Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గంగా తీర విద్యా విహారం-2

[శ్రీ యన్. వి. శాంతి రెడ్డి గారు రచించిన ‘గంగా తీర విద్యా విహారం’ అనే వేదాంత కథ అందిస్తున్నాము.]

రోజు మేము ఉ. 4-30 కే యోగా హాల్ కి వెళ్ళాం. యూరికా మేడం మా కోసం కొన్ని ప్రత్యేక మైన పరికరాలు ఏర్పాటు చేసింది.

“మేడం! ఈ వయసులో మాకు యోగా అవసరమంటారా?” అడిగాను.

“ఆహా! మీరు భగద్గీత ధ్యాన శ్లోకాలు చదివి వుంటారు. అందులో ‘మూకం కరోతి వాచాలం/పంగుమ్ లంగయతే గిరిమ్! యత్తకృపా తమహం వందే/పరమానంద మాధవమ్!!’ అనే శ్లోకం చదవలేదా? ఎవరిని ఏ పనికి సృష్టించాడో పరమాత్మకే తెలుస్తుంది. మన కర్తవ్యం మనం చేయడమే!”అంది.

“మా వయసుకు, మా చదువుకు, ఈ యోగాభ్యాసానికి లింక్ కుదరడం లేదు” సందేహం వ్యక్తపరిచింది సువర్ణ.

“అదే యోగ మాయ అంటే! మీరు వేదాంతం ఎందుకు చదువుకోవాలని నిర్ణయించుకొన్నారు?” యూరికా.

“మమ్మల్ని మేము తెలుసుకోవాలని.” చెప్పింది సువర్ణ.

“దేర్ యూ అర్! అది అన్నిటికంటే కష్టమే! అది తెలిసి పోతే అన్నీ తెలిసినట్టే! దాని కోసమే ఈ యోగా కూడా! మీరు గీతలో ఈ శ్లోకాలు చదివే వుంటారు. ‘సమం కాయ శిరో గ్రీవం/ధారయన్న చలం స్థిరః! సంప్రేక్ష్య నాసి కారం స్వం/దిశశ్చానవలోకయన్!!’. అంటే శరీరం, శిరస్సు, కంఠము లను సమముగా నిశ్చలంగా ఉంచి, సుస్థిర స్వభావంతో తన నాసికాగ్రమును చూచుచు ఇతరమును చూడకుండా యోగాభ్యాసము చేస్తే.. అదుపు లేని మనసు అదుపు లోని కొచ్చి కష్టమైన లక్ష్యాలను సాధించే ఆలోచనను కలిగిస్తుంది. ‘సర్వ ద్వారాణి సంయమ్య/మనో హృది నిరుద్యచ! మూర్ధాన్న ధాయాత్మనః ప్రాణం/ఆస్థితో యోగ దారణమ్!!’. సకల ఇంద్రియములను చక్కగా నియంత్రించి మనసును హృదయమందు నిలిపి, ఆత్మను మూర్ధ స్థానమందు నిలిపి యోగ, ధ్యాన సాధనను చేయు వాడు సర్వోత్తమమైన స్థితి అంటే మోక్షమును పొందును. నిన్ను నీవు తెలుసుకోవడం అంటే మోక్షమును పొందుటే!

