[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన వసుంధర గారి ‘ఫ్యామిలీ స్టార్’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
మనసుకి చంచలత్వం సహజం. కోరికలు గుర్రాలవడం సహజం.
వాటిని అదుపు చెయ్యడానికి మనిషి విలువల్ని సృష్టించుకుని, నియమాల్ని విధించుకున్నాడు.
కొందరిలో ధనమదం, అధికారమదం కల్గించే అహంకారం. కొందరిలో అజ్ఞానం, అమాయకత్వం వల్ల కలిగిన అసహాయత.
ఆ కారణంగా వారు విలువలకు ప్రాధాన్యమివ్వకపోవచ్చు. నియమాలు పాటించకపోవచ్చు. కానీ అందువల్ల జీవితంలో వారు పెద్దగా నష్టపోయేదీ ఉండకపోవచ్చు.
నష్టపోతే వారిది మధ్యతరగతి అన్నమాట! మనోచాంచల్యాన్నీ, కోర్కెల పరుగుల్నీ క్రమశిక్షణతో అదుపు చెయ్యకపోతే – వారి జీవితాలు తెగిన గాలిపటాలౌతాయి.
మామూలుగా మధ్యతరగతిలో క్రమశిక్షణ ఎక్కువే. కానీ వయసు కల్పించిన మోహావేశాల ప్రభావంతో –వారిప్పుడు తెగిన గాలిపటాలు కావడానికి సంకోచించడం లేదు.
అందుకు నేనే ఒక ఉదాహరణ.
ఇంజనీర్‌ని. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని. సంప్రదాయం ఆధునిక మహిళ స్వేచ్ఛకి ప్రతిబంధకమని నమ్మేదాన్ని.
నాలో విప్లవభావాలున్నాయి. కానీ అవి స్వార్థానికే తప్ప, సమాజోద్ధరణకి మాత్రం కాదు. ఆ విధంగా ఆధునికతలో నాది మధ్యతరగతి అనొచ్చు.
నాకు మధ్యతరగతే సబబు. ఎందుకంటే –
మనది అనాదిగా పతివ్రతల దేశం.
వేల సంవత్సరాల క్రితమే ఇల్లాలికి క్షణమాత్రపు చిత్తచాంచల్యాన్ని మహాపాపంగా అభివర్ణించిన దేశం.
ఉదాహరణకి ప్రస్తుతం నడుస్తున్న వైవస్వత మన్వంతరంలో సప్తర్షుల్లో ఒకడైన జమదగ్నినే తీసుకుంటే- ఆయన భార్య రేణుకాదేవి మహాపతివ్రతగా ప్రసిద్ధి చెందింది. అవతార పురుషుడు పరశురాముణ్ణి కన్న మహద్భాగ్యం ఆమెది. అటువంటి పుణ్యశీలికి మరణశిక్ష విధించాడు భర్త జమదగ్ని. కారణం – ఆమె గంధర్వుల జలకేళిని క్షణమాత్రం ఆసక్తికరంగా చూడడం!
అలాంటప్పుడు నా సంగతేమిటి?
క్షణమాత్రమేమిటి – నా భర్త శశి దగ్గరైనప్పుడల్లా నాకు రిషి గుర్తుకొస్తాడు.
రిషి నా చైల్డ్‌హుడ్ క్రష్.
తప్పు నాదనిపించదు. అందుకు నా కారణాలు నాకున్నాయి.
శశి రెండుమూడేళ్లకోసారి ఉత్తరాదిలో ఓ యోగాశ్రమానికి వెళ్లి రెండు వారాలుండి వస్తాడు.
మనసు శుద్ధి కావడానికని అడక్కుండానే సంజాయిషీ ఇస్తాడు.
నిజమే కావచ్చు. కానీ అపనమ్మకమో ఏమో, నాకు మాత్రం తేడా కొడుతుంది.
ఐనా శశిని నిలదియ్యను. ఎందుకంటే – ఏ మాటకామాటే చెప్పుకోవాలి. శశి నామీద ఎలాంటి ఆంక్షలూ పెట్టలేదు. దేనికీ నన్ను నిలదియ్యలేదు.
అలాగని శశిని ఉదాత్త పురుషుడనుకోను. ‘ఇస్తినమ్మా వాయనం, పుచ్చుకుంటినమ్మా వాయనం!’ అనుకుంటాను.
అసలు మా పెళ్లే ఓ విచిత్రం.
అమ్మాయే స్వయంగా ఓ అబ్బాయిని ఇంటికి తీసుకొచ్చి, మొగుడని పరిచయం చేస్తే – మారు మాట్లాడకుండా అక్షింతలేసి దీవించడమే పెద్దరికం అనుకునే ఈ రోజుల్లో కూడా –
మేము పరస్పరం ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు.
పెద్దలమధ్య వ్యాపారసంబంధాలే, మా వివాహబంధానికి దారితీశాయి.
అలాగని మా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి విముఖతా లేదు.
ఇంట్లో ఎప్పుడూ గొడవ పడలేదు. కలిసి బయటికొస్తే చూపరులు కళ్లప్పగించి చూసే జంట మాది!
