Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సముద్రానికి మానవీయ స్వభావం కల్పించిన కవిత ‘పసిఫిక్ తీర కెరటం’

[డా. కొండపల్లి నీహారిణి రచించిన ‘పసిఫిక్ తీర కెరటం’ అనే కవితని విశ్లేషిస్తున్నారు శ్రీ సందినేని నరేంద్ర.]

ప్రముఖ కవయిత్రి, జర్నలిస్ట్, మయూఖ, తరుణి పత్రికల సంపాదకులు, డాక్టర్ కొండపల్లి నీహారిణి కలం నుండి జాలువారిన ‘పసిఫిక్ తీర కెరటం’ కవితపై విశ్లేషణా వ్యాసం ఇది. ఈ కవిత పసిఫిక్ మహా సముద్రం యొక్క అల్లకల్లోలమైన అలలతో కూడిన తీర ప్రాంతాన్ని సూచిస్తుంది. భూకంపాలు, అగ్నిపర్వత విస్పోటనలు వంటివి సముద్రంలో పెద్ద అలలను సృష్టిస్తాయి. వీటిని సునామీలు అంటారు. కెరటం అంటే ప్రధానంగా నీటిలో వచ్చే అల. ఇది సముద్రంలో ఏర్పడే ఉప్పెనను సూచిస్తుంది. పసిఫిక్ సముద్రంలోని కెరటాలను చూడగానే కవయిత్రి మనసులో చెప్పలేని ఎన్నో ఊసులు, అపూర్వమైన భావాలు కలిగి పరవశంతో ఈ కవితకి బీజం పడింది. కవయిత్రి తన జీవితంలో ఎదురయ్యే సంఘటనలను సముద్ర కెరటాలుగా భావిస్తున్నారు. పసిఫిక్ తీర కెరటాలలో తాను పొందిన ప్రతి అనుభవం, చూసిన ప్రతి దృశ్యం తనలో గొప్ప మార్పుకి శ్రీకారం చుట్టింది. ఇక పసిఫిక్ సముద్రపు తీర కెరటం కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారిద్దాం. అలౌకిక అనుభూతుల లోకంలో విహరిద్దాం.

“నా నుండి ఏ దృశ్యమూ
నన్ను గాయపరచకుండా పోలేదు
ఈ విశాల ప్రపంచం అడుగులకు
పొద్దు మాపులను మోపు చేసినప్పటి నుండి
నేనొక అనిర్వచ వాక్యమవుతూనే ఉన్నాను”

ఇందులోని భావనల్లో తీవ్రత ఉంది. విశాలత్వం కూడా ఉంది. కొంత విచ్ఛిన్నత కూడా కనిపిస్తుంది. పసిఫిక్ తీరం మిక్కిలి విస్తారమైనది. “నా నుండి ఏ దృశ్యమూ/నన్ను గాయపరచకుండా పోలేదు” అంటున్నారు. కవయిత్రి తాను జీవితంలో చూసిన ప్రతి దృశ్యం తన కళ్ళకు సరైన చూపును, ఒక గొప్ప అనుభవాన్ని, గాఢమైన సంబంధాలను ఏర్పరచిందని, తన ఎదను గాయంగా మార్చిందని చెప్పే తీవ్రమైన బాధతో కూడిన వ్యక్తీకరణను సూచిస్తుంది. ఇది ఎన్నో బాధల, అసంతృప్తుల సంకలనం. కవయిత్రి తాను చూసిన ప్రతి దృశ్యం, ప్రతి సంఘటన, తన గుండెను గాయం చేసిందని చెబుతున్నారు. ఇది జీవితపు బాధల తీవ్రతను చూపించే కవితా పంక్తిగా పేర్కొనవచ్చు.

“ఈ విశాల ప్రపంచం అడుగులకు/పొద్దుమాపులను మోపు చేసినప్పటి నుండి/నేనొక అనిర్వచ వాక్యమవుతూనే ఉన్నాను” అంటున్నారు. కవయిత్రి తాను ప్రపంచపు అడుగుల కింద కాల భారం మోసుకుంటూ వచ్చానని చెప్పుకుంటున్నారు. తాను ఈ లోకంలో ఒక అల్పమైన జీవిని మాత్రమేనని ఊహించుకుంటున్నారు. విశాలమైన విశ్వంలో తాను కేవలం ఒక బిందువు మాత్రమే అని భావిస్తున్నారు. ఇది తన నిస్సహాయతను, విశ్వం విస్తృతిని సూచిస్తుంది. పొద్దు మాపుల సమయం తనపై భారంగా, బరువుగా పడుతున్నది. ఎందుకో తెలియదు జీవితం వ్యక్తపరచలేని ఒక అసంపూర్ణ వాక్యంలా కొనసాగుతున్నది. కదిలే కాల ప్రవాహం మనల్ని ఎప్పటికీ ముందుకు నడిపిస్తూనే ఉంటుంది. కానీ, ఆ వాక్యం పూర్తిగా చెప్పబడదు. ఎప్పటికీ నిర్వచింపలేని వాక్యంగా మిగిలిపోతుంది. కాలం కల్పించిన అనుభవాలు, గాయాల మధ్య తాను ఒక అసంపూర్ణ వాక్యంలా మారిపోతున్నాను అని కవయిత్రి భావిస్తున్నారు. ఈ కవితా పంక్తిలో జీవితం అనిర్వచ వాక్యంగా, ఎప్పటికీ పూర్తిగా పలకలేని మాటగా చూపించడం,ఇది అస్తిత్వ వేదనను తెలుపుతున్నది. ఇందులో జీవితాన్ని సముద్రంలోని కెరటాల వలె బాధలతో నిండినదిగా చూపిస్తున్నది. ప్రపంచ విస్తృతిలో కాల భారం, ప్రతి దృశ్యం ఒక గాయమై మిగిలిపోతున్నది. కవయిత్రి తాను ఒక అసంపూర్ణ వాక్యంలా, నిర్వచించలేని జీవన సంఘటనలా ఊహించుకుంటున్నారు. పొద్దు మాపులు, అనిర్వచ వాక్యాలు వంటి చిత్రాలు కవిత్వానికి, సౌందర్యం చేకూర్చాయి. ఏ దృశ్యము నన్ను గాయపరచకుండా ఉండలేదు అనే కవితా పంక్తి తనలోని బాధను గాఢతరం చేస్తున్నది. పసిఫిక్ సముద్రం ప్రశాంత గాంభీర్యాన్ని, అందులో ఎగసిపడే కెరటం కలతను సూచిస్తున్నది. ఇది కవితలోని ఘర్షణను ప్రతిబింబిస్తుంది. కవయిత్రి తాను మాటల్లో వ్యక్తం చేయలేని స్థితిని చూపిస్తుంది. ఇది ఆధునిక కవిత్వానికి ముఖ్యమైన లక్షణంగా భావించవచ్చు. ఇది నవీన నాగరికతను, మనిషి అనుభవాన్ని, అతిశయోక్తిగా ప్రతిబింబిస్తున్నది. విశాల విశ్వంలో తాను చేసే చిన్నపాటి ప్రయాణం, ప్రతి అనుభవం వల్ల తనకు ఏర్పడిన గాయాలు, వీటన్నింటి ఫలితంగా తాను నిర్వచింపలేని వాక్యంగా మిగిలి పోతున్నది.

