Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తొలి భారతీయ – అమెరికన్ వ్యోమగామి కల్పనా చావ్లా

మార్చి 17వ తేదీ కల్పనా చావ్లా జయంతి మరియు షష్టిపూర్తి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు పుట్టి నాగలక్ష్మి.

***

మన స్వర్గీయ రాష్ట్రపతి అబుల్ కలామ్ గారు చెప్పినట్లు కలలు కన్నారామె. మూడో ఏట నుండి ఆకాశంలో రాయంచల్లా ఎగురుతూ కనువిందు చేసే విమానాలని చూస్తూ తనూ అలా ఎగరాలని కోరుకునేవారు. ఆ దిశగానే చదువునూ ఆ అంశాలతోనే కొనసాగించారు.

విమానాలను నడిపే పైలట్ కావాలని ఆకాంక్షించారు. కానీ విధివిలాసం మరోలా ఉంది. అప్పటి వరకూ భారతీయ మహిళలకు అందని తీయ ద్రాక్షని అంది పుచ్చుకున్నారు. అదే అంతరిక్ష వ్యోమగామిగా ఎంపికవడం. సుమారు 2000 మంది పోటీ పడితే ఈమె దక్కించుకున్నారంటేనే ఆమె కృషి పట్టుదల కఠోరశ్రమ అర్థమవుతాయి. అయితే ఆ ప్రయాణంలోనే, అంబరాన India’s Daughter గా కలిసిపోయారు.

ఈమె 1962 మార్చి 17వ తేదీన హర్యానాలోని కర్నాల్ పట్టణంలో జన్మించారు. ఈమె మూడవ ఏట నుండి తమ ఇంటి పైకప్పు పై భాగంలో ఎగిరే విమానాలను చూసి కేరింతలు కొట్టేవారు. విమానం బొమ్మలు చేసుకుంటూ, విమానాల బొమ్మలు గీస్తూ ఉండేది. ఈమె అన్న సంజయ్ చావ్లా పైలట్ కావాలని ఆశించేవాడు. అన్నాచెల్లెళ్ళు ఇద్దరూ అలా ‘ఆకాశంలో హంసలమై’ అన్న చందాన ఎగరాలని కలలు కన్నారు.

కల్పాల్ లోని ఠాగూర్ బాల్‌నికేతన్ పాఠశాలలో పాఠశాల విద్యను అభ్యసించారు. తర్వాత 1980లో చండీఘడ్‌లోని పంజాబ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏరోనాటిక్ ఇంజనీరింగ్ చదివారు. తరువాత అమెరికా దేశానికి వెళ్ళారు. అక్కడ 1984లో ఆర్లింగ్టన్‌లోని టెక్సాస్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడుయేషన్ పట్టాని తీసుకున్నారు. బోల్డర్ లోని కొలరాడో విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ పట్టాని తీసుకున్నారు. ఈ విధంగా ఏరోనాటిక్ (విమానయానానికి) విభాగం చదివి తన కలలు నెరవేర్చుకోవడానికి పునాది వేసుకున్నారు.

1988 సంవత్సరంలో నాసాలో చేరి అమెర్స్ రీసెర్చ్ సెంటర్‌లో పని చేయడం మొదలుపెట్టారు. విమానాలు ఎగిరే సమయంలో విమానం చుట్టూ గాలి ప్రవహించే విధానాన్ని అవగాహన చేసుకున్నారు. Power Lift Computational Fluid Dynamics గురించి పరిశోధనలను కొనసాగించారు. ఈ విభాగంలో తన నైపుణ్యాన్ని సంపాదించారు.

అయితే వైమానికరంగంలో పని చేయాలన్న ఆశలు నెరవేరలేదు. అంతరిక్షయాత్రల వైపు ఈమె జీవితం మళ్ళింది. 1994లో వ్యోమగామి శిక్షణ పొందడర కోసం ఎంపిక చేయబడ్డారు. ఒక సంవత్సరం పాటు శిక్షణను పొందారు.

ఆస్ట్రోనాట్ కార్యాలయంలో EVA/రోబోటిక్ అండ్ కంప్యూటర్ బ్రాంచిలో ప్రతినిధిగా నియమితులయ్యారు. స్పేస్ షటిల్ కోసం సాఫ్ట్‌వేర్ రంగంలో పరిశోధనలు చేశారు. రోబోటిక్ సిట్యుయేషనల్ అవేర్‌నెస్ డిస్‌ప్లేల గురించి పరిశోధించారు.