మా కాపురానికిపుడు ఐదేళ్లు. వయసు, వరస, ఏకాంతం – ఈ మూడింటి ప్రోత్సాహంతో కొంచెం యాంత్రికంగానే ఐతేనేం – మా దాంపత్య జీవితానికీ ఐదేళ్లు.
మాకింకా పిల్లలు లేరు. కారణం – ఏకాంతంలో మేము మనస్ఫూర్తిగా ఒకరికొకరు సహకరించేది, పిల్లల్ని వాయిదా వెయ్యడంలోనే!
ప్రస్తుతం శశి ఆశ్రమానికని బయల్దేరాడు. పెళ్లయ్యేక తనిలా వెళ్లడం మూడోసారి.
మొదటిసారి వెళ్లినప్పుడు- నా జీవితానికి ఆగస్టు పదిహేను వచ్చిందనిపించింది. ఫ్రెండ్సుతో సప్తాహం చేసుకోవాలనుకున్నాను.
ఒకో రోజు ఒకో ఫ్రెండు ఇంట్లో.
టాపిక్- మొగుళ్లు, మొగాళ్లు,
వాళ్లమీద జోక్సు బోలెడు, వాటిలో ఎక్కువ బోల్డు.
భలే వినోదం!
శశి వెనక్కి వస్తే, అరే అప్పుడే వచ్చేశాడా అనిపించింది.
శశి రెండోసారి యోగసాధన పేరిట వెళ్లినప్పుడు- ‘ఈసారి రెండు వారాలుండి రా’ అన్నాను.
‘ఎందుకు?’ అన్నాడు శశి అదోలా.
‘తిరిగొచ్చేక నీలో కొత్త ఉత్సాహం చూశాను. రెండు వారాలైతే మరింత..’ ఆగిపోయాను.
అబద్ధాలు కొత్త కాదు కానీ, ఎప్పుడాడినా నాకు గొంతు పట్టేస్తుంది మరి!
ఈసారి ఫ్రెండ్సుని ఇళ్లలోకాక క్లబ్బులో కలవాలనుకున్నాను.
రోజూ క్లబ్బులో పేకాట.
అదో నిషా. డబ్బొచ్చినా పోయినా పెరిగిపోయే కసి.
ఇంటికెళ్లేక రాత్రంతా కలలో పేకముక్కలే తిరిగేవి. మెదడు బరువెక్కేది.
రెండు వారాల తర్వాత బేరీజు వేస్తే నష్టపోయింది పదకొండువేలు.
అది నాకు మరీ ఎక్కువేం కాదు. కానీ నాకు లభించిన వినోదంతో పోలిస్తే, నష్టమే ఎక్కువనిపించింది.
ఉసూరుమనిపించింది. ఐనా క్లబ్బు కొనసాగించేదాన్నేమో – శశి వచ్చెయ్యకపోతే!
మనసులో మాత్రం అనుకున్నా- అదేపనిగా పెట్టుకుంటే- నా మనస్తత్వానికి క్లబ్బు, పేకాట సరిపడవని!
ఈసారి శశిలో నిజంగానే కొత్త ఉత్సాహం చూశాను. ఐతే అది కావాలని తెచ్చిపెట్టుకున్నట్లుంది.
కారణం ఊహించగలను. బయటపడడు కానీ, శశికి నానుంచి మెప్పు కావాలి.
మొదటి ట్రిప్పు తర్వాత మెప్పు లభిస్తే, సీరియస్‌గా తీసుకుని రెండో ట్రిప్పు రెండు వారాలు చేశాడు.
ఇలా అనుకుంటున్నానా – నాకు వేరే అనుమానాలు కూడా ఉన్నాయి.
ఒకటి- తనకి ట్రిప్పులు నచ్చుండొచ్చు.
రెండు- తరచుగా ట్రిప్పులు వెయ్యడానికి నానుంచి ప్రోత్సాహం లభిస్తుందన్న ఆశ కావచ్చు.
అనుకోవడం కరెక్టో, అనుమానం కరెక్టో తెలియదు కానీ- మూడో ట్రిప్పుమీద వెళ్లేముందు- ‘ఈసారి మూడు వారాలుండి రానా?’ అనడిగాడు శశి.
ఇదివరకటితో పోల్చితే ఆ అడగడంలో కొంచెం తేడా ధ్వనించింది.
తనకి ఎక్కువ రోజులుండాలని ఉన్నట్లు లేదు.
నేను తగ్గించుకోమని చెప్పినా, అసలు ట్రిప్పే వద్దన్నా ఎక్కువ సంతోషిస్తాడనిపించింది. జాలేసింది.
మనసు వేరే ఎటైనా ఉన్నప్పటికీ – బాధ్యతపట్ల అంకితభావంలో, మహిళలముందు పురుషులు దిగదుడుపే! అందువల్ల శశి నా సాహచర్యంలో లభించే అంకితభావాన్ని ఆస్వాదిస్తూ క్రమంగా నా పట్ల ఎక్కువ ఆకర్షితుడౌతున్నాడేమో!