“ఇక్కడ చలి నెగళ్ళ ప్రస్తావన
అక్కడేమో జ్వలననాదాలు”

ఈ కవితా పంక్తులలో విరుద్ధ భావాల సౌందర్యం ప్రధానంగా కనిపిస్తోంది. చలి నెగళ్ళు అంటే గాఢమైన చలి గుర్తుకొస్తుంది. శరీరాన్ని చీల్చే చల్లని గాలి, సూదులు గుచ్చే చలి, కఠినమైన గడ్డ కట్టించే చలి అనే వాస్తవాన్ని తెలియజేస్తుంది. చలి నెగళ్ళ ప్రస్తావన అనే పదం కవితాత్మకంగా తన ఆలోచనల్లోని చలిని తెలియజేస్తుంది. అక్కడేమో జ్వలన నాదాలు అంటున్నారు. జ్వలనం అంటే దహించు, నాదాలు అంటే ధ్వనులు, ప్రతిధ్వనులు. ఒక చోట గడ్డ కట్టే చలి మరొక చోట దహించే అగ్ని సృష్టించే ఆర్తనాదాలు. ఇందులో విరుద్ధ భావాలలో సమన్వయం ఉంది. ఈ రెండు కవితా పంక్తులు కలిసి మనిషి అనుభవాల ద్వంద్వ రీతులను ప్రతిబింబిస్తాయి. చలి నెగళ్ళు – నిరాశ, వేదన, ఒంటరితనం, శూన్యతను తెలుపుతాయి. జ్వలన నాదాలు – ఆవేశం, కోపం, శూన్యం, తిరుగుబాటు, ఉత్సాహాలను తెలుపుతాయి. ఒక వైపు మనసు చల్లని శూన్యతలో ఉంది. ఇంకో వైపు మనసు దహించే ఆవేశాలతో నిండి ఉండటం చూస్తాం. కవయిత్రి చెబుతున్నది ఏమంటే మనిషి జీవనంలో ఒకే సమయంలో గడ్డకట్టే నిశ్శబ్దం, దహించే భావోద్వేగాలు రెండు ఉంటాయి అని, ఆ విరుద్ధతలే మనసులోని అంతర్గత సంఘర్షణలను ప్రతిబింబిస్తాయి. ఒకే సందర్భంలో పరస్పర విరుద్ధమైన భావాలతో కూడిన దృశ్యాలను మన ముందుంచి కవిత్వానికి ఒక గాఢతను తీసుకుని వచ్చారు.

“మనదైన బుద్ధి చాపల్యమో
తమదైన సత్తువ లేని తనమో
అన్నీ మరుపు తట్ట కెక్కిస్తుంటాము
ఒకానొక సూరీడు
ఉత్తర విహారమొక్కటి చేయమంటున్నాడు
దేశ మధ్య భాగమే
మన దేశ హృదయ భాగమయ్యుంటే
కిరణ తాపడాల
భావ యుద్ధాలు జరుపుతున్నట్టు
సముద్రం సంకేత పవనాలను పంపుతున్నట్టు
అదిమిపట్టిన దుఃఖం
నా కళ్ళ ముందు కడలి ఉప్పొంగుతూనే ఉన్నది”

ఈ కవితా పంక్తులలో లోతైన సామాజిక, రాజకీయ భావనలతో పాటు మనిషి పడుతున్న వేదన, ఆందోళన గాఢంగా వ్యక్తం అవుతున్నాయి.

“మనదైన బుద్ధి చాపల్యమో/తమదైన సత్తువ లేని తనమో/అన్నీ మరుపు తట్ట కెక్కిస్తుంటాము” అంటున్నారు. ఇక్కడ మనదైన బుద్ధి చాపల్యం అంటే మన ప్రజల అవివేకం, తడబాటు, ఆత్మ పరిశీలన లేకపోవడాన్ని సూచిస్తుంది. ఇది మన ఇప్పటి సామాజిక, రాజకీయ పరిస్థితుల ప్రతిబింబం. ఈనాటి ప్రజలకు సరైన ఆలోచన, వివేకం, సమగ్ర దృష్టి లోపించడాన్ని తెలుపుతుంది.

“తమదైన సత్తువలేనితనం” అంటున్నారు. పాలకవర్గంలోని అధికారులు, నాయకులు, నీతి సూత్రాల ప్రకారం నడుచుకోకపోవడం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వారికి లేకపోవడాన్ని విమర్శిస్తున్నారు. ఇది సమాజానికి గణనీయంగా ఉపయోగపడే సంకేతం. “అన్నీ మరుపు తట్ట కెక్కిస్తుంటాము” అంటున్నారు. సమాజం అనుభవిస్తున్న బాధలను, సమస్యలను కాలానుగుణంగా మోస్తూ వాటిని మరిచిపోతున్నాం అనేది వాస్తవం. ఇది సామూహిక జ్ఞాపకంపై బలహీనతను సూచిస్తున్నది. ఇది మన సమాజపు తీరుతెన్నులు, గతకాలపు చరిత్రను మరిచిపోయే స్వభావాన్ని తెలుపుతున్నది. సమస్యలు వచ్చినప్పుడు కాసేపు కలవరపడతాం. కానీ, వెంటనే వాటిని మరిచిపోవడం, ప్రజాస్వామ్యపు బలహీనతను, నిరంతర జాగృతి లేకపోవడాన్ని సూచిస్తుంది.

