Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కనిపించని మరొక కోణాన్ని చూపే కవిత ‘అయిననూ..!?’

[శ్రీ శిఖా – ఆకాష్ గారి ‘అయిననూ..!?’ అనే కవితని విశ్లేషిస్తున్నారు శ్రీ నరేంద్ర సందినేని.]

ప్రముఖ కవి, శిఖా – ఆకాష్ కలం నుండి జాలువారిన ‘అయిననూ..!?’ కవిత పై విశ్లేషణా వ్యాసం ఇది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల గురించి రాసిన కవిత ఇది. ఇప్పటికీ మహిళలకు ఆకాశంలో సగం అవకాశాల్లో శూన్యం స్థితి కొనసాగుతోంది. ‘అయిననూ’ అనే దానిని అయినప్పటికీ అనే అర్థంలో వాడుతారు. ఇది ఆశ్చర్యాన్ని, సందేహాన్ని లేదా అనిశ్చితిని వ్యక్తపరిచే భావ వ్యక్తీకరణ. మహిళలకు ఎదురైన అత్యాచారాలు, వేధింపుల గురించి తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. సాధారణంగా మనం ఏదైనా అందమైన దాన్ని చూసినప్పుడు ఆనందంతో పరవశిస్తాం. కానీ, కవి ఇక్కడ ‘అయిననూ’ అనే కవితా శీర్షిక ద్వారా స్త్రీల జీవితాల్లో మనం చూడని, మనకు కనిపించని మరొక కోణం దాగి ఉందని సూచిస్తున్నారు. కవి శిఖా – ఆకాష్ కవితా చరణాలపై దృష్టి సారించండి.

‘సౌందర్య దరహాస చంద్రికలు సరే
కనబడని ముళ్ళ కిరీటాలెన్నో..!?’

ఈ పంక్తులు ఒక ఆలోచనాత్మకమైన భావాన్ని వ్యక్తపరుస్తున్నాయి. స్త్రీల వ్యక్తిత్వం గురించి కవి ఒక అందమైన చిత్రాన్ని చిత్రీకరిస్తున్నాడు. అందం, చిరునవ్వు, చంద్రుని కాంతి అన్నీ ఆమెలో కలిసి ఉన్నాయి. ఆమె ముఖంలో చిరునవ్వు, ఆకర్షణీయమైన రూపం చంద్రుని కాంతిలా వశపరుచుకునే వ్యక్తిత్వం ఉండొచ్చు. ఆమెలో కనబడని బాధలు, కష్టాలు ఎన్నో దాగి ఉన్నాయి అని చెప్పడం గొప్ప జీవిత సత్యాన్ని తెలియజేస్తుంది. మనం స్త్రీలను వారి జీవితాలను బాహ్యంగా చూస్తాం. స్త్రీలు ఎంతో అందంగా, చిరునవ్వుతో, ప్రశాంతంగా కనిపిస్తారు. వారి జీవితంలో ఎలాంటి కష్టాలు లేవని అనుకుంటాం. కానీ,వాస్తవంగా వారు అనుభవిస్తున్న మానసిక సంఘర్షణలు, బాధలు, కష్టాలు మన కళ్ళకు కనిపించవు. ఈ కవిత ద్వారా స్త్రీల జీవితంలోని ఒక లోతైన భావాన్ని తెలుసుకోగలం. బయట ఎంతో అందంగా కనిపించినా స్త్రీ తన జీవితంలో ఏదో ఒక రకమైన బాధను, సంఘర్షణను అనుభవిస్తూనే ఉంటుంది. మనకు కనిపించని కష్టాలను,బాధలను అనుభవిస్తున్న స్త్రీలను సానుభూతితో అర్థం చేసుకోవాలి. మనకు కనిపించే ప్రపంచం ఒక మాయా బజారు. దాని వెనుక గల అసలు నిజం ఏమిటి? అని లోతుగా పరిశీలించాలి. అందం, ఆనందం ఉన్న చోట కూడా బాధలు, కష్టాలు దాగి ఉంటాయి. వారిని మనస్ఫూర్తిగా అర్థం చేసుకోవాలి. అదే నిజమైన జీవన దార్శనికత.