‘మూడు వారాల మాటటుంచు. అసలు ట్రిప్పు అవసరమా?’ అని నేనంటే ఎలా స్పందిస్తాడో చూడాలన్న చిలిపి ఆలోచన కలిగింది. కానీ నా ప్రేమలో అంకితభావం ఇంకా రిషి చుట్టూనే తిరుగుతోంది.
అందుకే నాకు గొంతు పెగల్లేదు. ‘నీ ఇష్టం’ అని ఊరుకున్నాను.
శశి మూడో ట్రిప్పుకి వెళ్లిపోయాడు.
క్లబ్బు వద్దనుకున్నా కాబట్టి ఈసారి మళ్లీ ఫ్రెండ్సుతోనే గడపాలనుకున్నాను. కానీ ఇక్కడో సమస్యుంది.
మేం సోషల్ మీడియాలో తరచు కలుస్తాం. ఆలోచనల్లో, అభిప్రాయాల్లో, జోక్సులో అందరిదీ వాట్సాప్ ఫార్వర్డ్ తంతు. పాతవే మళ్లీమళ్లీ సర్క్యులేట్ చేస్తుంటారు. రీసైక్లింగుకి బెస్టు. వినోదానికి వేస్టు.
ఈసారేదైనా కొత్తగా చెయ్యాలనుకుంటూ ఆఫీసుకెళ్లాను. వెళ్లిన కాసేపటికే – నాకు రాధనుంచి ఫోను.
రాధ రిషి భార్య.
‘ఈరోజు రిషి బర్త్ డే! నా గ్రీటింగ్సు అందజెయ్యి’ – అంతే చెప్పి ఫోన్ పెట్టేసింది రాధ.
‘ఆహా, అన్నమాట నిలబెట్టుకున్నావుగా రాధా’ అని మనసులోనే అభినందించాను.
అప్పుడే బుర్రలో ఏదో వెలిగింది.
‘అనుకున్నామని జరుగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్నీ’ అని చెవిలో పాట గింగురుమంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తాజా ఫలితం విన్నట్లుగా మనసు ఉరకలేసింది.
‘తుంటిమీద కొడితే మూతిపళ్లు రాలినట్లు, రాధ తన భర్త రిషికి బర్త్డే గ్రీటింగ్సు చెప్పమంటే మధ్య నీకెందుకీ ఉత్సాహం’ అని విసుక్కున్నా మనసుని.
కానీ నాకు తెలియదా – నా మనసు గతి!
ఊరకనే వేసిన ఉరకలు కావవి. వాటికో ఫ్లాష్‌బాకుంది. అదేంటంటే-
రాధ నాకు కాలేజిమేట్. అదే కాలేజిలో రిషి మాకు రెండేళ్లు సీనియర్.
రాధ అతణ్ణి పప్పుసుద్ద, దద్ధోజనం అని గేలిచేసేది నావద్ద.
రిషి నా చైల్డ్‌హుడ్ క్రష్ అని రాధకు తెలియదు. నేనూ ఎప్పుడూ తన వద్ద బయటపడలేదు. ఇప్పుడు కూడా, ‘రిషి గురించి అలాగనకే! చాలామంది అమ్మాయిలైతే రిషిని పెళ్లికి మంచి ప్యాకేజి అంటారు’ అని మనసులో మాటని వేరెవరికో ఆపాదించి చెప్పాను.
‘అసలు సంగతి తెలిసుండదు వాళ్లకి! రిషిది మధ్యతరగతి ఉమ్మడి కుటుంబం. తాత, బామ్మ, తండ్రి, తల్లి, ఇద్దరు బాబాయిలు – పినతల్లులు, ఓ అన్న – వదిన – అంతా పిల్లాపాపలతో కలిసుంటున్నారు. అంకితభావంలో రిషితో సహా ప్రతి ఒక్కరూ తలో ‘ఫ్యామిలీ స్టార్’. కాబట్టి తనిక్కడే ఈ ఊళ్లోనే స్థిరపడతాడు. ప్రైవసీ లేని ఇంట్లో కాపురానికి ఈరోజుల్లో ఏ అమ్మాయిష్టపడుతుందే?’ అంది రాధ.
ఫ్యామిలీ స్టార్ అంటే – మధ్యతరగతి అనుబంధాలకీ, విలువలకీ ప్రాధాన్యమివ్వడం కోసం – వ్యక్తిగతంగా ప్రైవసీని త్యాగం చెయ్యడాన్ని ఇష్టపడేవాడని – రాధ ఉద్దేశ్యం.
అప్పుడు రాధ వాడిన ‘ఫ్యామిలీ స్టార్’ పదం శీర్షికగా, ఇప్పుడు 2024లో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా వచ్చింది. ఆ టైటిల్ క్రెడిట్ రాధదంటే ఇప్పుడెవరొప్పుకుంటారు? సాక్ష్యమెలా తెచ్చేది?
