[సన్నిహిత్ గారి ‘గాలిపటం’ అనే కథాసంపుటిని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]
ప్రముఖ రచయిత సన్నిహిత్ గారి తొలి కథాసంపుటి ‘గాలిపటం’. జయంతి పబ్లికేషన్స్ వారు ప్రచురించిన ఈ పుస్తకంలో 10 కథలున్నాయి. ఈ కథలన్నీ 2009-2017 మధ్య వివిధ ప్రింట్/ఆన్లైన్ పత్రికలలో ప్రచురితమైనవే.
‘జీవిత వాస్తవాలు.. శ్రీ సన్నిహిత్ కథలు’ అనే తమ ముందుమాటలో “ఓ రచయిత రచనలు చదివి అతని వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు. ‘గాలిపటం’ కథాసంపుటి లోని కథలు చదివినప్పుడు రచయిత శ్రీ సన్నిహిత్ గారిలో సమాజంలో జరుగుతున్న సంఘటనల పట్ల ఆవేదన, సమాజం ఎలా ఉండాలో చెప్పాలన్న ఆలోచన, అలా ఉంటే బాగుంటున్న ఆశావహ దృక్పథం మనకు కనిపిస్తాయి” అన్నారు ప్రముఖ కథా-నవలా రచయిత శ్రీ సి.ఎమ్. చంద్రశేఖర్. ఈ కథలు చదివాకా పాఠకులు ఆయన అభిప్రాయంతో ఏకీభవిస్తారు.
~
‘ఒకే గూటి పక్షులు’ కథలో ఎదుటి వాళ్ళు చేసే మోసాలు చూసి వాళ్ళని అసహ్యించుకున్న వ్యక్తి.. తాను చేసే తప్పులని కన్వీనియంట్‌గా.. తన తెలివితేటలుగా చెప్పుకుంటాడు. కానీ ఓ సందర్భంలో తప్పు చేస్తున్న కానిస్టేబుల్‌కి లంచమిచ్చి, అతని వ్యవహారశైలిపై వ్యాఖ్య చేయగా, ఆ కానిస్టేబుల్ అన్న మాటలతో.. తాను చేస్తున్న తప్పులు మదిలో మెదిలి మొదటిసారిగా సిగ్గుపడతాడు. ఆత్మవిమర్శ చేసుకుంటాడు.
మనుషులలోని ద్వంద్వ వైఖరులని గొప్పగా చెప్పిన కథ ‘గాలిపటం’. ఎటు ప్రయోజనం అనిపిస్తే అటు మొగ్గే వ్యక్తుల గురించి అల్లిన ఈ కథ సమాజంలోని కొందరి స్వభావాలను చాటుతుంది. విచక్షణ ఎంత అవసరమో చెబుతుంది.
కొడుకు కోడలు తనని పట్టించుకోకుండా నిరాశ్రయురాలిని చేస్తే, తన దారి తాను చూసుకుని, వాళ్ళకి దూరంగ ఓ ఆశ్రమంలో చేరిన ఆమె అనారోగ్యంతో చనిపోతుంది. తన అంత్యక్రియల అనంతరం కొడుక్కి ఇవ్వమని రాసి పెట్టిన సంచీ దొరికితే, ఆశ్రమ నిర్వాహకులు కొడుకుని పిలిచి ఆ సంచీని అందజేస్తారు. ఆ సంచీలో కొడుక్కి కావల్సినది దొరకటంతో పాటుగా, ఊహించని సలహా లభించి అతని అంతరంగాన్ని పరిశుద్ధం చేస్తుంది. ‘అమ్మ’ కథ కళ్ళు చెమరింపజేస్తుంది.
భార్యతో పని చేయించి ఆమె డబ్బుని వాడుకుందామనుకున్న పనిమనిషి రాజి మొగుడికీ, ప్రభుత్వోద్యోగి అయిన తన చేతే లోన్లు పెట్టించి, వాయిదాలు కట్టిస్తున్న భర్తకీ స్వభావంలో ఏమీ తేడా లేదని తెలుసుకున్న ఆమె – రాజికి ఇచ్చిన సలహానే తానూ పాటించి భర్త ఆలోచనని త్రీసిపుచ్చుతుంది. ‘ప్రాణమున్న ఏ.టి.ఎం’ కథ సంపాదన ఉన్నా ఆర్థిక స్వాతంత్ర్యం లేని స్త్రీల వేదనని చాటుతుంది.
కెరీర్లో పైకి ఎదగాలనే బలమైన స్వార్థం ఉన్న ప్రణీత్ – భార్యనీ, ఆమె ప్రేమనీ నిర్లక్ష్యం చేస్తుంటాడు. ఆఫీసులో తన లాంటి స్వభావమే ఉన్న కొలీగ్ బలమన్మరణం పాలవడంతో ప్రణీత్‌లో ఆలోచన మొదలవుతుంది. భార్యకి తనపై నమ్మకం కలిగేలా ఓ నిర్ణయం తీసుకుంటాడు ‘క్షమించు కళ్యాణీ’ కథలో.