“ఒకానొక సూరీడు/ఉత్తర విహారమొక్కటి చేయమంటున్నాడు” అంటున్నారు. సూరీడు ఇక్కడ శక్తివంతమైన పాలకుడు. ఉత్తర విహారం ఆధిపత్య దండయాత్రకు సంకేతం. ఇది ప్రభుత్వాల,శక్తివంతుల నిర్ణయాలను సూచిస్తుంది. ఇక్కడ ప్రజల ప్రయోజనం కంటే అధికార ప్రదర్శనకే ప్రాధాన్యం ఎక్కువ. అభివృద్ధి పేరిట కొత్త యాత్రలు, కొత్త ప్రాజెక్టులు చేపడతారు. కానీ, ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యల పరిష్కారం మాత్రం అటకెక్కిపోవడం, పాలకుల దుర్నీతిని ప్రతిబింబిస్తుంది.

“దేశ మధ్య భాగమే/మన దేశ హృదయ భాగమయ్యుంటే” అంటున్నారు. ఇక్కడ దేశ భౌగోళికతను ప్రస్తావిస్తూ దేశ మధ్య ప్రాంతం అని మన దేశ ప్రజల్లో చెలరేగే భావోద్వేగతను చక్కగా విడమర్చి చెప్పారు. దేశ మద్య భాగం అంటే రాజనీతి, ఆర్థిక, సాంస్కృతిక కేంద్రం అని చెప్పడం, దేశాన్ని వ్యక్తిగా భావించి దాని హృదయాన్ని ఆవిష్కరించిన తీరు బాగుంది. కవి ఇక్కడ మన దేశ సమగ్రతకు ప్రాధాన్యతను అందించడం గురించి చెబుతున్నారు. దేశ మధ్య భాగం అంటే అది కేవలం భౌగోళికం కాదు. అది సామాజిక,సాంస్కృతిక కేంద్రం. దేశ హృదయం బలహీనం అయితే మొత్తం దేశ ప్రజల ఉనికికి ముప్పు వాటిల్లుతుంది.

“కిరణ తాపడాల/భావ యుద్ధాలు జరుపుతున్నట్టు” అంటున్నారు. కిరణ తాపడాలు అనగా సూర్య కిరణాల వేడి. ఇది ప్రకృతి యొక్క శక్తిని సూచిస్తుంది. దీనిని భావ యుద్ధంతో పోల్చడం, మన మనసులోని సంఘర్షణలు, సమాజంలోని తాపత్రయాలు, ప్రకృతి శక్తులు దహించేవిగా మారడాన్ని సూచిస్తున్నారు. ఇది ఆధునిక సమాజంలో మనుషుల మధ్య ఉన్న విభేదాలు, విరోధాలు, వేడెక్కిన రాజకీయ వాదనలు, సాంప్రదాయం మరియు ఆధునికత మధ్య చెలరేగే సంఘర్షణలు, విలువల మధ్య జరుగుతున్న పోరాటాన్ని తెలుపుతున్నవి.

“సముద్రం సంకేత పవనాలను పంపుతున్నట్టు” అంటున్నారు. సముద్రం రహస్య సూచనలను పంపడం, ఇందులో ప్రకృతి మానవ సంబంధాల ప్రస్తావన ఉంది. ప్రకృతి కూడా మానవ సంఘర్షణపై ప్రతిస్పందిస్తోంది. ప్రకృతి కూడా మనిషికి సంకేతాలు ఇస్తున్నది. ప్రకృతిలో సంభవించే వాతావరణ మార్పుల వల్ల వరదలు ముంచెత్తుతున్నాయి. అతివృష్టి, అనావృష్టి వల్ల కరువుల బారిన పడడం, కనీస అవసరాలకు లోటు ఏర్పడి, తినడానికి తిండి లేక, చేసేందుకు ఉపాధి లేక వలసలు పెరగడం వంటి దారుణమైన స్థితి ఏర్పడింది. ఇవన్నీ మానవులకు ప్రకృతి చేసిన హెచ్చరికలుగా భావించాలి. కవయిత్రి మన జీవన విధానాన్ని, ప్రకృతిలో భాగమైన సముద్రపు ప్రతిస్పందనగా సూచిస్తున్నారు.

“అదిమి పట్టిన దుఃఖం/నా కళ్ళ ముందు కడలి ఉప్పొంగుతూనే ఉన్నది” అంటున్నారు. ఇది వ్యక్తిగత వేదన కాదు. ఇందులో సమాజంలో నివసిస్తున్న ప్రజలు ఎదుర్కొంటున్న బాధల తీవ్రత ఉంది. కడలి ఉప్పొంగడం అంటే దుఃఖం నిరంతర తరంగాల్లా మనసులో ఉప్పొంగుతూ ఉండడం. ఇది కవిత్వంలోని ఉత్కర్షమైన భావోద్వేగాల తీవ్రతను తెలియజేస్తుంది. ఇది వ్యక్తిగత వేదన కాకుండా జనజీవన వేదన. సమాజంలో నెలకొన్న సమస్యలు, అవినీతి, అన్యాయం, పాలకుల నిర్లక్ష్యం ఇవన్నీ కవయిత్రి మనసులో సముద్రంలా ఉప్పొంగుతున్నాయి. కవయిత్రి తాను అనుభవిస్తున్న బాధ కాకుండా సమాజం కోసం తాను పడుతున్న తపనను తెలియజేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్లక్ష్యం, నాయకుల వైఫల్యం, దేశం ఎదుర్కొంటున్న అంతర్గత సంఘర్షణలు, ప్రకృతి హెచ్చరికల నేపథ్యంలో కవయిత్రి మదిలో ఉప్పొంగుతున్న దుఃఖ సముద్రాలలో ఇప్పటి సమాజపు బాధ, అస్థిరత కనిపిస్తున్నది. ప్రజానాయకులైన పాలకుల వైఫల్యం, ప్రజల బలహీనత, మరుపు మనస్తత్వం, దేశ రాజకీయ సాంస్కృతిక సంఘర్షణలు, ప్రకృతి ప్రతిస్పందనలు ఇవి అన్ని ఒక పోరాటంగా వ్యక్తమవుతున్నాయి. కవయిత్రికి సముద్రంలా నిరంతరం ఉప్పొంగుతున్న దుఃఖం కనిపిస్తున్నది.

