[కన్నడంలో అక్షతారాజ్ పేర్ల రచించిన కథని ‘గమనమా? గమ్యమా?’ పేరిట అనువదించి అందిస్తున్నారు కోడీహళ్ళి మురళీమోహన్.]
గేటు బయట దేవదారు చెట్టు కింద కారు ఆపి, వేలాడుతున్న బోర్డు చూశాడు సాగర్. “మనస్సు సేవాశ్రమం: భావలోకానికి సుస్వాగతం.” ఆ పేరు అతని మనసును కదిలించింది. “మనస్సు.. ఎంత అందమైన పేరు,” తనలో తాను అనుకున్నాడు. మొబైల్ తీసి కాల్ చేశాడు.
“ఫాదర్, వచ్చాను.. గేటు బయట ఉన్నాను,” అన్నాడు.
“లోపలికి రండి,” అని స్వరం అటునుండి వినిపించింది.
సెక్యూరిటీ గార్డు “కౌన్ హో తుమ్?” అని అడగ్గానే, “ఫాదర్ పిలిచారు,” అని సాగర్ బదులిచ్చాడు. “ఠీక్ హై, సాబ్,” అంటూ గేటు తెరిచాడు.
లోపలికి అడుగుపెడుతున్న కొద్దీ సాగర్ మనసు సీతాకోకచిలుక లార్వాలా నెమ్మదిగా పాకసాగింది. చుట్టూ చూశాడు. ఆరేళ్ల పిల్లల నుండి ఎనభై ఏళ్ల వృద్ధుల వరకు, జీవితంలోని అన్ని దశలు ఒకేచోట కలిసినట్టు కనిపించాయి. అందరూ తమ లోకంలో మునిగి, బయటి చింతలకు అతీతంగా ఉన్నారు. ఎంత అందమైన జీవితం! అనిపించింది, గుండెలో ఓ చిన్న అసూయ కలిగింది.
ఫాదర్ ప్రకాష్ సెల్వరీస్ కార్యాలయం దగ్గరకు చేరాడు.
ఫా. ప్రకాష్ సెల్వరీస్
సేవాశ్రమం ముఖ్యస్థులు
తలుపు దగ్గర ఉన్న బోర్డును చదివి, సందులోంచి గదిలోకి ఒక్కసారి తొంగిచూశాడు. ఎవరో మాట్లాడుతున్నట్లు గమనించి తన వంతు కోసం బయట ఉన్న రాతి బెంచీపై కూర్చొని వేచి ఉన్నాడు.
ఆశ్రమం సాగర్‌కు కొత్తేమీ కాదు. డా. సాగర్‌గా చాలాసార్లు ఇక్కడికి వచ్చాడు. మానసిక వ్యాధులతో బాధపడేవారికి ఎందరికో వారి వ్యాధులను నయం చేశాడు. ఊరిలో అతడు ప్రసిద్ధ మానసిక వైద్యుడు. కానీ తన మనసు? దాన్ని నయం చేసుకోలేక, సమాధానం కోసం ఇక్కడికి వచ్చాడు. ఆ వైరాగ్యం తనను తాను నవ్వించింది, కానీ ఆ క్షణంలో నవ్వు కూడా అతన్ని ఓడించింది.
ఇంతలో మొత్తం వాతావరణాన్ని పాడుచేస్తూ మొబైల్ ఫోన్ రింగయ్యింది. స్క్రీన్ మీద కనిపించిన పేరు సాగర్‌కు అసహ్యాన్ని కలిగించింది.
ఒకటి, రెండు, మూడు, నాలుగు మళ్లీ మళ్లీ కాల్ వచ్చినప్పుడు అయిష్టంగానే ‘హలో’ అన్నాడు.
“ఏంటిది, సాగర్? ఈ పిచ్చి ఆట ఏమిటి? స్మితా చెప్పింది, నీవు ఆశ్రమానికి వెళ్తున్నావని! ఆ మాత్రానికి నీకు భార్య, పిల్లలెందుకు? ముందే చేరాల్సింది” మావయ్య కోపంగా అరిచాడు.
“మావయ్యా, ఇది ఎకాఎకి తీసుకున్న నిర్ణయం కాదు. చాలా ఆలోచించే వచ్చాను. మీ అమ్మాయికి నేను ఎందుకు కావాలి చెప్పండి?” అడిగాడు.
“ఏంటి నీ పొగరు? ఆ చిన్నపిల్లలను, ఆమెను వదిలి నువ్వు ఉండగలవా!”
