[శ్రీమతి రాజేశ్వరి దివాకర్ల రచించిన ‘పరిహాసం ప్రధాన ప్రకరణమైన కథా కావ్యం – కేయూరబాహు చరిత్ర’ అనే వ్యాసం పాఠకులకు అందిస్తున్నాము.]
తెలుగు సాహిత్యంలో తొలి ప్రత్యేకతలున్న కావ్యం కేయూర బాహు చరిత్ర. కేయూర బాహు చరిత్రను రచించిన కవి మంచన. మంచన కాలం పదమూడవ శతాబ్దమని విజ్ఞులు నిర్ణయించారు.
సంస్కృత నాటకాన్ని అనుసరించిన తొలి శ్రవ్యకావ్యం కేయూరబాహు చరిత్ర. దృశ్య కావ్యానికి శ్రవ్యంగా ప్రక్రియా భేదాన్ని కలిగించిన ప్రథమ ప్రబంధం కేయూర బాహు చరిత్ర. కేయూరబాహు చరిత్ర సంస్కృత నాటిక ‘విద్ధ సాలభంజిక’ ను అనుసరించిన కావ్యం. ‘విద్ధ సాల భంజిక’ అంటే ‘చెక్కబడిన బొమ్మ’. విద్ధ సాలభంజిక నాటక రచయిత రాజశేఖరుడు. రాజశేఖరుడు లక్షణ కర్త. తాను వాల్మీకి, భవభూతి వంటి కవుల అవతార రూపం అని చెప్పుకున్నాడు.
మంచన కేయూర బాహు చరిత్రలో తనను గురించి ప్రస్తావన కావించలేదు.
“తన యిష్టసఖుని విద్వ
జ్జన మాన్యుని నుభయకావ్య సరణిజ్ఞుని మం
చన నామదేయు నన్నుం
గనుగొని యిట్లనియె వినయ, గౌరవ మెసగన్”
అని తన పేరును, అశ్వాసాంతములో.. ఇది సకలజన విధేయ ప్రణీతంబైన కేయూరబాహుచరిత్రం బను మహా ప్రబంధము నందు.. అని మాత్రమే వ్రాసుకొన్నాడు. ‘మంచన కవితా శిల్పము’ అను వ్యాసములో కేయూరబాహు చరిత్ర కర్త పూర్తి పేరు అవధానము మంచిరాజు అని, తంజావూరు సరస్వతీ మహల్ పుస్తక భాండాగారములో ‘సర్వ లక్షణసారము’ లక్షణ గ్రంథంలో ఉన్నట్టు పరిశోధకులు పేర్కొన్నారు.
విద్ధసాల భంజిక నాటకంలో సంభ్రమాశ్చర్యాలను కలిగించే అంశాలు ఉన్నాయి. నాయికను సాలభంజికా రూపాన కనుగొనడం రాజశేఖర కవి సాహిత్యం లో ప్రవేశ పెట్టిన నూతన మైన అంశం. నాటిక ఇతివృత్తంలో కనవచ్చే దృశ్యా దృశ్య సన్నివేశాలు నేటి సాంకేతిక యంత్ర విన్యాసాలను తలపిస్తాయి.
మంచన తన కావ్యాన్ని నండూరి గుండన మంత్రికి అంకితం ఇచ్చాడు. గుండన మంత్రి ధనదు పుర నివాసి. గుండయ పూర్వికులు వెలనాటి చోడుల వద్ద మంత్రులుగా సేనాధి పతులుగా ఉండిన వారు. ధనదుప్రోలు లేక సనదుప్రోలునే నేడు చందవోలు అని పిలుస్తున్నారు. గుండన “శాస్త్ర పురాణాగమ దుగ్ధాబ్ధి మంధరా చలపతి. గణకత్వ విద్యలో వలెనే సర్వ విద్యలలో చతురుడు. భ్రాజిత మథుర కావ్య పరిణతుడు. వితరణ శీలి కాకుళేశ్వర తిరునాళ్ళలో అర్థులకు కోరినంత ధనము వెదజల్లే వాడు.”