“ఏదీ నాది కాకుండా పోనన్నప్పుడు
ఆక్రమిత దృశ్యాల ముందు
సమయాన్ని తిట్టిపోస్తూ
వానాకాలం ఎండ నుంచో
ఆషాడపు మేఘం నుంచో
అంతః ప్రేరణ పొందని
మనసు స్పందన తెలపని
వింత జనంలో
శరీరాన్ని వేలాడదీస్తూ
నలుగురులో నడవటం నేర్పినం
నయం అనుకుంటూ..
మర బొమ్మల మవుతున్నాం”

ఇది వ్యక్తిగత అనుభూతులు, అంతరంగంలోని నిరాశ, నిరీక్షణల మధ్య సాగే ఒక అద్భుత చిత్రణ. ఇది వ్యక్తి లోపల ఉన్న విరుద్ధ భావోద్వేగాల ప్రతిబింబం. ఇది ఆధునిక కవిత్వం శైలిలో ఉంది. ఇందులోని భావ స్రవంతి, కాలంపై అసహనం, విసుగైన జీవన ప్రవాహం, ఈనాటి యాంత్రికతలో చిక్కుకున్న మానవుల చుట్టూ తిరుగుతున్నాయి.

“ఏది నాది కాకుండా పోనన్నప్పుడు/ఆక్రమిత దృశ్యాలముందు/సమయాన్ని తిట్టిపోస్తూ” అంటున్నారు. మనసుకు దగ్గరైన దానిని కోల్పోవడం వల్ల కలిగే బాధను కవయిత్రి ఇక్కడ చిత్రిస్తున్నారు. మనసుకు దగ్గరైన దానిని కోల్పోయిన బాధతో, కాలాన్ని నిందించే మానవ సహజ స్థితిని స్పష్టం చేస్తున్నారు. వ్యక్తి కోల్పోయిన అనుబంధాన్ని తిరిగి పొందలేకపోవడం, కాలాన్ని శపించడం ఒక సహజమైన ప్రతిస్పందన. అది కేవలం వ్యక్తిగత నష్టం మాత్రమే కాదు. కాలానుగుణంగా ప్రతి మనిషి అనుభవించే మానసిక విసుగు. తాను కోల్పోయిన వాటి పట్ల మనసులోని శూన్యత, సమయంపై ఆగ్రహం ఇక్కడ స్పష్టమవుతుంది. జీవితంలో మనం ఎదుర్కొనే పరిమితులు, ఇతరుల నియంత్రణలపై నిరసన, ఇక్కడ కవయిత్రి మన సొంతమైనది ఏది లేని స్థితిని చెబుతున్నారు. ఆక్రమిత దృశ్యాలు అంటే మన చుట్టూ ఉన్న పరిసరాలను మనవి కాకుండా ఇతరుల ఆధిపత్యంలో ఉండటం. మన కంటికి కనిపించినప్పటికీ వాటిని మనం నియంత్రించలేని పరిస్థితులు, సమయాన్ని నిందించే తనలోని బలహీనత, మనసులోని అసహాయత, అసహనాన్ని ఇది వ్యక్తపరుస్తున్నది.

“వానా కాలపు ఎండనుంచో/ఆషాఢపు మేఘం నుంచో” అంటున్నారు. వానా కాలంలో కూడా ఎండ రావడం, ఆషాడంలో మేఘం రావడం అనే దృశ్యాలు, వైరుధ్యాలతో నిండిన జీవనాన్ని సూచిస్తాయి. ప్రకృతిలోని వివిధ సంఘటనల రూపంలో మన జీవన పద్ధతులను కవయిత్రి చూపిస్తున్నారు. వానా కాలపు ఎండ అనూహ్యం, అసహజం. ఇది ఋతువుకి విరుద్ధమైన దృశ్యం. ఆషాడపు మేఘం భారంగా ఉండి కూడా వర్షం కురిపించని మేఘంలాగా మనసుకు ఉపశమనాన్ని ఇవ్వని పరిస్థితులను భావోద్వేగాల ఘనతను ప్రతిబింబిస్తున్నది. ఆషాడపు మేఘం భారమై ఉన్న భావోద్వేగం, వర్షం కురిపించని స్థితి. కవయిత్రి ఇక్కడ ప్రకృతి ప్రతీకలతో తన మనో వేదనను స్పష్టపరుస్తున్నారు. వర్షాకాలంలో ఎండ, వర్షం కురిపించని మేఘంలా మనిషి ఆశలు, మనసు, సంతృప్తి లేకుండా పోయిన స్థితి స్పష్టమవుతుంది.

“అంతః ప్రేరణ పొందని/మనస్సు స్పందన తెలుపని వింత జనంలో”అంటున్నారు. సృజనాత్మకత లేకుండా జీవించే జనాన్ని వింత జనం అని పిలుస్తున్నారు. ఇది ఆధునిక సమాజపు అజాగ్రత్త, స్పందనలేమితనం, భావనల శూన్యతను సూచిస్తోంది. అంతర్గత ప్రేరణ లేకపోవడం అంటే మనసులో ఖాళీతనం, స్పందించని జనంలో సమాజం తన బాధను పట్టించుకోని స్థితి. ఇది వైరాగ్య భావనను తెలుపుతుంది. మన చుట్టూ ఉన్న సమాజం నిస్పృహతో మరియు స్పందన లేని యాంత్రికతతో ఉంది అని కవయిత్రి భావిస్తున్నారు. అంతరంగానికి వెలుగు ఇవ్వని హృదయానికి స్పర్శ లేదు. ఆశ ఉన్నా ఫలితం రాని పరిస్థితి. మనసు స్పందించని జనంలో ఉండే బలహీనత. ఇవి ఆధునిక మనిషి యాంత్రిక జీవితాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఇది ఆధునిక సమాజంలోని మూగబోయిన మనుషులను సూచిస్తుంది. యాంత్రికత నిండిన ఈ జన సమూహంలో అనుభూతులకి, స్పందనలకు స్థానం లేదు అని కవయిత్రి చెప్పిన తీరు వాస్తవికంగా ఉంది.

