[డా. కందేపి రాణీప్రసాద్ గారి ‘ఫెదర్‌డేల్ సిడ్నీ వైల్డ్ లైఫ్ పార్క్’ అనే రచనని అందిస్తున్నాము.]
ఆస్ట్రేలియా ఖండం మొత్తం ఒక దేశంగా పరిగణిoపబడుతున్నది. కొద్ది రోజుల క్రితం ఆస్ట్రేలియా దేశాన్ని చూడటానికి వెళ్ళాం. మాకు కేవలం నాలుగైదు రోజులే ఉండటం వల్ల సిడ్నీ నగరం మాత్రమే చూడాలని అనుకున్నాం. ఆస్ట్రేలియా ఖండం చుట్టూతా నీళ్ళతో ఆవరింపబడి ఉండటం వల్ల ఈ దేశం మిగతా ప్రపంచానికి దూరంగా ఉన్నది. ఇక్కడ ఉండే జంతు, వృక్ష జాతులు సైతం వైవిధ్యంగా ఉంటాయి. కేవలం ఈ ఖండంలో తప్ప మరెక్కడా జీవించలేని జాతులు చాలా ఉన్నాయి. పసిఫిక్ మహా సముద్రం ఆస్ట్రేలియా ఖండాన్ని చుట్టు ముట్టి ఉన్నది. యాభైవేల సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియాకు వచ్చిన తొలి మానవులను అబోరిజన్స్ అంటారు.
ఆస్ట్రేలియా ఉన్నిని అధికంగా ఉత్పత్తి చేస్తుంది. పోలాల్లో ఎక్కడ చూసినా గొర్రెలు కనిపిస్తాయి. ఇంకా ఆల్పైకా అనే జంతువుల్ని కూడా ఉన్ని కోసమే పెంచుతారు. ఇవి కూడా పొలాల్లో గడ్డి మేస్తూ కనిపిస్తుంటాయి. గుర్రం సైజు కన్నా చిన్నగా, గొర్రెల కన్నా పెద్దగా కనిపిస్తాయి. దీనిని ‘ఒంటె క్షీరదం’ అంటారు. మేము కాఫీ కోసం ఒక చోట ఆగినప్పుడు పక్కనున్న పొలాల్లో ఈ అల్పైకా జంతువులు కనిపించాయి. వీటి పేరేమిటని అడిగినప్పుడు మా కోచ్ డ్రైవర్ జూన్ ‘అల్పాకా’ అని చెప్పాడు. వీటి శరీరం నుండి ఉన్నిని కత్తిరిస్తారట. ఆ తర్వాత మేము ఉన్నిదుస్తుల దుకాణాలలో చూసినప్పుడు అల్పాకా ఫర్ తో చేసిన ఎన్నో దుస్తులు కనిపించాయి. డోర్ మాట్లు, స్వెటర్లు, టోపీలు వంటి దుస్తులు చలి నుంచి రక్షణ కలగడానికి ఎన్నో కనిపించాయి. అల్పాకా ఫర్ చాలా సున్నితంగా పట్టుకుంటే మెత్తగా అన్పించింది. ఈ అల్పాకా ఉన్నితో చేసిన రగ్గులు, స్వెట్టర్లు ఖరిదైనవిగా ఉన్నాయి.
ఆస్ట్రేలియా పేరు చెప్పగానే మొదటగా గుర్తుకొచ్చే జంతువులు కంగారూలు. జంతు జాతి లోనే కంగారులది ఒక ప్రత్యేకమైన జాతిగా చెప్పుకోవచ్చు. బిడ్డ పుట్టాక తన పొట్ట సంచిలో పిల్లల్ని పెట్టుకుని పెంచుతుంది. ముందుకాళ్ళు పొట్టిగా, వెనకకాళ్ళు పొడవుగా ఉండటం వలన వీటి నడక గమ్మత్తుగా ఉంటుంది. స్టష్టిలో ఈ జంతువులకు అమర్చబడిన పొట్ట సంచి తన పిల్లల కోసం ప్రకృతి చేసిన ఏర్పాటు. కంగారులను చూడాలనీ వాటిని దగ్గరగా చూడాలనీ ఆస్ట్రేలియా వెళ్ళిన ప్రతివారి కోరిక.
