16-09-2021 తేదీ యం. యస్. సుబ్బులక్ష్మి గారి జయంతి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.
***
ఆమె విశ్వవేదిక ఐక్యరాజ్యసమితిలో సంగీత కచేరి చేసి ప్రేక్షకులను అలరించిన తొలి భారతీయ సంగీత సరస్వతి. ‘భారతరత్న’ పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయ సంగీత కళాకారిణి. తాను సినిమా నటిగా, సంగీత సామ్రాజ్ఞిగా సంపాదించిన ధనమంతా దానాలు చేసిన గొప్ప దాత.
“సుబ్బులక్ష్మీ! రామ్ ధున్ నువ్వే గానం చేయాలి…” అని గాంధీ మహాత్ముడు ఆమెని ప్రశంసించారు. “నాదేముంది? నేను ఒక దేశానికి ప్రధానమంత్రిని మాత్రమే! ఆమె సంగీత సామ్రాజ్యానికే మహారాజ్ఞి” అని ప్రథమ ప్రధాని జవహర్లాల్ వినమ్రంగా, “సుబ్బులక్ష్మి సంగీత విద్వాంసులకే విద్వాంసురాలు” అని జ్యోతిబసు ఆమెను మెచ్చుకున్నారు. ఆమే శ్రీమతి యం.యస్.సుబ్బులక్ష్మి.
దక్షిణ భారతదేశంలో కర్నాటక సంగీతంలో త్రిమూర్తులుగా పేరు పొందిన వారిలో ఈమె ఒకరు. కాగా మిగిలిన ఇద్దరు శ్రీమతి డి.కె.పట్టమ్మాళ్, శ్రీమతి యం.యల్. వసంత కుమారిలు.
ఈమె 1916లో సెప్టెంబర్ 16వ తేదీన ఆనాటి మద్రాసు ప్రెసిడెన్సీ, నేటి తమిళనాడులోని మధురైలో జన్మించారు. తల్లిదండ్రులు షణ్ముఖ వడివు అమ్మాళ్, సుబ్రహ్మణ్య అయ్యర్లు. ఈమెను కుంజమ్మ అని ముద్దుగా పిలుచుకునేవారు. తల్లి వీణావాద్యంలో పేరుపొందారు. తల్లి వద్దే సంగీత పాఠాలు నేర్చుకున్నారు. అమ్మమ్మ అక్కమ్మాళ్ వయొలిన్ విద్వాంసురాలు. వీరి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు. అంతేకాదు వారిని మించి ఎదిగారు. మధుర మీనాక్షి దేవాలయ ఆస్థాన వాయిద్యకారుల సన్నాయి నాదాలు ఈమెకి సంగీతం పట్ల మక్కువని పెంచాయి. రేడియోలో బడే గులామ్ ఆలీఖాన్, అబ్దుల్ కరీమ్ ఖాన్ మొదలయిన హిందుస్థానీ సంగీత కళాకారుల గానాన్ని విని పరవశించేవారు.
కారైకుడి సాంబశివ అయ్యర్, యం.యన్. సుబ్బరామ భాగవతార్, అరియకుడి రామానుజ అయ్యంగార్ల వద్ద కర్నాటక సంగీతాన్ని అభ్యసించారు. అందరి వద్ద కర్నాటక సంగీతపు మెలకువలని ఆకళింపు చేసుకున్నారు.
పండిట్ నారాయణరావు వ్యాస్ దగ్గర హిందుస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకున్నారు. ఉత్తర, దక్షిణ భారత దేశపు సంగీత మెలకువలని అవగాహన చేసుకుని సంగీత కచేరిలిచ్చే స్థాయికి ఎదిగారు.
‘మద్రాసు మ్యూజిక్ అకాడమీ’లో ఈమె ఇచ్చిన కచేరి ఈమె జీవితాన్ని మార్చింది. ఈమె సంగీత ప్రపంచంలో ఎదగడానికి దోహదం చేసింది.
