[ది 23 డిసెంబర్ 2024న మృతి చెందిన ప్రముఖ సినీ దర్శకుడు శ్రీ శ్యామ్ బెనెగల్ గారికి నివాళిగా ఈ వ్యాసం అందిస్తున్నారు సోమంచి జయసూర్య.]
వందలాది యాడ్ ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్, మరెన్నో డాక్యుమెంటరీలు తీసిన అనుభవంతో ఫీచర్ ఫిల్ముల వైపు దృష్టి సారించి, సుమారు పాతిక సినిమాలు, కొన్ని టీవీ సీరియల్స్ తీసి జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన శ్యామ్ బెనగల్ నిండుగా జీవించి, ఈమధ్యే తన 90వ పుట్టినరోజు జరుపుకుని, మరో పది రోజుల్లోపే మరణించారు.
భారతీయ సినిమాని అంతర్జాతీయ స్థాయిలో తన మొదటి సినిమా ‘అంకుర్’ తోనే నిలబెట్టిన బెనగల్ దార్శనికుడూ, ద్రష్టా కూడా. నెరేటివ్ సినిమాకు ఒక కొత్త రూపునీ చూపునీ ఇచ్చిన ఆయన సినిమా ఎప్పుడూ నేల విడిచి సాము చెయ్యలేదు. సత్యజిత్ రాయ్ తరువాత మంచి సినిమాను సాధారణ ప్రేక్షకులకు దగ్గర చేసిన మహా దర్శకుడు శ్యామ్ బెనెగల్. సినిమాను సినిమాగా చూపిస్తూనే దాని స్థాయిని ఎంతో ఎత్తుకు తీసుకువెళ్ళడం ఒక ఎత్తయితే, సినిమాను సామాజిక అవగాహనకూ మార్పుకూ ఒక చైతన్య కేతనంలా ఎగరేసిన నిరంతర అధ్యయనశీలీ, నిత్య చైతన్యశీలీ శ్యామ్ బెనెగల్.
హైదరాబాద్ నిజామ్ కాలేజ్లో చదువుతున్న రోజుల్లోనే మంచి సినిమా మీద ప్రేమతో ఆయన కలకత్తా వరకూ వెళ్ళి సత్యజిత్ రాయ్ సినిమాలు చూసి ప్రభావితుడు అయ్యాడు. ఆ తరువాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ చదువుతున్నప్పుడు హైదరాబాద్‌లో మొట్టమొదటి ఫిలిం సొసైటీని ప్రారంభించారు బెనెగల్. కలకత్తాలో సత్యజిత్ రాయ్ తన మిత్రులతో మొదలెట్టిన ఫిలిం సొసైటీ ఉద్యమం మంచి ఊపందుకోవడంతో అది చూసిన శ్యామ్ ఇక్కడ కూడా మంచి సినిమాకు పునాది వేశారు.
‘అంకుర్’ సినిమా తీయడానికి ముందు దాదాపు పదేళ్ళపాటు ప్రచార చిత్రాలూ, కార్పోరేట్ చిత్రాలూ తీశారు. అనేక విషయాల మీద అంటే సామాజిక ఇతివృత్తాలు, కళలు, సైన్స్, ఆంత్రొపాలజీ వంటి విషయాల మీద ఎన్నో డాక్యుమెంటరీలు తీసి పేరు తెచ్చుకోవడమే కాక, తన ఫిలిం మేకింగ్ నైపుణ్యాన్ని మెరుగు పెట్టుకున్నారు. కాలేజ్ రోజుల్లో తను రాసుకున్న కథ ఆధారంగా ‘అంకుర్’ సినిమాకి అంకురార్పణ చేశారు. 1973లో పూర్తిగా అవుట్‌డోర్‌లో, రంగుల్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ‘అంకుర్’ నిర్మాణం సాగింది. భూస్వామ్య వ్యవస్థలో దళితులపై సాగిన అరాచకాల నేపథ్యంలో పీడన గురించిన ఒక విభిన్నమైన కథను బిగి సడలకుండా చెప్పడంలో కామెరానూ సౌండ్నూ బెనెగల్ ఉపయోగించిన తీరు ఎంతో పేరు తెచ్చుకుంది. కాస్ట్, క్లాస్, జండర్ అసమానతలనూ వాటిలోని డైనమిక్స్‌నీ ఎక్కడా మెలోడ్రామాకు తావివ్వకుండా పట్టు సడలని కథన శైలితో ఆకట్టుకుంటాడు బెనెగల్. పేదల మీద జరిగే పీడన ప్రధానాంశంగా ఆయన తీసిన మొదటి మూడు సినిమాలూ, ‘అంకుర్’, ‘నిశాంత్’, ‘మంథన్’.. గ్రామీణ నేపథ్యం గలవే. ‘అంకుర్’, ‘నిశాంత్’ తెలంగాణా జీవితాన్ని ప్రతిబింబిస్తే, ‘మంథన్’, గుజరాత్ లోని సహకార పాల కేంద్రాల నేపథ్యంలో రూపొందిన మొదటి క్రౌడ్ ఫండెడ్ సినిమాగా చరిత్రలో నిలుస్తుంది. భూస్వాముల దౌష్ట్యం మీద ప్రజల తిరుగుబాటును కథాంశంగా తీసిన ‘నిశాంత్’లో గగుర్పాటు కలిగించే సన్నివేశాలతో పాటు మరికొన్ని మెడిటేటివ్ మూమెంట్స్‌ని కూడా బెనెగల్ తన స్క్రీన్‌ప్లేలో రాసుకున్న తీరు, వాటికి నేపథ్య సంగీతంతో చెక్కిన నగిషీలు అప్పటి భారతీయ సినిమాలో కొత్త పోకడలు.