‘యోగ యుక్తో మునిర్బహ్మ/నచిరేణాధి గచ్ఛతి!!’ అంటే.. సన్యాస యోగమును కర్మానుష్ఠానము లేకుండా పొందుట దుర్లభం. ‘తం విద్యా ద్దుఃఖ సంయోగ/వియోగం యోగ సంజనితం/స నిచ్చయేన యోక్తవ్యః /యోగో నిర్విన్న చేతసా!!’ ఎన్ని విఘ్నములు సంభవించినా వెరవక పట్టుదల, ఉత్సాహము గల వారికే యోగము సిద్ధించును. అలాగే యుక్తమైన ఆహార, విహార, నిద్రా, మెలుకువ గలవారికే యోగం సిద్ధించును. మరో శ్లోకంలో ‘సమ లోష్టాశమా కాంచనః!!’ అంటాడు భగవాన్, అంటే యుక్త యోగి మట్టిగడ్డను, రాతిని, బంగారమును సమముగా భావించును. యోగనిష్ఠుడు తాను సర్వము లోనూ ఉన్నట్టు, సర్వమూ తన యందే ఉన్నట్టు దర్శించును. ఇప్పుడు చెప్పండి యోగసాధన మీకు అవసరమా? కాదా? కొన్ని కోట్ల ప్రపంచ జనాభాలో కేవలం యాభై మందికే ఈ పవిత్ర గంగా తీరంలో చదువు, సాధనలకు అవకాశం దక్కిందంటే అది కేవలం మీ పూర్వ జన్మ పుణ్య సుకృతం గానీ మరొకటి కాదు. కాబట్టి మీ సొంత ఆలోచనలు కట్టిపెట్టి పతంజలి మహర్షి దీవెనలతో నేను చెప్పినట్టు సాధన చెయ్యండి. కొద్ది రోజుల ప్రత్యేక శిక్షణతో అందరితో సమానం అవుతారు. ఆ మాధవుని కృప వుంటే మీ బ్యాచ్ లోని యువకులంతా మీతో పోటీ పడాల్సి రావచ్చు! ఆల్ ది బెస్ట్! ఉయ్ స్టార్ట్” అంది యూరికో. మిగిలిన అందరూ వచ్చే వరకూ మా ఇద్దరికీ ప్రత్యేక సాధన కొనసాగింది.

***

ఉ. 8-30 కి స్వామి తత్త్వ విదానంద వారి వైరాగ్య శతకం క్లాసు మొదలైంది.

‘సదా శివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం

అస్మద్ ఆచార్య పర్యంతాం వందే గురు పరంపరాం!’

ప్రార్థనా శ్లోకాలు చెప్పి పాఠం మొదలుపెట్టారు.

“భ్రాంతం దేశమనేక దుర్గ విషమం ప్రాప్తం న కించిత్ఫలం

త్యక్తవాజాతికులాభిమానముచితం సేవాకృతానిస్ఫలా!

భుక్తం మాన వివర్జితం పరగృహే షవా శంకయా కాకవత్

తృష్ణనే జ్రుంభసి పాపకర్మ పిశునే నాద్యాపి సంతుష్యసి!”

భావం:

జీవితం లోని బాధలకు కారణం కోరికలు. తృప్తి లేకపోవడం. కోరికలు తీరేవి కాదు. వాటి మీద ఆసక్తి పెరుగుతునే వుంటుంది. శాంతి, ఆనందం కోసం ఎన్ని ప్రాంతాలు (కొండలు, కోనలు, తీర్ధములు, గుడులు) దర్శించినా కోరికల పై ఆశ పెరుగుతుందే గానీ తరుగుట లేదు (ఆనందం వుండే చోటు తెలియక).

వ్యాఖ్యానం:

మనిషి శాంతి కోసం, ఆనందం కోసం అవి లభించే చోటు తప్పించి మిగిలిన చోట్లన్నీ వెదుకుతాడు. నిజానికి అవి తన లోనే వున్నాయని, తానే అయి వున్నాయని గ్రహించలేడు. అజ్ఞానం యొక్క పొర కమ్మేసి వుంటుంది. ఈ సందర్భంలో బుద్ధ భగవానుని నోబెల్ ట్రూత్ గుర్తు తెచ్చుకోవాలి. 1. సర్వం దుఃఖం 2 దుఃఖానికి కారణం కోరికలు (హేట్, గ్రీడ్ అండ్ ఇగ్నోరెన్స్) 3. కోరికలకు కారణం అజ్ఞానం 4. నివారణం: జ్ఞానం (తెలుసుకోవడం). ఈ జగత్తును సృష్టించింది బ్రహ్మ. వేదాంత శాస్త్రం ప్రకారం ఆ బ్రహ్మ ఎక్కడో లేడు. నీలోనే వున్నాడు. ఎలా వున్నాడంటే ‘నీవై’ వున్నాడు. నీవు నిద్రిస్తున్నప్పుడు ఈ జగత్తు లేదు. నీ జాగ్రత్ అవస్థ లోనే ఈ జగత్తు వుంది అంటే అది ‘నీ’ జగత్తు. ప్రతి ఉదయం నీ జగత్తును నీవు సృష్టించుకొని, నీ మెలకువలో నీ ఇష్టం వచ్చిన విధంగా పాలించుకొని, రాత్రికి నీ నిద్ర లోకి విలీనం చేసుకుంటున్నావు. నీవు ఏమి సృష్టించుకొంటే అవే నీ జగత్తులో ఉంటాయి. అది నీ మనో వృత్తి!