మేము కూడా ఆస్ట్రేలియా దేశంలో అడుగు పెట్టగానే కంగారుల కోసమై కళ్ళు వెదికాయి. ఇంకా ఈ దేశానికే పరిమితమైన కోలాలు, ఒంబుట్లు, ఎకిడ్నాలు, ప్లాటిపస్, డింగోలు, మార్సూపియాల్లు, ఆక్టోపస్‌లు, ఈము పక్షులు వంటి జంతువులున్నాయి. టాస్మానియాన్ పులి ఈ ఖండంలో 1936 లోనే అంతరించిపోయిన అతి పెద్ద మాంసాహార జంతువు. ప్రస్తుతం అంతరించిపోతున్న దశలో ఉన్న ‘మచ్చల కుల్’ అనే అతి పెద్ద మాంసాహార మార్సూపియాల్ జంతువు.
మేము సిడ్నీ నగరం లోని డూన్ సైడ్ ప్రాంతంలోని ‘ఫెదర్‌డేల్ వైల్డ్ లైఫ్’ పార్కును చూడటానికి వెళ్ళాము. ఉదయం టిఫిన్ తినగానే నోవాటెల్ హోటల్ నుంచి ఒక కోచ్‌లో కిల్డేర్ రోడ్ లో ఉన్న పార్కును చూడటానికి బయల్దేరాము. వాతావరణం అత్యంత శీతలంగా ఉన్నది. వర్షం చినుకులు పడుతునే ఉన్నాయి. ఇక్కడ ఆస్ట్రేలియాలో ‘మోనార్డో సఫారీ పార్క్’ చాలా పెద్ద సఫారీ ఉన్నది. ఉప్పునీటి మొసళ్ళు, పెంగ్విన్లు, క్వాక్కాలు, కంగారూలు, లారి కీట్లు వంటి ఎన్నో రకాలున్నాయి.
ఫెదర్‌డేల్ పార్కుకు చేరేసరికి వర్షం బాగానే పెరిగింది. టికెట్ తీసుకునేటప్పుడు కంగారూలకు తినిపించటానికి కావాల్సిన మేతను ఒక పేపర్ గ్లాసులో ఇచ్చారు. ఏడు ఎకరాల స్థలంలో ఉన్న ఫెదర్‌డేల్ సిడ్నీ వైల్డ్ లైఫ్ పార్కులో 2600 పైగా అస్ట్రేలియన్ జాతులు ఉన్నాయి. ఈ జంతువులలో అరవై జాతులకు పైగా అంతరించి పోయే దశలో ఉన్నాయి. వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉన్నది. అలాగే ‘కోలా’ జంతువుతో ఫోటో తీయించుకోవటానికి ఆస్ట్రేలియన్ డాలర్లు కట్టి రశీదు తీసుకున్నాము. సహజ వాతావరణం సృష్టించబడి ఉన్నది.
‘ఫాస్కో లార్క్ట్ స్ సినేరియన్’ అనే శాస్త్రీయ నామం కలిగిన కోలా జంతువును చూడటానికి, పోటో తీయించుకోవడానికి లైనులో నిలబడ్డాo. ఇదొక చిన్న ఎలుగుబంటి లాగా ఉన్నది. ఇంకా చెప్పాలంటే పిల్లలు ఆడుకనే టెట్టిబేర్ వలే ఉన్నది. ఇది ఆస్ట్రేలియాకు మాత్రమే చెందిన క్షీరదాలు. ఇది మార్సూపియల్ తరగతికి చెందిన శాకాహరులు. దీనిని కోతి ఎలుగుబంటి, చెట్టు ఎలుగుబంటి అని కూడా పిలుస్తారు.
కోలా ఫోటోలకు బాగానే ఫోజులిస్తోంది. గానీ మా వంతు వచ్చేసరికి దానికి నిద్ర ముంచుకొచ్చేసింది. కదిలించినా ఎక్కువగా కదల్లేదు. వెనక కాళ్ళతో చెట్టు కొమ్మను బలంగా పట్టుకుని కునుకు తీస్తోంది. కాళ్ళ భాగం దగ్గరే పట్టుకోమన్నారు. తల భాగాన్ని ముట్టుకుంటే శత్రువులా బాధిస్తుందట. అందువలన జాగ్రత్తగా పట్టుకొని ఫోటో, వీడియో తీసుకున్నాం. నేని కోలా పేరును అంతకు ముందెన్నడూ వినలేదు. కోలాలు చాలా ముద్దుగా అమాయకంగా ఉన్నాయి. బూడిదరంగు శరీరంతో ‘ఫాస్కోలారిక్డిడే’ కుటుంబానికి చెందిన ఏకైక జీవి ‘కోలా’.