“శరీరాన్ని వేలాడదీస్తూ/నలుగురిలో నడవటం నేర్పినం/నయం అనుకుంటూ..” అంటున్నారు. మనిషి తన అసలైన స్వరూపాన్ని కోల్పోయి సమాజం నిర్దేశించిన పాత్రను పోషించే స్థితిని ఈ కవితా పంక్తులు చూపిస్తున్నాయి. మనసు మౌనంగా ఉన్నా యథాలాపంగా శరీరం తన పని తాను చేసుకుంటూ వెళ్లడం, అదే జీవితం అనుకోవడం, ఇది ఆధునిక జీవనంగా కొనసాగుతున్నది. సమాజపు ఒత్తిడిలో మనం శరీరాన్ని మాత్రమే మోసుకుంటూ బాధ పడ్డ మనసుతో, భారంగా నడుస్తున్నట్టుగా చెప్పడం, ఈనాటి యాంత్రిక జీవితాన్ని తెలుపుతుంది. వ్యక్తికి తనకు ఇష్టం లేకపోయినా సమాజం విధించిన కట్టుబాట్లు, పద్ధతుల ప్రకారం నడుచుకోవడం, ఇది ఆధునిక సమాజంలో వ్యక్తిత్వం లేనితనాన్ని తెలుపుతుంది. శరీరం లాక్కెళ్ళినట్లు నడవడం అనేది యాంత్రిక జీవితాన్ని సూచిస్తుంది. సమాజపు ఒత్తిళ్లలో మనిషి జీవన శైలి యాంత్రికమై పోవటం చూస్తున్నాం. మనసు స్పందించక పోయినా శరీరం నడవడం దానిని జీవితం అనుకోవడం ఒక చేదు వాస్తవం, ఇది ఆధునిక జీవితం యొక్క మోసపూరిత స్వరూపాన్ని బయటపెడుతుంది. ఇక్కడ మనిషి తనను తాను మోసగించుకోవడమే జీవన శైలి అయిపోయిందని కవి బాధతో చెబుతున్నారు. మనసు లేని శరీరం యొక్క నడకలు, అసలైన జీవితం కాదు అని స్పష్టం అవుతున్నది.

“మరబొమ్మలమవుతున్నాం” అంటున్నారు. మనుషుల జీవనశైలి మర బొమ్మల వలె యాంత్రికమై పోవటం చూస్తున్నాం. మనిషి తన ధైర్యాన్ని వదిలిపెట్టి సమాజాన్ని అనుసరిస్తున్నాడు. అలాంటి జీవితం సరియైనదని భ్రమపడి మనిషి తన స్వేచ్ఛను కోల్పోయి బొమ్మగా మారిపోతున్నాడు. మనిషి సమాజపు తీర్మానాల ప్రకారం కదిలే బొమ్మగా మారిపోవటం అనేది తన ఉనికిని మరియు స్వరూపాన్ని కోల్పోయిన స్థితికి స్పష్టమైన ప్రతిబింబం. స్వేచ్ఛను కోరుకునే మనిషి, సామాజిక బంధనాలు, కట్టుబాట్లను అనుసరిస్తూ సాగిపోతున్నాడు. మనిషి మనసు చెప్పినట్లు నడుచుకోలేని స్థితిలో ఆత్మతో సంబంధాన్ని కోల్పోయి కేవలం యాంత్రికమైన బొమ్మగా మారిపోతాడు.

“నీవు నా కోసం ఏమీ చేయకున్నా/సముద్రమంతా కవిత్వమైన/అక్షర యోధుని వివరం చెబితే చాలు..!” అంటున్నారు. ఇక్కడ కవయిత్రి చెప్పేది నీ వల్ల నాకు ఎలాంటి ప్రత్యక్ష సహాయం లేదా ప్రయోజనం లేకపోయినా నాకు ఇబ్బంది లేదు. సముద్రంలా విస్తరించిన కవిత్వం, సాహిత్యం, నాకు చాలా ఇష్టమైనవి. అక్షరాలను ఆయుధాలుగా చేసుకుని సమాజం కోసం, న్యాయం కోసం పోరాడే రచయితలు ఉన్నారు. ఇలాంటి వారిని అక్షర యోధులు అంటారు. నాకు ఏ సహాయం చేయకున్నా సముద్రమంత విస్తృతమైన గంభీరమైన కవిత్వాన్ని చెప్పిన అక్షర యోధుల గురించి నాకు చెపితే చాలు అని కవయిత్రి అంటున్నారు. సాహిత్యకారుని పోరాటం పట్ల గౌరవం చూపుతున్నారు. ఈ కవితా పంక్తులలో వ్యక్తం చేసిన భావం ఇది. సముద్రం ఎంతో విస్తారమైనది. సముద్రంతో కవిత్వాన్ని సమానంగా చూపడం, ఆ రచన పట్ల గల ప్రేమ, భక్తి, విశాలమైన భావ గంభీరతను తెలియజేస్తుంది. ఇందులో అక్షరాలు యోధులై భయాన్ని, అన్యాయాన్ని ఎదుర్కొనే శక్తిని పొందినట్టు చిత్రీకరించడం గొప్పగా ఉంది. కవిత్వాన్ని సముద్రంతో పోల్చడం, అక్షరాలు యోధులు అని చెప్పబడడం, వ్యక్తి కోసం ఎవరు నిలబడి పోరాడక పోవచ్చు. కానీ, పదాల శక్తి సముద్రమంత వ్యాప్తిని, సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అని కవయిత్రి భావిస్తున్నారు.

“ఓ పసిఫిక్ సముద్రమా
చాలీచాలని బతుకు గోడు చెప్పిన
అగ్నికీల కనులకు కనిపిస్తే చాలు
నేనో మెరుపునై పోతాను
ఎన్ని పాదాలుగా విస్తరించి కవిత్వమై
కవి హృదయమై విస్తరించావు!”

పసిఫిక్ సముద్రాన్ని ఉద్దేశిస్తూ సంబోధించడం విస్తారమైన అనంతమైన భావాలను సూచిస్తుంది. కవి సముద్రాన్ని సహచరుడిగా పిలవడం జరిగింది. ఓ పసిఫిక్ సముద్రమా అని పిలుస్తూ దాన్ని జీవం కలిగిన మిత్రుడిగా, శ్రోతగా భావిస్తున్నారు. కవి సముద్రాన్ని వేదనా ప్రతిబింబంగా, సృజనాత్మక స్ఫూర్తితో కవిత్వపు విస్తృతిని వివరించారు. అందువల్ల సముద్రం కేవలం ఒక సహజ వస్తువుగా కాకుండా సజీవ ప్రతీకగా కవి హృదయానికి ప్రతిరూపంగా నిలుస్తుంది. ప్రకృతిని సజీవంగా మలిచే కవి శైలి కవిత్వంలో ఒక ప్రధానమైన అంశం. కవి తనదైన శైలిలో విలక్షణ రీతిలో కవిత్వాన్ని మలిచిన తీరు బాగుంది.

