[శ్రీమతి మరింగంటి సత్యభామ గారి ‘గమనం’ అనే రచనను అందిస్తున్నాము.]
తయారయ్యావా. అవకపోయినా రావాలి!
నీ పాపపుణ్యాల మూటలు నా దగ్గరున్నాయి.
ఎన్నాళ్ళు ఉంటావు? ఎప్పుడూ వుండే తాపత్రయాలే!
ఉట్టి కట్టుకుట్టుకుని ఊరేగుదాం అనుకుంటున్నావా!
ఏమిటా సద్దుడు? ఏం దాస్తున్నావు!
ధనమా! నగలా!
నీ అనుకునే వాళ్ళ మీద ప్రేమా, అభిమానాల మూటా!
అవన్నీ నీతో రావు, రావు కదా! ఇంకా ఎందుకీ వ్యామోహం?
నువ్వే రావు! నీ రూపే రాదు!
ఎందుకు ఈ ప్రలోభం?
సద్దుకునేవేమిటీ! పోయేముందు సద్దుబాట్లా!
అవన్నీ వున్నా లేకున్నా నిమిత్తమాత్రమే!
చేసిన పుణ్యపు మూట ముందు, పాపపు మూట వెనక.
ఐనా నువ్వు రావడం ఏంటీ. నేనే తీసుకెళ్తా.
నీ ఇష్టంతో నిమిత్తం ఏం లేదు.
సరే! నా కళ్ళు భారం అవుతున్నాయి. కదలలేకపోతున్నాను.
నీ వెనక నేనెలా రాగలను! నా మనసు. నీ స్ధానం ఇక్కడే!
వెళ్ళకు అంటోంది. ఏదో మాయ!
మగతగా వుంది. పరిసరాల మీద మమకారం.
నా ఆస్తుల మీద కాపీనంతో మనసంతా సతమతమౌతోంది!
మధ్యలో నీ గోలేంటో!
ఇవ్వాల్సినవి ఇవ్వాలి! నా స్వంత కుటుంబంలో వారికి నేనంటే
ఎంతోప్రేమ అభిమానం.
వారిని క్షణమైనా విడువలేనే, వారిచ్చేవీ పుచ్చుకోవాలి కదా!
ఏం తీసుకుంటావు. నీ వాళ్ళనుకుంటున్నావా!
ఎవరు వీళ్ళు! ఏది నీది!.
తలుచుకో! పరమాత్మను. స్మరించు రామ రామ. కృష్ణ కృష్ణ.
నారాయణ నారాయణ.
ఓం నమశ్శివాయ. హరహరా.
ఆ దైవనామస్మరణ తప్ప అన్నీ గుర్తొస్తున్నాయి
ఎంతో కష్టపడి సంపాదించినవి ఎలా వదిలేది?? నేనే వుండి చేయవలసిన ముఖ్యమైన పనులు నడిపించాలి కదా!
నీవే నడవలేవు, నడిపించేదీ, నడిచేదీ ఏముందీ? దైవచింతనలోకి మళ్ళరా! నువ్వు లేకుంటే సూర్యోదయం, సూర్యాస్తమయం ఆగుతాయా? ప్రపంచ గమనం నిలిచిపోతుందా! దైవస్మరణలోకి దృష్టి నిలుపు!
నా భార్య ఉత్తమురాలు! నాకు ప్రియమైనది! పిల్లలు గుణసంపన్నులు! వారి కోసం గణించిన ఆస్తుల మాటేంటీ! వారితో కలిసి సంతోషంగా అనుభవించాలిగా! ఎంత ధనసంపదలు దాచానో! వాటిని వదలలేనే! ఎలా?ఏం చేయను. నేను రానే రాను!
సమయం మించిపోతోంది రా! లంపటాలేల? ఆస్తులా! ఓహో! నువ్వు గణించినవి అనుభవిస్తావా! ఎలా! నీ బంధువులు, బంధాలు, ఆస్తులు వెంటవస్తాయని భ్రమలో పడుతున్నావా! అరే! నీ భార్యాపిల్లలు, బంధుబలగం తోటే.. నిత్యం అని.. భ్రాంతిలో పడుతున్నావా! వారు నిన్ను నీ మనసునీ లాగుతున్నారా! వాళ్ళు కట్టిపడేసినా నాతో రావలసిందేరా! జీవుడా, జీవనంబుద్బుదప్రాయం. అశాశ్వతం! వినలేదా! ఇక్కడే నిత్యమను కుంటున్నావా? ఆయువు తీరాక వచ్చేది నా దగ్గరకే! నీ ముందు.. నేను. నావెనక నీవు! ఏ జీవికైనా తప్పని యానము! జనన మరణ చక్రభ్రమణం! నిజం తెలుసుకోరా.. మూర్ఖుడా!