“ప్రయత్నిస్తాను మావయ్యా. ఇన్ని రోజులు ఇదే సెంటిమెంట్ నన్ను ఓడిపోయేలా చేసింది. కానీ ఈసారి అలా కాదు. మీ అమ్మాయికి కూడా చెప్పండి, ఆమెకి ఇష్టమైన జీవితాన్ని ఎంచుకోవడానికి పూర్తి స్వాతంత్ర్యం ఇచ్చానని” సాగర్ శాంత స్వరంతో చెప్పినా మావయ్య గొంతు మాత్రం పెరిగింది.
“ఇదే నీ చివరి నిర్ణయమా! ఒక మాట గుర్తుంచుకో ఇప్పుడు నువ్వు వదిలి వెళ్ళిపోతే.. నా అమ్మాయి వైపు, నీ పిల్లల వైపు ఎప్పుడూ తిరిగి చూడకు, ముఖ్యంగా ఇంకో విషయం.. నా ఆస్తి వైపు కూడా!”
సాగర్ కోపం ఉప్పొంగింది. “నా పిల్లలను, మీ అమ్మాయిని చూడకుండా ఉండడం నాకు కొత్తా? నేను పేదవాడిని మావయ్యా, మీ అంత సంపద లేదు. ఈ కారణంతోనే కదా మీ అమ్మాయి నా పిల్లలను తీసుకుని మీ ఇంటికి చేరింది? ఆశగా నేను చూడటానికి వచ్చినప్పుడల్లా ఫారిన్ ట్రిప్‌లో ఉండేది? మీ ఆస్తి మై ఫూట్”
తన స్వరం పెరిగినట్టు, చుట్టూ ఉన్నవారు తన వైపు చూస్తున్నట్టు గమనించి, మనసును అదుపు చేసుకున్నాడు. “మావయ్యా నా భార్య, ఐ మీన్ మీ అమ్మాయికి నేను తగను. ఆమెనే చెప్పిన మాట ఇది. సంవత్సరాలుగా మేమిద్దరం ఒకరి ముఖం ఒకరం చూడలేదు. బయట సంసారి వేషంలో సన్యాస జీవితం ఎందుకు? ఈ ఆశ్రమంలో సన్యాసిగా ఉంటూ, బాధిత మనసుల సేవలో ప్రశాంతత వెతుకుతాను. వదిలేయండి. మీ అమ్మాయే అంగీకరించిన తర్వాత మీ అనుమతి అవసరం లేదు.” కాల్ కట్ చేసి, మొబైల్ స్విచ్ ఆఫ్ చేశాడు.
***
వద్దు అనుకున్నా పదేళ్ల క్రితం జరిగిన ఆ రోజు కళ్ళ ముందు మెరిసింది.
ముంబైలో ఒక కాన్ఫరెన్స్‌కు వెళ్తున్న సాగర్, ఫ్లైట్ ఆలస్యం కావడంతో ఎయిర్పోర్ట్ లాంజ్‌లో కూర్చున్నాడు. “ఎక్స్క్యూజ్ మీ.. ప్లీజ్ గివ్ మీ యువర్ మొబైల్ ఫర్ వన్ ఎమర్జెన్సీ కాల్” అని ఒక అమ్మాయి అడిగింది. కూలింగ్ గ్లాస్లో, బాబ్ కట్ జుట్టుతో, అందమైన ఆమె ముఖం అతన్ని కట్టిపడేసింది.
“ష్యూర్, ష్యూర్..” అంటూ మొబైల్ తీసి ఇచ్చాడు. అరగంట పాటు మాట్లాడిన తర్వాత మొబైల్ తిరిగి ఇచ్చింది. “ఇస్ ఇట్ ఎమర్జెన్సీ కాల్? మోర్ దాన్ హాఫ్ ఆన్ హవర్” అని సాగర్ వ్యంగ్యంగా అడిగాడు. “మిస్టర్.. తప్పుగా అనుకోవద్దు” అంటూ కన్నడంలో ఆమె చెప్పిన సమాధానం విని మనసులోనే మురిసిపోయాడు.
“ఓహ్, మన కన్నడ వాళ్ళే అన్నమాట. ఎక్కడో ఇంగ్లాండులో పుట్టినవాళ్ళు అనుకున్నాను మిమ్మల్ని చూసి” మళ్ళీ ఆటపట్టించాడు.
“ఏంటండీ మీరు! నా టెన్షన్ నాకుంటే మీరు ఎగతాళి చేస్తున్నారా?” గట్టిగానే అంది.