కృతిపతి వంశాన్ని మంచన విస్తారంగా వర్ణించాడు. వెలనాటి చోడుల రాజ్య వైభవం, వారి చరిత్రలు, బాపట్ల భావనారాయణ స్వామి దేవాలయం, కృష్ణా, గుంటూరు జిల్లాల లోని సనదవోలు, శ్రీకాకుళం దేవాలయాలను గురించి తెలుపడం వల్ల సాహిత్య చరిత్ర పరిశోధకులు ఆ స్థలాలను గూర్చి అనేక విషయాలను తెలుసుకోగలిగారు.
గుండన మంచనతో
“నాకు నొక్క కృతి గైకొన నిష్టము నీవు ప్రజ్ఞ సం
భావిత కావ్య దక్షుడవు భవ్యమతిన్ ద్విజదేవ నిర్మితం
బైవిలసిల్లు తంత్రము ప్రియంబున జూచిన నందు కర్ణ సౌ
ఖ్యావహమై ప్రబంధ రచనాశ్రయ మయ్యెడు మార్గమూతగన్”
అని కోరాడు. అంతే కాక
“స్థాయి రసము శృంగారం
బై యలవడ గథలు నీతులై యెడనేరా
గేయూర బాహు చరితము
సేయుము నీ వట్టి కావ్యశిల్పము మెఱయన్”
అని ప్రత్యేకించి చెప్పాడు.
మంచనకు పూర్వం నన్నెచోడుడు ‘ప్రబంధము’ అనే పదాన్ని వాడాడు. మంచన తన కావ్యంలో శృంగార రసాన్ని గూర్చి, కావ్య శిల్పమును గూర్చి తొలిసారిగా ప్రస్తావించి కావ్య శైలికి ఒరవడిని దిద్దాడు. శృంగార ప్రబంధ శాఖకు మంచన మొదటివాడు.
కేయూర బాహు చరిత్ర కావ్య కథ అనేక చిత్రాలతో కూడి ఉంటుంది. కళింగ దేశం లోని త్రిపురిని పాలించు రాజు కేయూర బాహుడు. ఆతని దేవేరి రత్న సుందరి. మంత్రి భాగురాయణుడు, విదూషకుడు చారాయణుడు. రాజు రాణి మోహంలో రాజ్య కార్యాలను విస్మరించాడు. ఆతని మంత్రి భాగురాయణుడు ‘ఈ కొరగాని చందముల ఈ నరనాథుని బాప ఏ క్రియం జేకురు ఉపాయమ’ని రాజును ఉద్ధరించడానికి తగిన ఉపాయాన్ని ఆలోచించాడు.
లాటభూపతి తన పుత్రిక మృగాంకావళిని మృగాంకవర్మగా పురుష వేషంలో పెంచుతున్నాడని, ఆమెను వివాహమాడిన వ్యక్తి సార్వభౌముడు కాగలడనే రహస్యాన్ని చారుల వలన తెలుసుకున్నాడు. లాట దేశం రాణి రత్న సుందరికి పినతల్లి. మంత్రి మృగాంకావళిని రప్పించి తన నివాస భవనంలో విడిదిని ఏర్పాటు కావించాడు. కళావతి అనే పరిచారికకు మృగాంకావళి గుట్టును చెప్పి తన కార్య సిద్ధికి అనుకూలంగా ఆమెకు తగిన చర్యలను ఉపదేశించాడు.
శిల్పులను పిలిచి, మాయ గోడలతో కనుపించని తలుపులతో, మర బొమ్మలతో సుషిర కుడ్య సంచార యుక్తమైన శయన మందిరాన్నికట్టించాడు. మృగాంకా వళికి రాజ సందర్శనం కలుగునట్లు ఏర్పాటు కావించాడు.
రాజుకు మిత్రుడైన చారాయణుడు రాణి ప్రియ సఖి మేఖలకు పురుష వేషంలో ఉన్న దాసితో వివాహం జరిపి పరాభవించాడు. రాణి తన ఆప్త సఖికి జరిగిన అవమానానికి ఆగ్రహించింది. చారాయణుడు కావించిన పరిహాస ప్రకరణాన్ని రాజు కావించిన తప్పుగా ఆతని మీద అలుక పూనింది. రాజు శయ్యా గృహానికి వెళ్ళడం మానింది.