నీ వెనక వచ్చేవి.. నువ్వు చేసిన పుణ్యం, దానం, అన్నదానం. నీకూడా వస్తాయి. మరో మహోన్నత దానం దాహార్తులకు నీటి దానం. పేదలకి నీడ. చిన్నపాకైనా దానంగా ఇచ్చావా? పోనీ పసివారికి క్షీరదానం, విద్యాసక్తి గల పేద విద్యార్ధులను చదివించావా! వస్త్రదానం. ఎండ, వాన, చలితో బాధపడేవారికి దుప్పట్లు, వస్త్రాలు ఇచ్చావా!
నీకు పంటభూమి, నివాసభూములు చాలా వున్నాయి. చేశావా భూదానం? పోనీలే, గోదానఫలం విన్నావా? బ్రాహ్మలని పూజించి గోదానం చేశావా! అపర బ్రహ్మ స్వరూపులు. ఫలితం అనంతం!
పుణ్యక్షేత్రాలలో దైవదర్శనం చేశావా? దేవుని పేర ఏవైనా ధర్మసత్రాల్లాంటివి ఏర్పాటు చేసి దైవదర్శన యాత్రీకులకు భోజన, శయన సదుపాయాలు కల్పించావా?
ఒక్క నుయ్యి అయినా తవ్వించావా?
చేద్దామన్నా తీరికేదీ? అనేక రాచకార్యాలు. అవన్నీ గుర్తెందుకుంటాయి!
ఆపదలో వున్నవారికి ధైర్యం చెప్పి ఆసరాగా వుండి ఆ కష్టానికి సహాయం చేశావా?
వాళ్ళ మొహం చూసేంత సమయమేదీ..! నా సమయం చాలా విలువైనది! ఎవరికీ కేటాయించలేనే!
ఔనా? ఎంత స్వార్థం! అందుకే పుణ్యాత్ముల పద్దులో నీ పేరు లేదు! ఇవేం లేకుండా పుణ్యం ఎలా వస్తుంది..?
సరే! పరులకి నువ్వు చేసిన కీడు., హాని, ద్రోహాలేమైనావున్నాయా? అవి మరీ జటిలం! అన్నీ.. చిత్రగుప్తుని పద్దులో ఇమిడి వున్నవిలే!
నీ అభిజాత్యాల చిట్టా పద్దు.. నడింక. రకరకాలైన శిక్షల కేంద్రం నరకానికి! పద. పద. నిన్ను నా అనుచరులే తీసుకొస్తారు!
ఎవరు నువ్వు? నాకు కనిపించకుండా నీ ఆహ్వానం ఏమిటీ? పెళ్ళి పిలుపులా పిలుస్తున్నావు! కనిపించు! నువ్వెవరివో.. తెలుసుకుంటా!
నేను కనిపించానంటే నువ్వు వుండవు! ఓ మానవా! అశాశ్వతం అయినవి శాశ్వతం అనుకోకు! భగవంతుని అనుగ్రహం శాశ్వతం రా!
దైవాన్ని నిలపు మనసునందు! స్మరించు! మనసారా.. నారాయణ నామస్మరణ చేయి!
భగవంతుని నిలపరా! కళ్ళ ముందు! తలుచుకో! భక్తిపూర్వక ధ్యానంలో హరినామస్మరణ! సకలపాపవిముక్తి కలుగుతుంది!
పరమేశా! నారాయణా! రంగాశ్రీరంగా!
మాయాజీవనం. నిత్యమా. రామా! రామా! శ్రీరామా. ఓం నమఃశ్శివాయా! ప్రార్థన చేయరా జీవుడా!
మనసు నిలకడ లేదే! ఏకాగ్రత కుదరడం లేదెందుకో? ప్రవచనాలు వింటున్నా. మనసు తీసుకోవటం లేదు! ధ్యానం సంగతి గుర్తేలేదు. పనుల్లో పడి అన్యాక్రాంతమైన ఇతర ఆలోచనలు. ఓ దైవమా! నాకేల? ఈ ద్వందభావాలు? నాకెందుకు ప్రాపంచిక వ్యామోహాలు? విడిపించుకుందామన్నా మనసు వినదేమి? తండ్రీ, సకలచరాచరాలను నడిపించు సర్వాంతర్యామీ, నిలకడ ప్రసాదించు!
స్వామీ, నా మనసు, ధ్యాస, ధ్యానం అన్నీ నీవే! సర్వోపగతుడవైన నీ పాదాలనే శరణుకోరి వేడుకుంటున్నా! నీ పాదాలే శరణం తండ్రీ!