దురదృష్టవశాత్తు నీ మనసులో కోరికలు – భయాలు మాత్రమే ఉంటాయి. అవి నిన్ను బంధించి వేధిస్తుంటాయి. నిన్ను నీవు తెలుసుకోలేవు. ప్రతి క్షణం ఏదో అవ్వాలని కోరుకుంటుంటావు. కానీ ఏది అయ్యి ఉన్నావో తెలుసుకోవు. యు సఫర్ ఇన్ ఏ కాన్‌ఫ్లిక్ట్ బిట్వీన్ బీయింగ్ అండ్ బికమింగ్! ఎక్కడో, ఎప్పుడో ఒకచోట ఒక మహానుభావుడు, కారణజన్ముడు ఉంటాడు.

వారే ఒక రామకృష్ణ పరమహంస, ఒక భగవాన్ రమణులు, ఒక స్వామి ఓంకార్‌లు. అలాంటి అతి కొద్ది మంది మాత్రమే వారు వచ్చిన కారణాన్ని తెలుసుకొని ఆ కార్యాన్ని చక్కబెట్టుకొని వెళతారు. మిగిలిన అందరూ ఈ సంసార చక్రంలో తిరుగుతూ వుంటారు. ఈ విషయంలో గృహస్థులు – సన్యాసులు అనే భేదం ఉండదు. పరమ పదం అంటే చేరుకోవాల్సిన అతి శ్రేష్ఠమైన గమ్యం. ఆ గమ్యాన్ని అంటే మోక్షాన్ని పొందటమే ప్రతీ మానవుని జీవిత లక్ష్యం. అదే నాలుగవ పురుషార్థం! అసలు మానవ జన్మ వచ్చిందే అందుకోసం! అయితే ఆ గమ్యం చేరడానికి కొంత మందికి వంద జన్మలు పట్టవచ్చు కొంతమందికి లక్ష జన్మలు కూడా సరిపోకపోవచ్చు. చిత్రమేమిటంటే ఆత్మ జ్ఞానం ఈస్ నాట్ టైం బౌండ్, నాట్ ఇన్ ఫ్యూచర్, ఓన్లీ నౌ అండ్ హియర్! మరి ఏమి చెయ్యాలి అంటే.. ఏమీ చెయ్యక పోవడమే చెయ్యాలి అప్రయత్న ప్రయత్నమే అన్న మాట! నాట్ డూయింగ్, ఓన్లీ బీయింగ్ అండ్ నోయింగ్! యూ అర్ దట్!! సినిమా ఎంతటి అసత్యమో ఈ సంసారం కూడా అంతే అసత్యం ఈ జగత్తులాగే! కనిపించేవే కాని వాస్తవం గా లేనివి. అంతా భావనా మాత్రమే! సినిమా తెరమీద కనిపిస్తుంది- పాము తాడులో కనిపిస్తుంది అంతే! నిజంగా వున్నవి కాదు. సంసారం కల్పన అయినప్పుడు దానితో వచ్చే సుఖ దుఃఖములు ఎలా నిజమౌతాయి?