“ఊరికే జోక్ చేశాను మిస్, చెప్పండి మీ టెన్షన్ ఏమిటి? కాల్ కూడా భయంతో చేసినట్లుంది” అన్నప్పుడు “అదంతా గమనించారా?” వెనుక సీటు నుండి లేచి పక్కన వచ్చి కూర్చున్న ఆమె పర్ఫ్యూమ్ వాసన గుండెల్లో సీతాకోకచిలుకలు ఎగిరినట్లు అనిపించింది.
“హ్మ్ అవును.. ఏమైంది?” అడిగాడు.
“మిస్టర్, నేను ముంబైలో చదువుతున్నాను. రేపటి నుండి ఎగ్జామ్ ఉంది. ఎప్పుడూ నాతో అమ్మ లేదా నాన్న ఉండేవారు ఎగ్జామ్ టైంలో. ఫస్ట్ టైమ్ ఒక్కదాన్నే ఉన్నాను ఈ సిచువేషన్లో” చెప్పిన ఆమె కళ్ళ నిండా నీళ్ళు.
“అంతేనా వదిలేయండి. ఎన్ని రోజులుంది ఎగ్జామ్?”
“పది రోజులు. డాడ్ బిజినెస్ టూర్‌కు వెళ్ళారు, మామ్ లేడీస్ క్లబ్ యాన్యువల్ డే బిజీ” అంది.
తాను పదిహేను రోజులు ముంబైలో ఉండటం గుర్తుకు వచ్చి “నేనున్నాను, చింత వదిలేయండి” వెంటనే అన్నాడు.
“వాట్ డు యు మీన్?” అడిగినప్పుడే తాను ఏమన్నాడో సాగర్‌కు గుర్తుకొచ్చింది.
“తప్పుగా అనుకోవద్దు మిస్. నేను కూడా పదిహేను రోజులు ముంబైలో ఉంటున్నాను. సెమినార్ అని బయలుదేరాను. అలాగే లాంగ్ లీవ్ పెట్టి ఈసారి ముంబై తిరిగే ఆలోచన. ఎలాగూ ఫ్రీగా ఉంటాను, ఏదైనా సహాయం కావాలంటే అడగవచ్చు అని మాత్రమే ..” తడబడుతూ చెప్పాడు.
“థాంక్స్ మీ పేరు?”
“సాగర్ .. డా. సాగర్” గర్వంగా చెప్పాడు.
“ఓహ్ .. మీరు డాక్టర్?” అడిగినప్పుడు “యెస్ మిస్.. సైకియాట్రిస్ట్” అన్నాడు.
“అలాగా. అందుకే మీకు నా టెన్షన్ అర్థమైంది” అతని వృత్తి తెలిసిన తర్వాత అయి ఉండాలి! ఆమె మాటల్లో స్నేహం కొనసాగించాలనే కోరిక ఉందని మానసిక రోగ నిపుణుడు డా. సాగర్‌కు అర్థమైంది.
“అయితే మిస్, నా పేరు అడిగారు మీ పేరు చెప్పలేదే” అడిగినప్పుడు “సారీ, స్మితా దేవ్ అని నా పేరు, ముంబైలో ఎంబీఏ చేస్తున్నాను” అంది.
“దేవ్..! ఆర్ యు మిసెస్?” కొద్దిగా నిరాశగా అడిగినప్పుడు “నో.. నో.. దేవ్ మిశ్రా మై ఫాదర్” మాట విని మళ్ళీ కొత్తదనం.
“అదేంటి బెంగళూరు వదిలి ముంబైలో ఎంబీఏ?” అడిగాడు.
“అలా ఏమీ లేదు. డాడ్ ఇండస్ట్రియలిస్ట్, ముంబైలోనూ ఇండస్ట్రీ.. ఓన్ ఫ్లాట్ అన్నీ ఉన్నాయి. వాళ్ళ బిజినెస్ చూసేలా నేను చదువుకోవాలి అనేది వాళ్ళ కోరిక” పెదవికి ముద్దు పెడుతున్న ముంగురులను వెనక్కి జరుపుకుంటూ చెప్పింది ఆ అమ్మాయి.
‘అబ్బో మంచి శ్రీమంతుల అందగత్తె. శంఖంలాంటి ఈమె మెడను ముద్దుపెట్టుకునే అదృష్టం నాకు దక్కుతుందా?’ మనసులో అనుకున్నది తరువాత నిజమైంది సాగర్‌కు.