ఆస్ట్రేలియా దేశంలోని ‘న్యూ సౌత్ వేల్స్’ రాష్ట్రంలోని రాజధాని నగరం సిడ్నీ. బాతు ముక్కు లాంటి ముక్కుతో ఉండే ప్లాటిపస్ లు కూడా ఇక్కడ జీవిస్తాయి. ఇవి విషపూరితమైనవి. ఇవి ఆర్నితోరింకిడే కుటుంబానికి చెందిన క్షీరదాలు. కానీ గుడ్లు పెడతాయి పిల్లల్ని కనవు. న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర జంతువు ప్లాటిపస్. దీని కాలి వేళ్ళు ఒక దానికొకటి అతుక్కుని నీటిలో నివసించే జంతువుల్లా ఉంటాయి.
డింగో అనే అడవి కుక్కలు కంగారూలను వేటాడే జంతువులున్నాయి. ఈ అడవి కుక్కలు ఆస్ట్రేలియాలో కనిపించే పురాతన వంశపు కుక్కలు. దీని శాస్త్రీయనామం ‘కానిస్ ఫెమిలిరియాసిస్’ ఆస్ట్రేలియాలో నివసించే అతి విష పూరితమైన పాములున్నాయి. “సుడోనాజా టేక్టైలిన్” అనే తూర్పు గోధుమ పాములు ఆస్ట్రేలియాలో నివసించే జాతి అలాగే దక్షిణ ఆస్ట్రేలియాకు చెందిన టైగర్ స్నేక్‌లు కూడా అత్యంత విషపూరిత జంతువులు, ఇది చెట్లు ఎక్కుతాయి. నీటిలో ఈదుతాయి. ఎర్రటి పొట్ట తో నల్లపాములు కూడా ఇక్కడ జీవించే విషపూరిత పాములు. ఇవి తూర్పు ఆస్ట్రేలియాలో ఉంటాయంట.
పొడువైన తోకతో శిశుకోశాన్ని కలిగిన క్షీరదాలు. ఆస్ట్రేలియా, న్యూగినియా, టాస్మానియా దేశాలలో విస్తరించి ఉండే జంతువులు కంగారూలు. ఇకా శాకాహార జీవులు మా చేతికిచ్చిన ఆహారం తీసుకొని కంగారూ కేజ్ దగ్గరకు వెళ్ళాము. ఆహారం చూపించగానే దగ్గరకు వచ్చాయి. చేతిలో ఆహారం పెట్టుకుని వాటికి చూపించగానే వాటి ముందు కాళ్ళు పైకెత్తి నా చేతిని పట్టుకొని తినడం మొదలు పెట్టాయి. వీటి నడక గెంతుతూ గమ్మత్తుగా ఉంటుంది. వీటి తోకను కంగారూకున్న ఐదవ కాలుగా పేర్కోంటారు. కొన్ని కంగారలు బయటికొచ్చి మరీ మా చేతి లోని ఆహారాన్ని తిన్నాయి. ఆహారం అయిపోగానే వెళ్ళిపోయాయి. ఇవి చాలా చిన్న కంగారూలు. ఇది గోధుమ రంగులో ఉన్న మార్సూపియర్ జాతులు.
ఎరుపు ముదురు ఆకుపచ్చ రంగు శరీరంతో ఉండే రామచిలకలు ఉన్నాయి. పసుపు పచ్చ తోకలు, నీలం రంగు తల, నారింజ రంగు ముక్కుతో ఉండే లారికీట్లు, వైట్ వింగ్ డ్ చౌ, రెయిన్ బో లారికీట్లు, నల్లటి శరీరం గలిగిన రామచిలుకలు, లాంఫింగ్ కూకాబుర్రా, బఫ్ బాండెడ్ రెయిల్, గ్రేటర్ బ్లూ బానెట్, వంటి రకరకాల రామచిలుకలు ఉన్నాయి. మూరెడు ముక్కుతో తెల్లని రంగుతో ఉన్న పక్షులు పంజరాలకు బయటనే తిరుగుతున్నాయి. పసుపు రంగు, నలుపు రంగులతో మిశ్రితమై ఉన్న చిన్న పిట్టలు నేలమీదనే నడుస్తూ వచ్చిన వారిని అలరిస్తున్నాయి. వాటికి గింజలు పెడదామని చేయి చాచాను. దాని ముక్కుతో పొడిచేసరికి వేలుకు సూది గుచ్చుకున్నట్లుగా గుచ్చకుంది. ఇంత వాడిగా ఉంటాయని అనుకోలేదు.
