి ఉండకపోతే ఈనాడు ఇక్కడ వుండేవారమా? అంతెందుకు అక్టోబర్ నెలలో నా పుట్టిన రోజు వస్తుంది. అప్పుడు మీ అందర్నీ మాడ్ కేఫ్ కు తీసుకెళ్లి డిన్నర్ కూడా ఇస్తాను” స్వామిలో సన్యాసి లక్షణాలు లేశ మాత్రం లేవని; అతిపెద్ద సంసారి అని అర్థమైంది. అందరికీ అర్థమైపోయింది వాడు ఎంతటి బోగస్ స్వామో.

ప్రారబ్దంలో వున్న దాన్ని అనుభవించాలి కదా? స్వర్గం ప్రక్కనే నరకం వుంటుంది. భరించాలి అనుకుంటుండగా అదృష్టం కొద్దీ టీ విరామం బెల్ మోగింది.

అందరం విరామం తర్వాత క్లాసుకు వచ్చాము. స్వామిని సద్విద్యానంద సరస్వతి మాతాజీ వారి భగవద్గీత క్లాసు. మాతాజీ గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు. స్వామి విధితాత్మానంద శిష్యురాలు. దయానందులు ఇంగ్లీషులో రాసిన భగద్గీత హోమ్ స్టడీని గుజరాతీ లోకి అనువదించిన పండితురాలు. క్లాసుకు వచ్చిన వెంటనే మమ్మల్ని పరిచయం చేసుకొని గీతా ప్రెస్ వారి శంకర భాష్య సహిత భగద్గీత పుస్తకాలు, గుజరాత్ నుండి తెప్పించిన అల్ఫాన్సా మామిడి పండ్లు మా అందరికీ ఇచ్చి ప్రార్ధనా శ్లోకంతో పాఠం మొదలుపెట్టారు.

“త్వమేవ మాతా చ పితా త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ!
త్వమేవ విద్యా ద్రవిణంత్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ!!
మూకం కరోతి వాచాలం పంగుమ్ లంఘయితే గిరిమ్!
యత్కృపా తమహం వందే పరమానంద మాధవమ్!!”

గీత 1వ చాప్టర్‍లో మూడు శ్లోకాలు చదివి చక్కగా వివరించారు. గంట ఎలా గడిచిందో తెలియనంత ఆహ్లాదకరంగా గడిచింది. గంట కొట్టేసారు. క్లాసు ఇంకా వుంటే బావుండుననిపించింది. అందరం గంగా తీరంలో కోచ్చేసాము.

“ఏం చేద్దాం?” అడిగాడు మార్టిన్.

“విహరిద్దాం!” అంది దిమిత్రి.

అందరూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారి న్యూ క్యాంపస్ దగ్గర బయలుదేరి కుడి వైపు గంగా ప్రవాహాన్ని ఎడమ వైపు ఆశ్రమాలను గమనిస్తూ బయలుదేరాము. జ్ఞాన కర్తార్ ఆశ్రమం లోంచి బ్రహ్మచారులు వల్లిస్తున్న తైత్తరీయం శ్రావ్యంగా వినిపిస్తుంది. తర్వాత అవధూత అఖాడావారి తోట చూడముచ్చటగా వుంది. పూలు, కూరగాయలు విరగకాసి విపరీతంగా వున్నాయి. వారి గోశాల కూడా చాలా బావుంది. ఆ తర్వాతదే స్వామి దయానంద ఆశ్రమం. దయానంద ఘాట్‌లో గంగా హారతికి సిద్ధం చేస్తున్నారు. ఆ తర్వాతి రాధా ఘాట్‌లో చాలామంది గంగా స్నానం చేస్తున్నారు. పూజకు వేళ అయిందంటూ బెల్ కొట్టారు. ఆ రోజుకు గంగా తీర విహారం ముగించి అందరం గంగాధరేశ్వరుని సన్నిధిలో కూర్చున్నాము. పూజ అనంతరం గంగా హారతిలో పాల్గొనటానికి నిర్ణయించుకొన్నాము!!!

*స్వస్తి*

Exit mobile version