13-12-2021 శ్రీమతి స్మితా పాటిల్ వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.
***
ఆమె భారతదేశ సినిమా చరిత్రలో ఒక దశాబ్దం పాటు తన చిత్రాలతో తనకంటూ ఒక చరిత్రని మిగుల్చుకున్నారు. ఈనాటికీ ఆ చిత్రాలు ప్రేక్షకుల మదిలో మెదులుతూనే ఉన్నాయి. ఆమె చిత్రాలు తరువాత తరాల వారికి పాఠాలు నేర్పాయి. న్యూవేవ్ చిత్రాలతో సమాంతరంగా వాణిజ్య చిత్రాల నాయికగానూ భేష్ అనిపించుకున్నారు. మహిళాభివృద్ధిని ఆకాంక్షించారు. అట్టడుగు, అణగారిన వర్గాల మహిళల కష్టనష్టాలను, బాధామయ గాథలను, కన్నీటి కడలిని ప్రేక్షకుల కళ్ళకు కట్టినట్లు తన నటనలో చూపించారు. ఆమే – నల్లపిల్ల, మెరిసేకళ్ళు, కోటేరు ముక్కు, ఏ పాత్రలో అయినా ఇమిడిపోయే అందమైన పద్మశ్రీ స్మితా పాటిల్. ముప్పై ఒక్కేళ్ళకే జీవితాన్ని ముగించిన విధివంచిత.
ఈమె 1955 అక్టోబర్ 17వ తేదీన షిర్పూర్ ఖాందేష్ ప్రావిన్స్‌లో జన్మించారు. తల్లి విద్యాతాయి పటేల్ సామాజిక కార్యకర్త. తండ్రి శివాజీరావ్ గిరిధర్ పాటిల్ సేవాభావం కల రాజకీయ కార్యకర్త. రేణుకా స్వరూప్ మెమోరియల్ హై స్కూల్లో మరాఠీ మాధ్యమంలో చదివారు. మాతృభాష మరాఠీ. పాఠశాలలో నాటకాలలో నటించేవారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ తల్లి జిజాబాయి పాత్రని ఎక్కువసార్లు ధరించారట. మూడున్నరేళ్ళ వయసులోనే మరాఠీ భాషని అనర్గళంగా మాట్లాడేదట చిన్నారి స్మిత.
1969లో వీరి కుటుంబం బొంబాయిలో నివాసం ఏర్పాటు చేసుకుంది. బొంబాయి విశ్వవిద్యాలయంలో సాహిత్యాన్ని అభ్యసించారు. తరువాత పూనాలోని ‘ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ (FTII)లో నటనలో బ్యాచులర్ డిగ్రీని పొందారు. విద్యార్థిగా ఉండగానే నటించేవారు.
పూనా ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ వారి చిత్రంలో నటించారు. ఇది ఈమె తొలిచిత్రం.
1970లో బొంబాయి దూరదర్శన్‌లో మరాఠీ వార్తలు చదివేవారు.
ఈమె విద్యార్థినిగా ఉండగానే మనోజ్ కుమార్ ‘రోటీ కపడా ఔర్ మకాన్’ సినిమాలో, దేవానంద్ ‘హరే రామ హరే కృష్ణ’ సినిమాలో నటించమని కోరారట. కాని ఈమె తల్లిదండ్రులు చదువు పూర్తి కావాలని అభ్యంతరం వ్యక్తం చేశారు.
1975లో శ్యామ్ బెనగల్ పిల్లల చిత్రం ‘చరణ్‌దాస్ చోర్’తో పేరు పొందారు. సుమారు 80 చిత్రాలలో నటించారు.
హిందీ, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, బెంగాలీ, మళయాళం, కన్నడ, తెలుగు మొదలైన భాషా చిత్రాలలో నటించారు.
నిశాంత్, కొందూర, చక్ర, తజుర్బా, అర్థ్, బద్లే కీ ఆగ్, దర్ కా రిస్తా, నమక్ హలాల్, శక్తి, మండి, అర్ధ్ సత్య, భూమిక, అమృత్, అనోఖా రిస్తా, తీస్రా కినారా, డ్యాన్స్ డ్యాన్స్, ఆవామ్, వారిస్, మిర్చి మసాలా వంటి విభిన్న హిందీ చిత్రాలలో నటించారు.
ఇంకా జైత్ రే జైత్, సర్వసాక్షి, ఉంబర్తా (మరాఠీ), సాల్ సోల్వన్ ఛడ్యా (పంజాబీ), భవానీ భవై (గుజరాతీ), దేబాబిషు (బెంగాలీ), చిదంబరం (మళయాళం), అన్వేషణె (కన్నడ), అనుగ్రహం (తెలుగు) వంటి ఇతర భాషా చిత్రాలలో నటించి తన ప్రత్యేకతను నిరూపించుకున్నారు.
