Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అంతరాత్మను శోధించాల్సిన అవసరాన్ని గుర్తు చేసే ‘మనిషితనం ఎందుకిలా?’ కవిత

[బిట్ల అంజనీ దేవి గారు వ్రాసిన ‘మనిషితనం ఎందుకిలా?’ అనే కవితని విశ్లేషిస్తున్నారు శ్రీ నరేంద్ర సందినేని.]

ప్రముఖ కవయిత్రి, బిట్ల అంజనీ దేవి కలం నుండి జాలువారిన ‘మనసెందుకో సున్నితం’ కవితా సంపుటిలోని ‘మనిషితనం ఎందుకిలా?’ కవితపై విశ్లేషణా వ్యాసం ఇది. ఇది కేవలం ఒక ప్రశ్న కాదు. ఒక భావోద్వేగం. ఒక తాత్విక ఆవేదన. ఈ కవితలోని భావం చాలా లోతైనది. మనిషి మనసులోని మంచితనాన్ని కోల్పోయి జీవితం నిస్సారంగా మారిపోతున్నప్పుడు కలిగే బాధను సూచిస్తుంది.

‘వసంత కాలపు కోకిల గానం
కాకుల రొదలా ఉంది

వసంత కాలం ఋతువుల రాణి. వసంత కాలంలో చెట్లు చిగురిస్తాయి. పూలు వికసిస్తాయి. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. వసంత కాలం సౌందర్యానికి, ఉల్లాసానికి ప్రతీక. వసంత కాలంలో కోకిల కుహూ కుహూ రాగాలు మధురంగా వినిపిస్తాయి. మనసును రంజింప చేస్తాయి. కోయిల గానం ఆహ్లాదకరమైనదిగా భావిస్తాం. మధురమైన కోకిల గానం కూడా కాకుల రొదలా వినిపిస్తుంది. మనసుకు ఉల్లాసాన్ని హాయిని గొలిపే కోకిల గానం కూడా బాధను, నిరాశను కలిగిస్తోంది. మనం ఆలోచించే ధోరణిలో మార్పు కావొచ్చు. మన మనసు ఎల్ల వేళలా ఒక్క తీరుగా ఉండదు. మన మనసు బాగా లేనప్పుడు మధురమైన సంగీతం కూడా కోపాన్ని, చికాకును కలిగిస్తుంది. ఇది మన మనసు లోపలి మార్పును సూచిస్తుంది.

కోయిల గాన మాధుర్యం ఏమైంది?ఎందుకు ఇలా మారింది?ఇది ఒక ప్రత్యేకమైన భావన. కమ్మనైన ఆ కోయిల గానం మార లేదు. కానీ, లోకాన్ని చూస్తున్న మనిషి దృష్టి కోణం మారింది. కవయిత్రి మనిషితనంలో వచ్చిన మార్పుపై విచారాన్ని వ్యక్తం చేస్తున్నది. ప్రకృతిలోని అందాలను, సంతోషాన్ని గుర్తించ గల సామర్థ్యం మనిషిలో తగ్గిపోతున్నది. మనిషి మనసు కలుషితం కావడం వల్ల కోయిల గానంలో మాధుర్యం కనిపించట్లేదు.

మనిషి మనసులోని భావోద్వేగాలు, అనుభూతులు ఎందుకో తగ్గిపోతున్నాయి. అందుకే మధురమైన కోయిల గానం కూడా కాకుల రొదలా ఉంది. ఇది ఒక తాత్విక ప్రశ్న. మనిషితనం ఎందుకిలా విచ్ఛిన్నం అవుతోంది? ఈ కవితా పంక్తులు సామాజిక పరిశీలనతో పాటు ఒకసారి మన అంతరాత్మను శోధన చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తాయి. మనిషితనంలోని విచిత్రమైన మార్పును, మనసు స్థితిలో వచ్చిన అసహజతను చూపిస్తూ మనిషితనం ఎందుకిలా అని కవయిత్రి ప్రశ్నిస్తున్నది.