ఈ సృష్టిలో వున్నది ఒకటే సత్యం. అది ఆత్మ. ఆ ఆత్మ నీవే అయివున్నావు. అందుకే నీకు జననం లేదు-మరణం ఉండబోదు! ఆది లోనూ అంతము లోనూ ఉండనిది మధ్యలో కూడా ఉండదు. ఉదాహరణకు కెరటం మొదట్లో నీరు, గాలి వల్ల ఎగిరి పడుతూ కెరటం లా భాసిస్తుంది. విరిగి పడిన తర్వాత అది నీరు తప్ప మరేమి కాదు. అలాగే ఈ సంసారము, తాడులో కనిపించే పాము, ఎడారిలో ఎండమావి, తెర మీద కనిపించే సినిమా, నీ జాగృదావస్థలో మాత్రమే భాసించే ఈ జగత్తు కూడా నీ మనోకల్పితాలే గానీ వాస్తవం మాత్రం కాదు! కాదు! కాదు!”

అంటూ అరగంట సేపు శ్లోకం మీద వ్యాఖ్యానం చేసి ప్రశ్నలు-జవాబుల కార్యక్రమం చేపట్టారు స్వామీజీ!!

***

“ధ్యానం అంటే ఏమిటి?” తపన్ రజూర్కర్ ప్రశ్న

“నీలోఉన్న అహంకారాన్ని, అంటే నేనూ – నాదీ అనే భావ పరంపరల కదలికలను గమనించుటే ధ్యానం.” స్వామీజీ.

“భార్యా భర్తల కాపురంలో కలహం ఎప్పుడు ఎందుకు ఏర్పడుతుంది?” సువర్ణ ప్రశ్న.

చిన్నగా నవ్వారు స్వామిజీ. “కలహం ఒక అహంకారానికి మరో అహంకారానికి మధ్య ఏర్పడుతుంది. అహంకారం ఎప్పుడూ ప్రపంచానికి భయపడుతూ వుంటుంది, తనలో వున్న ప్రాణ శక్తే (ఆత్మ చైతన్యం) తన భర్త లోనూ ఉండని గ్రహించక పోవుటే కాపురంలోని కలహాలకు కారణం.”

“హిప్నోటిజం అంటే ట్రాన్స్ లోకి వెళ్లి పోవడం ధ్యానం కాదా?” తన ప్రశ్నను కొనసాగించాడు తపన్.

“కాదు. అది హఠ యోగం! మన వేదాంతుల ధ్యానం ‘ఎరుక లోనే ఉండి గమనించడం’. అన్నీ తెలుస్తూనే ఉంటాయి. మనసును ఏదో ఒక దానిమీద కేంద్రీకరించి, మనసును నియత్రించు కోవడమే గానీ, మనసును డల్ చేసుకోవడం కాదు మన పద్ధతి. గంగా తీరంలో కూర్చుని ప్రవహించే గంగను గమనించుట, తెల్లవారు ఝామున తూర్పు తెల్లారడాన్ని గమనించడం మన కోవలోకి వచ్చే ధ్యాన పద్ధతి. గంగా తీరంలో మన గేటు వాచ్‌మన్‌ను గమనించండి. బయటకు వెళ్ళేవాళ్లకు గేటు తీస్తాడు. లోపలకు వచ్చే వాళ్లకు తీస్తాడు. అతను చేసేదికూడా ధ్యానమే. మన మనసులోకి ఆలోచనలు వస్తుంటాయి. పోతుంటాయి. వచ్చేవాటిని రానివ్వండి, పోయే వాటిని పోనివ్వండి. వాటిని గమనిస్తూ వుండండి. మీరెప్పుడైతే మీ మనసును గమనిస్తుంటారో అప్పుడది సైలెంట్ అయి పోతుంది. కానీ డల్ మాత్రం కాదు.” స్వామీజీ.

“మనసు ఎప్పుడూ ఎందుకు చలిస్తూ ఉంటుంది?” కత్రిన్.

“మనసు యొక్క చలనానికి కారణం అదే సృష్టి చేసుకున్న దేహము, దైవము, కాలము, జగత్తు- వాటిలోని నామ రూపములు.” చెప్పారు స్వామి.

“ఇమేజినేషన్ అన్నా భావన చెయ్యడమన్నా ఒకటేనా స్వామీజీ?” అడిగింది యూలియా సెంక్విచ్.