ఇదే సమయంలో సినిమాలలో నటించే అవకాశం కూడా లభించింది. ‘స్త్రీ బాధల నుండి విముక్తి కావాలి’ అనే స్త్రీవాద అంశంతో నిర్మించిన సాంఘిక సినిమా ‘సేవాసదనం’తో సినీరంగ ప్రవేశం చేశారు. ‘శకుంతల’ సినిమాలోనూ నటించారు.
ఈమె నటించిన కృష్ణభక్తురాలు ‘మీరా’ సినిమాలోని నటనకు, సినిమాలో ఆలపించిన మీరా భజన్లకు దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు లభించాయి. ‘సావిత్రి’ ఈమె నటించిన చివరి చిత్రం. ఈ సినిమాలో ‘నారద పాత్ర’ను ధరించి ఆలపించిన పాటలు ప్రేక్షకాదరణకు గురయ్యాయి.
ఆ రోజుల్లో ప్రముఖ జాతీయోద్యమ నాయకుడు, పత్రికాధిపతి, వ్యాపారస్తులు అయిన సదాశివం, ఈమెను వివాహమాడారు. సదాశివంగారు తన ‘కల్కి’ పత్రికలో సుబ్బులక్ష్మి సంగీత కచేరిల విశేషాలకు సంబంధించిన వ్యాసాలను ప్రచురించారు. ఈమె సంగీత సామ్రాజ్ఞిగా పేరు పొందడానికి దోహదం చేశారు.
ఈమె కేవలం కర్నాటక, హిందూస్థానీ సంప్రదాయాలతో ఆగిపోలేదు.
ఆమె గొప్పదనాన్ని జనబాహుళ్యానికి అందజేశాయి. భారతదేశమంతటా ఈమెకు సంగీత సామ్రాజ్ఞిగా పేరు లభించింది.
తరువాత కాలంలో ఆమె మాతృభాష తమిళంతో పాటు తెలుగు, బెంగాలీ, కన్నడం, మళయాళం, గుజరాతీ, హిందీ, సంస్కృతం వంటి భారతీయ భాషలను అధ్యయనం చేశారు. ఆయా భాషలలో పొందుపరిచిన సంగీతాన్ని అభ్యసించి, వాటిల్లోని వైవిధ్యపు సంగీతపు పోకడలను ఆకళింపు చేసుకున్నారు. వివిధ భాషల్లో శాస్త్రీయ గీతాల ఆలాపన ద్వారా అందరినీ అలరించారు.
మీరా, కబీర్, సూర్దాస్, తులసీదాస్, గురునానక్ భజన్లు, అన్నమాచార్య సంకీర్తనలు, క్షేత్రయ్య మువ్వగోపాల పదాలు, భక్తరామదాసు కీర్తనలు, తుకారాం అభంగ్లు, యింకా ఎందరెందరో పద సంకీర్తనాచార్యుల కీర్తనలను తన్మయత్వంతో భక్తిపూర్వకంగా ఆలపించారు. చివరికి ‘రవీంద్ర సంగీత్’ని వదలలేదు.
ప్రాకృచ్చిమ దేశాలలో చాలా సంగీత కచేరిలు చేశారు. లండన్లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో, న్యూయార్క్ లోని కార్నెగీ హాల్లో, రష్యాలోని క్రెమ్లిన్ రాజ ప్రాసాదంలో, కెనడా, ఇండియా కార్యక్రమాలలో ఆమె కచేరిలు చేశారు.
ఐక్యరాజ్యసమితిలో సాధారణ సభలో 1966 అక్టోబరులో జరిగిన ఐక్యరాజ్యసమితి దినోత్సవ కార్యక్రమంలో ఆమె చేసిన కచేరి ‘నభూతో నభవిష్యతి’గా పేరుపొందింది. ఈ అరుదైన అవకాశాన్ని పొందిన తొలి భారతీయ సంగీత కళాకారిణి ఈమె.