‘పరిమళాలు వెదజల్లాల్చిన పూదోటలో
ఏదో గంజాయి వాసన ప్రమాదం పొంచి ఉంది

పూదోట ఒక అందమైన ప్రదేశం. అట్టి తోటలో సువాసనలు విరబూయాలి. శుభ్రత, సౌందర్యం, శాంతి వెల్లివిరియాలి. కానీ, అపరిశుభ్రతకు చిహ్నమైన ప్రమాదకరమైన గంజాయి వాసనతో అక్కడ ప్రమాదం నిశ్శబ్దంగా ఎదురు చూస్తోంది. సౌందర్యంతో ఒప్పార్చిన తోటలోకి అనారోగ్యం, చెడు ప్రభావాలు ప్రవేశించబోతున్నాయి అనేది ఒక సంకేతంగా తోస్తోంది. శుభ్రతగా ఉండాల్సిన వాతావరణం చెడుతనం వల్ల గంజాయి వాసనతో కలుషితం అవుతుంది. ఇది చెడు అలవాట్లు, వికృతమైన ఆలోచనల వల్ల కలిగే విలయాన్ని సూచిస్తుంది. గంజాయి వాసనతో పరిసరాలు అపరిశుభ్రంగా తయారవుతాయి. కాలుష్యం చోటు చేసుకుంటుంది. అట్టి ప్రదేశం గంజాయి కారణంగా ఉద్భవిల్లే ప్రమాదం ఇంకా పూర్తి స్థాయిలో వెలుగులోకి రాలేదు. కానీ,ముందు ముందు గంజాయి వల్ల తీవ్రమైన ముప్పు తలెత్తబోతోంది అనేది వాస్తవం. ఈ కవితా పంక్తులు ఒక గంభీరమైన సామాజిక సందేశాన్ని అందిస్తున్నాయి. మనం అప్రమత్తంగా ఉండాలి అనే సందేశం కవయిత్రి భావాల్లో వ్యక్తం అవుతుంది.

‘మల్లె తీగలన్నీ ముళ్ళ పొదలుగా
పారిజాతాలన్నీ పల్లేర్లుగా మారుతున్నాయి

ఈ కవితా పంక్తులు కవితాత్మకంగా సమాజంలో ప్రకృతిలో వ్యక్తిగత జీవితంలో వస్తున్న మార్పులను సూచిస్తున్నాయి. మల్లె పూలు మనకు సుగంధాన్ని పంచే అందమైన పువ్వులుగా గుర్తింపు పొందినవి. ఇది సాధారణంగా సౌమ్యత, శాంతి, అందం,ప్రేమకు సంకేతం. కానీ, అవే మల్లె తీగలు ఇప్పుడు ముళ్ల పొదలుగా మారుతున్నాయి. సౌందర్యం,స్నేహం,ప్రేమ వంటివి నశించి పోతున్నాయి. హింస,కఠినత,బాధ కలిగించే పరిస్థితులకు సంకేతంగా నిలుస్తున్నాయి. పారిజాతాలు అపురూపమైన సుగంధభరితమైన పుష్పాలు. వీటిని దేవుడికి సమర్పిస్తారు. ఇవి పవిత్రతకు సూచన. కానీ, అవే పారిజాతాలు ఇప్పుడు పల్లేరులుగా మారుతున్నాయి అని చెప్పడం వలన ఈ సౌందర్యం, సౌమ్యత అంతా కఠినత, బాధ, హింసకు గురి అయింది అనే భావాన్ని పలికించారు. జీవితంలోని అందమైన విషయాలు, విలువలు, భావోద్వేగాలు వాడిపోయాయి. ఇది ప్రకృతి భవితవ్యంలోని మార్పును సూచిస్తుంది. మానవ సంబంధాల్లో నెలకొన్న ఉల్లాసం క్రమంగా తగ్గిపోతున్నాయి. కవయిత్రి మనిషి జీవితంలో ప్రకృతిలో వస్తున్న మార్పులను తన భావాల్లో వ్యక్తం చేస్తున్నది. ఇది సామాజిక సంబంధాలలో మనిషి మనసులో వచ్చిన మార్పులను సూచిస్తుంది. ఇది వెలుగు,వాసన,జీవం ఉన్న ప్రపంచం. కానీ, ఇప్పుడు చీకటి ముళ్ళతో వ్యాప్తి చెంది నిర్జీవతతో నిండినదిగా మారిపోయింది అనే సంకేతాన్ని అందిస్తున్నది.

