Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ముగ్గురి ప్రేమ విఫలంలో పరోక్ష కారకురాలి చుట్టూ తిరిగిన ప్రేమ గాథ ‘కాలం వెక్కిరించింది’

క రచయిత లేదా రచయిత్రి తన యవ్వన కాలంలో, ముఖ్యంగా విద్యార్థి దశలో రాసే లేదా రాయడానికి సాహసం చేసే కథలు, ఎక్కువగా ‘ప్రేమ కథలు’ అయి ఉంటాయి. వయసు, కాలం, చుట్టూరా వుండే పరిస్థితులు అలాంటి కథా వస్తువులకు ప్రేరణ ఇస్తాయి. అంతమాత్రమే కాదు ప్రతి ఆడపిల్ల లేదా మగపిల్లాడు అది యవ్వన ప్రాంగణంలోకి అడుగుపెట్టే కాలం. వయసు – మనసు అల్లరి పెట్టి ‘ప్రేమ’ అనే మత్తు వాళ్లంతా అల్లుకుని, ప్రేమంటే ఏమిటో సరిగా అవగాహన లేకుండానే, బాహ్యా ఆకర్షణలకు బానిసలై, ప్రేమకూ మోహానికి మధ్య వుండే వ్యత్యాసం (ఇది అందరికీ వర్తించదనుకోండీ) తెలియక, తెలుసుకునే సాహసం చేయక, ప్రేమంటూ వెంటబడడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, ఎన్నో ఆశలతో, ఆకాంక్షలతో పెంచి పెద్దచేసిన తల్లిదండ్రుల హృదయాలను ఉసూరుమనిపించడం, అప్పుడూ, ఇప్పుడూ జరుగుతున్న విషయమే!

ఆందుకే, ఆ వయసులో రాసే రచయిత్రుల/రచయితల కథలు కూడా అలాగే ఉంటాయి. అసలు విద్యార్థి దశలో కథలు రాయగలగడం చాలా గొప్ప! కళాశాల మ్యాగజైన్ వంటి పత్రికలు, రచనా వ్యాసంగం పట్ల అభిరుచి గల విద్యార్థులకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు.

ఇప్పుడు నేను చర్చించబోయే కథ ‘కాలం వెక్కిరించింది!’ కూడా ఈ కోవకు చెందిన కథే! రచయిత్రి తన విద్యార్థి దశలో, అంటే 1969లో, (బి. ఏ. ప్రథమ సంవత్సరం) రాసిన కథ ఇది. నలుగురు విద్యార్థి విద్యార్థినుల చుట్టూ తిరిగి విఫలమైన ప్రేమ కథ. ఆ వయస్సులోనే ఈ కథను, కొసమెరుపు కథగా తీసుకురావడానికి, రచయిత్రి చాలా శ్రమించారు, కానీ కథ మధ్యలోని కొన్ని సన్నివేశాల మూలంగా ముగింపు కొంత పాఠకుడికి తప్పక స్ఫురించే అవకాశం వుంది. అయినా కథ బాగుంది. అప్పటికే రచయిత్రి, భవిష్యత్తులో చేయితిరిగిన కథా రచయిత్రి కాగలదన్న నమ్మకం కలిగించేలా ఈ కథ రాసారు. కథను విషాదంగా ముగించారు గానే, ఆ వయసులో యువతీ యువకుల ఆలోచనలు ఎలా ఉంటాయన్న విషయాన్ని కథలో చెప్పగలిగారు. అప్పటి పిల్లల ఆలోచనలు, ముఖ్యంగా ఆడపిల్లలు, తమకు కాబోయే భర్త, యద్దనపూడి నవలల్లో హీరోలా, హిందీ సినీమా హీరో ధర్మేంద్రలా వుండాలని కోరుకునేవారు. కానీ అది ఎందరికి సాధ్యం? అదే జరిగి ఈ కథ దుఃఖాంతమైంది. ఇప్పుడైతే ఇదే కథను రచయిత్రి వేరేగా రాసి వుండేవారేమో!

