[29 జూలై జ్ఞానపీఠ కవి డా. సి. నారాయణ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈ వ్యాసాన్ని అందిస్తున్నారు శ్రీమతి రాజేశ్వరి దివాకర్ల.]
నారాయణ రెడ్డి గారి మొదటి గేయ నాటిక ‘నవ్వని పువ్వు’. 1953లో తన తొలిరచనగా ‘నవ్వని పువ్వు’ అన్న సంగీత ప్రధానమైన రూపకాన్ని వెలువరించారు
ఈ మొగ్గ ప్రసవం అపురూపంగా జరిగింది.
ఈ మొగ్గ చిన్ని మొగ్గ, కన్నె మొగ్గ
ఈ మొగ్గ ప్రసవం తీగె చివురుటాకులలో రవల రేకులలో మంచు ముత్యాలుంచి, మంచి మధువులనుంచి ఉదయ భాను కరాల -సుధలు జారేవేళ. ప్రకృతి లక్ష్మి పాద పూజలు చేసి కన్నది.
ఈ తీగె నిండు మమతల వెల్లి,
ఇక ఈ చిన్ని పూవును
ఎంతో గారాబంగా పెంచింది. డాబుగా పెంచింది. కడుపార పోషించింది. మనసారా పెంచింది
పాల వెన్నెలలో పచ్చి మీగడ దీసింది
ఈ పూవు చిన్ని మొగ్గ గా జనించింది.
కన్నతల్లి తీవె కడుపార కన్నది. ఆ సమయం అతి మనోహరం
ఈ మొగ్గ కన్నె మొగ్గ
నవ్వని పువ్వు చిన్ని మొగ్గ. కన్నె మొగ్గ. తీగ తల్లి ఉదయ భాను కరాల సుధలు జారేవేళ, ప్రకృతి లక్ష్మికి ఎన్నో నోములు నోచి ఈ కన్నె మొగ్గను కన్నది. తల్లి తీగ జీవనాడులలోన శీతాంబువులను పోసి కన్న మొగ్గను పాల వెన్నెలలోని పచ్చి మీగడను తీసి, తన మేని పొరలనే మెత్తటి పాంపు గాచేసి ఎంతో డాబు గా గారాబుగా పెంచింది. కన్న మొగ్గను కడుపారగా పెంచిన తల్లి తీగను మాతృమూర్తిగా పరిచయం చేసారు కవి. మొగ్గ జనించిన మనోహర ప్రకృతి వేళను నవ్వని పువ్వు గేయ నాటికా రంగస్థల భూమికను సిద్ధం చేసారు.
‘నవ్వని పువ్వు’ లోక సహజమైన మానవ స్వభావాలను ప్రకృతి చైతన్యానికి ఆరోపించిన లలిత రూపకం. నృత్యాభినయానికి తగిన సన్నివేశ రూపకల్పన కవి గారి సౌందర్యాపేక్షను, స్నిగ్ధ మనస్సును ప్రతిబింబిస్తుంది. సామాజికపరమైన సందేశాన్ని కళాత్మకంగా ప్రకటించిన నేర్పు నాటికలో మనోన్మీలితమైన వికాసాన్ని కలిగిస్తుంది.
‘నవ్వని పువ్వు’ శీర్షిక ఒక సందేహాన్ని కలిగిస్తుంది. పూవు అంటేనే నవ్వుకు ప్రతిరూపం కదా! పూవు నవ్వని కారణం ఏమిటబ్బా? అని ప్రతి భావుకునికి ఆసక్తి కలుగుతుంది.
జీవ నాడుల లోన శీతాంబువులు వోసి అనే శబ్ద రవళి తల పోతలకు మెలకువ కలిగిస్తుంది. బిడ్డను గురించి తల్లి ఆశలను, ఆమె లాలన, రక్షణ, ఇత్యాది మాతృభావన లను అన్నింటినీ చిన్ని పదాలలో వ్యక్తం చేసారు. తీగ తల్లి పాత్రను ఆడ బిడ్డను కన్న తల్లి సంస్కృతిని దర్శనం కావించారు.
ఈ నాటికలో మొగ్గ, తుమ్మెద, తీగ, కవి, పవనుడు పాత్రలు.