ముంబై ఎయిర్పోర్ట్ వదిలి బయటకి వస్తున్నప్పుడు “మొబైల్ నంబర్ షేర్ చేసుకోవచ్చా! ఇక్కడ నాకు కూడా తెలిసినవాళ్ళు ఎవరూ లేరు, మీకు కూడా ఒక్కరే అనే భయం ఉన్నప్పుడు ఇలా మాట్లాడుకోవడానికైనా.” సాగర్ ఇలా అమ్మాయిల నంబర్ తీసుకోవడం కొత్తేమీ కాదు, కానీ ఈమెలో ఏదో ప్రత్యేకత ఉందని మొదటిసారి మనస్ఫూర్తిగా నంబర్ అడిగాడు. ఆమె కూడా వెనుకాడకుండా నంబర్ ఇచ్చినప్పుడు స్వర్గం అంచుల్లో ఉన్నంత ఆనందం కలిగింది అతనికి.
తరువాత ముంబైలో ఉన్నన్ని రోజులు ఆమెకు ఎగ్జామ్ కు ధైర్యం చెప్పే నెపంతో ప్రతిరోజు కాల్ చేస్తున్న సాగర్‌కు సమయం ఎలా గడిచిపోయిందో తెలియలేదు. ఆమెకు ఇంకా రెండు పేపర్లు మిగిలి ఉండగా మళ్ళీ బెంగళూరుకు తిరిగివెళ్ళే రోజు వచ్చింది సాగర్‌కు. “స్మితా ఇంకో రెండు రోజుల్లో ఊరికి బయలుదేరుతున్నాను” అతడు అన్నప్పుడు “వద్దు..” ఒక్క మాటలో ఆపేసింది.
“లేదు బయలుదేరాలి”
“టికెట్ రిజర్వ్ అయ్యిందా?”
“లేదు చేయాలి ఇంకా”
“వద్దు ప్లీజ్, ఇంకా రెండు పేపర్లు ఉన్నాయి. అది అయ్యాక నేను కూడా వస్తాను. అప్పటివరకు ముంబైలో ఉండండి. కావాలంటే మా ఫ్లాట్‌లో ఉండొచ్చు”
ఆమె మాటలకు మనసులోనే మురిసిపోయిన సాగర్ “ఇంత చెప్తున్నారు కనుక ఓకే. ఇక్కడే హోటల్ రూమ్‌లో ఉంటాను. లాస్ట్ పేపర్ ముగించి ఒక డిన్నర్ చేసుకుని బయలుదేరిపోదాం” అతని మాటలకు ఒప్పుకున్న అమ్మాయి ఇక తనదే అనే భావం అప్పటికే సాగర్‌ను ఆవరించుకుంది.
బెంగళూరుకు వచ్చిన తర్వాత పరిచయం స్నేహంగా, ఆపై ప్రేమగా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. కానీ ఒక అంతస్తు ఇంటివాడు బహుళ అంతస్తుల భవనం వైపు తల ఎత్తి చూస్తే జీవితం నవ్వులపాలు అవుతుందేమో అనే భయం గుండెల్లో ఏ మూలలోనో దాగివుంది.
“నేను మీ అమ్మానాన్నలకు నచ్చుతానా?” అడిగినప్పుడు “నా ఇష్టాన్ని మామ్ డాడ్ ఇంత వరకూ నో చెప్పలేదు” అన్న స్మిత ఆ రోజే ఇంట్లో ప్రస్తావించి పెళ్లికి ఒప్పించింది. ఆమె ఇంట్లో చెప్పకోదగ్గ వ్యతిరేకత ఏమీ లేకపోయినా, ఉన్నదొక్కటే షరతు. “ఒక్కతే కూతురు కాబట్టి ఇల్లరికపు అల్లుడు అయితే మాత్రమే..!”
సాగర్ కూడా అమ్మనాన్నలను ఇద్దరినీ కోల్పోయినందున, ఇది పెద్ద కష్టం కాదనిపించి మొదటిసారి తన ఎంపికలో తప్పటడుగు వేశాడు.
