Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

గగనవీధుల్లో పతాకం..

[డా. మైలవరపు లలితకుమారి రచించిన ‘గగనవీధుల్లో పతాకం..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

భిన్నత్వంలో ఏకత్వం మన మతం
ఐకమత్యమే మన సిధ్ధాంతం
భారతీయతకు అదే మూలధనం
శాంతి అహింసలు ఆయుధములుగా
సత్యాగ్రహమే అంతస్సూత్రముగా
ధర్మచక్ర పరిభ్రమణం ఆదర్శంగా
అడుగులు కదిపిన నాయకుల
మార్గమే ఆదర్శముగా
నడిచింది సమస్త భరతజాతి
తెల్లవారను ముష్కరులను
దేశంనుండి తరిమికొట్టి
భరతమాత శతాబ్దాల
దాస్య శృంఖలాలను తెగనరికి
స్వేచ్ఛా భారతమును సాధించి
భాయీ భాయీ అంటూ
చేయీ చేయీ కలిపి
నవభారత నిర్మాణము గావించి
ఎర్రకోటపై ఎగిరే మువ్వన్నెల పతాక
గగనవీధుల్లో రెపరెపలాడగా
జై భారత్! జై హింద్! అను
జనావళి నినాదాలు
జగమంతా ప్రతిధ్వనించెను.

Exit mobile version