“కాదు. బోత్ అర్ లుక్స్ లైక్ సేమ్ బట్ నాట్ సేమ్! ఇమేజినేషన్ ఈస్ ది ప్రొడక్షన్ ఆఫ్ సెన్సేషన్స్, ఫీలింగ్స్ అండ్ థాట్స్ డిపెండ్ అపాన్ పాస్ట్ ఎక్స్పీరియన్సస్. అదే ఊహ! అంటే ఇంద్రియాలకు కనిపించని లేదా వాస్తవంలో గతంలో పూర్తిగా గ్రహించని మానసిక చిత్రాన్ని రూపొందించే చర్య లేదా శక్తే ఊహ! ఇక భావనలంటే.. అభిప్రాయం, ఆలోచన, సిద్ధాంతం, అనుభవం, స్మృతి! భావన అంటే ఆధ్యాత్మిక పెంపకం, హృదయం -మనస్సు యొక్క అభివృద్ధి, ప్రేమ పూర్వకమైన దయ!” స్వామీజీ.

“స్వామీజీ! హిప్నోటిజంతో ట్రాన్స్ లోకి వెళ్లడం, మెడిటేషన్‌తో సమాధి లోకి వెళ్లడం ఒకటేనా?” అడిగాను.

‘కాదు! హిప్నోటిజంలో ట్రాన్స్ లోకి వెళ్లడమంటే లేనిదానిని కల్పన చేసి వూహించుకోవడం, కానీ సమాధి స్థితి అంటే బహిశ్చేతన నుండి అంతః చేతనకు సిద్దించిన ప్రయాణం!” చెప్పారు స్వామీజీ.

“బహిశ్చేతన- అంతఃచేతన అంటే ఏమిటి? అంతః చేతనే సమాధి స్థితియా? ‘ అడిగాను మళ్ళీ.

“ఇట్ ఈస్ ఏ గుడ్ క్వశ్చన్! బహిశ్చేతన అంటే భాహ్య ప్రపంచాన్ని తెలుసుకొనే మనసు యొక్క స్థితి. అంతః చేతన అంటే అంతరంగ జగత్తును తెలుసుకొనే మానసిక పరిణితి! అంతః చేతనకు సమాధి స్థితితో సంబంధం వుంటుంది గానీ, అది సమాధి స్థితి కాదు. సమాధి స్థితి అంటే ఒక అత్యున్నత ధ్యాన స్థితి! ఈ స్థితిలో మనసు యాక్టివ్ గానే వుంటుంది గానీ పూర్తిగా స్థిరంగా వుంటుంది. వ్యక్తి దైవంతో అంటే అంతిమ వాస్తవంతో ఐక్యంగా ఉంటాడు. అంతరంగ ప్రపంచం పై ఎక్కువ అవగాహన కలిగి ఉంటాడు.” వివరించారు స్వామీజీ.

“నేను ఎవరు?” సచిత్ ప్రశ్న.

“ఇట్ ఈస్ ఏ బిగ్ క్వశ్చన్ ఇన్ స్పిరిచువల్ వరల్డ్! నేనుకు ‘సత్’, ‘చిత్’ అనే వస్త్రాలు తొడగక పోతే బ్రహ్మే!”

“ఆది శంకరాచార్య ఈ ఫొటోలో వున్నట్టే ఎర్రగా బుర్రగా వుండేవారా?” సచిత్ అడిగాడు మళ్ళీ.

నవ్వారు స్వామి. “ఆ అవకాశమే లేదు. మీలాగే నల్లగా ఉండివుంటారు. ఎందుకంటే మీ కేరళ లోనే పుట్టారు కదా?” చెప్పారు.

“అహంకారం అంటే ఏమిటి? జ్ఞానం అంటే ఏమిటి?” అండ్రియా బర్రెరియో ప్రశ్న.

“అహం అంటే నేను, అహంకారం అంటే ‘నేను చేస్తున్నాను’ అనే భావం, ఇక జ్ఞానం అంటే తనను తాను తెలుసుకోగలిగి, ఇతరమును కూడా తెలియడమే!!” చెప్పారు.

“ఆత్మ నిష్ఠకు అర్హత ఎప్పుడు కలుగును?” జ్ఞానానంద.