1944లో బొంబాయిలో అఖిల భారత నాట్య సమావేశంలో పాల్గొని కచేరి ఇవ్వడం ద్వారా దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. ఆ తరువాత భారత దేశంలోని వివిధ ప్రదేశాలలో కచేరిల ద్వారా శ్రోతలను అలరించారు. మన దేశసరిహద్దులు దాటి ఇంగ్లాండ్, అమెరికా, యూరప్, కెనడా, ఆసియా దేశాలలో తన సంగీత యానాన్ని కొనసాగించారు.
1963లో ‘ఎడిన్బర్గ్ ఫెస్టివల్’లో చేసిన కచేరి ద్వారా విదేశీయుల హృదయాలలో స్థానం సంపాదించారు.
1966 అక్టోబర్లో యునైటెడ్ నేషన్స్ వేడుకలలో మనదేశం తరపున పాల్గొని తన గేయాలాపనతో విశ్వవిఖ్యాతిని పొందారు.
లండన్లో 1982లో ‘ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ వేడుకలలో పాల్గొన్నారు. 1987లో సోవియట్ రష్యాలో తన గానగరిమను ప్రదర్శించారు. ఈ విధంగా ప్రాక్పశ్చిమ దేశాలలో భారత సంగీత గొప్పతనాన్ని ఆవిష్కరింపజేశారు.
ఈమె వివిధ సామాజిక సంస్థల కోసం అనేక ఛారిటీ సంగీత ప్రదర్శనలనిచ్చారు. ఆ ధనాన్ని ఆ సంస్థలకు అందించారు. కోట్లాది రూపాయలను దానం చేయడం ‘నభూతో నభష్యత్’.
ఈమె విద్వత్తుకు దేశవిదేశాల నుండి బిరుదులు, పురస్కారాలు లభించాయి.
భారత ప్రభుత్వం జాతీయ పురస్కారాలను ప్రదానం చేసిన మొదటి సంవత్సరం 1954లోనే ఈమెకు ‘పద్మభూషణ్’ పురస్కారం అందించి గౌరవించింది. 1975లో ‘పద్మవిభూషణ్’ను, 1981లో ‘భారతరత్న’ పురస్కారాలను అందించింది.
దేశదేశాల విశ్వవిద్యాలయాలు డాక్టరేట్లతో సత్కరించాయి.
1974లో ‘ఆసియా నోబెల్ బహుమతి’గా పేరు పొందిన ‘రామన్ మెగసెసే అవార్డు’ అందుకున్నారు. అవార్డు ద్వారా అందిన 10,000 పౌండ్లను భారతీయ విద్యాభవన్, బొంబాయిలోని హాస్పిటల్కు వితరణగా అందించడం ఈమె గొప్పతనానికి నిదర్శనం.
‘ప్రాథమిక స్థాయి నుండి విశ్వవిద్యాలయ స్థాయి వరకు విద్య యొక్క అన్ని స్థాయిలలోను సంగీతాన్ని తప్పనిసరిగా బోధించాలని, అప్పుడే పిల్లలకు సంగీతం ద్వారా మానసిక శాంతి, ప్రశాంతత అలవడతాయ’ని నమ్మారావిడ.
ఈమె ఆలపించిన భజగోవిందం, విష్ణు సహస్రనామాలు, శ్రీవేంకటేశ్వర సుప్రభాతం, మీరాభజన్లు మొదలయినవి విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది భారతీయుల, విదేశీయుల సంగీత దాహార్తిని తీర్చుతున్నాయి.
కవికోకిల శ్రీమతి సరోజినీ నాయుడు ‘నైటింగేల్ ఆఫ్ ఇండియా’ తాను కాదని అసలైన ‘నైటింగేల్ ఆఫ్ ఇండియా శ్రీమతి యం.యస్.సుబ్బులక్ష్మియే’ అని కొనియాడారు.
ప్రతి భాషని మాతృభాషలా అభ్యసించి ఉచ్చారణను ఆయా భాషల సంకీర్తనలను ఆలపించారు. అందువల్లనే ఆయా భాషల వారికి ఆమె తమ మనిషే అని భావన కలిగించారు. అందరి మన్ననలను పొందారు.