***
నాన్నా! ఎలా వున్నావు! వచ్చేశాం! ఓసారి చూడు నాన్నా! పొలం, ఇళ్ళు, డాక్యుమెంట్స్, బంగారం, స్థలాల తాలుకు డాక్యుమెంట్స్ – అవన్నీ ఏ బీరువాలో ఎక్కడ పెట్టావు? తాళాలు ఏవీ? వినబడుతోందా?
మాటలు వినిపిస్తున్నాయి! త. త. త. త. ల కింద తా..ళాలు.. పైకి రాక, తడబడిపోతున్నాయి మాటలు.
ముసలాడు ఏం చెప్పకుండా గుటుక్కుమంటాడేమో! తర్వాత యాతన! వినపడుతున్నాయి.
అరే! బాబీ! మీకేం తక్కువ చేశా! అడిగినంతా ఇచ్చా కదా!ఇంకా బాధేంటి? మీ కోసమేగా! సంపాదించి దాచా!
కళ్ళు విప్పలేక పోతున్నాడు. సన్నని ధ్వనులు. ఏంటీ.!
నేనెంత పాపిష్టి వాణ్ణి! మీనాక్షికి చేసిన అన్యాయం. నలుగురు పిల్లలతో తరిమేశా! రామూ, సూర్యా, రమ్యా, శేషూ.. నన్ను క్షమించండి. ఒక్కసారి కనిపించరా! రాక్షసుడిలా దిక్కులేనివాళ్ళని చేశా! కసాయి వాడిలా మీ అమ్మని కొట్టి తరిమేశా! సొమ్ములు తేలేదని పంపేశా. మన్నించి రండి. ఆఖరిచూపులో ఒక్కసారి మనసారా చూస్తాను. అ..ల..మ..టిం..చి..పో..తూ పలవరింతలు.. దిగులు.. బెంగ, దిగమింగలేక.. కక్కలేక.
అమ్మా.. విన్నావా. ఈయన చావు పలవరింతలు.. అన్నీ వాళ్ళ పరం చేస్తాడేమో! నోట్లో ఏవీ పొయ్యకండి. పోతాడు.. బతికితే మనసు మారితే. ఆస్తి మాయం కాగలదు!
సవితికొడుకు.. వుంచుకున్న భార్య. దండుకునే కొడుకు.. పావనగంగ తీర్ధం నోట్లో పొయ్యకుండానే హంస లేచిపోతూ.. గొంతులో గసగస. గుడగుడ. గుడ. కాళ్ళు తేల్తున్నాయి!..
పాపిష్టివాణ్ణి. మీనాక్షీ.. మీనాక్షీ! నోరెండిపోతోంది! గంగ. దా..హం.. నీళ్ళు.
***
తేల్తాయి. కాళ్ళు.. నువ్వు. తేలి, నాతో వస్తావు! తలుచుకో! నీళ్ళెవరు పోస్తార్రా నీకు! పోసేవారు గిట్టలేదుగా! అనుభవించు! నారాయణ. నారాయణ.. తల్చుకో!
***
చిన్నగా మాటలు!
ఏమండీ! మిమ్మల్నే! నా కాసుల పేరు, పలకసర్లు, చంద్రహారం, సూర్యహారం, మువ్వల వడ్డాణం, హారాలు.. దండవంకీలు. వెండి బంగారాలు ఎక్కడ దాచారో చెప్పండి!
ఆ.వవ. ఏవీ? వ.వ.వ.వస్తున్నా. ఆ.వ.లేంటీ?
చెప్పండి?ఎక్కడ.. వున్నాయో!
పది. సమయం మించిపోయింది!.
అయిపోయింది!
***
నా ఆయువు.. లాగుతున్నారెవరో? తేలి తేలి. పైకి. పైపైకి. గమనం అగమ్యగోచరం!
తెల్లని కాంతి వలయంలో! ఆకాశమార్గం! ప్రశాంత నభోమార్గం! సువిశాలమైన అంతంలేని.. ఆ గగన పయనం!
స్వచ్ఛమైన మెరిసే తెల్లని మార్గంపై నా గమనం.
కింద నా పిల్లలు, భార్యా కనిపిస్తూన్నా నిర్వికార నిరామయం.. వాళ్ళని పట్టించుకోకుండా నిశ్చల దృష్టి.. పైపైకి వెళ్తూ.. ఆగని పయనం.
ఎక్కడికో సడి,సవ్వడులు లేని నిశ్శబ్ధప్రయాణం! మనోహరం!
మనసులో ఎవరూ లేరు! నా మేని జాడ ఎక్కడ! రూపు లేని నేను నేను కాను.
శరీరం కింద భువిపై. కళేదీ? ప్రాణకాంతేది?
చుట్టూ ఎవరెవరో. వారికీ నాకు సుదూర సరళరేఖ. అందలేనంత.. అందనే అందనంత!