రిషి ‘ఫ్యామిలీ స్టార్’ అని నాకూ తెలుసు. ఐనా నేనిష్టపడుతున్నాను. కానీ రాధకి చెప్పలేదు.
డిగ్రీ అవగానే రిషి ‘కంఫర్ట్ టెకీ’లో చేరాడు. ఆ కంపెనీ మా బాబాయిది.
డిగ్రీ అయ్యేసరికి కేంపస్ ఇంటర్వ్యూల్లో రెండుచోట్ల మంచి ఆఫర్లొచ్చాయి నాకు. అవి కాదని రిషికోసం మా ‘కంఫర్ట్ టెకీ’లో చేరాను. రెండ్రోజుల్లో రిషితో సాన్నిహిత్యం పెంచుకున్నాను.
నేననుకున్నట్లు రిషి పప్పుసుద్ద, దద్ధోజనం కాదు.
ఏకాంతంలో అతడి మాటలు రొమాంటిక్ గానే ఉన్నాయి. ఐతే ఎక్కడా సభ్యత హద్దులు దాటని హుందాతనముంది అతడిలో.
ముందు రిషికి నేనంటే ఇష్టమేనని రూఢి చేసుకున్నాను. తర్వాత తెలివిగా రిషిని బాబాయి దృష్టిలో పడేలా చేస్తే, బాబాయి మా ఇంట్లో అతడి గురించి చెప్పాడు.
మావాళ్లు రిషి పెద్దలతో మాటలకి వెళ్లారు.
అక్కడ అన్నీ బాగున్నాయి కానీ జాతకాలు నప్పలేదు.
ఇరవయ్యొకటో శతాబ్దమా, మజాకా! సంబంధం మిడిల్ డ్రాప్!
‘తప్పు నీదీ నాదీ కాదు. మూఢనమ్మకాలది! వాటిని గౌరవించినంత కాలం, ప్రేమకు త్యాగం తప్పదు. ఏంచేస్తాం, స్పోర్టివ్‌గా తీసుకుని, వేరే పెళ్లి చేసుకుని – స్నేహాన్ని ఇలాగే కొనసాగిద్దాం’ అన్నాడు రిషి.
‘మరప్పుడు మన స్నేహాన్ని, మన పార్ట్‌నర్స్ స్పోర్టివ్‌గా తీసుకుంటారా?’ అన్నాను చటుక్కున.
రిషి ఉలిక్కిపడి, ‘స్నేహమంటే, ఏమనుకుంటున్నావ్ నువ్వు?’ అన్నాడు.
‘చిన్నప్పుడే నువ్వు నా క్రష్‌వి’ అని తనంటే నాకున్న ఆకర్షణ గురించి వివరంగా చెప్పాను.
అమ్మాయిని. నోరు విడిచి చెప్పాను. అలాంటప్పుడు అబ్బాయి సగర్వంగా కాలరెగరేస్తే అది సామాన్యం. కానీ రిషి అలా కాదుగా, ‘ఈ మాట అప్పట్లోనే చెప్పాల్సింది. పరిణతి లేదు కాబట్టి ఆ వయసులో ఆలోచనలు మనని తొందరపడేలా చేసేవి. విలువల్ని నమ్మేవాళ్లం కాబట్టి- ఆ తొందరపాటే, జాతకాల్ని కూడా పక్కనపెట్టి, మన పెళ్లి జరిపించేదేమో!’ అన్నాడు రిషి.
‘ఐతే, సమయమింకా మించిపోలేదు. ఆ రూట్లోనే ప్రయత్నిద్దాం!’ అన్నాను.
తొందరపాటులో సిగ్గుని కూడా మర్చిపోయానన్న స్పృహ నాకు కలగలేదు కానీ – రిషి, ‘నా మాట నీకలా అర్థమైందా? అయాం సారీ! ఇప్పుడు సమయం మించిపోయింది. నాకు పెళ్లి ఫిక్సైపోయింది’ అన్నాడు మందలింపుగా.
దెబ్బ తిన్నాను, ‘అంటే, నా సంబంధమెప్పుడు తప్పిపోతుందా అని ఎదురుచూస్తున్నావన్నమాట! ఇలా రిజెక్టయింది, అలా మరొకరితో పెళ్లి!’ అన్నాను ఉక్రోషంగా.
‘ఈ కాలం అబ్బాయిని, నాకంత సీనులేదు. డిగ్రీ అవగానే మావాళ్లు నాకు సంబంధాలు చూడ్డం మొదలెట్టారు. ఎన్నారైని కానని కొన్నీ, ఇక్కడ నా జీతం నెలకి రెండులక్షలేనని కొన్నీ తప్పిపోయాయి. ఇంకా పెద్ద అభ్యంతరమేంటంటే – మాది ఉమ్మడికుటుంబం కావడం. పెళ్లయ్యేక అత్తమామలతో కలిసుండడానికి అమ్మయిలు ఇష్టపడే రోజులా ఇవి! నాకు మాత్రం – పెళ్లైనా కాకపోయినా – మావాళ్లని వదిలి వేరుగా ఉండే ప్రసక్తే లేదు’ అన్నాడు రిషి.