ఈమె న్యూవేవ్ నూతన పంథా (సమాంతర), విప్లవాత్మక కథాచిత్రాలతో పాటు వాణిజ్య చిత్రాలలోను నటించి తన ప్రతిభను చాటారు.
31 సంవత్సరాల నిజజీవితంలో కేవలం పది సంవత్సరాల సినీ జీవితం మాత్రమే వీరికి లభించింది. ఇంత తక్కువ సమయంలో సుమారు 80 వివిధ భాషా చిత్రాలలోని, విభిన్న తరహా పాత్రలలో నటించడం కాదు జీవించి ఆయా చిత్రాలను సుసంపన్నం చేశారు. తనదైన శకాన్ని భారతీయ సినిమా చరిత్రలో లిఖించారు.
ఈమె నటించిన సినిమాలలోని కొన్ని ముఖ్యమైన పాత్రలను విశ్లేషిస్తే: ‘మంథన్’లో పాలసంఘాల నాయకత్వంపై జరిగిన తిరుగుబాటుకు నాయకత్వం వహించిన హరిజన మహిళగా నటించారు. ‘భూమిక’లో లైంగిక నిర్బంధాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన పాత్రలో జీవించడం విశేషం. ‘చక్ర’ సినిమాలో భారతీయ పట్టణాలు, నగరాలలోని మురికి వాడలలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిని అధిగమించే మహిళగా అద్వితీయంగా నటించారు.
‘ఉంబర్తా’ మరాఠీ సినిమాలో మహిళా జైలు సూపరింటెండెంట్‌గా, అక్రమ సంబంధాలు కలిగిన భర్తను వదిలిన ఒంటరి వనితగా నటించారు. ఈ సినిమా ‘సుబాహ్’ పేరుతో హిందీలోకి అనువదించారు.
ఈ సినిమాలోని నటనకు ఈమెకు మహారాష్ట్ర ప్రభుత్వం వారి ‘చిత్రపథ్’ ఉత్తమ నటి పురస్కారం లభించింది.
‘మిర్చిమసాలా’ సినిమాలో మిరపకారంపొడి తయారు చేసే కర్మాగారంలో ఎదురైన భయానక పరిస్థితుల నుండి బయట పడడానికి ఈమె ప్రయోగించిన చిట్కా ఈనాటి ఆడపిల్లలు గమనించాలి. ఈమె పాత్ర నేతృత్వంలో యజమాని కళ్ళలో కారం కొట్టి మహిళలు బయటపడి తమని తాము రక్షించుకోవడం విశేషం.
‘మండి’ వేశ్యాగృహాలలోని మహిళలకు సంబంధించిన కథాంశంతో కూడిన చిత్రం. ఈమె నటన పరాకాష్టకు చేరిన సినిమా ఇది. ఎదురు తిరిగి పోరాడిన గిరిజన పాత్రలు అసాధారణ నటనను ప్రదర్శించారు.
ఇలా అసాధారణమైన పాత్రలలో భారతీయ వెండితెరని అలరించి రాణిలా రాణించారు. ఇవి మచ్చుకి కొన్ని మాత్రమే!
సామాజిక సేవా కార్యకర్తగా తల్లి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు. అమ్మ, అక్కలతో పాటు ఈమె కూడా రాష్ట్ర సేవాదళ్ సభ్యురాలిగా పని చేశారు.
స్త్రీవాద ఉద్యమకారిణి కూడా! ముంబై ఉమెన్స్ సెంటర్లో సభ్యురాలిగా సేవలను అందించారు. మహిళల అభ్యున్నతిని ధ్యేయంగా ఎంచుకున్నారు. తొలినాటి సినిమాలలో సాంప్రదాయిక స్త్రీ పాత్రలలోను, మధ్య తరగతి స్త్రీల వ్యథాభరిత పాత్రలలోను జీవించి మెప్పించారు. మహిళల సమస్యలను చిత్రీకరించిన పాత్రలకు ప్రాముఖ్యమిచ్చారు.
కొన్నిసార్లు తను ధరించే దిగువ తరగతి, మధ్య తరగతి స్త్రీ పాత్రలను నటనతో పండించేందుకు చాలా కృషి చేసేవారు. ఆయా వర్గాల స్త్రీలు నివసించే ప్రాంతాలకు వెళ్ళి వారి జీవన విధానాన్ని, ఎదుర్కొంటున్న సమస్యలను నిశితంగా పరిశీలించేవారు. అందువల్లే ఆమె నటించిన సినిమా పాత్రలు ఆయా సినిమాలని సుసంపన్నం చేశాయి.