ఈమె 2004 డిశంబర్ 11 వ తేదీన చెన్నైలో మరణించారు.
వీరి జ్ఞాపకార్థం 2005 డిశంబర్ 18వ తేదీన 5 రూపాయల విలువతో స్టాంపును విడుదల చేసింది భారత తపాలాశాఖ. స్టాంపు మీద కుడివైపున వృత్తంలో ఆమె చిత్రంను ముద్రించారు. ఎడమవైపున కచేరిలో తంబురాశృతి చేస్తూ పరవశిస్తున్న గాన కోకిల దర్శనమిస్తారు.
సెప్టెంబరు 16వ తేదీన వీరి జయంతి సందర్భంగా ఈ నివాళి.
Image Courtesy: Internet
సుధారాణి, భక్తిప్రదాయిని, అభినయిని, సు హాసిని, మనోరంజని, భారతరత్న, సంగీత సామ్రాజ్ఞి ,శ్రీమతి యం.యస్. సుబ్బులక్ష్మి గారు మన భారతీయురాలు అవటం మనకు ఎంతో గర్వకారణం. ఆమెకు నా నమస్సుమాంజలి.
ఇంటి ముందు తులసి మొక్క లాంటి పవిత్రత, భారతీయత ఉట్టిపడే రూపం,అసమాన సంగీత ప్రతిభ, అద్బుత గానంతో సమస్త భారతీయులను అలరించిన గాయనిమణి,.నూటికో కోటికో ఒక్కరు జన్మిస్తారు ఇటువంటి వ్యక్తులు..ఆ స్వామిని కూడా తన సుప్రభాతంతో మెల్కొలపగలిగే అదృష్టవంతురాలు.. ఆవిడ జీవితాన్ని మా ముందు చక్కగా ఆవిష్కరించిన మీకు ధన్యవాదాలు!!!
The Real Person!
😊🙏🏼Very nice and informative presentation by you Madam. Congrats for your Publication 👏🏼💐 K. Dasaradhi
Subbalakshmi gaarini gurinchi chaala chepparu. Ame gaaru nati ani nasku teleedu. Sampaadinchi daanam chesaaru. Chaala goppa vaaru. Ame leka pote evvaroo sangeetam nerchukone vaaru kaadu. Andaroo prodduna aame Venkateswara Swamy suprabhatam vinalsinde. Congrats! A. Raghavendra Rao, Hyd
వావ్! అన్ని భాషలలో, అన్నిరకాల కీర్తనలు… చాలా గ్రేట్ మేడమ్ గారూ– కె. అనురాధ
సంగీత సామ్రాజ్ఞిని మా ముందు సాక్షాత్కరింపజేశారు.. ధన్యవాదాలు మేడమ్.. ఎ. సత్యశ్రీ
యం. యస్. సుబ్బులక్ష్మి గారు సినిమా లలో కూడా నటించారని మీ వ్యాసం వల్లనే తెలిసింది నాగలక్ష్మి గారూ! జి. రమ
ఎమ్. ఎస్. సుబ్బలక్ష్మి గారి జీవితం లో కొన్ని ముఖ్య ఘట్టాలు నేటి తరం తెలుసుకునే విధంగా అందించిన రచయిత్రి కి హృదయపూర్వక ధన్యవాదాలు.
మనహ్పూర్వక ధన్యవాదాలండీ 🙏🏻🙏🏻🙏🏻
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
వారెవ్వా!-39
ఎండమావులు-7
కందములు – పంచ భూతములు
వేంపల్లి రెడ్డి నాగరాజు నాలుగు మినీ కథలు-6
భూతాల బంగ్లా-8
జ్ఞాపకాల పందిరి-48
సరిగ పదమని-12
ఆకాశవాణి పరిమళాలు-36
సిల్క్ థ్రెడ్ జువెల్లరీ
ఆశల విహంగం
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®