[‘పుస్తక సురభి’ శీర్షికలో భాగంగా బార్బరా పిమ్ రాసిన ‘ఎక్సలెంట్ ఉమెన్’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు స్వప్న పేరి.]
బార్బరా పిమ్ రాసిన ‘ఎక్సలెంట్ ఉమెన్’ నవలని తరచుగా యుద్ధానంతర బ్రిటీష్ జీవితంపై చిత్రించిన సున్నితమైన వ్యంగ్య రచనగా వర్ణిస్తారు, కానీ అది దాని కంటే చాలా ఎక్కువ అని ఋజువైంది. పైకి సాదాసీదా రచనగా అనిపించే, ఈ నవలలో చురుకైన హాస్యం, పదునైన అంతర్దృష్టి, ఇంకా కాలాతీత ఔచిత్యం ఉన్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, లండన్‍లో రేషనింగ్ వ్యవస్థనీ, నగరం పునరుద్ధరణనీ ప్రదర్శించే నేపథ్యంలో అల్లినప్పటికీ, ఈ పుస్తకం ఆధునిక సున్నితత్వాన్ని వ్యక్తం చేస్తుంది. దీనిలో హాస్యం అణగి వున్నట్టు ఉంటుంది కానీ చురుకైనది. నవల సామాజిక వ్యాఖ్యానం సూక్ష్మంగా ఉన్నా, శాశ్వత ప్రభావం చూపేదిగా ఉంటుంది. అప్పటి ఆ కాలాన్ని, ఆనాటి సమాజంలోని మానవ ప్రవర్తనని, భావోద్వేగ సూక్ష్మతలని విశేషతలుగా భావించే ప్రపంచాన్ని రచయిత్రి చిత్రించారు ఈ నవలలో.
బార్బరా పిమ్
ఈ కథ ముప్పై ఏళ్ల వయసున్న ‘మిల్డ్రెడ్ లాత్‌బరీ’ అనే అవివాహితపై దృష్టి సారిస్తుంది. సమాజంలోని ‘ఉత్తమమైన మహిళలు’ అని పిలవబడే – నమ్మదగిన, గుర్తింపు లేని మూలస్తంభాలు, అన్నిటినీ కలిపి ఉంచే స్త్రీలలో ఒకరామె. నిరాడంబరమైన లండన్ ఫ్లాట్‌లో నివసిస్తున్న మిల్డ్రెడ్ తన స్వచ్ఛంద సేవని, చర్చి కార్యకలాపాలని, సామాజిక అంచనాలను హుందాగా సమతుల్యం చేసుకుంటుంది. కొత్త పొరుగువారు – రాకింగ్‍హామ్, హెలెనా నేపియర్ రాకతో ఆమె జీవితం కాస్త చెదురుతుంది. వారి వైవాహిక ఇబ్బందులు, ప్రాపంచిక అంశాలలో వాళ్ళ పద్ధతులు – మిల్డ్రెడ్ నిశ్శబ్ద ఉనికికి భిన్నంగా ఉంటాయి. మిల్డ్రెడ్ కళ్ళ నుండి మనం, వికార్‍ల విపరీత మనస్తత్వాలను, ఆంత్రోపాలజిస్టులను, బ్రహ్మచారిణి మిత్రులను చూస్తాము, వీటన్నిటి గుండా యుద్ధానంతర కఠిన పరిస్థితులను అంచనా వేస్తాము.
ఈ కథాంశం పైకి తేలికగా కనిపించవచ్చు, కానీ భావోద్వేగాలు, సామాజిక అంతర్వాహినులు లోతుగా ఉంటాయి. నేపియర్స్, వారి ప్రేమ సమస్యలు, సామాజిక అస్థిరతతో – మిల్డ్రెడ్ నిర్మాణాత్మక ప్రపంచంలో గందరగోళాన్ని ప్రవేశపెడతారు. కొంచెం ఆడంబరమైన వికార్ జూలియన్ మలోరీ, ముభావంగా ఉండే విద్యావేత్త ఎవెరార్డ్ బోన్ వంటి ఇతర పాత్రలు ఆమె క్రమబద్ధమైన దినచర్యను మరింత క్లిష్టతరం చేస్తాయి. అయితే నవల అసలైన గొప్పదనం దాని మలుపులలో లేదు, ఈ నిశ్శబ్ద ఉద్రిక్తతలకు రచయిత్రి జీవం పోసే విధానంలో ఉంది. సాధారణ కార్యకలాపాల ద్వారా – షేర్డ్ బాత్రూమ్‌లు, చర్చి అమ్మకాలు, మరియు ఇబ్బందికరమైన టీ లు – మారుతున్న బ్రిటీష్ సమాజాన్ని గొప్పగా చిత్రించారు రచయిత్రి.