కేవలం ఆస్ట్రేలియాలో మాత్రమే నివసించే ‘ఓంబుట్లు’ ఉన్నాయి. ఇవి గోధుమ రంగు బూడిద రంగు వెంట్రుకలను కలిగి ఉంటాయి. ఇవి మనుషుల మీద దాడి చేస్తుంటాయి. ఇవి కూడా ‘కోలా’ లతో పోలికలు కలిగి ఉంటాయి. బొరియలు తవ్వి జీవించే క్షీరదాలలో ‘ఓంబుట్లు’ పెద్ద ఆకారంతో ఉంటాయి. పాత రాతి చిత్రకళల్లో ఈ జంతువు బొమ్మలు కనిపించినట్లుగా ఆధారాలున్నాయి. ఇవి ఎలుకల వలె ముందు పళ్ళతో బొరియలు తవ్వుతాయి.
ఆస్ట్రేలియా జాతీయ పక్షి అయిన ఈము కూడా ఈ పార్కులోన ఉన్నది. నిప్పుకోడి జాతికి చెందిన పక్షి ‘ఈము’. ఈము అనే పేరు అరబిక్ నుంచి గానీ పోర్చుగీసు నుంచి గానీ వచ్చి ఉండవచ్చని నమ్ముతారు. ఈ పక్షులు ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉన్న అతి పెద్ద ఆకారపు పక్షులు. ఈ పక్షి ఎగరలేని పక్షి. ఈ పక్షులు గోధుము పంటలను బాగా నాశనం చేస్తాయి. ఈ పక్షుల్ని ఆహార వనరుగా వినియోగిస్తారు. ఈము పక్షుల ఈకలతో అనేక అలంకార వస్తువులు తయారుచేస్తారు.
వాన చినుకుల మధ్య చల్లని చలి గాలుల మధ్య మేము ఫెదర్‌డేల్ సిడ్నీ వైల్డ్ లైఫ్ పార్కును తడుచుకుంటూ చూశాం. మా వస్త్రాలన్నీ తడిచి పోయాయి. రకరకాల రామ చిలుకల్ని, అనేక ఆస్ట్రేలియన్ జంతువుల్ని చూశాము. నేను డిగ్రీ చదివేడప్పుడు చదివిన జంతువుల పేర్లన్నీ ఇక్కడ కనిపించాయి. చాలా జంతువులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. మేము సిడ్నీలో చూసిన జంతువులు ఇవి.
డా. కందేపి రాణీప్రసాద్ MA, MSc, PHD, బాల సాహితీ వేత్త, కవయిత్రి, అనువాదకులు, చిత్ర కళాకారిణి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. రాణీ ప్రసాద్ ఆర్ట్ పేరుతో హాస్పిటల్ వేస్ట్‌తో 4000 బొమ్మలను సృష్టించారు. బాల సాహిత్యంలో 48 పుస్తకాలు రచించారు. ‘తెలుగు బాల సాహిత్యంలో సైన్స్ రచనలు’ అనే అంశంపై నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. తెలుగు విశ్వ విద్యాలయంలో బాల సాహిత్య కీర్తి పురస్కారాన్ని నెలకొల్పారు. మిల్కీ మ్యూజియం, స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీ లను తమ ఆసుపత్రిలో పిల్లల కోసం నిర్వహిస్తున్నారు. తమ సొంత ఆసుపత్రిలో ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద పిల్లల కోసం తెలుగు పాట, బొమ్మ పెట్టి ప్రింట్ చేస్తున్నారు. సైన్సు, యాత్రా సాహిత్యం విరివిగా రాస్తున్నారు. కళాభారతి, కవిత వాణి, చిత్ర కళారాణి అనే ఎన్నో బిరుదులను, 6 వరల్డ్ రికార్డ్స్నూ సొంతం చేసుకున్నారు.