కొత్తలో గాడిద కూడా గుర్రం అన్నట్లు ఇంటి అల్లుడి హోదా సుఖంగానే అనిపించింది. కానీ తాను ఎక్కిన పీఠం బానిసత్వం కంటే తక్కువ అని తెలిసేసరికి ఇద్దరు పిల్లల తండ్రి అయ్యాడు. తాను ఇష్టపడిన తన వైద్య వృత్తిని ఎప్పుడో మాన్పించి మావయ్య కంపెనీ మేనేజర్‌గా చేసేశారు. కూర్చున్న చోట, నిలబడిన చోట అడిగే లెక్కలు, వేసే లెక్కాచారాలతో విసిగిపోయి మళ్లీ వైద్యవృత్తి చేస్తానంటే ఒప్పుకోని భార్య, అర్థం లేని జీవితంతో సర్దుబాటు! ఏదో బిజినెస్, ఎక్కడో మీటింగ్, ఎప్పుడో తిరిగి చేరే ఇల్లు. ఇంతే అయినప్పటికీ సహించిన అతని ఓర్పు కట్టలు తెంచుకుంది స్మిత అతిశయించిన టూర్లతోనే. పిల్లలను బోర్డింగ్ స్కూల్ నెపంతో ఊటీలో వదిలేయడంతో చాలాసార్లు ఫారిన్ టూర్ అని నెలల తరబడి బయట ఉండి, ఆమె ముఖం కూడా కనిపించనప్పుడు కుమిలిపోయేవాడు.
తనది కాని తానిష్టపడిన వృత్తి, తనదై ఇష్టపడని జీవితం వీటన్నిటితో సతమతమవుతున్నవాడిని చేయి చాచి పిలిచింది “మనస్సు”.
ఏదో కార్యక్రమం ప్రారంభోత్సవానికి ఆశ్రమానికి వచ్చినవాడు అక్కడి వాతావరణానికి మైమరచిపోయాడు. ఇలా అప్పుడప్పుడు వచ్చి అక్కడి వారికి అవసరమైన మానసిక చికిత్సను అందించేవాడు. ఈ క్రమంలో ఫాదర్ ప్రకాష్ ఆత్మీయుడు కాగా తనలోని వేదన తనకే తెలియకుండా బయటికి వచ్చింది.
“ఫాదర్, మీరు ఒప్పుకుంటే నేను ఇక్కడే..” మాట పూర్తి కాకుండా మధ్యలోనే ఆపారు ఫాదర్.
“నో నో సాగర్. ఇంకా చిన్న వయసు మీది. సంసారం సజావుగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఎందుకుంటారు” ఫాదర్ అడిగారు.
“లేదు ఫాదర్. పైకి బాగానే ఉన్నట్లుంది అంతే. లోపల చెదలుపట్టింది. నాకు ఈ అవమానకరమైన జీవితం చాలు. అన్నింటినీ వదిలేసి నేను నేనుగా ఉండాలి” అంటున్న సాగర్ కళ్ళలోకి చూసి ఏమి అనుకున్నారో ఏమో “సరే మీ ఇష్టం” అని లేచి వెళ్ళారు.
ఆ రోజు కూడా ఇంటికి వచ్చినప్పుడు స్మిత లేదు. ఫారిన్ ట్రిప్ వెళ్లి వారం అయింది.
“ఐ వాంట్ టు టాక్ విత్ యూ” అని మెసేజ్ పెట్టిన కొద్దిసేపటికే “బిజీ విత్ ఫ్రెండ్స్” అని రిప్లై వచ్చింది. రాత్రంతా ఎదురు చూసినవాడు ఉదయం లేచి వాట్సాప్ కాల్ చేస్తే ఏదో మత్తులో మాటలు.
“ఏమిటి మాట్లాడటం? ఇంట్లో అన్నీ ఉన్నాయే” అంది.
“అన్నీ ఉన్నాయి, కానీ ఉండాల్సిన నువ్వు తప్ప” అన్న అతడికి “నేనేం మూడు పూటలా అక్కడే పడి ఉండాలా?” ఆమె ఈ ధోరణి సాగర్‌కు కొత్తేమీ కాదు.
“అవసరం లేదు. నేను కూడా ఇక్కడ ఉండలేను. ఆశ్రమంలో చేరుతున్నాను” అతని మాటలకు అటువైపు నుంచి జోరుగా నవ్వు వినిపించింది.
“నవ్వకు స్మితా, నిజమే చెప్తున్నాను” అంటున్న అతనితో “వంకరగా ఉన్న కుక్కతోకను సాపు చేయగలమా చెప్పు? వెళ్ళు అక్కడే ఉండు” హేళనగా అంది.
“ఇదే నీ చివరి మాటా?” అడిగాడు.
“నీకిష్టం లేకపోతే నేనెందుకు నాతో ఉండమని బలవంతం చేయాలి? యువర్ లైఫ్, యువర్ ఛాయిస్” అని కాల్ కట్ చేసిన ఆమెపై ఉన్న కొద్దిపాటి ప్రేమ కూడా చచ్చి అసహ్యం పుట్టడంతో ఆశ్రమానికి బయలు దేరాడు.