‘మానవులు తయారవ్వాల్సిన ఫ్యాక్టరీలో
ఎందుకో మారణాయుధాలు తయారవుతున్నాయి

ఇది కేవలం శారీరకంగా మనుషులను తయారు చేయడం గురించి కాదు. ఇక్కడ మానవుడు మంచి విలువలతో మానవత్వంతో విలసిల్లాలని సూచిస్తున్నారు. సహజంగా మంచి విలువలు కలిగిన వ్యక్తులు, కుటుంబాలు, విద్యా సంస్థల నుండి తయారవుతారు. మనిషిని రక్షించాల్సిన ప్రేమను, సహకారాన్ని అభివృద్ధి చేయాల్సిన చోట ఎందుకో విధ్వంసాన్ని సృష్టించే మనస్తత్వాలు గల వ్యక్తులు తయారవుతున్నారు. మానవత్వాన్ని పెంపొందించాల్సిన స్థలంలో ద్వేషం, హింస పెరుగుతుండడం చూస్తున్నాం. ఇక్కడ మారణాయుధాలు అనగా హింసను, ద్వేషాన్ని, విధ్వంసాన్ని ప్రేరేపించే మనుషులు అని అర్థం. మంచి మనుషుల్ని తయారు చేయాల్సిన ప్రదేశంలో ఇప్పుడు భిన్న ధోరణులు కొనసాగుతున్నాయి. అసహనాన్ని పెంచే విద్యా విధానాలు, స్వార్థపూరితమైన రాజకీయాలు, అధిక భయాందోళనలు కలిగించే మీడియా ఈనాడు మనిషిని మానవత్వం వైపు పయనించకుండా మారణాయుధాలుగా మలుస్తున్నాయి అనేది వాస్తవం. మంచిని పెంపొందించాల్సిన వ్యవస్థలు లోపభూయిష్టం కావడం వల్ల మానవులు శ్రేష్ఠమైన విలువలను కోల్పోయి ద్వేషం, హింస, అసహనంతో కూడిన వ్యక్తులుగా మారుతున్నారు. దీనిని ఆధునిక సమాజం తీవ్రంగా ఆలోచించవలసి ఉంది.

‘మాలతీ లతలు పందిరి నెక్కడానికి
ఎందుకో భయపడుతున్నాయి
పందిరి మాటున పొంచి ఉన్న
పైశాచికత్వం గుర్తించింది కాబోలు

మాలతీ లతలు సున్నితమైన, స్వచ్ఛమైన ప్రకృతికి ప్రతీక. మాలతీ లతలు పందిరిని ఎక్కడం అంటే దాని ఎదుగుదల, అభివృద్ధి పథంలో ముందడుగు వేసే ప్రక్రియ. కానీ, అవి పందిరిని ఎక్కడానికి భయపడుతున్నాయి. సున్నితమైన జీవ వృక్షాలకు తమ ఎదుగుదల మీద ఒక సందేహం, భయం ఏర్పడినట్లు తెలుస్తుంది. అసహజమైన, భయంకరమైన దానిని ముందే గుర్తించినట్లు తోస్తోంది. మాలతీ లతలు సున్నితమైన అందమైన పుష్పాలను అందిస్తాయి. లతలు ఎదిగేందుకు పైకి ప్రాకడానికి పందిరి తోడ్పడుతుంది. లతలు పందిరి సహాయంతో పైకి ఎగబాకడం, సాధారణంగా అభివృద్ధి చెందడాన్ని సూచిస్తుంది. కానీ, అవే మాలతీ లతలు భయపడుతున్నాయి అని చెప్పడం ద్వారా అభివృద్ధికి కూడా భయం ఏర్పడుతుందన్న భావన వ్యక్తం అవుతున్నది. కానీ,ఇ క్కడ ఆ పందిరి మాటున క్రూరత్వం, అహంకారం,దురాశ, పైశాచికతలాంటి చెడు శక్తులు దాగి ఉన్నాయి. దాని వెనుక ఉన్న మానవ స్వభావంలోని చెడును మాలతీ లతలు గుర్తించాయి అని చెప్పడం ద్వారా మన సమాజంలోని వాస్తవ పరిస్థితిని తెలియజేయడం జరిగింది. అభివృద్ధి సౌకర్యాలు వంటి వాటి వెనుక దాగి వున్న విధ్వంసాన్ని, స్వార్థాన్ని,కపటాన్ని సున్నితమైన ప్రకృతి శక్తులు గల మాలతీ లతలు గుర్తించి వెనుకడుగు వేస్తున్నట్లు చెప్పబడింది. ఇది మనిషి ఆలోచనలు, సంకల్పాలు ప్రగతికి సంబంధించిన ప్రశ్నలను ఆవిష్కరిస్తుంది. మాలతీ లతల భయం ద్వారా కవయిత్రి మనం కూడా వివేచనతో ముందుకు అడుగులు వేయాలని సూచిస్తున్నది.