జీవితమంటే మనకి తెలియదని, అది మన ఊహకు అందదని ‘కొడుకు’ కథ సూచిస్తుంది. తాను స్వార్థపరుడై ఉండి కూడా, ఎదుటివారిని స్వార్థపరులుగా భావించే విధాతకు ఓ రోడ్డు ప్రమాదం ద్వారా వాస్తవాలు అర్థమవుతాయి ఈ కథలో.
సమస్యలలో సాపేక్షతని గ్రహించిన వ్యక్తి – సానుకూల దృక్పథం అలవర్చుకున్న వైనాన్ని ‘బీ-పాజిటివ్’ కథ చెబుతుంది. భావోద్వేగాలపై నియంత్రణ లేని వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారో, తమని తాము అదుపులో ఉంచుకుని తార్కికంగా ఆలోచించే వ్యక్తుల నడవడి ఎలా ఉంటుందో ‘నిర్ణయం’ కథ చెబుతుంది.
ఎవరు గొప్పవాడు? ఏది గొప్పతనం అన్న ప్రశ్నలకు జవాబులు ఆన్వేషించే మేధావి కథ ‘గొంగళిపురుగు’. ఎన్నో తర్జనభర్జనల తర్వాత అంతరాత్మ మాటనే వింటాడు మేధావి.
ఎదుటివారు ఆశించినట్టుగా బతకటం చేతకాని వ్యక్తినని తనని తాను భావించుకునే సురేష్‌తో అభిప్రాయ భేదాల వల్ల అతని భార్య అతనికి దూరంగా వెళ్ళిపోతుంది. దగ్గరవ్వాలని వచ్చిన కొలీగ్ సుప్రియ ప్రతిపాదనని కాదంటాడు. ‘రైలుపట్టాలు’ భిన్నమైన కథ.
~
ఈ సంపుటిలోని కథలన్నీ చిన్నకథలే. వ్యక్తుల అంతరంగాలని సన్నిహితంగా చూసిన రచయిత అల్లిన కథలివి. పాత్రలు, సన్నివేశాలు మనకి పరిచయమున్నవే. కథల్లోని ఏదో ఒక సమస్యను మనం ఎదుర్కునో లేదా ఏదో ఒక పాత్రను మనం చూసో ఉంటాం. అందుకే ఇవి మన కథల్లా అనిపిస్తాయి. ఆసక్తిగా చదివింపజేస్తాయి.
***
రచన: సన్నిహిత్
ప్రచురణ: జయంతి పబ్లికేషన్స్, హైదరాబాద్.
పేజీలు: 96
ధర: ₹ 100/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
~
జయంతి పబ్లికేషన్స్, దిల్షుక్నగర్, హైదరాబాద్ 9399939302
~
సన్నిహిత్, 9490956012
కొల్లూరి సోమ శంకర్ రచయిత, అనువాదకులు. బి.ఎ.డిగ్రీతో గ్రాడ్యుయేషన్. మానవ వనరుల నిర్వహణలో పిజి డిప్లొమా చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.
సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి కథలను అనువదిస్తున్నారు. కేవలం కథలే కాక ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో’ అనే పిల్లల నవలను ‘కొంటెబొమ్మ సాహసాలు’ అనే పేరుతోను, ‘మాజిక్ ఇన్ ది మౌంటెన్స్’ అనే పిల్లల నవలను ‘కొండలలో వింతలు’ అనే పేరుతోను, వినయ్ జల్లా ఆంగ్లంలో రాసిన ‘వార్స్ అండ్ వెఫ్ట్’ అనే నవలని ‘నారాయణీయం’ అనే పేరుతోను, వరలొట్టి రంగసామి ఆంగ్లంలో రాసిన ‘లవ్! లవ్! లవ్!’ నవలను ‘సాధించెనే ఓ మనసా!’ పేరుతోనూ, అజిత్ హరిసింఘానీ రచించిన ట్రావెలాగ్ ‘వన్ లైఫ్ టు రైడ్’ను ‘ప్రయాణానికే జీవితం’అనే పేరుతోను, డా. చిత్తర్వు మధు ఆంగ్లంలో రచించిన ‘డార్క్ అవుట్పోస్ట్స్’ అనే స్పేస్ ఒపేరా నవలను ‘భూమి నుంచి ప్లూటో దాకా’ అనే పేరుతోనూ; అమర్త్యసేన్ వ్రాసిన ‘ది ఐడియా ఆఫ్ జస్టిస్’ అనే పుస్తకాన్ని, మరో నాలుగు పుస్తకాలను తెలుగులోనికి అనువదించారు. ‘దేవుడికి సాయం’ అనే కథాసంపుటి, ‘మనీప్లాంట్’, ‘నాన్నా, తొందరగా వచ్చెయ్!!’, ‘ఏడు గంటల వార్తలు’ అనే అనువాద కథా సంపుటాలను ప్రచురించారు.