***
“ఓకే ఫాదర్. వచ్చే నెల వస్తాం. థాంక్యూ సో మచ్” అన్న మాట చెవికి వినబడగానే వాస్తవంలోకి వచ్చి అటువైపు చూశాడు. గుండ్రటి ముఖం, భుజాల కంటే కొద్దిగా కిందకు వదిలిన వదులుగా ఉన్న జుట్టు, జీన్స్ ప్యాంట్ మీద లేత పసుపు రంగు టాప్ ధరించిన మహిళ ఫాదర్‌తో మాట్లాడుతూ బయటికి రావడం చూశాడు. వాళ్ళిద్దరి వెనుక వచ్చిన పదహారేళ్ళ బాలికలు, చూస్తే కవలల వలె ఉన్నారు! అచ్చం ముందున్న మహిళను పోలి ఉండటం చూసి పిల్లలై ఉండాలి అనుకునేలోపు అతని దగ్గరకు వచ్చారు.
“మిస్టర్ సాగర్ వచ్చారా! ఐదు నిమిషాల్లో ఇప్పుడే వస్తాను” ఫాదర్ అన్నప్పుడు ముందు వెళ్ళిన ఆమె తిరిగి “సాగర్?” అడిగింది. దగ్గర నుండి ఆమె ముఖం చూడగానే తెలిసిన ముఖం అనిపించింది. “అవును” అన్నప్పుడు “మీరు.. మీరు మంగళూరు వారా?” ఆశ్చర్యంతో సాగర్ తల ఊపాడు.
“మేరీ కాన్వెంట్ స్కూల్?” మళ్ళీ అడిగింది.
“యస్”
“నేను. నేను ఫ్లేవియా. సిస్టర్ ఫ్లేవియా.” మాట విని ఆశ్చర్యపోయాడు సాగర్.
“నువ్వు! మరి వీళ్ళిద్దరూ?”
“హా. వీళ్ళిద్దరూ నా కవల పిల్లలు. జెన్నీ అండ్ జెనితా. చూడు నీ పుణ్యమా అని నేనివాళ సంసారిగా ప్రశాంతంగా జీవితం గడుపుతున్నాను. మస్కట్‌లో ఉన్నాను. వచ్చి నెల రోజులు అయ్యింది. అత్తయ్య ఇక్కడే ఉంటారు. కొద్దిగా మెంటల్ డిజార్డర్. అందుకే ఇక్కడ చేర్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము. నిన్ను చూసి సంతోషంగా ఉంది. మొబైల్ నంబర్ ఇవ్వు” గుక్క తిప్పకుండా మాట్లాడుతున్న ఆమెతో “సరే, సేవ్ చేసుకో నంబర్” అని నంబర్ చెప్పాడు.
“లేట్ అయింది కదా, పిల్లలదేదో షాపింగ్ ఉందట. కారులో కూర్చున్నాడు విల్సన్, ఓహ్ సారీ మై హస్బెండ్” అని తొందరలో వెళుతున్న ఆమెను చూసిన ఫాదర్ “గుడ్ లేడీ! ఈమె మీకు ఎలా తెలుసు?” అడిగారు.
“నా క్లాస్మేట్” సాగర్ సమాధానం విని ఫాదర్ ప్రకాష్ ఆశ్చర్యపోయి “ఓహ్ గుడ్ గుడ్. రండి లోపలికి” అని గదిలోకి వెళ్ళారు. సాగర్ మాత్రం ఫ్లేవియా వెళ్ళిన దిశనే చూస్తూ నిలబడ్డాడు.
***
“చూడు సాగర్, వస్తోంది మన సన్యాసిని. ఇలాంటి ఫిగర్స్ సన్యాసం స్వీకరిస్తే మనలాంటి అబ్బాయిల గతి ఏమిటి!” దిలీప్ మాటలకు అటువైపు చూశాడు సాగర్.
గుండ్రటి ముఖం ఉన్న ముద్దులొలికే అమ్మాయి అనవచ్చేమో! కానీ మెడలో ఉన్న శిలువ తప్ప నుదురు, చేతులు, కాళ్లు అన్నీ బోసిగా ఉన్నాయి. లేత గోధుమ రంగు చీర కట్టుకుని నిరాడంబరంగా ఉంది. “ఎవరామె?” సాగర్ అడిగాడు.
