Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రెండు సార్లు నోబెల్ బహుమతి గెల్చుకున్న మేడం క్యూరీ

[బాలబాలికల కోసం ‘రెండు సార్లు నోబెల్ బహుమతి గెల్చుకున్న మేడం క్యూరీ’ అనే రచన అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]

డియర్ చిల్డ్రన్!

ప్రపంచ ప్రఖ్యాతి పొందిన అత్యంత ప్రతిష్టాకరమైన నోబెల్ బహుమతి గురించి మీకు తెలుసు కదూ! భౌతిక, రసాయనిక, సాహిత్య, వైద్య, ఆర్ధిక శాస్త్రాలలో అద్వితీయ ఆవిష్కరణలు చేసిన వారికి ఈ బహుమతినిస్తారు. ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారమైన ఈ నోబెల్ బహుమతి లభించటమే ఎంతో గొప్ప. అటువంటిది ఒకే కుటుంబానికి భౌతిక, రసాయన శాస్త్రాలలో మూడు నోబెల్ బహుమతులు లభించాయంటే ఎంత అరుదైన విషయం. ఆ కుటుంబం గురించి తెలుసుకోవాలన్పిస్తుంది కదూ!

మేడం క్యూరీ 1867 నవంబరు 7వ తేదీన పోలెండులోని ‘వార్సా’ నగరంలో జన్మించింది. ఈమె పేరు మేరీ. తండ్రిపేరు స్లోడోవ్ స్కా. ఈయన విజ్ఞాన శాస్త్రంలో ప్రొఫెసర్ కావటం మూలంగా నిరంతరం పరిశోధనలు చేస్తుండేవాడు. అలా చిన్నతనం నుండే మేరీకి శాస్త్ర పరిశోధనల పట్ల ఇష్టం ఏర్పడింది. వార్సాలో శాస్త్ర విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి తగిన అవకాశాలు లేనందున మేరీక్యూరీ పారిస్ వెళ్ళింది. పారిస్ లోని సార్బోన్ విశ్వవిద్యాలయం నుంచి మేరీ 1898 నాటికి వైద్యశాస్త్ర పట్టా పొందింది.

సార్బోన్ విశ్వవిద్యాలయంలో పరిచయమైన ‘పియరీ క్యూరీ’తో 1896లో మేరీ వివాహం జరిగింది. ఆ తరువాత భార్యాభర్తలిరువురూ కలసి శాస్త్ర పరిశోధనలు చేశారు. ‘యురేనియం’కు రేడియోధార్మిక శక్తి ఉన్నదని ‘హెన్రీబిక్వెరల్’ అనే శాస్త్రవేత్త అప్పటికే కనుక్కున్నాడు. ‘పిచ్ బ్లెండి’ అనే ఖనిజ మిశ్రమంలో పొలోనియం, రేడియం, ఆక్టీనియం అనే మూడు ధాతువులున్నట్లు క్యూరీ గుర్తించింది. 1898లో క్యూరీ ‘రేడియం’ను కనిపెట్టింది. లండన్ లోని రాయల్ సొసైటీ క్యూరీ దంపతులకు ‘డేవీ పతకాన్ని’ బహూకరించింది. 1903లో క్యూరీ దంపతులకు, హెన్రీబిక్వెరల్ కు కలిపి భౌతికశాస్త్రంలో తొలిసారిగా ‘నోబెల్ బహుమతి’ లభించింది.

1906లో పియరీ క్యూరీ ఒక రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అయినప్పటికీ నిరాశా, నిస్పృహలకు లోనుకాకుండా క్యూరీ తన పరిశోధనలను కొనసాగించింది. రేడియోథార్మికత గురించి చేసిన పరిశోధనలకు గుర్తింపుగా 1911లో రసాయన శాస్త్రంలో క్యూరీకి రెండవసారి ‘నోబెల్ బహుమతి’ లభించింది.

మేడం క్యూరీ పరిశోధనల కోసం సార్బోన్ లో ఒక రేడియం సంస్థను నెలకొల్పారు. రేడియంను కనుక్కోవడం విజ్ఞానశాస్త్ర చరిత్రలో ఒక ముఖ్యమైన సంఘటన. ఈరోజు పరమాణు నిర్మాణాన్ని గురించి, పరమాణు శక్తిని గురించి తెలుసుకోవడానికి ఇది ఎంతో తోడ్పడింది. వైద్యశాస్త్రంలో కూడా రేడియంకు చాలా ప్రాధాన్యత ఉంది. కాన్సర్ చికిత్సలో దీన్ని ఉపయోగిస్తున్నారు.

క్యూరీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఐరిన్, ఈవ్. ఐరిన్ తన భర్త ఫ్రెడరిక్ జోలియట్ క్యూరీతో కలసి తల్లి పరిశోధనా బాటలోనే కృషి సాగించింది. సామాన్య ధాతువులలో కృత్రిమంగా రేడియోథార్మికతను కలిగించినందుకు ఐరిన్ దంపతులకు 1935లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.

దీర్ఘకాలం పాటు అణుధార్మిక శక్తిపై పరిశోధనలు నిర్వహించడం వల్ల అనారోగ్యంతో మేడం క్యూరీ 1934 జులై నాలుగున కన్నుమూసింది. మానవ పురోగతికి ఆమె చేసిన సేవలు మరువలేనివి.

Exit mobile version