అతడి గురించి రాధ కూడా సరిగ్గా ఇవే మాటలు చెప్పింది.
మరిప్పుడు రిషిని ఇష్టపడ్డ అమ్మాయెవరా అని – ఆరా లాగితే – ఆ అమ్మాయి రాధ!
తెల్లబోయాను.
ఆడువారి మాటలకూ అర్థాలు వేరులే అని పక్కాగా ఋజువు చేసింది రాధ.
రాధ రిషికి మరదలు వరస. వాళ్లవాళ్లు ఎప్పట్నించో అడుగుతున్నారు. జాతకాలు కూడా కలిశాయి.
‘మేనరికం ఇష్టంలేదు నాకు. అందుకే నీకు ఓకే చెప్పాను. కానీ ఏంలాభం? జాతకాలు కుదర్లేదు. దాంతో జాతకాల ప్రాధాన్యం అర్థమైంది. ఆలస్యం చేస్తే రాధ సంబంధమూ తప్పిపోతుందని మావాళ్ల భయం. వాళ్ల మాట నాకు శిరోధార్యం. అలా జరిగింది మ్యాచ్ ఫిక్సింగ్’ నిట్టూర్చాడు రిషి.
తర్వాత రాధకి ఫోన్ చేసి, ‘ఏంటీ, చివరికి ఫ్యామిలీ స్టారునే పెళ్లి చేసుకుంటున్నావ్!’ అనడిగాను.
‘దంపతులకి, ముఖ్యంగా కొత్తగా పెళ్లైనవారికి ప్రైవసీ అవసరమే! కానీ ఆ పాట్లు ఆడాళ్లవి కాదు, మగాళ్లవి! వాళ్ల ప్రోబ్లం వాళ్లే సాల్వ్ చేసుకుంటారు. ఇక ఉమ్మడి కుటుంబమంటావా – భర్త మనవాడైతే మిగతావాళ్లతో మనకేం పని! మనిష్టమొచ్చినట్లు మనముంటాం. మొగుడు ఫ్యామిలీ స్టారైతే – మనతోనూ సద్దుకుపోతాడు. ఫ్యామిలీ స్టార్లు మంచి మొగుళ్లవుతారు’ అంది రాధ.
ఇంత లోతుగా ఆలోచించిందంటే – రాధకిది ఈనాడు పుట్టిన బుద్ధి కాదు. మిగతా అమ్మాయిల దృష్టిని రిషిమీంచి తప్పించడానికి, అప్పుడలాగనేదన్న మాట!
‘ఎంత మోసం చేశావే! ఏదో రోజున ఏదో వంకతో మీ ఆయన్ని కాఫీకి పిల్చి…’
నేనింకా మాట పూర్తి చెయ్యలేదు, ‘ఆ కుర్చీని మడత పెట్టి.. అన్నట్లే ఉంది కానీ ఇక ఆపు’ అంది రాధ.
తర్వాత కొద్ది నెలల్లోనే – నాకు శశితో, రిషికి రాధతో పెళ్లిళ్లయ్యాయి.
నేను ఉద్యోగంలో కొనసాగుతున్నా. ఉమ్మడికుటుంబంలో రాధకి వర్క్-ఫ్రం-హోంకి మాత్రమే అనుమతి దొరికింది.
‘ఇదింకా బాగుంది! ఇంట్లోనే ఉద్యోగమైతే ఆ పేరు చెప్పి- ఇక్కడి పుల్ల తీసి అక్కడ పెట్టక్కర్లేదు’ అంది రాధ నాతో. నిజమే చెప్పిందో, సద్దుకు పోతోందే తనకే తెలియాలి!
రిషి, నేను ఆఫీసులో తరచుగా మాట్లాడుకునేవాళ్లం. తనకెలాగుండేదో కానీ – నాకు మాత్రం మేము స్నేహితుల్లాకాక మాజీ ప్రేమికుల్లా అనిపిస్తోంది.
అప్పుడప్పుడు రిషిని రాధ గురించి అడిగేదాన్ని.
‘రాధతో పెళ్లయ్యేక అర్థమైంది. దాంపత్యంలో మగాడికి భార్య గొప్ప వరం’ అన్నాడు రిషి.
కానీ రిషి నన్ను శశి గురించి అడిగితే, అతడికిలా పాజిటివ్‌గా చెప్పేదాన్ని కాదు.
రిషికి ఏమర్థమయిందో! ఒక రోజు, ‘దాంపత్యమంటే కూడిక, తీసివేత కాదు. గుణింతం. ఇద్దరూ పాజిటివ్ ఐతే జంట కూడా ఎలాగూ పాజిటివే! ఒకరు నెగెటివ్ ఐతే, రెండోవాళ్లూ నెగెటివ్ అయినా ఆ జంట పాజిటివే! ఒకళ్లు పాజిటివూ ఒకళ్లు నెగెటివూ ఐనప్పుడు – ఆ జంటని పాజిటివుగా చెయ్యడానికి చేసే ప్రయత్నమే సద్దుకుపోవడం. ఉమ్మడికుటుంబాల్లో అది సాధారణం’ అన్నాడు.