కాలిఫోర్నియాలో కంపెనీ ఉపాధ్యక్షురాలిగా పని చేశారు. ఏరోడైనమిక్స్‌కి సంబంధించిన మెళకువలను అధ్యయనం చేశారు. సిమ్యులేషన్, అనాలసిస్ ఆఫ్ ఫ్లో ఫిజిక్స్ తదితర అంశాలమీద పరిశోధనలను చేశారు.

1997లో అమెరికాలో నాసావారి చేత రోబోటిక్ స్పెషలిస్ట్‌గా ఎంపిక చేయబడ్డారు. 1997 నవంబర్ నెలలో 6 గురితో కలిసి STS87 ఫ్లయిట్‌లో కొలంబియా నౌకలో ప్రయాణాన్ని మొదలు పెట్టారు. ఇది రెండు వారాలలో 252 సార్లు భూప్రదక్షిణలను పూర్తి చేయగలిగింది. సుమారు 10.67 మిలియన్ కిలోమీటర్ల దూరం ప్రయాణించింది.

మొక్కల పునరుత్పత్తి, అంతరిక్షంలో వివిధ పదార్థాల ప్రవర్తన స్థితిగతులను అధ్యయనం చేశారు. అయితే నాసా సూచనల ప్రకారం పనిచేయడం మానేసింది ఈ నౌక. దీనికి ఈమె బాధ్యత వహించారు. నిందలను భరించారు. అయితే నిపుణులు 5 నెలల పాటు ఈ మిషన్ సాంకేతిక పరిస్థితులను అధ్యయనం చేశారు. ఈమెను నిర్దోషిగా నిర్ధారించారు.

ఆ తరువాత నాసాలోని వివిధ సాంకేతిక స్థానాలలో పనిచేసి అన్ని అంశాలను అవగాహన చేసుకున్నారు. ఈ విధంగా తన నైపుణ్యాన్ని ప్రదర్శించడంతో అందరిలోను గుర్తింపును తెచ్చుకోగలిగారు.

2000 సంవత్సరంలో ఈమె వ్యోమగామిగా ఎంపికయ్యారు. కఠోర శ్రమతో శిక్షణను తీసుకున్నారు. మొదటి ప్రయాణం 2000 సంవత్సరంలో మొదలైంది. STS-107లో మిషన్ స్పెషలిస్ట్‌గా పనిచేయడం కోసం అంతరిక్షంలోకి బయలుదేరారు. అనుకున్న సమయానికి కాకుండా ఆలస్యంగా ప్రయాణం మొదలు పెట్టారు. అయినా 16 రోజుల పాటు జరిగిన ఈ ప్రయాణంలో 80 ప్రయోగాలు చేయడం విశేషం. ఈ ప్రయోగాలు జీవశాస్త్రం, ఆరోగ్యశాస్త్రం, సూర్యకిరణాలను గురించి జరిగాయి.

30 రోజుల 14 గంటల 54 నిమిషాల పాటు ఈ మిషన్లో తన కార్యకలాపాలను నిర్వహించారు. పరిశోధనలను కొనసాగించారు.

2003 ఫిబ్రవరి 1వ తేదీన భూమి మీదకి కెన్నడీ స్పేస్ సెంటర్‌లో దిగాలని సమయాన్ని నిర్ధారించారు. భూమి గుండా ప్రయాణించే సమయంలో షటిల్ ఇంజన్ లైనర్‌లలో పగుళ్ళు కనిపించాయి. నౌక లోకి వేడి వాయువులు ప్రవేశించాయి. బ్రీఫ్ కేస్ అంత పరిమాణంలో సంభవించిన పగులు ప్రాణాంతకమయింది. వేడి నుండి రక్షించే షీల్డ్ పనిచేయలేదు.

అమెరికాలోని టెక్సాస్ ప్రాంతంలో ఈ అంతరిక్ష నౌక నేల మీదకి దిగాలి. కానీ నౌక లూసియానా మీదగా భూ కక్ష్యలోకి దిగే ముందు విడిపోయింది. మంటలు చెలరేగాయి.

కల్పనా చావ్లాతో పాటు రిక్ హస్బెండ్, లారెల్ క్లార్క్, ఇలాన్ రామన్, డేవిడ్ బ్రౌన్, విలియం మెకికూల్, మైఖేల్ ఆండర్సన్‌లు ఈ భయంకర విపత్తులో మరణించారు.

ఈ విధంగా తొలి భారతీయ అమెరికన్ వ్యోమగావి కల్పనా చావ్లా తన ఆశయం మేరకు పనిచేస్తూ భయంకర ప్రమాదంలో కనుమరుగవడం ఒక విషాద పరిణామం.