మంత్రి ఇది తగిన సమయం అని ఎంచి కళావతితో సుషిర స్తంభములలో సంచరించుట ద్వారా మృగాంకావళి సందర్శనం రాజుకు కలుగ జేయమని కళావతికి ఆదేశించాడు. కళావతి చెప్పినట్లుగా మృగాంకావళి యంత్ర సంచారం ద్వారా శయనిస్తున్న రాజు వద్దకు వెళ్ళి ఆతనిని చూచి పరవశురాలయింది. తన మెడలోని కంఠ హారాన్ని రాజుకు సమర్పించింది. ఆతడు మేల్కాంచినంతలో మృగాంకావళి కంబమును జొచ్చి నిష్క్రమించింది. రాజుకు తాను కాంచినది కలా? నిజమా అని భ్రాంతి కలిగింది.
ఆ అసమాన సౌందర్య వతిని చూచి విరహ వేదన చెందుతున్న రాజుకు కళావతి భాగురాయణుని వ్యూహాన్ని వివరించింది.
మేఖలకు అవమానము జరిగినప్పుడు రాజు పరిహాసమని తలచాడు కాబట్టి రాజుకు తగిన ముఖ భంగము చేయుట ఉచితం అని కళావతి రాణికి నచ్చ జెప్పింది. ఆమె మాటలను నమ్మిన రాణి తాను పురుషునిగా భావిస్తున్న మృగాంకావళికి ఆడ వేషం వేసి రాజుకు వివాహం చేసి పరాభవం చేయ దలచింది. వివాహం ముగిసింది.
అంతలో లాట దేశం నుండి వచ్చిన సందేశం ద్వారా రాణికి నిజము తెలిసింది. రాజును మోసగించ దలచినందుకు పాశ్చాత్తాపం చెందింది. మృగాంకావళిని చేరదీసి గారవించింది. కేయూర బాహుడు మనోరథ సిద్దిని పొందాడు. సార్వభౌమత్వాన్ని పొందాడు.
ఈ కావ్యంలో నాయిక మృగాంకావళి మృగాంక వర్మ పురుష వేషంలో ఉండడం వింత గొలుపుతుంది. మీట నొక్కితే కుడ్య స్తంభాలు తెరుకోవడం, అందులోంచి దృశ్యా దృశ్యంగా నాయకునికి మృగాంకావళి కనుపించి మెడలో హారం వేసి అదృశ్యం కావడం, రాజు తాను కాంచినది కలయా? సత్యమా అను భ్రాంతికి లోను కావడం,ఇత్యాది కథాంశాలు గ్రాఫిక్స్‌గా సంభ్రమాశ్చర్యాలకు లోను కావిస్తాయి.
ఇక విదూషకుడు రాణి ఆప్త సఖి మేఖలకు అళీక వివాహం కావించడం, అందుకు ప్రతీకారంగా రాణి తాను పురుషుడు అనుకుంటున్న మృగాంకావళిని స్త్రీ గా రాజుకిచ్చి వివాహం చేసి మోసగించ యత్నించడం, ఈ రెండు మాయా (అళీక) వివాహాలు ఆశ్చర్యాన్ని, వింతైన ఆసక్తిని కలిగిస్తాయి.
కేయూర బాహు చరిత్రను కృతిపతి కావ్యశిల్పం నిరూపిస్తూ రచించమని కోరాడు.
“స్థాయి రసము శృంగారం
బైయలవడ గథలు నీతులై యెడనేరా
గేయూర బాహు చరితము
సేయుము నీ వట్టి కావ్యశిల్పము మెఱయన్”
అని ప్రత్యేకించి చెప్పాడు
మంచన కృతిపతి కోరినట్లు కర్ణ సౌఖ్యావహంగా ఉండునట్లు ప్రధాన కథలో పంచతంత్ర, హితోపదేశ కథలను జోడించాడు. తన కావ్యాన్ని నీతి కథా చిత్ర పటాలతో అలంకరించాడు. నీతి విద్యా విజ్ఞానాలను బోధించే 22 చిన్న చిన్న కథలను చేర్చాడు. అందువల్ల ఈ కావ్యం తెలుగు లోని నీతి కథాకావ్యంగా కూడా ప్రసిద్ధమయింది. కథా కావ్యాలలో మొదటిది కేతన దశకుమార చరిత్ర.