‘ఉప్పొంగే ప్రేమల వెనుక
దహిస్తున్న కార్చిచ్చు

ఈ పంక్తిలో ఉన్న భావం ఎంతో లోతుగా ఉంది. ఇది ప్రేమ యొక్క రెండు విభిన్న పార్శ్వాలను తెలియజేస్తుంది. ప్రేమ యొక్క మాధుర్యాన్ని వెల కట్టలేం, అలాగే దాని వెనుక దాగి ఉన్న వేదనను గుర్తించలేం. ప్రేమ ఒక పవిత్రమైన భావన. ఒకరికి మరొకరిపై కలిగే అపారమైన మమకారం, ప్రేమ, అనురాగం, ఉద్వేగాలు మరియు కలుసుకున్న క్షణాల్లో కలిగే ఆనందం మనసును పరవశింప చేస్తుంది. ప్రేమ వెలుగును, ఆనందాన్ని, మధురమైన అనుభూతులను ఇస్తుంది. ప్రేమ ఒక కొత్త ప్రపంచంలో విహరించేలా చేస్తుంది. కానీ, ప్రతి ప్రేమ కథ వెనుక ఓ వేదన కూడా దాగి ఉంటుంది. ప్రేమలో వచ్చే విరహం, ఆవేదన మనసును కాల్చి వేస్తాయి. పైకి ప్రేమ ఎంత అందంగా కనిపించినా, లోపల కలిగే బాధ, త్యాగం కొన్ని సార్లు కార్చిచ్చులా వేధించవచ్చు. ప్రేమలోని త్యాగాలు, విరహ బాధ, ఎదుటి వారి నుంచి ఎదురయ్యే నిరాశ, నిట్టూర్పులు, కష్టం, మనసును కార్చిచ్చు వలె బాధిస్తాయి. ప్రేమను పొందడం ఎంత ఆనందదాయకమో చెప్పనలవి కాదు. ప్రేమను కోల్పోయిన భావన అంతే తీవ్రంగా ఉంటుందనే సత్యాన్ని తెలియజేస్తుంది. ప్రేమ యొక్క మాధుర్యాన్ని అలాగే దాని వెనుక దాగి ఉన్న బాధను,ఈ కవితా పంక్తులు అద్భుతంగా వ్యక్తీకరిస్తున్నాయి.

‘ప్రవహిస్తున్న కన్నీటి లావా !?’

శ్రీ శిఖా – ఆకాష్

ఇది భావోద్వేగాలను వ్యక్తపరిచే ఒక రూపకం అని చెప్పవచ్చు. ప్రవహిస్తున్న కన్నీటి లావా అంటే నిరంతరం ఆగకుండా కన్నీళ్లు ప్రవహించడం. ఇది మానసిక వేదన లేదా అంతులేని దుఃఖాన్ని సూచిస్తుంది. కష్టంలో ఉన్నప్పుడు దుఃఖంతో కన్నీళ్లు ఆగకుండా వస్తాయి. కన్నీళ్ళను మామూలు నీటి ప్రవాహంతో కాకుండా లావాతో పోల్చడం వల్ల బాధ తీవ్రత ఎంత గొప్పదో స్పష్టంగా తెలుస్తుంది. లావా వేడిగా ఉగ్రంగా అణిచి వేయలేనిదిగా ఉంటుంది. అలాగే కన్నీటి లావా అంటే నిస్సహాయత, తీవ్రమైన వేదన, నిరాశ, కోపం కలిసిన భావోద్వేగం అని చెప్పవచ్చు. స్త్రీల కళ్ళల్లో ప్రవహిస్తున్న కన్నీటి లావా ఎవరికీ కనిపించదు. అన్యాయానికి గురైన వారి కన్నీళ్లు కన్నీటి లావాగా మారి విస్పోటనం చెందుతాయి. మనసులో క్షోభ పెరిగినప్పుడు అది కన్నీటి రూపంలో బహిర్గతమవుతుంది. కానీ, ఒక దశలో అది ఓ పెద్ద విస్ఫోటం అవుతుంది. అగ్నిపర్వతంలా పేలి పోతుంది. ప్రవహిస్తున్న కన్నీటి లావా అనేది కేవలం కన్నీళ్లు మాత్రమే కాదు. ఒక మనిషి లేదా సమాజం లావాను ఊహించలేని బాధలో మునిగి పోతున్న తీరు అగ్నిజ్వాల లాంటిది. ఇది శోకాన్ని, నిరాశను, విస్ఫోటనాన్ని, తిరుగుబాటును సూచిస్తుంది. ఇది ఒక స్త్రీ వ్యక్తిగత బాధ కాదు. సమాజంలోని మహిళలు అందరిపై వివక్ష యథేచ్ఛగా కొనసాగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా స్త్రీలపై జరిగే సామాజిక అసమానతలు, అన్యాయాల రూపకంగా కూడా చూడవచ్చు.