మొగ్గకు తరుణ ప్రాయం వచ్చింది. తొలి వలపు కలవరం కలిగింది. గాలి బాటలలో పయనించి వచ్చి కమ్మని పాటలతో గానం చేసి గిలిగింతలు రేపుతున్న ఆతడెవరో అని గుబులు పడింది.
ఝుం అంటూ తుమ్మెద ప్రవేశించి మొగ్గకు వలపు మాటలాడింది. మొగ్గ కోసం తపించి ఉన్నానని. బ్రతుకంతా అమ్మెదననీ పలికాడు. మొగ్గ తుమ్మెద మాటలకు మైమరచింది. రాణా అంటూ అతనిని ప్రియమార సంబోధించింది.
అతడు మాయ గానాల చతురుడు. మొగ్గ చిరునవ్వుకు వేచానని పలికాడు. ఆమె కొరకు స్వర్గము దాచానని పలికాడు.
అమాయిక ఆతని తీపి మాటలకు మనసునిచ్చింది.
తుమ్మెద రాకడను తల్లి తీగ కనిపెట్టింది.
ఆతడొక మాయగాడని బిడ్డకు నచ్చ జెప్పింది. ఇటువంటి తిరుగుబోతులు, మీ బోటి మొగ్గలను కవ్వించి తీయ తేనెలు త్రాగి మరొక చోటికి పోయి విహరిస్తారని హెచ్చరించింది. బిడ్డను నవ్వకే అంటూ అనుభవంతో మాట్లాడింది.
తల్లి హెచ్చరికను విని, తన ఆటలు సాగవని తెలిసింది.
కవి మొగ్గను అనునయిస్తూ చిన్ని మొగ్గ వలపు తలపుకు తన సానుభూతిని తెలిపాడు.
తుమ్మెద మాటల మైకంలో మొగ్గకు మంచి చెడు జ్ఞానం కలుగలేదు,
టక్కరి తుమ్మెద విరి మొగ్గ మధువు లను గ్రోలే ఆశను వీడలేదు. తన కోర్కెను తీరేందుకు చెలికాడు పవనుని తోడు పిలిచింది.
పవనుడు దుష్ట తుమ్మెద చెలికాడు. ఆతణి దురాలోచన తెలుసును కనుక,
ఏమిటోయీ నీ రొద? ఏ కన్నెపై కన్ను వేసావేమిటి? అని అడిగాడు.
మిత్రుడు సరిగా ఊహించాడని తుమ్మెద ‘నవ్వని పువ్వు’ను గూర్చి చెప్పాడు. మువ్వన్నెల పూవు జాణను నువ్వూ నేనూ కలిసి ఎలాగైనా నవ్విద్దామని పథకం వేసాడు. కాని తేనెలు నా వంతు, తావులే నీ వంతూని స్పష్టం చేసాడు.
తుమ్మెదకు సహకరిస్తానని వెంటనే సమ్మతించాడు. విరికన్నెల తేనెలను త్రాగే తుమ్మెదను అళిరాజాని సంబోధించాడు.
ఇద్దరూ కలిసి బయలుదేరారు. మొగ్గ సిగ్గును తొలగించే ప్రయత్నం చేసారు. గిలిగింతలు పెట్టారు కలగీతులతో, కవి ఇప్పుడు పెద్దరికం వహించాడు. వాళ్ళిందరూ ఎంత కవ్వించినా నవ్వ వద్దని హితవు చెప్పాడు
తీగ తల్లి కవికి వత్తాసు పలికింది. నవ్వబోకు అని హెచ్చరించింది.
మొగ్గకు జ్ఞానోదయం అయింది.
తల్లితో, కవితో తాను నవ్వనని ప్రమాణం చేసింది. తన పరువం నలిపివేసేందుకు కాచుకుని ఉన్న వారి వలలో పడడం కంటే తనలో దాచుకున్న వలపు తలపులే మిన్న అని తెలుసుకుంది. కవి గారికి ఆ మాట చెప్పింది. తుమ్మెదను పాట చాలించు అని తరిమింది. కవి తల్లి ఒడిలో చల్లగ ఊగుమని మొగ్గను దీవించాడు.
‘నవ్వని పువ్వు’ గేయ నాటిక అన్యాపదేశంగా పూవుకు తల్లి చెప్పిన హితవు మిషతో నేటి యువతులకు మిథ్యాకర్షణలకు పోవద్దని గట్టి బోధను చేస్తుంది.