‘ఎక్సలెంట్ ఉమెన్’ నవల పఠనాన్ని ఆనందదాయకంగా మార్చేది పిమ్ – అండర్‍స్టేటెడ్ హ్యూమర్. మిల్డ్రెడ్ పొడి పొడి మాటలు చమత్కారం, స్వీయ-అవగాహన – నవ్వించటమే కాకుండా ఆలోచింపజేస్తాయి. సామూహిక ప్రదేశాల మర్యాదల గురించి ఆలోచిస్తున్నా లేదా పురుషాహంకారాలను సూక్ష్మంగా హేళన చేసినా, మిల్డ్రెడ్ పరిశీలనలు తీక్షణంగా, కాస్త చమత్కారంగా, లోతుగా, మానవీయంగా ఉంటాయి. రచయిత్రి ఎప్పుడూ కఠినమైన వ్యంగ్యాన్ని ఆశ్రయించరు; బదులుగా, ఆమె క్రూరత్వం లేకుండా రోజువారీ జీవితంలోని అసంబద్ధతలను బహిర్గతం చేసే ఆప్యాయతని, స్పష్టంగా తెలిసే హాస్యాన్ని అందిస్తారు.
నవలలో అక్కడక్కడా ప్రేమ చిక్కులు ఉంటాయి, కానీ పాఠకుల దృష్టి వాటిపై ప్రధానంగా కేంద్రీకృతం కాదు. రాకీ, జూలియన్, ఎవెరార్డ్‌తో సహా అనేక మంది పురుషుల దృష్టిని ఆకర్షిస్తుంది మిల్డ్రెడ్, కానీ ఇవి విస్తృతమైన ప్రేమకథలు కావు. బదులుగా, అవి అనుబంధాలు, అంచనాలు, స్వేచ్ఛల సంక్లిష్టతలను వెల్లడిస్తాయి. మిల్డ్రెడ్ ఈ పరిస్థితులను సున్నితమైన వ్యంగ్యం, దృఢమైన మనోబలంతో అధిగమిస్తుంది, ఆమెకి తన భావోద్వేగాల గురించి తెలుసు కానీ వాటిచే ఎప్పుడూ నియంత్రించబడదు. ఆమె నిర్లిప్తత ఉదాసీనత కాదు, కానీ ఆమె అంతర్గత స్పష్టతకి, కష్టపడి సాధించుకున్న ఆత్మగౌరవానికి సంకేతం.
చివరగా, ‘ఎక్సలెంట్ ఉమెన్’ అనేది తరచుగా విస్మరించబడి, మౌనంగా సాగిపోయే అద్భుతమైన జీవితాల వేడుక. మిల్డ్రెడ్ కథ పరిధిలో చిన్నదే కావచ్చు, కానీ అది హృద్యమైనది, ప్రాముఖ్యత కలిగినది. రచయిత్రి పిమ్ – ఆమెను గౌరవంగా చూస్తారు, సూక్ష్మంగా పరిశీలిస్తారు. ఆమె ఎంపికలను, ఆమె స్థిరమైన దృఢసంకల్పాన్ని గౌరవిస్తారు. పిమ్ వచనం సొగసైనది, నిరాడంబరంగా ఉంటూనే నిర్దుష్టంగా ఉంటూ – ఆమె కథానాయిక వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ నవల ద్వారా, గొప్ప సాహిత్యం ప్రతిసారి, గొంతు చించుకోదనీ; కొన్నిసార్లు, అది చాలా కాలం పాటు ప్రతిధ్వనించే సత్యాలను గుసగుసలాడుతుందని ఈ నవల ద్వారా పిమ్ మనకు గుర్తు చేస్తారు.
***
Author: Barbara Pym
Published By: Virago
No. of pages: 304
Price: Paperback ₹ 799/-
Link to buy:
https://www.amazon.in/Excellent-Women-Virago-Modern-Classics/dp/0349016070
స్వప్న పేరి ఫ్రీలాన్స్ బ్లాగర్. పుస్తక సమీక్షకురాలు. సినిమాలంటే ఆసక్తి.