“ఆమె పేరు ఫ్లేవియా అని. ఆలస్యంగా అడ్మిషన్ అయ్యిందట. సిస్టర్ అవ్వాలని అనుకుంటోంది, సో కాన్వెంట్ నుండి వస్తోంది” దిలీప్ చెప్పేసరికే ఆమె దగ్గరికి వచ్చింది.
“హాయ్” విష్ చేసిన అతనికి చేతులు జోడించి వెళ్ళిన ఆమెను చూసి కోపం వచ్చింది. “ఏంటిది. ఈ వయసులో మరీ ఇంత వైరాగ్యం ఏమిటి?” అన్నప్పుడు “ఇలాంటి వాళ్ళే కావాలిరా.. మన బెట్టింగ్‌కి” నవ్వాడు దిలీప్.
ఇతని బెట్టింగ్ పిచ్చి సాగర్‌కు కొత్తేమీ కాదు. చిన్న చిన్న విషయాలకు కూడా సాగర్‌తో బెట్టింగ్ కట్టేవాడు. గెలిచిన సందర్భాలకన్నా ఓడిపోయిందే ఎక్కువ.
“ఈ సన్యాసి ముఖం చూడగానే నీకు బెట్ గుర్తుకొచ్చిందేంటి! ఫిగర్ బాగుంది, కానీ సన్యాసుల సావాసం మనకు వద్దురా” సాగర్ అన్నాడు.
“ఇక్కడే ఉంది మజా. సన్యాసిని అవుతానని బయలుదేరిన ఆమెను సంసారిని చేయి చూద్దాం” గెలిస్తే నువ్వు చెప్పినట్లు వింటాను” దిలీప్ ఛాలెంజ్ చేశాడు.
“నిజంగా” అడిగాడు సాగర్.
“ఇట్స్ మై ప్రామిస్” అతని మాటలకు “అయితే నువ్వా నేనా తేల్చుకొందాం. డిగ్రీ ముగిసే నాటికి ఆమె నార్మల్ అమ్మాయిలా అవుతుంది. అలా చేయలేకపోతే నేను మా నాన్న కొడుకునే కాదు” కాలుతో నేల తన్ని వెళ్ళిన అతని ఆవేశం కేవలం మాటలుగా మిగిలిపోలేదు.
కాలేజీలో మూడు సంవత్సరాలు పూర్తయ్యేసరికి ఏదో విధంగా ఫ్లేవియా స్నేహాన్ని సంపాదించుకున్నవాడు, మెల్లమెల్లగా ఆమెను మార్చుకుంటూ వచ్చాడు. చివరి డిగ్రీ సంవత్సరంలో ఒకసారి దగ్గరకు వచ్చి “సాగర్, ఎక్కడైనా పి.జి. ఉంటే చెప్పు” అన్నప్పుడు “ఎందుకు?” అడిగాడు.
“నేను కాన్వెంట్ వదిలేయాలి అనుకుంటున్నాను” అన్న ఆమెకు “మరి నీ దీక్ష..! సన్యాసం?” నవ్వాడు.
“లేదు సాగర్, నేను నేనుగా దీక్ష తీసుకోవడానికి రాలేదు. నాకు అమ్మ మాత్రమే ఉంది. నీకు తెలుసు కదా సింగిల్ పేరెంట్‌గా అమ్మాయిని పెంచడం కష్టం అని, దాంతోపాటు పేదరికం. అందుకే అమ్మ నన్ను ఇక్కడ చేర్చింది. కానీ లాస్ట్ ఇయర్ అమ్మ కూడా చనిపోయింది. ఉన్న ఇంటిని దూరపు బంధువు ఒకరు మంచి రేటుకు కొనుక్కున్నారు. ఇప్పుడు నేను కూడా మేజర్ కదా. నాకు కూడా ఆశలున్నాయి. ఎలాగూ చదువుకున్నాను కదా. ఏదైనా ఉద్యోగం చేద్దాం అని. ఈ సన్యాస జీవితం నాకు నచ్చడం లేదు. ఇష్టపడని దానిని బలవంతంగా ఒప్పుకోకూడదు. నాకు కూడా రంగు రంగుల డ్రెస్సులు వేసుకోవాలి, ఇతర అమ్మాయిల లాగా ఉండాలి” కళ్ళనీళ్ళతో చెప్పినప్పుడు సాగర్‌కు అయ్యో పాపం అనిపించింది. ఆమె ఆప్తురాలు అయినప్పటికీ ఒక రోజు కూడా వేరే దృష్టితో చూడని సాగర్‌కు మొదటిసారి ఈమెను సన్యాసం నుండి బయటకు తీసుకువచ్చి తప్పు చేశానేమో అనిపించింది.
