Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఫస్ట్ లవ్-24

[శ్రీ ఎం. వెంకటేశ్వరరావు రచించిన ‘ఫస్ట్ లవ్’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[స్నేహితుడు రాజుకు పెళ్ళి కుదిరితే అతని పెళ్ళి బట్టల షాపింగ్ కోసం రాజు, సురేష్, కార్తీక్‍లు సెంట్రల్ మాల్‌కి వస్తారు. రాజుని బట్టలు సెలెక్ట్ చేసుకుంటూ ఉండమని, ఈ లోపు తామిద్దరం అలా తిరిగొస్తామని అంటారు. తనకి సెలక్షన్ పెద్దగా రాదని, వాళ్ళని కూడా తన వెంటే ఉండమంటాడు. ఇంతలో ఒక అమ్మాయి ఎవరో వెనక నుంచి వచ్చి కార్తీక్‍ని పలకరిస్తుంది. తిరిగి చూస్తే, ఆమె మేఘన. కాసేపు మాట్లాడుకుంటారిద్దరూ. మీరిష్టపడినా అమ్మాయి దొరికిందా అని మేఘన అడిగితే, లేదంటాడు కార్తీక్. పోస్ట్ గ్రాడ్యుయేట్ పానీపూరి సెంటర్ అక్కడ కనిపించడం లేదని మేఘన అడిగితే, అతనిప్పుడు .ఎన్.టి.యు సెంటర్ దగ్గర టిఫిన్ సెంటర్ ఓపెన్ చేశాడనీ, బాగా నడుస్తోందని చెప్తాడు. కాసేపు మాట్లాడుకుని ఎవరికి వారు వెళ్ళిపోతారు. హసంతి ఇంట్లో పెళ్ళి పనులు మొదలవుతాయి. వినాయకుడికి బియ్యం కడతారు. పసుపుకొమ్ములు పసుపుగా కొడతారు. ధృతి ఆమె ఫ్రెండ్ కలిసి శుభలేఖలకి పసుపు రాస్తారు. హసంతి మనసులో ద్వైదీభావం! గౌతమ్ ఓ వైపు, కార్తీక్ ఓ వైపు ఆమె మనసుని ఇబ్బందిపెడుతున్నారు. అంతరాత్మకి సమాధానం చెప్పుకోలేక అవస్థ పడుతుంది. కొద్ది సేపయ్యాకా, కవిత పైకి వచ్చి – రఘురాం మావయ్య, గౌతమ్ వస్తున్నారని, షాపింగ్‍కి వెళ్ళాలని, వాళ్ళని వెయిట్ చేయించొద్దు, తొందరగా కిందకి రమ్మని చెప్పి వెళ్తుంది. తన గదిలో గౌతమ్ శుభలేఖలన్నింటిని చింపి ముక్కలుగా చేసి, వాటి మధ్య కూర్చుని బాధపడుతుంటాడు, ఫోన్ మోగుతున్నా పట్టించుకోడు. అతని మిత్రుడు సుధాకర్ లోపలికి వస్తాడు. గౌతమ్‍ని ఆ పరిస్థితుల్లో చూసి బాధపడి,  విషయం అడిగితే, హసంతికి తనతో పెళ్లి ఇష్టం లేదనీ, ఆమె మరొకతని ప్రేమిస్తోందని తెలిసిందంటాడు. హసంతి నేరుగా నీతో చెప్పిందా అని అడుగుతాడు సుధాకర్. లేదంటాడు. అలాంటప్పుడు నింద వేయద్దని అంటాడు సుధాకర్. కార్తీక్ అనే కుర్రాడు బైక్ మీద తనని ఫాలో అయ్యి  – హసంతిని ప్రేమిస్తున్నట్టు, అతనికి ఆమెను వదిలెయ్యాలనీ, లేకపోతే తమ పెళ్లి జరగనివ్వనన్నాడని సుధాకర్‍కి చెప్తాడు. ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి పెళ్లి జరగనివ్వనని, ఛాలెంజ్ చేస్తే.. భయపడతావా అని అడిగి, ఇందులో హసంతి తప్పేముందని అంటాడు. చిరిగిన శుభలేఖలని చూపిస్తూ వీటిని ఇలా చూస్తే మీ నాన్న బాధపడతారు, ముందు వీటిని శుభ్రం చెయ్యి, తర్వాత కలుద్దాం అని చెప్పి వెళ్తాడు సుధాకర్. ఇక చదవండి.]