ఏ గుర్తులూ లేవు! భ్రమలు, నాది నాదనే భ్రాంతివలయం ఛేదించినట్లు ఉన్నా.
సుడిగుండంలా.. నావెంట సడులుసుడులుగా తిరుగుతూ పైపైకి. పయనం.. మనోదృష్టి.. దూరాన, తన తాలూకు.. అని భ్రమించిన వారి రూపు.. రేఖామాత్రంగా కనబడుతూ!
భ్రమల వలయరేఖలు. తిరుగుతూ, సుదూరతీరాలలో మాయమైపోతూ!!
***
హరి.. హరీ! ఇంకా వ్యామోహంలోనే మునిగి వున్నావా! లీలగా వినపడింది.
పరంజ్యోతి స్వరూపం. తల్చుకునే యోగం లేదు ఈ అల్పప్రాణికి!
మాయా మోహం! సంయమని ముఖంలో.. చిరు దరహాసం!
ఆకాశ మార్గంలో తేలియాడుతూ. ఓహో! నా సమయం మించిపోయింది! ఆహ్వానం అందుకున్నా! గానీ.. నా ఆత్మ నా ఇంటి ముందే సంచరిస్తుందేమిటి? వాళ్ళెవరూ నన్ను చూడడం లేదు!
మళ్ళీ పైకెళ్ళిన ఆత్మ. శూన్యం! తెల్లని గగన మార్గం! కాంతిపథం! తేజస్సుతో నిండిపోయి, ఏ రంగు లేని, చిన్న మబ్బు తునక కూడా లేని నభోవీధి గుండా. కింద నుండి పైకీ ప్రయాణమే!
అనంతవిశ్వం! అంతా శూన్యం! ఓహో! ఇదేనేమో మరణం! ఈ శూన్యం అద్భుతం!
శబ్ధాలు, సవ్వడులు ఏవీ! అన్నీసమాప్తమే!
నిశ్శబ్దం! పరమ ప్రశాంతం!నిశ్శబ్ద నీరవం!
నేను.. కాని ఈ.. ఆత్మకి.. ప్రసన్న దైవదర్శనం! ఇంక జీవాత్మ.. మోక్షదర్శనం! విశ్వేశు దర్శనం చేసుకోవాలి! పరమాత్మ కరుణా కటాక్షం!
దేవదేవుని.. దర్శనయోగం అంత సులభమా! దర్మదేవుని.. అదృశ్య.. అనుసరణ స్తుతి స్తోత్రాలతో ఆత్మసమర్పణ!
నమక.. నీరాజనం!
ఓం నమో నారాయణాయ! నమోనమః
ఓం నమశ్శివాయ! నమోనమః
ఓం నమో వాసుదేవాయ! నమోనమః
ధ్యానం. మాయ విడిపోయి పరమాత్ముని రూపం కనుల ముందు లీలగా.
ప్రశాంత ప్రసన్న వదనం. చల్లని చిరునవ్వు! ప్రేమపూరితమైన చూపులు! కరుణ మలయమారుతంలా!
ఆత్మ ముందు జ్యోతిస్వరూపం మాయం!
ఆ దివ్యతేజోమయ దర్శనం! ఆత్మని స్పృశించింది! జన్మ ధన్యం అయింది!
పరమేశా! నీ ఆహ్వానం అపురూపం!
***
అరే! గిరగిరా తిరుగుతూ కింద పడిపోతున్నానే! ఎక్కడికో.. అధోలోకమా. అంధకారం! భయంకరం!
ఇదేరా! రౌరవం పడు!!
పుణ్యం.. అయిపోయింది! న..ర..కం నువ్వక్కడే! అనుభవించాలి కర్మఫలం!
అనుభవిస్తూ దైవచింతనలో అలౌకిక ధ్యానం.. తపస్సు.. ముక్తిమార్గం లభిస్తుంది.
చిదానందరూపా.. శివోహం..శివోహం
వైకుంఠవాసా.. నమోస్తుతే
నమో.. నమో.. నారాయణాయ
ఓం నమో నమో నారాయణాయ
(జీవికి యమలోకపు. పాప.. కర్మల.. దండనానంతరం(అంత తేలికగా.. సులభంగా..) వైకుంఠవాసుని దర్శనం.. (అవుతుందో లేదో తెలియదు.. ఊహ మాత్రమే)
జననమరణ చక్రగమనంలో ఎన్నిజన్నలు జీవిని ఆశ్రయించుకుని వుంటాయో.. సృష్టి క్రమం, దైవానుగ్రహం.. ఇదేనేమో!
పరమాత్మ సృష్టి విలాసం! చిద్విలాసం!
(సమాప్తం)