కావ్యాంతంలో సప్త వ్యసనాల వల్ల ధర్మ రాజాదులకు కలిగిన కష్టాలను వివరించి, భోగ లాలసతను త్యజింపవలసినదిగా మంత్రి రాజుకు హితం చెప్పాడు. “చతుర్విధపురుషార్ధములలో స్వ‘ధర్మ’ నిర్వహణము అతి ముఖ్యమనియు, జాతి, సంఘ సుస్థితికి స్వధర్మ నిర్వహణము మూలమనియు ప్రబోధించు సత్ప్రబంధము కేయూరబాహు చరిత్రము.” అని విజ్ఞులు అన్నారు.
మంచన కథా కథనం ప్రతిభావంతమైనది. తాను ఏకథను చెప్పదలచినా ఆరంభం లోనే అందులోని నీతిని స్పష్టం కావించాడు.
తగు కొలది గాని లోభము /మిగులంగ జేయగ రాదు, మిక్కిలి యగు లో/
భగుణంబు కతన గాదే /మృగ ధూర్తుదొకండు తొల్లి మృత్యువు చెందెన్
అని అతి లోభంతో వ్యవహరించిన నక్క కథను తెలిపాడు.
మరొక చిత్రమైన కథ:
ప్రియ భాషుడనే యక్షుడు భార్య గర్భాన్ని కొద్ది సమయానికి గాను తాను ధరించాడు. భార్య నిపుణిక వినోదాన్ని చూడ డానికి వెళ్ళి, తాను తిరిగి వెళ్తే తిరిగి గర్భాన్ని మోసి “వెక్కుచు స్రుక్కుచు నుండి ప్రసూతి వేదనన్ జాల నలంగి యాపదను జడ్డ పడంగను నాకు నేల?” ఆ దెయ్యాన్ని వదిలించు కోడమే మంచిదని తలుస్తుంది. యక్షుడు భారాన్ని మోయ లేక ఆలిని తలచుకుని పలవరిస్తూ ప్రాణాలను విడుస్తాడు.
ఈ కథ ప్రకృతి సహజమైన స్త్రీ పురుషుల శరీ నిర్మాణ స్థితిని స్త్రీ స్వేచ్ఛను గురించిన కట్టుబాట్లను తెలుపుతుంది.
మంచన ప్రబంధ శైలికి నాయికా నాయకుల ప్రథమ సమాగమం
“నిగుడుచు మగుడుచునుండెడు
మగువ మెరుగు చూపు గములు మగుడ పదిలం
బుగ నందు విభుని చూడ్కుల
తగులున ఒండొరుల మీద తలముగ పర్వెన్”
నాయిక నిద్రితుడైన భూపతిని కనుగవ రెప్ప వెట్టక చూచింది. తన అనురాగాన్ని తెలుపుతూ నాయకునికి ఒక లేఖను రాసి జార విడించింది. “ఆమె విరహజ వేదనా భరమున – ముద్దియ మహోగ్ర మనోభవ వహ్ని అంగముల్ దరి కొని కాల్పగా కృశత్వము చెందింది. నాయిక తన లేఖను కేతకీ పత్రాన రాయడం కూడా ఒక విశేషం. నాయికా నాయకుల పరిణయానంతరం ‘కర్పూర కస్తురికా పరిమళ కరం/
డములట్టి రత్న హర్మ్యముల యందు /కోకిల కీరాది కోలాహలంబున /విలసిల్లు ఉద్యాన తలములందు’ – ఇత్యాదిగా వారి సమాగమమును శృంగార రస పూర్ణము గావించాడు.
మంచన పంచతంత్ర కథలను ఎన్నుకొనడంలో అలనాటి విష్ణుశర్మ ఆశించిన వయోజన విద్యా ప్రాముఖ్యాన్ని గుర్తించాడు.
సొమ్ములలో ముప్పోర్చు జ
గమ్మెల్లను సోడు ముట్టగా జేయును శ్లా
ఘ్యమ్మగు వస్తువు నగుటన్,
కమ్మని కనకమ్ము గాదె కవిత దలంపన్
సప్త సంతానాలలో కవిత కననకం లాంటిదని తొలి సారి గ్రంథస్థం చేసాడు.