‘లోలోన విస్పోటాలకు సిద్ధం గున్న
రక్త పర్వతాలు..!?’

ఈ పంక్తిని ఒక అలంకారిక, భావోద్వేగాత్మక రూపకంగా పరిగణించవచ్చు. ఇది స్త్రీలలోని ప్రమాదం, విపత్తు లేదా ఘోర పరిస్థితిని ప్రతిబింబిస్తుంది. అలాంటి దృశ్యం గాఢమైన భావోద్వేగాలను, ఉద్వేగాన్ని లేదా క్రూరతను వ్యక్తపరచవచ్చు. ఇది ఒక వ్యక్తి హృదయం, సమాజంలోని అంతర్గత విభేదాలు లేదా ప్రకృతిలోని అగాధ ఉగ్రతను చక్కగా ఆలంకారికంగా చిత్రిస్తున్నాయి.

‘మధురమైన పాట వెనుక
విషాద గాధలెన్నో

ఒక మధురమైన పాట వెనుక భావోద్వేగాలు, వ్యక్తిగత అనుభవాలు, ప్రేమలోని నిస్సృహలు, విడిపోతే వచ్చిన బాధలు లేదా సామాజిక పరిస్థితుల ప్రభావం ఉండవచ్చు. మనం ఆలకించే ప్రతి పాటకు ఒక కథ ఉంటుంది. కవి రాసిన కొన్ని పాటలు తన మనసులోని లోతైన బాధల్ని ప్రతిబింబిస్తాయి. ఆ పాట వెనుక ఉన్న తపన ఏమిటి? ఒక అనురాగపు వేదన, కవి తన జీవిత అనుభవాలను లేదా తన ఊహల్లో ఒక విషాద గాథను అందులో మేళవిస్తాడు. కవి గుండెల్లో అట్టుడుకుతున్న దుఃఖం ఉంటుంది. అందులో కోల్పోయిన అనుభూతులు, అందని కలలు ఉంటాయి. పాటల వెనుక కవి కన్నీళ్లు ఉంటాయి. అవి వినే వాళ్ళ హృదయాల్లో మధుర స్మృతులుగా మారుతాయి.

‘సౌందర్య దీపాల వెనుక
కమిలిన గాయాలెన్నో..!?’

ఈ పంక్తిలో అంతర్లీన భావాన్ని చూడ వచ్చు. సౌందర్య దీపాలు అందమైన స్త్రీలకు ప్రతీకలు. కమిలిన గాయాలు అంటే లోపల దాచుకున్న బాధలు, కష్టాలు అని అర్థం. ఇది స్త్రీల జీవితంలోని బాధల్ని సూచిస్తుంది. మనకు కనిపించే అందమైన ముఖాల వెనుక, మెరిసే విజయాల వెనుక, ఎన్నో కష్టాలు, బాధలు, త్యాగాలు దాగుంటాయి. మనం ఎవరి జీవితాన్ని చూసినా బయటకు కనిపించే దాని కంటే లోపల దాగున్న కష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కవితా పంక్తి కేవలం ఒక కవితాత్మకమైన భావన కాకుండా జీవితం పట్ల లోతైన అర్థాన్ని ఇచ్చే జీవన సత్యం.