‘గులాబీలు తుమ్మ ముళ్లను
అరువు తెచ్చుకుంటున్నాయి
ఆత్మ పరిరక్షణ కోసం
అవలంబించాలి యుద్ధనీతి

గులాబీలు అందమైన సుగంధభరితమైన పుష్పాలు. అవి సుగంధాలు వెదజల్లుతూ ఉంటాయి. కానీ, వాటి కాడలు మాత్రం ముళ్ళతో నిండి ఉంటాయి. అట్టి ముళ్ళు గులాబీ అందం కోసం కావు. అవి గులాబీ పూల రక్షణ కోసం ఉన్నాయి. ఆత్మ పరిరక్షణ కోసం, తనకు హాని కలిగించే పరిస్థితుల నుంచి కాపాడుకోవడం కోసం గులాబీ పూలు ముళ్లను ఉపయోగిస్తున్నవి. దీని ద్వారా మనిషి సున్నితత్వంతో పాటు కాఠిన్యాన్ని కూడా కలిగి ఉండాలి అనే జీవన సత్యాన్ని బోధిస్తున్నది.

కవయిత్రి అంజనీ దేవి

మనం అవసరానికి తగ్గట్టుగా యుద్ధ వ్యూహాలు, రక్షణ మార్గాలు చేపట్టాలి. శత్రువుల నుంచి మరియు ప్రమాదాల నుంచి రక్షించుకోవాలంటే కొన్ని సార్లు కఠినతను అనుసరించక తప్పదు. మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో మనల్ని మనం కాపాడుకోవాలిసిన అవసరం ఏర్పడుతుంది. రక్షణాత్మక వ్యూహంలో భాగంగా హింసాత్మకమైన వైఖరిని కూడా అవలంబించాల్సి ఉంటుంది.శాంతి కోసం,సత్యం కోసం పాటు పడుతున్నప్పుడు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్యంతో వ్యవహరించాలి. తనను తాను రక్షించుకొనేందుకు గులాబీ ముళ్ళను పెంచుతుంది. అదే విధంగా మన జీవితాల్లోను అవసరమైనప్పుడు తగిన రక్షణ చర్యలు అవలంబించాలి.ఇది ఒక గొప్ప ఆత్మ రక్షణ వ్యూహంగా చెప్పవచ్చు. ఈ కవిత మనకు ఒక జీవన సత్యాన్ని సూచిస్తుంది. గులాబీలు సాధారణంగా అందం, సౌందర్యానికి ప్రతీక. అవి తమ కాడలపై ముళ్ళను పెంచుకొని ఉంటాయి.ఇది ఒక రకంగా తమకు రక్షణ కవచంలా పని చేస్తాయి. కవయిత్రి తన భావాల ద్వారా ప్రతిసారి శాంతిని కోరుకుంటే సరిపోదు, కొన్ని సార్లు మన ఆత్మ రక్షణ కోసం కఠినమైన చర్యలు కూడా తీసుకోవాల్సి వస్తుంది అన్న సందేశం ఇస్తున్నారు. సౌమ్యతతో పాటు ధైర్యం కూడా జీవనంలో అవసరం అనే సందేశం కవయిత్రి భావాల్లో వ్యక్తం కావడం బాగుంది.

‘దీపంలా వెలగాల్సిన ఇల్లు
చితి మంటల్లో చిక్కుకుంది
ఆఖరి పుల్ల వేస్తూ ఆజ్యం పోస్తూ
నిప్పును రాజేసే కుటిలత్వం నీడలో