“అమ్మా! ప్లీజ్.. ఏదైనా మాట్లాడమ్మా! నువ్వు తప్ప నాకు ఎవరున్నారు? అమ్మా! నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? అమ్మా! మాట్లాడమ్మా!” ఏడుస్తూ అంది హసంతి.

“ఏం మాట్లాడమంటావ్? నువ్వు చేసిన దానికి బంధువులకి మొహం ఎలా చూపించేది? మీ నాన్న చనిపోతే మనల్ని ఆదరించి, నీకు చదువుకు సాయం చేసిన రఘురాం మామయ్యకి నేను ఎలా మొహం చూపించేదే? పాపిష్టిదానా? తండ్రి లేని పిల్లని తల్లికి సరిగా పెంచడం తెలియదని, అందరూ నా మొహం మీదే ఉమ్మేస్తారు! అదే కదా! నీకు కావాల్సింది. నీ గురించే నేను ఆలోచించాలి.. కానీ నా గురించి నీకేం బాధ లేదు” అని ఏడుస్తుంది.

“అమ్మా! అదేం లేదమ్మా! గౌతమ్ రాకముందే నేను కార్తీక్‌ని ఇష్టపడ్డాను. మనసులో కార్తీక్ నుంచుకొని, గౌతమ్‌కి భార్యగా నటించలేనమ్మా! ఈ పెళ్లి వల్ల గౌతమ్ కూడా నెమ్మదిగా ఉండలేడు. దయచేసి అర్థం చేసుకో!”

“గౌతమ్ లాంటి మంచివాడు మళ్లీ నీకు దొరుకుతాడా?! మా అన్నయ్యకి నా మొహం ఎలా చూపించాలో చెప్పు. రఘు మామయ్య ఎంత మంచివాడో నీకు తెలుసు”

“నిజమేనమ్మా! గౌతమ్ మంచివాడే. కానీ పెళ్లికి కావాల్సింది మంచితనం ఒక్కటే కాదమ్మా! నాకు రాబోయేవాడు ఎలా ఉండాలో.. నాకూ కొన్ని ఇష్టాలు ఉంటాయి కదమ్మా! 100% కాకపోయినా కనీసం కొన్ని అయినా..” అంది హసంతి ఏడుస్తూ.

“ఇలా ఏవో మాటలు చెప్పి నన్ను మార్చాలనుకుంటున్నావు. శుభలేఖలు కూడా వేయించాక, ఇప్పుడు ఇలా చెబితే, రఘు మామయ్యకి నేను ఎలా చెప్పాలి? నావల్ల కాదు! హాయిగా నేను చచ్చిపోతాను. ఆ తర్వాత నీకు ఇష్టం వచ్చిన వాణ్ణి చేసుకో” అని కవిత ఏడుస్తుంటే.

“అమ్మా! ఏంటమ్మా ఈ మాటలు. బయటి వాళ్ళకి నా మాటలు విచిత్రంగా ఉండొచ్చు. అర్థం కాకపోవచ్చు. నువ్వూ ఒక ఆడదానివే కదా! అమ్మా! నన్ను నువ్వు అర్థం చేసుకోకపోతే బయట వాళ్ళు ఎందుకు అర్థం చేసుకుంటారు. చెప్పమ్మా!” అని తల్లి ఒళ్లో తల పెట్టుకుని,

“ఎవరో, ఏదో, అనుకుంటారని ఆలోచించకుండా.. కన్న కూతురిని గురించి ఆలోచించమ్మా”

“ఈ మాట ముందే చెప్పొచ్చు కదా! అంతా అయిపోయాక నన్నేం చేయమంటావో చెప్పు” అంది కవిత.