“చాలీచాలని బతుకు గోడు చెప్పిన/అగ్నికీల కనులకు కనిపిస్తే చాలు/నేనో మెరుపునై పోతాను” అంటున్నారు. జీవితంలోని బాధలు, వేదనలు, అగ్నికీలల వంటివి. అవి కన్నుల ముందు ప్రత్యక్షం అయితే చాలు, కవయిత్రికి ఒక కొత్త శక్తిని కలిగిస్తాయి. ఇక్కడ అగ్నికీల కనులు అనేది ఆవేశం, కోపం, జీవన తపన లేదా ఉత్కంఠతను సూచిస్తుంది. బాధలు కలిగిన క్షణంలో కవయిత్రి తాను ఒక మెరుపుగా మారుతారు. కవిత్వం తనలో స్ఫూర్తిని,శక్తిని పెంచి జ్యోతిగా మారుతున్నది. చాలీచాలని బతుకుగోడు అనే మాటలతో కవి తన బాధలను సముద్రంతో పోల్చింది.అలలు తీరం వైపు ఆగకుండా ఎలా ఎగసిపడతాయో అలా తన వేదన కూడా ఉప్పొంగుతుందని సూచించింది.సముద్రం ఒక సృజనాత్మక శక్తిగా ఒక్క క్షణంలోనే స్ఫూర్తిని రగిలించగలదు.సముద్రం కవిత్వంగా మారి పోతుంది.సముద్రం మెరుపులాంటి సృజనాత్మక జ్యోతిని వెలిగిస్తుంది.

“ఎన్ని పాదాలుగా విస్తరించి కవిత్వమై/కవి హృదయమై విస్తరించావు..!/అంటున్నారు. సముద్రంలాగా కవిత్వం కూడా అనంతంగా విస్తరిస్తుంది. కవయిత్రి తన హృదయాన్ని సముద్రంలా విశాలంగా భావిస్తున్నారు. సముద్రం, కవిత్వం, కవి హృదయం -ఇవి మూడు ఒకే విశాలత్వం కలిగినవిగా ప్రతిబింబించాయి. బాధను కవిత్వంగా మార్చే శక్తి కవి హృదయానికి ఉంది. జీవితంలో ఎదురయ్యే బాధలు, కవి మనసుని చెదరగొట్టవు. అవి స్ఫూర్తిని, శక్తిని అందిస్తాయి. కవి తన మనసులోని వేదనలను, సముద్రంతో పోల్చిన తీరు వాటిని కవిత్వంగా మలిచే ఆత్మశక్తిని వ్యక్తం చేస్తున్నది. పసిఫిక్ సముద్రం అపారత విశాలత సౌందర్యం కేవలం భౌగోళిక వస్తువు కాదు. ఇది ఒక అంతరంగానికి ప్రతీక. మెరుపు అనేది సృజనాత్మక జ్యోతి. దానికి వేదనను కవిత్వంగా మార్చే శక్తి ఉంది. కవిత్వంలో కవి వేదన, అనుభవం క్రమంగా వాక్యాలుగా మారడం సహజం. పసిఫిక్ సముద్రాన్ని ఆహ్వానిస్తూ దానిని ఒక సహచరుడిగా, శ్రోతగా భావించడం జరిగింది. చాలీ చాలని బతుకు గోడు చెప్పగా అగ్ని కీలలతో కూడిన కవయిత్రి కనులు తార స్థాయికి చేరిన ఆమె వేదనను ప్రకటిస్తున్నాయి. ఆమె వేదన అగ్నికీలలను పోలి కళ్ళలో ప్రతిబింబిస్తోంది. ఒక దృష్టి, ఒక అనుభవం చాలు. అది సృజనాత్మక తుఫానులా తనను మార్చేస్తుంది. ప్రకృతి, జీవితం, వేదన మూడు కలిసి కవిత్వరూపం దాల్చాయి. సముద్ర విస్తారాన్ని కవిత్వంలో మేళవించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ కవిత వ్యక్తిగత బాధలు కూడా సముద్రంతో సమానమైన విశాలమైన కవిత్వంగా విస్తరించగలవు అని చెబుతున్నది. అట్టి వేదనలను మలిచి కవిత్వంగా మార్చే ప్రక్రియలో ప్రకృతి, సముద్రం, వ్యక్తి వేదన మూడు ఏకమవుతాయి. కవి హృదయం సముద్రంలా విస్తరించి, ప్రతి అల ఒక కవితకు పాదముగా మారిపోతున్నది. కవికి సముద్రం కేవలం జలరాశి కాదు. అది మనసు, వేదన, సృజన అన్నింటిని ప్రతిబింబించే ఒక సజీవ రూపం. సహచరుడిగా పసిఫిక్ సముద్రాన్ని సంబోధించడం వలన సముద్రం ఒక శ్రోత, మిత్రుడు స్థాయికి ఎదిగింది. సముద్రం కవి హృదయంలో విస్తరించి కవిత్వంగా రూపు దాల్చిన తీరు చక్కగా ఉంది.

“మాటలు మాటున దాగక
నాకొక్క ‘వర’ వరాల
మూట నిస్తావా రత్నాకరా..!”

ఈ కవితా పంక్తులను చూడగానే నిగూఢమైన భావంతో సముద్రం అనే గొప్ప కవితను రాసిన ప్రసిద్ధ కవి వరవరరావు గుర్తుకు వస్తారు. ఇందులో కవయిత్రి సముద్రాన్ని రత్నాకరుడిగా పేర్కొని సంభాషిస్తున్నారు. మాటల వెనుక గూఢార్థాలు లేకుండా స్పష్టంగా ఒక వరం కాదు, అనేక వరాలు ఇవ్వుమనే అర్థింపు ఉంది. సముద్రాన్ని వరప్రదాతగా భావించి అర్థిగా వేడుకుంటున్నారు. వరం ఇవ్వమని కోరుతున్నారు.. సముద్రాన్ని వేడుకోవడంలో ఆలోచనతో కూడిన ఆశ కనిపిస్తుంది. ఇది కేవలం ఒక వరం అడగడం కాదు. అది వేదనతో మనసు చేసే విన్నపం. కవయిత్రి సముద్రాన్ని దాత స్థాయికి తీసుకువెళ్ళారు.