అంకుర్, నిశాంత్ లలో తెలంగాణా లాండ్‌స్కేప్‌ను మొదటిసారిగా స్క్రీన్ మీద చూపించారు. వీటిలో శబ్దాన్నీ చిత్రాన్నీ కాంప్లిమెంటరీగా అనుసంధానించిన పద్ధతి అమోఘం. నేపథ్య సంగీతంలో సహజమైన శబ్దాలను రీ రికార్డింగ్‌లో దృశ్యంలోని మూడ్‍కి తగ్గట్టుగా మిక్స్ చెయ్యడంలో పరిణతి సాధించారు బెనెగల్.
తన ఫిల్మ్ కెరీర్‍లో మొదటి రెండు దశాబ్దాల్లో టెక్నిక్ పరంగా ఎన్నో ప్రయోగాలు చక్కగా చేశారు శ్యామ్. ఆ దశలో వచ్చిన దాదాపు అన్ని సినిమాల్లోనూ ఏదో ఒక నూతనత్వం వస్తుపరంగానూ శిల్పపరంగానూ మనకు కనిపిస్తుంది. తన సృజనాత్మక ప్రయోగాల ద్వారా సినిమా పరిభాష పరిధులను విస్తృతం చేస్తూ ఒక కొత్త మీడియమ్‍ని ప్రవేశపెట్టారు. ప్రధానంగా భూమిక, అనుగ్రహం/కొండురా చిత్రాల్లో గోవింద్ నిహలానీ కామెరా ద్వారా ఎన్నో కొత్త పుంతలు తొక్కారు శ్యామ్. 1940ల్లో హిందీ, మరాఠీ చిత్రాల పాపులర్ నటి హంసా వాడ్కర్ జీవిత కథ ఆధారంగా తీసిన భూమిక సినిమాతో లీనియర్ నెరేటివ్‌ని కాదని నాన్ లీనియర్ పద్ధతిలో కథను ఎంతో ఆసక్తిదాయకంగా నడిపిస్తారు బెనెగల్. అలాగే ఫ్లాష్‌బాక్‌లో నలుపు తెలుపులనూ సెపియా టోన్నూ వాడడం అప్పట్లో ఒక కొత్త టెక్నిక్. పీరియడ్ ఫిల్మ్ నేపథ్యాన్ని మనసుకు హత్తుకునేలా చూపించడానికి, పాటనూ ఆటనూ చిత్రీకరించడంలో వాడిన కలర్స్, కాస్ట్యూమ్స్, సెట్ ప్రాపర్టీస్‌ని 1940ల నాటి బాలీవుడ్ ఫిల్ముల చిత్రీకరణ ఎలా ఉండేదో తెలిపేలా ప్రొడక్షన్ డిజైన్ని సెట్ చేసి తీసిన చిత్రం ‘భూమిక’. స్మితా పాటిల్‌కి ఉత్తమనటి పురస్కారం తెచ్చిపెట్టిన ఈ సినిమా వస్తువరంగా కథనశైలి లోనూ శ్యామ్ బెనెగల్‍కి ఒక సవాలు వంటిది. అనంత్ నాగ్, అమోల్ పలేకర్, అమ్రీష్‌పురీ లతో పాటు నసీరుద్దీన్ షా నటన కూడా పెద్ద అసెట్‍గా నిలిచి ‘భూమిక’ను ఒక మాస్టర్ పీస్ చేసింది.