తెలుగు సాహిత్యంలో మొట్టమొదటగా విద్యా ప్రాధాన్యాన్ని చెప్పిన కవి కూడా మంచన. ఈ క్రింది పద్యం ఈ సంగతిని స్పష్టం చేస్తుంది
“అక్షరజ్ఞుఁడు గాని యతనికి శాస్త్ర రాణాగమాదులు
రావు సొరఁగ
గ్రంథాధిగమశక్తి గలుగక శుద్ధ వివేకంబు
లేదు, వివేకశుద్ధి
కలుగక కర్తవ్యకర్మమెఱుంగడు, కర్తవ్యమెఱుఁగక
కడగి చేయు
క్రియల నీగఁగరాని కిల్బిషములఁ బొందుఁ
బాపుండు నరక కూపమునఁ ద్రెళ్ళు
నరకవాసి పేదనరుడగుఁ బేదయై
కడుపు కొఱకుఁ బాతకములు సేసి
రౌరవమునఁ గూలుఁ గ్రమ్మఱ నట్ల యా
పదలకెల్లఁ గుదురు చదువు లేమి”.
అక్షరజ్ఞానం లేనివాడు శాస్త్ర పురాణాగమాది గ్రంథాలను చదవలేడు. అవి చదవనివానికి వివేకం కలుగదు. వివేకశుద్ధిలేనివానికి ఏది చేయదగిన పనో ఏది కాదో తెలియదు. అది తెలియనివాడు చేసే పాపకర్మల వలన కలిగే ఫలితం నరకమే అవుతుంది. తత్ఫలితంగా పేదవాడిగా జన్మిస్తాడు. పేదరికం మళ్ళీ పాపకర్మలకు హేతువై అది మళ్ళీ రౌరవాది నరకానికే దారితీస్తుంది. అందువలన, ఆపదలన్నిటికీ ‘కుదురు’ చదువులేక పోవడం. అంటూ ఈ సందర్భంగా ‘కుదురు’ అన్న ఒక చక్కని అర్థవంతమైన మాటను ప్రయోగించి చెప్పాడు మంచన. విద్యా ప్రాముఖ్యాన్ని 13 వశతాబ్దం లోనే వెల్లడించాడు మంచన..
అన్ని వేళలా స్మరించుకోదగిన మాటలను తమ కావ్యాలలో పొందుపరచి చెప్పడం ఉత్తమ కవుల లక్షణం. ఈ మాటలకున్న బలమే తరచూ ఆయా కావ్యాలను కాలంలో నిలబడేలా చేస్తూ వుంటుంది. కేయూర బాహు చరిత్రములో సందర్భాను సారంగా మంచన చెప్పిన కొన్ని మాటలకు వున్న ఆ బలమే ఆ కావ్యం ఇప్పటికీ తెలుగు సాహిత్యంలో ఒక మంచి రచనగా మిగిలేలా చేసింది.
అలాంటి కొన్ని మంచి మాటలలో ఒకటి ‘మేల్వడసియు, బుద్ధిచాలని యభాగ్యులు తత్ఫలమంద నేర్తురే?’ అన్నది. పూర్వం ఒకడు తపస్సుచేసి వరంగా మృత్యుంజయత్వాన్ని దేవీప్రసాదంగా ఆకుపసరు రూపంలో పొందుతాడు. ఆ ఆకులను గ్రహించి అడవి నుండి ఇంటికి వెళ్ళే దారిలో ఒక మృతజీవి కళేబరం కనబడుతుంది. దానిని చూసిన వాడికి, దేవి ప్రసాదంగా పొందిన ఆకుల మహత్యాన్ని పరిక్షించాలన్న పెడబుద్ధి పుడుతుంది. వెంటనే చేతిలోని ఆకులను పిండగా వచ్చిన పసరును ఆ కళేబరంపై చల్లుతాడు. వాడి కర్మకు ఆ కళేబరం నుండి ఒక పెద్దపులి జీవం పోసుకుని లేచి నిలబడుతుంది. ఎదురుగానే వుంది ఆహారం. మరింక ఆలస్యం ఎందుకు చేస్తుంది ఆ పులి? అలా ముగుస్తుంది వాని కథ. వివేకశూన్యుడైన వ్యక్తి అందుకున్న వరం ఒక్కొకప్పుడు వాని మృత్యువుకు కారణం కూడా అవుతుందన్నది ఇందులో సారాంశం.
ఈ కాలంలో అంచెలంచెలుగా ఎదుగుతున్న మనిషి మేధస్సుకు ఉన్న అపారమైన బలంతో, వరం పొందడం అన్నది ఒక సమస్య కాదు. ఆ వరం పొందిన తరువాత, దానితో మనం ఏం చేయబోతున్నామన్నదే అసలు సమస్య; ఇప్పుడు మనిషి అరచేతిలో అమరిన ‘అంతర్జాలం’ లాగా అని వ్యాఖ్యానించారు విమర్శకులు.
