Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తండ్రి స్మృతులను శాశ్వతం చేసిన కందుకూరి అంజయ్య కవిత ‘నిట్టాడు’

[శ్రీ కందుకూరి అంజయ్య కవిత ‘నిట్టాడు’ అనే కవితను విశ్లేషిస్తున్నారు శ్రీ నరేంద్ర సందినేని.]

ప్రముఖ కవి కందుకూరి అంజయ్య కలం నుండి జాలువారిన ‘కట్టెపల్క’ కవితా సంపుటిలోని ‘నిట్టాడు’ కవితపై విశ్లేషణా వ్యాసం ఇది.

శ్రీ కందుకూరి అంజయ్య

‘నిట్టాడు’ కవిత కవి అంజయ్య నాన్న జీవిత సంఘటనలకు సంబంధించినది. నాన్న గురించిన అనుభూతులను అక్షరీకరించడం, సామాన్యమైన విషయం కాదు. నిట్టాడు ఇంటి పైకప్పునకు ఆధారం. నాన్నను నిట్టాడుగా పేర్కొంటూ నాన్నతో గడిపిన బాల్యాన్ని పెనవేసుకున్న బంధాన్ని కవిత ద్వారా తెలియజేశారు. ‘కట్టెపల్క’ కవితా సంపుటిని తన తల్లిదండ్రులైన రాజయ్య, లక్ష్మిలకు అంకితమివ్వడం సముచితంగా ఉంది. ముఖచిత్రాన్ని  ప్రముఖ చిత్రకారుడు అన్నవరం శ్రీనివాస్ అందించారు. అంటరానితనం, అణచివేత, కుల వివక్షతలను కవి అంజయ్య బాల్యంలో ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ ఎన్నో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో చదివి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో M.A., M.Phil. విద్యను అభ్యసించారు. దళిత కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన కవి అంజయ్య యూనివర్సిటీ స్థాయి విద్యను పూర్తి చేయడం సామాన్యమైన విషయం కాదు.

“పుట్టెడు బురదలో/పువ్వులా బయటకు వచ్చే/కుమ్మరి పురుగు తత్వం నీది/ప్రయత్నంలో పిపీలికానికి పాఠాలు నేర్పే ఓర్పు నీది” అంటున్నాడు. నాన్న గురించి కవిత్వం రాస్తూ కుమ్మరి పురుగు ఎంత బురదలో ఉన్నా నిర్మలంగా పువ్వులా బయటకు వస్తుంది. ఇవ్వాళ ఉన్న వ్యవస్థలో అవ్యవస్థ కొనసాగుతోంది. ఈ వ్యవస్థలో నివసిస్తూ నాన్న పుట్టెడు బురదలోంచి బయటపడ్డ కుమ్మరి పురుగు అనడం చాలా అద్భుతంగా ఉంది. ప్రయత్నంలో చీమకు పాఠాలు నేర్పే ఓర్పు నీది అని కవి అంజయ్య గొప్ప భావం పలికించారు. తన తండ్రి పిపీలికంలా సహనం కలవాడని తెలియజేస్తున్నాడు. మాట సొర నీయకుండా సత్యం వైపు నడుస్తూ పంతం నెగ్గించుకునే పట్టు కొందరికే  ఉంటుందని మన అందరికీ తెలుసు.

“పంచాయితులైన/పడావులైనా/పారే మాట నీది/తీర్చే తీర్పు నీది” అంటున్నాడు. కవి అంజయ్య తండ్రి పంచాయతుల్లో ఉన్నది ఉన్నట్లు మాట్లాడే వాడు. సరైన తీర్పు ఇచ్చేవాడు. ఈ కాలంలో ఇలాంటి వాళ్ళు ఉండడం అరుదు. జనాల్లో ఎవ్వరికీ ప్రశ్నించే తత్వం ఉండడం లేదు. ప్రశ్నించే తత్వం ఉన్న వాళ్లను చంపేస్తున్నారు. తప్పుడు కేసుల్లో ఇరికించి జైళ్ల పాలు చేస్తున్నారు. న్యాయం అనేది ఎండమావిలా తయారయింది. బ్రిటిష్ కాలం నాటి చట్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. చట్టాలను మార్చాలనే సోయి కూడా ఉండడం లేదు. దేవుడా రక్షించు నా దేశాన్ని అని కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ కవిత్వం రాశారు. ఇప్పటికీ అది యథార్థంగా ఉంది.