సిపాయిల తిరుగుబాటు నేపథ్యంలో రచయిత రస్కిన్ బాండ్ రాసిన ది టూ పీజియన్స్‌ని శ్యామ్ దర్శకత్వంలో శశికపూర్ ‘జునూన్’ పేరుతో నిర్మించారు. ఈ చిత్రానికి గోవింద్ నిహలానీకి జాతీయ అవార్డు వచ్చింది. దీనికోసం మూడు కామెరాలు వాడారు. మల్టీ కామెరా సెటప్ వినియోగించిన మొదటి బెనెగల్ సినిమాగా నిలుస్తుంది ‘జునూన్’. ముస్లిమ్ యోధుడు, యూరపియన్ యువతి ప్రేమకథ ‘జునూన్’.
‘కల్ యుగ్’ సినిమాను 1981లో తీశారు బెనెగల్. శశి కపూర్ నిర్మాత. కార్పొరేట్ ప్రపంచంలో బెనెగల్ ఆవిష్కరించిన ఆధునిక మహా భారతం ‘కల్ యుగ్’. 1982లో వచ్చిన ‘ఆరోహణ్’ శ్యామ్ బెనెగల్ సినిమాల్లో తక్కువ పేరు వచ్చిన సినిమా. కౌలురైతుల వెతల గురించి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్మించిన ఈ సినిమా ద్వారా నటుడు ఓమ్‍పురికి ఉత్తమ నటుడిగా జాతీయ బహుమతి వచ్చింది. 1960 దశకం మధ్యనుంచి 1980 వరకూ నడిచిన బెంగాల్ రైతాంగ చరిత్రకు అద్దం పట్టిన ఈ చిత్రం శ్యామ్ బెనెగల్ చిత్రాల్లో విశిష్టమైనది. నేపథ్య సంగీతంగా బౌల్, టప్పా జానపద సంగీత రీతుల సరిగమలు, చిత్రం చివరిలోని వరద సన్నివేశాలు మనల్ని కట్టిపడేస్తాయి.
1983 లో వచ్చిన ‘మండీ’, శ్యామ్ కెరీర్లో ఒక కొత్త మలుపు. వేశ్యా వాటిక ప్రాంగణంలో ఎన్నో పాత్రల సమ్మేళనంలో తెరకెక్కిన ఈ హ్యూమన్ డ్రామాలో అప్పటి హిందీ చిత్రసీమలో కారక్టర్ నటుల అపూర్వ సంగమాన్ని ఒక casting coup గా వర్ణించవచ్చు. అప్పటిదాకా శ్యామ్ బెనెగల్ కుడిభుజంగా ఉండిన గోవింద్ నిహలానీ దర్శకుడిగా బిజీ కావడంతో ఆ స్థానంలోకి వచ్చాడు అప్పటికే సినిమాటోగ్రాఫర్‍గా జాతీయ బహుమతి పొందిన అశోక్ మెహతా. ఈ చిత్రంతో మొదలైన శ్యామ్, అశోక్‍ల బంధం మరో రెండు ఆణిముత్యాలు ‘త్రికాల్’, ‘సుస్మన్’ వరకూ కొనసాగింది. వీళ్ళ కాంబినేషన్‍లో బెనెగల్ సినిమాల లుక్ మారింది. ‘మండీ’లో సహజమైన వెలుతురుతో పాటు వివిధ వర్ణ సమ్మేళనాన్ని చక్కగా వాడుకున్నారు.
‘త్రికాల్’ సినిమా నేపథ్యం గోవా విముక్తి పోరాటం. ఇందులో కొవ్వొత్తి వెలుతురులో ఎన్నో సన్నివేశాలు రక్తి కట్టాయి. నేత కార్మికుల జీవన పోరాటమే ప్రధానాంశంగా పోచంపల్లిలో చిత్రీకరించిన ‘సుస్మన్’లో సహజమైన కాంతిలో నేతన్నల అస్తిత్వ వేదనను అపూర్వంగా చిత్రీకరించారు.
పూర్తి నిడివి కథాచిత్రాలతో పాటు జాతీయనాయకుల గాంధీ, బోస్‍ల జీవితాలను టీవీ సీరియల్స్‌గా తీశారు. వాటిలో ‘యాత్ర’ వంటి సీరియల్సే కాక, ‘కథా సాగర్’, ‘అమరావతీ కీ కథాయే’ (సత్యం శంకరమంచి అమరావతి కథలు) వంటి కథా మాలికలను హృద్యమైన సీరియల్స్‌గా మలిచారు బెనెగల్.