ఈమె తనకి తొలిసారి జాతీయ ఉత్తమ నటి పురస్కారం ద్వారా అందిన నగదును స్వచ్ఛంద సంస్థకి విరాళంగా అందించడం ఈమె సేవా గుణానికి, దాతృత్వానికి నిదర్శనం.
హిందీ సినిమాలు ‘భూమిక’ (1977), ‘చక్ర’ (1980) సినిమాలలోని పాత్రలకి ఊర్వశి, మరాఠీ సినిమాలు ‘జైత్ రే జైత్’ (1978), ‘ఉంబర్తా’ (1981) సినిమాలలోని పాత్రలకి, ‘చక్ర’ హిందీ సినిమా లోని పాత్రకి ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు లభించాయి. ఉంబర్తా సినిమాకి మహారాష్ట్ర ప్రభుత్వం వారి ఉత్తమ నటి ‘చిత్రపథ్’ పురస్కారం లభించింది.
ఈమె మరణాంతరం విడుదలయిన ‘మిర్చి మసాలా’ సినిమాలోని పాత్రకి ‘బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (BFJA) పురస్కారం’ లభించింది.
1984లో మాంట్రియల్ ప్రపంచ చలన చిత్రోత్సవంలో జ్యూరీ సభ్యురాలిగా పని చేసి సరికొత్త రికార్డును సృష్టించారు.
1985లో భారత ప్రభుత్వం వారి ‘పద్మశ్రీ’ పురస్కారం లభించింది. అప్పటికి ఈ పురస్కారాన్ని పొందిన వారిలో ఈమే పిన్న వయస్కులు.
ప్రముఖ నటుడు రాజ్‌బబ్బర్‌తో ఈమె తజుర్పా, ఆవామ్, ఆకీ ఆవాజ్, హమ్ దో హమారే దో మొదలయిన సినిమాలలో నటించారు. అప్పటికే ఆయనకి భార్యా పిల్లలున్నారు. మహిళాభివృద్ధి కోసం కంకణం కట్టుకుని అసామాన్యమైన కృషి చేసిన స్మిత ఈ విధంగా ప్రవర్తించడం చాలా వివాదాస్పదమయింది. తల్లి కూడా ఈమెను ప్రశ్నించారు. ఆమె ఎవరి మాటలను పట్టించుకోలేదు. చివరికి రాజ్‌బబ్బర్‌ను వివాహం చేసుకున్నారు.
1986వ సంవత్సరంలో స్మితాపాటిల్ ఒక కుమారుడికి జన్మనిచ్చారు. ఆమెకు ప్రసవ సమయంలో అనారోగ్య సమస్యలు తలెత్తాయి. రెండు వారాల తరువాత ఆరోగ్యం మరింతగా క్షీణించింది. ‘ప్యూర్ పెరల్ సెప్పిస్’తో బాధపడుతూ 1986 డిశంబర్ 13వ తేదీన మరణించారు.
అధునాతన వైద్య సౌకర్యాలు అభివృద్ధి చెందిన ఎనభయ్యవ దశకంలో ఈమె ఈ రకమైన సమస్యతో మరణించడం కూడా ప్రశ్నార్థకమే! తన ఆరోగ్యం పట్ల ఆమె నిర్లక్ష్యం కూడా కొంత కారణం కావచ్చు. ఏమయితేనేం 31 ఏళ్ళ వయస్సులోనే ఆమెకు నూరేళ్ళు నిండడం బాధాకరం. ఆమె మరణం ప్రసవ సమయంలో ఎదురయ్యే సమస్యలను నిర్లక్ష్యం చేయకూడదనే గుణపాఠాన్ని మహిళా లోకానికి అందించింది.
“చాలా వైద్యపరమైన నిర్లక్ష్యం కారణంగా ఈమె మరణించారని” ప్రముఖ న్యూవేవ్ సినిమా దర్శకులు మృణాల్ సేన్ అన్నారు. ఈమె మరణించిన రెండు దశాబ్దాల తరువాత ఈ అభిప్రాయాన్ని వ్యక్తపరచడం విశేషం.
1986లో ప్రియదర్శనీ అకాడమి అనే స్వచ్ఛంద సంస్థవారు ఈమె పేరుతో ‘స్మితాపాటిల్ మెమోరియల్ గ్లోబల్ అవార్డు ఫర్ బెస్ట్ యాక్టర్’ లను ప్రదానం చేయడం ప్రారంభించారు. ఒక స్వచ్చంద సంస్థ కీర్తిశేషురాలైన నటి పేరుతో పురస్కారాలను అందించడం ఆ సంస్థకి ఆమె పట్ల గల గౌరవాభిమానాలకి నిదర్శనం.
ఆమె మంచి ఫోటోగ్రాఫర్ కూడా! 1992 లో ‘నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్’ లో త్రూ ది ఐస్ ఆఫ్ స్మిత్’ (Through the Eyes of Smita) అనే ఛాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో ప్రదర్శింపబడిన స్మితా తీసిన ఫోటోలు ఫోటోగ్రఫీలో ఈమె నైపుణ్యానికి అద్దం పట్టాయి.