కవి అంజయ్య తండ్రి పంచాయితీ చెపితే దడువతులు, దండుగలు ఏవీ తీసుకునే వాడు కాదు. దడువతు డబ్బులు దగ్గరకు రానీయకుండ దరహాసం చేసే వాళ్ళు ఈనాడు ఎవ్వరు ఉండరు. కవి అంజయ్య నాన్న దోషిచే ఆత్మ పరిశీలన చేసుకొని క్షమాపణ చెప్పించడం మామూలు విషయం కాదు. గడ్డి కుప్ప మీద కుక్క బొక్క తెచ్చుకుని అది తినదు, ఇంకో కుక్కను తిననీయదు. అలానే బొక్కను చూస్తూ ఉంటుంది. ఇవ్వాళ ఉన్న వ్యవస్థలో కొందరి మనుషుల ప్రవర్తనను అసహ్యించుకుంటూ ఆ పదాన్ని ఉపయోగించారు.

దొడ్డు మొస తెలంగాణ పల్లె పదం. కవి తండ్రి దొరలను మెసలనీయకుండ మాట్లాడే ధైర్యం కలిగి ఉండే వాడు. కవి తండ్రి సుక్క పొంటెకులే‌సి మట్లకు కట్టేసిన ఎడ్లను తీసుకొని వ్యవసాయ బావి వద్దకు వెళ్లి మోట కట్టేవాడు. మోట బొక్కెనతో నీళ్ళు పారిస్తే ఊటల సంగీతం మోగేది. బార్లు బంతి పువ్వు లయ్యేవి. మోట కొడుతున్నప్పుడు రెండు ఎడ్లకున్న పగ్గాలు గుంజి పట్టి గుంజి పట్టి తన తండ్రి చేతులు గుంజేవి అని ఆవేదన వ్యక్తంచేశారు. బొజారు తెలంగాణ పల్లె పదం. దోనెతో నీళ్లు పోసే దానిని బొజారు అంటారు. మోట బొక్కెనతో నీళ్లు పారుతుంటే మడుల మనసు నిండేదని చెప్తున్నారు. కవి తండ్రి గూడ వేసి యాతం పోసి నీళ్లు పాలించేవాడు. పీజ పీజకూ మక్క పెరడులో చిన్న చిన్న మడులు కడతారు. పసిపిల్లలకు తల్లిపాలిచ్చినట్టు ప్రేమతో చెమట చుక్కలు ధారపోసి ప్రతి కర్రకు నీళ్లు తాగించే వాడు. శ్రమను నమ్ముకున్న కవి తండ్రి మక్క కర్ర తలమీద చేయి వేస్తే జల్లు వేసేది. చంకలో చంటి పాపలాగా కంకులు అయ్యేవి అని చెప్పడం గొప్పగా ఉంది.

అమిది, శిబ్బులు, తెలంగాణ పల్లె పదాలు. అమిది అంటే బావిలోని పూడిక. శిబ్బులు అంటే మేదరి అల్లిన చిన్న తట్టలు. కవి తండ్రి మోట బావిలో దిగి పూడిక తీసేవాడు. బావి నుండి పూడిక తీసిన మట్టిని మేదరి తట్టల్లో నింపేవాడు. తట్టల్లోని మట్టిని సోలుపుగా నేర్పుగా పైకి పంపేవారు. పూడిక తీస్తేనే నీళ్ళు ఊరుతాయి. జిమ్మలు తెలంగాణ పల్లె పదం. జిమ్మలు అంటే చేపలు. బొక్కెన నిండ జిమ్మలు ఇంటి నిండా తోరణాలు. కొన్ని చేపలు కూర వండుకునేవారు. మిగిలిన చేపలను ఇంటి నిండా తోరణాలుగా కట్టే వారు. జీవన యానంలో మనిషి బతకడానికి ఎన్నో పనులు చేయాల్సి వస్తుంది. కోటి విద్యలు కూటి కొరకే అన్నారు.