“ఇలా జరుగుతుందని అనుకోలేదమ్మా! గౌతమ్ నాకు నచ్చాడా? లేదా? అని ఒక్కసారైనా అడిగారా? నేను చెప్పాలనుకున్నాను. ఎంగేజ్మెంట్ అయ్యేసరికి ఎలా చెప్పాలో.. తెలియలేదమ్మా!” అంది వెక్కివెక్కి ఏడుస్తూ.

“మరి ఇప్పుడు ఎందుకు వచ్చి చెప్తున్నావు? ఇప్పుడు నన్నేం చేయమంటావు? మీ నాన్న మనల్ని వదిలి వెళ్లి హాయిగా ఉన్నాడు! నాకే ఈ బాధలన్నీ”

“అమ్మా! అమ్మా!” అని కాళ్ళ మీద పడి ఏడుస్తున్న కూతురు తలపైకి ఎత్తి..

“హసంతీ! నీకు ఏది మంచిదనిపిస్తే అదే చెయ్యి. నువ్వు వెళ్లి నీకు నచ్చిన వాడినే పెళ్లి చేసుకో. ఇప్పటికిప్పుడు వెంటనే నేను అంగీకరించలేను. నువ్వు వద్దని చెబుతున్నది, నేను బలవంతంగా నీకు అంటగట్టలేను. మెల్లగా నేను మా అన్నయ్య దగ్గర చెప్తాను. ఆ తర్వాత ఏమైనా జరగనీ! నా తలరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. నువ్వు వెళ్ళిపో!” అని హసంతిని లేవదిదీసింది

వెళ్ళటానికి సిద్ధపడ్డ హసంతితో  “జాగ్రత్త” అంది.

హసంతి బయలుదేరింది.

***

“హసంతీ! ఏంటి గది నుంచి బయటికి రావా?” కింది నుంచి పిలిచింది తల్లి.

‘ఛ! ఇదంతా కలా!? అమ్మో అమ్మకి చెప్తే ఇంకేమన్నా ఉందా? చంపేస్తుంది. వద్దు చెప్పను. ఏం జరిగితే అది జరుగుతుంది. గౌతమ్ దగ్గరికి వెళ్తున్నానని చెప్పి ముందు బయటపడాలి’ అనుకొని కిందికి దిగింది.

“ఏంటి హసంతీ! ఎక్కడికి బయలుదేరావు?”

“గౌతమ్ ఫోన్ చేశాడమ్మా! నిన్న తీసుకున్న డ్రెస్సులు మరోసారి చూద్దాం రమ్మన్నాడు. వెళ్తున్నాను.”

“జాగ్రత్తగా వెళ్ళిరా!” అంది కవిత.

బయటకు వచ్చింది హసంతి.

***

ఆటో ఎక్కిన హసంతి ఆలోచనలు వేగంగా వెళుతున్న ఆటోతో పోటీపడి పరిగెత్తుతున్నాయి.

‘కార్తీక్ అమెరికా వెళ్ళిపోతున్నాడా?! ప్రేమించిన వాడు వెతుక్కుంటూ వస్తే, కనీసం ఆప్యాయంగా పలకరించలేని దుస్థితి తనది. అతను కనిపించినప్పుడల్లా చిరునవ్వుతో స్వాగతించకుండా, ఆవేశంతో, దుఃఖంతో మాట్లాడితే అతను మాత్రం ఏం చేస్తాడు? కార్తీక్‌ని కలిసి పరిస్థితి వివరించి ఆప్యాయంగా పలకరించాలి. అతనిని హగ్ చేసుకోకపోయినా పర్వాలేదు.. హర్ట్ చేసినందుకు మన్నించమని కోరాలి. ఇప్పుడు నాకున్న ఒకే ఒక ఆప్షన్ గౌతమ్. ముందు గౌతమ్ దగ్గరకి వెళ్లి విషయం చెప్పి కన్విన్స్ చేయాలి. కార్తీక్ దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పాలి’.

“మేడం వచ్చేసాం.” అని ఆటో అతను చెప్పేసరికి, ఆలోచనలో నుంచి బయటికి వచ్చి ఆటో ఫేర్ చెల్లించి గౌతమ్ వాళ్ళ ఇంట్లోకి వచ్చింది.

గౌతమ్ గది తలుపు దగ్గరగా వేసుంది.