1983లో విమానయాన శిక్షకుడు జీన్-పియర్-హారిసన్‌తో ఈమె వివాహం జరిగింది. 1990లో అమెరికన్ పౌరురాలయ్యారు.

ఈమె తన కోసమే కాదు. తరువాత తరాల వారి కోసం కూడా ఆలోచించారు. తగిన చేయూతని అందించారు. 1998 నుండి ప్రతి సంవత్సరం ఇద్దరు భారతీయులను హోస్టన్ నగరంలోని Foundation for International Space Education సంస్థ ఆధ్వర్యంలో నడిచే స్కూలుకి పంపించేవారు. ఈ స్కూలే United Space School. ఆ విద్యార్థులను తమ ఇంటికి ఆహ్వానించి, ఆదరించి ప్రోత్సాహించేవారు. తనకి వీలయినంత వరకు ఆర్థిక సాయం కూడా చేసేవారు. ఇంత గొప్ప మనసు ఎంత మందికి ఉంటుంది?

ఈమె పుట్టిన కర్నాల్ పట్టణంలో ఫ్లయింగ్ క్లబ్ ఉండేది. తన అన్నతో కలిసి ఆకాశంలో ఎగిరే విమానాలని చూసి సంబర పడేవారు. జె. ఆర్. డి. టాటా గురించి అబ్బురంగా విని సంబర పడేవారు. విమానాన్ని నడిపిన తొలి భారతీయుడు టాటా. ఆయనలాగా విమానాన్ని నడపాలని కలలుగనేవారు. ఫ్లైట్ ఇంజనీర్, ఏరోస్పేస్ ఇంజనీరు కావాలనుకునేవారట. అందుకే గణితం, భౌతిక శాస్త్రం, రసాయనశాస్త్రాలను చదివారు.

అలా అలా మబ్బులలో తేలిపోతూ తిరగాలని కలలు కంటూ-కంటూ, తన కోరికని నెరవేర్చుకుని మబ్బుల్లో కలిసిపోయి కనుమరుగవడం మనందరికీ బాధాకరం.

2010లో ఈమె స్మారక చిహ్నాన్ని టెక్సాస్ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాల ఆర్లింగ్టన్ కళాశాలలో ఏర్పాటు చేసి గౌరవించారు.

ఈమెకి కాంగ్రెషనల్ స్పేస్ మెడల్, నాసా విశిష్ట సేవాపతకం, నాసా స్పేస్ ప్లేట్ మెడల్స్‌ని అందించి గౌరవించాయి.

ఈమె భర్త జీన్-పియర్-హారిసిన్ విమాన చోదక శాస్త్ర రచయిత కూడా! 2011లో ‘ది ఎడ్జ్ ఆఫ్ టైమ్’ పేరుతో ఆమె జీవిత చరిత్రని గ్రంధస్థం చేశారు.

‘ఆస్ట్రోనాట్ డైరీస్: రిమెంబరింగ్ ది కొలంబియా షటిల్ క్రూ’ పేరుతో 2005లో, ‘స్పేస్ షటిల్ కొలంబియా మిషన్ ఆఫ్ హోప్’ పేరుతో 2013 లోను లఘుచిత్రాలను నిర్మించారు.

ఈమె జ్ఞాపకార్థం 2015 సెప్టెంబర్ 2వ తేదీన 5 రూపాయల విలువతో స్టాంపును విడుదల చేసింది భారత తపాలాశాఖ. స్టాంపు ఎడమ వైపున సైకిల్ నడుపుతున్న యువతి కనిపిస్తుంది. కుడి వైపున మబ్బుల్లో పయనిస్తూ మేఘాలలో కలిసిపోయిన ఆ అంతరిక్ష తార అంతరిక్ష వ్యోమగామి దుస్తులలో ధైర్యంగా కనిపిస్తారు. ఆమె కుడి ప్రక్కన సమాంతరంగా రాకెట్ కనిపిస్తుంది. క్రింద భాగంలో ఐదుగురు అమ్మాయిలు భుజం భుజం కలిపి మానవహారంలా నిలబడి గాలిపటాలు ఎగరేస్తూ కనిపిస్తారు. ఆ గాలిపటాలు కల్పానా చావ్లాని మోస్తున్న పల్లకిలా అనిపిస్తుంది.

Women Empowerment శీర్షికతో ఈ స్టాంపు విడుదల అయ్యింది.

మార్చి 17వ తేదీన ఈమె జయంతి, షష్టిపూర్తి సందర్భంగా ఈ నివాళి.

***

Image Courtesy: Internet

Exit mobile version