2011లో Reddiff.com వారు ‘స్వర్గీయ నర్గీస్ దత్ తరువాత రెండవ గొప్ప భారతీయ నటి’ అని కితాబు నిచ్చారు.
‘దక్కన్ హెరాల్డ్’ పత్రిక తరపున సురేష్ కోహ్లి ‘స్మితాపాటిల్ బహుశా హిందీ చిత్రసీమలో అత్యంత నిష్ణాతురాలైన నటి’ అని ప్రశంసించారు.
2021లో ‘స్మితాపాటిల్ డాక్యుమెంటరీ అండ్ షార్ట్ ఫిలిమ్ ఫెస్టివల్’ను నిర్వహించారు. ఇది భారతదేశ చిత్రపరిశ్రమలో ఈమె నటనా కౌశలానికి, సంఘసేవా దృక్పథానికి దక్కిన గౌరవం.
శ్యామ్ బెనెగల్ “కెమెరా వైపు ఆమె ఫోకస్ నన్ను ఆకర్షించింది. ఆమె చదివింది వార్తే అయినా నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది” అన్నారు. అందుకే సినిమాలలో నటించమని కోరి, భారత వెండితెరకు ఒక నక్షత్రాన్ని అందించారాయన. ఆ తారాకాంతులు, కళ్ళ మెరపులు, చమక్కులు ఈ నాటికీ ప్రేక్షకుల మదిని దోచుకుంటూనే ఉన్నాయి.
ఈమె జ్ఞాపకార్థం 2013 మే 3వ తేదీన ‘నూరేళ్ళ భారతీయ సినిమా’ సిరీస్‌లో ఒక స్టాంపును విడుదల చేసి గౌరవించింది భారత తపాలాశాఖ. 5 రూపాయల విలువతో విడుదలయిన ఈ స్టాంపు మీద మెరిసే కళ్ళతో నవ్వులొలికిస్తున్న స్మిత అందంగా కనిపిస్తారు.


డిశంబర్ 13వ తేదీ ఈమె వర్థంతి సందర్భంగా ఈ నివాళి.
***
Image Courtesy: Internet

5 Comments
gdkyyprml@gmail.com
స్మితాపాటిల్ ఏ పాత్ర పోషించినా సహజంగా అన్పించేది, ప్రేక్షకులు కూడా లీనం అయ్యేటట్లు నటించిన గొప్ప నటి. ఆమెకు శతకోటి వందనాలు…




కొల్లూరి సోమ శంకర్
Meeru Smita Patil meeda vraasina vyasan Anni konaalani santarinchukundi. Chaalaa baaga vachhindi garvanga cheppaalante. Nenu Ane cinemaalannee choosaanu.
Dhanyavaadamulu
A. Raghavendra Rao
Alluri Gouri Lakshmi
Smita is really a wonderful artist..she had butiful n expressive eyes..thanks Nagalakshmi garu for giving a comprehensive report on her short lived life..
Jhansi Lakshmi
అద్బుత నటి,సహజ నటి స్మితపాటిల్..ఆవిడ నటించిన ప్రతి సినిమా ఆణిముత్యం. హీరోయిన్ గా నటించే గ్లామర్ ఆమె సొంతమైన అవిడ de glamourous రోల్స్ లో కూడా అధ్బుతంగా ఇమిడిపోయాము..గొప్ప కళాకారులు మాత్రమే ఇలాంటి అవకాశం ఉపయోగించుకుంటారు..అంతటి మహానటి ఇప్పటి వరకు జీవించి ఉంటే ఎన్ని సంచలనాలను సృష్టిoచేవారో…అంతటి గొప్ప కళాకారిణి చిన్న వయసులో మరణించటం కళారంగం చేసుకున్న దురదృష్టం..స్మిత పాటిల్‌కు నివాళులు.. అధ్బుతంగా ఆ స్త్రీ మూర్తినీ పరిచయం చేసిన మీకు నమస్సులు
కొల్లూరి సోమ శంకర్
స్మితాపాటిల్ గారి గురించి చాలా బాగా వ్రాసారు. స్త్రీవాది,నటి, ఛాయాచిత్రకారిని, సామాజిక సేవాకర్తగా మంచి పేరు సంపాదించి చిన్నవయసు లోనే మరణిం చడం బాధాకరం. అయితే ప్రభుత్వ మరియు ఇతర సంస్థల ద్వారా పురస్కారాలు పొంది చిరస్థాయిగా పేరు పొందారు.మీ వల్ల ఆమె గురించి తెలుసుకోగలిగాము
వి. జయవేణి