“ఈ నామ రూపములు కల్పితం అనే భావన స్థిరపడినప్పుడు ఆత్మ నిష్ఠకు అర్హత కలుగుతుంది.” స్వామి.

“మనిషి దేవుణ్ణి ప్రేమించగలుగుతాడా?” జున్ ప్రశ్న.

“దేవుడు ఏకము! అలాగే దృష్టి ఏకమే! కానీ దృశ్యాలు అనేకం. దృశ్యమును దృష్టిలో ఏకాగ్రమ్ చేయుటే ప్రవీలాపము (విలీనమగుట) కానీ కర్మ ఎప్పుడూ బహిరంగమే. బయట, లోపలా వున్న ఆలోచనలను లోపలికి తీసుకెళ్లే ప్రక్రియే భావన. అదే ధ్యానం! అలా మంచి భావనలు కలవాడు మాత్రమే దేవుణ్ణి (మనిషిని) ప్రేమించగలుగుతాడు!” చెప్పారు స్వామీజీ.

సమయము కావడంతో మంగళశ్లోకంతో క్లాసు ముగించారు.

***

అందరం టీ తాగి స్వామి పరమార్ధానంద వారి శ్రీ రామ గీత క్లాసుకు లెక్చర్ హాల్‌కు వెళ్ళాము. క్లాసు చివరిలో అనౌన్స్ చేశారు. స్వాములు ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనడానికి త్రివేణి ఘాట్ వద్ద నున్న ఆంధ్ర నిర్వాణ ఆశ్రమానికి వెళుతున్న కారణాన సాయంత్రం క్లాసులు రద్దు చేయబడినవని. రద్దయినందుకు బాధ కలిగినా, గంగా తీరంలో ఎక్కువ సేపు విహరించ వచ్చని సంతోషం కూడా కలిగింది. ఒకే ఘటన దుఃఖం-సుఖం ఇస్తుంది అనడానికి ఉదాహరణ అయ్యింది!

***

3 గంటలకు టీ తాగి గంగాతీరానికి బయలు దేరాము. హిమాలయాల్లో వర్షాలు కురుస్తున్నాయనడానికి నిదర్శనంగా బురద నీరు ఉదృతంగా ప్రవహిస్తుంది. జలచరాల బ్రీడింగ్ టైం కావడాన్న నదిలో బోట్ ప్రయాణాలు నిషేదించారు. క్రితం రోజు విహారం ఆపేసిన స్వామి నారాయణ ఆశ్రమం దగ్గర బయలు దేరాము. వంద గజాలు ముందుకెళ్లే టప్పటికి తీరానికి చేరువలో పందుల పెంపకందారుల పందుల షెడ్స్ కనిపించాయి. ఆశ్రమాల్లో మిగిలిపోయిన ఆహారాన్ని ఇక్కడకు తెచ్చి పందులకు పెడతారు. దుర్గంధం వస్తుంది. ముక్కులు మూసుకొని వంద అడుగులు వేసేటప్పటికి గంగా రిసార్ట్ బిల్డింగ్స్ చాలా అందంగా వున్నాయి. వాటి ముందు సువాసనలు వెదజల్లే పూలతోట ఆహ్లాదకరంగా అల్లరిస్తుంది. రిసార్ట్స్ గంగా తీరానికి రావడానికి, మళ్ళీ లోపలికి వెళ్ళడానికి గేటు ఉంది. వెళ్లే వారికి, వచ్చే వారికీ ఒకే విధంగా నవ్వుతూ గేటు తీస్తున్నాడు వేస్తున్నాడు, ఎవరి ఫీలింగ్స్ తోనూ మమేకం కాకుండా! అతను ఒక విధమైన ధ్యానం చేస్తున్నాడు, స్వామీజీ చెప్పిన గమనించడం అనే ధ్యానం చేస్తున్నాడనిపించింది.