కవి తండ్రికి వ్యవసాయం చేయడానికి తగినంత భూమి లేదు. వ్యవసాయానికి సంబంధించిన అన్ని పనులు తానే చేసేవాడు. కవి తండ్రి గుల్లకోట గ్రామానికీ చెందిన వాడు. ఆ గ్రామానికి ఆనుకుని పెద్ద గుట్ట ఉంది. కవి తండ్రి వ్యవసాయానికి సంబంధించిన సుట్టలు, ఆరెలు తెచ్చి రైతులకు అమ్మేవాడు. కైకిలి కింద వాళ్ళు ఇచ్చిన డబ్బులతో జీవనం సాగించేవాడు. కవి తండ్రి గుట్టలకు గొడ్డలితో వెళ్లేవాడు. గొడ్డలి చిప్ప అందుకొని గుట్ట దారిపడితే పొట్రాళ్ల పొగరు అణిగేది. పొట్రాల్లు తెలంగాణ పదం. మనం బాట పొంటి వెళ్తా ఉంటే కొన్ని రాళ్లు పైకి తేలి కాళ్లకు తగులుతూ ఉంటాయి. వాటిని పొట్రాళ్ళు అంటారు. గులకరాళ్లు తెలంగాణ పదం. చిన్న చిన్న రాళ్లను గులకరాళ్లు అంటారు. గుట్ట దారి మీద నడుస్తుంటే గులక రాళ్లు గుడ్లు తేలేసేవి. కత్తెర రాళ్లు తెలంగాణ పదం. కత్తెర రాళ్ల పొంట నడుస్తుంటే కత్తెర రాళ్లు మెత్తబడేవి.

కవి తండ్రి గుట్టమీద అడుగుపెడితే పల్లేర్లు, పార్శంకాయలు, ముండ్లు, ములకలు తలవంచుకునేవి అని జ్ఞాపకం చేస్తున్నాడు. తన శ్రమకు ప్రకృతి కూడా సహకరించేది. గుట్టమీద పాదం మోపితే ఎగుడు దిగుడులు ఏకమయ్యేవి అంటే  సమానమయ్యేవి. వర్షం పడితే గుట్టల మీద నుండి ధారలుగా వచ్చే నీరు కిందకు పారేది. గుల్ల కోట గ్రామంలో ఉన్న ఆ పెద్ద గుట్టలో ఒక ప్రాంతాన్ని మైసమ్మ గుట్ట అంటారు. మైసమ్మ గుట్ట మీద ఉన్న రాళ్లు మనసు పడేవి. ఆ పెద్ద గుట్టలోని ఒక ప్రాంతాన్ని పెసరుగాని గుట్ట అంటారు. పెసరుగాని గుట్ట పేరంటానికి పిలిచేది. ఆ పెద్ద గుట్టలోని ఒక ప్రాంతాన్ని జొన్నల రాశి గుట్ట అంటారు. జొన్నల రాశి గుట్ట జోల పాడేది. సుట్టలు, ఆరెలకు సంబంధించిన కర్ర శోధించి గుట్ట మీద నుండి తీసుకువచ్చేవాడు. గుండ్రని చక్రానికి గుండ్రంగా అమర్చే కర్రను సుట్ట అంటారు. చక్రానికి మధ్య జిడ్డిగం. ఇరుసుకు తొడిగే బాగం ఆరె అంటారు. కాగు తెలంగాణ పదం. కాగు అంటె కుండ ఆకారంలో పెద్దగా ఉంటుంది. ఊరంతా కరువైనా తిండికి ఎలాంటి లోటు లేకుండా కాగు నిండా మక్కలు ఉండేవి అని చెప్తున్నారు.

తలె తెలంగాణ పదం. తలె అంటె కంచుతో చేసిన అన్నం తినే పాత్ర. ఆ కాలంలో కంచు గిన్నెలు మరియు మట్టి పాత్రలు వాడేవారు. అప్పుడు అల్యూమినియం,  స్టీలు పాత్రలు ఉండేవి కావు. కవి తండ్రి మక్క గడ్కను బంగారు బువ్వ అని ఊరించుకుంటూ తినేవారని చెపుతున్నారు. మనం తినే తిండిని ప్రేమించే వాళ్ళు ఎందరు ఉంటారు. తినే తిండిని ప్రేమించడమే కాదు. బంగారు బువ్వ అని ఊరించుకుంటూ తిన్న కవి తండ్రిని అభినందించాలి. తండ్రి తినే మక్క గడ్కని కష్టమైన ఇష్టమనిపించేది అని కవి అంజయ్య అంటున్నారు. ఆ కాలంలో వాళ్లకు గంజి మెతుకులు కూడా లభ్యమయ్యేవి కావు. నీరడి మల్లయ్య ఇంటి దగ్గర నుంచి అడిగి వెండి బువ్వ తీసుకొచ్చి కవి అంజయ్య అలిగిన కోరికను తీర్చేవారు.ఈ వాక్యాలు చదువుతుంటే ఆ కాలంలోని పేదరికం మనకు అర్థం అవుతుంది.కష్టపడి పనిచేసినా పట్టెడు అన్నం కూడా దొరికేది కాదు అన్న వాస్తవంతో పాటు జీవితంలో తనతో పాటు తల్లి, తండ్రి చెల్లి ఎదుర్కొన్న బాధలను అక్షరీకరించాడు. పేదరికం ఎంత శాపమో పేదలుగా పుట్టడం వివక్షను ఎదుర్కోవడం ఎంత కష్టమో ఇవన్నీ కవి అంజయ్య మన కళ్ళకు కట్టినట్లు నిట్టాడు కవిత ద్వారా వివరించారు.