అది నాకు మందలింపో, సలహాయో, హెచ్చరికో మరి!
ఐతే నా ఆలోచనలు వేరే దార్లో వెడుతున్నాయి.
మనిషికో గదివ్వలేని మధ్యతరగతి కుటుంబంలో కొత్త జంట కూడా ప్రైవసీ దొరక్క సద్దుకుపోవాల్సిన పరిస్థితి! పెళ్లయినా కూడా దాంపత్యజీవితాన్ని రేషన్ పద్ధతిలో సరిపెట్టుకునే రిషిని, నా దారికి తెచ్చుకోవడం కష్టం కాదు.
ఆ ఆశతో రిషిని ఓసారి మా ఇంటికి కాఫీకి పిలిస్తే, ‘కలిసి కాఫీ తాగడానికి మనకి ఆఫీసుండనే ఉంది. ఇంటికొస్తే ఏం ప్రత్యేకతుంటుంది?” అన్నాడు రిషి వెంటనే.
వెంటనే, ‘ఎలాంటి ప్రత్యేకత కావాలి నీకు?’ అనడిగాను. ఆ ప్రశ్నలో నేనిస్తున్న హింటునీ, అవకాశాన్నీ అర్థం చేసుకోలేనంత అమాయకుడు కాదు రిషి.
నేను బయటపడ్డానికి సంకోచించలేదు. ఇక తను బయటపడ్డానికి సంకోచించనవసరం లేదు. కానీ రిషి హింటుని పట్టించుకోకుండా, ‘ఇలాంటివి మీ ఆడాళ్లకి తెలిసినట్లు, మా మగాళ్లకి తెలియవు. నీకంటే ముందు నేను నిన్ను మా ఇంటికి పిలుస్తాను. ప్రత్యేకంగా ఉండాలని రాధకి చెబుతాను. తనేం చేస్తే అదే నువ్వూ చేద్దువుగాని’ అన్నాడు.
తనకు రాధ అనే భార్య ఉందని చాలా తెలివిగా నన్ను హెచ్చరించాడని గ్రహించాను.
ఇక అతడితో లాభం లేదనుకుని, ఓసారి రాధకి ఫోన్ చేసి, ‘మీ ఆయన్ని మరీ కొంగుకి కట్టేసుకున్నావా? మా ఇంటికి కాఫీకి రమ్మంటే రానంటాడు..’ అన్నాను.
రాధ నవ్వేసి, ‘నైటీలూ, చుడీదార్లూ. ఇవీ ఇంట్లో నా డ్రెస్సులు. ఎప్పుడైనా చీర కట్టి, ఆయన్ని కొంగున ముడేసుకున్న రోజు నీకు ఫోన్ చేసి చెబుతాన్లే! మిగతా రోజుల్లో తను ఫ్రీ!’ అంది .
‘ఫ్రీయే ఐతే, మరి నేను పిలిస్తే ఎందుకు రాడు?’ అన్నాను.
‘ఫ్యామిలీ స్టార్ కదా! ఇల్లు, ఆఫీసు తప్ప ఇంకో ధ్యాసుండదు’ అంది రాధ.
‘ఎంత ఫ్యామిలీ స్టారైనా – ఏదో చిన్న బలహీనతుండకపోదు. అది నీకు తెలియకనూ పోదు. మన స్నేహం నిజమైనదైతే, నీకు నామీద, రిషిమీద నమ్మకముంటే- అది నాకు చెప్పాలి’ అన్నాను.
కొంచెం నీరు. కొంచెం నిప్పు. కొంచెం గరళం. కొంచెం అమృతం. కొంచెం సవాలు. కొంచెం సెంటిమెంటు.
ఇవన్నీ రాధమీద బాగానే పని చేసినట్లున్నాయి. ఆమె వెంటనే, ‘రిషికి ఓ బలహీనతుంది. ఎవరైనా తన పుట్టినరోజు తెలుసుకుని పిలిస్తే- కాఫీకే కాదు, సినిమాకి కూడా కంపెనీ ఇస్తాడు’ అంది.
‘థాంక్స్, రాధా! చాలా తేలికైన ఉపాయం చెప్పావ్!’ తేలికగా నిట్టూర్చాను.
‘అదేమంత తేలిక్కాదు. దీనికో పెద్ద ఫిటింగుంది. మా ఇంట్లో పుట్టినరోజు వేడుకలు కూడా పండగలకి లాగే తిథుల ప్రకారం జరుపుతాం. మరి తిథి గుర్తుండడం కష్టం కదా! గుర్తున్నా తేదీ నిర్ధారించడమూ కత్తిమీద సామే! తెలుగు పండుగలు ఏ రోజో చెప్పడానికి మన సిద్ధాంతులు మీడియాలో చేసే హడావుడి నీకు తెలియదా!. మా ఇంట్లోనూ ఉంటుందలాంటి తంతు!’ అంది.