‘ఏదీ లోతుండదు
వ్యవస్థీకృత విధ్వంసమేదో..
విస్ఫోటనమేదో..
సునామీ ఏదో
ఆమెలానే.. లోనే..!?’

ఈ కవితా పంక్తులు కవితాత్మకంగా మార్మికంగా ఉన్నాయి. ఇది ఒక అంతర్ముఖ భావనను సూచిస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఏదీ లోతుండదు. ఇందులో ఎక్కడ స్థిరత్వం లేదు. నిశ్చలత లేదు అని భావించవచ్చు. సమాజంలో మహిళలకు పూర్తిగా భద్రత లేదు. మహిళలు ఎక్కడ హాయిగా ఉన్నట్లు అనిపించదని సూచిస్తున్నది.

‘వ్యవస్థీకృత విధ్వంసమేదో..’

నియంత్రితమైన విధ్వంసం అనగా ఒక విధంగా ఏర్పాటైన విధ్వంసం, ఆలోచించిన విధంగా జరిగే మార్పులు. సమాజంలో మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలు ఉన్నాయి. అవి పూర్తిగా అమలు కాకపోవడం వల్ల మహిళల జీవితాలలో గణనీయమైన మార్పు కాన రావడం లేదు అని చెప్పొచ్చు.

‘విస్ఫోటనమేదో..
సునామీ ఏదో..

ఇవి పెద్ద మార్పులను సూచించే పదాలు. ఇవి ఏకకాలంలో శక్తివంతమైన ప్రకృతి వైపరీత్యాలను, అంతర్గత ఉప్పెనలను సూచించవచ్చు. ఇది మహిళలపై జరుగుతున్న హింసను, వేధింపులను, వివక్షలకు ప్రతీకగా భావించవచ్చు. రోజు రోజుకి మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఒక పెద్ద సంక్షోభంలా మారుతున్నాయి అని చెప్పవచ్చు.

‘ఆమెలానే.. లోనే..!?’

ఇది అత్యంత ఆసక్తికరమైన భావం. ఇది మహిళల అంతరంగిక స్థితిని ప్రతిబింబించవచ్చు. మహిళల వేదనలు బయటికి కనబడకపోయినా ఆమెలోనే మౌనంగా భయాలు, బాధలు, అనుభవాలు దాగి ఉండొచ్చు. ఒక మహిళ తన అంతరంగంలో ఎదుర్కొంటున్న మానసిక గందరగోళాన్ని, భయాన్ని లేదా ఆమె లోపలే ఒక విప్లవ జ్వాల రగలడాన్ని సూచిస్తుంది. సమాజంలో మహిళల రక్షణ కోసం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇది ఒక వ్యక్తి మనసులో జరుగుతున్న ప్రక్రియను అంతర్గత మథనాన్ని తెలియజేస్తున్నట్లు అనిపిస్తోంది. బాహ్యా ప్రపంచంలో ప్రశాంతంగా కనిపించినా, మనసులో మాత్రం మార్పుల తుఫాను చెలరేగుతుంది. స్త్రీల అంతరంగంలో ఏర్పడే ఆలోచనల ప్రకంపనలను, అస్తవ్యస్తతను ఆవేశాన్ని, కల్లోలాన్ని ఈ పదాలు తెలియజేస్తున్నాయి.

‘కల్పనల వాస్తవంగానే..
ఆత్మహత్యల హత్యగానే..

కొన్నిసార్లు కల్పన నిజంలా మారుతుంది. ఏదైనా హత్య జరిగితే అది నిజంగా హత్య జరిగిందా? లేక హత్యను ఆత్మహత్యగా ప్రచారం చేస్తున్నారా? అన్న సందేహం కలుగుతుంది.

‘ఎప్పటిలానే..
ఆమె అన్నీనూ.. మీ కాదూనూ..

సమాజంలో ఆమెకు స్త్రీగా గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఎప్పటిలాగా ఆమెను చిన్నచూపు చూస్తూ ఉండటం మనం ఎరిగినదే. ఆమెకు సరైన గౌరవం లభించడం లేదు. ఆమె ఆకాశంలో సగం, అన్నింటా ఆమెనే అని అంటున్నారు. అయినా సమాజంలో ఆమెకు ఎలాంటి గుర్తింపు లేదు.