కవి అంజయ్య తండ్రి గొప్ప కళాకారుడు అని కవితలో వ్యక్తీకరించడం సమంజసంగా ఉంది. జానపదులలో మరుగునపడిన కళాకారులు పల్లెల్లో ఎంతో మంది ఉన్నారు. వారి చరిత్ర అక్షరబద్ధం కాలేదు. గుల్లకోట గ్రామంలో సాయంత్రం అయితేనే సందడి మొదలయ్యే తీరు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.ఆ పల్లెలో గడ్డి గుడిసె సలాంద్రి అవుతుంది. సలాంద్రి అంటె యక్షగాన కళలను ప్రదర్శించే వేదిక. సాయంత్రం అయితేనే ఆ పల్లెలో నివసించే వారంతా ఆ గడ్డి గుడిసె దగ్గరకు చేరి ఆ కళాకారున్ని దర్శించుకునే వారు. కవి తండ్రి ఏక్‌తారా మీటుతూ తత్వాలు పాడేవాడు. ఆ కళాకారుడు పాటలు పాడితే చుక్కలు జలజల రాలేవి. ఆ పల్లెలోని పానాదులు ఆ ఇంటి దారి పట్టేవి. గడ్డి గుడిసెలో పాటల సంగీతం వెలిసేది. పానాదులు అంటే బజార్లు అని అర్థం. తమ కష్టాలను, బాధలను పాట ద్వారా కైగట్టి పాడే సంస్కారం పల్లెవాసులైన జానపదుల్లో ఉంటుంది. రాత్రి పూట ఊరంతా నిద్ర పోతుంది. కాని ఆ గడ్డి గుడిసెలో చేరి వాళ్లంతా కవి తండ్రి ఏక్‌తారా మీటుతూ పాడుతుంటే ఆనందంతో వినేవారు. ఆకాశంలోని చుక్కలు సైతం జల జల రాలేవి. ఆ పల్లెలోని గడ్డి గుడిసె పాటలతో ఊయలలూగేది అన్న వాస్తవాన్ని తెలియజేస్తున్నాడు.

చెలిమె చల్లినట్లు చెమట చల్లితేనే బ్రతుకు సాగుతుంది.కవి తండ్రి శ్రమజీవి.శ్రమించి చెమటను ధారపోసి  చదివిస్తేనే కవి చదువు కొనసాగింది.అతనిలో జ్ఞానదీపం వెలిగింది.కష్టపడి ఇష్టంగా చదువుకొని విద్యావంతుడు అయ్యాడు.కవి తండ్రి చివరి దశలో పట్నం చేరిండు. పట్నంలో ఉన్న కవి తండ్రికి అల్జీమర్స్ వ్యాధి సోకి జ్ఞాపకశక్తిని కోల్పోయాడు. అనారోగ్యం బారిన పడి ఈ లోకాన్ని వీడిపోయాడు. నదుల నీరంతా సముద్రం చేరినట్లు కవి తండ్రి ప్రాణం అనంత లోకాలకు చేరింది. కవి, తండ్రి స్మృతిలో నిట్టాడు కవితను మనకు అందిస్తూ తన తండ్రికి జోహార్లను అర్పించాడు.

కందుకూరి అంజయ్య రచయితగా, కవిగా, కళాకారుడిగా, వివిధ సాహిత్య సంస్థలతో అనుబంధం పెంచుకుని పని చేస్తూ సమాజానికి  సేవలు అందిస్తున్నాడు. కవి అంజయ్య కలం నుండి మరిన్ని మంచి కవితా సుమాలు రావాలని మనసారా కోరుకుంటున్నాను.

Exit mobile version