కొంత ముందు కెళ్ళేటప్పటికి పెద్ద గ్రౌండ్. ఏదో కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జ్ఞాననంద అక్కడున్న వారిని ఎంక్వయిరీ చెయ్యగా బాబా రాందేవ్ ధ్యాన శిభిరం వచ్చే ఆదివారమని రెండు గంటల కార్యక్రమానికి ఇరవై రోజులనుంచి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అక్కడ చేస్తున్న ఏర్పాట్లు చూసిన వారివరైనా దేశ ప్రధాన మంత్రి మీటింగ్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి అనుకుంటారు. గ్రౌండ్‌కు ఆవలి ప్రక్కన కైలాస్ ఆశ్రమం కనిపిస్తుంది. కైలాష్ ఘాట్ వద్దకొచ్చాము. శవ దహనాలు చేసే ప్లాట్ఫార్మ్స్ అన్నీ కాళీగా వున్నాయి. ఇవతలి ప్రక్క తన గుడిసె ముందు కాటికాపరి బీడీ తాగుతు చాలా విచారంగా వున్నాడు. అతనికి ఒక ప్రక్క మురికి గుంటలో మూడు పందులు దొర్లుతున్నాయి. గట్టు మీద ఐదు పెద్ద బాతులు ఆడుకొంటున్నాయి. సచిత్ అతన్ని సమీపించి అడిగాడు.

“ఏమిటి భాయ్ విచారంగా వున్నావ్?” సచిత్ అన్నాడు.

విచారంగా మొహం పెట్టి, “ఏం చెప్పమంటారు సాబ్ ! ప్రొద్దుటినుండి ఒక్క శవం కూడా రాలేదు.”

“ఈ ఋషికేశ్‌లో ఈ రోజు ఎవరు చనిపోనందుకు సంతోష పడాలిగా?” సచిత్.

“ఎవరూ చనిపోక పోతే నా బ్రతుకు బండి నడిచేదెలా? కనీసం రోజుకు అర డజను శవాలైన రాకపోతే ఆ రోజు నాకు కూడు ఎలా? నిదరెలా వస్తుంది?” కాటికాపరి.

ఒక చావు ఒకరికి క్లేదం, మరొకరికి మోదం కలిగిస్తుంది అన్న మాట. ద్వంద్వములు గురించి చెప్పిన స్వామి మాటలు గుర్తొచ్చాయి అందరికీ! సచిత్‌కు అతని మీద జాలి కలిగి జేబు లోంచి ఐదు వందల నోటుతీసి ఇచ్చాడు.

“బహుత్ ధన్యవాద్ సాబ్. ఎప్పుడైనా మీ తాలుకు ఎవరైనా పోతే చెప్పండి సాబ్. కార్యక్రమం బాగా చేస్తాను.” అన్నాడు కాటికాపరి.

“బాగా అంటే ఏమి చేస్తావ్?” సచిత్.

“మీకు తెలియంది ఏముంటుంది సాబ్. ఈ దేశంలో అందరూ గంగా నిమర్జనాన్ని పవిత్రంగా భావిస్తారు. కానీ ఆ పనిని ప్రభుత్వం నిషేధించింది. మీరు నాకు ముందుగా చెబితే కొద్దిగా కాలిన తర్వాత గంగ లోకి( నిమర్జనం) తోచి వేస్తాను.” కాటికాపరి.

కాస్త ముందుకెళ్ళాము నిర్మాణంలో వున్న ‘జానకీ ఝాలా’ చూసాం. ఇవతలి ప్రక్క కైలాష్ ఘాట్ పార్కింగ్ ప్లేస్, షాపింగ్. ముందుకెళ్ళాము పూర్ణానంద విద్యా సంస్థల ప్లే గ్రౌండ్ ఎదురుగా కైలాస్ ఆశ్రమ హారతి ఘాట్. కొద్ది ముందు ప్రేమనగర్ ఆశ్రమం, హరిద్వార్ వారి బ్రాంచ్, దాని పక్కనుంచి ఒక పెద్ద వాగువచ్చి గంగలో కలుస్తుంది.

అక్కడి లాన్‌లో ఒక అరగంట కూర్చుని కబుర్లు చెప్పుకొని గంగా హారతికి సమయం సమీపించడం అందరం వెనుతిరిగాం!

*స్వస్తి*

Exit mobile version