మంచన వ్యక్తిత్వాన్ని గూర్చి చెప్పుకోవాల్సిన విషయాలు కొన్ని వున్నాయి. కవిగా కంటే కర్షకునిగా జీవనాన్ని సాగించడాన్ని మించిన సాఫల్యం మానవ జన్మకు మరొకటి లేదనే అభిప్రాయాన్నిమొట్ట మొదట తెలిపాడు మంచన ..పోతన చెప్పినదిగా బహుళ ప్రచారమైన ‘బాల రసాలపుష్పనవపల్లవ కోమల కావ్యకన్యకన్’ అనే పద్యం. ‘కేయూరబాహు చరిత్రము’లోని ప్రథమాశ్వాసంలో 13వ పద్యంగా కనిపిస్తుంది.
ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం మరొకటి వుంది. మంచన కర్షక జీవితంపై తనకున్న కోరికను, గౌరవప్రదమైన అభిప్రాయాన్ని ‘బాల రసాలపుష్ప..’ అనే ఆ ఒక్క పద్యంలోనే చెప్పి వూరుకోలేదు. కర్షక జీవనంలోని గొప్పదనాన్ని మరింత ఎత్తులో నిలబెట్టి ‘కేయూరబాహు చరిత్రము’ కావ్యంలోనే మరొక చోట
“ఈలోకమింతయు నాలుగు పాళు లిందొకట భిక్షుకులు సోమకులు నొక్క
పాలు, సేవావృత్తి బ్రతికెడువారు విద్యోపజీవికులు నొక్కపాలు,
వ్వవహారమాడెడువారుఁ దస్కరులును నొక్కపాలు, కర్షకులొక్కపాలు,
మొదలిపాళ్ళు మూఁడుఁ బిదపటి పాలిన యనవరతంబును నపహరించు
నపహరించియు నంతంతకవి నశించు
నపహృతంబయ్యు నభివృద్ధినందు చుండు
గానఁ దగురాజు గలిగినఁ గిరసనంపు
జీవనముఁ బోల దొండొక జీవనంబు.”
– జీవన రీతులను ఆధారంగా చేసుకుని స్థూలంగా విభజించడానికి వీలయ్యే నాలుగు పాళ్ళ వ్యవస్థను మంచన వివరించి చెప్పాడు. నాలుగు పాళ్ళలోకంలో బిక్షమెత్తుకుని బ్రతికేవారు, చిన్న చిన్న పనులకు సంబంధించిన శ్రమచేసి పొట్టపోసుకునేవారు మొదటి పాలు. తాను నేర్చిన విద్య సంపాదించి పెట్టిన ఉద్యోగంచేస్తూ సేవకవృత్తిలో పొట్టపోసుకునేవారు రెండవ పాలు. లోకవ్యవహారంలో ఆరితేరి, తగాదాలను పెట్టి, పెట్టిన తగాదాలనే తీర్చి, మధ్యవర్తిత్వంచేసి సంపాదించే ధనంతో బ్రతికేవారు, తస్కరులు మూడవ పాలు. కర్షకవృత్తి చేసుకుంటూ జీవనం సాగించేవారు నాలుగవ పాలు.
ఈ నాలుగు పాళ్ళ ప్రపంచంలో మొదటి మూడుపాళ్ళ జనులకు కావలసిన అన్నాన్ని పండించేది కర్షకుడే. మిగిలిన మూడుపాళ్ళ జనుల శ్రమ నశించినట్లుగా, కర్షకుని శ్రమ నశించదు. సరికదా అంతకంతకూ ఇంకా అభివృద్ధి చెందుతూ వుంటుంది. అందువలననే, సరైన రాజు దొరికితే కర్షకవృత్తి అంత ఉత్తమమైన వృత్తి మరొకటి లేదు అని మంచన తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పాడు.