“కన్నుల మాట వదిలేయి గానీ
నా కాళ్ళను తడుపుతున్నావు ఇక్కడ
అక్కడ పద్యాల్లో బంధీవైన నిన్ను
కొత్తగా పరిచయం చేయించుకున్నావు
బడబాగ్నుల నిలయం నీవని
రెప్పలకు వేళ్ళాడేసిన చుక్కలను
మనసు దొప్పలతో తాగుతున్నాం..
నిశ్శబ్ద మెరుగని మా గుండెల చప్పుళ్ళు
ఎప్పుడూ ఓటమెరుగని బతుకు సవ్వళ్ళనే వినిపిస్తున్నది
ఆగని కెరటాల్లా
ఆలోచనలు మోస్తూ వస్తుంటే
జయతరంగాల హోరులో భావోత్తుంగమై
సముద్రం ఇప్పుడు ప్రత్యక్ష దర్శనంలో
చిన్నగా ఓ అనుభూతి వాక్యాన్ని
బహుమతిగా ఇచ్చింది..!”

ఈ కవితా పంక్తులను ఎంతో భావ సంపన్నంగా తీర్చిదిద్దారు. కవయిత్రి సముద్రాన్ని కేవలం ప్రకృతి దృశ్యంగా కాకుండా భావప్రతీకలతో, స్ఫూర్తిని కలిగించే జీవిత మార్గదర్శిగా చక్కగా మలిచారు. “కన్నుల మాట వదిలేయి గానీ” అంటున్నారు. ఇది కవి భావోద్వేగానికి నిదర్శనం. ముఖ్యంగా మనసు విప్పి మాట్లాడే మాటల కంటే కంటి చూపులకు విశిష్టత ఎక్కువ. అవి ఉన్నది ఉన్నట్లుగా అన్ని విప్పి చెప్పగలవు. కళ్ళలో వ్యక్తమయే భాష చాలా శక్తివంతమైనది. అయినా దాన్ని పక్కన పెట్టి మరింత లోతైన అనుభూతికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇది కేవలం కళ్ళతోనే కాదు. ఇది హృదయం ఆత్మతో మమేకమయ్యే సంభాషణ. కవికి దృశ్యం కంటే అనుభూతి ముఖ్యం. కళ్ళతో చూసే దాని కంటే హృదయంలో నుండి వచ్చిన అనుభూతికి లోతు ఎక్కువ.

“నా కాళ్ళను తడుపుతున్నావు ఇక్కడ” అంటున్నారు. ఇది భౌతిక అనుభూతిని సూచిస్తుంది. అవి సముద్ర కెరటాలై ఉండవచ్చు. ఇది ప్రత్యక్ష అనుభవాన్ని నెమరు వేసుకోవడం వల్ల కలిగిన అనుభూతి. సముద్రపు అలల్లో కాళ్ళను తడిపే ఆ స్పర్శ విచిత్రమైన అనుభూతిని కలిగిస్తుంది. ఇది భౌతిక అనుభవానికి నిదర్శనం. ఇక్కడ తడపడం అనేది ప్రకృతికి తనకు మధ్య గల జీవ సంబంధాన్ని సూచిస్తుంది. ఇది సముద్రానికి కవికి గల సాన్నిహిత్యాన్ని తెలియజేస్తుంది.

“పద్యాల్లో బందీవైన నిన్ను కొత్తగా పరిచయం చేయించుకున్నావు” అంటున్నారు. నీవు పద్యాల్లో బంధించబడి ఉన్నావు. కవిత్వపు గొలుసులో చిక్కుకున్నావు. కవిత్వం నిన్ను ఒక నిర్బంధిత రూపంలో ఉంచింది. నీ చుట్టూ అసలైన విశాలతను, స్వేచ్ఛను నిరోధించింది. నువ్వు కేవలం పద్యాల్లో మాత్రమే జీవించిన ఒక ఖైదీ వలె ఉన్నావు. ఇంత వరకు కవిత్వంలో మాత్రమే ఊహించిన సముద్రం ఇప్పుడు ప్రత్యక్ష అనుభూతిగా లభించింది. ఈ విధంగా కల్పన నుండి వాస్తవానికి మార్పు చెందిన తీరు బాగుంది.

“కొత్తగా పరిచయం చేయించుకున్నావు” అంటున్నారు. ఇక్కడ కవి కొత్త అనుభవాన్ని, ఆవిష్కరణను వ్యక్తం చేస్తున్నారు. నీవు ఇక్కడ పద్యంలో ఖైదీగా బంధింపబడి లేవు. నిజ జీవితంలో ప్రత్యక్షమై ఒక కొత్త పరిచయం కలిగించుకున్నావు. ఇప్పటి వరకు నీవు కేవలం కవిత్వంలోని భావరూపమే. కానీ, ఇప్పుడు నీవు నిజ జీవితంలో ప్రత్యక్షమై పరిచయం అయ్యావు. కవికి ఇది ఒక కొత్త అనుభూతి,క ల్పనలో బంధించబడిన రూపం ప్రత్యక్షంగా ప్రకటితమవుతున్నది. ఇది పద్యం, కవిత్వం మరియు జీవిత అనుభవం మధ్య గల సంబంధాన్ని ప్రతిబింబిస్తుంది. పద్యంలోనే బంధింపబడి ఉన్న దృశ్యాలు, భావ పరంపరలు పద్యం గోడలను దాటి ప్రత్యక్షంగా కవి కొత్తగా పరిచయం అవుతున్నాడు.