ఇంతకీ కథ విషయానికి వస్తే, ఇది నలుగురు స్నేహితులు చుట్టూ తిరిగిన ప్రేమ కథ. ఇద్దరు యువకుల ఆలోచనలు ఒక మాదిరిగా, ఇద్దరు యువతుల ఆలోచనలు భర్తను ఎంచుకునే విషయంలో మరో విధంగా వుండి ప్రేమ విఫలం కావడం ఈ కథా వస్తువు.

ఈ కథ ఇద్దరు విద్యార్థులు, ఇద్దరు విద్యార్థినుల చుట్టూ తిరిగే ఆసక్తికరమైన ప్రేమకథ. కథ మొత్తం ఈ నాలుగు పాత్రలతోనే నడిచి ముగుస్తుంది. అందచందాలు మూటకట్టుకుని వున్న అమ్మాయి, అందమైన అబ్బాయి యద్దనపూడి సులోచనారాణి గారి నవలల్లోని అందమైన హీరో రాజశేఖరంలా వుండాలనుకుంటుంది. అంటే ఆమె వ్యక్తి బాహ్య సౌందర్యానికి తన ప్రాధాన్యతను ఇస్తుంది. అయితే, ఆమె కనుసన్నలకు అందని ఒక మామూలు మంచి అబ్బాయి ఆమె ప్రేమలో పడతాడు. కానీ ఆ అమ్మాయి, అతన్ని అసహ్యించుకుని, అసలు తన వంక చూడవద్దని గట్టి వార్నింగ్ ఇచ్చేస్తుంది. ఈ అందమైన అమ్మాయికి ఒక స్నేహితురాలు వుంది. ఆ స్నేహితురాలి ద్వారా, తన ప్రేమను ఆశించిన అబ్బాయి, ప్రేమ వికటించడం వల్ల తాను ఆత్మహత్య చేసుకున్న విషయం ప్రస్తావించి, అతను చూడడానికి బాగోకున్నా, అతని ఆత్మసౌందర్యం గొప్పదని, అతని మంచి గుణగణాలను వర్ణిస్తుంది. ఈలోగా మొదటి అమ్మాయికి సంబంధం కుదురుతుంది. ఆమె కోరుకున్న అందగాడే ఆమెకు భర్తగా దొరుకుతాడు. కానీ ఈ పెళ్ళికి స్నేహితురాలు ఏదో వంక చెప్పిరాదు.

ఈ పెళ్ళైన అమ్మాయిని భర్త అసలు పట్టించుకోడు. అతని మనసులో మరొక స్త్రీ ఉండడమే దానికి కారణం. చివరికి ఈ అందమైన అమ్మాయికి ఆ ముగ్గురూ దూరమైపోతారు. అది ఎలా జరిగిందో కథ చదివితే గాని పూర్తిగా అర్థం కాదు.

ఈ కథల గురించి ప్రముఖ రచయిత్రి శ్రీమతి తుర్లపాటి లక్ష్మి గారు చెప్పినట్టు “చిన్న చిన్న సంభాషణలు, సున్నితమైన భావ ప్రకటన, సుతి మెత్తని సూటిదనం తనదైన విలక్షణ శైలి, పాఠకులను అడుగడుగునా, అలరిస్తాయి”.

ఈ కథా రచయిత్రి డా. అమృతలత గారు. ఈ కథ రాసే సమయానికి వీరు బి.ఏ. మొదటి సంవత్సరం విద్యార్థిని. ఇప్పుడు ప్రముఖ విద్యావేత్త, సాహిత్య సేవకురాలు. ఈ కథ డా. అమృతలత గారి కథా సంపుటి ‘స్పందన’ నుండి స్వీకరించబడింది. ఇప్పటికి రెండు ముద్రణలకు నోచుకున్న ఈ కథా సంపుటి నాకు ఇప్పటికి అందుబాటులోనికి రావడం మూలాన, అమృతలత గారి కథలు చదివే అవకాశం ఇప్పుడు కలిగింది.

కథా ప్రేమికులు తప్పక చదవ వలసిన కథలివి. ఈ పుస్తకం కాపీలు కావలసినవారు, రచయిత్రిని వారి మొబైల్ (9848868068) ద్వారా సంప్రదించ వచ్చును. రచయిత్రి డా. అమృతలత గారికి శుభాకాంక్షలు.

Exit mobile version