‘ఐతే మీ ఆయన్ని మా ఇంటికి కాఫీకి పిలవడం వీలుపడదంటావ్!’ అన్నాను నీరసంగా.
‘అలా నీరసపడకు. ఈ విషయంలో నా వంతు సాయం నే చేస్తాను. రిషి పుట్టిన్రోజొస్తే నీకు నేనే మెసేజి చేస్తాన్లే!” అని హామీ ఇచ్చింది రాధ.
ఈరోజు రిషి పుట్టినరోజని చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకుంది రాధ.
‘ఎందుకు నిలబెట్టుకోదూ! తన మొగుడు ఫ్యామిలీ స్టారని అంత నమ్మకం! అందుకే ఆ ఫ్యామిలీ స్టార్‌ని ఉత్త స్టారుగా మార్చగల నీ ఆకర్షణశక్తిని తక్కువ అంచనా వేసింది’ అంది మనసు.
దాంతో నాకది సవాలు కూడా అయింది.
ఆలస్యం చెయ్యకుండా వెంటనే రిషివద్దకెళ్లి, ‘ఈ సాయంత్రం మా ఇంటికి కాఫీకొస్తున్నావ్!’ అన్నాను.
‘ఏమిటి అకేషన్?’ అన్నాడు రిషి కుతూహలంగా.
జవాబుగా “హాపీ బర్త్‌డే రిషీ” అని చేయి చాపాను.
రిషి తన చేయి ముందుకి చాపలేదు, ‘ఎవరు చెప్పారు- ఈవేళ నా పుట్టిన్రోజని!’ అన్నాడు ఆశ్చర్యంగా.
‘ఇష్టం లేకపోతే రానని చెప్పేసేయ్. ఈవేళ నీ పుట్టిన్రోజు కాదని అబద్ధం మాత్రం చెప్పకు’ సీరియస్‌గా అన్నాను.
‘అబద్ధమా, నేనా?’ అని నవ్వేశాడు రిషి. ఓ క్షణమాగి, ‘ఐనా నేనబద్ధమాడతానంటే, నేనైనా నమ్మొచ్చు కానీ, నువ్వు మాత్రం నమ్మవ్. అయాం సెంట్ పర్సెంట్ ష్యూర్’ అన్నాడు.
ముందరి కాళ్లకు బంధమెయ్యడమంటే, ఇదే!
రిషి తెలివికి ముచ్చటేసింది కానీ ముచ్చట్ల పండుగ ఇంకా ముందుందిగా!
‘ఐతే రాధ అబద్ధమాడుండాలి’ అన్నాను.
‘రాధా?!’ అని తెల్లబోయాడు రిషి, ‘ఐనా నా పుట్టిన్రోజు గురించి తను నీకెందుకు చెబ్తుంది?’ అన్నాడు.
‘ఎందుకంటే, నువ్వు మా ఇంటికి కాఫీకి రావడానికి తనకే అభ్యంతరమూ లేదు కాబట్టి!’ అని రిషికి మా మధ్య జరిగిన ఒప్పందం చెప్పాను.
‘అమ్మో, నాక్కాఫీ ఇవ్వడానికి చాలా దూరం వెళ్లావన్న మాట!’ నవ్వేశాడు రిషి.
రిషి విషయంలో నేనెంత దూరం వెడతానో తెలిస్తే – అలా నవ్వగలడా? కళ్లు కాస్త ఎర్రబడవూ..
ఏదేమైనా తనలా నవ్వేడంటే విషయాన్ని పక్కదారి పట్టించడం ఖాయం. అందుకని, ‘ఈవేళ నిజంగా నీ పుట్టిన్రోజు కాదనుకో. లేదా, నీ పుట్టిన్రోజున నా పిలుపుని మన్నించవనుకో. ఈ రెంటిలో ఏంజరిగినా నీ భార్య రాధ పచ్చి అబద్ధాలకోరు అనుకోవాలి’ అన్నాను.
ఆ క్షణంలో నా కత్తికి రెండువైపులా పదునే! రిషి మా ఇంటికొస్తే- గీత దాటిస్తాను. తర్వాత ఊఁ అని నేనంటాను. ఉఊఁ అని అతణ్ణి అననివ్వను.
కలల్లో తేలిపోతున్న నాతో, ‘మరోసారీ మరోసారీ ఐతే మరో సారీ చెప్పకుండా, నీ పిలుపుని తప్పక మన్నించేవాణ్ణి. బట్ దిస్ మెసేజ్ ఈజ్ వెరీ స్పెషల్! నేనిప్పుడో అరగంట పెర్మిషన్ తీసుకుని, పెందరాళే ఇంటికెళ్లాలి’ అన్నాడు రిషి.
తనిలా అంటాడని ఊహించలేదు నేను. నోటికందిన ముద్దుని ఎవరో ఎటో లాక్కునిపోతున్నట్లయింది. ‘ప్లీజ్ రిషీ! ఈ ఒక్కసారికీ నా ఆహ్వానాన్ని మన్నించు’ అన్నాను.
