[శ్రీ పివిబి శ్రీనివాసరావు రచించిన ‘గగన సందేశం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక సాహితి ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 శ్రీ విశ్వావసు ఉగాది కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత.]
కొన్ని పలకని మాటలేవో దొర్లుతుంటాయి
లోలోపల..
కొన్ని నిశ్శబ్ద రహదారులు
ఏ పాదాలకో నిరీక్షిస్తుంటాయి
దారికిరువైపులా చెట్లు గాలిని మీటకుండా
ఏదో ఆగమనాన్ని అభిలషిస్తుంటాయ్
కలువకు ఏ సంకేతం అందిందో ఏమో
గింగిరాలు పోతోంది కొలను!
ఏ మౌని శృతి చేసుకున్న గానమో
చుక్కల పెనిమిటి
నిలువురాత్రిని మెత్తనిపాటతో తడిపేశాడు
దేవతలు తారాడుతున్నారో ఏమో
హృదయం ఎందుకో ఇంత బరువెక్కింది
నాతో మాట్లాడానుకుంటున్నారా
నాకు భాషేమీ లేదు
ఎక్కడ మీటినా పాటయే
హృదయం తప్ప!