“బడబాగ్నుల నిలయం నీవని/రెప్పలకు వేళ్ళాడేసిన చుక్కలను/మనసు దొప్పలతో తాగుతున్నాం..” అంటున్నారు. కష్ట సముద్రం, దుఃఖ జ్వాలల సమాహారం నీవే అని సూచన. ఇక్కడ బడబాగ్నులు అనేది జీవితంలోని కష్టాలు, విపత్తులు, మనసులోని ఆరాటాలు అన్నీ కలిపి చెప్పిన భావంగా వ్యక్తం అవుతుంది. ఇక్కడ మనసులోని కష్టాలు అగ్నిలా చిత్రించబడినాయి. రెప్పలకు వేళ్ళాడేసిన చుక్కలు అంటే అవి కన్నీటి బిందువులు. వాటిని కవి అందమైన రూపకంగా చూపించారు. ఆ కన్నీటి చుక్కలను మనసు దొప్పలతో తాగుతున్నాం అని చెప్పడం, బాధలను మనసులో దాచుకోవడం, ఎవరికి తెలియకుండా మౌనంగా అనుభవించడం అని స్పష్టమవుతుంది. వేదన ఇందులోని ప్రధాన భావం. కష్టాలు, బాధలు చుట్టుముట్టినప్పుడు వచ్చే కన్నీటి బిందువులను రెప్పలపై వేళ్ళాడేసిన చుక్కల వలె వర్ణించడం అద్భుతంగా ఉంది. ఆ కన్నీళ్లను బయటకు కార్చకుండా మనసులోనే దిగమింగుకోవడం అనేది లోతైన అంతరంగిక వేదనను సూచిస్తుంది. చుక్కలు రెప్పలకు వేళ్ళాడటం అనేది కన్నీళ్లను సహజసిద్ధమైన రీతిలో చెప్పిన సన్నివేశం. కవి రెప్పలకు వేళ్ళాడేసిన చుక్కలను మనసు దొప్పలతో తాగుతున్నాం అని చెప్పడంలో అనంతమైన అంతరంగిక వేదనను కవి స్పష్టం చేశారు. మనసులోని బాధలు అంత లోతుగా ఉన్నప్పటికీ బయటకు పలక లేకపోవడం, కన్నీళ్ల మాటున దాగిన బాధను కళ్ళలో నింపుకుని వాటిని మనసు లోపలికి దిగమింగుకోవడం, ఇది ఒక మౌన వేదన, ఒంటరితనం, నిస్సహాయతకు ప్రతిబింబం.

“నిశ్శబ్ద మెరుగని మా గుండెల చప్పుళ్ళు/ఎప్పుడూ ఓటమెరుగని/బతుకు సవ్వళ్ళనే వినిపిస్తున్నది” అంటున్నారు. గుండె చప్పుళ్ళు అనగా హృదయ స్పందనలు, ఇవి కేవలం జీవించడాన్ని సూచించడమే కాక మన జీవితంలోని తపనలను, ఆశలను, పోరాటాన్ని సూచిస్తున్నాయి. మన గుండె చప్పుళ్ళు నిర్విరామంగా వినిపిస్తూనే ఉంటాయి. వాటికి నిశ్శబ్దం అనేది ఉండదు. ఎప్పుడు ఓటమెరుగని బతుకు సవ్వళ్ళు, ఇవి జీవితంలోని గెలుపు, తపన, పోరాటం, ఉత్సాహం, జీవించాలనే సంకల్పం, ఇవన్నీ హృదయ స్పందనల రూపంలో ప్రతిధ్వనిస్తున్నాయి. ఎన్ని బాధలు, విపత్తులు వచ్చినా గుండె చప్పుళ్ళు ఆగవు. గుండె చప్పుళ్ళు జీవించాలనే తపనను మనకు సూచిస్తూ ఉంటాయి. ఈ గుండె చప్పుళ్ళు పరాజయం తెలియని బతుకు చప్పుళ్ళనే వినిపిస్తూ ఉంటాయి. ఈ కవితలో మన హృదయ స్పందనలను బతుకు సవ్వళ్ళుగా వ్యక్తం చేసిన తీరు బాగుంది. నిశ్శబ్దమెరుగని, ఓటమెరుగని పదాల ద్వారా జీవితం ఓడిపోదు అనుటకు బదులుగా హృదయ స్పందనల రూపంలో జీవన గాఢతను తెలియజేశారు. మన గుండె చప్పుళ్ళకి నిశ్శబ్దం తెలియదు. అవి ఎప్పటికీ ఆగవు. అవి మన బతుకు ప్రయాణంలో ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. జీవితం అనేది ఎప్పటికీ ఓడిపోని యాత్ర,గుండె కొట్టుకునే వరకు అది నిరంతర పోరాటమే.

“ఆగని కెరటాల్లా/ఆలోచనల్ని మోస్తూ వస్తుంటే/ జయ తరంగాల హోరులో భావోత్తుంగమై/సముద్రం ఇప్పుడు ప్రత్యక్ష దర్శనంలో/చిన్నగా ఓ అనుభూతి వాక్యాన్ని/ బహుమతిగా ఇచ్చింది..!” అంటున్నారు. ఆలోచనలు నిరంతర ప్రవాహంలో ఉండే అలలతో పోల్చబడ్డాయి. సముద్రంలో కెరటాలు ఎప్పుడు ఆగవు. అలాగే మన ఆలోచనలు నిరంతర యాత్రలో సాగుతూ ఉంటాయి. విజయపు అలల హోరులో మనసు ఉత్సాహంతో, ఎగసిపడుతోందని స్పష్టం అవుతుంది. సముద్రాన్ని చూసి మనసు పొందిన చిన్న ఆనందపు క్షణాన్ని ఒక లోతైన అనుభూతిని, బహుమతిగా స్వీకరించినట్టుగా కవయిత్రి భావించారు. ఈ కవితా పంక్తులలో లోతైన భావం ఉంది. సముద్రపు సాక్షాత్కారం ద్వారా తనలో ఆనందం, ఉత్సాహం కలిగింది. సముద్రాన్ని కేవలం ప్రకృతి దృశ్యంగా కాకుండా అనుభూతుల ప్రతిబింబంగా చూపిస్తున్నారు. ఆగని కెరటాల్లా ఆలోచనలు సాగుతున్నాయి. జయ తరంగాల హోరు వలె ఉత్తుంగమైన భావాలు కలిగిన సముద్రం ప్రత్యక్షమైంది. సముద్రం అనుభూతి వాక్యాన్ని బహుమతిగా ఇచ్చింది అనడం ద్వారా సముద్రానికి మానవీయ స్వభావం ఇచ్చారు. మన ఆలోచనలు ఎప్పటికీ ఆగకుండా సాగే అలల వంటివి. అవి విజయోత్సాహపు అలలతో కలిసినప్పుడు మనసు ఉప్పొంగిపోతుంది. ఆ సమయంలో సముద్ర దర్శనం అనేది ఒక ఆత్మీయ అనుభూతిని, లోతైన స్ఫూర్తిని మనసుకు బహుమతిగా అందించింది. ఈ కవితా పంక్తులలో ప్రకృతి దర్శనం సముద్రం ద్వారా కలగడం, మనసులో, ఆలోచనలో, ఉత్సాహం, విజయానుభూతులను కవితాత్మకంగా మిళితం చేసిన తీరు బాగుంది.

అద్భుతమైన కవితను అందించిన కవయిత్రి కొండపల్లి నీహారిణి గారిని మనసారా అభినందిస్తున్నాను. వారు మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని కోరుకుంటున్నాను.

Exit mobile version