ఇల్లు అంటే కేవలం గదులు కాదు. అది ప్రేమ, సామరస్యం, నమ్మకం, ఆనందం వంటి విలువలతో నిండిన స్థితి. ఇల్లు దీపంలా దేదీప్యమానంగా వెలిగిపోవాలి. ఇల్లు అందరికీ వెలుగు మరియు మార్గదర్శనం ఇచ్చేలా ఉండాలి. ఇల్లు జీవితంలో సాంత్వన, సంతోషం, ధైర్యం ఇచ్చే స్థలం. కానీ, అట్టి ఇల్లు చితిమంటల్లో చిక్కుకుంది. పవిత్రమైన దేవాలయంలాంటి ఇల్లు ఇప్పుడు చితి మంటల్లో చిక్కుకుని ఉంది. ఇల్లు శిథిలమై జీవం లేని స్థితిలోకి చేరుకుంది. మానవ సంబంధాలు మృగ్యం అయిపోయాయి.ఇల్లు ప్రేమను అందించే స్థలంగా ఉండక ఇప్పుడు నాశనం కలిగించే స్థితికి చేరింది. చితిని పేర్చి శవ దహన సమయంలో చివరిగా కట్టెలు వేయడం,నెయ్యి పోసే క్రియలను నేటి కుటిలత్వం సూచిస్తుంది.శవదహన చివరి ఘట్టంలో నెయ్యి పోసి కట్టెలు వేయడం వల్ల మంటలు మరింతగా పెరిగి జ్వాలలు ఎగసి పడతాయి. ఇంటి నాశనాన్ని ఆపాల్సిన వారు, దాన్ని రక్షించాల్సిన వారు ఆ ప్రయత్నం మాని, వాళ్లే దానిని పూర్తిగా మట్టి కరిపించే చర్యలు తీసుకుంటున్నారు. ఈ కవితలో కవయిత్రి తీవ్రమైన భావోద్వేగంతో వ్యంగ్యంగా వ్యక్తం చేసిన తీరు బాగుంది.

నిప్పును రాజేసే కుటిలత్వం నీడలో దుర్మార్గులు తమకు తోచిన విధంగా మరింతగా నిప్పును ఎగదోస్తున్నారు. కుటిలత, దురాలోచనలు ఇంటిని నాశనం చేస్తున్నాయి. ఇల్లు ప్రేమానురాగాలు పంచే స్థలంగా ఉండాలి. కానీ, ఇల్లు ఇప్పుడు కుటిల ఆలోచనల వల్ల మంటల్లో చిక్కుకొని తగలబడిపోతుంది. ఇల్లు ఇలా నాశనం అవ్వడానికి కారణం బయటికి కనబడని కుటిలత్వం, కపటం, దురాలోచనలు, స్వార్థం అని చెప్పవచ్చు. కానీ, కుటిలత్వం దాని ప్రభావం వల్ల ఇల్లు నాశనం అవ్వడం స్పష్టంగా కనిపిస్తుంది. దీపంలా వెలగాల్సిన ఇల్లు అనుబంధాలు మృగ్యం అయిపోయి హింస, కుటిలత, దురాలోచనల వల్ల చితిలా మారుతుంది. ఇది చింతనాత్మక వ్యంగ్య రూపకం.

‘మంచు కొండలా చల్లగా ఉండాల్సిన మనిషితనం
ఎందుకనో లావాలా జ్వలిస్తుంది
నేనెందుకనో గడ్డ కట్టుక పోతున్నాను

ఇక్కడ మనిషితనం మానవత్వాన్ని సూచిస్తుంది. మనిషితనం మంచుకొండ వలె చల్లగా, శాంతంగా, శీతలంగా ఉండాలి అని కవయిత్రి భావాల్లో వ్యక్తం అవుతుంది. మనిషి హృదయం మృదువుగా, దయతో, ప్రేమతో నిండి ఉండాలి. మనిషితనం అనే మాటకు మంచుకొండను ప్రతీకగా తీసుకోవడం వల్ల మన మనసులో చల్లదనం, శాంతి అనే భావాలు మెదులుతాయి. మానవత్వం కూడా మంచు కొండ వలె చల్లగా ఉండాలి అనే ఆశ కలుగుతుంది. మనిషిలో ఉండే సహజమైన గుణాలు ప్రేమ, దయ, మమకారం, సహనశీలత ఇవన్నీ చల్లదనాన్ని సూచిస్తాయి. మనిషితనం బాధ్యతతో శాంతియుతంగా ఉండే స్వభావం కావాలి. నిజమైన మానవత్వం శాంతియుతంగా ఉండాలి. చల్లదనంతో కూడి ఉండాలి.

మనిషితనం గురించి ఇక్కడ విరుద్ధంగా చెప్పబడింది. మనిషితనం శాంతంగా ఉండాలని ఆశించగా అది వాస్తవంలో మంటల మాదిరిగా లావాలా మండిపోవడం ఒక తీవ్రమైన ఉద్వేగాన్ని సూచిస్తుంది. లావా అనగానే భయంకరమైన వేడి, నాశనం,మండే స్వభావం గుర్తుకు వస్తాయి. కవయిత్రి ప్రశ్నిస్తూ చింతిస్తూ ఎందుకీ మార్పు? ఎందుకీ మండే కోపం?ఎందుకీ హింసాత్మక మనసు?అంటూ సమాజంలోని మారుతున్న పరిస్థితులపై నిరాశను వ్యక్తం చేస్తుంది.