‘ఆమె లేనిదే ఏదీ లేదు
అయిననూ..

నిజానికి ఆమె లేక ప్రపంచమే లేదు. అయినా, ఆమె ఉన్నా లేనట్టే చూసే పరిస్థితి ఈ సమాజంలో కొనసాగుతుంది.

‘ఎన్నైనా చెప్పండి
పేరుకే.. ఉత్తుత్తికే..

ఆమెను ఎంతగానో పొగుడుతున్నారు. కానీ, అవి కేవలం మాటలకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. వాస్తవ జీవితంలో ఆమెకు సరైన గౌరవం, గుర్తింపు అసలు ఉన్నదా? అనే సందేహం కలుగుతుంది.

‘పొగడ్తకే.. దేవతగానే..’

మహిళను దేవతగా పొగుడుతారు. కానీ, నిజజీవితంలో ఆమెకు స్వేచ్ఛా, సమానత్వం ఏమీ లేవు. సమాజంలోని ఈ కపట ధోరణిని ప్రశ్నిస్తున్న పంక్తి ఇది. మహిళల జీవితంలోని విపరీతమైన విభేదాలను, సమాజపు వేషధారణను ప్రతిబింబిస్తున్నది. ఆమె లేకపోతే ఏదీ లేదు. కానీ, ఆమెకు సరైన గుర్తింపు ఉండదు. సమాజంలో ఆమెను దేవత అంటూ పాడే పాటలకు, పొగడ్తలకు కొదువ లేదు. కానీ, వాస్తవ పరిస్థితుల్లో ఆమెను అణగతొక్కే వ్యవస్థ ఇంకా కొనసాగుతుంది. ఈ కవితా పంక్తి వ్యంగ్యంతో కూడి ఆలోచింప జేస్తుంది.

‘ఆమె
ఇప్పుడిక్కడ
బానిసలకు బానిసగానే..!?’

ఆమెకు తన జీవితంలో ఏ మాత్రం స్వేచ్ఛ లేదు. ఆమె జీవితం బానిసల కన్నా అధ్వాన్నమైన స్థితిలో కొనసాగుతున్న స్థితిని తెలియజేస్తున్నది.

‘కల్పనల వాస్తవంగానే..!?’

ఆమె కన్న కలలు కల్లలుగా మారిపోయాయి. ఆమె కోరుకున్న ఆశలు అడుగంటి పోయాయి. కలలు చెదిరి, ఆశలు నాశనమై కఠినమైన జీర్ణించుకోలేని వాస్తవాలుగా మారిపోయాయి.

‘అవమానాల అణిచివేతగానే..!?’

ఆమె నిరంతరం అవమానాలను అణిచివేతలను ఎదుర్కొంటూ మౌనంగా భరించాల్సిన స్థితిలో ఉందనేది స్పష్టమవుతుంది.

‘మానభంగాల ముద్దగానే..!?’

ఆమె నిత్యం లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నది. ఆమె అత్యాచార బాధితురాలిగా మిగిలి పోయింది అని కవి ఇక్కడ హృదయవిదారకంగా ప్రస్తావించారు.

‘ఆత్మహత్యల హత్యగానే..!?’

స్వచ్ఛందంగా ఆత్మహత్య చేసుకోవడానికి గురిపెట్టబడిందా లేక సమాజమే ఆమెను మానసికంగా శారీరకంగా చంపేస్తుందా? అన్న ప్రశ్న ఎదురవుతున్నది. ఇది ఒక సామాజిక స్పృహ కలిగించే కృత్యం.

ఈ కవిత సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వివిధ ఒత్తిళ్లు, అన్యాయాలు, అనుభవాలను తీవ్రంగా ప్రశ్నిస్తూ ఒక గాఢమైన సందేశాన్ని అందిస్తుంది.

కవి శిఖా – ఆకాష్ మహిళల గురించి సందేశాత్మక కవితను అందించినందులకు వారిని అభినందిస్తున్నాను. వారు మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

Exit mobile version