“గౌతమ్” అని పిలిచింది. లోపలికి తొంగి చూసింది.

అంతే! ఆశ్చర్యపోయింది.

చింపి పోసిన వెడ్డింగ్ కార్డ్ ముక్కల మధ్య కూర్చున్న గౌతమ్‌ని చూసేసరికి మనసంతా విలవిలలాడింది.

‘అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ, చిన్నప్పుడు ఎప్పుడో తల్లి చెప్పిన ఒక్క మాట పట్టుకుని, నా గురించి ఇంత మనో వేదన భరించడం గౌతమ్‌కి అవసరమా?’ అనుకుంది.

“గౌతమ్” అంది.

తలపై పెత్తి “వచ్చావా హసంతీ! రా! ఎలా ఉన్నానో చూసిపోదామని వచ్చావా?”

“ఏంటీ పిచ్చి పని?” అంది.

“అంతా పిచ్చే! నేను పిచ్చి. నా ప్రేమ పిచ్చి. నువ్వు ఇష్టపడ్డ కార్తీక్‌ని పెళ్ళి చేసుకుని వెళ్ళిపో! ప్లీజ్.. లీవ్ మీ అలోన్”

వేగంగా గౌతమ్ దగ్గరికి వెళ్లి చేయి పట్టుకుని “గౌతమ్ నన్ను కార్తీక్ దగ్గరికి ఒకసారి తీసుకెళ్తావా! ప్లీజ్! నువ్వు నాకోసం చిన్నప్పటి నుంచి ఎన్నో చేశావు. నేను అడిగింది ఏదీ కాదనవు కదా! జీవితంలో ఇంకెప్పుడూ ఏమీ అడగను. ప్లీజ్ వెళదాం రా! నన్ను కార్తీక్ దగ్గరికి తీసుకెళ్ళు” అంది.

అంత బాధలోనూ విరక్తిగా నవ్వాడు గౌతమ్.

“ఎక్కడికి?”

ఎక్కడికి తీసుకెళ్లాలో చెప్పింది.

“పద నిన్ను నువ్వు ఇష్టపడ్డ కార్తీక్‌కి అప్పగించి, నేను నెమ్మదిగా అమెరికా వెళ్ళిపోతాను.”

“థాంక్యూ నన్ను గౌతమ్! అర్థం చేసుకున్నందుకు, నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో, తెలియడం లేదు”

హసంతి టైం చూసింది. ఇప్పుడు బయలుదేరిన వెళ్ళినా వెళ్లేసరికి రెండు అవుతుంది. కారు వేగంగా వెళుతోంది. ఇద్దరి మధ్య మౌనం.

“ఎంట్రన్స్ లోనే.. వెయిట్ చేద్దాం గౌతమ్” అంది.

హసంతి కిందికి దిగి ధృతి దగ్గర తీసుకున్న కార్తీక్ మొబైల్‌కి కాల్ చేసింది.

“హలో కార్తీక్! నేను హసంతిని. ఎక్కడున్నావ్?”

“నీకు అందనంత దూరంలో”

“నిన్ను అందుకోవడానికి వచ్చాను. చెప్పు కార్తీక్, నిన్ను చూడాలి, కలవాలి, నీతో మాట్లాడాలి.”

“హసంతీ! ఇది సినిమా కాదు. జీవితం”

“డైలాగులు వద్దు కార్తీక్! ముందు ఎక్కడున్నావో చెప్పు”

“ఇంకో పది నిమిషాల్లో ఎయిర్‌పోర్ట్‌లో ఉంటాను. నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను”

“నేను నీకోసం, నీకు దగ్గరగా వచ్చేసాను”

“నిన్ను కలవటం నాకు ఇష్టం లేదు.”

“నిన్ను కలవటమే నాకు ఇష్టం”.

“నీ జ్ఞాపకాలు ఎప్పుడూ నాలో బతికే ఉంటాయి. అవి చాలు నేను బతకడానికి” అని ఫోన్ కట్ చేశాడు.

ఆ తర్వాత రెండు సార్లు ప్రయత్నించినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు కార్తీక్.

(ముగింపు వచ్చే వారం)

Exit mobile version