ఇది వ్యక్తిగతమైన అనుభూతిని తెలియజేస్తుంది. ఇంత హింస మార్పు మధ్య కవయిత్రి తన హృదయం చలిలో గడ్డకట్టుకపోయిన వేదనను అనుభవించినట్లు తెలియజేస్తుంది. అనుబంధాలు, ప్రేమ, మానవత లేకపోవడం వల్ల తన భావాలు నిశ్చలమవుతున్నట్లు అనిపిస్తోంది. మనిషితనం శాంతంగా ప్రేమతో నిండి ఉండాలి. కానీ, అది ఇప్పుడు కోపం, ద్వేషంతో మండిపోతోంది. ఈ పరిస్థితుల్లో కవయిత్రి తనలో రగులుతున్న భావోద్వేగాలను వెలిబుచ్చలేక గడ్డ కట్టినట్టుగా బాధను అనుభవిస్తున్న తీరును వ్యక్తం చేయడం బాగుంది.

‘రేపెప్పుడైనా అగ్నిపర్వతంలా జ్వలించి
లావాలా స్రవించాలి కాబోలు

ఈ కవితా పంక్తులు భావోద్వేగాలను,ఆవేశాన్ని మరియు ఉక్కిరిబిక్కిరైన హృదయ స్థితిని వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో అగ్నిపర్వతంలా జ్వలించి లావాలా స్రవించాలి. ఇది ఊహాత్మకంగా అనేక భావాలను సూచిస్తుంది.ఒక వ్యక్తి తనలోని ఆవేశం, కోపం లేదా వేదనను ఇంతవరకు అణిచి వేసి పెట్టుకున్నాడు. కానీ, ఎప్పటికైనా అది ఉవ్వెత్తున ఎగసి పడుతుంది. తన హృదయంలో చెలరేగే మంటలు, భావోద్వేగాలు, బాధలు లావాలా బయటకు రావాలి. కానీ, భావోద్వేగాలను అంతర్గతంగా అణిచి వేసేందుకు ప్రయత్నిస్తే తట్టుకోలేనంత బాధ కలుగుతుంది. రేపెప్పుడైనా అనే పదం భవిష్యత్తులోని ఒక ఆశయం, అనివార్యతను సూచిస్తోంది. ఇది ఇప్పుడే కాదు గాని భవిష్యత్తులో జరుగుతుంది అనే భావం వ్యక్తం అవుతుంది. వ్యక్తి అంతరంగంలో ఉన్న అణిచివేత, ఆవేశం, బాధ లేదా నిరుత్సాహం వంటివి ఉక్కిరి బిక్కిరిగా మారి అగ్ని పర్వతంలా బహిర్గతం అవుతాయని సూచిస్తుంది. అగ్నిపర్వతం సాధారణంగా శాంతంగా ఉంటుంది. కానీ, దాని లోపల రగిలే మంటలు ఎప్పుడో ఒక రోజు పేలిపోతాయి. అగ్నిపర్వతంలోని మంటలు ఎప్పుడో ఒక రోజు ఎగసిపడతాయి. కవయిత్రి హృదయంలో ఎన్నో భావోద్వేగాలు అణిచి వేయబడి ఉన్నాయి. అవి ఎప్పుడో ఒక రోజు జ్వాలలుగా వ్యాప్తి చెందుతాయి.

కవయిత్రి తనలోని భావాలు బాధ, కోపం, నిరాశ ఎన్నో రోజుల నుంచి దాచుకున్నా చివరికి బయటకు వస్తాయంటోది. ఇది కేవలం ఒక అంచనా మాత్రమే కాదు. ఒక ఆత్మ విమర్శగా వినిపిస్తుంది. ఇది జరగక తప్పదు కాబోలు. ఇది వ్యక్తి అంతరంగ ఆవేదనను తీవ్రతను వ్యక్తం చేస్తున్నది. తాను మౌనంగా, శాంతంగా ఉండిపోయినప్పటికీ మనసు లోపల రగిలే ఆలోచనలు కదులుతున్నాయి, అవి ఎప్పుడో ఒక రోజు అగ్నిపర్వతంలా పేలి బయటకు రాక తప్పదు అని కవయిత్రి వ్యక్తం చేసిన భావం పాఠకులను ఆలోచింపజేస్తుంది.

కవయిత్రి అంజనీ దేవి మరిన్ని మంచి కవితాసుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

Exit mobile version