[తాటికోల పద్మావతి గారు రచించిన ‘ఎవరివో! నీవెవరివో?’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
నీవు ఎవరివో తెలియదు గానీ ఉగాది వసంతంలా వచ్చి
ఆమని కోయిలవై పిలుస్తావు.
మోడుబారిన నా హృదయాన్ని చిగురింప చేస్తావు.
పచ్చదనం కోల్పోయి గ్రీష్మ తాపంతో
వడలిపోయిన తీగనై నేల వాలిపోతుంటే,
ఆమనిలా పలకరించి ఆదరించి,
ప్రకృతినంతా దోసిలిలో నింపావు.
గ్రీష్మ తాపాన్ని చల్లబరచడానికి
మరు మల్లెలై విరబూసి మంచి గంధం చిలకరిస్తావు.
ఎల కోయిల పాట వై, చిరుమామిళ్ల పూతవై,
మధుమాస గీత మాలపించి
మనసును మైమరపింప చేస్తావు.
ఎవరివో! నీవెవరివో?
చిరుజల్లుల తోడుగా మలయ పవనమై సాగి
మరువజాలని నీ వసంత సోయగాలు
తొలకరి చినుకుల తోరణాలు కట్టి
మెరుపు మేఘాలతో చెలిమి చేసి,
శరత్కాలపు వెన్నెల సౌరభాల రవళిలో
చల్లని వాన గీతం వర్ణనాతీతం.
మంచు వెన్నెల పూల తివాచీ పరిచి
తుషారవిందుల సొగసులతో
మదిని దోచుకున్న శరత్ చంద్రుడు.
నులివెచ్చని కలల కౌగిలింతలో,
తలపుల ఆరాధనలతో,
వెన్నెల గాయాలు చేసి
శారద చీకట్లలోకి పడదోస్తావు.
బంతి చేయమంతుల విరహాగ్ని రగిలించి
నిశ్శబ్దంగా నవ్వుకుంటూ హేమంతంలో దాగి పోతావు.
ఎవరివో! నీవెవరివో?
శిశిరంలో రాలిపోయిన కలలను
ఏరుకుంటూ మూగబోయిన గొంతును సవరించుకొని
ఆమని వసంతంలా వస్తావని
మళ్ళీ ఉగాది దాకా ఎదురుచూస్తూనే ఉంటాను.
ఈసారి మాత్రం వెళ్ళిపోకుమా!
ఎవరివో! నీవెవరివో?