తరువాతి కాలంలో పోతన ఈ అభిప్రాయానికి కట్టుబడి ‘బాల రసాలపుష్ప నవపల్లవకోమల కావ్యకన్యకన్..’ అనే పద్యం చెప్పాడు. మంచన చెప్పటం మాత్రమే చేశాడు. పోతన ఎన్నో కష్టాలను పడుతూ కూడా, కర్షక వృత్తిని వదలలేదు. పోతన కర్షకజీవనంపై తనకున్న మక్కువను పద్యంగా చెప్పడమే కాకుండా చేసి చూపించాడని జనబాహుళ్యంలో కూడా అభిప్రాయమై నిలిచి వుంది. ఈ కారణంగానే, ‘బాల రసాలపుష్ప నవపల్లవకోమల కావ్యకన్యకన్..’ అనే పద్యం మంచన చెప్పినదిగా ఒక మాట పండితలోకంలో ఉన్నప్పటికీ జనం మాత్రం, కర్షకునిగా జీవనాన్ని సాగించి చూపించిన కారణం చేత పోతనకే ఆ పద్యం కర్తృత్వాన్ని కట్టబెట్టారు. కర్షక జీవనపు గొప్పదనానికి సాహిత్య గౌరవాన్ని ఇచ్చి ప్రశంసించినవాడు తెలుగు సాహిత్యంలో మొదటగా మంచన అని గుర్తించాలి.
భాషలో లిపిని గురించి ప్రథమంగా చెప్పాడు మంచన.
“వాచకత్వము లేఖనోచితత్వము ఆంధ్ర లిపి రీతిగా సర్వ లిపుల యందు ఫణిత జాతియు తీవ్ర భంగియును తెనుంగు బాస పోలిక సర్వ భాషలందు”
గుండన మంత్రి తెలుగు లిపి వలెనే మిగిలిన లిపులలో ప్రవీణుడు అతి వేగంగా రాసే నేర్పు కలవాడు అని చెప్పడం ఆనాటి తెలుగు లిపి స్పష్టతను తెలుపుతుంది. ఈ మాట గుండనను పొగడడానికి కాదు, ఒక నిజాన్ని తెలిపాడు.
“కరిముఖుడశ్వినుల్ శ్రుతులు కంజ సముద్భవు మోము అంబికేశ్వరు మొగముల్ తదాత్మజుని వక్త్రము ఆది మునీంద్ర మండలము ఉరగ పతుల్ గ్రహంబులు పయోరుహ నాభుడు తారకంబులున్ బొరిబొరి నెల్ల సంపదలుపోలమ గుండని కిచ్చుగావుతన్”
అవతారికా పద్యంలోనే చక్కని కావ్య శిల్పం చూపాడు. లెక్కలలో ప్రవీణుడైన గుండన మంత్రికి దేవతలు సంపదలను ఇవ్వాలని కరిముఖుడు ఏక దంతుడు. అశ్వినులు ఇద్దరు, శ్రుతులు మూడు, బ్రహ్మ తలలు నాలుగు, శివుని వదనాలు అయిదు, తదాత్మజుని ముఖాలు ఆరు, ఆది మునీంద్రులు ఏడుగురు, అష్ట నాగములు, నవ గ్రహాలు, విష్ణు అవతారాలు పది, తారకలు అనంతం అని ఒకటి నుంచి అనంతం దాకా అంకెలను పేర్కొన్నాడు. గణకత్వ విద్యలో మేటి అయిన కృతి పతిని అంకెలలో మెప్పించాడు.
ఏ రసమున కెవ్వడు ప్రియుడా/ రసమునయదె చొచ్చి అభినవ రుచి వి/స్తారము పుట్టించి మును జేరిన దెస విడిచి మనము సేరు నవలకున్ అని రస విషయంలో అభిరుచుల భిన్నత్వాన్ని పేర్కొన్నాడు. తన ప్రబంధం లో ఉన్న రస రుచి విస్తారమును సూచించాడు.
మంచన ప్రబంధ శైలికి ప్రబంధ మణి భూషణంలో ఉదహరింప బడిన పద్యాలు నిదర్శనమిస్తాయి.
అల్లసాని పెద్దన ‘ఎవ్వతెవీవు భీత హరిణేక్షణ’ పద్యానికి మంచన ‘ఎవ్వరిదాన వీవు హరిణేక్షణ ఎయ్యెది నీకు పేరు’, ఆధారమయింది. మంచనను జక్కన, పిల్లల మర్రి పినవీరన మున్నగు కవులు అనుసరించడం ఆతని కవిత్వ ఘనతను చాటిచెప్పింది.