“కానీ ఫ్లేవియా, బయటి ప్రపంచం నువ్వు అనుకున్నంత సరైంది కాదు” ఏదో ఆలోచనలో అన్నాడు.
“మరి నన్ను సన్యాసం నుండి విముఖురాలిని ఎందుకు చేశావు? బయటి ప్రపంచం గురించి ఆశ ఎందుకు కలిగించావు?” ఆమె అడిగిన ప్రశ్నకు “కేవలం బెట్టింగ్ కోసం” అని ఎలా సమాధానం ఇవ్వగలడు సాగర్?
“అది.. అది.. వదిలేయ్. నీకు అక్కడ ఉండటం ఇష్టం లేకపోతే వేరే ఏర్పాటు చేస్తాను. కానీ పి.జి. వద్దు” అని నాన్న స్నేహితులను పట్టుకుని ఫ్లేవియాకు వాళ్ళ కంపెనీలో చిన్న ఉద్యోగం ఇప్పించాడు. తరువాత సాగర్ అమ్మ నాన్న కూడా గతించిన తర్వాత చదువుకోవడానికి విదేశాలకు వెళ్ళినవాడు మంగళూరుకు అరుదైన బంధువు అయ్యాడు.
***
ఇదంతా జరిగి సంవత్సరాలు గడిచిపోయాయి. ఈరోజు మళ్ళీ చూసిన ఫ్లేవియాలో ఎంత మార్పు. ఆమె. ఆమె సంసారం. కవల పిల్లలు. సన్యాసం నుండి బయటపడిన ఎంత అందమైన జీవితం. ఒకవేళ పంతం కోసం అప్పుడు నేను బెట్ కట్టకపోతే ఈరోజు ఎలా ఉండేది ఫ్లేవియా? అదే బోసి నుదురు, బోసి చేతులు కాళ్లు, కప్పుకున్న చీరలో విరక్తిగా ఉండేది. కానీ నేటి ఫ్లేవియా! మోడర్న్ మహిళ. తనకంటూ ఒక గూడు కట్టుకున్నది. కాలేజీ రోజులలో పంతానికి తాను చేసిన పనితో ఆమె జీవితం చెడిపోలేదని అనుకున్నవాడికి వెంటనే తన జీవిత గతి గుర్తుకొచ్చింది.
‘నేను..! ఆమెను సన్యాసం నుండి విముఖురాలిని చేసిన నేను ఈ రోజు ఎలా ఉన్నాను? వచ్చి నిలబడింది ఎక్కడ! సన్యాసిని అయిన ఆమెను సంసారిని చేసినవాడు ఈ రోజు సన్యాసి అవ్వడానికి బయలుదేరాను. ఆనాడు ఆమెకు జీవితం గురించి చెప్పిన రంగురంగుల ఊహాచిత్రాలన్నీ ఈ రోజు నా కళ్ళ ముందు చెదిరిపోయాయి. ఆమె అయితే సన్యాసం వదిలి సుఖంగా ఉంది, నేను సంసారం వదిలి సుఖంగా ఉండటానికి బయలుదేరినవాడిని. జీవితానికి ఎన్ని భిన్నముఖాలు? నువ్వు ఇప్పుడు సన్యాసిని కమ్మంటే బహుశా ఫ్లేవియా ఈ జీవితాన్ని వదిలి మళ్ళీ వెనుకకు వెళ్ళదు. నేను కూడా అంతే.. మళ్ళీ సంసారిని కావాలంటే కుదరని పని. అలాగైతే వదిలి వెళ్ళడం అంటే ఏమిటి? ఉన్నచోటే చనిపోవడమా! లేక చచ్చి పుట్టడమా?’ మనసులో పుట్టిన లెక్కలేనన్ని ప్రశ్నలకు సమాధానం వెదుకుతున్న సాగర్‌కు కనిపించింది ఒక్క “మనస్సు” అనే సేవాశ్రమం బోర్డు మాత్రమే!
కన్నడ మూలం: అక్షతారాజ్ పేర్ల
తెలుగు అనువాదం: కోడీహళ్ళి మురళీమోహన్
కోడీహళ్లి మురళీమోహన్ వ్యాసకర్త, కథకులు, సంపాదకులు. తెలుగు వికీపీడియన్. ‘కథాజగత్’, ‘సాహితి విరూపాక్షుడు విద్వాన్ విశ్వం’, ‘జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు’ అనే పుస్తకాలు ప్రచురించారు.