మనిషికి అహం సహజం. ఆడవాళ్లకి, అందులోనూ అందం-వయసు ఉన్నవాళ్లకి అది మరింత సహజం.
స్వార్థం మితిమీరినప్పుడూ, అవకాశవాదం అవసరమైనప్పుడూ మనిషి అహాన్ని విడిచిపెట్టినా అది నటన మాత్రమే!
నాదిప్పుడు నటన కాదు. అది ప్రేమో, మోహమో చెప్పలేను కానీ, నాలో ఇప్పుడు అహం ఎంతలా నశించిందంటే, రిషిని నా ఇంటికి తీసుకెళ్లడానికి అతడి కాళ్లావేళ్లా పడ్డానికి కూడా సంకోచించలేదు.
ఇప్పటి నా నిరహంకారత్వానికి కారణం భక్తి భావమైతే- భగవంతుడు మోక్షమివ్వడానికున్న క్యూలో- ప్రహ్లాదుడు, తుకారాం వంటివారికంటే నేనే ముందుండేదాన్ని.
కానీ ఇప్పుడు నేనేం చెప్పినా వినే మూడ్‌లో లేడు రిషి.
‘రిషికి ఏమయింది? భార్య గ్రీటింగ్సుకి బదులుగా ట్రీటివ్వడం అర్జంటనుకున్నాడా? అలాంటప్పుడు ఈవేళ తన పుట్టిన్రోజు కాదన్నట్లు మాట్లాడాడేం?’ ఈ ప్రశ్నలు నా మనసుని దొలిచేస్తున్నాయి.
ఏమైతేనేం – రిషి నా పిలుపుని లెక్కచెయ్యకుండా, అరగంట ముందే ఇంటికి వెళ్లిపోయాడు. కోపం, ఉక్రోషం, అవమానం నన్ను రగిల్చేస్తుంటే ఎలాగో తమాయించుకుని రాధకి ఫోన్ చేసి, ‘ఈ వేళ రిషి పుట్టిన్రోజు కాదు. అబద్ధం చెప్పావ్ కదూ!’ అన్నాను.
రాధ బుకాయించలేదు, ‘ఔనే, చెప్పడం తప్పనిసరయింది’ అంది.
‘అబద్ధం చెప్పడం కాదు – నాతో ఆడుకోవడం నీకు తప్పనిసరైందన్నమాట!’ అన్నా నిష్ఠూరంగా.
‘సారీయే! ఈ రోజింట్లో నేనుతప్ప ఇంకెవ్వరూ లేరు. మాకు ప్రైవసీ తక్కువకదా! ఇలాంటి అవకాశమొస్తే ఎలా వదులుకుంటాం? మామూలుగా ఐతే – హాపీ బర్త్‌డే – అని రిషికి మెసేజి పెడతా! బర్త్ డే అంటే నిజంగా బర్త్‌డే కాదు. ‘భర్త డే’ కి కోడ్ అన్నమాట! కానీ తప్పో ఒప్పో, రిషి బర్త్‌డే చెబుతానని నీకు మాటిచ్చానుగా – అందుకని, ఉభయతారకంగా ఉంటుందని- ఈరోజు ఫోనుకి బదులు, నిన్ను ఎంచుకున్నా. ఇందులో రిషికి చిన్న పరీక్ష కూడా ఉంది. బర్త్‌డేకి లొంగితే మీ ఇంటికొస్తాడు. భర్త డేకి మొగ్గితే మా ఇంటికొస్తాడు. అదీ సంగతి!’ అంది.
జరిగిందేమిటో స్పష్టం కావడానికి కాసేప్పట్టింది.
రాధ నన్ను తప్పు పట్టలేదు. మందలించలేదు. కనీసం నామీద కోపం కూడా ప్రదర్శించలేదు. తనేమిటో, రిషి ఏమిటో, వారిద్దరి అనుబంధమేమిటో చాలా హుందాగా చెప్పింది. ఆ చెప్పడంలోనే – నా జీవితాన్ని తెగని గాలిపటం కాకుండా కాపాడే – ఏదో చిట్కానీ ఇమిడ్చింది.
ఇన్నాళ్లూ రిషిని ఫ్యామిలీస్టార్ అనుకున్నాను. కానీ అతణ్ణి ఫ్యామిలీస్టార్ చేసిన ఫ్యామిలీస్టార్ రాధ!
‘తనిప్పుడు నన్ను కూడా ఫ్యామిలీ స్టార్ చేస్తుందా’
అది అనుమానం కాదు, భయం కాదు. ఆశ కావచ్చు. కానీ ఒప్పుకుందుకు అహం అడ్డొచ్చింది. ఆ తర్వాత మరో నాలుగేళ్ల మా కాపురంలో – శశి ఒంటరిగా ఇంకా నాలుగో ట్రిప్పుకి వెళ్లకపోయినా – ఆ అహం అలాగే ఉంది. ఐనా –
ఫ్యామిలీ స్టారునై, తెగని గాలిపటంలా, మనుగడ కొనసాగిస్తున్నంత కాలం – ఆ అహం గురించి నేను పట్టించుకోను..